సాక్షి, హైదరాబాద్: ప్రతి సోమవారం బుద్ధ భవన్ వేదికగా నగర ప్రజల నుంచి ఫిర్యాదులు, సలహాలు స్వీకరించాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ పార్కులు, స్థలాలు, చెరువులకు సంబంధించి ఆక్రమణలపై నేరుగా ప్రజల నుండి ఫిర్యాదుల స్వీకరించనున్నారు. ప్రతి సోమవారం ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 5:30 గంటల వరకు ప్రజావాణి నిర్వహించనున్నారు. ప్రజావాణిలో ఫిర్యాదుదారులు ఆధారాలతో సహా రావాలని హైడ్రా కమిషనర్ సూచించారు. మొదటగా వచ్చిన 50 మంది ఫిర్యాదు దారులకు టోకెన్స్ ఇచ్చి.. ప్రాధాన్యతా క్రమంలో ఫిర్యాదులు స్వీకరిస్తామని తెలిపిన రంగనాథ్ వెల్లడించారు.
ఐఎస్‌బీ మేగజైన్‌లో ‘హైడ్రా’
రాజధానిలోని జలవనరుల పరిరక్షణ కోసం ఏర్పాటైన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ) రికార్డుల్లోకి ఎక్కింది. ఈ సంస్థకు చెందిన ‘ఐఎస్‌బీ ఎగ్జిక్యూటివ్ ఎడిషన్’ డిసెంబర్–2024 మేగజైన్‌లో హైడ్రాపై వ్యాసం ప్రచురితమైంది. పబ్లిక్ పాలసీ విభాగంలో ‘హైదరాబాద్స్ హైడ్రా: ఎన్ ఎక్సర్‌సైజ్ ఇన్ అర్బన్ వాటర్ బాడీ రిక్సామ్‌నేషన్’ శీర్షికన దీన్ని ప్రచురించింది. తన అధికారిక వెబ్‌సైట్‌లోనూ ఈ వ్యాసాన్ని అందుబాటులో ఉంచింది.
దాదాపు ఏడు వేల జలవనరులతో సిటీ ఆఫ్ లేక్స్‌గా పేరున్న హైదరాబాద్‌లో ప్రస్తుత పరిస్థితి, దానికి కారణాలను ఈ వ్యాసం వివరించింది. గతేడాది జూలై 19న హైడ్రా ఏర్పడిన తర్వాతి పరిస్థితులు, చెరువుల పునరుద్ధరణకు తీసుకుంటున్న చర్యలను అభినందించిన ఈ వ్యాసం, హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ జలవనరుల పరిరక్షణకు కృషి చేస్తున్నారని కితాబిచ్చింది. జనావాసాల జోలికి వెళ్లకుండా చెరువుల పరిరక్షణ చేపట్టాలంటూ హైడ్రా తీసుకున్న పాలసీ నిర్ణయాన్ని ఐఎస్‌బీ వ్యాసం అభినందించింది.
ఇదీ చదవండి: హెచ్‌ఎంపీవీ వైరస్‌పై తెలంగాణ సర్కార్ అలర్ట్
జల వనరుల ఆక్రమణ, అవి కనుమరుగు కావడం, కాలుష్య కోరల్లో చిక్కుకోవడం తదితర సమస్యలు దేశ వ్యాప్తంగా ఉన్నాయని, ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాలు హైడ్రా తరహా వ్యవస్థల్ని ఏర్పాటు చేసుకోవాలని ఐఎస్‌బీ తన వ్యాసంలో సూచించింది. తెలంగాణకు చెందిన పాలకులు, అధికారులు హైడ్రాకు మరింత చేయూత ఇవ్వాలని అభిప్రాయపడింది.
Comments
Please login to add a commentAdd a comment