ఎంతోకాలంగా అటు ఔషధ పరిశ్రమలవారూ, ఇటు ప్రజారోగ్యరంగ కార్యకర్తలూ ఎదురు చూస్తున్న జనవిశ్వాస్ బిల్లు గత నెల 27న లోక్‌సభలో, ఈ నెల 2న రాజ్యసభలో ఆమోదం పొందింది. మణిపుర్‌పై అట్టుడుకుతున్న కారణంగా పార్లమెంటులో తీవ్రగందరగోళం ఏర్పడిన నేపథ్యంలో ఎలాంటి చర్చా లేకుండా మూజువాణి ఓటుతో గట్టెక్కిన ముఖ్యమైన బిల్లుల్లో ఇది కూడా చేరిపోయింది. 19 మంత్రిత్వ శాఖలకు సంబంధించిన 42 చట్టాలకు ఈ బిల్లు సవరణలు ప్రతిపాదించింది. ఇప్పుడు అమల్లో ఉన్న 1940 నాటి డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం వల్ల ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నామని ఔషధ రంగ పరిశ్రమలు ఎప్పటినుంచో చెబుతున్నాయి.
అయితే ఆ చట్టంలోని లొసుగుల వల్ల నాసిరకం ఔషధ తయారీదారులపై కఠిన చర్యలు సాధ్యం కావటం లేదన్నది ప్రజారోగ్యరంగ కార్యకర్తల విమర్శ. తాజా సవరణ బిల్లు దాన్ని మెరుగుపరచకపోగా మరింత నీరుగార్చిందని వారి వాదన. ఈ బిల్లు మొత్తం 180 స్వల్ప నేరాలకు జైలు శిక్ష బదులు జరిమానాతో సరిపెట్టింది. చిన్న చిన్న సమస్యలను సైతం భూతద్దంలో చూపి జైలుకు పంపుతున్న ధోరణి సరికాదనీ, ప్రతి చిన్న అంశంలోనూ అధికారులకు వివరణ ఇవ్వాల్సి రావటం, కేసుల్లో ఇరుక్కుంటే న్యాయస్థానాల చుట్టూ తిరగటం ఉత్పాదకతకు అవరోధమవుతున్నదనీ ఔషధరంగ నిర్వాహకులు ఆరోపిస్తున్నారు. వారి కోణంలో ఈ సవరణలు మంచివే కావొచ్చుగానీ, రోగుల కోణం నుంచి దీన్ని పరిశీలించారా అన్నది సందేహమే.
ఫార్మారంగంలో మన దేశం అంతర్జాతీయంగా ముందంజలో ఉంది. కానీ కొన్ని ఫార్మా సంస్థలు నాసిరకం మందులు ఎగుమతి చేసి దేశం పరువుప్రతిష్ఠలను దెబ్బతీస్తున్న ఉదంతాలు తక్కువేం కాదు. మన దేశంనుంచి ఎగుమతైన దగ్గుమందు సేవించి ఆఫ్రికా ఖండ దేశం గాంబియాలో నిరుడు 70 మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. ఆమధ్య ఉజ్బెకిస్తాన్‌లో కూడా 19 మంది పిల్లలు చనిపోయారు. ఇక్కడి నుంచి అమెరికాకు ఎగుమతైన కంటికి సంబంధించిన మందు వికటించి నిరుడు మే నెల నుంచి ఈ ఏడాది జనవరి వరకూ 55 మందికి సమస్యలు తలెత్తాయి.
అందులో ఒకరు మరణించారు కూడా. పాత చట్టం కఠినంగా ఉన్నదని ఫార్మారంగం మొత్తుకుంటున్న కాలంలోనే ఇలాంటి ఉదంతాలు జరిగితే దాన్ని నీరుగార్చటం సమస్యను మరింత పెంచదా అన్న సందేహం ఎవరికైనా వస్తుంది. ఇప్పుడు అమల్లో ఉన్న చట్టం కల్తీ మందులు, నకిలీ మందులు, తప్పుదోవ పట్టించే పేర్లతో మందుల చలామణీ, నాణ్యతా ప్రమాణం కొరవడిన మందులు అని నాలుగు రకాలుగా వర్గీకరించింది. ఆ మందులు వాడినవారికి ఎదురయ్యే సమస్య తీవ్రతను బట్టి ఆ నేరాలకు శిక్షలున్నాయి.
కల్తీ, నకిలీ మందులవల్ల రోగి మరణం సంభవించిన పక్షంలో అందుకు కారకులని గుర్తించినవారికి పదేళ్ల నుంచి యావజ్జీవ శిక్ష వరకూ ఉన్నాయి. తప్పుడు అభిప్రాయం కలిగించే బ్రాండ్‌లతో మందులు చలామణి చేస్తే రెండేళ్ల వరకూ శిక్ష ఉంది. ప్రామాణిక నాణ్యత లేని మందుల (ఎన్‌ఎస్‌క్యూ) తయారీకి రెండేళ్ల వరకూ శిక్ష, రూ. 20,000 వరకూ జరిమానా విధించవచ్చు. వీటన్నిటికీ తాజా బిల్లు అయిదు లక్షల వరకూ జరిమానాలతో సరిపెట్టింది. జైలు శిక్షలు తొలగించింది. ఇతర నేరాల మాటెలావున్నా ఎన్‌ఎస్‌క్యూ కేటగిరీ కిందకొచ్చే కేసులకు జైలు శిక్ష బెడద లేకుండా చేయటాన్నే ప్రధానంగా ప్రజారోగ్య రంగ నిపుణులు ప్రశ్నిస్తున్నారు.
ఈ ఆఖరి కేటగిరీ 27(డి) కిందే దేశంలో ఎక్కువ కేసులు నమోదవుతుంటాయి. ఔషధంలో వినియోగించిన పదార్థాలు అనుమతించిన మోతాదులో కాకుండా వేరేవిధంగా ఉంటే ఆ ఔషధం రోగికి నిరుప యోగమవుతుంది. కానీ కొన్నిసార్లు జబ్బు ముదిరి మరణానికి దారితీసే ప్రమాదం ఉంటుందన్నది నిపుణుల వాదన. అలాంటి కేటగిరీని సైతం చిన్న తప్పిదంగా పరిగణించి జరిమానాలతో సరిపెడితే ఔషధ నాణ్యత దెబ్బతినదా... ప్రజారోగ్యం ప్రమాదంలో పడదా అని వారు ప్రశ్నిస్తున్నారు. నిజానికి నిరుడు ఈ బిల్లు ముసాయిదాను ప్రకటించి అన్ని వర్గాల నుంచీ అభిప్రాయాలు కోరినప్పుడు ప్రజారోగ్య నిపుణులు ప్రధానంగా దీనిపైనే అభ్యంతరం తెలిపారు. అసలు ఫార్మా కంపెనీలు నిబంధన ప్రకారం రిజిస్టరయిన ఫార్మాసిస్టులను నియమించు కోవాల్సి వుండగా చాలా సంస్థలు దాన్ని ఉల్లంఘిస్తున్నాయి.
అకారణంగా వేధించటాన్ని ఎవరూ సమర్థించరు. కానీ రోగుల ప్రాణాలతో ఆడుకునే విధంగా, కేవలం లాభార్జనే ధ్యేయంగా ఉండే సంస్థల విషయంలో కఠినంగా ఉండొద్దా? అసలే తరచు బయటి కొచ్చే ఉదంతాల వల్ల విదేశాల్లో మన ఫార్మా ఉత్పత్తులపై చిన్నచూపు పడుతోంది. మన చట్టాలు చాలా ఉదారంగా ఉండటంవల్లే, తగిన తనిఖీలు లేనందువల్లే ఇదంతా జరుగుతోందన్న అభిప్రాయం ఉంది. ఇప్పుడు తీసుకొచ్చిన బిల్లు ఆ అభిప్రాయాన్ని పోగొట్టే విధంగా లేకపోగా మరింత సరళంగా మార్చిందని ప్రజారోగ్య కార్యకర్తల ఆరోపణ.
కేవలం కఠిన శిక్షలు, తనిఖీలు మాత్రమే సమస్యకు పరిష్కారం కాకపోవచ్చు. కానీ కల్తీ, నకిలీ మందుల కారణంగా రోగి ప్రాణం కోల్పోయినా, తీవ్రమైన వైకల్యం సంభవించినా ఆ రోగి కుటుంబానికి భారీయెత్తున పరి హారం చెల్లించే నిబంధన ఉంటే ఔషధ తయారీ సంస్థ దారికి రాదా? దీనికి బదులు రూ. 5 లక్షల జరిమానాతో సాధించేదేమిటి? ఈమాత్రం జరిమానా చెల్లించలేని స్థితిలో ఏ సంస్థయినా ఉంటుందా? పటిష్టమైన పర్యవేక్షణ, పారదర్శకత, నేరం చేస్తే కఠిన శిక్ష, భారీ పరిహారం చెల్లింపు తప్పదన్న భయం ఉంటేనే పరిస్థితి చక్కబడుతుంది. ఇవేమీ లేకుండా చట్టం తెచ్చి ప్రయోజన మేమిటి?
ఈ చట్టంతో సాధించేదేమిటి?
Published Sat, Aug 5 2023 3:55 AM | Last Updated on Sat, Aug 5 2023 3:55 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment