
హిమాయత్‌నగర్: దేశంలోని కొన్ని కార్పొరేట్ శక్తులకు లాభాలు అందించే సరుకుగా విద్యుత్ మారిందని పలువురు వక్తలు వ్యాఖ్యానించారు. బషీర్‌బాగ్ దేశోద్ధారక భవన్‌లో 7 వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో సోమవారం ‘2022 విద్యుత్ సవరణ బిల్లును వ్యతిరేకిద్దాం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై మోపుతున్న విద్యుత్ భారాలను ఎండగడదాం’అనే అంశంపై రాష్ట్ర సదస్సును నిర్వహించారు.
అంతకముందు బషీర్‌బాగ్ విద్యుత్ కాల్పుల్లో మృతి చెందిన అమరులకు నివాళులర్వించారు. ఎంసీపీఐ (యు) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి, సీపీఐ(ఎంఎల్) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చలపతిరావు, రాష్ట్ర కార్యదర్శి ప్రసదన్న, ఎస్‌యూసీఐ(సీ) రాష్ట్ర కార్యదర్శి మురగరి, ఆర్‌ఎస్‌పీ రాష్ట్ర కార్యదర్శి జానకి రాములు, ఏఐఎఫ్‌బీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రసా ద్ పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యుత్ సవరణ బిల్లు–2022 అనే ది కేవలం కార్పొరేట్ శక్తులకు మాత్రమేనన్నారు.ఈ బిల్లు వల్ల విద్యుత్ చార్జీలు సామన్య వినియోగ దారులకు అందుబాటులో లేనివిధంగా పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే పేదప్రజలు, రైతులు, ప్రజా వినియోగ రంగాలకు ఇచ్చే సబ్సిడీలు క్రమంగా రద్దు అవుతున్నాయన్నారు.
ప్రజా వ్యతిరేక విద్యుత్ సవరణ బిల్లు–2022ను ఉపసంహరించుకోవాలని,విద్యుత్ చట్టం–2003ను రద్దు చేయాలని, ప్రీపెయిడ్ మీటర్ల యోచనను విరమించుకోవాలని, 100 యూనిట్లు లోపు గృహవినియోగదారులకు విద్యుత్ ఉచితంగా ఇవ్వాలంటూ ఈ సదస్సు ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎంసీపీఐ(యూ) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వనం సుధాకర్, సుకన్య, తేజ, భరత్, హేమలత పాల్గొన్నారు.