న్యూఢిల్లీ: పార్లమెంట్‌లో పరస్పరం వాగ్వాదానికి దిగే ఎంపీలు ఆదివారం ఉల్లాసంగా గడిపారు. పరస్పరం పోటీపడ్డారు. కానీ, పార్లమెంట్ లోపల కాదు, బయట మాత్రమే. క్షయవ్యాధి (టీబీ)పై అవగాహన పెంచడానికి లోక్‌సభ, రాజ్యసభ ఎంపీల మధ్య స్నేహపూర్వక క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు. ఢిల్లీలోని మేజర్ ధ్యాన్‌చంద్ నేషనల్ స్టేడియంలో జరిగిన టీ20 మ్యాచ్‌లో రాజ్యసభ చైర్మన్ ఎలెవన్ జట్టుపై లోక్‌సభ స్పీకర్ ఎలెవన్ విజయం సాధించింది.
రాజ్యసభ జట్టుకు కేంద్ర మంత్రి కిరెణ్ రిజిజు, లోక్‌సభ టీమ్‌కు కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ కెపె్టన్లుగా వ్యవహరించారు. పక్కా ప్రొఫెషనల్స్‌ను తలపిస్తూ ఇరు జట్లూ హోరాహోరీగా తలపడటం విశేషం. తొలుత బ్యాటింగ్ చేసిన లోక్‌సభ ఎలెవన్ ఏడు వికెట్ల నష్టానికి ఏకంగా 250 పరుగులు సాధించింది. కెపె్టన్ ఠాకూర్ సెంచరీ (111 పరుగులు) చేయడం విశేషం. లక్ష్యఛేదనలో రాజ్యసభ ఎలెవన్ 8 వికెట్ల నష్టానికి 178 పరుగులు మాత్రమే చేయగలిగింది.
రాజ్యసభ జట్టు సభ్యుడు, భారత క్రికెట్ జట్టు మాజీ కెపె్టన్ మహమ్మద్ అజారుద్దీన్ 42 బంతుల్లో 74 పరుగులు సాధించారు. ఆయనతో పాటు హర్బజన్‌సింగ్, యూసుఫ్ పఠాన్ రూపంలో మ్యాచ్‌లో ముగ్గురు మాజీ ఇండియా ఆటగాళ్లు తలపడటం విశేషం. లోక్‌సభ సభ్యులు దీపేందర్ హుడా(కాంగ్రెస్)కు బెస్ట్ బౌలర్, నిషికాంత్ దూబే(బీజేపీ)కి బెస్టు ఫీల్డర్ అవార్డులు లభించాయి.
బీజేపీ ఎంపీ మనోజ్ తివారీకి సూపర్ క్యాచ్ అవార్డు దక్కింది. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అవార్డులను ప్రదానం చేశారు. అంతకుముందు మ్యాచ్ ఆరంభించిన లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కాసేపు సరదాగా బ్యాట్ పట్టి అలరించారు. కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, శర్బానంద సోనోవాల్, జ్యోతిరాదిత్య సింధియా, మన్‌సుఖ్ మాండవీయ, గజేంద్రసింగ్ షెకావత్, సురేశ్ గోపీ, చిరాగ్ పాశ్వాన్, ఎంపీలు రాఘవ్ చద్దా (ఆప్), డెరెక్ ఓబ్రియాన్ (టీఎంసీ) తదితరులు మ్యాచ్‌లో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment