అమరులకు లోక్‌సభ నివాళి
న్యూఢిల్లీ: 2001 డిసెంబర్ 13వ తేదీన పార్లమెంట్‌పై జరిగిన ఉగ్రదాడిని ఎదుర్కొని ప్రాణ త్యాగం చేసిన భద్రతా సిబ్బందికి లోక్‌సభ శుక్రవారం ఘనంగా నివాళులర్పించింది. సభ ఉదయం 11 గంటలకు ప్రారంభం కాగానే అమరుల గౌరవార్థం సభ్యులంతా లేచి నిలబడి కొద్దిసేపు మౌనం పాటించారు.
అనంతరం పాత పార్లమెంట్ సంవిధాన్ సదన్ వెలుపల జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో అమరులకు పుష్పాంజలి ఘటించారు. కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్, ప్రధాని మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ, పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు పాల్గొన్నారు.
సీఐఎస్‌ఎఫ్ జవాన్లు అమరులకు సెల్యూట్ చేశారు. అనంతరం మౌనం పాటించారు. బాధిత కుటుంబాల సభ్యులతో నేతలు మాట్లాడారు. కాగా, అప్పటి ఘటనలో పార్లమెంట్ భద్రతా విభాగం, ఢిల్లీ పోలీసులు, సీఆర్‌పీఎఫ్‌లకు చెందిన 8 మంది సిబ్బందితోపాటు సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ శాఖకు చెందిన ఓ ఉద్యోగి నేలకొరిగారు. పార్లమెంట్‌లోకి ప్రవేశించి మారణ హోమం సృష్టించేందుకు తెగబడిన పాకిస్తాన్‌కు చెందిన మొత్తం ఐదుగురు లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతమయ్యారు.
సర్వదా రుణపడి ఉంటాం: రాష్ట్రపతి ముర్ము
2001లో ఉగ్ర మూకల దాడి నుంచి పార్లమెంట్‌ను రక్షించే క్రమంలో ప్రాణత్యాగం చేసిన వారికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఘనంగా నివాళులర్పించారు. అమరులకు సర్వదా రుణపడి ఉంటామని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పేర్కొన్నారు. ఉగ్రమూకలను జాతి యావత్తూ కలిసి కట్టుగా ఎదుర్కొందని, ఉగ్రవాదంపై పోరుకు దేశం కట్టుబడి ఉంటుందని ఆమె ‘ఎక్స్’లో తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment