
హైదరాబాద్: జాతీయ కులగణనకి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకి అంటూ కేంద్ర హెంశాఖ మంత్రి బండి సంజయ్ విమర్శించారు. కులగణన చేపట్టాలనే కేంద్ర ప్రభుత్వం కేబినెట్ లో తీసుకున్న నిర్ణయం తమ ఘనతే అని చెప్పుకుంటున్న కాంగ్రెస్‌కు బండి సంజయ్ చురకలంటించారు. ‘కాంగ్రెస్ 50 ఏళ్ల పాలనలో జనాభా లెక్కల్లో కులగణనను చేర్చకపోవడమే నిదర్శనం. కులగణన చేయాలంటూ అన్ని పార్టీలు కోరినా పట్టించుకోని దుర్మార్గపు పార్టీ కాంగ్రెస్సే. మోదీ సర్కార్ నిర్ణయం కాంగ్రెస్ ఘనతేనని చెప్పడం సిగ్గుచేటు.
అదే నిజమైతే డూప్లికేట్ గాంధీల ఏలుబడిలో కులగణన ఎందుకు చేయలేదో సమాధానం చెప్పాలి. దేశవ్యాప్త కులగణన మోదీ సర్కార్ ఘనతే. రాష్ట్ర ప్రభుత్వ కులగణన సర్వే అంతా తప్పుల తడకే. కేసీఆర్ సమగ్ర సర్వేకు, రేవంత్ సర్కార్ సర్వేకు పొంతన లేకపోవడమే నిదర్శనం. కేంద్ర కులగణన అత్యంత శాస్త్రీయమైది. కులాల వారీగా జనాభా ఎంతో తేలిపోతోంది. జనాభా ఆధారంగా రిజర్వేషన్లలో న్యాయం జరుగుతుంది. రాజకీయాలకు అతీతంగా అందరూ సహకరించండి’ అని బండి సంజయ్ కోరారు.