Pharmaceutical industry
-
మొక్కా.. మొక్కా..నీ పేరేంటి..
పీజీ చేసినా పెరటి మొక్క పేరు తెలియని విద్యార్థులు శాస్త్రీయ నామాలకే నేటి తరం పరిమితం..ఫార్మా పరిశ్రమలకు తగ్గుతున్న పరిశోధనలు బొటానికల్ ఇండియా సర్వేలో తేలిన వాస్తవాలుసాక్షి, హైదరాబాద్: పెరట్లో మొక్కలు.. వాటి పేర్లు, ఉపయోగాల గురించి చిన్నప్పుడు నాయనమ్మో.. అమ్మమ్మో చెబితే నేర్చుకునేవాళ్లు. బడికి వెళ్లాక టీచర్ మొక్కల శాస్త్రీయ నామాలు చెబుతుంటే.. ‘ఓ అదా.. మా పెరట్లోని జిల్లేడు చెట్టు.. పొలం మధ్యలో వావిలాల చెట్టు’ అని తేలికగా గుర్తుపట్టేవాళ్లు. ఇప్పుడు కాలం మారింది. వృక్ష శాస్త్రంలో పీజీ చేసిన విద్యారి్థకి కూడా ఇంట్లోని మందార చెట్టు పేరు తెలియడం లేదు. బొటానికల్ ఇండియా ఇటీవల చేసిన సర్వేలో అనేక ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి. విద్యార్థుల వైఖరి ఇలాగే కొనసాగితే వారిలో శాస్త్రీయ కోణమే లోపిస్తుందని బొటానికల్ ఇండియా శాస్త్రవేత్తలు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. పాఠశాల స్థాయి నుంచే మొక్కలపై అవగాహన పెంచాలని సూచించారు. సర్వేలోని కీలక విషయాలు ⇒ సర్వేలో భాగంగా పీజీ పూర్తిచేసిన 867 మందిని పెరటి మొక్కలపై ప్రశ్నలు అడిగితే.. సొంత ఊరిలో కనిపించే ఔషధ మొక్కల గురించి కూడా కనీస సమాచారం ఇవ్వలేకపోయారు. జిల్లేడు, తిప్పతీగ, బంతి మొక్కలను చూపిస్తే వంద మందిలో 28 మంది మాత్రమే తెలుగు పేర్లు చెప్పారు. మిగతా వాళ్లతా శాస్త్రీయ నామాలే చెప్పారు. కుండీల్లో పెరిగే మొక్కల గురించి ప్రశ్నలు వేసినప్పుడు వందకు 20 శాతం మంది వాటి ఉపయోగాలను వెల్లడించలేకపోయారు. ⇒ నాగజెముడును అనేక ఔషధాల్లో వినియోగిస్తున్నాయి. పల్లె వాకిట్లో తేలికగా దొరికే ఈ మొక్క గురించి వృక్షశాస్త్రంలో డిగ్రీ చేసిన 428 మందిని ప్రశి్నస్తే, 48 శాతం దీని ఆనవాలు తెలియదన్నారు. 26 శాతం ఇదో ఔషధ మొక్క... విదేశాల్లో పండిస్తారని చెప్పారు. 18 శాతం మంది మాత్రమే భారతీయ పల్లె పెరిగే మొక్కగా గుర్తించారు. ⇒ పదేళ్ల క్రితం వరకూ పల్లెల్లో విరివిగా కనిపించిన మంగళగిరి కంచె గురించి 60 శాతం బోటనీ విద్యార్థులకు అవగాహనే లేదు. కార్బన్–డై–ఆక్సైడ్‌ను నియంత్రించడంలో దీని పాత్ర గురించి అసలే చెప్పలేకపోయారు. ⇒ వైద్య రంగంలో ఉన్నవారికి కూడా ఉమ్మెత్త మొక్క గొప్పతనం తెలియడం లేదు. ఇంటర్లో బైపీసీ చదివిన 250 మందిని ఈ మొక్క గురించి ప్రశి్నస్తే.. 186 మంది అదేం మొక్క? అని ఎదురు ప్రశ్నించారు. ఫొటో చూశాక శాస్త్రీయ నామం చెప్పగలిగారు. ⇒ బతకమ్మ సందడి వల్ల తెలుగు విద్యార్థులు తంగేడు చెట్టును గుర్తుపడుతున్నారు. నూటికి 80 శాతం మంది ఇది తంగేడు పూల మొక్క అని చూడగానే చెప్పారు. ⇒ రకరకాల షాంపూల గురించి «గుక్క తిప్పుకోకుండా చెప్పగలిగే ప్రస్తుత యువతరంలో 78 శాతం మందికి కుంకుడు చెట్టు గురించి ఇసుమంతైనా తెలియటంలేదు. ఈ చెట్టు ఆకులు ఎలా ఉంటాయో సర్వేలో పాల్గొన్న 92 శాతం మందికి తెలియలేదు. కాల గర్భంలో ఎన్నో మొక్కలు (బాక్స్) విరిగిన ఎముకలు కట్టుకోవడానికి వాడే నల్లేరు.. కఫంతో ఊపిరి ఆగిపోయే పరిస్థితి నుంచి కాపాడే కరక్కాయ.. ప్రాణం పోయేలా అనిపించే తలనొప్పిని సైతం తగ్గించే శొంఠి.. కురుపు ఏదైనా ఆకుతోనే నయం చేసే జిల్లేడు.. చర్మవ్యాధుల పనిపట్టే మారేడు.. సర్వ రోగ నివారణి తులసి వంటి ఎన్నో అద్భుత ఔషధ మొక్కలు మన పెరటి వైద్యం నుంచి కని్పంచకుండా పోతున్నాయి. ఇలా అయితే కష్టం మొక్కలు, వాటి ప్రయోజనాలు తెలుసుకునే ఆసక్తి విద్యార్థి దశ నుంచే ఏర్పడాలి. లేకపోతే ఔషధ రంగం ఇతర దేశాల చేతుల్లోకి వెళ్తుంది. ఇప్పటివరకు 3.5 లక్షల మొక్క జాతులను వృక్ష శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇందులో 2.78 లక్షల మొక్కలపై ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరిగాయి. వీటిల్లో చాలా వరకు మన పల్లెల్లో ఒకప్పుడు కని్పంచినవే. –నవీన్ చావ్లా (ఫార్మా రంగ నిపుణుడు) విద్యలో మార్పు తేవాలి నేడు అందరూ కంప్యూటర్ సైన్స్ వైపు వెళ్తున్నారు. వృక్షశాస్త్ర ప్రాధాన్యత తగ్గుతోంది. మొక్కల ప్రాధాన్యతను భావి తరాలకు చెప్పే బయో డైవర్సిటీ బోర్డులకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. అప్పుడే ఈ పరిస్థితిలో మార్పు వస్తుంది. – డాక్టర్ కె తులసీరావు, డైరెక్టర్, గ్లోబల్ బయోడైవర్సిటీ. -
ఈ చట్టంతో సాధించేదేమిటి?
ఎంతోకాలంగా అటు ఔషధ పరిశ్రమలవారూ, ఇటు ప్రజారోగ్యరంగ కార్యకర్తలూ ఎదురు చూస్తున్న జనవిశ్వాస్ బిల్లు గత నెల 27న లోక్‌సభలో, ఈ నెల 2న రాజ్యసభలో ఆమోదం పొందింది. మణిపుర్‌పై అట్టుడుకుతున్న కారణంగా పార్లమెంటులో తీవ్రగందరగోళం ఏర్పడిన నేపథ్యంలో ఎలాంటి చర్చా లేకుండా మూజువాణి ఓటుతో గట్టెక్కిన ముఖ్యమైన బిల్లుల్లో ఇది కూడా చేరిపోయింది. 19 మంత్రిత్వ శాఖలకు సంబంధించిన 42 చట్టాలకు ఈ బిల్లు సవరణలు ప్రతిపాదించింది. ఇప్పుడు అమల్లో ఉన్న 1940 నాటి డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం వల్ల ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నామని ఔషధ రంగ పరిశ్రమలు ఎప్పటినుంచో చెబుతున్నాయి. అయితే ఆ చట్టంలోని లొసుగుల వల్ల నాసిరకం ఔషధ తయారీదారులపై కఠిన చర్యలు సాధ్యం కావటం లేదన్నది ప్రజారోగ్యరంగ కార్యకర్తల విమర్శ. తాజా సవరణ బిల్లు దాన్ని మెరుగుపరచకపోగా మరింత నీరుగార్చిందని వారి వాదన. ఈ బిల్లు మొత్తం 180 స్వల్ప నేరాలకు జైలు శిక్ష బదులు జరిమానాతో సరిపెట్టింది. చిన్న చిన్న సమస్యలను సైతం భూతద్దంలో చూపి జైలుకు పంపుతున్న ధోరణి సరికాదనీ, ప్రతి చిన్న అంశంలోనూ అధికారులకు వివరణ ఇవ్వాల్సి రావటం, కేసుల్లో ఇరుక్కుంటే న్యాయస్థానాల చుట్టూ తిరగటం ఉత్పాదకతకు అవరోధమవుతున్నదనీ ఔషధరంగ నిర్వాహకులు ఆరోపిస్తున్నారు. వారి కోణంలో ఈ సవరణలు మంచివే కావొచ్చుగానీ, రోగుల కోణం నుంచి దీన్ని పరిశీలించారా అన్నది సందేహమే. ఫార్మారంగంలో మన దేశం అంతర్జాతీయంగా ముందంజలో ఉంది. కానీ కొన్ని ఫార్మా సంస్థలు నాసిరకం మందులు ఎగుమతి చేసి దేశం పరువుప్రతిష్ఠలను దెబ్బతీస్తున్న ఉదంతాలు తక్కువేం కాదు. మన దేశంనుంచి ఎగుమతైన దగ్గుమందు సేవించి ఆఫ్రికా ఖండ దేశం గాంబియాలో నిరుడు 70 మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. ఆమధ్య ఉజ్బెకిస్తాన్‌లో కూడా 19 మంది పిల్లలు చనిపోయారు. ఇక్కడి నుంచి అమెరికాకు ఎగుమతైన కంటికి సంబంధించిన మందు వికటించి నిరుడు మే నెల నుంచి ఈ ఏడాది జనవరి వరకూ 55 మందికి సమస్యలు తలెత్తాయి. అందులో ఒకరు మరణించారు కూడా. పాత చట్టం కఠినంగా ఉన్నదని ఫార్మారంగం మొత్తుకుంటున్న కాలంలోనే ఇలాంటి ఉదంతాలు జరిగితే దాన్ని నీరుగార్చటం సమస్యను మరింత పెంచదా అన్న సందేహం ఎవరికైనా వస్తుంది. ఇప్పుడు అమల్లో ఉన్న చట్టం కల్తీ మందులు, నకిలీ మందులు, తప్పుదోవ పట్టించే పేర్లతో మందుల చలామణీ, నాణ్యతా ప్రమాణం కొరవడిన మందులు అని నాలుగు రకాలుగా వర్గీకరించింది. ఆ మందులు వాడినవారికి ఎదురయ్యే సమస్య తీవ్రతను బట్టి ఆ నేరాలకు శిక్షలున్నాయి. కల్తీ, నకిలీ మందులవల్ల రోగి మరణం సంభవించిన పక్షంలో అందుకు కారకులని గుర్తించినవారికి పదేళ్ల నుంచి యావజ్జీవ శిక్ష వరకూ ఉన్నాయి. తప్పుడు అభిప్రాయం కలిగించే బ్రాండ్లతో మందులు చలామణి చేస్తే రెండేళ్ల వరకూ శిక్ష ఉంది. ప్రామాణిక నాణ్యత లేని మందుల (ఎన్ఎస్క్యూ) తయారీకి రెండేళ్ల వరకూ శిక్ష, రూ. 20,000 వరకూ జరిమానా విధించవచ్చు. వీటన్నిటికీ తాజా బిల్లు అయిదు లక్షల వరకూ జరిమానాలతో సరిపెట్టింది. జైలు శిక్షలు తొలగించింది. ఇతర నేరాల మాటెలావున్నా ఎన్ఎస్క్యూ కేటగిరీ కిందకొచ్చే కేసులకు జైలు శిక్ష బెడద లేకుండా చేయటాన్నే ప్రధానంగా ప్రజారోగ్య రంగ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఈ ఆఖరి కేటగిరీ 27(డి) కిందే దేశంలో ఎక్కువ కేసులు నమోదవుతుంటాయి. ఔషధంలో వినియోగించిన పదార్థాలు అనుమతించిన మోతాదులో కాకుండా వేరేవిధంగా ఉంటే ఆ ఔషధం రోగికి నిరుప యోగమవుతుంది. కానీ కొన్నిసార్లు జబ్బు ముదిరి మరణానికి దారితీసే ప్రమాదం ఉంటుందన్నది నిపుణుల వాదన. అలాంటి కేటగిరీని సైతం చిన్న తప్పిదంగా పరిగణించి జరిమానాలతో సరిపెడితే ఔషధ నాణ్యత దెబ్బతినదా... ప్రజారోగ్యం ప్రమాదంలో పడదా అని వారు ప్రశ్నిస్తున్నారు. నిజానికి నిరుడు ఈ బిల్లు ముసాయిదాను ప్రకటించి అన్ని వర్గాల నుంచీ అభిప్రాయాలు కోరినప్పుడు ప్రజారోగ్య నిపుణులు ప్రధానంగా దీనిపైనే అభ్యంతరం తెలిపారు. అసలు ఫార్మా కంపెనీలు నిబంధన ప్రకారం రిజిస్టరయిన ఫార్మాసిస్టులను నియమించు కోవాల్సి వుండగా చాలా సంస్థలు దాన్ని ఉల్లంఘిస్తున్నాయి. అకారణంగా వేధించటాన్ని ఎవరూ సమర్థించరు. కానీ రోగుల ప్రాణాలతో ఆడుకునే విధంగా, కేవలం లాభార్జనే ధ్యేయంగా ఉండే సంస్థల విషయంలో కఠినంగా ఉండొద్దా? అసలే తరచు బయటి కొచ్చే ఉదంతాల వల్ల విదేశాల్లో మన ఫార్మా ఉత్పత్తులపై చిన్నచూపు పడుతోంది. మన చట్టాలు చాలా ఉదారంగా ఉండటంవల్లే, తగిన తనిఖీలు లేనందువల్లే ఇదంతా జరుగుతోందన్న అభిప్రాయం ఉంది. ఇప్పుడు తీసుకొచ్చిన బిల్లు ఆ అభిప్రాయాన్ని పోగొట్టే విధంగా లేకపోగా మరింత సరళంగా మార్చిందని ప్రజారోగ్య కార్యకర్తల ఆరోపణ. కేవలం కఠిన శిక్షలు, తనిఖీలు మాత్రమే సమస్యకు పరిష్కారం కాకపోవచ్చు. కానీ కల్తీ, నకిలీ మందుల కారణంగా రోగి ప్రాణం కోల్పోయినా, తీవ్రమైన వైకల్యం సంభవించినా ఆ రోగి కుటుంబానికి భారీయెత్తున పరి హారం చెల్లించే నిబంధన ఉంటే ఔషధ తయారీ సంస్థ దారికి రాదా? దీనికి బదులు రూ. 5 లక్షల జరిమానాతో సాధించేదేమిటి? ఈమాత్రం జరిమానా చెల్లించలేని స్థితిలో ఏ సంస్థయినా ఉంటుందా? పటిష్టమైన పర్యవేక్షణ, పారదర్శకత, నేరం చేస్తే కఠిన శిక్ష, భారీ పరిహారం చెల్లింపు తప్పదన్న భయం ఉంటేనే పరిస్థితి చక్కబడుతుంది. ఇవేమీ లేకుండా చట్టం తెచ్చి ప్రయోజన మేమిటి? -
ఫార్మాస్యూటికల్స్ వృద్ది అంతంతే
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారత ఫార్మాస్యూటికల్స్ మార్కెట్ 2023 జనవరిలో 2.3 శాతం వృద్ధి చెందింది. 2022 జూన్ నుంచి పోల్చితే ఇదే అత్యల్పం కావడం గమనార్హం. గతేడాది గరిష్ట అమ్మకాలు నమోదు కావడం, కాలానుగుణ ప్రభావం ఇందుకు కారణమని ఇండియా రేటింగ్స్, రిసర్చ్ తెలిపింది. ఇప్పటికే ఉన్న ఉత్పత్తులపై తీసుకున్న ధరల పెంపు గత నెలలో మొత్తం మార్కెట్ పనితీరుకు కీలకంగా ఉంది. అయితే పరిమాణాలు క్షీణించాయని వివరించింది. ఆల్ ఇండియన్ ఒరిజిన్ కెమిస్ట్స్, డిస్ట్రిబ్యూటర్స్ ప్రకారం 2022 జనవరిలో పరిశ్రమ 14.1 శాతం, డిసెంబర్లో 10.4 శాతం దూసుకెళ్లింది. గతేడాది ధరలు 5.8 శాతం పెరిగితే, జనవరిలో ఇది 5.9 శాతంగా ఉంది. కొత్త ఉత్పత్తుల రాక 1.8 శాతం పెరిగింది. 2022లో ఇది 2.8 శాతం. పరిమాణం 5.5 నుంచి 5.4 శాతానికి క్షీణించింది. భారత ఫార్మాస్యూటికల్స్ మార్కెట్ 2021లో 14.9 శాతం, 2022లో 8 శాతం దూసుకెళ్లింది. 2023–24లో పరిశ్రమ 8–10 శాతం వృద్ధికి ఆస్కారం ఉంది. 2023 జనవరిలో డెర్మటాలాజికల్, గైనకాలాజికల్ విభాగం ఔషధాల అమ్మకాలు వరుసగా 11, 10 శాతం పెరిగాయి. విటమిన్స్ విక్రయాలు అతి తక్కువగా 0.3 శాతం అధికం అయ్యాయి. -
ఫార్మా ఎంఎస్ఎంఈలకు కొత్త పథకాలు
న్యూఢిల్లీ: ఫార్మాస్యూటికల్ పరిశ్రమలో సూక్ష్మ, చిన్న, మధ్య స్థాయి (ఎంఎస్ఎంఈ) కంపెనీలను బలోపేతం చేసే లక్ష్యంతో కేంద్ర సర్కారు మూడు కొత్త పథకాలను గురువారం ప్రారంభించింది. ఈ వివరాలను కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రి మన్సుఖ్ మాండవీయ మీడియాకు తెలిపారు. టెక్నాలజీ నవీకరణ, ఫార్మా ఎంఎస్ఎంఈ క్లస్టర్ల వద్ద ఉమ్మడి పరిశోధన కేంద్రాలు, వ్యర్థాల శుద్ధి కర్మాగాలను ఈ పథకాల కింద ఏర్పాటు చేసుకోవచ్చని చెప్పారు. చిన్న కంపెనీలు అయినా కానీ, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తమ కేంద్రాలను అభివృద్ధి చేసుకోవచ్చన్నారు. ‘‘ఈ పథకాల నుంచి ఫార్మా రంగం ఎంతో ప్రయోజనం పొందుతుంది. దీర్ఘకాలంలో భారత ఫార్మా పరిశ్రమ మరింత బలోపేతంగా, భవిష్యత్తుకు సన్నద్ధంగా, స్వావలంబన సాధిస్తుంది’’అని మాండవీయ అన్నారు. ఫార్మా ఎంఎస్ఎంఈ యూనిట్లు టెక్నాలజీ నవీకరణకు వడ్డీ సబ్సిడీతో కూడిన రుణాలను పొందొచ్చు. ఉమ్మడి పరిశోధన, టెస్టింగ్ కేంద్రాల ఏర్పాటుకు రూ.20 కోట్ల వరకు లభిస్తుంది. సిడ్బీ ఈ పథకాల అమలుకు కన్సల్టెంట్‌గా వ్యవహరిస్తుంది. రూ.10 కోట్ల వరకు తీసుకునే రుణాలకు 10 శాతం క్యాపిటల్ సబ్సిడీ కూడా లభిస్తుంది. మూడేళ్ల కాల వ్యవధికి తీసుకోవచ్చు. ఫార్మా క్లస్టర్లలో సదుపాయాల అభివృద్ధికి చేపట్టే ప్రాజెక్టు వ్యయంలో 70 శాతాన్ని (రూ.20 కోట్ల వరకు) కేంద్రం సమకూరుస్తుంది. -
అసమాన పెట్టుబడి కేంద్రంగా భారత్
న్యూఢిల్లీ: ఇటీవల చేపట్టిన కార్మిక, వ్యవసాయ సంస్కరణలు భారత్‌లో వ్యాపారం చేయడాన్ని మరింత సులభతరం చేస్తాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మార్కెట్‌ను ఎంచుకోవడానికి రైతులకు హక్కు కల్పిస్తోందని, అలాగే ఎగుమతులు పెరిగేందుకు దోహదం చేస్తుందని చెప్పారు. ఇన్వెస్ట్ ఇండియా–2020 సదస్సులో ఆయన వీడియో ద్వారా కీలకోపన్యాసం చేశారు. భారత్–కెనడా మధ్య వ్యాపార సంబంధాలు మరింత బలోపేతం లక్ష్యంగా ఈ సదస్సు జరిగింది. శక్తివంతమైన ప్రజాస్వామ్యం, రాజకీయ స్థిరత్వం, వ్యాపారానికి అనుకూలమైన విధానాలతో విదేశీ వ్యాపారులకు భారత్ అసమాన పెట్టుబడి కేంద్రంగా నిలిచిందని ప్రధాని అన్నారు. పెద్ద ఎత్తున సంస్కరణలు.. ప్రైవేటు రంగ భాగస్వామ్యాన్ని మెరుగుపరిచేందుకే విద్య, వ్యవసాయం, కార్మిక వంటి ప్రధాన రంగాల్లో సంస్కరణలు చేపట్టామని మోదీ తెలిపారు. ‘కార్మిక చట్టాల సంస్మరణలతో లేబర్ కోడ్స్ తగ్గుతాయి. ఇవి సంస్థలకు, ఉద్యోగులకు స్నేహపూర్వకంగా ఉంటాయి. అలాగే ఆత్మనిర్భర భారత్ నిర్మాణానికి దోహదం చేస్తాయి. విద్యా రంగంలో సంస్కరణలతో యువత నైపుణ్యం మెరుగవుతుంది. విదేశీ యూనివర్సిటీలు భారత్‌కు వస్తాయి. విద్య, తయారీ, సేవలు, వ్యవసాయ రంగాల్లో భాగస్వామ్యం, పెట్టుబడి, సహకారానికి భారత్ సరైన వేదిక’ అని వివరించారు. అవకాశాలను అందుకున్నాయి.. మౌలిక రంగ పెట్టుబడిలో ఉన్న పెద్ద సంస్థలకు కెనడా కేంద్రంగా ఉందని ప్రధాని గుర్తు చేశారు. ‘కెనడాకు చెందిన పెన్షన్ ఫండ్స్ తొలుత ఇక్కడ పెట్టుబడులు పెట్టాయి. హైవేస్, ఎయిర్‌పోర్టులు, లాజిస్టిక్స్ రంగాల్లో కెనడా సంస్థలు ఇక్కడి అవకాశాలను అందుకున్నాయి. భారత ఆర్థిక వ్యవస్థ నేడు బలంగా ఉంది. రేపు మరింత శక్తివంతమవుతుంది. ఎయిర్‌పోర్టులు, రైల్వేలు, హైవేలు, పవర్ ట్రాన్స్మిషన్ లైన్స్‌లో ప్రైవేటు పెట్టుబడులను పెద్ద ఎత్తున ఆహ్వానిస్తున్నాం. ఎఫ్‌డీఐ విధానాలను సరళీకరించాం. సార్వభౌమ సంపద, పెన్షన్ ఫండ్స్ విషయంలో స్నేహపూర్వక పన్నుల విధానం అనుసరిస్తున్నాం. కోవిడ్–19 నేపథ్యంలో ప్రత్యేక విధానాన్ని అమలుచేశాం. పేదలు, చిన్న వ్యాపారుల కోసం ఉద్దీపన ప్యాకేజీ ఇచ్చాం. నిర్మాణాత్మక సంస్కరణలకు దీనిని అవకాశంగా తీసుకున్నాం’ అని చెప్పారు. ఔషధ కేంద్రంగా భారత్.. ప్రపంచానికి ఔషధ కేంద్రంగా భారత్ నిలిచిందని నరేంద్ర మోదీ తెలిపారు. ‘150కిపైగా దేశాలకు భారత్ మందులు అందించింది. 2019లో అంతర్జాతీయంగా ఎఫ్‌డీఐల రాక 1 శాతం తగ్గితే, భారత్ విషయంలో ఇది 20 శాతం వృద్ధి నమోదైంది. అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు భారత్ పట్ల నమ్మకం కొనసాగుతోందనడానికి ఇది నిదర్శనం. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో 20 బిలియన్ డాలర్లకుపైగా ఎఫ్‌డీఐలను భారత్ స్వీకరించింది. అంతర్జాతీయంగా కోవిడ్ తీవ్ర స్థాయిలో ఉన్నప్పటికీ ఇది సాధించాం’ అని వివరించారు. కాగా, భారత్‌లో విదేశీ పెట్టుబడుల్లో కెనడా 20వ స్థానంలో ఉంది. 600లకుపైగా కెనడా కంపెనీలు భారత్‌లో కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఇప్పటి వరకు ఇవి 50 బిలియన్ డాలర్లకుపైగా పెట్టుబడులు చేశాయి. -
పరిశ్రమలో పేలిన రియాక్టర్..
సాక్షి, హైదరాబాద్: బాలానగర్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఐడీఏ గాంధీ పారిశ్రామిక వాడలోని ఓ ఫార్మా స్యూటికల్ పరిశ్రమలో రియక్టర్ పేలడంతో పెద్ద ఎత్తున మంటలు చేలరేగాయి. ఈ ఘటనలో ఇద్దరు కార్మికులకు గాయాలయ్యాయి. బాధితులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో పేలుడు ధాటికి ఫ్యాక్టరీ మొదటి అంతస్తులోని గోడలు పగిలిపోయాయి. ప్రమాదంపై పోలీసులు, అధికారులు ఆరా తీస్తున్నారు. -
తయారీ 50–60 శాతమే
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ తయారీ రంగంపై కరోనా తీవ్ర ప్రభావం చూపుతోంది. లాక్డౌన్ కారణంగా దినసరి కార్మికులు వారివారి స్వస్థలాలకు తిరిగి వెళ్లిపోయారు. ఉన్నవారు కాస్తా వైరస్ భయంతో ప్లాంట్లకు రావడానికి జంకుతున్నారు. దీంతో ఫ్యాక్టరీల్లో ఉత్పత్తి తగ్గింది. వెరశి ప్లాంట్ల వినియోగం 50 నుంచి 70 శాతం మాత్రమే నమోదు అవుతోంది. ముందస్తు వేతన చెల్లింపులు, ఆహారం, రవాణా సదుపాయం కల్పించిన భారీ సంస్థల్లో ప్లాంట్ల వినియోగం 70 శాతం వరకు ఉంటే.. చిన్న, మధ్య తరహా కంపెనీల్లో 50–60 శాతం మాత్రమే ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. దీంతో కంపెనీల పనితీరుపై తీవ్ర ప్రభా వం ఉంటుందని అంటున్నాయి. మార్జిన్లు భారీగా తగ్గుతాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎగుమతుల్లో 60%, దేశీయ మార్కెట్లో 50 శాతం వాటాను భారీ కంపెనీలు దక్కించుకున్నాయి. లాభాలూ కుచించుకుపోతాయి... కరోనా ప్రభావం ఆరు నెలల వరకు ఫార్మా రంగంపై ఉంటుందని బల్క్ డ్రగ్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ (బీడీఎంఏ) చెబుతోంది. కార్మికుల కొరత వాస్తవమేనని బీడీఎంఏ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఈశ్వర్ రెడ్డి సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ‘ఔషధాల కోసం డిమాండ్ బాగానే ఉంది. కంపెనీల వద్ద నిల్వలూ ఉన్నాయి. రెండు మూడు నెలల్లో వైరస్‌కు కట్టడి పడ్డా.. ఈ రంగం తిరిగి గాడిన పడేందుకు మరో రెండు మూడు నెలల సమయం పడుతుంది. కంపెనీల ఆదాయాలతోపాటు లాభాలూ కుచించుకుపోతాయి. ఇటువంటి క్లిష్ట పరిస్థితి నుంచి భారీ స్థాయి కంపెనీలు నెట్టుకొస్తాయి. చిన్న కంపెనీలకే సమస్య. వీటిల్లో కొన్ని కంపెనీల ప్లాంట్లు తాత్కాలికంగా మూతపడే అవకాశాలూ లేకపోలేదు’ అని ఆయన వివరించారు. పోర్టుల వద్దా కార్మికుల కొరత ఉందని, ఇది కూడా సమస్యేనని ఫార్మెక్సిల్ డైరెక్టర్ జనరల్ ఆర్.ఉదయ్ భాస్కర్ తెలిపారు. 2020–21లో ఫార్మా రంగం పనితీరు ఎలా ఉంటుందో అంచనా వేయలేకపోతున్నట్టు చెప్పారు. చైనాలో సమస్య మొదలవగానే తయారీ విషయంలో అందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకున్నట్టు లారస్ ల్యాబ్స్ వెల్లడించింది. కార్మికుల కొరత వంటి సమస్యలు తమకు లేవని వివరించింది. మార్జిన్స్ ఉండే వాటిపై.. భారత ఔషధ రంగానికి ఇది క్లిష్ట సమయమని ప్రముఖ లిస్టెడ్ కంపెనీ డైరెక్టర్ ఒకరు వ్యాఖ్యానించారు. కరోనా కట్టడి విషయంలో ఇతర దేశాలతో పోలిస్తే భారత్ మెరుగ్గా వ్యవహరిస్తోందని ఆయన అన్నారు. ‘త్వరలోనే సమస్య నుంచి గట్టెక్కుతాం. భారత్ నుంచి ఔషధాల ఎగుమతులకు ఎటువంటి సమస్య లేదు. ఇక్కడి ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉంది. దేశీయంగానూ మార్కెట్ ఉత్తమంగా ఉంటుంది. ప్రారంభంలో ఒడిదుడుకులు ఉన్నా అంతా సర్దుకుంటుంది. అంతర్జాతీయంగా ఔషధాల ధరలు మెరుగ్గా ఉన్నాయి. జూన్ నుంచి మార్కెట్ గాడిలో పడుతుంది. కంపెనీలు అధిక లాభాలను ఇచ్చే ఔషధాల తయారీపై దృష్టిసారిస్తాయి. ఇదే జరిగితే ఎగుమతుల్లో ఎంత కాదన్నా 10–15 శాతం వృద్ధి సాధిస్తాం. ప్రభుత్వం సైతం ఎగుమతుల వృద్ధికి తోడ్పాటు అందిస్తోంది’ అని అయన వివరించారు. -
ఫార్మా వృద్ధి 11–13%
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఔషధ పరిశ్రమ 11–13 శాతం వృద్ధి నమోదు చేయవచ్చని ఇక్రా వెల్లడించింది. దేశీయ మార్కెట్లో ఆర్యోగకర డిమాం డ్ ఇందుకు కారణమని వివరించింది. అలాగే యూఎస్ మార్కెట్లో ధరల ఒత్తిడి తగ్గడం, నూతన ఉత్పత్తుల విడుదల, ఇప్పటికే విక్రయిస్తున్న మందుల విషయంలో కంపెనీల వాటా పెరగడం వంటి అంశాలు పరిశ్రమను నడిపిస్తాయని తెలిపింది. ధరల నియంత్రణ, జనరిక్స్ తప్పనిసరి చేయడం, తయారీ కేంద్రాలపై యూఎస్ఎఫ్డీఏ తనిఖీల వంటి రెగ్యులేటరీ పరమైన జోక్యం వృద్ధి ని పరిమితం చేస్తాయని అభిప్రాయపడింది. 21 కంపెనీల ఆధారంగా ఇక్రా ఈ నివేదికను రూపొం దించింది. 2018–19లో భారత ఫార్మా ఇండస్ట్రీ వృద్ధి 12 శాతంగా ఉంది. 2018–19లో డాలరుతో పోలిస్తే రూపాయి 8.4 శాతం పతనం కంపెనీల యూఎస్ మార్కెట్ వాటా వృద్ధికి తోడ్పడింది. యూఎస్ మార్కెట్లో ఇలా.. ఇక్రా ప్రకారం.. ఈ ఆర్థిక సంవత్సరంలో ధరల ఒత్తిడి స్థిరంగా ఉండడం, ప్రత్యేక ఉత్పత్తులు, తక్కువ పోటీ ఉన్న ఔషధాల విడుదల, కొనుగోలు చేసిన వ్యాపారాల కన్సాలిడేషన్ వంటివి భారతీయ కంపెనీల యూఎస్ మార్కెట్ వాటా వృద్ధికి దోహదం చేసే అంశాలు. యూఎస్‌లో ఏఎన్‌డీఏ పోర్ట్‌ఫోలియోను కొనుగోలు చేసిన అరబిందో, డాక్టర్ రెడ్డీస్, గ్లెన్‌మార్క్ తదితర కంపెనీలు రానున్న రోజుల్లో వృద్ధికి కారణం కానున్నాయి. 2019 జనవరి–మార్చిలో యూరప్, యూఎస్ విపణి మద్దతుతో భారత ఫార్మా ఇండస్ట్రీ ఆదాయం వృద్ధి 11.8%గా నమోదైంది. యూఎస్ విషయంలో ఇది 21.2 శాతంగా ఉందని ఇక్రా కార్పొరేట్ రేటింగ్స్ వైస్ ప్రెసిడెంట్ గౌరవ్ జైన్ తెలిపారు. కొన్ని సంస్థల ఆదాయం తగ్గినప్పటికీ యూరప్ వృద్ధి 18.8 శాతంగా ఉంది. గత దశాబ్దంతో పోలిస్తే భారత కంపెనీలు ఔషధాల అభివృద్ధి సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుకున్నాయి. దీంతో అభివృద్ధి చెందిన మార్కెట్లలో కొత్త అవకాశాలను అందుకునేలా చేస్తోంది. ప్రత్యేక ఔషధాలపై ఫోకస్.. గతంతో పోలిస్తే పలు భారతీయ కంపెనీలు ఆర్అండ్డీలో పెట్టుబడులను పెంచాయి. 2010–11లో ఆర్అండ్డీ వ్యయం అమ్మకాల్లో 5.9% ఉంటే, 2016–17 వచ్చేసరికి ఇది 9%కి వచ్చి చేరింది. 2017–18లో 8.8%, గత ఆర్థిక సంవత్సరంలో 7.8%గా ఉన్నట్టు ఇక్రా వివరించింది. నియంత్రిత మార్కెట్లు, ఇంజెక్టేబుల్స్, ఇన్హేలర్స్, డెర్మటాలజీ, బయో సిమిలర్లపై కంపెనీల ఫోకస్‌తో ఆర్అండ్డీ వ్యయాలు 7.5–8% ఉంటాయని అంచనా వేసింది. ఇక ప్రత్యేక ఔషధాలు, మాలిక్యూల్స్, క్లిష్ట చికిత్సలకు అవసరమయ్యే మందుల తయారీపై భారత కంపెనీలు దృష్టిపెట్టాయి. ధరల ఒత్తిడి, ఏఎన్‌డీఏ అనుమతులు వేగంగా రావడంతో నెలకొన్న పోటీ, ఊహించినదాని కంటే తక్కువ ఆదాయ వృద్ధి వంటి యూఎస్ మార్కెట్లో ఉన్న పరిస్థితులనుబట్టే భారత కంపెనీలు తమ దృక్పథాన్ని మార్చుకున్నాయి. సులువుగా తయారు చేయగలిగే ఉత్పత్తులు, ఎక్కువ కంపెనీలు పోటీ పడుతు న్న సాధారణ జనరిక్స్ అభివృధ్ది నుంచి వైదొలగడంతోపాటు క్లిష్ట జనరిక్స్, ప్రత్యేక ప్రొడక్టులపై భారత ఫార్మా సంస్థలు దృష్టిసారిస్తున్నాయి. -
ఔషధ పరిశ్రమలో అగ్నిప్రమాదం
ఒకరి మృతి.. మరొకరి పరిస్థితి విషమం - షార్ట్ సర్క్యూట్‌తో మంటలు... పేలిన సిలిండర్ - గగన్‌పహాడ్ సంజైమ్ పరిశ్రమలో ఘటన శంషాబాద్: హైదరాబాద్ రాజేంద్ర నగర్ సర్కిల్ గగన్‌పహాడ్ పారిశ్రామిక వాడలోని సంజైమ్ ప్రైవేటు లిమిటెడ్ ఔషధ పరిశ్రమలో మంగళ వారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒకరు మృతిచెం దగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. పరిశ్రమలోని ఓ ప్లాంటు అర్ధరాత్రి 2 గంటల సమయంలో షార్ట్ సర్క్యూట్ కావడంతో పొగలు వచ్చాయి. దీంతో పక్క ప్లాంటులో విధులు నిర్వర్తిస్తున్న గగన్‌పహాడ్ బస్తీకి చెందిన తలారి శంకర్ (45), సాతం రాయి గ్రామానికి చెందిన శ్రీనివాస్ లు అక్కడికి వెళ్లారు. అక్కడే ఉన్న ఓ సిలిండర్ పేలడంతో ప్లాంటు పైకప్పు కుప్పకూలింది. ఈ ఘటనలో తీవ్ర గాయాలైన శంకర్ అక్కడికక్కడే మృతి చెందగా... శ్రీనివాస్ మంటల్లో చిక్కుకుపోయి తీవ్ర గాయాలపాల య్యాడు. అతడి పరిస్థితి విషమంగా ఉంది. రెండు ఫైరింజన్లు రెండుగం టల పాటు శ్రమించి మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చాయి. మృతుడు శంకర్‌కు భార్య చంద్రకళ, ఇద్దరు సంతానం ఉన్నారు. సుమారు 27 ఏళ్లుగా శంకర్ అదే పరిశ్రమలో కార్మికుడుగా పనిచేస్తున్నాడు. విష యం తెలుసుకున్న కుటుంబసభ్యులు పరిశ్రమ వద్దకు చేరుకుని మృతదే హాన్ని చూసి బోరున విలపించారు. అతడి కుటుంబానికి న్యాయం చేయాలని స్థానికులు డిమాండ్ చేశారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకా ష్‌గౌడ్ పరిశ్రమను సందర్శించి మృతు డి కుటుంబాన్ని పరామర్శించారు. తగిన నష్టపరిహారం చెల్లించడంతో పాటు వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వడానికి యాజమాన్యం అంగీక రించింది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పోలీసులు ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. పరిశ్రమను సందర్శించిన సంఘాలు పరిశ్రమలోని ఘటన స్థలాన్ని టీఎన్టీయూసీ నాయకులు ధనుం జయ్, ఏఐటీయూసీ నాయకులు ఓరుగంటి యాదయ్య, పుస్తకాల నర్సింగ్‌రావు, సీఐటీయూ నాయ కులు సందర్శించారు. మృతుడి కు టుంబానికి 30 లక్షల నష్టపరి హారం ఇప్పించాలని డిమాండ్ చేశారు. స్థానికంగా పరిశ్రమలో భద్రత ప్రమాణాలపై అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.