
చింత చెట్టు చిగురు చూడు.. చిన్నదాని పొగరు చూడు అని పాత తెలుగు సినిమా పాట. చింత చిగురు రేటు చూడు.. ఆకాశాన్నంటున్న ధర చూడు అంటూ ఇప్పుడు పాడుకోవాల్సి వస్తోంది. ఎందుకంటే చింత చిగురు ధర అమాంతం పెరిగి ఆహార ప్రియులను కలవరపెడుతోంది. దాని రేటు మటన్ ధరతో పోటీ పడుతుండడంతో వినియోగదారులు చింత చిగురు (Chinta Chiguru) కొనడానికి జంకుతున్నారు. చింత చిగురు కూరలు ఈసారి కుదరకపోవచ్చని నిట్టూరుస్తున్నారు.
హైదరాబాద్: చింత చిగురు మార్కెట్‌లో రికార్డు స్థాయిలో ధర పలుకుతోంది. రోజు రోజుకీ చింత చిగురు పసిడి ధరలాగా పైకి ఎగబాకుతుందే తప్ప కిందకు దిగిరావడం లేదు. భాగ్యనగరంలో శని, ఆదివారాల్లో జరిగే వారాంతపు సంతల్లో కిలో చింతచిగురు రూ.650 పలికింది. కానీ, ఈ ధర మంగళవారం రూ.800 చేరుకుంది. అంత ధర పెట్టి కొనుగోలు చేయకలేక చాలామంది వినియోగదారులు వెనక్కి వెళ్లిపోతున్నారు.
వర్షాలు (Rains) లేక చింత చిగురు రావడం లేదని విక్రయదారులు పేర్కొంటున్నారు. ధరలు ఎక్కువగా ఉండటం, కొనుగోలుదారులు ఆసక్తిని కనబరచకపోవడంతో విక్రయదారులు చింత చిగురును అమ్మడానికి ముందుకు రావడం లేదు.
చదవండి: జీవామృత కేంద్రానికి రూ. లక్ష : కేంద్రం కొత్త మార్గదర్శకాలు తెలుసా?