ప్రతిష్టంభనకు తెర! | Constitution debate to be held in Lok Sabha and Rajya Sabha | Sakshi
Sakshi News home page

ప్రతిష్టంభనకు తెర!

Published Tue, Dec 3 2024 4:49 AM | Last Updated on Tue, Dec 3 2024 4:49 AM

Constitution debate to be held in Lok Sabha and Rajya Sabha

స్పీకర్‌ చొరవ, విపక్షాలతో చర్చలు

రాజ్యాంగంపై ఉభయసభల్లో చర్చకు ఇరుపక్షాల అంగీకారం

లోక్‌సభలో 13, 14న చర్చ రాజ్యసభలో 16, 17 తేదీల్లో

నేటినుంచి సజావుగా పార్లమెంటు

సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా చొరవ ఫలించింది. పార్లమెంటు శీతాకాల సమావేశాలపై వారం రోజులుగా నెలకొన్న ప్రతిష్టంభనకు ఎట్టకేలకు తెరపడింది. రాజ్యాంగ దిన వజ్రోత్సవాల సందర్భంగా ఉభయ సభల్లోనూ రాజ్యాంగంపై చర్చ చేపట్టేందుకు ప్రభుత్వానికి, ప్రతిపక్షాలకు మధ్య అంగీకారం కుదిరింది. ఆ మేరకు డిసెంబర్‌ 13, 14 తేదీల్లో లోక్‌సభలో, 16, 17ల్లో రాజ్యసభలో చర్చ జరగనుందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్‌ రిజిజు ప్రకటించారు. సోమవారం అన్ని పారీ్టల పార్లమెంటరీ పక్ష నేతలతో స్పీకర్‌ భేటీ అనంతరం ఆయన మీడియాకు ఈ మేరకు తెలిపారు. మంగళవారం నుంచి ఉభయ సభల సమావేశాలూ సజావుగా జరిగేలా సహకరించేందుకు అన్ని పక్షాలూ అంగీకరించాయన్నారు.

దీన్ని భేటీలో పాల్గొన్న విపక్షాల నేతలు కూడా ధ్రువీకరించారు. విపక్షాలు చర్చకు పట్టుబడుతున్న సంభాల్‌ హింస, మణిపూర్‌ కల్లోలం తదితరాల పరిస్థితి ఏమిటని ప్రశ్నించగా నిబంధనలకు లోబడి ఏ అంశాన్నైనా సభల్లో లేవనెత్తవచ్చని రిజిజు బదులిచ్చారు. అదానీ, మణిపూర్‌ కల్లోలం తదితర అంశాలపై చర్చకు విపక్షాలు పట్టుబడుతుండటంతో నవంబర్‌ 25న పార్లమెంటు శీతాకాల సమావేశాలు మొదలైనప్పటి నుంచీ ఉభయ సభల్లో రోజూ వాయిదాల పర్వం సాగుతుండటం తెలిసిందే. దీనికి తెర దించేలా విపక్షాలను ఒప్పించేందుకు ఓం బిర్లా కొద్ది రోజులుగా ప్రయతి్నస్తున్నారు.

వాటికి కొనసాగింపుగా ఆయన సోమవారం అఖిలపక్ష భేటీ నిర్వహించారు. కాంగ్రెస్‌ నుంచి గౌరవ్‌ గొగొయ్, డీఎంకే నుంచి టీఆర్‌ బాలు, తృణమూల్‌ కాంగ్రెస్‌ నుంచి కల్యాణ్‌ బెనర్జీ తదితరులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కుదిరిన సమన్వయ ఒప్పందం ప్రకారం సమాజ్‌వాదీ పార్టీ సంభాల్‌ అంశాన్ని, తృణమూల్‌ బంగ్లాదేశ్‌ సమస్యను లేవనెత్తేందుకు అనుమతించనున్నట్టు సమాచారం. తాము డిమాండ్‌ చేస్తున్న మేరకు రాజ్యాంగంపై రెండు రోజుల ప్రత్యేక చర్చకు మోదీ సర్కారు ఎట్టకేలకు అంగీకరించిందని కాంగ్రెస్‌ పేర్కొంది.

అదానీ, సంభాల్‌ తదితర అంశాలపై పార్లమెంటులో చర్చకు భయపడి తప్పించుకుంటోందని దుయ్యబట్టింది. ఆ పార్టీ గట్టిగా పట్టుబడుతున్న అదానీ అంశంపై చర్చకు అధికార పక్షం అంగీకరిస్తుందా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. ఈ విషయంలో ఇతర విపక్షాలేవీ కాంగ్రెస్‌కు దన్నుగా నిలవడం లేదు. ప్రతి సమావేశాల్లోనూ పార్లమెంటును అధికార బీజేపీ హత్య చేస్తూ వస్తోందని టీఎంసీ ఎంపీ డెరిక్‌ ఓబ్రియాన్‌ దుయ్యబట్టారు.

అవే ఆందోళనలు.. ఉభయసభలూ నేటికి వాయిదా
అదానీ, సంభాల్, అజ్మీర్‌ దర్గా సహా పలు అంశాలపై సోమవరం పార్లమెంటు అట్టుడికింది. వాటిపై చర్చకు విపక్షాలు పట్టుబట్టడంతో సోమవారం కూడా ఉభయ సభలూ కార్యకలాపాలేవీ జరపకుండానే వాయిదా పడ్డాయి. లోక్‌సభ ప్రారంభమవగానే స్పీకర్‌ ఓం బిర్లా ప్రశ్నోత్తరాలు చేపట్టగా విపక్షాలు అడ్డుకున్నాయి. అదానీపై చర్చించాలంటూ నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగడంతో సభ తొలుత మధ్యాహ్నం దాకా వాయిదా పడింది.

తర్వాత కూడా విపక్షాల ఆందోళనలు కొనసాగడంతో మంగళవారానికి వాయిదా పడింది. రాజ్యసభలోనూ ఇదే తంతు కొనసాగింది. అదానీ సహా పలు అంశాలపై విపక్షాలిచి్చన 20 వాయిదా తీర్మానాలను చైర్మన్‌ జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌ తిరస్కరించారు. ఆందోళనల నడుమ సభ తొలుత మధ్యాహ్నానికి, తర్వాత మంగళవారానికి వాయిదా పడింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement