
హైదరాబాద్, సాక్షి: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయిన కాళేశ్వరం ఈఎన్సీ భూక్యా హరిరామ్‌పై తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఆయన్ని సస్పెండ్ చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో ఆయనకు కోర్టు రిమాండ్ విధించడంతో చంచల్‌గూడ జైలులో ఉన్నారు.
ఏప్రిల్ 26వ తేదీ ఉదయం 6 గంటల నుంచి రాష్ట్రవ్యాప్తంగా హరిరామ్‌కు సంబంధించిన 14 ప్రాంతాల్లో ఏక కాలంలో సోదాలు చేసిన ఏసీబీ బృందాలు పలుచోట్ల భూములు, ఇతర ఆస్తులు ఉన్నట్టు గుర్తించాయి. ఇప్పటివరకు గుర్తించిన ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.250 కోట్లకు పైనే ఉంటుందని ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే స్వాధీనం చేసుకున్న ఆస్తుల పత్రాలను పరిశీలిస్తున్నారు.
హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో రెండు ఇండిపెండెంట్ గృహాలు, షేక్‌పేటలో ఒక విల్లా, కొండాపూర్‌లో ఒక విల్లా, మాదాపూర్‌లో ఒక ఫ్లాట్, నార్సింగిలో ఒక ఫ్లాట్, అమరావతిలో ఒక వాణిజ్య స్థలం, మర్కూక్ మండలంలో 28 ఎకరాల వ్యవసాయ భూమి, పటాన్‌చెరులో 20 గుంటల భూమి, బొమ్మలరామారంలో 6 ఎకరాల్లో మామిడి తోటతో కూడిన ఫామ్ హౌస్, కొత్తగూడెంలో నిర్మాణంలో ఉన్న ఒక భవనం, కుత్బుల్లాపూర్‌లో, మిర్యాలగూడలో స్థలాలు ఉన్నట్టు కీలక ఆధారాలను అధికారులు సేకరించారు.