
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో తోటా యాక్ట్ అమలు చేయాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. యాక్ట్‌లో పలు మార్పులు చేసి.. అమలు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటికే యాక్ట్‌లో మార్పులు చేసి అమలు చేస్తున్న రాష్ట్రాల్లో పర్యటించాలని అధికారులను వైద్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. త్వరలోనే గుజరాత్‌తో సహా పలు రాష్ట్రాల్లో అధికారుల బృందం పర్యటించనుంది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో తోటా యాక్ట్‌లో మార్పు బిల్లును తెలంగాణ ప్రభుత్వం పెట్టనుంది. యాక్ట్‌లో మార్పు వల్ల కార్పొరేట్ ఆసుపత్రుల దందాకు అడ్డుకట్ట వేస్తామని ప్రభుత్వం చెబుతోంది.
రాష్ట్రంలో 1994 నాటి అవయవ మార్పిడి చట్టం ‘టీహెచ్‌ఓఏ’ (ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆఫ్ హ్యుమన్ ఆర్గన్స్ యాక్ట్)ను మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం గత పదకొండేళ్లుగా అమలు చేస్తూ వచ్చింది. దీంతో అవయవ మార్పిడి ఆశించిన స్థాయిలో జరగలేదు. కానీ ఇప్పుడు.. ఆ చట్టానికి సవరణలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం 2014లో తీసుకొచ్చిన ‘టీహెచ్‌ఓటీఏ–తోటా’ (ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆఫ్ హ్యుమన్ ఆర్గాన్స్ అండ్ టిష్యూస్ యాక్ట్) చట్టాన్ని అమల్లోకి తేవాలని నిర్ణయించింది. రాష్ట్రంలో ఈ చట్టాన్ని అమలు చేసేలా గత నెలలో శాసనసభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదించింది. దీంతో రాష్ట్రంలో మరింత పారదర్శకంగా, మానవ అవయవాల వ్యాపారాన్ని నిరోధించి, అవసరమైన వారికి చట్టబద్ధంగా, ఎక్కువ సంఖ్యలో అవయవ మార్పిడి జరిగేందుకు అవకాశం ఏర్పడింది.
అవయవ దానం ఎంతో ఉదాత్తమైనది. సంకల్ప బలం ఉంటే గానీ సాధ్యమయ్యే విషయం కాదు. కొంతమంది కళ్లు, మూత్రపిండాలు ఇతర అవయవాలు దానం చేస్తారు. దాతలు చనిపోయాక వాటిని తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. తమవారి ప్రాణాలు కాపాడేందుకు కుటుంబసభ్యులు కిడ్నీ దానం చేయడం కూడా అడపాదడపా జరుగుతుంటుంది. గతంలో అవయవ దానం అంటే చనిపోయిన వారి కళ్లు దానం చేయడమే అనుకునేవారు. కానీ పదేళ్లలో పెరిగిన అవగాహన వల్ల కళ్లతో పాటు ఇతర అవయవాల దానం కూడా పెరిగింది. అవయవ మార్పిడితో పునర్జన్మ పొంది ప్రాణాలు కాపాడుకుంటున్న వారి సంఖ్య ఏటా పెరుగుతోంది.
తాజాగా ‘తోటా’ అమలు తీర్మానంతో ఇది మరింత ఊపందుకునే అవకాశం ఏర్పడింది. గత పదేళ్లలో రాష్ట్రంలో అవయవాలను దానం చేసిన వారి సంఖ్య 1,594 కాగా.. ఎవరైనా చనిపోయిన తర్వాత, బ్రెయిన్ డెడ్ అయిన వారి నుంచి సేకరించిన కంటి కారి్నయా, గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు ఇతర అవయవాలను ట్రాన్స్ ప్లాంట్ చేయడం ద్వారా పన్నెండేళ్లలో ఏకంగా 6 వేల మంది పునర్జన్మ పొందారు. ఇంకా 3,823 మంది అవయవ మార్పిడి కోసం రాష్ట్ర ప్రభుత్వ ‘జీవన్‌దాన్’ కార్యక్రమం కింద నమోదు చేసుకున్నారు. దీనిని బట్టే రాష్ట్రంలో అవయవ దానం, అవయవ మార్పిడిపై ప్రజల్లో అవగాహన ఎంతగా పెరుగుతోందో స్పష్టమవుతోంది.