
ఆమ్‌ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్‌పై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై పిటిషన్ దాఖలైన క్రమంలో ఆయనపై కేసు నమోదు చేయాలని ఇటీవల ఢిల్లీ కోర్టు ఆదేశాలు చేయగా,
ఢిల్లీ: ఆమ్‌ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్‌పై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై పిటిషన్ దాఖలైన క్రమంలో ఆయనపై కేసు నమోదు చేయాలని ఇటీవల ఢిల్లీ కోర్టు ఆదేశాలు చేయగా, పోలీసులు ఆయనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ మేరకు పోలీసులు కోర్టుకు రిపోర్ట్‌ను సమర్పించారు.
ఈ కేసుకు సంబంధించిన విచారణ జరుగుతోందని, మరింత సమయం కావాలని కోర్టుకు పోలీసులు విజ్ఞప్తి చేశారు. దీంతో తదుపరి విచారణను ఏప్రిల్ 18కి కోర్టు వాయిదా వేసింది. కాగా, 2019లో ద్వారకలో భారీ హోర్డింగ్‌లు ఏర్పాటుకు నిధులు దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ ఢిల్లీ రౌజ్‌అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ వ్యవహారంలో కేజ్రీవాల్ సహా ఇతర నాయకులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ పిటిషనర్ న్యాయస్థానాన్ని కోరారు. ఆ అభ్యర్థనకు ఢిల్లీ కోర్టు అంగీకారం తెలిపింది. కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రోసిజర్ సెక్షన్ 156(3) కింద దరఖాస్తును అనుమతించాల్సిన అవసరం ఉందని ఈ కోర్టు అభిప్రాయపడింది.
ఢిల్లీ ప్రివెన్షన్ ఆఫ్ డిఫేస్‌మెంట్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్, 2007లోని సెక్షన్ 3 కింద నమోదు చేయాలని కోర్టు పేర్కొంది. అక్రమ హోర్డింగ్‌లు కూలిపోవడం వల్ల గతంలో మరణాలు నమోదయ్యాయని, అందువల్ల కఠిన చర్యలు అవసరమని కోర్టు నొక్కి చెప్పింది. వెంటనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ఎస్‌హెచ్‌వోను ఆదేశించినట్లు అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ నేహా మిట్టల్ తన తీర్పులో పేర్కొన్నారు. 2019లో దాఖలైన ఫిర్యాదులో కేజ్రీవాల్, కొందరు నేతలు ఆ ప్రాంతం అంతటా భారీ హోర్డింగ్‌లను ఏర్పాటు చేయడం ద్వారా ప్రజా నిధులను దుర్వినియోగం చేశారని ఆరోపించారు.