
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ప్రభుత్వ స్థలాలు, చెరువుల పరిరక్షణే లక్ష్యంగా దూకుడుగా ముందుకెళ్తున్న హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) తన లోగో మార్చుకుంది. జల వనరుల శాఖను పోలి ఉండేలా కొత్త లోగోను అధికారులు రూపొందించారు. హైడ్రా అధికారిక సోషల్ మీడియా అకౌంట్‌ల్లో ఈ లోగోను ప్రొఫైల్ చిత్రంగా పెట్టి అప్‌డేట్ చేసింది. ఈ లోగోను తెలంగాణ సర్కార్ అధికారికంగా ఆమోదించింది. హైడ్రా కార్యాలయంతో పాటు సిబ్బంది యూనిఫాం, వాహనాలపై కొత్త లోగోను ముద్రించనున్నారు.
కాగా, ప్రభుత్వ స్థలాలు, చెరువులు, పార్కులు, నాలాల ఆక్రమణలను అడ్డుకోవడమే లక్ష్యంగా జాతీయ రిమోట్ సెన్సింగ్ కేంద్రం (ఎన్‌ఆర్‌ఎస్‌సీ)తో హైడ్రా చారిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకుంది. ఎన్‌ఆర్‌ఎస్‌సీ వద్దనున్న ఉపగ్రహ చిత్రాలు, ఇతరత్రా భూ వివరాలను ఉపయోగించుకుని చెరువుల పూర్తిస్థాయి నీటి మట్టం(ఎఫ్‌టీఎల్), బఫర్ జోన్‌లను నిర్ధారించడమే ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశం. అందుకు సంబంధించిన పరస్పర అవగాహన ఒప్పందం (ఎంఓయూ)పై హైడ్రా కమిషనర్ ఏ.వి.రంగనాథ్, ఎన్‌ఆర్‌ఎస్‌సీ సంచాలకుడు డాక్టర్. ప్రకాశ్ చౌహాన్ బాలానగర్‌లోని ఎన్‌ఆర్‌ఎస్‌సీలో సంతకాలు చేశారు.