ఆగమైంది తెలంగాణ కాదు.. కేసీఆర్ కుటుంబం: సీఎం రేవంత్‌ | Telangana CM Revanth Counter To KCR Warangal Speech Again | Sakshi
Sakshi News home page

ఆగమైంది తెలంగాణ కాదు.. కేసీఆర్ కుటుంబం: సీఎం రేవంత్‌

Published Wed, Apr 30 2025 4:22 PM | Last Updated on Wed, Apr 30 2025 5:02 PM

Telangana CM Revanth Counter To KCR Warangal Speech Again

హైదరాబాద్‌, సాక్షి:  ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం బలంగా ఉండాలని, ప్రజా సమస్యలను ప్రస్తావించకుండా ఉత్త విమర్శలు చేస్తూ కాలయాపన చేయడం కాదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. బుధవారం శ్రీమహాత్మ బసవేశ్వర జయంతోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన బీఆర్‌ఎస్‌ను, ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

12వ శతాబ్దంలోనే సమాజంలో అనేక మార్పులకు పునాదులు వేసిన విప్లవకారుడు బసవేశ్వరుడు. ఆయన జయంతి రోజున పదోతరగతి ఫలితాలు విడుదల చేసుకోవడం సంతోషం. పరీక్షలు పాసైన విద్యార్థులందరికీ శుభాకాంక్షలు. బసవన్న స్ఫూర్తితో మా ప్రభుత్వం పనిచేస్తోంది. కుల, మత, లింగ వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన అభ్యుదయవాది బసవన్న. బసవేశ్వర స్ఫూర్తితోనే పంచాయతీ రాజ్ పార్లమెంటరీ వ్యవస్థను మనం తెచ్చుకున్నాం. ప్రతీ మనిషి గౌరవంగా బతికేలా ప్రభుత్వాలు ప్రణాళికలు రూపొందించాలి. పాలకపక్షం తీసుకునే నిర్ణయాలలో లోపాలను ఎత్తి చూపేందుకే ప్రతిపక్షం అనే వ్యవస్థ ఉంది. 

మొన్న ఒకాయన(కేసీఆర్‌ను ఉద్దేశించి..) వరంగల్ లో సభ పెట్టి కాంగ్రెస్‌ను విమర్శించిండు.   వాళ్లు రజతోత్సవాలు , విజయోత్సవాలు ఏర్పాటు చేసుకుంటే ఆర్టీసీ నుంచి బస్సులు ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం సహకరించింది. వరంగల్ సభలో మేం చేసిన మంచిని అభినందించి ప్రజా సమస్యలను అక్కడ ప్రస్తావించి ఉంటే నిజంగానే ప్రజలు ఆయన్ను అభినందించే వాళ్లు. ప్రభుత్వ జీతం తీసుకుంటూ అసెంబ్లీకి ఎందుకు రావడం లేదు?. ఇన్నాళ్లుగా ఆయన ఇంట్లో నుంచి కాలు కదపకుండా జీతభత్యాలు తీసుకున్నారు.. ఇది ఏ చట్టంలో ఉంది?. ప్రతిపక్ష నాయకుడిగా రూ. 65 లక్షలు, వాహనాలు, పోలీస్ భద్రత తీసుకున్నారు. మరి ఎందుకు ప్రతిపక్ష నాయకుడిగా పని చేయకుండా ఫామ్ హౌస్‌లో పడుకున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు

ఫామ్ హౌజ్‌లో పడుకుని ప్రజలకు ఏం సందేశం ఇవ్వదలచుకున్నారు?. సంక్షేమ పథకాలు ఆగిపోయాయని ఆయన మాట్లాడిండు. రైతు బంధు, ఆరోగ్యశ్రీ, ఉచిత కరెంటు, షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి వీటిలో ఏది ఆగిపోయింది?. మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చాం.. ఇవేవీ మీకు కనిపించడంలేదా?. మీరు ఏ మత్తులో తూగుతున్నారో మీకే తెలియాలి. కడుపు నిండా విషం పెట్టుకుని విద్వేష పూరితప్రసంగం చేసి ప్రజల్ని రెచ్చగొట్టి ఏం చేయాలనుకుంటున్నారు?

BRS సభకు ఎన్ని బస్సులు అడిగితే అన్ని ఇవ్వమని చెప్పాం

ప్రజలు విజ్ఞులు.. ఎవరేం చేశారో ప్రజలకు తెలుసు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు కేసీఆర్‌కు లేదు. పదేళ్లు ప్రజలు మెచ్చే పరిపాలన చేస్తాం. అభివృద్ధి, సంక్షేమ పథకాలపై చర్చ చేద్దాం రండి. ఏ అంశంపైన అయినా సరే చర్చకు సిద్ధం.  కాళేశ్వరం, ఉచిత బస్సు, రుణమాఫీ, రైతు బంధు, మేం ఇచ్చిన 60 వేల ఉద్యోగాలు, ఎస్సీ వర్గీకరణ, కులగణన వీటిలో దేనిపై చర్చ చేద్దాం చెప్పండి.. కేసీఆర్. చర్చకు మేం సిద్ధంగా ఉన్నాం.

కేసీఆర్ మాటల్లో.. కళ్ళల్లో విషం కనిపిస్తోంది. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ విలన్‌ ఎలా అవుతుంది?. పదేళ్లు దోచుకున్న మీకు కాంగ్రెస్‌ను విమర్శించే హక్కు లేదు. ఆగమైంది తెలంగాణ కాదు.. కేసీఆర్ కుటుంబం. వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రకు వెళ్లినట్లు కేసీఆర్ వరంగల్ వెళ్లారు. ఆయన వరంగల్ వెళ్లి పాపాలు కడిగేసుకున్నానుకుంటున్నారు.. కానీ అక్కడికి వెళ్లి అబద్ధాలు మాట్లాడి ఇంకో తప్పు చేశారు. వరంగల్ సభలో నా పేరు కూడా పలకలేకపోయారు

బసవేశ్వరుడి స్ఫూర్తితో ‘రాష్ట్ర ఆదాయం పెంచాలి.. పేదలకు పంచాలి’ అనే విధానంతో మా ప్రభుత్వం ముందుకు వెళుతున్నాం. ప్రజలకు మేలు చేయడమే మా పని… ప్రచారం చేయాల్సింది మీరే. మీరే మా బ్రాండ్ అంబాసిడర్లు’’ అని రేవంత్‌ అన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement