martyrs
-
పార్లమెంట్‌పై ఉగ్రదాడి ఘటన..
న్యూఢిల్లీ: 2001 డిసెంబర్ 13వ తేదీన పార్లమెంట్‌పై జరిగిన ఉగ్రదాడిని ఎదుర్కొని ప్రాణ త్యాగం చేసిన భద్రతా సిబ్బందికి లోక్‌సభ శుక్రవారం ఘనంగా నివాళులర్పించింది. సభ ఉదయం 11 గంటలకు ప్రారంభం కాగానే అమరుల గౌరవార్థం సభ్యులంతా లేచి నిలబడి కొద్దిసేపు మౌనం పాటించారు. అనంతరం పాత పార్లమెంట్ సంవిధాన్ సదన్ వెలుపల జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో అమరులకు పుష్పాంజలి ఘటించారు. కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్, ప్రధాని మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ, పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు పాల్గొన్నారు. సీఐఎస్ఎఫ్ జవాన్లు అమరులకు సెల్యూట్ చేశారు. అనంతరం మౌనం పాటించారు. బాధిత కుటుంబాల సభ్యులతో నేతలు మాట్లాడారు. కాగా, అప్పటి ఘటనలో పార్లమెంట్ భద్రతా విభాగం, ఢిల్లీ పోలీసులు, సీఆర్పీఎఫ్లకు చెందిన 8 మంది సిబ్బందితోపాటు సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ శాఖకు చెందిన ఓ ఉద్యోగి నేలకొరిగారు. పార్లమెంట్‌లోకి ప్రవేశించి మారణ హోమం సృష్టించేందుకు తెగబడిన పాకిస్తాన్‌కు చెందిన మొత్తం ఐదుగురు లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతమయ్యారు.సర్వదా రుణపడి ఉంటాం: రాష్ట్రపతి ముర్ము 2001లో ఉగ్ర మూకల దాడి నుంచి పార్లమెంట్‌ను రక్షించే క్రమంలో ప్రాణత్యాగం చేసిన వారికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఘనంగా నివాళులర్పించారు. అమరులకు సర్వదా రుణపడి ఉంటామని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పేర్కొన్నారు. ఉగ్రమూకలను జాతి యావత్తూ కలిసి కట్టుగా ఎదుర్కొందని, ఉగ్రవాదంపై పోరుకు దేశం కట్టుబడి ఉంటుందని ఆమె ‘ఎక్స్’లో తెలిపారు. -
National Forest Martyrs Day: అటవీ అమరవీరుల త్యాగాలు మరువలేనివి
న్యూఢిల్లీ: భారతదేశంలో ప్రతి ఏటా సెప్టెంబర్ 11న జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. దేశంలోని అడవులు, వన్యప్రాణులను రక్షించడానికి తమ ప్రాణాలను త్యాగం చేసిన వీరుల త్యాగాన్ని పురస్కరించుకుని ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ రోజున మానవాళి మనుగడలో అడవుల పాత్ర, అడవులను రక్షించాల్సిన అవసరం గురించి అవగాహన పెంచడానికి దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు.పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ, విద్యా సంస్థలు ఈరోజు ప్రత్యక కార్యక్రమాలు నిర్వహిస్తుంటాయి. 2013 సెప్టెంబరు 11 నుంచి మొదటిసారిగా పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ దేశంలో జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవాన్ని అధికారికంగా జరుపుకోవడం ప్రారంభించింది. ఈ రోజున జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవాన్ని జరుపుకోవడం వెనుక ప్రత్యేక కారణముంది. 1730, సెప్టెంబర్ 11న రాజస్థాన్‌లోని ఖేజర్లీ గ్రామంలో మారణకాండ జరిగింది. మార్వార్ రాజ్యంలో చెట్లను రక్షించడానికి బిష్ణోయ్ కమ్యూనిటీ సభ్యులు తమ ప్రాణాలను త్యాగం చేసిన రోజు ఇది. అప్పటి జోధ్‌పూర్ మహారాజు అభయ్ సింగ్ కొత్త రాజభవనాన్ని నిర్మిస్తున్నాడు. దాని కోసం అతనికి ఖేజ్రీ కలప అవసరమైంది. దీంతో రాజస్థాన్‌లోని థార్ జిల్లాలోని ఖేజ్రీ గ్రామంలోని ఖేజ్రీ చెట్లను నరికివేయాలని మహారాజు ఆదేశించాడు. రాజు ఆజ్ఞను విష్ణోయ్ వర్గం తీవ్రంగా వ్యతిరేకించింది.ఖేజ్రీ చెట్లు బిష్ణోయిల జీవనోపాధికి ఒక ముఖ్యమైన వనరు. ఈ చెట్లను నరికివేయడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బిష్ణోయ్ మహిళ అమృతా దేవి, ఆమె ముగ్గురు కుమార్తెలు ఖేజ్రీ చెట్లను కావలించుకుని వాటిని నరకకుండా అడ్డుకున్నారు.అమృతా దేవితో పాటు ఆమె కుమార్తెల సాహసోపేతమైన చర్య గురించి అందరికీ తెలిసింది. దీంతో గ్రామస్తులంతా చెట్లను నరికేవారిని అడ్డుకున్నారు. ఈ నేపధ్యంలో బిష్ణోయిలు- మహారాజు సైనికుల మధ్య కొట్లాట జరిగింది. సైనికులు భయంకరమైన మారణకాండను కొనసాగించారు. చెట్లను రక్షించే ప్రయత్నంలో 363 మందికి పైగా బిష్ణోయిలు కన్నుమూశారు. -
ఒకే కుటుంబం.. రెండు నెలల్లో అమరులైన ఇద్దరు జవానులు
జమ్ముకశ్మీర్‌లోని కథువాలో ఆర్మీ వాహనంపై ఉగ్రవాదులు మెరుపుదాడి చేయగా, ఐదుగురు భారత సైనికులు వీరమరణం పొందారు. వీరంతా ఉత్తరాఖండ్‌కు చెందిన వారు. ఈ ఘటన సైనికుల కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ముఖ్యంగా రెండు నెలల వ్యవధిలో దేశం కోసం ఇద్దరు కుమారులు అమరులైన కుటుంబం అనుభవిస్తున్న వేదన మాటలకు అందనిది.ఉత్తరాఖండ్‌లోని టెహ్రీ పరిధిలోగల డాగర్ గ్రామానికి చెందిన ఒక కుటుంబంలోని ఇద్దరు కుమారులు రెండు నెలల వ్యవధిలో దేశం కోసం ప్రాణాలర్పించారు. వీరిలో ఒకరైన ఆదర్శ్ నేగి గత సోమవారం జమ్ముకశ్మీర్‌లోని కథువాలో మరణించగా, మరో కుమారుడు మేజర్ ప్రణయ్ నేగి గత ఏప్రిల్‌లో లేహ్‌లో వీరమరణం పొందారు. కుమారులిద్దరూ అసువులుబాయడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.కథువాలో వీరమరణం పొందిన సైనికుడు ఆదర్శ్ నేగి 2018లో గర్వాల్ రైఫిల్స్‌లో చేరాడు. తాజాగా ఆదర్శ్ తల్లిదండ్రులు అతనికి పెళ్లి చేయాలని నిశ్చయించారు. ఒక కుమారుని బలిదానం నుండి ఆ కుటుంబం ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తరుణంలో మరో కుమారుడు మరణించడాన్ని వారు దిగమింగుకోలేకపోతున్నారు. సీఎం పుష్కర ధామి అమరవీరుల కుటుంబాన్ని ఓదార్చారు. -
ఈ ఐదుగురు.. 26/11 అమర వీరులు!
ముంబై మహానగరంలో 2008, నవంబర్ 26న జరిగిన ఉగ్రదాడికి నేటితో 15 ఏళ్లు పూర్తయ్యాయి. తాజ్, ట్రైడెంట్ హోటళ్లతో పాటు ఛత్రపతి శివాజీ టెర్మినస్‌పై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో 166 మంది మృతి చెందారు. అయితే మనదేశానికి చెందిన వీర జవానులు, పోలీసులు ఉగ్రవాదులను ధైర్యంగా ఎదుర్కొని ఎంతోమంది అమాయకుల ప్రాణాలను కాపాడారు. ఈ దాడిలో ఐదుగురు వీర జవానులు ప్రాణాలు కోల్పోయారు. ఆ అమరవీరుల ధైర్యసాహసాలను మరోసారి గుర్తుచేసుకుందాం. హేమంత్ కర్కరే హేమంత్.. ముంబై యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అంటే ముంబై ఏటీఎస్ చీఫ్. హేమంత్ రాత్రి డిన్నర్ చేస్తుండగా నగరంలో ఉగ్రవాద దాడికి సంబంధించి క్రైమ్ బ్రాంచ్ నుండి కాల్ వచ్చింది. దీంతో ఆయన ఇంటి నుంచి బయటకు వచ్చి, ఏసీపీ అశోక్ కామ్టే, ఇన్స్పెక్టర్ విజయ్ సలాస్కర్‌తో కలిసి డ్యూటీలోకి దిగారు. కామా హాస్పిటల్ వెలుపల జరిగిన ఎన్కౌంటర్లో ఉగ్రవాదులు అజ్మల్ కసబ్, ఇస్మాయిల్ ఖాన్లు అతనిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ నేపధ్యంలోనే హేమంత్ వీరమరణం పొందారు. మరణానంతరం ఆయనకు అశోకచక్ర పురస్కారం లభించింది. అశోక్ కామ్టే అశోక్ ముంబై పోలీస్ విభాగంలో ఏసీపీ. ఉగ్రదాడి జరిగిన సమయంలో ఆయన ఏటీఎస్ చీఫ్ హేమంత్ కర్కరే బృందంలో ఉన్నారు. కామా హాస్పిటల్ వెలుపల జరిగిన ఎన్కౌంటర్లో ఉగ్రవాది ఇస్మాయిల్ ఖాన్ అతనిపై అనేక రౌండ్ల కాల్పులు జరిపాడు. ఒక బుల్లెట్ అశోక్ తలకు తగిలింది. ఆయన తీవ్రంగా గాయపడినప్పటికీ, కొందరు శత్రువులను తుదముట్టించారు. విజయ్ సలాస్కర్ సీనియర్ పోలీస్ ఇన్స్పెక్టర్ సలాస్కర్ పేరు వినగానే ముంబయి అండర్‌వరల్డ్ వణికిపోయేది. విజయ్ సలాస్కర్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్‌గా గుర్తింపు పొందారు. ముంబైలో దాడి జరిగినప్పుడు, విజయ్ సలాస్కర్ కూడా ఏటీఎస్ చీఫ్ హేమంత్ కర్కరే బృందంలో సభ్యుడు. కామా హాస్పిటల్ వెలుపల జరిగిన ఎన్కౌంటర్లో ఉగ్రవాదుల బుల్లెట్లకు సలార్కర్ వీరమరణం పొందారు. మరణానంతరం అతనికి అశోకచక్ర పురస్కారం లభించింది. తుకారాం ఓంబ్లే ముంబై పోలీస్ విభాగానికి చెందిన ఈ ఏఎస్ఐ ధైర్యాన్ని ప్రశంసించకుండా ఎవరూ ఉండలేరు. తుకారాం ఆయుధాలు లేకుండా ఉగ్రవాది అజ్మల్ కసబ్‌ను ఎదుర్కోవడమే కాకుండా, చివరికి అతన్ని పట్టుకోవడంలో కూడా విజయం సాధించారు. ఈ సమయంలో కసబ్ అతనిపై అనేక రౌండ్ల బుల్లెట్లను కాల్చాడు. ఫలితంగా తుకారాం అమరుడయ్యారు. మరణానంతరం అతనికి అశోకచక్ర పురస్కారం లభించింది. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ ఉగ్రవాద దాడుల సమయంలో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ మిషన్ ఆపరేషన్ బ్లాక్ టోర్నాడోకు నాయకత్వం వహించారు. అతను 51 ఎన్ఎస్ఏజీ కమాండర్. తాజ్ మహల్ ప్యాలెస్, టవర్స్ హోటల్ లోపల దాక్కున్న ఉగ్రవాదులతో మేజర్ పోరాడుతుండగా, ఒక ఉగ్రవాది అతనిపై వెనుక నుండి దాడి చేశాడు. దీంతో అతను అక్కడికక్కడే వీరమరణం పొందారు. అతనికి మరణానంతరం 2009లో అశోకచక్ర పురస్కారం లభించింది. ఈ ఐదుగురు వీర సైనికులు, పోలీసులతో పాటు హవల్దార్ గజేంద్ర సింగ్, నాగప్ప ఆర్. మహాలే, కిషోర్ కె. షిండే, సంజయ్ గోవిల్కర్, సునీల్ కుమార్ యాదవ్ తదిరులు నాడు జరిగిన పోరులో ధైర్యసాహసాలకు ఉదాహరణగా నిలిచారు. ఇది కూడా చదవండి: ఉత్తరకాశీలో రెస్క్యూ ఆపరేషన్‌కు మరో ఆటంకం? -
ప్రభుత్వం సాధించిన విజయాలకు అక్షర చిహ్నం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం సాధించిన విజయపరంపరకు అక్షరచిహ్నంగా ‘తెలంగాణ మోడల్’ పుస్తకం ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఆదివారం ప్రగతిభవన్‌లో తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ సంపాదకత్వంలో వెలువడిన ’తెలంగాణ మోడల్‘’ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కేసీఆర్ దార్శనిక ఆలోచనలతో ప్రవేశపెట్టిన పథకాలు నేడు దేశానికి ఎలా నమూనా అయ్యాయో ఈ పుస్తకంలో గౌరీశంకర్ పొందుపరిచారని చెప్పారు. విజయాలను నమోదు చేయడం అంటే చరిత్రలో తెలంగాణ ప్రభుత్వ కార్యకలాపాలు భద్రపరచడమేనని, ప్రస్తుతం దేశంలోని ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా ఉండే ఈ విజయాలు పుస్తకరూపంలో రావడం భవిష్యత్తరాలకు పాఠాలుగా నిలుస్తాయన్నారు. ‘టుడే ఏ రీడర్– టుమారో ఏ లీడర్’ అంటారని గుర్తు చేశారు. శాసనమండలి సభ్యుడు దేశపతి శ్రీనివాస్, తెలంగాణ డిజిటల్ మీడియా డైరెక్టర్ కొణతం దిలీప్, రచయిత పెద్దింటి అశోక్‌కుమార్ పాల్గొన్నారు. ఎర్రోజు శ్రీనివాస్ ‘నడక’ పుస్తకావిష్కరణ తెలంగాణ వికాస సమితి ప్రధాన కార్యదర్శి ఎర్రోజు శ్రీనివాస్ వివిధ పత్రికల్లో రాసిన వ్యాసాలన్నీ కలిపి తీసుకొచ్చిన ’నడక’ పుస్తకాన్ని మంత్రి కేటీఆర్ ఆదివారం ఆవిష్కరించారు. ఈ వ్యాసాల ద్వారా దశాబ్దాల కాల తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని విశ్లేషించిన తీరును కేటీఆర్ అభినందించారు. -
అటవీ అమరవీరుల కుటుంబాలకు అండ
బహదూర్‌ఫురా: విధి నిర్వహణలో అశువులు బాసిన అటవీ అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ హామీనిచ్చారు. అటవీ శాఖ ఉద్యోగులు, సిబ్బందికి ప్రభుత్వం అన్ని రకాల సహాయసహకారాలు అందిస్తుందని భరోసానిచ్చారు. సోమవారం జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా నెహ్రూ జూలాజికల్ పార్కు స్మారక చిహ్నం వద్ద మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధికారులు, సిబ్బందితో కలిసి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... విధి నిర్వహణలో అటవీ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అటవీ సంపదను దోచుకునే స్మగ్లర్లు, అరాచక ముఠాలకు ఎదురొడ్డి ప్రాణాలర్పించి వీర మరణం పొందిన అటవీ సిబ్బంది త్యాగాలను వృథా కానివ్వకుండా వారి ఆశయాలకు అనుగుణంగా పని చేయాలని కోరారు. కార్యక్రమంలో అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, అటవీ సంరక్షణ ప్రధాన అధికారి ఆర్.ఎం.డోబ్రియాల్, వన్యప్రాణుల ముఖ్య సంరక్షణ అధికారి లోకేశ్ జైశ్వాల్, వీసీ అండ్ ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, జూపార్కు డైరెక్టర్ ప్రసాద్, క్యూరేటర్ సునీల్ హీరమత్ తదితరులు పాల్గొన్నారు. మరోవైపు జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ ఓ ప్రకటనలో శ్రద్ధాంజలి ఘటించారు. -
విద్యుత్ సవరణ బిల్లును అడ్డుకోవాలి
హిమాయత్‌నగర్: దేశంలోని కొన్ని కార్పొరేట్ శక్తులకు లాభాలు అందించే సరుకుగా విద్యుత్ మారిందని పలువురు వక్తలు వ్యాఖ్యానించారు. బషీర్‌బాగ్ దేశోద్ధారక భవన్లో 7 వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో సోమవారం ‘2022 విద్యుత్ సవరణ బిల్లును వ్యతిరేకిద్దాం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై మోపుతున్న విద్యుత్ భారాలను ఎండగడదాం’అనే అంశంపై రాష్ట్ర సదస్సును నిర్వహించారు. అంతకముందు బషీర్‌బాగ్ విద్యుత్ కాల్పుల్లో మృతి చెందిన అమరులకు నివాళులర్వించారు. ఎంసీపీఐ (యు) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి, సీపీఐ(ఎంఎల్) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చలపతిరావు, రాష్ట్ర కార్యదర్శి ప్రసదన్న, ఎస్‌యూసీఐ(సీ) రాష్ట్ర కార్యదర్శి మురగరి, ఆర్ఎస్పీ రాష్ట్ర కార్యదర్శి జానకి రాములు, ఏఐఎఫ్బీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రసా ద్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యుత్ సవరణ బిల్లు–2022 అనే ది కేవలం కార్పొరేట్ శక్తులకు మాత్రమేనన్నారు.ఈ బిల్లు వల్ల విద్యుత్ చార్జీలు సామన్య వినియోగ దారులకు అందుబాటులో లేనివిధంగా పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే పేదప్రజలు, రైతులు, ప్రజా వినియోగ రంగాలకు ఇచ్చే సబ్సిడీలు క్రమంగా రద్దు అవుతున్నాయన్నారు. ప్రజా వ్యతిరేక విద్యుత్ సవరణ బిల్లు–2022ను ఉపసంహరించుకోవాలని,విద్యుత్ చట్టం–2003ను రద్దు చేయాలని, ప్రీపెయిడ్ మీటర్ల యోచనను విరమించుకోవాలని, 100 యూనిట్లు లోపు గృహవినియోగదారులకు విద్యుత్ ఉచితంగా ఇవ్వాలంటూ ఈ సదస్సు ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎంసీపీఐ(యూ) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వనం సుధాకర్, సుకన్య, తేజ, భరత్, హేమలత పాల్గొన్నారు. -
అట్టుడుకుతున్న అడవి పల్లెలు!
సాక్షి ప్రతినిధి, వరంగల్: తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ సరిహద్దు అటవీ పల్లెలు అట్టుడుకుతున్నాయి. మావోయిస్టులు, పోలీసుల పోటా పోటీ సభలు, ప్రచారం, కూంబింగ్‌లతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మావోయిస్టు పార్టీ ఈ నెల 21 నుంచి 27 వరకు 18వ అమరవీరుల వారోత్సవాలను నిర్వహించనున్నట్టు మూడు రాష్ట్రాల సరిహద్దులో వారం ముందు నుంచే విస్తృత ప్రచారం చేసింది. గోదావరి పరీవాహక అటవీ ప్రాంతంలో నక్సల్స్ కదలికలున్నట్టు ఇంటెలిజెన్స్ అధికారులు పోలీసులను అప్రమత్తం చేశారు. దీనితో పోలీసు ఉన్నతాధికారులు గ్రేహౌండ్స్‌తోపాటు ప్రత్యేక సాయుధ పోలీసు బలగాలను రంగంలోకి దింపారు. మూడు రాష్ట్రాల సరిహద్దులోని కొమురంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అడవులను సాయుధ బలగాలు జల్లెడ పడుతున్నాయి. క్షణక్షణం భయం భయం మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ సాయుధ బలగాలతో కలిసి తెలంగాణ సరిహద్దులో ఓవైపు పోలీసులు అడవులను జల్లెడ పడుతుండగా.. మరోవైపు మావోయిస్టు పార్టీ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను చేపట్టింది. జన చేతన నాట్య మండలి నిర్వహించిన ఈ కార్యక్రమానికి మావోయిస్టు నాయకులతోపాటు 10, 12 గ్రామాల ప్రజలు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను పోలీసులు కూడా విడుదల చేశారు. ఇదే సమయంలో పోలీసులు వాల్ పోస్టర్లు, కరపత్రాల ద్వారా మావోయిస్టుల తలలకు వెల ప్రకటించి విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తుండటంతో అడవుల్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మావోయిస్టు స్థావరాలపై కన్ను కొంతకాలం నుంచి కూంబింగ్ ముమ్మరం చేసిన పోలీసులు.. మావోయిస్టు స్థావరాల సమాచారం సేకరించి దాడులు చేస్తున్నారు. ఈ క్రమంలో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ తాల్మెంద్రి అటవీ ప్రాంతంలో ఇటీవల నేషనల్ పార్క్ ఏరియా కమిటీ డీసీఎం దిలీప్ ఆధ్వర్యంలో మావోయిస్టులు సమావేశం అయ్యారనే సమాచారం అందింది. డీఆర్జీ పోలీస్ ఫోర్స్ దాడి చేయగా.. ఇరువురి మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. కానీ మావోయిస్టులు తప్పించుకున్నారు. -
మావోయిస్టుల అమరవీరుల వారోత్సవాలు.. ఏవోబీలో రెడ్ అలర్ట్
సాక్షి, పాడేరు/ముంచంగిపుట్టు/కొయ్యూరు: ఏజెన్సీలో మావోయిస్టులు జూలై 28 నుంచి ఆగస్టు 3 వరకు 50వ అమరవీరుల వారోత్సవాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఏవోబీ వ్యాప్తంగా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. కొద్ది రోజుల కిందట ఏవోబీ ప్రత్యేక జోనల్ కమిటీ కార్యదర్శి గాజర్ల రవి అలియాస్ ఉదయ్ అలియాస్ గణేష్ పేరిట విడుదలైన లేఖలో వారోత్సవాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఒడిశాలోని మల్కన్‌గిరి, కోరాపుట్ జిల్లాలతో పాటు అల్లూరి జిల్లాలోని పాడేరు, చింతపల్లి, రంపచోడవరం, చింతూరు పోలీసు సబ్ డివిజన్ల పరిధిలోని పోలీసు బలగాలు వారం రోజుల నుంచి కూంబింగ్ చేపడుతున్నాయి. చింతూరుకు సరిహద్దులో ఉన్న చత్తీస్‌గఢ్ ప్రాంతంలో కూడా గాలింపు చర్యలు చేపడుతున్నారు. జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ మావోయిస్టుల వారోత్సవాలను భగ్నం చేసేలా పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. సీఆర్పీఎఫ్తో పాటు ఇతర పోలీసు బలగాలు అటవీ ప్రాంతాల్లో మకాం వేశాయి. మండల కేంద్రాలు, ప్రధాన జంక్షన్లలో ఆయా పోలీసులు వాహన తనిఖీలు చేపడుతున్నారు. బాంబ్, డాగ్ స్క్వాడ్‌తో కూడా తనిఖీలు జరిపారు. ముంచంగిపుట్టులో ఎస్ఐ కె.రవీంద్ర ఆధ్వర్యంలో వాహన తనిఖీలు నిర్వహించారు. సీఆర్పీఎఫ్ పోలీసులు ముంచంగిపుట్టు నుంచి రాముల గ్రామం వరకు కల్వర్టులు, వంతెనలను బాంబు స్క్వాడ్‌తో పరిశీలించారు. జోలాపుట్టు, మాచ్‌ఖండ్, ఒనకఢిల్లీల్లో బీఎస్ఎఫ్ బలగాలు నిఘా పెంచాయి. నాయకులంతా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని, ఎక్కడికి వెళ్లినా తమకు సమాచారం అందించాలని పోలీసులు నోటీసులను జారీ చేశారు. కొయ్యూరు మండలంలోనూ పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. ఏడాది కాలంలో ఏవోబీ పరిధిలో 12 మంది మావోయిస్టులు మరణించారు. అలా మరణించిన వారికి వారోత్సవాల్లో మావోయిస్టులు నివాళులర్పిస్తారు. ఈ సందర్భంగా యాక్షన్టీంలను రంగంలోకి దించే అవకాశం ఉండడంతో పోలీసులు నిఘా పెంచారు. పాడేరు, చింతలవీధి, గబ్బంగి, కరకపుట్టు తదితర ప్రాంతాల్లో ఎస్ఐలు లక్ష్మణ్‌రావు, రంజిత్‌లు తమ సిబ్బందితో తనిఖీలు చేపట్టారు. ప్రైవేటు వాహనాలు, ఆర్టీసీ బస్సులలో రాకపోకలు సాగిస్తున్న వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. (క్లిక్: ఆంధ్రాలోనే ఉంటాం.. భద్రాచలాన్ని ఆంధ్రాలో కలపాలి) -
దండకారణ్యంలో యుద్ధ మేఘాలు.. పోలీసు బలగాల కూంబింగ్..
సాక్షి,చర్ల(ఖమ్మం): దండకారణ్యంలో యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. జూలై 28 నుంచి ఆగష్టు 3 వరకు మావోయిస్టులు పార్టీ అమరులకు నివాళులర్పించేందుకు వారోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ క్రమంలో పోలీసులు సరిహద్దు ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. పోలీసుశాఖ భారీగా బలగాలను తరలించింది. ఈ క్రమంలో కొనసాగుతున్న కూంబింగ్ ఆపరేషన్‌లో ఆదివారం ఉదయం చర్ల మండల శివారు అటవీ ప్రాంత గ్రామమమైన బోదనెల్లి–కొండెవాడ గ్రామాల మధ్యలోని కామరాజుగుట్ట సమీపంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందాడు. సరిహద్దు ఛత్తీస్‌గఢ్ అటవీ ప్రాంతంలోని బీజాపూర్, సుకుమా జిల్లాలతో పాటు దంతెవాడ జిల్లాలోని అటవీ ప్రాంతాలలోకి భారీగా చేరుకున్న సీఆర్పీఎఫ్, స్పెషల్ పార్టీ, గ్రేహౌండ్స్, కోబ్రా బలగాలు దండకారణ్య ప్రాంతంలో అణువణువునా గాలిస్తున్నారు. పెద్ద ఎత్తున దండకారణ్య ప్రాంతాలలోని గ్రామాలలో కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతుండడంతో ఏ క్షణంలో ఏం ప్రమాదం ముంచుకొస్తుందోనని సరిహద్దు ప్రాంతంలోని ఆదివాసీ ప్రజానీకం బిక్కుబిక్కుమంటున్నారు. సరిహద్దుల్లోని కొండెవాయి, బక్కచింతలపాడు, బోదనెల్లి, ఎర్రబోరు, కుర్నపల్లి, పులిగుండాల, నిమ్మలగూడెం, బత్తినపల్లి, ఎర్రంపాడు, చెన్నాపురం, రామచంద్రాపురం, కిష్ట్రారంపాడు, పూసుగుప్ప, దర్మపేట, ఎలకనగూడెం, డోకుపాడు, కర్రిగుండం, తెట్టెమడుగు, పాలచెలిమ, బీమారంపాడు, దర్మారం, యాంపురం, జెరుపల్లి తదితర గ్రామాలకు చెందిన కొంతమంది ఆదివాసీలు భయంతో ఇప్పటికే ఇళ్లను వదిలి వెళ్లారు. ఉన్న కొద్దిమంది కూడా తాజాగా బోదనెల్లి సమీపంలో జరిగిన ఎదురుకాల్పుల ఘటనతో భయంతో ఇతర ప్రాంతాలకు వెళ్తేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. గత నెల 28న ప్రారంభమైన వారోత్సవాలు రేపటితో (ఆగష్టు 3) ముగియనున్న నేపధ్యంలో ఆగష్టు 3వ తేదీ ఎప్పుడు వెళ్లి పోతుందా అని ఆదివాసీలు ఎదురుచూస్తున్నారు. -
కార్గిల్ విజయ్ దివాస్: సైనికుల త్యాగాలను దేశం ఎప్పటికీ మరువదు
న్యూఢిల్లీ: కార్గిల్ విజయ్ దివాస్‌ను పురస్కరించుకుని, దేశం కోసం అమరులైన సైనికులకు భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీలు ఘన నివాళులు అర్పించారు. వీరి త్యాగాలు మరువలేనివని, దేశం కోసం ప్రాణాలు పణంగా పెట్టిన అమర వీరుల్ని భారతజాతి ఎప్పటికీ గుర్తించుకుంటుందని రామ్‌నాథ్, మోదీలు కొనియాడారు. కాగా, కార్గిల్ విజయ్ దివాస్ 21 వార్షికోత్సవ వేడుకలను సోమవారం ద్రాస్‌లో నిర్వహించారు. దీనికి మొదట దేశ ప్రథమ పౌరుడు రామ్‌నాథ్ కోవింద్ ద్రాస్ సెక్టార్‌కు వెళ్లాల్సి ఉండగా, పర్యటన చివరి నిముషంలో రద్దయింది. వాతావరణం పరిస్థితుల కారణంగా పర్యటన రద్దయినట్లు ఆర్మీ అధికారులు పేర్కొన్నారు. అదేవిధంగా, భారత ప్రధాని నరేంద్రమోదీ నిన్న(ఆదివారం) జరిగిన మన్‌కీ బాత్ కార్యక్రమంలో దేశం కోసం అసువులు బాసిన సైనికులను గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా, అమరుల త్యాగాలను ఈ దేశం ఎప్పటికీ మరువదని ట్విట్టర్ వేదికగా సైనికుల ధైర్యసాహసాలను కొనియాడారు. అదే విధంగా, భారత్ హోంమంత్రి అమిత్‌షా, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాధ్ సింగ్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్ బిపిన్ రావత్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. అమరులైన సైనికులకు తమ ఘనమైన నివాళులు అర్పించారు. వారు చేసిన ధైర్యసాహాసాలను గుర్తుచేసుకున్నారు. అదే విధంగా, ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారక స్థూపంవద్ద రక్షణ శాఖ సహయ మంత్రి అజయ్ భట్, ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణె, ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ బదౌరియా, నేవీ వైస్‌చీఫ్ అడ్మిరల్ జి.అశోక్ కుమార్ నివాళులు అర్పించారు. కార్గిల్ యుధ్దం రక్షణ దళాల శౌర్యం, క్రమశిక్షణకు చిహ్నం అని అన్నారు. కాగా, వారి ధైర్యం, త్యాగానికి సెల్యూట్ తెలిపారు. కాగా, జూలై 26, 1999లో దాయాది పాకిస్తాన్ మన దేశాన్ని ఆక్రమించాలని.. ఎల్ఓసీ వద్ద భారత్ భూభాగంలో ప్రవేశించాయి. ఈ క్రమంలో భారత సైనికులకు, పాక్ ముష్కరులకు మధ్య భీకర యుద్ధం జరిగింది. అయితే, ఈ యుద్ధంలో భారత భద్రతా దళాలు, పాకిస్తాన్ ముష్కరులను సమర్థవంతంగా ఎదుర్కొని మట్టికరిపించిన సంగతి తెలిసిందే.ఈ యుద్ధంలో భారత సైనికులు చాలా మంది మృతి చెందారు. ఈ క్రమంలో.. దేశం కోసం తమ ప్రాణాలు అర్పించిన సైనికులను గుర్తుచేసుకుంటూ ప్రతి ఏడాది జూలై 26న కార్గిల్ విజయ్ దివాస్‌ను ఆపరేషన్ విజయ్‌గా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. In a message at the Dagger War Memorial at Baramulla, President Kovind paid tributes to the soldiers who laid down their lives defending the nation with indomitable courage and valour. pic.twitter.com/YweORqkf7W — President of India (@rashtrapatibhvn) July 26, 2021 We remember their sacrifices. We remember their valour. Today, on Kargil Vijay Diwas we pay homage to all those who lost their lives in Kargil protecting our nation. Their bravery motivates us every single day. Also sharing an excerpt from last year’s ’Mann Ki Baat.’ pic.twitter.com/jC42es8OLz — Narendra Modi (@narendramodi) July 26, 2021 -
రాష్ట్ర సరిహద్దులపై పోలీసుల నిఘా
సాక్షి, హైదరాబాద్/వెంకటాపురం(కె): తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. సీపీఐ (మావోయిస్టు) పార్టీ ఈనెల 28వ తేదీ నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు నిర్వహించనున్న అమరుల సంస్మరణ వారోత్సవాల నేపథ్యంలో పోలీసులు ఆయా ప్రాంతాల్లో నిఘాను ముమ్మరం చేశారు. ముఖ్యంగా గోదావరి, ప్రాణహిత నది పరీవాహక ప్రాంతాల మీదుగా మావోయిస్టులు రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉండటంతో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం జిల్లాల్లో పోలీసులు అప్రమత్తమయ్యా రు. ఈ ప్రాంతాల్లో సాధారణ తనిఖీలతోపాటు సరిహద్దులు, అడవుల్లో కూంబింగ్‌ను ముమ్మరం చేశారు. కాగా గోదావరి, ప్రాణహితలు ఉధృతంగా ప్రవహిస్తున్నందున మావోయిస్టులు నదులను దాటే ప్రయత్నం చేయకపోవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ‘మావో’పోస్టర్ల కలకలం ములుగు జిల్లా వెంకటాపురం మండలం విజయపురి కాలనీ పరిసర ప్రాంతాల్లో ఆదివారం మావోయిస్టు పోస్టర్లు వెలిశాయి. ఈనెల 28 నుంచి ఆగస్టు 3 వరకు జరిగే మావోయిస్టు అమర వీరుల సంస్మరణ వారోత్సవాలను విజయవంతం చేయాలని అందులో పేర్కొన్నారు. ‘గ్రామ గ్రామాన వారోత్సవాలు నిర్వహించి, అమర వీరుల ఆశయాలను కొనసాగించాలి. శత్రు సాయుధ బలగాలు చేస్తున్న సమాధాన్ ప్రహార్ దాడిని ఓడిద్దాం. ప్రపంచ సోషలిస్టు విప్లవం వర్ధిల్లాలి’అని చర్ల – శబరి ఏరియా కమిటీ పేరున పోస్టర్లు వెలిశాయి. ఈ పోస్టర్ల వ్యవహారం స్థానికంగా కలకలం సృష్టిస్తోంది. ఛత్తీస్‌గఢ్‌లో ఎదురు కాల్పులు చర్ల: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుకుమా జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఎదురు కాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందాడు. జిల్లా ఎస్పీ సునీల్ శర్మ కథనం ప్రకారం.. ఈనెల 28 నుంచి ఆగస్టు 3 వరకు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలకు మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చిన నేపథ్యంలో చింతగుఫ పోలీస్‌స్టేషన్ పరిధిలోగల అటవీ ప్రాంతంలో డీఆర్జీ, ఎస్టీఎఫ్, సీఆర్పీఎఫ్ బలగాలు కూం బింగ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున పోలీసులకు తారసపడిన మావోయిస్టులు బలగాలపైకి కాల్పులు జరిపారు. పోలీసులు కూడా ఎదురు కాల్పుల కు దిగారు. ఈ ఘటనలో ఒక మావోయిస్టు మృతి చెందగా, పలువురు తప్పించుకొని పారిపోయారు. -
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం: అమరవీరులకు నివాళులు అర్పించిన సీఎం కేసీఆర్
-
పోలీస్ అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివి : సజ్జనార్
సాక్షి, హైదరాబాద్: పోలీస్ అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ తెలిపారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా అమరవీరుల కుటుంబాలను శుక్రవారం సీపీ సజ్జనార్ పరామర్శించారు. ఐపీఎస్, స్వర్గీయ చదలవాడ ఉమేష్ చంద్ర ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన తల్లిదండ్రులను సీపీ ఘనంగా సత్కరించారు. అలాగే పోలీస్ అమరవీరుడు కానిస్టేబుల్ ఈశ్వర్ రావు ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను సజ్జనార్ పరామర్శించారు. బాధిత కుటుంబాలకు పోలీస్ డిపార్ట్మెంట్ తరపున అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. చదవండి: దయచేసి సాహసాలు చేయొద్దు: సీపీ సజ్జనార్ సీపీ వెంట శంషాబాద్ డీసీపీ ఎన్ ప్రకాష్ రెడ్డి, సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ ఎస్ఎమ్ విజయ్ కుమార్, ఐపీఎస్., డీసీపీ క్రైమ్స్ రోహిణీ ప్రియదర్శినీ, ఐపీఎస్, విమన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ వింగ్ డీసీపీ అనసూయ, బాలానగర్ డీసీపీ పద్మజా, మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు, ఏడీసీపీ మాణిక్ రాజ్, ఏసీపీ మాదాపూర్ రఘునందన్ రావు, బాలానగర్ ఏసీపీ పురుషోత్తం, జీడిమెట్ల ఇన్ స్పెక్టర్ బాలరాజు, ఇన్‌స్టెక్టర్ గురవయ్య తదితరులు ఉన్నారు. -
ఎంతో ప్రగతి సాధించాం : సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఏ సమస్యలు తీరుతాయని ఆశించామో ఆ సమస్యలు పరిష్కారం అవుతున్నాయని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అభిప్రాయపడ్డారు. తెలంగాణ ఏర్పడే నాటికి రైతుల పరిస్థితి, వ్యవసాయం దారుణంగా ఉండేవని, నేడు తెలంగాణ వ్యవసాయం దేశంలోనే అగ్రగామిగా ఉందన్నారు. ఎండాకాలం వస్తే ప్రజలు మంచినీళ్ల కోసం గోస పడేవారని, నేడు మిషన్ భగీరథతో ఆ సమస్య పరిష్కారమైందన్నారు. విద్యుత్, సాగునీరు, విద్య, వైద్యం, పారిశ్రామిక, ఐటీ తదితర రంగాల్లో ఎంతో ప్రగతి సాధించామని సీఎం కేసీఆర్ సంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా మంగళవారం ఆయన ప్రగతి భవన్లో జాతీయ జెండాను ఆవిష్కరించి రాష్ట్ర ప్రజలకు తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రగతిభవన్‌లో జెండా ఎగురవేస్తున్న సీఎం ప్రజాసంక్షేమానికి పునరంకితమవుతాం... తెలంగాణ రాష్ట్ర ప్రయాణం అనుకున్న రీతిలో ఎంతో ఆశావహంగా ప్రారంభమైందని సంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి పాటుపడేందుకు ప్రభుత్వం పునరంకితం అవుతుందని ముఖ్యమంత్రి ప్రకటించారు. అంతకుముందు ముఖ్యమంత్రి కేసీఆర్ గన్‌పార్కులోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు కె.కేశవరావు, జె.సంతోష్ కుమార్, కె.ఆర్.సురేశ్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు రాజీవ్‌శర్మ, అనురాగ్‌శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి, ఏసీబీ డీజీ పూర్ణచందర్రావు, మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, నాగేందర్, ఆత్రం సక్కు, రైతుబంధు అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, కార్పొరేషన్ల చైర్మన్లు గ్యాదరి బాలమల్లు, మారెడ్డి శ్రీనివాసరెడ్డి, సీఎంఓ అధికారులు పాల్గొన్నారు. జెండావిష్కరణ అనంతరం సెల్యూట్ చేస్తున్న సీఎం కేసీఆర్, సీఎస్ సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి ట్విట్టర్లో రాష్ట్రపతి, ప్రధాని శుభాకాంక్షలు... కృతజ్ఞతలు తెలిపిన సీఎం తెలంగాణ రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా ట్విట్టర్ వేదికగా రాష్ట్ర ప్రజలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, సినీనటుడు చిరంజీవి శుభాకాంక్షలు తెలియజేశారు. కోవింద్, మోదీ, అమిత్ షా, చిరంజీవి తెలుగులో శుభాకాంక్షల ట్వీట్లు చేయగా వెంకయ్య నాయుడు ఉర్దూలో ట్వీట్ చేశారు. వారందరికీ ముఖ్యమంత్రి కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. ‘తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపినందుకు ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్ర ప్రగతిని ఆకాంక్షించినందుకు రాష్ట్ర ప్రజల తరఫున, వ్యక్తిగతంగా నా తరఫున హృదయ పూర్వక కృతజ్ఞతలు’అని సీఎం పేర్కొన్నారు. రాష్ట్ర అవతరణపై ప్రముఖుల శుభాకాంక్షల ట్వీట్లు.. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. యావత్ భారతదేశం గర్వించే సంస్కృతి, సంప్రదాయాలు, సాహిత్యం తెలుగు వారి సొంతం. కష్టపడి పనిచేసే తెలంగాణ ప్రజలు దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయం. తెలంగాణ రాష్ట్రం సుసంపన్న భవిష్యత్ దిశగా, అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. – రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తెలంగాణ ప్రజలకు రాష్ట్రావతరణ శుభాకాంక్షలు. ఈ రాష్ట్ర ప్రజలు ఎన్నో క్షేత్రాల్లో తమ ప్రతిభ చాటుతున్నారు. దేశ ప్రగ తిలో ఈ రాష్ట్రం ఓ ముఖ్య భూమిక పోషిస్తోంది. తెలంగాణ ప్రజల అభ్యున్నతి మరియు శ్రేయస్సుకై నేను ప్రార్థిస్తున్నాను. – ప్రధాని మోదీ తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు. పుష్కలంగా సహజ వనరులు, గర్వించదగిన చరిత్ర కలిగిన విభిన్న భాషలు, సంస్కృతుల సమ్మేళనం. భారతీయ గంగా–జము నా తెహజిబ్కి తెలంగాణ ప్రతీక. రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రార్థిస్తున్నా. – ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలంగాణ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. రానున్న రోజుల్లో రాష్ట్రం అభివృద్ధిలో కొత్త శిఖరాలను అధిరోహించాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాను. – కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎందరో అమరవీరుల త్యాగాల స్ఫూర్తిగా, దశాబ్దాల కల సాకారం చేసిన జన హృదయ నేత కేసీఆర్‌కు, యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బంగారు తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. – సినీనటుడు చిరంజీవి -
హంద్వారా అమరులకు మహేష్ నివాళి
దేశమంతటా లాక్డౌన్ కొనసాగుతున్న వేళ జమ్మూకశ్మీర్‌లో భీకర ఎన్కౌంటర్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎదురుకాల్పుల్లో ఒక కల్నల్, ఒక మేజర్ స్థాయి అధికారి, ఇద్దరు జవాన్లతోపాటు పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ ఒకరు నేలకొరిగారు. పౌరుల ప్రాణాలు కాపాడి వీరమరణం పొందిన జవాన్ల కుటుంబానికి పలువురు ప్రముఖులు నివాళుర్పిస్తున్నారు. తాజాగా ప్రముఖ హీరో మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా నివాళులర్పించారు. (చదవండి : కల్నల్ సహా ఐదుగురు జవాన్ల వీరమరణం) ‘హంద్వారా దాడి.. మన దేశాన్ని దిగ్బ్రాంతికి గురిచేసింది. దేశాన్ని కాపాడటానికి మన సైనికులకు ఉన్న ధైర్యం, సంకల్పం చాలా ధ్రుడమైనవి. అది ఎప్పటికీ సజీవంగానే ఉంటుంది. విధి నిర్వహణలో మరణించిన సైనికులకుజజ నిల్చుని మౌనం పాటించి నివాళులర్పిస్తున్నాను. ఎదురుకాల్పుల్లో మరణించినవారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఈ సమయంలో వారికి ధైర్యం, బలం ప్రసాదించాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. జై హింద్’ అని మహేష్ బాబుపేర్కొన్నారు. కాగా, మహేష్ బాబు ఇటీవల నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రంలో ఆర్మీ మేజర్ పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. -
ఘనంగా పోలీసు అమతవీరుల వారోత్సవాలు
-
మరిచిపోని ‘రక్తచరిత్ర’
సాక్షి, పరకాల: స్వేచ్ఛ, స్వాతంత్య్రం కోరుతూ .. భుమి కోసం.. భుక్తి కోసం బానిస బంధాల విముక్తి కోసం పోరాడి ఎందరో ఉద్యమకారుల వీర మరణంతో 1947 సెప్టెంబర్ 2న పోరాటాల గడ్డ పరకాల నేల రక్తసిక్తమైంది. వందలాది మంది మంది క్షతగాత్రులయ్యారు. నెత్తుటి ముద్రల తాలుకు గుర్తులు ఇంకా ఉద్యమకారుల స్మతి పథం నుంచి ఇంకా చెరిగిపోలేదు. మరో జలియన్‌వాలా బాగ్గా తెలంగాణ సాయుధ పోరాటంలో చిరస్మరణీయంగా నిలిచింది. భారతదేశంలో జరిగిన పోరాటాల్లో తెలంగాణ సాయుధ పోరాటానికి ప్రత్యేక స్థానం ఉందంటూ పరకాలలో జరిగిన పోరాటం చరిత్రకెక్కింది. అమరవీరుల స్మారకార్థం.. 1947 సెప్టెంబర్ 2న జరిగిన మరో జలియన్‌వాలాబాగ్ ఘటనను కళ్లకు కట్టినట్లు అప్పటి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, ప్రస్తుత మహారాష్ట్ర గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్‌రావు తన తల్లి చంద్రమ్మ మెమోరియల్ ట్రస్టు తరఫున వందలాది విగ్రహాలతో పరకాల తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా ఉన్న ఖాళీస్థలంలో రెండేళ్లుగా శ్రమించి 2003 సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం రోజున నిర్మాణం చేసిన అమరధామాన్ని ఆయన చేతుల మీదుగా ప్రారంభించారు. తెలంగాణ ఉద్యమం నుంచి మొదలు ప్రస్తుతం పరకాల పట్టణంలో ఎలాంటి ఉద్యమ కార్యక్రమం జరిగిన ఇక్కడి నుంచి ప్రారంభం కావడం గొప్ప విశేషం. -
‘షహీద్’ అనాలా, ‘మార్టైర్’ అనాలా!?
సాక్షివెబ్ ప్రత్యేకం: పుల్వామా ఉగ్ర దాడిలో మరణించిన సైనికులకు షహీద్ లేదా మార్టైర్ హోదాను కల్పించాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇటీవల కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన విశయం తెల్సిందే. సైన్యంలో అలాంటి హోదా లేదని మోదీ ప్రభుత్వం స్పష్టం చేసినప్పటికీ పుల్వామా దాడిలో మరణించిన సైనికుల గురించి మోదీ ప్రస్తావించినప్పుడల్లా వారిని ‘షహీద్’ అని అంటున్నారు. గతంతో భారత సైనికులు మరణించినప్పుడు ‘మార్టైర్’ అని వ్యవహరించారుగానీ ‘షహీద్’ అని వ్యవహరించలేదు. అయితే బ్రిటీష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలు కోల్పోయిన వారిని ‘షహీద్’గా వ్యవరించారు. అందుకు ఉదాహరణ భారత స్వాతంత్య్ర సమర యోధుడు ‘షహీద్ భగత్ సింగ్’. ఆయన గురించి 1965లో ‘షహీద్’ పేరిట మనోజ్ కుమార్ నటించిన, 2002లో బాబీ డియోల్ నటించిన ‘షహీద్’ సినిమాలు వచ్చాయి. షహీద్ అనే పదం హిందీ పదంగా, మార్టైర్ పదం ఇంగ్లీషు పదంగా నేడు చెలామణి అవుతోంది. తెలుగులో ఈ పదాలకు ‘అమర వీరుడు’గా వ్యవహరిస్తున్నారు. తెలుగు వ్యవహారంలో ఇది మంచి పదమేగానీ సమానార్థం కాదు. ‘షహీద్’ పదం అరబిక్ నుంచి రాగా, ‘మార్టైర్ అనే పదం గ్రీకు మూలం నుంచి వచ్చింది. ఈ రెండు పదాలకు సమానార్థం సాక్షి. ఆది నుంచి ఇస్లాం మతంతో షాహిద్, క్రైస్తవ మతంతో మార్టైర్ అనే పదాలు అల్లుకు పోయాయి. ‘మార్టైర్’ పరిణామ క్రమం ‘ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఆఫ్ క్రిస్టియన్ చర్చి’ ప్రకారం మార్టైర్ అంటే ‘సాక్షి’ అని అర్థం. క్రైస్తవంలో ప్రధాన మత బోధకుడిని, ఏసు క్రీస్తు ప్రధాన అనుచరులను మార్టైర్ గా పేర్కొనే వారు. అంటే మత బోధనల్లో ఉన్న అంశాలకు సంబంధించి ఆయన ప్రత్యక్ష సాక్షి అనే అర్థంలోనే అలా పిలిచేవారు. మత ప్రచారం కోసం ఎవరైనా మరణిస్తే లేదా ప్రాణాలర్పిస్తే వారి మార్టైర్ గా వ్యవహరించడం కాలక్రమంలో వచ్చింది. క్రైస్తవ మతాన్ని వ్యతిరేకించే నాటి రోమన్లు క్రైస్తవ ప్రచారకులపైకి సింహాలను వదిలేవారు. వాటి చేతుల్లో మరణించిన వారిని మారై్టర్స్గా పిలిచేవారు. ‘బైబిల్’ రెండో భాగమైన ‘న్యూ టెస్టామెంట్’లో మార్టైర్ గురించి ఎక్కువగా ఉంది. మార్టైర్ అంటే మరణించిన వారికన్నా, ప్రధాన మత బోధకులనే అలా ఎక్కువగా వ్యవహించడం అందులో కనిపిస్తుంది. షహీద్ పరిణామ క్రమం అరబిక్ మూలం నుంచి వచ్చిన ‘షహీద్’ సమానార్థం ‘సాక్షి’యే అయినప్పటికీ మత ప్రచారంలో భాగంగా ప్రాణాలను కోల్పోయిన వారినే ‘షహీద్’లుగా ఎక్కువగా పేర్కొంటున్నారు. ‘ఖురాన్’లో సాక్షి అనే అర్థంలోనే షహీద్ పదాలను వాడారు. ముస్లింలలో ముఖ్యంగా షియా తెగవారు మరణించిన వారిని ‘షహీద్’లుగా పేర్కొంటున్నారు. ఖలీఫా రాజ్య స్థాపన కోసం మరణించే వారంతా వారి దృష్టిలో షహీద్లే. ‘హుతాత్మా’ అంటే ఏమిటీ ? షాహిద్, మార్టైర్ అనే రెండు పదాలు కూడా రెండు మతాలకు సంబంధించినవి కావడం వల్ల దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించే సైనికులను ఎట్టి పరిస్థితుల్లో ఈ రెండు పదాలతో పిలవరాదని ‘హిందూత్వ’ వ్యవస్థాపకుడు వినాయక్ దామోదర్ సావర్కర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అమర వీరుడు అనే అర్థంలో మరాఠీ మూలం నుంచి ‘హుతాత్మ’ అనే సంస్కృత పదాన్ని కాయిన్ చేశారు. దక్షిణ ముంబైలో అమర వీరుల స్మారక స్థూపానికి ‘హుతాత్మ చౌక్’ అని పేరు పెట్టారు. ప్రపంచ చరిత్రలో కోకొల్లలు భారత దేశం సెక్యులర్ దేశమని, సెక్కులర్ దేశాన్ని రక్షిస్తున్న సైనికులు మరణిస్తే ‘మార్టైర్’ పదాన్ని ఉపయోగించరాదని 2017లో సీనియర్ జర్నలిస్ట్ కరణ్ థాపర్ వాదించారు. కానీ ప్రపంచ చరిత్రలో స్వాతంత్య్రం కోసం పోరాడి ప్రాణాలు అర్పించిన వారిని మార్టైర్స్గా పేర్కొనడం ఉంది. 19వ శతాబ్దంలో ఆస్ట్రేలియా రాజ్యంలో స్వాతంత్య్రం కోసం పోరాడి ప్రాణాలర్పించిన హంగేరియన్లను, 20వ శతాబ్దంలో బ్రిటీష్ పాలకుల నుంచి స్వాతంత్రం కోసం పోరాడిన ఐరిష్ అమర వీరులను మార్టైర్స్గా వ్యవహరించారు. అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన అభ్రహాం లింకన్ హత్య తర్వాత పది రోజులకు ఆయన నిజమైన దేశభక్తుడైనందున ఆయనకు మార్టైర్ హోదా కల్పించాలంటూ ‘న్యూయార్క్ టైమ్స్’ డిమాండ్ చేసింది. మార్టిన్ లూథర్ కింగ్‌ను ‘అహింసా మార్టైర్’గా వాషింఘ్టన్ పోస్ట్ వ్యవహరించింది. మన సైన్యం ఏమంటుంది ? మన భారత దేశ సైనిక పరిభాషలో దేశం కోసం మరణించిన సైనికులను ‘బాటిల్ క్యాజువాలిటీ లేదా ఆపరేషన్స్ క్యాజువాలిటీ’ అని వ్యవహరిస్తున్నారు. అంతకుమించి ఎలాంటి విశేషణాలు వాడడం లేదు. (గమనిక: అమర వీరులను సావర్కర్ సూచించినట్లు ‘హుతాత్మలు’గా వ్యవహరించాలంటూ హిందూత్వ వాదులు సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో మరింత స్పష్టత కోసం ఈ వ్యాసం) -
పెళ్లి ఊరేగింపులో అమర జవాన్లకు ఘన నివాళి
వడోదరా: పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు దేశ ప్రజలు ఘనంగా నివాళులు ఆర్పిస్తున్న సంగతి తెలిసిందే. గుజరాత్‌లోని వడోదరాకు చెందిన నూతన వధూవరులు కూడా పుల్వామా ఉగ్రదాడిపై తమలో ఉన్న ఆవేదనను చాటిచెప్పారు. అందులో భాగంగా తమ పెళ్లి ఊరేగింపు వేడుకలో అమరులైన సైనికులకు ఘన నివాళులర్పించారు. వివాహనికి ముందు జరిగిన పెళ్లి ఊరేగింపులో భాగంగా గుర్రపు రథంలో కూర్చున్న వధూవరులు జాతీయ జెండాతో పాటు.. ఓ ఫ్లకార్డును ప్రదర్శించారు. దేశంలో కేవలం 1427 పులులు మాత్రమే ఉన్నాయని ఎవరు అన్నారు.. సరిహద్దులో ఉన్న 13 లక్షల పులులు దేశానికి రక్షణ కల్పిస్తున్నాయనే సందేశాన్ని అందులో ఉంచారు. వధూవరులు మాత్రమే కాకుండా ఆ వివాహ వేడుకకు హాజరైన ప్రతి ఒక్కరు జాతీయ జెండాను చేతబూని అమర జవాన్లకు ఘనంగా నివాళులర్పించారు. పాకిస్తాన్‌కు చెందిన జైషే మహమ్మద్ ఉగ్రసంస్థ గత గురువారం జరిపిన ఆత్మహుతి దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. -
అమర జవాన్లకు నివాళులర్పించిన ప్రధాని మోదీ
-
అమరవీరులకు కేసీఆర్ నివాళులు
సాక్షి, హైదరాబాద్: శాసనసభ సమావేశాలకు ముందు సీఎం కేసీఆర్ అమరవీరులకు నివాళులర్పించారు. ప్రగతిభవన్ నుంచి బయలుదేరి 11 గంటలకు నేరుగా అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్కులోని అమరవీరుల స్థూపం వద్దకు చేరుకున్నారు. అక్కడ సీఎం సహా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అమరవీరులకు నివాళులర్పించారు. అక్కడి నుంచి అసెంబ్లీకి చేరుకున్నారు. అసెంబ్లీ కార్యదర్శి వి.నరసింహాచార్యులు కేసీఆర్‌కు పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి అక్కడి నుంచి అసెంబ్లీ ఆవరణలోని మైసమ్మ గుడి వద్దకు వెళ్లారు. అక్కడ పూజలు నిర్వహించారు. అనంతరం శాసనసభలోకి చేరుకున్నారు. ప్రొటెం స్పీకర్ ముంతాజ్ అహ్మద్ ఖాన్ కూడా సీఎంకు పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. -
విరసం నేతను బంధించిన పోలీసులు
సాక్షి, ఖమ్మం: అమరుల బంధుమిత్రుల ఆధ్వర్యంలో ఖమ్మంలోని రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో ‘రాజ్య హింస, ఎన్కౌంటర్ హత్యలకు వ్యతిరేకంగా ’ నిర్వహిస్తున్న సభకు తరలివస్తున్న విరసం నేత వరవరరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో పోలీసులకు వరవరరావు పోలీసులకు మధ్య వాగ్వివివాదం జరిగింది. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ ఈ సభకు అనుమతి లేనందునే అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వరవరరావుతో పాటుకు సభకు వస్తున్న పలువురిని కుసుమంచి పోలీస్టేషన్‌కు తరలించారు. -
ఏడు అంతస్తులు... ప్రమిద ఆకారం
సాక్షి, హైదరాబాద్ : ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగాలు చేసిన అమరవీరులను శాశ్వతంగా గుర్తుచేసుకునేందుకు ప్రమిద ఆకారంలో ఏడు అంతస్తులతో తెలంగాణ అమరవీరుల స్తూపాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్మించనుంది. ఇందుకు సంబంధించిన నమూనా ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు సంతకం చేశారు. మార్చి తొలి వారంలో టెండర్లు పిలిచేందుకు అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్ వద్ద ఈ స్తూపాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించనున్నారు. ఇందులో సందర్శకుల కోసం అన్ని సౌకర్యాలను కల్పించనున్నారు. తొలి, మలి దశ తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరుల జ్ఞాపకార్థం తెలంగాణ ప్రభుత్వం భారీ స్తూపాన్ని నిర్మించాలని నిర్ణయించడం తెలిసిందే. ఇందులో భాగంగా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అత్యాధునిక హంగులతో అమరవీరుల స్తూపాన్ని నిర్మించడానికి రోడ్లు భవనాలశాఖ ఏర్పాట్లు చేస్తోంది. సందర్శకుల కోసం సకల సదుపాయాలు... అమరవీరుల స్తూపాన్ని చూసేందుకు వచ్చే సందర్శకుల కోసం ఏడు అంతస్తుల ప్రాంగణంలో రెండు అంతస్తుల్లో పార్కింగ్, ఓ మ్యూజియం, అమరవీరుల సంస్మరణ సభలు నిర్వహించుకోవడానికి వీలుగా ఆధునిక హంగులతో కన్వెన్షన్ హాల్, ఆడియో విజువల్ హాల్, రెస్టారెంట్ తదితర సదుపాయాలను కల్పించనున్నారు. సుమారు రూ. 80 కోట్ల అంచనా వ్యయంతో దీన్ని నిర్మించనున్నారు. సెల్లార్లో రెండు అంతస్తులు పార్కింగ్ కోసం కేటాయిస్తారు. గ్రౌండ్ లెవెల్లో సర్వీస్ ఫ్లోర్ ఉంటుంది. మొదటిది అమరవీరుల అంతస్తు, రెండో అంతస్తును సంస్మరణ సభలు జరుపుకోవడానికి వీలుగా ఉండే కన్వెన్షన్ హాల్ కోసం వినియోగించనున్నారు. మూడో అంతస్తులో రెస్టారెంట్ ఏర్పాటు చేయనున్నారు. వెలుగుతున్న దీపం ఆకారంలో ఉండే ప్రమిదను గ్లోసైన్ విద్యుత్ దీపాలతో వెలిగించేందుకు వీలుగా ఫైబర్ మెటీరియల్‌ను వినియోగించనున్నారు. సాగర్‌లోని బుద్ధుని విగ్రహం, ఆ వెనకవైపు ఒడ్డున ఎగురవేసిన అతిపెద్ద జాతీయ జెండా, అమరవీరుల స్తూపం ఒకే రేఖపై కనిపించేలా స్తూపం నిర్మాణం జరగనుంది. స్తూపం ప్రాంగణంలో ఆహ్లాదకర వాతావరణం ఉండేలా పార్కు, వాటర్ ఫౌంటెయిన్ ఏర్పాటు చేయనున్నారు. పార్కు మధ్యలో మరో పిల్లర్‌ను ఏర్పాటు చేసి దానిపై తెలంగాణ తల్లి విగ్రహం ఉండేలా డిజైన్‌ను రూపొందించారు. -
ఉగ్రవాదులు కాదు.. వాళ్లూ అమర వీరులే!
శ్రీనగర్ : కశ్మీర్ అధికార పార్టీ ఎమ్మెల్యే చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయ చిచ్చును రాజేస్తున్నాయి. పీపుల్ డెమొక్రటిక్ పార్టీ ఎమ్మెల్యే ఐజాజ్ అహ్మద్ మీర్ ఎన్కౌంటర్లో చనిపోతున్న టెర్రరిస్టులను అమర వీరులుగా పేర్కొన్నారు. దీంతో మిత్రపక్షం బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ‘‘ఉగ్రవాదులను చనిపోతుంటే మేం వేడుకలు చేసుకోలేం. ఎందుకంటే వారు మాకు సోదరులే. ఇకపై జవాన్ల కుటుంబాలతోపాటు మిలిటెంట్ల కుటుంబాలకు కూడా మా సంఘీభావం తెలుపుతాం’’ అని గురువారం అసెంబ్లీ బయట ఓ జాతీయ మీడియాతో మీర్ వ్యాఖ్యానించారు. చనిపోయిన వారు ఉగ్రవాదులా? పోలీసులా? అని తమకు సంబంధం లేదని.. కశ్మీర్ గడ్డపై పుట్టిన వారందరినీ తాము అమరులుగానే భావిస్తామని ఆయన చెప్పారు. కశ్మీర్ విషయంలో వేర్పాటువాదులతో, ఉగ్రవాదులతో ప్రభుత్వం చర్చలు జరపాలంటూ మీర్ డిమాండ్ చేస్తున్నారు. కాగా, మీర్ ప్రాతినిథ్యం వహిస్తున్న వాచి అసెంబ్లీ నియోజక వర్గం(సోఫిన్ జిల్లా)లో ఉగ్రవాదుల దాడులు తరచూ జరుగుతుంటాయి. గత అక్టోబర్‌లో మీర్ ఇంటిపైనే గ్రెనేడ్ దాడి జరగగా.. స్వల్ఫ గాయాలతో ఆయన బయటపడ్డాడు. అయినా సరే ఉగ్రవాదులకు మద్దతుగా ఆయన అసెంబ్లీలో గళం వినిపిస్తున్నారు. వారు చనిపోయినప్పుడు వేడుకలు చేసుకోవద్దంటూ బుధవారం ఎమ్మెల్యేలకు ఆయన పిలుపు కూడా ఇచ్చారు. ఇక మీర్ వ్యాఖ్యలను మిత్రపక్షం బీజేపీ తీవ్రంగా ఖండిస్తోంది. నరరూప రాక్షసులను అమరులుగా అభివర్ణించటాన్ని కశ్మీర్ రవాణా శాఖా మంత్రి సునీల్ శర్మ తప్పుబట్టారు. ఇక ఈ వ్యాఖ్యలు పీడీపీ ద్వంద్వ వైఖరికి నిదర్శమని ప్రతిపక్ష పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్ విమర్శిస్తోంది. -
మాజీ ముఖ్యమంత్రిని ఉతికి ఆరేశారు!
సైనికుల మరణాల విషయంలో కూడా రాజకీయం చేయడానికి ప్రయత్నించిన యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌ను సోషల్ మీడియాలోను, మామూలుగా కూడా చాలామంది ఉతికి ఆరేశారు. జమ్ము కశ్మీర్లో ఒక యువ సైనికాధికారిని షోపియాన్ జిల్లాలో కిడ్నాప్ చేసి హతమార్చిన ఘటనపై ఆయన చేసిన వ్యాఖ్యలు పలు వర్గాల్లో తీవ్ర ఆగ్రహావేశాలకు కారణమయ్యాయి. ''ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న ఘటనలకు సమాధానం లేదు. కొంతమంది తలలు నరికేస్తున్నారు, శరీరాలు ఛిద్రం చేస్తున్నారు... అయినా దానిపై చర్చ ఎందుకు లేదు? యూపీ, బిహార్, మధ్యప్రదేశ్, దక్షిణ భారతదేశంలోని కొన్ని రాష్ట్రాలలో చాలామంది అమర సైనికులు ఉన్నారు. కానీ గుజరాత్‌కు చెందిన ఒక్క సైనికుడూ ఎందుకు మరణించడం లేదు?'' అని అఖిలేష్ ప్రశ్నించారు. సైనికుల మరణాలతో రాజకీయాలు చేయకూడదని.. కానీ వందేమాతరం మీద కూడా రాజకీయాలు ఉన్నాయని ఆయన అన్నారు. అయితే ఇలాంటి దారుణమైన వ్యాఖ్యలు.. అది కూడా సైనికుల మరణం విషయంలో ఎలా చేస్తారని పలువురు ప్రశ్నించారు. అఖిలేష్ ప్రకటన చాలా బాధాకరమని, దాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని యూపీ మంత్రి శ్రీకాంత్ శర్మ అన్నారు. ఆయన ఓటమిని అంగీకరించలేక తన కోపాన్ని ఇలాంటి ప్రకటనల రూపంలో బయటకు కక్కుతున్నారని విమర్శించారు. ఇక సోషల్ మీడియాలో కూడా పలువురు అఖిలేష్ వ్యాఖ్యల మీద తీవ్రంగా మండిపడ్డారు. అఖిలేష్ ఇన్సల్ట్స్ మార్టిర్స్ అనే హ్యాష్ ట్యాగ్ దేశవ్యాప్తంగా ట్రెండింగ్ టాపిక్‌లలోకి ఎక్కింది. గుజరాతీలు చాలామంది తమ జీవితాలను త్యాగం చేశారని, కానీ అఖిలేష్ కుటుంబం నుంచి మాత్రం ఎవరూ ఇలాంటి త్యాగాలు చేయలేదన్న విషయం కచ్చితంగా చెప్పగలమని కెప్టెన్ శక్తి రాథోడ్ ట్వీట్ చేశారు. ఇలాగే ఇంకా కొన్ని వేల ట్వీట్లు ఇదే అంశం మీద వచ్చాయి. Shame On U Akhilesh Yadav for Ur Immature & Immoral Politics Thatswhy Up Reject You Man. A Big Shame On Ur Face -
అమర పోలీసులకు మోదీ నివాళులు
-
అమరవీరులకు వందనం
పోలీసు అమరవీరుల స్మారక వారోత్సవాల ముగింపు సభలో డీఐజీ రమణకుమార్ ప్రజా భద్రత కోసం ప్రాణాలొదిలిన వారి త్యాగాలను స్మరిస్తూ 'స్మృతిపరేడ్' కర్నూలు: విధుల్లో నిమగ్నమై ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయవద్దని డీఐజీ రమణకుమార్ పోలీసులకు సూచించారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవ ముగింపు సందర్భంగా శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని పరేడ్ మైదానంలో 'స్మృతి పరేడ్' నిర్వహించారు. కార్యక్రమానికి డీఐజీ రమణకుమార్, జిల్లా జడ్జీ అనుపమ చక్రవర్తి, ఎస్పీ ఆకె రవికృష్ణ, కోడుమూరు ఎమ్మెల్యేమణిగాంధీ తదితరులు ముఖ్యఅతిధిగా హాజరై అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ పోలీసులు అంతర్గత భద్రతలో ప్రాణాలు తెగించి పని చేస్తున్నారని ఈ ఏడాది దేశవ్యాప్తంగా 473 మంది, రాష్ట్రంలో 14 మంది అమరులయ్యారన్నారు. మావోయిస్టులు, తీవ్రవాదులు, అసాంఘీక శక్తుల చేతుల్లో ఉమేష్‌చంద్ర, పరదేశినాయకుడు, కేఎస్ వ్యాస్ వంటి మహానుభావులతో పాటు, తన బ్యాచ్మెంటు కేవీ గౌడ్ గ్రేహౌండ్స్‌లో డీఎస్పీగా పని చేస్తూ మందుపాతర పేలుడు సంఘటనలో పోరాడి అమరులయ్యారని గుర్తు చేసుకున్నారు. గత సంవత్సరంలో ఆరోగ్యం బాగలేక 163 మంది చనిపోయారని, వీరిలో జిల్లాకు చెందిన వారు 17 మంది ఉన్నారన్నారు. జిల్లాలో పని చేస్తున్న పోలీసులకు వారాంతపు సెలవులను తప్పనిసరిగా అమలుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అసాంఘిక శక్తులను ఎదుర్కొంటూ పోలీసులు ప్రజలకు రక్షణగా నిలవాలని పిలుపునిచ్చారు. విధి నిర్వహణలో దేశవ్యాప్తంగా ప్రాణాలు కోల్పోయి 473 మంది పేర్లను అదనపు ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి చదివి వినిపించారు. కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ ఐ.వెంకటేష్, డీఎస్పీలు రమణమూర్తి, బాబుప్రసాద్, వినోద్‌కుమార్, మురళీధర్, రాజశేఖర్‌రాజు, డీఐజీ కృష్ణమూర్తి, వెంకటాద్రి, హుసేన్‌పీరా, ఏఓ అబ్దుల్ సలాం, సీఐలు కృష్ణయ్య, డేగల ప్రభాకర్, ములకన్న, మహేశ్వరరెడ్డి, నాగరాజు యాదవ్, మధుసూదన్‌రావు, నాగరాజురావు, ఆర్ఐలు రంగముని, జార్జ్, పోలీసు అధికారుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నారాయణ, పోలీసు హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు రఘురాముడు, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, హోంగార్డు సిబ్బంది, అమరవీరుల కుటుంబాలు, వివిధ పాఠశాలల విద్యార్థులు పాల్గొని పోలీసు అమరవీరుల స్థూపానికి ఘనంగా నివాళులు అర్పించారు. సమాజ రక్షణలో పోలీసులదే కీలకపాత్ర: జిల్లా జడ్జీ అనుపమ చక్రవర్తి ప్రపంచమంతా రాత్రిళ్లు నిద్రలో ఉంటే పోలీసులు మేల్కొని శాంతిభద్రత పరిరక్షణ నిమిత్తం కాపలా కాస్తుంటారు. అందుకే ప్రజలు స్వేచ్ఛగా జీవిస్తున్నారు. విధి నిర్వహణలో త్యాగాలు చేసిన వారిని స్మరించుకోవడం మనందరి కర్తవ్యం. సమాజ రక్షణలో కీలకపాత్ర పోషిస్తున్న పోలీసుల సేవలను ప్రతి ఒక్కరు గుర్తించాలి. పోలీసు వ్యవస్థ విరామం తీసుకుంటే నష్టం అపారం : ఎస్పీ ఆకే రవికృష్ణ దేశంలో ఏ వ్యవస్థలో అయినా విశ్రాంతి తీసుకుంటే నష్టం స్వల్పం.. అదే పోలీసు వ్యవస్థ విరామం తీసుకుంటే నష్టం అపారం. పోలీసులకు ప్రజలు సహకారం అందించాల్సిన అవసరం ఉంది. పోలీసులుగా బాధ్యత నిర్వర్తించడానికి ముందుకు రాబోతున్న యువతకు విధినిర్వహణలో నూతనోత్తేజాన్ని, స్ఫూర్తిని నింపపడమే పోలీసు అమరవీరుల సంస్కరణ దినం నిర్వహించడం ప్రధాన ఉద్దేశం. -
అమరవీరుల సంస్మరణ వారోత్సవాలకు సిద్ధం కండి
కర్నూలు: పోలీసు అమరవీరుల (అక్టోబర్ 15–21 వరకు) సంస్మరణ వారోత్సవాలకు సిద్ధం కావాలని ఎస్పీ ఆకే రవికృష్ణ క్షేత్రస్థాయి పోలీసు అధికారులను ఆదేశించారు. గురువారం కమాండ్ కంట్రోల్ సెంటర్లో కర్నూలు సబ్ డివిజన్ పోలీసు అధికారులతో సమావేశమై వారోత్సవాలకు సంబంధించి చర్చించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని సబ్ డివిజన్లలో పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ వారోత్సవాలను నిర్వహించాలన్నారు. రక్తదాన శిబిరాలు, వ్యాసరచన, పెయింటింగ్, కార్టూన్ పోటీలు నిర్వహించాలన్నారు. అమరవీరుల వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ప్రజలందరికీ తెలిసేలా చేయాలన్నారు. పోలీసు కుటుంబాలకు, ప్రజలకు, స్కూల్ విద్యార్థులకు పోలీస్స్టేషన్లు, పోలీసుల ఆయుధాలు(ఓపెన్ హౌస్ ఎగ్జిబిషన్), విడి భాగాల సమాచారం తెలియజేయాలన్నారు. అమరవీరుల వారోత్సవాల బ్యానర్లను విరివిగా ఏర్పాటు చేయించాలని, సబ్ డివిజన్లు, సర్కిళ్లు, పోలీస్స్టేషన్లలో వారి పరిధిలో ర్యాలీ నిర్వహించి మీడియాకు, ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. విద్యార్థులను పోలీస్స్టేషన్లకు తీసుకువచ్చి పోలీసు ఆయుధాల గురించి అవగాహన కల్పించాలన్నారు. పోలీస్స్టేషన్ల వారీగా మృతి చెందిన పోలీసు కుటుంబాల సమస్యలు తెలుసుకోవాలన్నారు. పోలీసు కుటుంబాలతో వారోత్సవాల్లో ఓపెన్ హౌస్ నిర్వహించాలన్నారు. అమరవీరుల ఇళ్లకు వెళ్లి వారి సాధక బాధకాలను తెలుసుకోవాలని సూచించారు. పోలీసుల సేవలను ఓపెన్ హౌస్ కార్యక్రమంలో ఫొటో ఎగ్జిబిషన్ కార్యక్రమం ద్వారా తెలియపరచాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీలు చంద్రశేఖర్‌రెడ్డి, ఐ.వెంకటేష్, డీఎస్పీలు ఎ.జి.కృష్ణమూర్తి, డి.వి.రమణమూర్తి, జె.బాబుప్రసాద్, జిల్లా పోలీసు కార్యాలయ పరిపాలనాధికారి అబ్దుల్ సలాం, సీఐలు మధుసూదన్‌రావు, కృష్ణయ్య, డేగల ప్రభాకర్, మహేశ్వరరెడ్డి, నాగరాజరావు, ఇస్మాయిల్, ఆర్ఐ జార్జి, సూపరింటెండెంట్ రంగయ్య, డీటీఓ సిబ్బంది పాల్గొన్నారు. -
అమరవీరుల ఆశయసాధనకు కృషి చేయాలి : సీపీఎం
మునగాల: అమరవీరుల ఆశయసాధనకు నేటి యువత కృషిచేయాలని సీపీఎం మండల పార్టీ కార్యదర్శి బుర్రి శ్రీరాములు పిలుపునిచ్చారు. శనివారం మునగాలలో తెలంగాణ సాయుధ రైతాంగా పోరాట వారోత్సవాలల్లో ఆయన మాట్లాడారు. తొలుత మునగాలలో దాదాపు 200 ద్విచక్రవాహానాలతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక గణపరవరం క్రాస్‌రోడ్డులో స్టాలిన్‌రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నాడు నిజాం నిరంకుశ పాలనకు ఎదురొడ్డి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి మునగాల పరగణా సాక్ష్యంగా నిలిచిందన్నారు. ఆనాటి పోరాటంలో అసువులు బాసిన ఈ ప్రాంత వాసులు కేశబోయిన ముత్తయ్య, అలుగూరి వీరనారాయణ, కొల్లు నందయ్య, గట్టు గోపాలకృష్ణయ్య, సుంకర వెంకయ్య, గుండు రామయ్యల త్యాగాలను శ్రీరాములు కొనియాడారు. వీరి ఆశయ సాధనకు సీపీఎం పార్టీ కార్యకర్తలు ముందుండి పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కమిటీ నాయకులు చందా చంద్రయ్య, సొంపంగు జానయ్య, సుంకర పిచ్చయ్య, ఎం.సుందర్రావు, ఆరె.రామకృష్ణారెడ్డి, వీర బోయిన వెంకన్న, షేక్ సైదా, షేక్ ఖాజాబీ, జె.కొండారెడ్డి, అనంతు గుర్వయ్య, దేవరం వెంకటరెడ్డి, జి.వెంకటరెడ్డి, బి.రంగయ్య పాల్గొన్నారు. -
బషీర్‌బాగ్ అమరవీరులకు నివాళి
కర్నూలు సిటీ: బషీర్ బాగ్ కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన అమరవీరులకు ఆదివారం స్థానిక సుందరయ్య భవనంలో సంస్మరణ సభ ఏర్పాటు చేశారు. సీపీఎం జిలా కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి, నగర అద్యక్షులు గౌస్ దేశాయ్ అమరవీరుల చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2000 సంవత్సరంలో అప్పటి సీఎం చంద్రబాబు అనుసరించిన విధానాల వల్ల కార్మికులు ప్రాణాలు కోల్పోయారన్నారు. సీఎం విధానాలపై పోరాటాలు చేయడమే అమరులకు నిజమైన నివాళి అని అన్నారు. ప్రజా వ్యతిరేఖ విధానాల వల్ల పదేళ్లు అధికారానికి దూరమైనా చంద్రబాబు తీరులో మార్పు రాలేదని, ఇకపై టీడీపీ శాశ్వతంగా సమాధి కట్టే రోజులు దగ్గరలో ఉన్నాయన్నారు. సమావేశంలో సీపీఎం నాయకులు రాధాకష్ణ, అంజిబాబు, రాముడు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
అమరవీరుల స్ఫూర్తితో పోరాడాలి
సూర్యాపేట మున్సిపాలిటీ : విద్యుత్ పోరాట అమరవీరుల స్ఫూర్తితో పాలకులు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడాలని సీపీఎం డివిజన్ కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక ఎంవీఎన్ భవన్లో విద్యుత్ పోరాట అమరవీరుల వర్ధంతి సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలకు వ్యతిరేకంగా వామపక్షాలు పోరాటం చేశాయని.. ఆ పోరాటంలో బాలస్వామి, విష్ణువర్ధన్‌రెడ్డి, రామకృష్ణ వంటి నాయకులను కాల్పులు చేసి చంపిందన్నారు. నేడు తెలంగాణలో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డగోలుగా విద్యుత్ చార్జీలను పెంచి పేద,మధ్యతరగతి ప్రజలపై మోయలేని భారం మోపిందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం విద్యుత్ పోరాట అమరవీరుల చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. కార్యక్రమంలో వెంకటేశ్వర్లు, గురూజీ, మట్టిపల్లి సైదులు, కొలిశెట్టి యాదగిరిరావు, పెంటయ్య, రాంచరణ్, మామిడి సుందరయ్య తదితరులు పాల్గొన్నారు. -
విద్యుత్ ఉద్యమ అమరవీరులకు నివాళి
కోదాడఅర్బన్: 2000వ సంవత్సరంలో జరిగిన విద్యుత్ ఉద్యమంలో అమరులైన వారి సంస్మరణ సభను ఆదివారం కోదాడలోని సుందరయ్య భవనలో సీపీఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అమరులైన రామకృష్ణ, విష్ణువర్ధన్, బాలస్వామి చిత్రపటాలకు సీపీఎం మండల కార్యదర్శి కుక్కడపు ప్రసాద్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు హయాంలో పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాలని పోరాటం చేసినప్పుడు వారిపై చంద్రబాబు దారుణంగా కాల్పులు జరపించాడన్నారు. అమరవీరుల ఉద్యమ స్ఫూర్తిని కార్యకర్తలు ఆదర్శంగా తీసుకుని సమస్యల పరిష్కారానికి ఉద్యమించాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఈదర సత్యనారాయణ, ఎస్.రాధాకృష్ణ, ఎం.ముత్యాలు, జె.నర్సింహారావు, శ్రీను , సాయి, పల్లా నర్సయ్య, షేక్ గౌస్, శ్రీను, రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
భవనాలకు అమరవీరుల పేర్లు
జైపూర్: రాజస్థాన్ లోని ఓ గ్రామం అమర జవానుల గౌరవాన్ని ఇనుమడింపజేస్తూ వారి కీర్తిని పతాకస్థాయికి చేరుస్తోంది. సికర్ జిల్లాలోని దీన్వా లడ్కానీ గ్రామ ప్రజలు అమరవీరుల జ్ఞాపకార్ధంగా అక్కడి పాఠశాలలు, వైద్యశాలలు తదితర ప్రభుత్వ భవనాలకు అమరజవానుల పేర్లను పెడుతున్నారు. ఇప్పటివరకు గ్రామం నుంచి సైన్యంలోకి వెళ్లిన 9 మంది జవానులు అమరులయ్యారు. వీరిలో 8 మంది పేర్లను గ్రామంలోని ప్రభుత్వ భవనాలకు పెట్టారు. వీరి తర్వాత అమరుడైన సూరజ్ బుడానియా పేరును గ్రామ హెల్త్ కేర్ సబ్ సెంటర్ కు పెట్టాలని గ్రామస్తులు మెడికల్ ఆఫీసర్ ను కోరారు. గ్రామస్తుల కోరికపై ప్రభుత్వానికి వినతిపత్రాన్ని పంపినట్లు ఆయన తెలిపారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం అందుకు ఒప్పుకున్నట్లు వివరించారు. ప్రభుత్వ నిర్ణయంపై బుడానియా కుటుంబసభ్యులు ఆనందం వ్యక్తంచేశారు. 2010 ఆగస్టు 18న బుడానియా అమరులైనట్లు సోదరుడు రాజేష్ బుడానియా వెల్లడించారు. అప్పటినుంచి హెల్త్ సబ్ సెంటర్ కు సూరజ్ బుడానియా పేరును పెట్టాలని డిమాండ్ చేస్తున్నట్లు వివరించారు. -
అమరవీరుల స్థూపానికి జూన్ 2న శంకుస్థాపన
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల గుర్తుగా భారీ స్మారక స్థూపం నిర్మించి రాష్ట్ర ఆవిర్భావ దినం రోజున ఘనంగా నివాళులు అర్పించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. సచివాలయానికి సమీపంలో గల 12 ఎకరాల భూమిలో స్మృతివనంతో పాటు స్థూపానికి జూన్ 2న సీఎం శంకుస్థాపన చేయనున్నారు. స్మృతి వనంలో తెలంగాణ చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలను అందుబాటులోకి తీసుకువచ్చి సాహిత్య కేంద్రంగా తీర్చిదిద్దాలని అధికారులకు ఆదేశించారు. రాష్ట్రంతో పాటు ఢిల్లీలోని తెలంగాణ భవన్ వద్ద కూడా ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. -
జాతి గుండెపై మానని గాయం..
భారత దేశ చరిత్రలో అత్యంత అమానవీయ ఘటన ‘జలియన్ వాలాబాగ్’ మారణకాండ. బ్రిటీష్‌వారి దురహంకారానికి వెయ్యిమందికి పైగా భారతీయులు బలయ్యారు. దేశంలో ఆంగ్లేయుల పాలన ఎన్ని ఆకృత్యాలతో కూడి ఉండేదో చెప్పడానికి ఈ ఒక్క ఘటన చాలు. జలియన్ వాలాబాగ్ ఘటన జరిగి నేటితో 97 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ ఘటన పూర్వాపరాలు తెలుసుకుందాం.. ఎక్కడ, ఎలా.. ఏప్రిల్ 13, 1919 ఆదివారం రోజున ఉత్తర భారత దేశంలోని అమృత్సర్ పట్టణంలో ఉన్న జలియన్ వాలా బాగ్ అనే తోటలో ఈ ఘటన జరిగింది. ఆరోజు సిక్కులకు ఎంతో ఇష్టమైన వైశాఖి పండుగ. ఈ సందర్భంగా దాదాపు 20వేల మంది సిక్కులు, హిందూ, ముస్లింలు సమావేశమయ్యారు. దాదాపు ఏడెకరాల్లో విస్తరించి ఉన్న ఈ తోటకు చుట్టూ గోడలు, చిన్నచిన్న ద్వారాలు మాత్రమే ఉన్నాయి. వైశాఖి పండుగ సందర్భంగా సమావేశమయినప్పటికీ బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా కొందరు ప్రసంగాలు చేశారు. రౌలత్ చట్టాన్ని రద్దు చేయాలని వారంతా నినదించారు. ఇలా వేల మంది ఒకేచోట సమావేశమై శాంతియుతంగా ప్రసంగిస్తుండగానే అనూహ్యంగా ఈ ఘటన జరిగింది. ఒక్కసారిగా కాల్పులు.. ఈ సమావేశం గురించి సమాచారం అందుకున్న అప్పటి బ్రిగేడియర్ జనరల్ రెజినాల్డ్ డయ్యర్ తన సైన్యంతో జలియన్ వాలాబాగ్ చేరుకున్నాడు. సాయుధులైన సైన్యం జలియన్ వాలాబాగ్ గేట్లకు ఎదురుగా నిలబడ్డారు. వెంటనే అక్కడివారిపై కాల్పులు జరపాల్సిందిగా డయ్యర్ ఆదేశించాడు. దీంతో వారు విచక్షణారహితంగా అమాయకులైనవారిపై కాల్పులు జరపడం ప్రారంభించారు. ఏకధాటిగా పది నిమిషాలపాటు విచక్షణారహితంగా సైన్యం కాల్పులు కొనసాగించింది. దాదాపు 1650 రౌండ్ల కాల్పులు జరిపారు. తుపాకుల్లోని తూటాలు అన్నీ అయిపోయేంత వరకు ఈ కాల్పులు కొనసాగాయి. చివరకు మందుగుండు అయిపోవడంతో సైన్యం కాల్పులు ఆగిపోయాయి. ఎటూ వెళ్లలేక.. ఈ అనూహ్య ఘటనతో జలియన్ వాలాబాగ్‌లో సమావేశమైన ప్రజలు ఒక్కసారిగా హతాశులయ్యారు. బుల్లెట్ల దాడినుంచి రక్షించుకునేందుకు తలోదిక్కుకు పారిపోయేందుకు ప్రయత్నించారు. తోటలోని గేట్లవైపు వెళ్లి బయటపడదామని చూశారు. కానీ గేట్లు మూసి ఉండడం, తెరిచి ఉన్న ద్వారాల దగ్గర నిలబడి సైన్యం కాల్పులు జరపడంతో వారంతా తూటాలకు బలయ్యారు. మరోవైపు బయటికి వెళ్లేందుకు దారిలేక, లోపలే ఉండి ప్రాణాలు కాపాడుకోలేక కొందరు అక్కడే ఉన్న బావిలోకి దూకారు. దీనివల్ల కూడా కొందరు మరణించారు. ఇలా ఓ వైపు తూటాలకు కొంతమంది, మరోవైపు బావిలోదూకడం వల్ల, తొక్కిసలాట వల్ల మరికొందరు మరణించారు. అప్పటివరకు శాంతియుతంగా సాగిన సమావేశం రక్తసిక్తమైంది. వెయ్యి మందికిపైగా మృతి.. ఈ కాల్పుల్లో 379 మంది మాత్రమే మరణించినట్లు బ్రిటిష్ అధికారులు తేల్చారు. వారి అంచనా ప్రకారం 1,100 మంది గాయపడ్డారు. అయితే అసలు అంచనాలు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాయి. నిజానికి ఇక్కడ దాదాపు 1,000 మందికి పైగా మరణించినట్లు అంచనా. వేల సంఖ్యలో గాయపడ్డారు. మృతుల్లో చిన్న పిల్లల దగ్గరినుంచి వృద్ధుల వరకు ఉన్నారు. వారిలో ఆరువారాల చిన్నారి కూడా ఉండడం మరో విచారకర అంశం. కానీ ఈ వాస్తవాల్ని అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం తొక్కిపెట్టింది. మృతులు, క్షతగాత్రుల సంఖ్యను తక్కువగా చూపి ప్రపంచాన్ని నమ్మించేందుకు ప్రయత్నించింది. డయ్యర్ కారణంగానే.. ఈ ఘటనకు ప్రధాన బాధ్యుడు బ్రిగేడియర్ జనరల్ డయ్యర్. ఆయన దురహంకారపూరిత నిర్ణయం మూలంగానే ఈ మారణకాండ చోటుచేసుకుంది. సమావేశమైన ప్రజల్ని అణచి వేయడానికి అక్కడికి చేరుకున్న డయ్యర్ కాల్పులు జరిపేముందు ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదు. సమావేశం శాంతియుతంగా జరుగుతోందని, వారంతా నిరాయుధులని తెలిసినా అమాయకులపై కాల్పులు జరపమని ఆదేశించి డయ్యర్ ఈ మారణహోమానికి ప్రధాన నిందితుడిగా నిలిచాడు. ఈ ఘటనపై డయ్యర్ స్పందిస్తూ తాను ఈ సమావేశాన్ని ఆపేందుకే వెళ్లానని, అయితే అంతమందిని అదుపులో పెట్టడం కష్టం కాబట్టి కాల్పులకు ఆదేశించానని వ్యాఖ్యానించాడు. ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ డయ్యర్ ఈ ఘటనపై ఎలాంటి పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదు. అందని సాయం.. కాల్పుల్లో వందలాది మంది మరణించడంతోపాటు, వేలాది మంది గాయపడ్డప్పటికీ వారికి వెంటనే ఎలాంటి వైద్య సాయం అందలేదు. కాల్పులు జరిపిన అనంతరం డయ్యర్, అతడి సైన్యం అక్కడి నుంచి వెళ్లిపోయారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు డయ్యర్ ప్రయత్నించలేదు. దీనిపై డయ్యర్ మాట్లాడుతూ వారికి వైద్య సేవలు అందించడం తన కర్తవ్యం కాదు కాబట్టి ఆ పని చేయలేదని చెప్పాడు. డయ్యర్ చర్యను కొందరు బ్రిటిష్ పాలకులు సమర్ధించారు. కానీ ఈ చర్యను ఖండిస్తూ బ్రిటీష్ పార్లమెంటు తీర్మానం చేసింది. విన్స్టన్ చర్చిల్ వంటివారు ఈ ఘటనను తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ చర్యపై విచారణ సాగుతుండగానే డయ్యర్ ఇంగ్లండ్ వెళ్లిపోయాడు. స్మారక చిహ్నం ఏర్పాటు.. వందలాది మంది మృతికి కారణమైన ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. స్వాతంత్య్ర ఉద్యమం మరింత విస్తృతమయ్యేందుకు ఈ ఘటన దోహదపడింది. అకారణంగా ప్రాణాలు కోల్పోయిన అమాయక ప్రజల జ్ఞాపకార్థం 1961 ఏప్రిల్ 13న స్మారక స్థూపం ఏర్పాటు చేశారు. ప్రతిఏటా ఇదేరోజు స్థూపంవద్దే కాకుండా దేశవ్యాప్తంగా ప్రజలు జలియన్ వాలాబాగ్ మృతులకు నివాళులర్పిస్తారు. -
జవాను శవపేటికనూ వదలని 'అమ్మ'
చెన్నై: తమిళనాడులో ఏఐఏడీఎంకే మంత్రుల 'అమ్మ' భజన రోజు రోజుకు పెరిగిపోతోంది. మొన్నటికి మొన్న నూతన వధూవరులు బాసికాలపై కూడా దర్శనమిచ్చిన 'అమ్మ' ఇప్పుడు అమరులైన జవానుల శవపేటికలను కూడా వదలలేదు. సియాచిన్‌లో మంచుతుపానులో చిక్కుకుపోయి అమరులైన జవాన్లకు మంగళవారం వారి స్వస్థలాల్లో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. తమిళనాడులోని మదురైలో సిపాయ్ గణేషన్ అంత్యక్రియలు నిర్వహించారు. అయితే ఇక్కడ కూడా తమిళనాడు సీఎం జయలలిత ఫోటో దర్శనమిచ్చింది. రాష్ట్ర మంత్రి సెల్లూరు రాజు జిల్లా కలెక్టర్ వీర రాఘవరావుతో కలిసి జవాను అంత్యక్రియల కార్యక్రమానికి వచ్చారు. రూ. 10 లక్షల చెక్‌ను ప్రభుత్వం తరఫున సిపాయ్ గణేషన్ తల్లికి అందజేశారు. ఆ తర్వాత జయలలిత ఫోటోను శవ పేటికపై పెట్టి ఈ సాయం అందించింది తనే అంటూ జవాను తల్లికి సైగ చేశారు. దీంతో అప్పటికే ఏడుస్తూ ఉన్న ఆవిడ ఆ ఫోటో చూసి నమస్కారం చేసింది. దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన జవాను శవపేటిక వద్ద రాజకీయాలు చేయడం దారుణమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జయలలిత పేరును ఎంత వీలైత అంతగా ప్రచారంలోకి తీసుకు రావాలని ఏఐఏడడీఎంకే నేతలు భావిస్తున్నారు. ఇప్పటికే అమ్మ క్యాంటీన్, అమ్మ వాటర్, అమ్మ ఫార్మసి, అమ్మ సిమెంట్, అమ్మ ఉప్పు, అమ్మ ఆముదం, అమ్మ అవార్డులు, అమ్మ థియేటర్. ఇలా అనేక పథకాలు ఏఐఏడీఎంకే అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను ఉద్దేశించి ప్రారంభించినవే. -
పఠాన్‌కోట్ అమరవీరులకు ఘననివాళులు
-
'రూ. 25 లక్షల సాయం, ప్రభుత్వ ఉద్యోగం'
గురుదాస్ పూర్: పఠాన్ కోట్ దాడిలో వీరమరణం పొందిన తమ ఇద్దరు పంజాబ్ సైనికుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ ఆర్థిక సహాయం ప్రకటించారు. అమరవీరుల కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీయిచ్చారు. పఠాన్ కోట్ వైమానిక స్థావరంలోకి చొరబడిన ఉగ్రవాదులతో పోరాడుతూ పంజాబ్ చెందిన హానరీ కెప్టెన్ ఫతే సింగ్, హవల్దార్ కుల్వంత్ సింగ్ నేలకొరిగారు. ఖదియన్ అసెంబ్లీ నియోజకవర్గంలో మంగళవారం నిర్వహించిన సంగత్ దర్శన్ కార్యక్రమంలో బాదల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... దేశం కోసం ప్రాణాలు వదిలిన సైనికుల కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని అన్నారు. పఠాన్ కోట్ దాడిలో ప్రాణాలు కోల్పోయిన సైనికులందరినీ ఆదుకుంటామని హామీయిచ్చారు. అమరవీరుల కుటుంబాలను సంప్రదించి తగిన సాయం అందించాలని ప్రభుత్వ అధికారులను బాదల్ ఆదేశించారు. ఉగ్రవాదుల చొరబాటుకు ఆస్కారం లేకుండా సరిహద్దు వద్ద భద్రత కట్టుదిట్టం చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. -
అమరవీరులకు సలాం
-
బషీర్‌బాగ్ నెత్తుటి గాయానికి 15 ఏళ్లు
-
అమరత్వానికి హెచ్చుతగ్గులుండవ్!
మావోయిస్టుల ఎజెండాయే మా ఎజెండా అని నమ్మబలికి నిన్నకాక మొన్న అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రజా ఉద్యమాలను, ప్రజలను, ఉద్యమ కార్య కర్తలను హత్య చేయడమే ఎజెండాగా పెట్టుకున్నాడు. అధికారంలోకి వస్తే చాలు భూ సమస్యలను పరిష్కరి స్తానన్నవాడు నేడు పెట్టుబడిదార్ల పాలేగాడిగా మారి పోయి విదేశీ పెట్టుబడులకు, బహుళజాతి గుత్త సం స్థలకు ఎర్రతివాచీ పరిచి స్వాగతిస్తున్నాడు. ఆది వాసీల జీవనాన్ని విధ్వంసం చేస్తూ అక్కడ ఉన్న ఖనిజసంపదను దోచుకోవడం కోసం సీఆర్పీ ఎఫ్, గ్రేహౌండ్స్, కోబ్రా బలగాలను ఉసిగొల్పుతూ ప్రభుత్వం పాల్పడుతున్న దమనకాండకు నిదర్శనమే లంకపల్లి హత్యాకాండ. లంకపల్లి బూటకపు ఎన్‌కౌం టర్లో అసువులు బాసిన వివేక్, (రఘు), కమల, సో నిల నగ్న హత్యపైకూడా దారుణమైన దుష్ర్పచారానికి పూనుకుంటున్నారు. కేసీఆర్ ప్రభుత్వ విధానాలతో విసుగు చెందిన కొంతమంది యూనివర్సిటీ విద్యార్థు లు విప్లవోద్యమంలో భాగస్వాములయ్యారని వార్త గుప్పుమనగానే తెలంగాణ ప్రభుత్వం ఎన్కౌంటర్ లకు తెరదీసింది. అతి చిన్న వయస్సులో త్యాగానికి బాటలు పర్చిన వివేక్‌ను పొరుగు రాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వంతో కుమ్మక్కై బలితీసుకొంది. పైగా చిన్న పిల్లలను సైతం మావోయి స్టుపార్టీ రిక్రూట్ చేసుకుం టోందంటూ దుష్ర్పచారం మొదలెట్టింది. కానీ ప్రజా యుద్ధంలో అమరత్వానికి హెచ్చుతగ్గులు ఉండవు. లంకపల్లి బూటకపు ఎన్కౌంటర్లో అసువులు బాసిన వివేక్ (రఘు) వివరాలను ఫేస్‌బుక్‌ల్లోనూ, వాట్సప్ల్లోను చూస్తున్న ప్రతి ఒక్కరూ నేడు మావో యిస్టు పార్టీ రిక్రూట్మెంట్ విధానంపై చ ర్చిస్తున్నారు. కానీ గమనించాల్సింది ఏమిటంటే విప్లవ పదజా లాన్ని వాడుతూ, మాటలతోనే విప్లవాన్ని వల్లించేవాళ్ల ఆచరణ లేని విధానాన్ని గేలిచేస్తూ వివేక్, సోని, కమల వంటి వాళ్లు విప్లవంలోకి వచ్చారు. కాని వివేక్ తొందరపడ్డాడనీ, పరిణతి లేదనీ, ఆవేశంతో, దుందు డుకు స్వభావం కలవాడని సోషల్ మీడియాలో చాలా మంది మాట్లాడుతున్నారు. కమల, సోని, వివేక్ వం టి పసిమొగ్గలను పాశవికంగా చిదిమేస్తే ప్రభుత్వాన్ని ప్రశ్నించని వాళ్లు చిన్నవయస్సు వాళ్లను రిక్రూట్ చేసు కుంటోందంటూ మావోయిస్టు పార్టీని తప్పుబట్టటం పాలక వర్గాలకు అంతిమంగా వంతపాడటమే. నేడు జనతన సర్కార్లు ఏర్పాటు చేస్తున్న ఛత్తీస్ గఢ్, బిహార్, జార్ఖండ్‌లలో పసిపిల్లలను, వృద్ధులను, మహిళలను నిరాయుధులైన అనేకమంది పీడిత ప్రజ లను రోజువారీగా హత్య గావిస్తూనే ఉన్నారు. ఈ హత్యలను, ప్రభుత్వాల పాశవిక దమనకాండను మేధావులు ఎందుకు ఖండించడం లేదన్నది మా ప్రశ్న. ఆదివాసుల జీవన విధానం ఒక రణరంగమై, వారి బతుకులు ఛిద్రమై, ఇళ్లు ధ్వంసమై, హంతక బల గాలు ఆదివాసీల ఆస్తుల్ని ధ్వంసం చేసి, మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతుంటే రాజ్యాన్ని ప్రశ్నించేం దుకు ఏ మేధావి గొంతూ పెగలడం లేదు. ప్రాణత్యా గం చేస్తున్న అమరులను అవమానించేలా మాట్లా డటం అంటే వారి త్యాగాలను కించపర్చడమే. అం దుకే మేధావులను సరిగ్గా ఆలోచించవలసిందిగా కోరుతున్నాం. విప్లవకారుల త్యాగాలపై దుష్ర్పచారా న్ని నమ్మవద్దని అభ్యర్థిస్తున్నాం. ప్రజా రాజ్యాధికారం రావాలంటే సాయుధ పోరాటమే మార్గం. తెలంగాణ సాయుధ పోరాట అమరవీరుల నెత్తుటి సాక్షిగా తెలం గాణలో విప్లవోద్యమం ఫీనెక్స్ పక్షిలాగా తిరిగి ఉవ్వె త్తున ఎగిరేలాగా పుంజుకునేలా నిర్మిద్దాం. పసివయ స్సులోనే ప్రజల కోసం అసువులు బాసిన వివేక్ వంటి వారి త్యాగానికి అదే సరైన నివాళి. వ్యాసకర్త: జగన్ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి, సి.పి.ఐ. (మావోయిస్టు) -
'మొక్కలు నాటడమే వారికి మంచి నివాళి'
న్యూఢిల్లీ: మొక్కలు నాటడం ద్వారా దేశం కోసం పోరాడి ప్రాణాలర్పించిన వీర జవానులకు మంచి శ్రద్ధాంజలి ఘటించినట్లవుతుందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్ అన్నారు. శనివారం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశంకోసం పాటుపడిన ప్రతిఒక్కరిని స్మరించుకుంటున్నామని, ప్రతి ఒక్కరూ ఒక్కో మొక్క నాటడం ద్వారా వారికి మంచి నివాళి ఇచ్చినట్లవుతుందని చెప్పారు. శుక్రవారం ఆయన మూడు కోర్టుల వద్ద మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ ప్రజలకు ఇతర రాష్ట్రాలతో పోలిస్తే నిధులు కాస్తంత ఎక్కువేనని, సాంకేతిక పరిజ్ఞానం, సౌకర్యాలు అదనం అని చెప్పారు. అలాంటి ఢిల్లీలో పనిచేసేందుకు అనువైన వాతావరణం తయారుచేసుకోవడం ఒక బాధ్యతగా తీసుకోవాలని అన్నారు. మొక్కలు నాటడం ద్వారా అది సాధ్యమవుతుందని వివరించారు సందర్భంగా ఆయన ఈ మాటలు అన్నారు. -
కార్గిల్ యుద్ధానికి 16 ఏళ్లు
న్యూఢిల్లీ: కార్గిల్ యుద్ధంలో భారత సైన్యం విజయానికి గుర్తుగా జరుపుకొనే 'విజయ దివస్' సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ అమర జవాన్లకు నివాళులు అర్పించారు. 'మాతృభూమి కోసం పోరాడి, యుద్ధంలో మరణించిన సైనికులకు సెల్యూట్ చేస్తున్నా. త్రివిధ దళాల శౌర్యానికి, త్యాగానికి ప్రతీక విజయ్ దివస్' అని ట్వీట్ చేశారు. రక్షణ మంత్రి మనోహర్ పారికర్ అమర జవాన్లకు నివాళులు అర్పించారు. ఢిల్లీలోని అమర్ జవాన్ జ్యోతి వద్ద పుష్పమాల ఉంచి అంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో ఆర్మీ చీఫ్ జనరల్ దల్బీర్ సింగ్, ఎయిర్ చీఫ్ మార్షల్ అరూప్ రాహా, నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్. కె. ధోవన్ లు కూడా పాల్గొన్నారు. కార్గిల్ జిల్లాలోని ద్రాస్ వార్ మెమోరియల్ వద్ద శనివారం నాడు ఆర్మీ చీఫ్ దల్బీర్ సింగ్.. అమర జవాన్లకు నివాళులు అర్పించారు. కార్గిల్ యుద్ధం ముగిసి నేటికి 16 ఏళ్లు. 1999 మే నెలలో ప్రారంభమైన ఈ యుద్ధం జులై 26 వరకు కొనసాగింది. కశ్మీర్ లోని కార్గిల్ జిల్లా సహా సరిహద్దు వెంబడి మరికొన్నచోట్ల జరిగింది. యుద్ధప్రారంభ దశలో ఇది కేవలం కశ్మీరీ తిరుగుబాటుదారులు చేస్తున్న ఆందోళనగా భావించినప్పటికీ మరణించిన భారత జవాన్ల దగ్గర లభించిన ఆధారాలను బట్టి ఇందులో పాకిస్థాన్ సైనిక దళాల హస్తం కూడా ఉందని రుజువైంది. పాక్ ప్రధాని, సైన్యాధ్యక్షులు చేసిన వ్యాఖ్యలు కూడా ఇందుకు బలాన్ని చేకూర్చాయి. దీంతో మన దేశం అప్పమత్తమైంది. వాస్తవాధీనరేఖ దాటి పాకిస్థాన్ ఆక్రమించుకున్న ప్రదేశాలను భారత సైన్యం, భారత వాయుసేన సహకారంతో తిరిగి స్వాధీనపరుచుకుంది. అంతర్జాతీయంగా వస్తున్న వత్తిడిని తట్టుకోలేక పాకిస్తాన్ సైన్యం వెనుతిరిగింది. ఎత్తైన పర్వత ప్రాంతాల మీద జరిగిన యుద్ధాలకి ఇది తాజా ఉదాహరణ. ఇంత ఎత్తులో యుద్ధం జరగడం వల్ల ఇరు పక్షాలకి ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. అణుబాంబులు కలిగిన దేశాల మధ్య జరిగిన యుద్ధాల్లో ఇది రెండోది. మొదటిది చైనా - సోవియట్ ల మధ్య 1969 లో జరిగింది. కార్గిల్ యుద్ధంలో దాదాపు 500 మంది భారత జవాన్లు, అధికారులు అమరులయ్యారు. -
కార్గిల్ యుద్ధానికి 16 ఏళ్లు
-
సర్కారు సాయం...ముగ్గురికే
ఏడుగురు తెలంగాణ అమరుల కుటుంబాల ఎదురు చూపులు సాక్షి, సిటీబ్యూరో: తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసిన అమరవీరుల కుటుంబాలకు రూ.పది లక్షల చొప్పున ఆర్థిక సాయమందిస్తున్న ప్రభుత్వం...హైదరాబాద్ జిల్లాలో ముగ్గురికి మాత్రమే అందజేసింది. మిగతా ఎడుగురు అమరుల కుటుంబాలకు సాయం అందలేదు. నగరంలో ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం 2009 నుంచి 2013 వరకు ఉవ్వెత్తున ఎగసిన మలిదశ ఉద్యమంలో 12 మంది విద్యార్థి, యువజనులు తమ ప్రాణాలను త్యాగం చేశారు. ముగ్గురికి ఆర్థిక సాయం.. జిల్లాలోని సికింద్రాబాద్, అడ్డగుట్టలో 2009, డిసెంబర్ 28న తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకున్న ఇ.స్వామి, ఇదే నెల 30న సికింద్రాబాద్ అడ్డగుట్టలోని ఏసీఎస్ నగర్లో ఆత్మహత్య చేసుకున్న టి.వినోద్‌కుమార్, 2013, సెప్టెంబర్ 6న బేగంపేట్ రసూల్‌పురాలో ఆత్మహత్య చేసుకున్న కె.కృష్ణకాంత్ కుటుంబాలకు మాత్రమే ప్రభుత్వం రూ. 10 లక్షల చొప్పున రూ.30 లక్షలు అందజేసింది. నిరీక్షణ మిగతా ఏడుగురు అమరుల కుటుంబాలు కూడా ప్రభుత్వం అందించే ఆర్థిక సాయం కోసం ఎదురు చూస్తున్నాయి. ఓయూలో ఆత్మహత్య చేసుకున్న అమరులు కె. వేణుగోపాల్‌రెడ్డి, ఎస్.యాదయ్య, ఎం.సాయికుమార్, డి.సంతోష్ యాదవ్, ఎస్.భరత్‌గౌడ్, జూబ్లీ బస్ స్టేషన్ వద్ద పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్న ఎం. సుధాకర్, అమీర్‌పేట్‌లోని బీకే గూడకు చెందిన సిహెచ్. కనుకయ్య కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాల్సి ఉంది. ఇద్దరు అమరుల వివరాలు.. వారి జిల్లాలకు... జిల్లాలో తెలంగాణ కోసం అమరులైన జాబితాను పరిశీలించిన ఉన్నతాధికారులు 2010 జులై 31 న ఓయూ లైబ్రరీ సమీపంలో ఆత్మహత్య చేసుకున్న మెదక్ జిల్లాకు చెందిన ఇషాన్‌రెడ్డి, 2013 జూన్ 15న ఓయూ లా కళాశాల సమీపంలో ఆత్మహత్య చేసుకున్న మహబుబ్‌నగర్‌కు చెందిన బి.శ్రీనివాస్‌లకు ఆర్థిక సాయానికి సంబంధించిన వివరాలను సొంత జిల్లాలకు బదిలీ చేశారు. వీరి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేసినట్లు అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. తొలి దశ ఉద్యమకారుల కుటుంబాల్లోనూ ఆశలు.. మలి దశ ఉద్యమంలో ఆత్మబలిదానం చేసుకున్న అమరుల కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సాయమందించటంతో, తొలి దశ ఉద్యమంలో ప్రాణ త్యాగం చేసిన కుటుంబాల్లోనూ ఆశలు చిగురిస్తున్నాయి. జిల్లాలో తొలి దశలో ఉద్యమంలో భాగం గా 1969లో జరిగిన తెలంగాణ పోరులో అసువులు బాసిన మరో ఐదుగురు అమరుల కుటుంబాలు కూడా ప్రభుత్వం ఆర్థిక సాయం కోసం జిల్లా కలెక్టర్ ద్వారా సర్కారుకు మొరపెట్టుకున్నాయి.అందులో భాగంగానే తొలి దశ ఉద్యమంలో అమరులైన ఎన్.నాగభూషణం( సనత్‌నగర్), కె.వెంకటేశ్వర్రావు(ముషీరాబాద్), ఎస్.నర్సింగరావు(ఆసీఫ్‌నగర్), పి.వెంకటేశం(మంగళ్ హాట్), ఆకుల నరేందర్( కవాడీగూడ)లకు చెందిన కుటుంబాలు ఆర్థిక సాయం కోసం ఎదురు చూస్తున్నాయి. -
అమరవీరుల కుటుంబాలకు చెక్కుల పంపిణీ
తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరవీరుల త్యాగం చిరస్మరణీయమని రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన అమరవీరుల కుటుంబాల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లాకు చెందిన అమరవీరుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందించారు. మొత్తం 26 కుటుంబాలకు మంత్రి చెక్కులు పంపిణీ చేశారు. -
జూన్ 2న అమరవీరుల సంస్మరణ దినం
సాక్షి, హైదరాబాద్: జూన్ రెండో తేదీని తెలంగాణ అమరవీరుల సంస్మరణ దినోత్సవంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారని అధికారిక ప్రకటన విడుదలైంది. ఇక నుంచి అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని, జిల్లా కేంద్రాల్లో అమ రుల స్మారకస్థూపాల ఏర్పాటుకు కలెక్టర్లు చర్య లు తీసుకోవాలని ఆదేశించింది. దీనిపై పక్షం రోజుల్లో సీఎస్కునివేదికివ్వాలని సూచించింది. ‘వంద కోట్లతో ఓసీ భవన్ నిర్మించాలి’ ఇతర కులాలకు (ఓసీ) చెందిన నిరుపేదల అభి వృద్ధి కోసం హైదరాబాద్‌లో రూ.వంద కోట్లతో ఓసీ భవన్‌ను నిర్మించాలని సీఎం కేసీఆర్‌కు ఓసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జి.కరుణాకర్‌రెడ్డి ఒక ప్రకటనలో విజ్ఞప్తిచేశారు. తెలంగాణ ఉద్యమంలో అగ్రకులాలకు చెందినవారు కీలకపాత్ర పోషించారన్నారు. రాష్ర్టంలో కోటిమందికిపైగా జనాభా గల అగ్రకులాల్లో అత్యధిక శాతం పేదరికంలో ఉన్నార ని పేర్కొన్నారు. అన్నివర్గాలను ఆదుకుంటున్న సీఎం నిరుపేద ఓసీలను కూడా పట్టించుకోవాలని కోరారు. -
అమరుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున సాయం
అమరుల త్యాగాల వల్లే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని, అందువల్ల వారిని స్మరించుకోవాల్సిన అవసరం ఉందని తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. 459 మంది అమరుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల చొప్పున సాయం అందిస్తామని, ఇందుకోసం బడ్జెట్లో వందకోట్ల కేటాయింపు చేస్తామని ఆయన అన్నారు. ఇంకా బడ్జెట్ ప్రసంగంలో ఆయన ఏం చెప్పారంటే.. ''దుష్టశక్తుల ఆటలు కట్టించే నేర్పు, ఓర్పు మాకున్నాయి. ఉద్యమస్ఫూర్తితోనే బంగారు తెలంగాణ సాధించే ప్రయత్నం చేయాలి. తెలంగాణ సమాజాన్ని ప్రగతిపథంలో నడిపించడానికి ఈ బడ్జెట్ తోడ్పడుతుంది. సమస్యల పరిష్కారం దిశగా ఇది కృషిచేస్తుంది. గత ప్రభుత్వాల తప్పుడు విధానాల వల్ల విచ్ఛిన్నమైన తెలంగాణను మళ్లీ తన కాళ్ల మీద నిలబెట్టడానికి సహకరిస్తుంది. స్వల్పకాలిక, దీర్ఘకాలిక లక్ష్యాలతో ముందుకెళ్తాం. సమగ్ర కుటుంబ సర్వే ద్వారా సేకరించిన సమాచారంతో పథకాల లబ్ధి అందరికీ అందేలా చూస్తాం'' అని తెలిపారు. -
అమరులకు ఘన నివాళి
గుంటూరు పోలీస్ పరేడ్ మైదానంలో మంగళవారం పోలీస్ అమర వీరుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో పోలీస్ అమరులకు ఘన నివాళులర్పించారు. జిల్లా కలెక్టర్ కాంతిలాల్‌దండే, రూరల్ ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ తోపాటు పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. గుంటూరు క్రైం: సమాజంలో పోలీస్ ఉద్యోగం పవిత్రమైందని వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్లో మంగళవారం పోలీస్ అమర వీరుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి పుల్లారావు, కలెక్టర్ కాంతిలాల్‌దండే, రూరల్ ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణలు సిబ్బంది నుంచి తొలుత గౌరవ వందనం స్వీకరించారు. అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ పోలీసులు ప్రజల సంక్షేమం కోసం చేసిన ప్రాణ త్యాగాలను ఎన్నటికీ మరువలేమన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అన్నివిధాలా అండగా వుంటుందని స్పష్టం చేశారు. సిబ్బందిలో స్ఫూర్తి నింపేందుకు అమరవీరుల దినోత్సవం దోహదపడుతుందని తెలిపారు. విధి నిర్వహణలో నిత్యం ఒత్తిళ్లకు లోనవుతున్న పోలీసులకు తప్పనిసరిగా వారాంతపు సెలవులు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. కలెక్టర్ కాంతిలాల్‌దండే మాట్లాడుతూ పోలీసుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలన్నారు. విధి నిర్వహణలో అంతర్గత శత్రువులను ఎదుర్కొనేందుకు సుశిక్షితులైన ప్రత్యేక బలగాలు, అధునాతన ఆయుధాలు పోలీస్‌శాఖకు అవసర మని స్పష్టం చేశారు. రూరల్ ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ మాట్లాడుతూ విధి నిర్వహణలో అమరులైన వారి స్ఫూర్తితో ఎలాంటి పరిస్థితులలోనేనా ప్రజలకు సేవలు అందించేందుకు పోలీస్‌శాఖ సిద్ధంగా వుంటుందన్నారు. అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అమరజ్యోతి వద్ద మంత్రి పుల్లారావు, ఎమ్యెల్యేలు మెహమ్మద్ ముస్తఫా, కోన రఘుపతి, మోదుగుల వేణుగోపాలరెడ్డి, కొమ్మాలపాటి శ్రీధర్, కలెక్టర్ కాంతీలాల్‌దండే, జాయింట్ కలెక్టర్ శ్రీధర్‌లు పుష్పగుచ్చాలు ఉంచి ఘనంగా నివాళులు అర్పించారు. పోలీస్‌లు స్మృతి పరేడ్ నిర్వహించి నివాళులు తెలిపారు. పోలీస్ వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన పోటీల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన వారికి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చేతుల మీదుగా బహుమతులను అందించి అభినందించారు. అనంతరం రూరల్ ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ, అదనపు ఎస్పీలు, పోలీస్ కుటుంబాల సభ్యులు అమరవీరుల స్థూపంవద్ద అమరజ్యోతిని వెలిగించి పూలమాలలు వుంచి నివాళులర్పించారు. నగరంలో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా పోలీసులు, ఎస్పీ కార్యాలయ ఉద్యోగులు, స్థానికులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
పోలీసు అమరులకు కేసీఆర్ నివాళులు
విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు అమర వీరులకు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు నివాళులు అర్పించారు. పోలీసు అమరుల త్యాగానికి సార్థకత చేకూరాలని ఆయన అన్నారు. ప్రజల ధన, మాన, ప్రాణాలను కాపాడటంలో పోలీసులదే ముఖ్యపాత్ర అని ఆయన చెప్పారు. మంగళవారం నాడు పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసులకు పలువురు ఘనంగా నివాళులు అర్పించనున్నారు. -
అమర వీరుల త్యాగాలు చిరస్మరణీయం
ఎస్పీ ఆకె రవికృష్ణ పోలీసు అమర వీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా బుధవారం ఎస్పీ రవికృష్ణ రక్తదానం చేశారు. పోలీసులు వినియోగించే వివిధ రకాల ఆయుధాలు, వాటి పేర్లు, వినియోగంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. కర్నూలు : పోలీసు అమర వీరుల త్యాగాలు చిరస్మరణీయమని జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ అన్నారు. పోలీసు అమర వీరుల సంస్మరణ వారోత్సవాలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా జిల్లా పోలీసు యంత్రాంగం స్థానిక పోలీస్ పెరేడ్ మైదానంలో ఓపెన్ హౌస్, మోటార్ ట్రాన్స్‌పోర్టు కార్యాలయం పక్కన రక్తదాన శిబిరం ఏర్పాటు చేసింది. కార్యక్రమానికి ఎస్పీ రవికృష్ణ ముఖ్య అతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. ఓపెన్ హౌస్‌లో పోలీసులు వినియోగించే వివిధ రకాల ఆయుధాలు, వాటి పేర్లు, వినియోగంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. బాంబు డిస్పోజల్ టీం, ఫింగర్ ప్రింట్స్, కమ్యూనికేషన్ తదితర అంశాలకు సంబంధించిన విషయాలను విద్యార్థులకు వివరించారు. శిబిరంలో ముందుగా ఎస్పీనే రక్తదానం చేసి సిబ్బందిలో స్పూర్తి నింపారు. మొత్తం 49 మంది సిబ్బంది ఈ సందర్భంగా రక్తదానం చేశారు. అదనపు ఎస్పీ బాబురావు, ఏఆర్ అదనపు ఎస్పీ రాధాకృష్ణ, ఏఆర్ డీఎస్పీ అశోక్‌బాబు, ఆర్ఎస్ఐలు, స్పెషల్ పార్టీ కానిస్టేబుళ్లు శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారు. ఓఎస్డీ మనోహర్‌రావు, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ ఏజి.క్రిష్ణమూర్తి, కర్నూలు డీఎస్పీ డివి.రమణమూర్తి, హోంగార్డు డీఎస్పీ కృష్ణమోహన్, కర్నూలు పట్టణ సీఐలు, పోలీస్ సిబ్బందితో పాటు రెడ్‌క్రాస్ సొసైటీ చైర్మన్ జి.శ్రీనివాసులు మెడికల్ ఆఫీసర్ ముంతాజ్‌బేగం, కో-ఆర్డినేటర్ పద్మావతి, రెడ్‌క్రాస్ సొసైటీ సిబ్బంది కార్యక్రమంలో పాల్గొని సేవలందించారు. ఏపీఎస్పీ రెండవ పటాలంలో... పోలీసు అమర వీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకుని ఏపీఎస్పీ రెండవ పటాలంలో రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. కమాండెంట్ విజయ్‌కుమార్ ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. 81 మంది సిబ్బంది స్వచ్ఛందంగా శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా కమాండెంట్ మాట్లాడుతూ రక్తదానం చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రాణాలు నిలబెట్టే ఇలాంటి సేవల్లో అందరూ భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి చేశారు. జిల్లాలో ఎలాంటి సమస్య తలెత్తినా మేమున్నామంటూ ముందుకు వచ్చి విధులను సమర్ధవంతంగా నిర్వహించే బెటాలియన్ సిబ్బంది ఇలాంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం హర్షణీయమన్నారు. పటాలం ఓఎస్డీ ఈవీ.రామారావు ఈ సందర్భంగా పండ్లను పంచి పెట్టారు. బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ ఎస్ఎం.బాషా, యూనిట్ వైద్యాధికారి బాల సారయ్య, వెంకటయ్య, యుగంధర్ పాల్గొన్నారు. -
అమరుల కుటుంబాలను ఆదుకుంటాం
సాక్షి, ఖమ్మం: ‘1969 నుంచి ప్రత్యేక రాష్ట్రం సిద్ధించే వరకు ఎందరో వీరుల త్యాగఫలం తెలంగాణ.. రాష్ట్ర సాధన కోసం ఎంతో మంది అసువులుబాశారు. వారి కుటుంబాలకు మా ప్రభుత్వం అండగా ఉంటుంది. ప్రతి అమరుడి కుటుంబానికి రూ.10 లక్షల వరకు ఆర్థిక సహాయం అందిస్తుంది. అమరవీరులకుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తాం.. వ్యవసాయాధారిత కుటుంబాలకు వ్యవసాయ భూమి, అమర వీరుల పిల్లలకు ఉచిత విద్య, వైద్యం అందిస్తాం.’ అని ఎక్త్సెజ్ శాఖ మంత్రి టి.పద్మారావు ప్రకటించారు. నవ తెలంగాణ రాష్ట్రంలో శుక్రవారం తొలి స్వాతంత్య్ర వేడుకలు జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ నినాదాలు, గీతాలు, సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా నృత్యాలు, ప్రదర్శనలతో గ్రౌండ్ మార్మోగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి టి.పద్మారావుగౌడ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో అమరుడైన కరీంనగర్‌కు చెందిన పోలీస్ కిష్టయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం అందించడంతోనే అమర వీరులకు కుటుంబాలను ఆదుకునే ప్రక్రియ ప్రారంభించినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుతంగా పోరాడిన ఉద్యమకారులపై సీమాంధ్ర సర్కారు అనేక అక్రమ కేసులు బనాయించిందని, వీటన్నింటినీ ఎత్తివేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. పంట చేతికి రాక, సాగుకు చేసిన అప్పులు తీర్చలేక..కుటుంబం గడవక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, వారి రుణ భారాన్ని పంచుకోవడాన్ని ప్రభుత్వం బాధ్యతగా తీసుకుందని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు రూ.లక్ష వరకు రుణ మాఫీ చేస్తుందని హామీ ఇచ్చారు. గిరిజన తండాలు, ఆదివాసీ గూడేలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా గుర్తించాలని గిరిజన సోదరులు ఎన్నో ఏళ్లుగా పోరాడుతున్నారని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్ కల్పించి వారికి విద్య, ఉద్యోగావకాశాలను మెరుగు పరచాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పించారన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించి, సకలజనుల సమ్మె చేసిన ఉద్యోగుల సంక్షేమం తమ బాధ్యత అని, అందుకే ప్రభుత్వ ఉద్యోగులందరికీ ప్రత్యేక తెలంగాణ ఇంక్రిమెంట్ ప్రకటించామని చెప్పారు. అద్భుత పథకంకళ్యాణలక్ష్మి .. పేద దళిత, గిరిజన ఆడపిల్లల వివాహానికి రూ.50 వేలు ఆర్థిక సహాయం అందించాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలోంచి పుట్టిన పథకమే కల్యాణ లక్ష్మి అని మంత్రి పద్మారావు అన్నారు. దేశ చరిత్రలోనే ఇలాంటి పథకం లేదన్నారు. పేద విద్యార్థులు వృత్తి, ఉన్నత విద్యలనభ్యసించేందుకు వీలుగా ప్రభుత్వం ఫాస్ట్ పథకం ప్రవేశపెట్టిందన్నారు. గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉండే ఆర్ఎంపీ, పీఎంపీలకు ప్రభుత్వం సర్టిఫికెట్లు ఇచ్చి వారికి గుర్తింపునిస్తుందని పేర్కొన్నారు. దళిత బిడ్డలు పూర్ణ, ఆనంద్ ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించి తెలంగాణ రాష్ట్ర కీర్తిని ప్రపంచ వ్యాప్తంగా చాటారని ప్రశంసించారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించే ఉద్దేశంతోనే సమగ్ర సర్వే కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు. సర్వే రోజున ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు సెలవు ప్రకటించారని, ఆ రోజు అందరూ ఇళ్లలోనే ఉండాలని కోరారు. తెలంగాణలోని ప్రతి నియోజకవర్గంలో 40 లక్షల మొక్కలు నాటాలని నిర్ణయించినట్లు తెలిపారు. గోదావరి పుష్కరాలు ఘనంగా నిర్వహిస్తాం.. వచ్చే ఏడాది జూలైలో నిర్వహించనున్న గోదావరి పుష్కరాలకు ఘనంగా ఏర్పాట్లు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఖమ్మం నగర పాలక సంస్థ పరిధిలో రూ.18.26 కోట్లతో 255 పనులు జరుగుతున్నాయన్నారు. జిల్లాలోని ఆరు పురపాలక సంఘాల్లో రానున్న రోజుల్లో అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం రూ.కోట్లు ఖర్చు చేయనుందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇటీవల వరుసగా జరిగిన సార్వత్రిక, మున్సిపల్, ప్రాదేశిక ఎన్నికలు ప్రశాంతంగా జరిగిలే జిల్లా అధికారులు, పోలీసులు కృషి చేశారని ప్రశంసించారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ గడిపల్లి కవిత, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కలెక్టర్ డాక్టర్ కె.ఇలంబరితి, ఎస్పీ ఏవీ.రంగనాథ్, ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, బాణోతు మదన్‌లాల్, ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, జాయిల్ కలెక్టర్ సురేంద్రమోహన్, పలు పార్టీల నేతలు పాల్గొన్నారు. -
ఘనంగా విజయ్ దివస్
సాక్షి, చెన్నై :పాక్ సైన్యం 1999లో కాశ్మీర్‌ను ఆక్రమించుకోవడానికి భారత్‌లోకి చొరబడిన విషయం తెలిసిందే. ఈ చర్యలను తిప్పికొట్టడమే లక్ష్యంగా భారత సైన్యం వీరోచితంగా శ్రమించింది. కార్గిల్ గుండా దేశంలోకి చొరబడ్డ పాక్ శక్తుల్ని అదే మార్గం గుండా తరిమి కొట్టేందుకు రెండు నెలల పాటుగా యుద్ధం చేయాల్సి వచ్చింది. ఈ కార్గిల్ యుద్ధంలో మన సైనికులు 527మంది అమరులయ్యారు. 1863 మంది గాయపడ్డారు. ఇందులో రాష్ట్రానికి చెందిన వీర జవాన్లు కూడా ఉన్నారు. జూలై 26న ఈ యుద్ధంలో భారత్ విజయ కేతనం ఎగుర వేసింది. నాటి నుంచి కార్గిల్ విజయ్ దివస్‌ను జరుపుకుంటూ వస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం ఉదయం మెరీనా తీరంలోని వార్ మెమోరియల్ స్థూపాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. పలు రకాల పుష్పాలతో తీర్చిదిద్దిన ఈ స్థూపం వద్ద భారత ఆర్మీ, నావికాదళం అధికారులు, సిబ్బంది ఘన నివాళులర్పించారు. తమిళనాడు, ఆంధ్రా, క ర్ణాటక, కేరళ హెడ్ క్వార్టర్ జనరల్ ఆఫీసర్ కమాం డింగ్ లె ఫ్టినెంట్ జనరల్ జగ్బీర్ సింగ్, తమిళనాడు, పుదుచ్చేరి నావల్ ఆఫీసర్ ఇన్చార్జ్ కె మహదేవన్ ఆ స్తూపం వద్ద పుష్ప గుచ్ఛాలను ఉంచి వీర వందనం సమర్పించారు. -
తెలంగాణ సాధనలో జిల్లా ప్రజలది ప్రత్యేకపాత్ర
కలెక్టర్ వీరబ్రహ్మయ్య కరీంనగర్‌కల్చరల్, న్యూస్‌లైన్ : తెలంగాణ రాష్ట్ర సాధనలో జిల్లా ప్రజలది ప్రత్యేక పాత్ర అని కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య అన్నారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో భాగంగా వారం రోజుల పాటు నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలను సోమవారం ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అరవై ఏళ్ల కల సాకారమైందన్నారు. ఉద్యమంలో అశువులు బాసిన అమరులకు పేరుపేరున నివాళులర్పించారు. అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించినప్పుడే బంగారు తెలంగాణ ఏర్పడుతుందని అభిప్రాయపడ్డారు. జాయింట్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, మెప్మా పీడీ విజయలక్ష్మి, డీఈవో లింగయ్య, డీపీఆర్వో ప్రసాద్ ఇతర అధికారులు పాల్గొన్నారు. ఆకట్టుకున్న ప్రదర్శనలు శ్వేత, శాతవాహన కళాజ్యోతి కళాకారులు ప్రదర్శించిన శాస్త్రీయ జానపద నృత్యాలు, రేణికుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు, జేఎన్ఎంహెచ్ స్కూల్, అల్ఫోర్స్ హైస్కూల్ విద్యార్థుల నృత్యాలు, ఒగ్గుడోలు కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. సందర్భం లేని స్వాగత నృత్యం కార్యక్రమం ప్రారంభం సందర్భంగా ప్రదర్శించిన స్వాగత నృత్యం అందరినీ ఆశ్చర్యపరిచింది. శాతవాహన కళోత్సవాల కోసం ఆరేడేళ్ల క్రితం సినీగీతా రచయిత గుండేటి రమేశ్ రాసి స్వరపరిచిన గీతాన్ని ప్రదర్శించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక రాష్ట్రాన్ని స్వాగతిస్తూ సంబురాలు చేస్తే జిల్లా యంత్రాంగం మాత్రం శాతవాహన కళోత్సవాల స్వాగత నృత్యాన్ని ప్రదర్శించడం విమర్శలకు దారితీసింది. -
అమరవీరులకు కేసీఆర్ ఘన నివాళి
-
గన్ పార్క్ వద్ద అమరవీరులకు కేసీఆర్ ఘన నివాళి
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించారు. గన్ పార్క్ వద్ద అమర వీరుల స్థూపం సందర్శించి అంజలి ఘటించారు. కేసీఆర్‌తో పాటు కేకే, హరీష్ రావు, కేటీఆర్ తదితరులు ఉన్నారు. అనంతరం కేసీఆర్ రాజ్ భవన్‌కు బయల్దేరారు. ఉదయం 8.10 గంటలకు ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ తర్వాత సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. -
అమ్మ మాట..
ఏడాదికోసారైనా అమరులను తలచుకోవాలి తెలంగాణ రాష్ట్రంలో అమరవీరుల జ్ఞాపకార్థం ప్రభుత్వమే విగ్రహాలు, స్థూపాలు ఏర్పాటు చేయాలి. వారి కుటుంబాలకు బస్సు, రైలు పాస్‌లు అందజేయాలి. ఏడాదికోసారి అమరుల జ్ఞాపకార్థం సభలు, సమావేశాలు నిర్వహించి నివాళులర్పించాలి. అప్పుడే నాలాంటి తెలంగాణ అమరవీరుల తల్లులకు మనశ్శాంతి లభిస్తుంది. నవ తెలంగాణలో ప్రభుత్వమే ప్రతీ పేదకీ ఇల్లు నిర్మించి ఇవ్వాలి. కొత్త రాష్ట్రంలో లంచాలనే మాట వినిపించకుండా చేయాలి. అందరూ కష్టపడి కొత్త రాష్ట్రం నిర్మాణంలో పాలుపంచుకోవాలి. పేద విద్యార్థులుకు నాణ్యమైన విద్య అందించే ఏర్పాట్లు చేయాలి. చదువుకున్న ప్రతీ ఒక్కరికీ ఉద్యోగం కల్పించాలి. రేషన్‌షాపుల ద్వారా ప్రతీ ఒక్కరికీ నెలకు 15కిలోల బియ్యం పంపిణీ చేయాలి. అలాగే తెలంగాణలో మద్యాన్ని నిషేధించాలి. పేదలు పెద్దాస్పత్రులకు వెళ్లలేక తనువు చాలిస్తున్నారు. ఈ దుస్థితి ప్రత్యేక రాష్ట్రంలో తలెత్తకుండా అందరికీ నాణ్యమైన ఉచిత వైద్యం అందించే ఏర్పాటు చేయాలి. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఎమ్మెల్యే, ఎంపీల ఆస్తులు పెరిగితే వారిని అనర్హులుగా ప్రకటించాలి. -న్యూస్‌లైన్, ఇల్లెందు -
పార్లమెంటుపై దాడికి పన్నెండేళ్లు..
-
పార్లమెంటుపై దాడికి పన్నెండేళ్లు.. మృతులకు నివాళులు
పన్నెండేళ్ల క్రితం పార్లమెంటుపై జరిగిన దాడిలో మరణించిన వారికి వివిధ పార్టీల నాయకులు సంతాపం తెలిపారు. ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధాని మన్మోహన్ సింగ్, లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఉభయ సభల్లో విపక్షనేతలు సుష్మాస్వరాజ్, అరుణ్ జైట్లీ, పలు ఇతర పార్టీల నాయకులు... ఆనాటి సంఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులు అర్పించారు. 2001 డిసెంబర్ 13వ తేదీన భారీగా ఆయుధాలతో విరుచుకుపడిన ఉగ్రవాదులు పార్లమెంటును చుట్టుముట్టారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరుగుతుండగా ఇష్టారాజ్యంగా కాల్పులు జరిపారు. ఆ దాడిలో ఐదుగురు పోలీసులు సహా మొత్తం 11 మంది మరణించారు. ఈ దాడికి కుట్రదారుల్లో ఒకరైన అఫ్జల్‌గురును సుదీర్ఘ కాలం తర్వాత ఇటీవలే ఉరితీశారు. దానిపై పాకిస్థాన్ నుంచి నిరసనలు వచ్చినా, భారత ప్రభుత్వం లెక్కచేయలేదు. కాగా, శుక్రవారం నాడు పలువురు నాయకులు పన్నెండేళ్ల నాటి పార్లమెంటు దాడి సంఘటనపై స్పందించారు. పేలుళ్ల సూత్రధారిని అరెస్టు చేయాల్సిందేనని లోక్‌సభలో విపక్షనేత సుష్మా స్వరాజ్ అన్నారు. కనీసం ఇన్నాళ్లకైనా ఒక ఉగ్రవాదిని పట్టుకున్నారని హర్షం వ్యక్తం చేశారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి కూడా దాడిలో మరణించినవారికి నివాళులు అర్పించారు. -
ముంబైలో 26/11 మృతులకు నివాళి
-
మా కుటుంబాలకు దిక్కెవరు..?
=అమరుల కుటుంబీకుల ఆవేదన =అటవీశాఖలో కారుణ్య నియామకాలు చేపట్టాలని వినతి బహదూర్‌పురా,న్యూస్‌లైన్: అటవీ సంపద, వన్యప్రాణుల సంరక్షణలో ఎంతో ధైర్యంతో విధులు నిర్వర్తించి ప్రాణాలర్పించిన అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామన్న ప్రభుత్వం ఇప్పటివరకు పట్టించుకోలేదని అమరుల కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం అటవీ అమరవీరుల సంస్మరణదినం సందర్భం గా అమర వీరుల కుటుంబ సభ్యులు ఉద్యోగాలు కల్పించాలని ప్రభుత్వ ప్రధానముఖ్యకార్యదర్శి (పీసీసీఎఫ్) బి.ఎస్.ఎస్.రెడ్డికి వినతిపత్రం అందజేశారు. 1984లో మృతి చెందిన అక్బర్ కుటుంబానికి పింఛన్ మాత్రమే చెల్లిస్తూ... నేటికి ఉద్యోగం కల్పించకపోవడంతో బాధితురాలు ఖైరున్నీసా తన కుమారుడికి ఉద్యోగం కల్పించాలంటూ అధికారులను ప్రాధేయపడుతూ విలేకర్లతో వాపోయారు. అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఖైరున్నీసాకు పూర్తిస్థాయి వేతనాన్ని చెల్లించాలని ఉత్తర్వులు జారీచేసినా ఇప్పటివరకు ఆచరణకు నోచుకోలేదని ఆమె వాపోయింది. అమరులైన 32 మంది కుటుంబాల్లో సగానికి పైగా ప్రభుత్వోద్యోగాలు రాలేవంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. అమరుల కుటుంబసభ్యులకు ప్రభుత్వం,అటవీశాఖ తరఫున నష్టపరిహారం చెల్లించి చేతులు దులుపుకున్నారన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఉద్యోగాలు కల్పించాలని వారు విజ్ఞప్తి చేశారు. -
పోలీసుల త్యాగాలు వెలకట్టలేనివి..
సాక్షి, నల్లగొండ :విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసు అమరుల త్యాగాలు వెలకట్టలేనివని కలెక్టర్ టి.చిరంజీవులు అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నల్లగొండలోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. సమాజ శ్రేయస్సు కోసం విధి నిర్వహణలో అసువులుబాసిన పోలీసులకు నివాళులర్పించారు. అమరవీరుల స్మారక స్తూపం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి వారి సేవలను మననం చేసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడారు. విద్యార్థికి ఉపాధ్యాయుడు ఎంతో ముఖ్యమో.. సమాజానికి పోలీసు కూడా అంతే అవసరమని కలెక్టర్ పేర్కొన్నారు. అమరవీరుల కుటుం బాలకు ఎంత టి మేలు చేసినా తక్కువేనన్నారు. ఎస్పీ డాక్టర్ టి.ప్రభాకర్‌రావు మాట్లాడుతూ పోలీసు అమరుల లక్ష్యాలు, ఆశయాల సాధనకు ప్రతి పోలీసు కంక ణబద్ధులు కావాలని పిలుపునిచ్చారు. ఉగ్రవాదుల దాడులను, సంఘవి ద్రోహ శక్తులను తిప్పికొట్టాలని ఉద్భోదించా రు. అప్పుడు మాత్రమే వారి త్యాగాలకు సార్థకత లభిస్తుందన్నారు. అమరుల కుటుంబాల కు అనుకున్న స్థాయిలో న్యాయం జరగడం లే దని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై ఇటువంటి పరిస్థితి ఉండబోదని, వారి సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. నివాళ్లు.. కన్నీటి ధారలు కలెక్టర్, ఎస్పీల స్థాయి నుంచి ఒక్కొక్కరుగా పోలీసుల అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పిస్తున్నారు. వారి సేవలను స్మరించుకుంటున్నారు. త దుపరి అమరవీరుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల వంతు వచ్చింది. స్థూపం వద్దకు వెళ్లిన వారందరూ అశ్రు నివాళులర్పిం చారు. ఇలా ఒకరివెంట ఒకరు తమ వారిని గుర్తు చేసుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు. వీరిని చూసిన వారి కళ్లల్లోనూ నీళ్లు తిరిగాయి. దీంతో అక్కడి వాతావరణం ఒక్కసారిగా బరువెక్కింది. నిశ్శబ్దం ఆవహించింది. అందరి మదిలోనూ వారి త్యాగాలే మెలిగాయి. భారీ ర్యాలీ అమరవీరుల త్యాగాలు స్మరిస్తూ పోలీసు అధికారులు, పోలీసులు, విద్యార్థులు నల్లగొండ పట్టణంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. హెడ్క్వార్టర్స నుంచి గడియారం సెంటర్, ప్రకాశంబజార్, పాత కలెక్టరేట్ మీదుగా తిరిగి హెడ్క్వార్టర్స వరకు ర్యాలీ కొనసాగింది. ప్లకార్డులు ప్రదర్శిస్తూ ‘పోలీసు అమరవీరులకు.. జోహార్లు’ అంటూ నినదిస్తూ ముందుకు కదిలారు. కార్యక్రమంలో ఓఎస్డీ సయ్యద్ రియాజ్ బేగ్, డీఎస్పీ విజయ్‌కుమార్, ఇన్స్పెక్టర్లు లక్ష్మణ్, మనోహర్‌రెడ్డి, రవి, శ్రీనివాసులు, శాంతి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కానిస్టేబుల్ ఎంఏ కరీంకు పూర్తి వేతనం నక్సల్స్ దాడిలో తీవ్ర గాయాలపాలైన కానిస్టేబుల్‌కు పూర్తి వేతనాన్ని ఎస్పీ డాక్టర్ ప్రభాకర్‌రావు సోమవారం అందజేశారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఎస్పీ చే తుల మీదుగా నాలుగేళ్ల వేతనాన్ని కరీం అందుకున్నారు. 2006 ఆగస్టులో ఆత్మకూరు(ఎం) పోలీస్‌స్టేషన్‌పై నక్సల్స్ దాడి ఘటనలో తీవ్రగాయాలపాలైన కానిస్టేబుల్ కరీంను కలెక్టర్ పరామర్శించారు. అప్పటి ఘటన గురించి ఆయనను అడిగి తెలుసుకున్నారు. బహుమతుల ప్రదానం పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన పోలీసులకు, విద్యార్థులకు ఎస్పీ, జేసీ హరిజవహర్‌లాల్ ప్రశంసపత్రాలు అందజేశారు. ఎస్ఐలు డి.వెంకటేశ్వర్లు (మొదటి), ఎన్.విజయ్ ప్రకాశ్ (ద్వితీయ), వి.నారాయణరె డ్డి (తృతీయ) బహుమతులు సాధించారు. అలాగే ఏఎస్ఐ, ఆర్ఎస్ఐ, పీసీలు రాంచందర్ రాజు, పి. బచర్, కె.రేవతిలు ప్రశంసపత్రాలు అందుకున్నారు. వక్తృత్వ పోటీల్లో విజేతులుగా నిలిచిన విద్యార్థులు లాస్య, ప్రవళిక, అఖిల, యశ్వంత్ కుమార్, బాలమనోజ్, సంతోష్‌రెడ్డి, నిశిత తదితరులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. -
అమరవీరుల త్యాగాలు మరువలేనివి
నెల్లూరు(క్రైమ్), న్యూస్‌లైన్ : దేశ సరిహద్దుల్లో, సమాజంలో శాంతి, భద్రతల పరిరక్షణలో అసువులు బాసిన అమరవీరుల త్యాగాలు మరువలేనివని రాష్ట్ర ఆర్థిక శాఖ మం త్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నా రు. వారి ఆశయసాధనకు అంద రం సమష్టిగా కృషిచేద్దామని మంత్రి పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో స్థానిక పోలీసు పరేడ్‌గ్రౌండ్‌లోని ఉమేష్‌చంద్ర మెమోరియల్ కాన్ఫరెన్స్ హాలులో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ దేశ సరిహద్దుల్లో ఉన్న జవాన్లు యుద్ధం వచ్చినపుడే పోరాడుతారని, పోలీసులు సమాజంలో శాంతి, భద్రతల పరిరక్షణకు ప్రతి నిత్యం పోరాడుతూనే ఉంటారన్నారు. పోలీసు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందన్నారు. విధి నిర్వహణలో అమరులైన పోలీసు కుటుంబాలకు పోలీసు సంక్షేమ నిధి నుంచి సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. గతంలో బాధిత కుటుంబ సభ్యులకు ఇచ్చే నష్టపరిహారం, రాయితీని పెంచామన్నారు. జిల్లా పోలీసు కార్యాలయ నూతన భవనం, పోలీసుస్టేషన్లు, పోలీ సు సిబ్బంది క్వార్టర్లను నిర్మించేందు కు చర్యలు తీసుకుంటామన్నారు. ఎస్పీ పీవీఎస్ రామకృష్ణ మాట్లాడుతూ అవినీతి, అక్రమాలకు దూరంగా ఉం టూ సమాజంలో మెరుగైన శాంతి, భద్రతలను ప్రజలకందించడమే అమరులకిచ్చే నిజమైన నివాళి అన్నారు. జిల్లా ఏఆర్ అదనపు ఎస్పీ ఐఆర్ఎస్ మూర్తి విధి నిర్వహణలో ఈ ఏడాది మృతి చెందిన అమరవీరుల పేర్లను చదివి వారికి నివాళులర్పించారు. అనంతరం అమరవీరుల చిత్రపటాలకు మంత్రి, కలెక్టర్, ఎస్పీ, ఎమ్మెల్యేలు అధికారులు పూలమాలలు వేశారు. నివాళులు పోలీసు పరేడ్‌గ్రౌండ్‌లోని అమరవీరుల స్థూపానికి మంత్రి ఆనంతో పాటు కలెక్టర్ ఎన్.శ్రీకాంత్, ఎస్పీ పీవీఎస్ రామకృష్ణ, ఎంఎల్సీ విటపు బాలసుబ్రహ్మణ్యం, నెల్లూరు నగర, వెంకటగిరి, కావలి ఎమ్మెల్యేలు శ్రీధరకృష్ణారెడ్డి, రామకృష్ణ, మస్తానరావు, పోలీసు అధికారులు నివాళులర్పిం చారు. అనంతరం అమరవీరుల స్మృ త్యర్థం స్మృతి పరేడ్ నిర్వహించారు. అనంతరం పరేడ్‌గ్రౌండ్ నుంచి గాంధీబొమ్మ వరకు ర్యాలీ నిర్వహించారు. గాంధీవిగ్రహానికి పూలమాలలు వేసి అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటిం చారు. బహుమతుల ప్రదానం అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన వివిధ పోటీల్లో గెలుపొందిన విజేతలకు మంత్రి, కలెక్టర్ బహుమతులు ప్రదానం చేశారు. 300: అమరవీరుల స్థూపం వద్ద నివాళి అర్పిస్తున్న మంత్రి 302: సభలో మాట్లాడుతున్న ఎస్పీ 303: అమరవీరులకు నివాళి అర్పిస్తున్న పోలీసు సిబ్బంది 304: మంత్రి చేతుల మీదుగా బహుమతి అందుకుంటున్న ఆర్ఐ శ్రీనివాసరావు, 305: జోరు వానలో ర్యాలీ నిర్వహిస్తున్న పోసులు -
తెలంగాణ అమరుల కుటుంబాలను ఆదుకోవాలి
మంచిర్యాల టౌన్, న్యూస్‌లైన్ : నెల రోజుల్లో ఆవిర్భావం కానున్న ప్రత్యే క తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో తెలంగాణ కోసం ప్రాణాలు బలిదానం చేసిన అమరుల కుటుంబాలను ఆదుకోవాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ స్ప ష్టం చేశారు. ఆదివారం మంచిర్యాలలోని నిర్మాణ రంగ భవనంలో ఏర్పాటు చేసిన ‘అమరుల తల్లుల కడుపుకోత సదస్సు’కు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మొదట అమరవీరు ల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మంద కృష్ణమాదిగ మాట్లాడుతూ, కొంత మంది సీమాంధ్ర నాయకులు రక్షణ కల్పించాలని కేంద్రానికి చేస్తున్న విజ్ఞప్తుల మేరకు కేంద్ర మంత్రులు వత్తాసు పలుకుతున్నారని అలాంటి హామీలు చేస్తే సహించేది లేదని తెలిపారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరుతున్న తరుణంలో తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి అమరుల కుటుంబాలను ఆదుకునేలా వారికి అండగా నిలిచేలా ఫైల్‌పై మొదటి సంతకం చేయాలని తెలి పారు. నెక్లెస్ రోడ్ లో ప్రపంచ స్థాయిలోనే ప్రత్యేక సందర్శన స్థలంగా తీర్చిదిద్దే లా భారీ అమరవీరుల స్థూపాన్ని ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ఇక అమరవీరులకు సంబంధించిన ఆయా గ్రామాల్లో అమరవీరుల భవనాన్ని ఏర్పాటు చేసి అం దులో అమరుల చరితను భావితరాలకు తెలిపేలా గ్రంథాల యాల్లో పుస్తకాలను అందుబాటులో ఉంచాలని సూచిం చారు. దీంతోపాటు అమరవీరుల కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకునేలా వారికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా, 5 ఎకరాల సాగు భూమి, తల్లిదండ్రులకు నెలకు రూ.5 వేల పింఛన్, కుటుం బంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగ సౌకర్యం కలిపించాలని డి మాండ్ చేశారు. అమరవీరుల కుటుంబాలకు అండగా నిలి చేలా నవంబర్ 10వ తేదీన హైదరాబాద్‌లో తలపెట్టిన తెలంగాణ అమరవీరుల తల్లుల కడుపుకోత మహాసభకు అమరవీ రుల కుటుంబాల సభ్యులు తెలంగాణవాదులు, యువతీ, యువకులు భారీ సం ఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సదస్సులో ఎమ్మార్పీఎస్ నాయకులు రేగుంట సునీల్, దశరథం, కలమడుగు సత్తయ్య, మోతె పోచయ్య, నక్క అంజయ్య, నరేశ్‌మాదిగ పాల్గొన్నారు. -
పోలీస్ అమరవీరుల సేవలు మరువలేనివి
కోరుకొండ, న్యూస్‌లైన్ : శాంతి భద్రతల కోసం ప్రాణ త్యాగాలు చేసిన పోలీసు ఆమరవీరుల సేవలు మరువలేనివని కోరుకొండ ఉత్తర మండలం డీఎస్పీ జి.మురళీకృష్ణ అన్నారు. కోరుకొండలో పోలీసుస్టేషన్లో శనివారం పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ సభ జరిగింది. ముందు గా స్థానిక శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆల యం నుంచి ర్యాలీ జరిగింది. కోరుకొం డ, గోకవరం, సీతానగరం మండలాలు నుంచి విద్యార్థులు, పోలీసు అధికారులు, సిబ్బంది, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం శ్రీవల్లీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కళా మందిర్‌లో సీఐ వైవీ రమణ అధ్యక్షతన సభ జరిగింది. పోలీసు అమరవీరుల చిత్ర పటానికి డీఎస్పీ జి.మురళీకృష్ణ పూలమాలాలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో డీఎస్పీ మాట్లాడుతూ రాజమండ్రి అర్బన్ జిల్లా ఎస్పీ టి.రవికుమార్‌మూర్తి ఆధ్వర్యంలో మూడు మండలాల్లో విద్యార్థులకు వివిధ పోటీ పరీక్షలు నిర్వహించామన్నారు. శాంతి పరిరక్షణకు ప్రతి ఒక్కరు పోలీసులకు సహకరించాలన్నారు. సీఐ వైవీ రమణ, కోరుకొండ తహశీల్దార్ కె.పోసయ్య, గోకవరం ఎంపీడీఓ నాతి బుజ్జి, మండల వైఎస్సార్ సీపీ కన్వీనర్ చింతపల్లి చంద్రం, కోరుకొండ గ్రామ సర్పంచ్ కటకం అన్నపూర్ణచలం, మాజీ సర్పంచ్ వాకా నరసింహరావు, పంచాయతీ వార్డు సభ్యులు పరస శ్రీను. మైరెడ్డి రాంబాబు, కర్రి గణేష్, కోరుకొండ, గోకవరం, సీతానగరం ఎస్సైలు బి. వెంకటేశ్వరరావు, జీవీ నాగేశ్వరరావు, సీహెచ్ రాజశేఖర్ తదితరులు ప్రసంగించారు. వివిధ పాఠశాలల విద్యార్థులు, అధ్యాకులు పాల్గొన్నారు. -
అమరవీరులకు నివాళి
నాందేడ్, న్యూస్‌లైన్: నాందేడ్‌లో మంగళవారం 65వ ‘మరాఠ్వాడా ముక్తిసంగ్రామ్ దివస్’ను పురస్కరించుకొని నాందేడ్-వాఘాలా మున్సిపల్ కార్పొరేషన్ (ఎన్వీఎంసీ) ఆధ్వర్యంలో ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు. మేయర్ అబ్దుల్ సత్తార్ ఉదయం 8.05 గంటలకు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి జిల్లాపరిషత్ అధ్యక్షుడు దిలీప్ పాటిల్, డిప్యూటీ మేయర్ ఆనంద్ చవాన్, స్థాయి సమితి సభాపతి గణపత్ ధబాలే, సభాగృహ నేత వీరేంద్రసింగ్ గాడీవాలే, మహిళా-శిశు సంక్షేమ సమితి సభాపతి డాక్టర్ శీలా కదమ్, కార్పొరేటర్ రామ్‌నారాయణ్ కాబరా తదితరులు కార్యక్రమానికి హాజరయ్యారు. ఇదిలా ఉండగా, అంతకుముందు మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ స్థానిక అమరవీరుల స్థూపం వద్ద అమరవీరులకు నివాళులర్పించారు.