prajavani
-
‘ప్రజావాణి’ సంగతి ఏమిటి?
సాక్షి, హైదరాబాద్: ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజల నుంచి వస్తున్న దరఖాస్తులను ఏ విధంగా పరిష్కరిస్తున్నారని, ఈ దరఖాస్తుల పరిష్కారానికి అధికారుల వద్ద ఉన్న వ్యవస్థ ఏమిటని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రశ్నించారు. ప్రజల సమస్యలను పరిష్కరించే క్రమంలో జిల్లాల కలెక్టర్లు, ఆయా శాఖల ఉన్నతాధికారుల స్పందనను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఆదివారం సచివాలయంలో ప్రజావాణి దరఖాస్తులపై ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జి. చిన్నారెడ్డితో కలసి ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి.. అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఇప్పటివరకు ఎన్ని దరఖాస్తులు, ఏయే శాఖల వారీగా వచ్చాయి, ఎన్ని పరిష్కరించారన్న దానిపై అధికారులను అడిగారు. ప్రతి దరఖాస్తును పరిష్కరించే క్రమంలో అసలేం జరుగుతుందని అధికారులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రశ్నించారు. ఇందుకు నోడల్ అధికారిణి దివ్య దేవరాజన్ సమాధానమిస్తూ, తొలుత ఫిర్యాదు రాగానే దరఖాస్తుదారుని మొబైల్‌కు ఎస్ఎంఎస్ పంపుతామని, ఆ తర్వాత పరిష్కారం అయిన వెంటనే ఎస్ఎంఎస్ ద్వారానే సమాచారమిస్తామని వెల్లడించారు. అయితే, సదరు దరఖాస్తు పరిష్కారం ఏ దశలో ఉందో తెలుసుకునే వ్యవస్థ లేదని, ఈ నేపథ్యంలో అలాంటి వ్యవస్థ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. త్వరలోనే కొత్త రేషన్‌కార్డులు.. ప్రజావాణిలో భాగంగా కొత్త రేషన్‌కార్డుకోసం దరఖాస్తులు, పింఛన్లు, ధరణికి సంబంధించిన ఫిర్యాదులే ఎక్కువ సంఖ్యలో వస్తున్నాయని అధికారులు డిప్యూటీ సీఎం భట్టికి వివరించారు. దీనిపై స్పందించిన భట్టి మాట్లాడుతూ.. రేషన్‌కార్డుల జారీకి సంబంధించి ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసిందని, త్వరలోనే నిర్ణయం తీసుకుని కొత్త రేషన్‌కార్డులు మంజూరు చేస్తామని వెల్లడించారు. కొత్త పింఛన్లను కూడా త్వరలోనే మంజూరు చేసే అవకాశముందన్నారు. మహిళలకు కేవలం కుట్టుమెషీన్లు ఇస్తే సరిపోదని, శిక్షణ కూడా ఇవ్వాలని, ఇందుకోసం అవసరమైతే ఆర్థిక సాయం చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ డెసు్కలను బలోపేతం చేయాలని, తద్వారా ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) కోసం దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య తగ్గుతుందని చెప్పారు. జీరో విద్యుత్ బిల్లులు జారీ చేసే మండలస్థాయి సిబ్బందికి శిక్షణ ఇచ్చే అంశాన్ని కూడా పరిశీలిస్తామని వెల్లడించారు. అవసరమైతే పాలసీ మార్చుకుందాం ప్రజావాణిలో వచ్చే దరఖాస్తుల్లో పరిష్కారానికి అవకాశమున్న ప్రతి ఫిర్యాదును పరిష్కరించాల్సిందేనని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులకు సూచించారు. ఇందుకోసం ప్రభుత్వ విధానాల్లో ఏవైనా మార్పులు చేయాల్సి వస్తే రాతపూర్వకంగా నివేదిస్తే సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామని స్పష్టం చేశారు. ప్రతి మూడు నెలలకోసారి ప్రజావాణి దరఖాస్తులపై సమీక్ష నిర్వహిస్తామని వెల్లడించారు. ప్రజావాణి విభాగంలో పనిచేసేందుకు పూర్తిస్థాయి సిబ్బందిని కేటాయించాలని, మౌలిక సదుపాయాలు కల్పించాలని నోడల్ అధికారి దివ్య కోరగా, ఇందుకు స్పందించిన భట్టి తగినవిధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రైతు నుంచి అభినందన లేఖ.. ప్రజావాణిలో వచి్చన ఫిర్యాదులను వీలున్నంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని నోడల్ అధికారి దివ్య వెల్లడించారు. తన వ్యవసాయ భూమిలో విద్యుత్ వైర్లు వేలాడుతున్న విషయాన్ని ప్రజావాణి ద్వారా మహబూబ్‌నగర్‌కు చెందిన రైతు ఫిర్యాదు చేయగా, రెండు రోజుల్లో సమస్యను పరిష్కరించామని, ఇందుకు అధికారులను అభినందిస్తూ ఆ రైతు లేఖ రాసిన విషయాన్ని డిప్యూటీ సీఎం భట్టికి ఆమె వివరించారు. -
ప్రజా‘వాణి’ వినిపించదా?
సాక్షి, హైదరాబాద్: ఇబ్బంది ఏదైనా, పరిష్కార వేదిక ఏదైనా.. రాష్ట్రంలో రెవెన్యూ సమస్యలు మాత్రం పెండింగ్‌లోనే ఉండిపోతున్నాయి. భూసంబంధిత సమస్యలను త్వరితగతిన పరిష్కరించడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిపెట్టినా.. క్షేత్రస్థాయిలో మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. ఎక్కడికక్కడ ప్రజా సమస్యల అర్జీలు పేరుకుపోతూనే ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సీఎం ప్రజావాణికి వచ్చిన దరఖాస్తుల్లో రెవెన్యూ వర్గాలు పరిష్కరించినవి 30శాతం కూడా దాటలేదు. ప్రతి మంగళ, శుక్రవారాల్లో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో ఇప్పటివరకు రెవెన్యూ శాఖకు 13,513 దరఖాస్తులు రాగా.. అందులో పరిష్కారమైనవి 3,147 దరఖాస్తులు మాత్రమే. మిగతా 10,366 దరఖాస్తులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రెవెన్యూ శాఖకు వెళ్లే దరఖాస్తుల్లో ఎక్కువశాతం ధరణి సంబంధిత సమస్యలే ఉంటాయని.. కొన్నిచోట్ల పింఛన్లు, షాదీముబారక్, కల్యాణలక్ష్మి వంటి దరఖాస్తులు వచ్చాయని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. కేవలం విచారణతోనే సరి! ప్రజావాణి కింద వస్తున్న దరఖాస్తుల్లో ఎక్కువగా ధరణికి సంబంధించినవే ఉంటున్నాయని రెవెన్యూ వర్గాలు చెప్తున్నాయి. ధరణి పోర్టల్‌లో తమకు వచ్చిన లాగిన్ల ఆధారంగా సదరు దరఖాస్తులను పరిశీలించి, విచారణ జరిపి రిపోర్టు పంపించే అధికారం మాత్రమే తమకు ఉందని తహసీల్దార్ కార్యాలయాల సిబ్బంది స్పష్టం చేస్తున్నారు. నిజానికి ఈ దరఖాస్తులను విచారించేందుకు క్షేత్రస్థాయిలో సిబ్బంది కూడా లేరని.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఛిన్నాభిన్నమైన రెవెన్యూ వ్యవస్థ ఇంకా కోలుకోలేదని అంటున్నారు. మండలంలో ఉన్న ఒకరిద్దరు రెవెన్యూ ఇన్స్పెక్టర్లే (ఆర్ఐలే) ఈ దరఖాస్తులన్నింటినీ విచారించాల్సి వస్తోందని చెప్తున్నారు. విచారణ అనంతరం రిపోర్టులను పంపినా పైస్థాయిలో పరిష్కారం కావడం లేదని.. కొన్ని దరఖాస్తులు పరిష్కారమైనా ఆన్లైన్లో అప్డేట్ కావడం లేదని వివరిస్తున్నారు. తహసీల్దార్ల స్థాయిలోనే చాలా దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా.. పైస్థాయికి పంపిన వాటిని కలెక్టర్లు పట్టించుకోకపోవడంతో అక్కడా ఆగిపోతున్నాయని అంటున్నారు. నాలుగు జిల్లాల్లోనే కాస్త మెరుగు.. ‘సీఎం ప్రజావాణి’ దరఖాస్తుల గణాంకాలను పరిశీలిస్తే.. రాష్ట్రవ్యాప్తంగా నాలుగు జిల్లాల్లో మాత్రమే పరిష్కార కార్యక్రమం చురుగ్గా జరుగుతోంది. జగిత్యాల, కరీంనగర్, సంగారెడ్డి, సూర్యాపేట జిల్లాల్లో 80శాతానికిపైగా దరఖాస్తులను పరిష్కరించారు. ఆరు జిల్లాలు వరంగల్, హన్మకొండ, హైదరాబాద్, కామారెడ్డి, నాగర్‌కర్నూల్, భువనగిరి జిల్లాల్లో అయితే 100శాతం దరఖాస్తులు పెండింగ్‌లోనే ఉన్నాయి. అంటే ప్రజావాణి కార్యక్రమం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు ఆ జిల్లాల్లో ఒక్క రెవెన్యూ అర్జీ కూడా పరిష్కారం కాకపోవడం గమనార్హం. మిగతా జిల్లాల్లో మొక్కుబడిగా ప్రజావాణి దరఖాస్తుల పరిష్కార కార్యక్రమం జరుగుతోందన్న విమర్శలు ఉన్నాయి. సీఎం రేవంత్‌రెడ్డి సొంత జిల్లా మహబూబ్‌నగర్‌లో కూడా దరఖాస్తులు పెద్ద సంఖ్యలో పెండింగ్‌లో ఉండటం రెవెన్యూ యంత్రాంగం నిర్లిప్తతకు అద్దం పడుతోందన్న విమర్శలు వస్తున్నాయి. వారానికి వెయ్యి దాకా దరఖాస్తులు రాష్ట్రస్థాయిలో ప్రతి మంగళ, శుక్రవారాల్లో నిర్వహిస్తున్న ప్రజావాణికి వెయ్యి వరకు దరఖాస్తులు వస్తున్నాయి. అందులో రెవెన్యూ శాఖకు సంబంధించినవే ఎక్కువగా ఉంటున్నాయి. గత శుక్రవారం 494 దరఖాస్తులురాగా.. వీటిలో రెవెన్యూ శాఖకు సంబంధించి 125, హౌసింగ్ 43, పౌరసరఫరాల శాఖ 71, హోంశాఖ 45, పంచాయతీరాజ్ శాఖ 47, ఇతర శాఖలకు సంబంధించి 48 దరఖాస్తులు ఉన్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. -
నిరసనల ’ప్రజావాణి’
లక్డీకాపూల్: మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్‌లో మంగళవారం ప్రజావాణి కార్యక్రమం నిరసనలు, ఆందోళనల మధ్య సాగింది. లోక్‌సభ ఎన్నికల నియమావళి ముగిసిన తర్వాత పునఃప్రారంభమైన ప్రజావాణికి పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క హాజరై ప్రజల నుంచి అర్జీలు స్వీకరించడంతో పాటు వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తమకు అన్యాయం జరిగిందనీ, న్యాయం చేయాలంటూ వివిధ సంఘాల నేతలు ప్రజాభవన్ ఎదుట బైఠాయించారు. విధుల నుంచి తొలగించిన తమకు న్యాయం చేయాలంటూ పెద్దఎత్తున ఆర్టీసీ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. పెరిగిన డీజిల్, పెట్రోల్ ధరలకు అనుగుణంగా ప్యాకేజీ పెంచాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ డ్రైవర్స్ కం ఓనర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో పాత ప్యాకేజీపై వాహనాలు నడపడం చాలా కష్టమని, ప్యాకేజీని రూ.55 వేలకు పెంచాలని అసోసియేషన్ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంత్రి సీతక్కకు అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సి.రాజేశ్వరరావు, జి. దేవేందర్ వినతిపత్రాన్ని సమర్పించారు. తాను కొనుగోలు చేసిన భూమిని ధరణిలో నమోదు చేయకపోవడంతో కబ్జాకి గురైందంటూ మాజీ సీఆర్పీఎఫ్ ఉద్యోగి ఇమ్మడి సోమయ్య ఆందోళన వ్యక్తం చేశారు. ఇలా అన్ని విభాగాలకు సంబంధించి మొత్తం 702 దరఖాస్తులు నమోదయ్యాయి. రెవెన్యూ పరమైన సమస్యలకు సంబంధించి 219 దరఖాస్తులు, మున్సిపల్ శాఖకు సంబంధించి 54, హోం శాఖకు సంబంధించి 52, హౌసింగ్ శాఖకు సంబంధించి 44, పౌరసరఫరాల శాఖకు సంబంధించి 46, ఇతర శాఖలకు సంబంధించి 287 దరఖాస్తులు అందినట్లు ప్రజావాణి ప్రత్యేక అధికారి, మున్సిపల్ శాఖ సంచాలకులు దివ్య వెల్లడించారు. కార్యక్రమంలో ప్రజావాణి ఇంఛార్జి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జి.చిన్నారెడ్డి, ఆయా శాఖల సీనియర్ అధికారులు పాల్గొన్నారు. -
TS: ఉదయం 4.30కే మొదలైన ప్రజావాణి
సాక్షి, హైదరాబాద్: ప్రజా స్వీయ విజ్ఞప్తుల ద్వారా వాళ్ల సమస్యల పరిష్కారం కోసమంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజావాణి కార్యక్రమం కొనసాగిస్తోంది. ఈ కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా భారీగా స్పందన లభిస్తోంది. చలిని సైతం లెక్కచేయకుండా రాత్రంతా అక్కడే ఉంటున్నారు చాలామంది. ఈ నేపథ్యంలో శుక్రవారం ప్రజావాణి ఉదయం 4.30 నుంచే కార్యక్రమం మొదలు కావడం గమనార్హం. జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్ వద్ద ప్రజావాణికి ఫిర్యాదులతో వచ్చిన వాళ్లను క్యూ లైన్లో ఎక్కువ సేపు ఉంచడం లేదు. వాళ్లు ఇబ్బంది పడడమే కాకుండా.. ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతున్న పరిస్థితులు చూస్తున్నాం. ఈ నేపథ్యంలో వచ్చినవారిని వచ్చినట్లే క్యూ ద్వారా లోపలికి పంపిస్తున్నారు అధికారులు. ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకరణ కొనసాగుతోంది. ప్రజావాణిలో.. ఉద్యోగుల బదిలీలు, పెన్షన్లు విజ్ఞప్తులతోపాటు భూకబ్జాలు, డబుల్ బెడ్రూమ్ సమస్యలపై ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయి. -
TS:ప్రజావాణికి పోటెత్తిన ప్రజలు..ట్రాఫిక్ జామ్
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజావాణికి ప్రజల నుంచి భారీగా స్పందన వస్తోంది. వారానికి రెండు రోజులు మంగళ, శుక్రవారాల్లో ప్రజావాణి నిర్వహించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికే నిర్ణయించిన విషయం తెలిసిందే. దీంతో మంగళ, శుక్రవారాల్లో జ్యోతిరావ్ పూలే ప్రజాభవన్(గత ప్రగతిభవన్)కు భారీగా తరలివస్తున్నారు. ఈ వారంలో రెండోసారి జరిగే శుక్రవారం(డిసెంబర్15) ప్రజావాణి కోసం ప్రజలు పోటెత్తారు. ఉదయం 5 గంటలకే ప్రజాభవన్ ముందు క్యూ కట్టారు. ఈ క్యూ లైను తొమ్మిది గంటలకల్లా రెండు కిలోమీటర్లకుపైగా పెరిగిపోయింది. దీంతో బేగంపేట ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ప్రజావాణికి వచ్చిన వారిని క్రమపద్ధతిలో నిల్చోబెట్టి ఒక్కొక్కరిగా లోపలికి పంపడం పోలీసులకు కొంత టఫ్ టాస్క్‌గా మారింది. అయితే రాష్ట్రవ్యాప్తంగా సమస్యలు చెప్పుకునేందుకు ప్రజలందరూ హైదరాబాద్ ప్రజాభవన్కే రానవసరం లేకుండా ఎమ్మెల్యేలతో నియోజకవర్గాల్లోనూ ప్రజావాణి నిర్వహింపజేస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రజా వాణి నియోజకవర్గాల్లోనూ నిర్వహించడం వల్ల స్థానిక సమస్యలు ఎక్కడికక్కడే త్వరగా పరిష్కారమవడమే కాకుండా ప్రజలకు హైదరాబాద్ దాకా వచ్చే భారం తగ్గుతుంది. ప్రజాభవన్ వద్ద రద్దీ తగ్గి ఇక్కడి యంత్రాంగం మీద ఒత్తిడి తగ్గే అవకాశముంటుంది. ప్రజావాణిలో ఎక్కువగా భూముల సంబంధిత సమ్యలు, ధరణి, ఆరోగ్యం,నిరుద్యోగం అంశాలపైనే ఎక్కువ అర్జీలు వస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రజాదర్భార్ పేరుతో ప్రారంభమైన ప్రజావాణి కార్యక్రమానికి తొలిరోజు సీఎం రేవంత్‌రెడ్డి నేరుగా హాజరై ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఆ తర్వాత కార్యక్రమం పేరును ప్రజావాణిగా పేరుమార్చారు. అప్పటి నుంచి ఒక్కో రోజు ఒక్కో మంత్రి హాజరై ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఇప్పటివరకు ప్రజావాణికి మంత్రులు శ్రీధర్‌బాబు, కొండా సురేఖ హాజరయ్యారు. ఇదీచదవండి..TS: నేటినుంచి జీరో టికెట్ -
Prajavani: రెండున్నరేళ్లుగా మూగబోయిన ప్రజావాణి
సాక్షి, హైదరాబాద్: సాక్షాత్తు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో ప్రజల ఆవేదన వినేవారు లేకుండా పోయారు. గత రెండున్నరేళ్లుగా ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు ప్రభుత్వం నిర్వహించే ప్రజావాణి (గ్రీవెన్స్ సెల్) మూగబోయింది. కోవిడ్ నేపథ్యంలో జీహెచ్ఎంసీతోపాటు హైదరాబాద్ కలెక్టరేట్లలో 2020 మార్చి 17 నుంచి ప్రజావాణి కార్యక్రమం నిలిచిపోయింది. ఆ తర్వాత అదే ఏడాది ఆగస్టు 15 నుంచి ఈ–ఆఫీస్ ద్వారా కాగిత రహిత పాలనను చేపట్టారు. వివిధ సమస్యలపై వస్తున్న ప్రజల నుంచి నేరుగా కాకుండా దరఖాస్తులు ఆన్లైన్ ద్వారా, ఆ తర్వాత కలెక్టరేట్లోని ప్రవేశ ద్వారం వద్ద ప్రత్యేక బాక్స్ ఏర్పాటు చేసి దరఖాస్తులను స్వీకరించారు. కోవిడ్ వైరస్ ప్రభావం తగ్గినా... నేటికి గేటు వద్దనే మొక్కుబడిగా దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ఈ దరఖాస్తుల్లో కనీసం 10 శాతం కూడా సమస్యలు పరిష్కారం కావడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఆఫీసుల చుట్టూ చక్కర్లు నగర వాసులు తమ సమస్యల పరిష్కారానికి జీహెచ్ఎంసీ, మున్సిపల్ కలెక్టర్ రెవెన్యూ ఆఫీసుల నిత్యం ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. తమ సమస్యల పరిష్కారానికి దరఖాస్తులు ఎవరికి సమర్పించాలో తెలియని పరిస్ధితి నెలకొంది. సంబంధిత అధికారులు సైతం అందుబాటు లేక పోవడంతో వారిని పట్టించుకునేవారు కరువయ్యారు. దరఖాస్తులు సమర్పించినా... పరిష్కారమవుతుందన్న ఆశ కనిపించడం లేదు. దీంతో దళారులు, రాజకీయ నాయకులను ఆశ్రయించక తప్పడం లేదు. పెరిగిన పెండెన్సీ... ప్రభుత్వ పరంగా పేదలకు అందించే ఆసరా పింఛన్లు, కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ ఆర్ధిక చేయూత, సంక్షేమ రుణాలు, డబుల్ బెడ్రూమ్, సదరం సర్టిఫికేట్ తదితర దరఖాస్తులు పెండెన్సీ పెరిగిపోతోంది. దరఖాస్తుదారులు కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా ప్రయోజనం కనిపించడం లేదు. కనీసం ప్రజావాణి పునరుద్దరిస్తే అందులో తమ దరఖాస్తులకు పరిష్కారం లభించే అవకాశం ఉంటుందని పలువురు బాధితులు పేర్కొంటున్నారు. (క్లిక్ చేయండి: మన కార్లపై భారత్ సిరీస్ ఎప్పుడు? దీంతో లాభలేంటి..?) -
పింఛన్ తొలగించారని.. దివ్యాంగుడి ఆత్మహత్యాయత్నం
సాక్షి, యాదాద్రి/ కొండపాక(గజ్వేల్)/ సాక్షి, రంగారెడ్డిజిల్లా /మంచిర్యాల అగ్రికల్చర్: పింఛన్లు, డబుల్ బెడ్రూం ఇళ్లు, ఇతర పథకాలు అందడం లేదంటూ.. అధికారులు ఇబ్బందిపెడుతున్నారంటూ.. బాధితులు ఆందోళనకు దిగుతున్నారు. తమ బాధలు చెప్పుకొనేందుకు కలెక్టరేట్లలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాలకు వస్తున్నారు. తమ సమస్య ఎప్పుడు తీరుతుందోననే మనస్తాపంతో ఆత్మహత్యా యత్నాలు చేస్తున్నారు. సోమవారం పలు జిల్లా కలెక్టరేట్లలో నలుగురు ఇలాంటి ప్రయత్నాలు చేయడం కలకలం రేపింది. పింఛన్ తొలగించారంటూ.. దివ్యాంగుడు.. యాదాద్రి భువనగిరి జిల్లా హన్మాపురం గ్రామానికి చెందిన నాగపురి యాదగిరికి ఆగస్టులో ప్రభుత్వం వికలాంగుల పింఛన్ మంజూరు చేసింది. ఒక నెల పింఛన్ తీసుకున్న యాదగిరికి తర్వాతి నెలలోనే ఆపేశారు. తాను కృత్రిమకాలుతో నడుస్తున్నానని, భార్య కూలి పనిచేసి పోషిస్తోందని, తనకు పింఛన్ పునరుద్ధరించి ఆదుకోవాలని అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు. ఈ క్రమంలోనే యాదగిరి సోమవారం కలెక్టర్‌లో ప్రజావాణి కార్యక్రమానికి వచ్చాడు. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పింఛన్ పునరుద్ధరించడం లేదంటూ వెంట తెచ్చుకున్న పెట్రోల్ ఒంటిపై పోసుకుని నిప్పంటించుకోబోయాడు. ఇది గమనించిన కలెక్టర్ సీసీ సోమేశ్వర్, సిబ్బంది ఆయనను ఆపారు. ఆస్పత్రికి తరలించి, చికిత్స చేయించిన అనంతరం యాదగిరికి కౌన్సెలింగ్ చేసి ఇంటికి పంపించారు. అయితే యాదగిరి కుమారుడికి ట్రాక్టర్ ఉండటంతో పింఛన్ తొలగించినట్టు అధికారులు చెప్తున్నారు. భూమిని తమకు కాకుండా చేస్తున్నారంటూ.. మహిళ అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కవాడిపల్లికి చెందిన బి.జయశ్రీ తండ్రి సుర్వి భిక్షపతికి ఇదే రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 67లో 1.35 ఎకరాల భూమి ఉంది. ఆయన భూమిని ముగ్గురు కుమార్తెలకు రిజిస్ట్రేషన్ చేశారు. అయితే తమ భూమిపై రెండు రియల్ ఎస్టేట్ సంస్థలు కన్నేశాయని.. తాము విక్రయించబోమని చెప్తున్నా తహసీల్దార్ అనితారెడ్డితో కలిసి తీవ్రంగా ఒత్తిడి తెస్తున్నాయని జయశ్రీ అనే మహిళా రైతు రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు. ధరణి పోర్టల్‌లో భూమి వివరాలు మార్చి కాజేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. తహసీల్దార్ అనితారెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బ్లేడుతో చేతులు కోసుకున్నారు. అక్కడే ఉన్న పోలీసులు, కాంగ్రెస్ నేతలు ఆమెను అడ్డుకుని.. అదనపు కలెక్టర్ వద్దకు తీసుకెళ్లారు. ఈ అంశాన్ని పరిశీలించి, న్యాయం చేస్తామని అదనపు కలెక్టర్ తిరుపతిరావు హామీ ఇచ్చారు. దుకాణం ఖాళీ చేయాలని వేధిస్తున్నారంటూ.. యువకుడు మంచిర్యాల అగ్రికల్చర్: అద్దె దుకాణం తొలగించొద్దని మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం రొయ్యలపల్లి గ్రామానికి చెందిన కుమ్మరి సంతోష్ సోమవారం మంచిర్యాల కలెక్టరేట్ ఎదుట ఆత్మహత్యాయత్నం చేశాడు. ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునే క్రమంలో అక్కడే ఉన్న పోలీసులు అప్రమత్తమై అతడిపై నీళ్లు పోశారు. బాధితుడి వివరాల ప్రకారం.. చెన్నూర్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలోని దుకాణ సముదాయంలో ఓ షటర్‌ను పదేళ్లుగా అద్దెకు తీసుకుని టైర్ల దుకాణం నిర్వహిస్తున్నాడు. దుకాణం తొలగించాలని మూడు నెలల క్రితం ఎంపీడీవో, ఎంపీపీలు షటర్‌కు తాళం వేయించారు. ఎంపీ, ఎమ్మెల్యేకు గోడు వినిపించినా ఫలితం లేకపోయిందని పేర్కొన్నాడు. సోమవారం సాయంత్రానికి ఖాళీ చేయాలని చెప్పడంతో కలెక్టరేట్‌కు వచ్చానని తెలిపాడు. ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేయగా పోలీసులు నీళ్లు చల్లి అడ్డుకున్నారు. అదుపులోకి తీసుకుని ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం పోలీసు స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేశారు. సంతోష్‌పై నీళ్లు పోస్తున్న పోలీసులు ఇల్లు మంజూరైన అడ్డుకుంటున్నారని ఆత్మహత్య పురుగుల మందు తాగుతూ సెల్ఫీ వీడియో సిద్దిపేట జిల్లాలో కలకలం కొండపాక(గజ్వేల్): డబుల్ బెడ్ రూం ఇళ్ల అర్హుల జాబితాలో పేరు వచ్చాక కూడా కేటాయించకుండా అడ్డుకుంటున్నారని మనస్థాపానికి గురైన ఆటో డ్రైవర్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని కలెక్టరెట్ కార్యాలయం ఆవరణలో సోమవారం చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట పట్టణంలోని గణేశ్ నగర్లో నివాసం ఉంటున్న శీలసాగరం రమేశ్ ఆటో డ్రైవర్. పట్టణ శివారులో నిర్మించిన డబుల్ ఇల్లు కోసం భార్య లత పేరిట దరఖాస్తు చేసుకున్నాడు. మూడు పర్యాయాలు లబ్ధిదారుల జాబితాలో లత పేరు వచ్చింది. అయినా ఇల్లును కేటాయించలేదు. ఈ విషయమై పలుమార్లు అధికారులను అడిగినా ఫలితం లేకుండాపోయింది. దీంతో సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో ఫిర్యాదు చేశాడు. అర్హుల జాబితాలో పేరు ఉన్నా.. 26వ వార్డు కౌన్సిలర్ ప్రవీణ్ ఇల్లు రాకుండా అడ్డుకుంటున్నారంటూ ఆరోపణలు చేస్తూ పురుగుల మందు తాగుతున్న సెల్ఫీ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ క్రమంలోనే కలెక్టరెట్ ఆవరణలో ఉన్న వాహనాల పార్కింగ్ వద్ద పడిపోయాడు. వెంటనే అక్కడున్న స్థానికులు 108 అంబులెన్స్ సిబ్బంది మహేందర్, శ్రీనివాస్‌కు సమాచారం అందించారు. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని అపస్మారక స్థితిలో ఉన్న రమేశ్‌ను అంబులెన్సులో సిద్దిపేటలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడని అంబులెన్సు సిబ్బంది మహేందర్ తెలిపారు. మృతుడి భార్య లత ఇల్లు మంజూరైనా పట్టా ఇవ్వకుండా కౌన్సిలర్ ప్రవీణ్ అడ్డుకుంటుడటంతో డబ్బులు కూడా ఇచ్చామని ఆరోపించింది. తన భర్త మరణానికి కారణమైన వారిని అరెస్ట్ చేయాలని కన్నీరుమున్నీరుగా విలపిస్తూ వేడుకుంది. ఈ విషయమై ఎలాంటి ఫిర్యాదు అందలేదని సీఐ భాను ప్రకాష్ తెలిపారు. -
25 మంది అధికారులకు షోకాజ్ నోటీసులు
సాక్షి,సిటీబ్యూరో: ప్రజావాణి కార్యక్రమానికి అత్యధికంగా అధికారులు హాజరు కాకపోవడంతో కలెక్టర్ శ్వేతా మహంతి సీరియస్ అయ్యారు. ప్రజావాణికి హాజరు కాని సుమారు 25 మంది అధికారులకు షోకాజ్ నోటీసులు జారీకి ఆదేశాలిచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రతివారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి వివిధ శాఖల అధికారులు ఖచ్చితంగా హాజరు కావాల్సిందేనని అల్టిమేటం ఇచ్చారు. ఇక మీదట హాజరు కాకుంటే తీవ్ర చర్యలు తప్పవని హెచ్చరించారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమ ప్రాంగణానికి కలెక్టర్ చేరుకునే సరికి కనీసం పది మంది అధికారులు సైతం హాజరు కాకపోవడాన్ని తీవ్రంగా పరిగణించారు. మారని అధికారుల తీరు పాలనాధీశులు మారినా అధికారుల తీరు మాత్రం మారడం లేదు. గత రెండేళ్లుగా ప్రజావాణి కార్యక్రమం మొక్కుబడిగా సాగుతూ వచ్చింది. సాక్షాత్తూ పాలనాధీశులు ప్రజావాణి కార్యక్రమంపై పెద్దగా ఆసక్తి కనబర్చకపోవడంతో కింది స్థాయి సిబ్బందిని పంపించి జిల్లా స్థాయి అధికారులు గైర్హాజరవుతూ వచ్చారు. ప్రజావాణిలో ప్రజల సమస్యలు పరిష్కారం కాదు కదా.. అసలు వినేవారే కరువయ్యారు. కనీసం కార్యక్రమానికి సైతం సమయపాలన లేకుండా పోయింది. కొన్ని సార్లు కింద స్థాయి అధికారులు ప్రజావాణి కార్యక్రమాన్ని కొనసాగించగా, మరికొన్ని సార్లు అధికారుల కోసం అర్జీదారులకు పడిగాపులు తప్పలేదు. ప్రజావాణి కార్యక్రమంపై నమ్మకం సడిలి అర్జీదారుల సంఖ్య సైతం తగ్గుముఖం పడుతూ వచ్చింది. తాజాగా కలెక్టర్‌గా శ్వేతా మహంతి పాలనా పగ్గాలు చేపట్టడంతో కొంత ఆశలు చిగురించాయి. కానీ అధికారుల తీరు మారక పోవడంతో కలెక్టర్ కన్నెర్ర చేశారు. ప్రజావాణి ప్రత్యేకం.. కలెక్టర్ శ్వేతా మహంతికి ప్రజావాణి కార్యక్రమం అంటే ప్రత్యేక శ్రద్ధ . గతంలో పనిచేసిన ప్రాంతంలో ప్రజావాణి పై ప్రత్యేక దృష్టి సారించినట్లు అక్కడి వర్గాల ద్వారా తెలుస్తోంది. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి క్రమం తప్పకుండా హజరు కావడం, ప్రజా ఫిర్యాదులు, సమస్యలు వినడమే కాకుండా సంబంధిత అధికారులకు సత్వరమే పరిష్కార మార్గాల కోసం సూచనలు చేసే అలవాటు ఉన్నట్లు సమాచారం. సమయం మించి పోయినా తన చాంబర్లో సైతం ఫిర్యాదుల స్వీకరించే అధికారిగా పేరుంది. ఇలాంటి అధికారి కలెక్టర్‌గా పరిపాలన పగ్గాలు చేపట్టినా జిల్లా స్థాయి అధికారుల్లో మార్పు రాకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించండి ప్రజల ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి అధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఆమె ఆర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ఎం.కృష్ణ, రెవెన్యూ అధికారులు శ్రీను, వసంత కుమారి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
‘ప్రజావాణి’కి మంచి రోజులొచ్చేనా..!
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం గాడిలో పడుతుందా ? ప్రజల సమస్యల పరిష్కారానికి మోక్షం లభిస్తుందా ? జిల్లా స్థాయి అధికారుల్లో మార్పు వస్తుందా ? అధికారుల ఆదేశాలు అమలవుతాయా? అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించి పని చేయిస్తూ తాను పనిచేసే అధికారిగా ముద్ర వెసుకున్న శ్వేతా మహంతి జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టడంతో ప్రజల్లో ఆశలు చిగురిస్తున్నాయి. గత రెండేళ్లుగా జిల్లా పాలనా యంత్రాంగమే కంచె చేను మేసిన విధంగా వ్యవహరించడంతో ప్రజావాణి కార్యక్రమం మొక్కుబడిగా మారింది. సాక్షాత్తూ పాలనాధీశులు ప్రజావాణి కార్యక్రమంపై పెద్దగా ఆసక్తి కనబర్చకుండా జాయింట్ కలెక్టర్‌కు బాధ్యతలు అప్పగించడం, జిల్లా స్థాయి అధికారులు గైర్హాజరు కావడం, ప్రజా ఫిర్యాదుల నిర్లక్ష్యానికి మరింత కారణమైంది. ప్రజాసమస్యలు పరిష్కారం కాదు కదా. అసలు వినేవారే కరువయ్యారు. మరోవైపు కార్యక్రమానికి సమయపాలన లేకుండా పోయింది. కొన్నిసార్లు కింది స్థాయి అధికారులు ప్రజావాణి కార్యక్రమాన్ని కొనసాగించగా.. మరికొన్ని సార్లు ఆర్జీదారులకు పడిగాపులు తప్పడం లేదు. ప్రజావాణి కార్యక్రమంపై నమ్మకం సడిలి క్రమంగా అర్జీదారుల సంఖ్య తగ్గుముఖం పడుతూ వస్తోంది. ఆదేశాలు సైతం బేఖాతర్.. ప్రజావాణిలో ఉన్నతాధికారుల ఆదేశాలు సైతం అతంత మాత్రంగానే అమలవుతున్నాయి. జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రజావాణిలో పదే పదే జిల్లా స్థాయి అధికారులు హాజరు కావాలని, అర్జీలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించేందుకు వ్యక్తిగత శ్రద్ద కనబర్చాలని ఆదేశిస్తూ వచ్చినా ఫలితం లేకుండా పోయింది. పెండింగ్‌లో ఉన్న ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించి నివేదిక అందజేయాలని, పరిష్కరించిన వినతి పత్రాల వివరాలను శాఖల వారిగా తమ లాగిన్ ఐడీతో మీ కోసం వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని సూచనలు సైతం అమలు కాలేదు. మరోవైపు పాలనా యంత్రాంగం వద్ద ఇప్పటి వరకు ఎన్ని ఆర్జీలు వచ్చాయి. ఎన్నిపరిష్కారమయ్యాయి. ఎన్ని పెండింగ్‌లో ఉన్నాయన్న వివరాలు అందుబాటులో లేకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. మార్క్ ఉంటుందా..? ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ స్వయంగా పాల్గొని ప్రజల ఆర్జీలను స్వీకరిస్తారా..? లేక గత కలెక్టర్ల మాదిరిగా కార్యక్రమ బాధ్యతలు జాయింట్ కలెక్టర్‌కు అప్పగిస్తారా..? కొత్త కలెక్టర్ శ్వేతా మహంతి కొంత శ్రద్ధ కనబర్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు పనిచేసిన ప్రాంతంలో ప్రజావాణిపై ఆమె ప్రత్యేక దృష్టి సారిస్తూ వచ్చారు. ప్రజావాణికి క్రమం తప్పకుండా హాజరై ప్రజా ఫిర్యాదులు, సమస్యలు వినడమే కాకుండా సంబంధిత అధికారులకు అక్కడికక్కడే ఆదేశాలు జారీ అలవాటు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రజావాణి సమయం మించి పోయినా.. తన చాంబర్లో సైతం ఫిర్యాదుల స్వీకరించే అధికారిగా ఆమెకు పేరుంది. ప్రజావాణి కార్యక్రమానికి గైర్హాజరయ్యే జిల్లా స్థాయి అధికారులకు తీవ్రంగా మందలిచినట్లు తెలుస్తోంది. ప్రజా ఫిర్యాదుల ఆప్డేట్, ప్రతివారం వాటి పురోగతిపై సమీక్ష నిర్వహించే అలవాటు ఉండడంతో జిల్లా స్థాయి అధికారుల్లో గుబులు పట్టుకుంది. కొత్త కలెక్టర్ పాలనా పగ్గాలు చేపట్టడంతో ప్రజావాణి గాడిలో పడి అధికారుల్లో మార్పు వస్తుందనే ఆశలు ప్రజల్లో చిగురిస్తున్నాయి. -
మూగ వేదనకు... స్పందించిన ‘ప్రజావాణి’
అనంతగిరి : మూగజీవాలకు వైద్యం అందించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడిన ఓ రైతు.. లేగ దూడను ఆటోలో తీసుకుని వచ్చి ప్రజావాణిలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన సోమవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. ధారూరు మండలం కేరెళ్లికి చెందిన రాములుకు చెందిన ఆవు ఆదివారం లేగదూడకు జన్మనిచ్చింది.పుట్టిన కొద్ది సేపటికే చెంగున ఎగరాల్సిన దూడ చతికిలబడి పేగులు బయటకు ఉండటంతో రైతు గుండె కదిలిపోయింది. వెంటనే పశు వైద్యాధికారులకు ఫోన్ చేస్తే వారు స్పందించలేదు. సోమవారం ఉదయం ఓ డాక్టర్ వచ్చి పరీక్షించినా నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. దీనితో కలత చెందిన రాములు మరికొందరి సాయంతో ట్రాలీ ఆటోలో దూడను తీసుకుని.. కలెక్టరేట్‌కు వచ్చాడు. ప్రజావాణి కార్యక్రమంలో ఉన్న కలెక్టర్ ఆయేషా మస్రత్ ఖానమ్‌కు ఫిర్యాదు చేశాడు. దీంతో వెంటనే స్పందించిన పశు వైద్య జిల్లా అధికారులు దూడకు వికారాబాద్‌లోని పశువుల ఆస్పత్రికి తరలించి వైద్యం చేసి పంపించారు. -
ఉత్తమ కలెక్టర్‌గా ఎం.హనుమంతరావు
సాక్షి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎం.హనుమంతరావుకు మరో అరుదైన గౌరవం దక్కింది. దివ్యాంగులకు అందిస్తున్న విశిష్ట సేవలకు గాను ప్రభుత్వం ఆయనను ‘ఉత్తమ కలెక్టర్’అవార్డుకు ఎంపిక చేసింది. మంగళవారం ఆయన ఈ అవార్డును హైదరాబాద్‌లో అందుకోనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందింది. ఈ విషయాన్ని సోమవారం ఆయన స్వయంగా వెల్లడించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటు వేయడానికి వచ్చిన దివ్యాంగులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించడంలో కలెక్టర్ హనుమంతరావు ప్రత్యేక చొరవ చూపించారు. వీల్‌చైర్స్ సమకూర్చడం, కళ్లులేని వారిని, నడవలేని వారిని ఇంటి నుంచే సిబ్బందితో పోలింగ్ కేంద్రానికి తీసుకురావడం, ఓటు వేసిన తరువాత మళ్లీ ఇంటి వద్ద వదిలిపెట్టడం, పోలింగ్ కేంద్రం వద్దకు వచ్చిన వారికి సిబ్బంది సహాయంగా ఉండడం లాంటి చర్యలను ఆయన చేపట్టారు. దివ్యాంగుల ఆర్థిక ప్రగతికి, ఉపాధి కల్పనకు పెద్దపీట వేశారు. అలాగే బ్యాటరీతో నడిచే వాహనాలు, వీల్చైర్ల పంపిణీ, ప్రజావాణిలో వారి సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ చూపడం, సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవడం, డివిజన్ స్థాయిల్లో కూడా వారికి ప్రత్యేకంగా ప్రజావాణి నిర్వహించడం వంటి కార్యక్రమాలను చేపట్టారు. ఈ సేవలను గుర్తించి ప్రభుత్వం రాష్ట్రస్థాయిలో ఆయనను ఉత్తమ కలెక్టర్‌గా ఎంపిక చేసింది. ఈ సందర్భంగా కలెక్టర్ హనుమంతరావు మాట్లాడుతూ ఈ అవార్డు రావడం సంతోషంగా ఉందన్నారు. అవార్డు తన బాధ్యతను మరింత పెంచిందని పేర్కొన్నారు. -
మీడియాకు నో ఎంట్రీ.!
సాక్షి,సిటీబ్యూరో: ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం కవరేజీపై సాక్షాత్తు హైదరాబాద్ జాయింట్ కలెక్టర్ రవి నాయక్ ఆంక్షలు విధించారు. ప్రజావాణి సమావేశ మందిరంలోకి జర్నలిస్టులకు అనుమతి లేదని, ఫొటోలు తీసుకుని వెళ్లి పోవాలని, సమాచార పౌరసంబంధాల శాఖ అధికారులు పంపే ప్రెస్‌నోట్ చూసి వార్తలు రాసుకోవాలని సూచిస్తూ సరి కొత్త సాంప్రదాయానికి తెరలేపారు. ఇదేంటని ప్రశ్నించిన జర్నలిస్టులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సిబ్బంది సహకారంతో వారిని బలవంతంగా సమావేశ మందిరం నుంచి బయటికి పంపిన సంఘటన హైదరాబాద్ కలెక్టరేట్లో సోమవారం చోటుచేసుకుంది. జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించే ప్రజావాణికి కార్యక్రమాన్ని కవరేజ్ చేసేందుకు వివిధ పత్రికలు, చానళ్ల రిపోర్టర్లు కలెక్టరేట్‌కు వెళ్లారు. జిల్లా కలెక్టర్ మాణిక్ రాజ్ కన్నన్ ఇతర సమీక్షా సమావేశాల్లో బిజీగా ఉన్నందున ‘ప్రజావాణి’కి హాజరుకాలేదు. దీంతో జాయింట్ కలెక్టర్ రవి, జిల్లా రెవెన్యూ అధికారి భూపాల్ రెడ్డితో కలిసి ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. మధ్యాహ్నం ప్రజా సమస్యలకు సంబంధించి ఆయా శాఖల అధికారులపై జేసీ ఆగ్రహం వ్యక్త చేశారు. దీనిని గమనిస్తున్న జర్నలిస్టులను గుర్తించిన జేసీ జర్నలిస్టుల ప్రజావాణికి పాత్రికేయులు రావాల్సిన అవసరం లేదని, ఫొటోలు తీసుకొని బయటికి వెళ్లిపోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో నివ్వెరపోయిన జర్నలిస్టులు విధి నిర్వహణలో భాగంగా కవరేజీ కోసం వచ్చినట్లు చెప్పగా, మీరు జర్నలిస్టులని తెలుసునని, అయితే సమావేశ మందిరంలోకి అనుమతి లేదని అసహనం వ్యక్తం చేశారు. అక్రిడేటెడ్ జర్నలిస్టులైనా.. తాము ప్రభుత్వం జారీ చేసిన అక్రిడేటెడ్ జర్నలిస్టులమని కార్డులు చూపిస్తూ ప్రభుత్వ కార్యక్రమాలు, సమావేశాలను కవర్ చేసేందుకు అనుమతి ఉంటుందని కొందరు పాత్రికేయులు జేసీకి వివరించే ప్రయత్నం చేయగా ప్రజావాణి కార్యక్రమం పిటీషన్లు స్వీకరించేందుకు మాత్రమేనని, డీపీఆర్ఓ ప్రెస్ నోట్ పంపిస్తారని, దీనిని ప్రత్యేకంగా కవరేజీ చేయాల్సిన అవసరం లేదన్నారు.వారు పంపించింది రాసుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా కాలంగా ప్రజావాణి కార్యక్రమాన్ని కవర్ చేస్తున్నామని, అన్ని జిల్లాల్లో మీడియాను అనుమతిస్తున్నట్లు చెప్పగా ఆగ్రహానికిలోనైన జేసీ ఆ అవసరం లేదని స్పష్టం చేశారు. ఫిర్యాదు చేసుకోవచ్చు జాయింట్ కలెక్టర్ ప్రజావాణికి రానివ్వడం లేదని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసుకోవచ్చునని సూచించారు. అనంతరం ‘కాల్ది డీపీఆర్ఓ’ అంటూ జర్నలిస్టులపై ఆగ్రహావేశాలు ప్రదర్శించారు. దీంతో జిల్లా రెవెన్యూ అధికారి సీసీ పవన్ అక్కడికి వచ్చి ప్రాతికేయులను బయటికి వెళ్లాలంటూ నెట్టివేసేందుకు ప్రయత్నించారు. దీంతో కలెక్టరేట్ ఏఓ ఆశోక్ రెడ్డి అక్కడికి వచ్చి తర్వాత మాట్లాడుకుందాం... మొదట బయటికి వెళ్లాలని విలేకరులను బయటికి పంపారు. అనంతరం డీపీఆర్ఓను వేదిక వద్దకు పిలిపించుకున్న జేసీ కేవలం ఫొటోలు తీసుకుని పొమ్మనండి.. మీరు పంపించిన ప్రెస్‌నోట్ రాసుకోమ్మని చెప్పాలంటూ హుకుంజారీ చేయడం విస్మయానికి గురిచేసింది. -
కంప్లైంట్ ఈజీ..!
గ్రేటర్ జనాభా కోటి దాటింది. ఇంతమందికి పౌరసేవలందిస్తోన్న జీహెచ్ఎంసీ... సమస్యల పరిష్కారానికి, ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు వివిధ మార్గాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. సంప్రదాయ పద్ధతిలో వినతిపత్రాల నుంచి ఆధునిక తరహాలో స్మార్ట్ ఫోన్ యాప్స్ వరకు ఏ విధంగా ఫిర్యాదు చేసినా స్వీకరిస్తోంది. మార్పులకు అనుగుణంగా ప్రజలు తమకు అందుబాటులో ఉండే సాధనం ద్వారా ఫిర్యాదు చేసే అవకాశాన్నికల్పిస్తోంది. సమస్యలపై ప్రజలు అధికారులకు ఫిర్యాదు చేసేందుకు జీహెచ్ఎంసీ అందుబాటులోకి తీసుకొచ్చిన ఆయా సదుపాయాలపై ‘సాక్షి’ రిపోర్టు. కాల్ \కాల్ సెంటర్ 040–21111111 జీహెచ్ఎంసీ పరిధిలో సమస్యలకు సంబంధించి ప్రజలు ఈ నంబర్‌కు ఫోన్ చేయొచ్చు. ఫిర్యాదును బట్టి కాల్ సెంటర్ సిబ్బంది విభాగం, ఏరియా వారీగా సంబంధిత అధికారికి పంపుతారు. వారు ఫిర్యాదును నమోదు చేసుకొని పరిష్కారానికి కృషి చేస్తారు. డయల్ 100 ఇది కూడా జీహెచ్ఎంసీ కాల్ సెంటర్ తరహాలోనే పని చేస్తుంది. వరద ముంపు, అగ్నిప్రమాదాలు తదితర అత్యవసర సమయాల్లో నేరుగా 100కు డయల్ చేయొచ్చు. యాప్స్/వెబ్‌సైట్స్ మై జీహెచ్ఎంసీ ఈ మొబైల్ యాప్ ద్వారా ప్రజలు తమ సమస్య/ఫిర్యాదులను సంబంధిత ఫొటోలతో సహా అప్లోడ్ చేసి పంపించొచ్చు. తద్వారా లొకేషన్‌ను కూడా సులభంగా గుర్తించి అధికారులు వెంటనే చర్యలు తీసుకునేందుకు వీలవుతుంది. దీని ద్వారా వివిధ విభాగాల సమస్యలపై ఎప్పుడూ అందుబాటులో ఉండే ఫోన్‌తోనే ఫిర్యాదు చేసే అవకాశం ఉండడంతో దీన్ని ఎక్కువ మంది వినియోగిస్తున్నారు. ఈ నెల 23 వరకు 8,49,062 మంది ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నారు. స్వచ్ఛ విజిల్ ఇది కూడా ‘మై జీహెచ్ఎంసీ’ లాంటిదే. అయితే ప్రత్యేకంగా స్వచ్ఛత అంశాలు, పారిశుధ్యం సంబంధిత ఫిర్యాదులు మాత్రమే దీని ద్వారా చేయాల్సి ఉంటుంది. చెత్త పేరుకుపోవడం, పరిసరాలు అశుభ్రంగా ఉండడం లాంటి సమస్యలను ఫొటోలు తీసి లొకేషన్ల వివరాలతో పంపిస్తే చర్యలు తీసుకుంటారు. జీహెచ్ఎంసీ వెబ్సైట్: జీహెచ్ఎంసీ వెబ్సైట్ ద్వారా కూడా ప్రజలు ఫిర్యాదు చేయొచ్చు. ఫోన్‌కు వచ్చే ఓటీపీ ద్వారా ఫిర్యాదు నమోదు చేయొచ్చు. డైరెక్ట్ కంప్లయింట్ కమిషనర్ పేషీ ప్రజలు తమ ఫిర్యాదులను జీహెచ్ఎంసీ కార్యాలయంలో నేరుగా కమిషనర్‌కు అందజేయొచ్చు. కమిషనర్ పేషీలో ఫిర్యాదు కాపీని అందజేసినా తీసుకొని నమోదు చేసుకుంటారు. సాయంత్రం విజిటర్స్ సమయంలో నేరుగా కమిషనర్‌ను కలిసి సమస్యను వివరించడంతో పాటు దాన్ని అందజేయొచ్చు. ఫోన్ ఇన్ ఫోన్ ఇన్ లాంటి కార్యక్రమాల ద్వారా కమిషనర్ ప్రత్యేక సందర్భాల్లో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరిస్తున్నారు. ప్రజావాణి జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రతి సోమవారం ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్వహించే ఈ కార్యక్రమంలో కమిషనర్, అడిషనల్ కమిషనర్లు, ఆయా విభాగాల ఉన్నతాధికారులు పాల్గొంటారు. ప్రజల ఫిర్యాదులు స్వీకరించి, వారి సమస్యలను నమోదు చేసుకొని పరిష్కారానికి కృషి చేస్తారు. ప్రధాన కార్యాలయంతో పాటు జోన్/సర్కిల్ కార్యాలయాల్లోనూ ప్రజావాణి నిర్వహిస్తారు. అక్కడి అన్ని విభాగాల అధికారులు పాల్గొంటారు. ఇతరత్రా... గ్రీవెన్స్ బాక్స్ ప్రజలు తమ ఫిర్యాదులను వేసేందుకు తాజాగా జీహెచ్ఎంసీ కార్యాలయాల్లో గ్రీవెన్స్ బాక్సులు ఏర్పాటు చేస్తున్నారు. జీహెచ్ఎంసీ విజిలెన్స్ విభాగం వీటిని ఏర్పాటు చేస్తోంది. పత్రికల క్లిప్పింగ్స్ ప్రజల నుంచి నేరుగా వచ్చే ఫిర్యాదులే కాకుండా దినపత్రికల్లో ఆయా సమస్యలపై ప్రచురితమయ్యే వార్తా కథనాలు, ఫొటో ఫీచర్లను కూడా పరిగణనలోకి తీసుకొని సంబంధిత విభాగానికి పంపిస్తారు. సంబంధిత అధికారి పరిష్కార చర్యలు తీసుకుంటారు. పారిశుధ్యంపై విజిలెన్స్ ఇది జీహెచ్ఎంసీలోని అంతర్గత వేదిక. నగరంలో ఎక్కడెక్కడ పారిశుధ్యం అధ్వానంగా ఉందో? విజిలెన్స్ విభాగం గుర్తించి సంబంధిత అధికారులకు తెలియజేస్తుంది. సత్వర పరిష్కారానికి సమస్యలు నమోదు చేస్తుంది. సోషల్ మీడియా\ఫేస్బుక్ జీహెచ్ఎంసీ ఫేస్బుక్ ఖాతా ద్వారా కూడా ప్రజలు తమ సమస్యలపై ఫిర్యాదు చేయొచ్చు. సిబ్బంది ఫిర్యాదును పరిశీలించి సంబంధిత అధికారికి పంపిస్తారు. సదరు అధికారి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటారు. ట్విట్టర్ జీహెచ్ఎంసీ ట్విట్టర్ ఖాతా ద్వారా ఐటీ ప్రొఫెషనల్స్ ఎక్కువ మంది ఫిర్యాదు చేస్తున్నారు. దీన్ని ఉన్నతాధికారులతో పాటు ప్రభుత్వంలోని ముఖ్యులు కూడా చూస్తుండడంతో... ఇటు జీహెచ్ఎంసీకి ఫిర్యాదు చేయడంతో పాటు వారికి కూడా పంపిస్తున్నారు. దీంతో మిగతా అన్ని మార్గాల ద్వారా వచ్చే ఫిర్యాదుల కంటే జీహెచ్ఎంసీ అధికారులు దీనికే అధిక ప్రాముఖ్యం ఇస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తామేం పనులు చేశామనేది ఏరోజుకారోజు అధికారులు దీని ద్వారా ఉన్నతాధికారులకు పోస్ట్ చేస్తున్నారు. సమస్యను పరిష్కరించిన తర్వాత అధికారులు ఫిర్యాదు ఐడీతో సహా తిరిగి రీట్వీట్ చేస్తున్నారు. జీహెచ్ఎంసీ ట్విట్టర్ ఖాతాను అనుసరిస్తున్నవారు లక్ష మందికి మించిపోయారు. దేశంలోనే ఏ మునిసిపల్ కార్పొరేషన్‌కూ ఇంతమంది ఫాలోవర్లు లేరు. ♦ ఫిర్యాదులు ఎక్కువగా మై జీహెచ్ఎంసీ యాప్ ద్వారా వస్తున్నాయి. ఆ తర్వాతి స్థానంలో కాల్ సెంటర్ ఉంది. ♦ అయితే వివిధ వేదికల ద్వారా ఫిర్యాదులు స్వీకరిస్తున్నప్పటికీ... సమస్యలు పరిష్కారం కావడం లేదని ప్రజల నుంచి ఫీడ్‌బ్యాక్ అందుతోంది. కొందరు అధికారులు సత్వరమే స్పందించడం లేదని తెలుస్తోంది. నిధులుఅవసరమయ్యే వాటి విషయంలో ఆలస్యమవుతోందని అధికారులు పేర్కొంటున్నారు. -
మళ్లీ మమ!
సాక్షి, సిటీబ్యూరో: ప్రజావాణి.. ప్రజా సమస్యల పరిష్కారం కోసం జీహెచ్ఎంసీలో ప్రతి సోమవారం నిర్వహించే విశిష్ట కార్యక్రమం. కానీ గత కొంత కాలంగా అధికారులు దీన్ని పట్టించుకోవడం లేదు. దాదాపు రెండేళ్లకు పైగా ఇదో మొక్కుబడి తంతుగా తయారైంది. వాస్తవానికి ప్రజావాణికి ఉన్నతాధికారులు హాజరై ప్రజల ఫిర్యాదులను స్వయంగా స్వీకరించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి. అయితే ఉన్నతాధికారులు కాకుండా సంబంధిత సెక్షన్‌లోని ఎవరో ఒకరు హాజరవడం కొద్దిరోజులు సాగింది. ఆ తర్వాత కొన్ని విభాగాలు పూర్తిగా రావడమే మానేశాయి. ఇక ఇటీవల కాలంలో ఎన్నికల కోడ్ ప్రజావాణికి అడ్డంకిగా మారింది. పరిస్థితిని గుర్తించిన జీహెచ్ఎంసీ కమిషనర్ ఎం.దానకిశోర్ ప్రజావాణికి విభాగాధిపతులంతా తప్పనిసరిగా హాజరు కావాల్సిందేనని, ఏదైనా సమావేశం ఉంటే వేరే వారిని పంపించాలని ఆదేశించారు. విభాగాధిపతులే వెళ్లాల్సి వస్తే ముందస్తుగా తనకు సమాచారమివ్వాలని చెప్పారు. కమిషనర్ సీరియస్ కావడంతో అధికారులంతా హాజరవుతారని భావించారు. కానీ సోమవారం జరిగిన ప్రజావాణికి అన్ని విభాగాల ఉన్నతాధికారులు హాజరు కాలేదు. హాజరైన వారిలోనూ సగం మంది కమిషనర్ వెళ్లగానే జారుకున్నారు. బోనాల ఏర్పాట్లకు సంబంధించి సచివాలయంలో మంత్రితో సమావేశం ఉండడంతో కమిషనర్ వెళ్లారు. ఆయన అటు వెళ్లగానే ఒక్కొక్కరుగా అధికారులు కూడా వెళ్లిపోయారు. ఇలా మొత్తానికి మరోసారి ప్రజావాణిని మమ అనిపించారు. దీన్నో మొక్కుబడి తంతుగా ముగించారు. ఒక్కచోటే హాజరు... జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంతో పాటు జోనల్, సర్కిల్ కార్యాలయాల్లోనూ ప్రజావాణి సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జరుగుతుంది. కొందరు జోనల్ కమిషనర్లే ప్రధాన కార్యాలయం నుంచి ఆయా విభాగాలను పర్యవేక్షించే అడిషనల్ కమిషనర్లుగానూ ఉన్నారు. దీంతో వారు ప్రధాన కార్యాలయంలోని ప్రజావాణికి హాజరు కాలేదు. ఇలాంటి అడిషనల్ కమిషనర్లలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్సార్), జీవవైవిధ్య విభాగం పర్యవేక్షణ, ఎస్సార్డీపీ, హౌసింగ్, నాలాల ఆక్రమణలు, చార్మినార్ పాదచారుల పథకం విభాగాల అధికారులు ఉన్నారు. కమిషనర్ సీరియస్.. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ప్రజావాణికి కమిషనర్ దానకిశోర్ కూడా హాజరయ్యారు. దాదాపు మూడేళ్లుగా ప్రజావాణికి కమిషనర్ హాజరు కావడం లేదు. దానకిశోర్ రావడంతో ఫిర్యాదుదారులు సమస్యలు పరిష్కారమవుతాయనే ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించిన ఆయన సంబంధిత అధికారులకు వాటిని మార్క్ చేశారు. ఎంతోకాలంగా అందుతున్న ఫిర్యాదులను పట్టించుకోని అధికారులను ఫోన్లోనే మందలించారు. ప్రజావాణి ఫిర్యాదులపై తక్షణం స్పందించి వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పెరిగిన ఫిర్యాదులు.. ప్రజావాణి నిర్వహణపై కమిషనర్ సీరియస్ అయిన తెలియడంతో గతంలో కంటే ఫిర్యాదులు ఇచ్చేందుకు వచ్చిన వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రధాన కార్యాలయానికి 33 మంది తమ ఫిర్యాదులు అందజేసేందుకు వచ్చారు. జీహెచ్ఎంసీలో ప్రజావాణికి అందే ఫిర్యాదుల్లో సింహభాగం టౌన్‌ప్లానింగ్‌వే. సోమవారం ప్రధాన కార్యాలయంలో ప్రజావాణికి మొత్తం 33 ఫిర్యాదులు రాగా... వీటిలో 22 టౌన్‌ప్లానింగ్‌వే. ముషీరాబాద్‌లో 40 గజాల స్థలంలో ఐదంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నారని, పంజగుట్ట మీరా ట్రేడ్ సెంటర్ వద్ద అక్రమ షెడ్లను నిర్మించారని, రోడ్ల తవ్వకాలు, ఫుట్‌పాత్‌ల ఆక్రమణలు తదితర అంశాలపై కమిషనర్‌కు ఫిర్యాదులు అందాయి. ఫిర్యాదులు ఇలా.. ఇంజినీరింగ్ 8 వెటర్నరీ 1 టౌన్‌ప్లానింగ్ 22 రెవెన్యూ (ఆస్తిపన్ను) 2 -
కష్టం చెబితే కేసుపెట్టారు!
నా ప్రాధాన్యం ప్రజావాణికే..సోమవారం కలెక్టరేట్లో జరిగే గ్రీవెన్స్‌సెల్‌కు అన్ని శాఖల ఉన్నతాధికారులు హాజరు కావాల్సిందే.. లేని పక్షంలో కఠిన చర్యలు తప్పవు.. అని బాధ్యతలు స్వీకరించిన తర్వాత కలెక్టర్ కాటమనేని భాస్కర్ స్పష్టం చేశారు.తొలివారం గ్రీవెన్స్‌సెల్ లోచిన్న సమస్యల పరిష్కారానికి తక్షణ ఆదేశాలిచ్చారు.. ఈ వార్త ప్రజలకు చేరడంతో గతంలో ఎన్నడూ లేని విధంగా జిల్లా నలుమూలల నుంచి వివిధ సమస్యల పరిష్కా రం కోసం ప్రజలు తరలివస్తున్నా రు. తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. ఈ తరుణంలో సోమవారం కలెక్టర్ భాస్కర్ ప్రజావాణిలో వ్యవహరించిన తీరుపై అందరి నుంచి అసంతృప్తి వ్యక్తమయింది. సాక్షి, విశాఖపట్నం: కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో తన గోడు చెప్పుకునేందుకు వచ్చిన ఓ అర్జీదారుడిపై కలెక్టర్ ఏకంగా కేసు నమోదు చేయించారు. రెవెన్యూ శాఖకు చెందిన రిటైర్డ్ అధికారిపైనే కలెక్టర్ ఇలా ఆగ్రహం వ్యక్తం చేయడంతో అక్కడున్న అధికారులతో పాటు అర్జీదారులు కూడా విస్తుపోయారు. ఇదీ పరిస్థితి సంక్రాంతి తర్వాత బాధ్యతలు చేపట్టిన కలెక్టర్ కాటమనేని భాస్కర్ గడిచిన మూడు వారాలుగా అన్నీ తానై గ్రీవెన్స్‌సెల్ నిర్వహిస్తున్నారు. అర్జీదారుల సమస్యలను ఓపిగ్గా వింటూ వారి సమస్యల పరిష్కారానికి అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేస్తున్నారు. దీంతో చెప్పులరిగేలా తిరిగినా సమస్యలు పరిష్కారం కాని వారంతా మళ్లీ కలెక్టరేట్‌కు క్యూ కడుతున్నారు. ఈ కారణంగానే సోమవారం రికార్డుస్థాయిలో 455 మంది అర్జీదారులు వచ్చారు. విశ్రాంత డిప్యూటీ తహసీల్దార్పైకేసు నమోదుకు ఆదేశం కలెక్టరేట్లోని యూఎల్సీ విభాగంలో డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేసి రిటైర్ అయిన ఎల్.విజయ్‌కుమార్ ఏళ్ల తరబడి పరిష్కారం కాని తన సమస్య చెప్పుకునేందుకు సోమవారం కలెక్టరేట్‌కు వచ్చారు. 2013లో రిటైర్ అయిన ఈయనకు ఇంత వరకు పదవీవిరమణ ప్రయోజనాలు అందలేదు. మూడు పీఆర్సీలు అమలు కాలేదు. 13కు పైగా ఇంక్రిమెంట్లు పడలేదు. దాదాపు ఆరేళ్లుగా పెన్షన్ రావడం లేదు. ఈ విషయమై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పరిష్కారానికి నోచుకోలేదు. కొత్త కలెక్టర్‌కు చెప్పుకుంటే సమçస్య పరిష్కారమవుతుందన్న ఆశతో విజయ్‌కుమార్ సోమవారం గ్రీవెన్స్‌సెల్‌కు వచ్చారు. సమస్య చెప్పుకోగా.. ఆసాంతం విన్న కలెక్టర్ భాస్కర్ కొంత సమయం పడుతుంది..అంతతొందరగా అవదు కదా అంటూ బదులివ్వడంతో రిటైర్డ్ డీటీ కాస్త ఆవేదనతో తన గోడు చెప్పుకునే ప్రయత్నం చేశారు. పెన్షన్ కూడా రాకపోవడంతో ఆర్థికంగా చాలా ఇబ్బందిగా ఉంది సార్ అంటూ తన గోడును మరోసారి చెప్పుకునే ప్రయత్నం చేయడంతో కలెక్టర్ అతనిపై అసహనం వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు చెప్పాలి..అర్ధం కాదా అంటూ మండిపడ్డారు. పక్కనే ఉన్న డీఆర్వో చంద్రశేఖర్‌రెడ్డి వైపు చూసి ఏంటిది ? ఇక్కడ నుంచి తీసుకెళ్లండి? అని హుకుం జారీ చేశారు. విధులకు విఘాతం కల్గించారన్న అభియోగంపై ఫిర్యాదు చేయాల్సిందిగా డీఆర్వోను ఆదేశించారు. అంతే డీఆర్వో ఆదేశాల మేరకు కలెక్టరేట్ బీట్ చూసే పోలీసు సిబ్బంది రిటైర్డ్ డీటీ విజయకుమార్‌ను బలవంతంగా అక్కడ నుంచి మహారాణిపేట పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. కలెక్టరేట్ పరిపాలనాధికారి మల్లేశ్వరరావు ఫిర్యాదు మేరకు మహారాణిపేట పోలీసులు రిటైర్డ్ డీటీ పై సెక్షన్ 186, సెక్షన్ 188 కింద కేసు నమోదు చేశారు. గోడు చెప్పుకుంటే కేసులు పెడతారా? అంటూ విజయకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఏళ్ల తరబడి పరిష్కారం కాని తన సమస్యను కొత్త కలెక్టర్ అయినా పరిష్కరిస్తారని వస్తే తనపై కేసులు పెట్టిస్తున్నారంటూ కన్నీటి పర్యంతమయ్యారు. -
మూగవాణి!
సాక్షి, సిటీబ్యూరో: ప్రజా సమస్యల పరిష్కారం కోసం జీహెచ్ఎంసీ చేపట్టిన ‘ప్రజావాణి’ కార్యక్రమం ప్రస్తుతం ఎవరికీ పట్టని పనికిమాలిన ‘వాణి’గా మారింది. ఐదారేళ్ల క్రితం కృష్ణబాబు జీహెచ్ఎంసీ కమిషనర్‌గా ఉన్నప్పుడు చేపట్టిన ఈ కార్యక్రమానికి ఎంతో ఆదరణ ఉండేది. ప్రతి సోమవారం నిర్వహించే ఈ కార్యక్రమానికి ఉదయం 10 గంటల కల్లా వచ్చే ప్రజలు క్యూ కట్టేవారు. వచ్చిన వారందరినీ వరుస క్రమంలో పంపించేందుకు వరుస నెంబర్లతో టోకెన్లు జారీ చేసేవారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకే సమయమైనా..అందరిఫిర్యాదులూ స్వీకరించేంత వరకు అధికారులు ‘ప్రజావాణి’ కార్యక్రమంలో ఉండేవారు. కమిషనర్‌తోపాటు అన్ని విభాగాల అడిషనల్ కమిషనర్లు.. తదితరులు తప్పనిసరిగా ఉండేవారు. తమ వద్దకు వచ్చిన ప్రజల వేదనల్ని సావధానంగా వినేవారు. అప్పటికప్పుడే కంప్యూటర్లోనూ నమోదు చేసేవారు. అన్నీ పూర్తయ్యాక సంబంధిత విభాగాలకు పంపించేవారు. ప్రతివారం ఎన్ని ఫిర్యాదులొచ్చిందీ.. పత్రికా ప్రకటన సైతం విడుదల చేసేవారు. ఆ తర్వాత సోమేశ్‌కుమార్ కమిషనర్‌గా వచ్చిన తర్వాత కూడా కొంత కాలం వరకు ఈ కార్యక్రమం సజావుగా సాగింది. ఆ తర్వాత కమిషనర్ లేకపోయినా..కనీసం అడిషనల్ కమిషనర్ స్థాయి వారు ప్రజావాణికి హాజరయ్యేవారు. ఆయా విభాగాలకు సంబంధించి ఉన్నతస్థాయిలో నిర్ణయం తీసుకునేది వారే కనుక అడిషనల్ కమిషనర్లుండేవారు. ఇంజినీరింగ్, టౌన్‌ప్లానింగ్ తదితర విభాగాల అధిపతులూ తప్పనిసరిగా ఉండేవారు. దాదాపు రెండేళ్లుగా మొక్కుబడి తంతుగా సాగుతోన్న ప్రజావాణి గత ఏడాది కాలం నుంచి మరీ అధ్వాన్నంగా మారింది. కమిషనర్ సంగతటుంచి, కనీసం అడిషనల్ కమిషనర్లు కూడా హాజరు కావడం లేదు. విభాగాల ఉన్నతాధికారులూ రావడం లేదు. తప్పదన్నట్లుగా.. మొక్కుబడిగా ఒకరో ఇద్దరో వచ్చి కూర్చుంటున్నారు. అదీ క్లర్కులు, సూపరింటెండెంట్లు సైతం ఎవరు అందుబాటులో ఉంటే వారు కూర్చొని ప్రజలిచ్చే ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. అన్ని విభాగాల వారు ఉండకపోవడంతో పాటు పరిష్కారంపై నిర్ణయం తీసుకునేవారు లేకపోవడంతో ఆయా విభాగాలకు సంబంధించి సరైన సమాధానం ఇచ్చేవారు లేరు. ‘ఫిర్యాదు ఇచ్చిపోండి..పరిష్కరిస్తాం’ అని చెబుతూ ఫిర్యాదు పత్రం స్వీకరిస్తున్నారు. కనీసం వాటినైనా ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేస్తున్నారా అంటే అదీ లేదు. తీసుకున్న ఫిర్యాదు కాగితాల్ని ఆ తర్వాత ఎప్పుడో ఆన్లైన్లో ఉంచుతున్నారు. అందిన అన్ని ఫిర్యాదుల్నీ ఆన్లైన్లో ఉంచని ఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఉదాహరణకు తాజాగా సోమవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రజావాణికి అందిన ఫిర్యాదులే పది కాగా, వాటిల్లో ఒకటి కనిపించకుండా పోయింది. ఇక ఫిర్యాదు పరిష్కారమవుతుందనుకోవడం భ్రమే. ప్రజావాణిలో అందజేస్తే తమ ఫిర్యాదు వెంటనే పరిష్కారమవుతుందని భావించి పలువురు ఎంతో దూరం నుంచి వ్యయప్రయాసల కోర్చి వస్తున్నారు. పది గంటల నుంచి ప్రారంభం కావాల్సి ఉండగా, ఒక్కోసారి 11.30 గంటల వరకు కూడా ప్రారంభం కావడం లేదు. తాజాగా సోమవారం ప్రజావాణికి సైతం అడిషనల్ కమిషనర్లు, విభాగాధిపతులెవరూ హాజరు కాలేదు. వచ్చిందే నలుగురు. ఫిర్యాదులు నమోదు చేసే కంప్యూటర్ ఆపరేటర్ సైతం సోమవారం 12 గంటల దాకా రాకపోవడంతో స్వీకరణలో జాప్యం జరిగింది. అంతమాత్రం దానికి కార్యక్రమాన్నే పూర్తిగా ఎత్తివేస్తే పోద్దికదా అని దూరం నుంచి వచ్చిన ప్రజలు అభిప్రాయపడుతున్నారు. పదే ఫిర్యాదులు.. ఇక ఫిర్యాదుల్లో ప్రతిసారీ టౌన్ప్లానింగ్దే సింహభాగం. ఫిర్యాదులెన్ని అందినా అక్రమార్కులతో మిలాఖతయ్యే టౌన్‌ప్లానింగ్ అధికారులు వాటిని పరిష్కరించరు. తిరిగి, తిరిగి విసిగి వేసారి పోవాల్సిందే. సోమవారం మొత్తం పది ఫిర్యాదులందగా, అందులో టౌన్‌ప్లానింగ్‌వే ఆరు ఉన్నాయి. ఆస్తిపన్ను, ఇంజినీరింగ్, ఆరోగ్యం– పారిశుధ్యం తదితర విభాగాలకు చెందినవి ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి. గణాంకాలు చూపేందుకు మాత్రం అందిన ఫిర్యాదుల్లో 60 –90 శాతం వరకు పరిష్కారమైనట్లు పేర్కొంటారు. సర్కిళ్లలో పరిష్కారం కాక.. సర్కిళ్లు, జోన్ల స్థాయిల్లో పరిష్కారం కావాల్సినవి సైతం అక్కడ పరిష్కారం కాక ఎందరో ప్రధాన కార్యాలయానికి వస్తుంటారు. యూసుఫ్‌గూడ ప్రాంతంలో తన ఇంటిలో కొంతభాగాన్ని ఇతరులకు అమ్మితే.. మొత్తం ఇల్లును అమ్మినట్లు మ్యుటేషన్ చేశారని, తన ఈ సమస్యను పరిష్కరించాల్సిందిగా సర్కిల్‌స్థాయి అధికారులకు ఎన్ని పర్యాయాలు విన్నవించుకున్నా.. పట్టించుకోకపోవడంతో ఇక్కడికొచ్చినట్లు ఒకరు వాపోయారు. పైపెచ్చు రెండు పర్యాయాలు సంబంధిత డాక్కుమెంట్లు సమర్పించినా, కనిపించడం లేవని చెబుతున్నారని వేదన వ్యక్తం చేశారు. -
‘డబుల్’ ధమాకా..!
సాక్షి,సిటీబ్యూరో: హైదరాబాద్ మహా నగరంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం దరఖాస్తులు వెల్లువెత్తున్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం రెండో సారి కొలువు తీరడంతో డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం పేదలు మరింత ఆశల పెంచుకున్నారు. ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం అధికారికంగా ఎలాంటి దరఖాస్తులు కోరనప్పటికీ పేదల ఉరుకులు, పరుగులు మాత్రం అధికమయ్యాయి. ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించే విధానం అమల్లో ఉండటంతో డబుల్ బెడ్రూమ్ దరఖాస్తులు మీ సేవ, ఈ–సేవ కేంద్రాలకు కాసులు కురిపిస్తున్నాయి. ఆన్లైన్లో సమర్పించిన దరఖాస్తుల ప్రతులను తీసుకొని కలెక్టరేట్ వద్ద క్యూ కడుతున్నారు. ఎన్నికల ఎన్నికల కోడ్ ముగిసి జిల్లా కలెక్టరేట్లలో ప్రజావాణి కార్యక్రమం ఫునఃప్రారంభం కావడంతో సోమవారం దరఖాస్తుల తాకిడి అధికమైంది. గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ ప్రజావాణిలో పేదల డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం పెద్ద ఎత్తున దరఖాస్తులు సమర్పించారు. పెండింగ్ దరఖాస్తులే మూడు లక్షలు.. మహా నగర పరిధిలోని హైదరాబాద్–రంగారెడ్డి–మేడ్చల్ జిల్లా రెవెన్యూ యంత్రాంగాల వద్ద సుమారు మూడు లక్షలకు పైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం మొదటి విడతగా మురికి వాడల్లోని నివాస ప్రాంతాల్లో స్థల లభ్యతను బట్టి ఇళ్ల నిర్మాణాల ప్రక్రియ చేపడుతోంది. ఇప్పటికే అక్కడ ఉంటున్న లబ్ధిదారులందరికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంజూరు చేసి పోజిషిన్ సర్టిఫికెట్లను అందజేసింది. మొదటి విడత నిర్మాణాలు పూర్తయినా తర్వాత రెండో విడతలో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించింది. ఆయితే మొదటి విడత పనులే నత్తనడక నడుస్తున్నాయి. వాస్తవంగా ప్రభుత్వం నగరంలో రెండు లక్షల ఇండ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందులో ఈ ఆర్ధిక సంవత్సరం లక్ష ఇళ్లు లక్ష్యంగా పెట్టుకొని డిసెంబర్ అఖరు నాటికి దాదాపు 40వేల ఇళ్ల నిర్మాణం పూర్తిచేసే విధంగా చర్యలు చేపట్టింది. అందుకు అనుగుణంగా సెప్టెంబర్ మొదటి వారం వరకు వడివడిగా సాగిన పనులు ఆ తర్వాత మందగించాయి. ఇందుకు బిల్లుల చెల్లింపు పెండింగ్ పడడం ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఈ ఏడాది లక్ష్యం... ఈ ఏడాది మొత్తం లక్ష ఇళ్ల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకొని ఇప్పటి వరకు మూడు ప్రాంతాల్లో 496 డబుల్ బెడ్రూమ్ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. మరో 38 ప్రాంతాల్లో 39,669 ఇళ్లు పూర్తి కావాల్సి ఉంది. వచ్చే వేసవి నాటికి: 68 ప్రాంతాల్లో 59,835 పూర్త చేయాల్సి ఉంది. ప్రస్తుతం అమీన్పూర్లో (176), గాజుల రామారంలో (144), జమ్మిగడ్డలో (56),సయ్యద్‌సాబ్ కాబాడాలో (48) తదితర ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణం దాదాపుగా పూర్తయ్యాయి. జియాగూడలో(840), బండ మైసమ్మనగర్, అహ్మద్‌గూడలో (4428) డి.పోచంపల్లిలో(1404), ఎరుకల నాంచారమ్మబస్తీలో (288), బహదూర్‌పల్లిలో (900) తదితర ప్రాంతాల్లో పనులు కొంత మంద కొడిగా సాగుతున్నాయి. ఇళ్ల నిర్మాణం ఇలా... నగరంలో స్థల లభ్యతనుబట్టి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను జీ+3, జీ+5, జీ+9 అంతస్తులుగా నిర్మిస్తున్నారు. వీటిల్లో ఒక్కో యూనిట్కయ్యే ఖర్చు అంచనా వేస్తే జీ+3 : రూ. 7 .00 లక్షలు, జీ+ 5 : రూ. 7.75 లక్షలు, జీ+9 : రూ. 7.90 లక్షలు ఖర్చు అవుతోంది. ఇందులో ఒక్కో యూనిట్‌కు లక్షా యాభైవేలు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్‌యోజన ద్వారా చెల్లిస్తోంది. మిగతా మొత్తాన్ని రాష్ట్రప్రభుత్వమే చెల్లించాలి. వీటితోపాటు మౌలిక సదుపాయాల కల్పనకు మరి కొంత ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేశారు. వాస్తవంగా లక్ష ఇళ్ల నిర్మాణం కోసం మొత్తం అంచనా వ్యయం రూ. 8598 కోట్లు, కాగా,అందులో కేంద్రప్రభుత్వ సబ్సిడీ రూ. 1500 కోట్లు. ఇప్పటి వరకు రూ. 2000 కోట్ల విలువైన పనులు జరుగగా రూ. 1600 కోట్లు చెల్లింపు జరిగింది. మరో నాలుగు వందల కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. -
కేఎఫ్ బీర్లను విక్రయించాలి.. వైరల్ లేఖ
సాక్షి, జగిత్యాల : ప్రజావాణిలో జగిత్యాల జిల్లా కలెక్టర్‌కు ఓ వ్యక్తి రాసిచ్చిన ఫిర్యాదు లేఖ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. వైన్స్‌షాపుల్లో, బార్లలో కింగ్ ఫిషర్ బీర్లను విక్రయించేలా చర్యలు తీసుకోవాలని జగిత్యాలకు చెందిన అయిల సూర్యనారాయణ(టీవీ.సూర్యం) సోమవారం జరిగిన ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. మద్యంప్రియులు, యువత ఎక్కువగా ఇష్టపడే కింగ్‌ఫిషర్ బీర్ల విక్రయాలతో ప్రభుత్వానికి ఆదాయం కూడా వస్తుందన్నారు. మద్యం విక్రయదారులు సిండికేట్‌గా మారి కింగ్‌ఫిషర్ బీర్లను విక్రయించడం మానేశారని, వాటి స్థానంలో నాసిరకం బీర్లను విక్రయిస్తూ మోసం చేస్తున్నారని ఆరోపించారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 లో పేర్కొన్న ప్రాథమిక హక్కులలోని స్వేచ్ఛతో కూడిన కొనుగోలు హక్కుకు మద్యం విక్రయదారులు భంగం కలిగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీర్ల విక్రయాలపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి మద్యం వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ప్రజావాణి కార్యక్రమంలో బీర్లపై ఫిర్యాదు రావడంతో అధికారులతో పాటూ, ఫిర్యాదు చేయడానికి వచ్చిన వారు కూడా ఆశ్చర్యపోయారు. అధికారులు ఆ లేఖను అబ్కారీ శాఖకు పంపారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న లేఖ -
విన్నాం.. చూస్తాం..
జనం సమస్యలు తెలుసుకొని సత్వర పరిష్కారం కోసం జిల్లా ఉన్నతాధికారులు నిర్వహిస్తున్న ‘ప్రజా వాణి’ మొక్కుబడిగా సాగుతోంది. వినతులు తీసుకోవడం, తరువాత బుట్టదాఖలు చేయడం సర్వసా«ధారణమైపోయింది. ఫలితంగా ఎక్కడో మారుమూల ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రానికి వచ్చి తమ గోడు వెళ్లబోసుకుంటున్న బాధితుల వేదన అరణ్యరోదనగానే మారుతోంది. జిల్లా స్థాయి అధికారులైనా న్యాయం చేస్తారని వ్యయప్రాయాసలకోర్చి వస్తున్న వారికి నిరాశే మిగులుతోంది. –చిత్తూరు, సాక్షి చిత్తూరు, సాక్షి: జిల్లాలో ప్రతి సోమవారమూ ‘ప్రజావాణి’ కార్యక్రమం నిర్వహించడం ఆనవాయి తీ. జిల్లా కేంద్రాల్లో కలెక్టర్, మండల కేంద్రాల్లో తహసీల్దార్ నేతృత్వంలో వినతులు స్వీకరణ జరుగుతోంది. జిల్లాస్థాయిలో నిర్వహించే సమావేశానికి ఆయా శాఖల హెచ్వోడీలు, మండల స్థాయిలో వివిధ శాఖల మండల స్థాయి అధికారులు ప్రజావాణిలో పాల్గొనాలి. చాలాచోట్ల తహసీల్దార్ తప్ప ఇంకెవరూ భాగస్వాములు కావడం లేదు. జిల్లాస్థాయిలో కలెక్టర్ ఉంటారన్న భయంతో విభాగాధిపతులు హాజరవుతున్నారు. కొన్ని శాఖల అధికారులు కింది స్థాయి సిబ్బందిని పంపిస్తున్నారు. దీంతో సమస్యలు పరిష్కారం కావడం లేదు. కిందిస్థాయి సిబ్బంది హెచ్వోడీలకు సమస్యలు వివరించే పరిస్థితి ఉండదు. చెప్పినా వింటారనే భావన లేదు. నేరుగా హెచ్‌వోడీలే ప్రజావాణిలో పాల్గొంటే కలెక్టర్ దగ్గరే సమస్యపై స్పష్టత వచ్చే వీలుంటుంది. ప్రజావాణికి రాని విభాగాధిపతులకు నోటీసులు జారీ చేస్తే మరో ప్రజావాణికైనా వచ్చే వీలుంటుంది. ప్రజావాణి 11 గంటలు దాటితే కానీ ప్రారంభం కావడం లేదు. దీనివల్ల సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వారు ఇబ్బంది పడుతున్నారు. వేదిక మీద కూర్చున్న తర్వాత హడావుడిగా వినతులు స్వీకరిస్తున్నారు. వినతిపత్రం ఇస్తున్న వారితో ఎక్కువ సమయం కేటాయించలేకపోతున్నారు. రెవెన్యూ శాఖవే ఎక్కువ ఫిర్యాదులు.. ♦ రెవెన్యూ శాఖ సమస్యలే ఎక్కువ ఫిర్యాదులుగా వస్తున్నాయి. ఫిర్యాదు చేసిన వారే ప్రతి వారమూ వస్తున్నారు. ♦ క్షేత్ర స్థాయిలో అధికారుల పర్యటనలు తక్కువ కావడం కూడా దీనికి కారణం. ♦ భూ సరిహద్దులపై స్పష్టత లేకపోవడంపై ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయి. ఒకరి భూ మిలోకి మరొకరు వచ్చారని ఆక్రమించుకుంటున్నారన్న ఫిర్యాదులు ఎక్కువయ్యాయి. ♦ క్లిష్టమైన సమస్యలను రెవెన్యూ శాఖ ఎదుర్కొంటోంది. ఈ ఏడాది జనవరి నుంచి 534 వినతులు వస్తే వాటిలో 73 మాత్రమే పరిష్కారమయ్యాయి. ♦ మిగతా శాఖల్లో ప్రజల నుంచి 50కి మించిన ఫిర్యాదులు రావడం లేదు. కొన్ని ఫిర్యాదులను ప్రజావాణిలో నమోదు చేయడం లేదన్న ఆరోపణలున్నాయి. ♦ ప్రతిరోజూ సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు కలెక్టర్ వినతులు స్వీకరించే సంప్రదాయం గతంలో ఉండేది. ఇప్పుడది లేదు. ♦ ప్రజావాణి ఫిర్యాదులపై సమీక్షలు, సమావేశాలు లేకపోవడం వల్ల కూడా పరిష్కారాలు తక్కువ నమోదవుతున్నాయన్న ఆరోపణలున్నాయి. ♦ హౌసింగ్ విభాగంలో 542 వినతులు వచ్చాయి. వీటిలో కేవలం 190 మాత్రమే పరిష్కారమయ్యాయి. ♦ ఎస్సీ, ఎస్టీల ఫిర్యాదులు పరిష్కరించడంలో అ«ధికారులు అలసత్వం వహిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. సమస్యలు పరిష్కరించడం లేదు అధికారులు అర్జీలు తీసుకుంటున్నారే గాని సమస్యలు పరిష్కరించడం లేదు. ఏడాదిన్నరగా దారికోసం ఇప్పటికి కలెక్టర్‌కు ఏడుసార్లు విన్నవించాను. పట్టించుకోలేదు. కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా ఆ అర్జీలు తిరిగి మండల అధికారులకు వస్తున్నాయి. మం డల అధికారులు సమస్యను పరిష్కరించకపోగా దురుసుగా ప్రవరిస్తున్నారు.– టి.రమేష్, ఈఆర్ కండ్రిగ, జీడీనెల్లూరు లోకేష్బాబుది కుప్పం మండలం కొత్తపల్లె. 45శాతం వికలాంగత్వం ఉన్నట్లు సదరం నుంచి ధ్రువీకరణ పత్రం ఉంది. వికలాంగ పింఛను కోసం దరఖాస్తు చేసుకుంటే మంజూరు కాలేదు. కలెక్టరేట్‌కు మూడు సార్లు తిరిగాడు. సోమవారం మళ్లీ అర్జీ ఇచ్చాడు. తన వినతిని పట్టించుకోవడం లేదని లోకేష్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఎందుకు పింఛను మంజూరు చేయరో కూడా చెప్పడం లేదని వాపోతున్నాడు. -
అర్హత సాధించినా ఉద్యోగమివ్వరా?
ఖమ్మం సహకారనగర్: కోర్టులో ప్రభుత్వ ఉద్యోగానికి తాను అర్హత సాధించినా తనకు ఉద్యోగం ఇవ్వలేదని ఖమ్మంకు చెందిన ఓ యువకుడు సోమవారం ప్రజావాణిలో కలెక్టర్ ఎదుటే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. నగరంలోని నిజాంపేటకు చెందిన జాగటి సాంబయ్య కోర్టులో అటెండర్ ఉద్యోగానికి 2012లో దరఖాస్తు చేశాడు. అయితే, అతడికి ఉద్యోగం రాలేదు. కానీ, సమాచార హక్కు చట్టం వివరాల ప్రకారం.. తాను రెండో సా ్థనంలో ఉండగా, మొదటి, మూడో స్థానంలో ఉన్న వారికి అటెండర్ ఉద్యోగం కల్పించారని తేలింది. దీంతో తనకు న్యాయం చేయాలని కోరుతూ కలెక్టర్‌ను కలిసేందుకు ప్రజావాణికి వచ్చాడు. దీంతో ఔట్ సోర్సింగ్‌లో ఉద్యోగం కల్పిస్తానని చెప్పడంతో మనస్తాపానికి గురై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అధికారులు, కలెక్టర్లు గన్మెన్లు అతడిని అడ్డుకుని బయటకు పంపించారు. -
న్యాయం జరిగేలా చూడాలి
మెదక్ మున్సిపాలిటీ : ఫిర్యాదుదారులకు న్యాయం జరిగేలా చూడాలని ఎస్పీ చందనాదీప్తి అధికారులను ఆదేశించారు.సోమవారం మెదక్‌లోని జిల్లా పోలీసుకార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా మనోహరబాద్ మండలం కొండాపూర్ గ్రామానికిచెందిన జల్లి రామకృష్ణ తాను ప్రేమించుకొని 2018 మే24న ఆర్యసమాజ్‌లో పెళ్లి చేసుకున్నామని, దీంతో మా కుటుంబ పెద్దలు నా భర్తను చంపేస్తామని బెదిరిస్తున్నారని సిద్దిపేట జిల్లా కొండపాక మండలం మంగోల్ గ్రామానికిచెందిన దాసరి హైమావతి ఎస్పీకి ఫిర్యాదు చేసింది. అలాగే తన భర్త పరమేష్ ప్రతిరోజు మద్యం తాగివచ్చి కొడుతున్నాడని, అతనిపై చర్యలు తీసుకోవాలని మెదక్ మండలం అవుసుపల్లి గ్రామం బొల్లారం తండాకు చెందిన బానోత్‌రాణి ఫిర్యాదు చేసింది. మా సొంత వ్యవసాయ భూమిని గొల్ల కంచన్‌పల్లి నర్సింలు అనే తనకు తెలియకుండా ట్రాక్టర్‌తో దున్నాడని, ఈ విషయంలో అతన్ని ప్రశ్నించగా గ్రామ పెద్ద సమక్షంలో విచారణ చేస్తుండగా నా కొడుకులను నర్సింలు,యాదయ్య, మహేష్ అనే వ్యక్తులు దాడిచేసి గాయపర్చారని, న్యాయం చేయాలంటూ శివ్వంపేట మండలం దంతాన్పల్లి గ్రామానికి చెందిన గొల్ల పెంటయ్య ఎస్పీకి ఫిర్యాదు చేశారు. చట్టపరమైన విషయంలో న్యాయం జరగకుంటే ఫిర్యాదుదారులు తిరిగి తనను సంప్రదించవచ్చన్నారు. -
ఆవేదనల నివేదనలు
కరీంనగర్‌సిటీ : సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జిల్లా నలు మూలలా నుంచి బాధితులు సోమవారం కలెక్టరేట్లో నిర్వహించి న ప్రజావాణికి తరలివచ్చారు. ఎండను సైతం లెక్క చేయడం లేదు. ప్రధానంగా పట్టాపాసుపుస్తకాల్లో సవరణలు, భూ సమస్యలు, పింఛన్లు, డబుల్బెడ్రూం ఇళ్ల నిర్మాణం, ఉద్యోగాల కల్పన కోరుతూ అర్జీలు సమర్పించారు. జాయింట్ కలెక్టర్ బద్రి శ్రీనివాస్, ట్రెయినీ ఐఏఎస్ రాజశ్రీషార్ వినతులు స్వీకరించారు. అంతకుముందు జిల్లా అధికారులతో కలిసి డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా కేంద్రానికి రాలేని ప్రజలు తమ సమస్యలను ప్రతీ సోమవారం నిర్వహించే డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమానికి ఫోన్ ద్వారా తెలుపుతారని, సంబంధిత జిల్లా అధికారులు వెంటనే సమస్యలకు పరిష్కారం చూపుతారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కరీంనగర్ నుంచి శ్రీనివాస్ మాట్లాడుతూ.. బీసీ కార్పొరేషన్ రుణం మంజూరు కోసం దరఖాస్తు చేశానని.. ఇంతవరకు మంజూరు కాలేదని తెలుపగా పరిశీలిస్తామని జేసీ అన్నారు. రామడుగు మండలం తిరుమలాపూర్ నుంచి మల్లేశం మాట్లాడుతూ.. తన భూమి కేసు కోర్టులో పెండింగ్‌లో ఉందని, కానీ నా ప్రత్యర్థికి పట్టాదారు పాసుపుస్తకం జారీ అయిందని తెలుపగా, వెంటనే పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని ఆర్డీవోను ఆదేశించారు. జమ్మికుంట మండలం బిజిగిరీషరీఫ్ నుంచి సదానందచారి మాట్లాడుతూ.. గ్రామానికి మానేరు నుంచి తాగునీటి పైప్‌లైన్ వేశారని.. ఇంతవరకు కనెక్షన్ ఇవ్వలేదని తెలుపగా గ్రామంలో ఆరు బావులను అద్దెకు తీసుకుని తాగునీటిని సరఫరా చేస్తున్నామని తాగునీటికి కొదువ లేదని జిల్లా పంచాయతీ అధికారి తెలిపారు. చొప్పదండి మండలం రుక్మాపూర్ గ్రామం నుంచి మహేశ్ మాట్లాడుతూ జంగోలకుంట చెరువు నుంచి మట్టిని తీసి భూమిని కబ్జా చేసుకుంటున్నారని తెలపగా వెంటనే తనిఖీ చేసి నివేదిక సమర్పించాలని తహశీల్దార్‌ను జేసీ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో అయేషా మస్రత్ ఖానమ్, జిల్లా పరిషత్ సీఈవో పద్మజారాణి, వయోజన విద్యాశాఖ డీడీ జయశంకర్, జౌళిశాఖ ఏడీ వెంకటేశం, మెప్మా పీడీ పవన్‌కుమార్, జిల్లా మార్కెటింగ్ శాఖ డీడీ పద్మావతి, సీపీవో పూర్ణచందర్, జిల్లా వ్యవసాయాధికారి శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు. -
సత్వరమే పరిష్కరించాలి
వనపర్తి: ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ శ్వేతామహంతి సూచించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆమె ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఉదయం పదిన్నర గంటల నుంచి మధ్యాహ్నం ఒకటిన్నర వరకు 120 ఫిర్యాదులు అందినట్లు గ్రీవెన్స్ సెల్ అధికారరులు తెలిపారు. వచ్చిన ఫిర్యాదులలో ఎక్కువగా భూములు, పింఛన్లు, నీటి సమస్యలు పరిష్కరించాలని, గ్రామాల్లో బెల్టుషాపులను తొలగించాలని, మిషన్ కాకతీయ పనుల్లో నాణ్యతను పరిశీలించాలని ఫిర్యాదులు వచ్చాయి. వాటిని సంబంధిత శాఖలకు సిఫారస్ చేస్తూ.. ఫిర్యాదుదారులకు రశీదులు ఇచ్చి పంపించారు. కార్యక్రమంలో అన్ని ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్‌తోపాటు ఇన్చార్జ్ జేసీ చంద్రయ్య ఫిర్యాదులు స్వీకరించారు. అలాగే, జిల్లా కేంద్రంలోని కార్మిక శాఖ కార్యాలయంలో ఒకేఒక్క జూనియర్ అసిస్టెంట్ ఉన్నారు. తగినంత మంది సిబ్బంది లేక ప్రభుత్వం కార్మికుల కోసం ప్రవేశపెట్టిన చాలారకాల దరఖాస్తులు పెండింగ్‌లో పడిపోతున్నాయి. కార్మికులకు అందాల్సిన చెల్లింపులలో తీవ్ర జాప్యం నెలకొంటుందని భవన నిర్మాణ సంఘం నాయకులు ఫిర్యాదు చేశారు. ఊర్లోలేరని.. భూమి స్వాధీనం భర్త చనిపోవడంతో పిల్లల పోషనకు పట్నం పోతే.. మా భూమిని పక్కన ఉన్న రైతులు వారి భూమిలో కలుపుకున్నారు. మా తండ్రికి ఇందిరమ్మ పాలనలో అసైన్డ్ చేసిన 1.30 ఎకరాల భూమిని పెళ్లి సమయంలో నాకు రాసిచ్చారు. ముందు నుంచి తామే.. భూమిని సాగు చేసుకుని పంటలు పండించుకున్నాం. ఎవ్వరూ లేరని భూమిని సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ విషయంపై పలుమార్లు కలెక్టర్, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా.. పట్టించుకోలేదు.– చెన్నమ్మ, గోపాల్పేట మంచినీటి సమస్య పరిష్కరించాలి నాలుగేళ్లుగా వేసవి వ చ్చిందంటే.. గ్రామంలో తీవ్ర మంచినీటి సమస్య ఉత్పన్నమతుంది. గ్రామానికి చుట్టూ నీరున్నా.. తాగడానికి గుక్కెడు నీటికోసం అవస్థపడాల్సి వస్తోంది. ఈ నెల 19న సమస్యను డీపీఓ దృష్టికి తీసుకువెళ్తే.. ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో చర్చించి సమస్య పరిష్కరిస్తామని చెప్పారు. కలెక్టర్ స్పందించి నీటి సమస్యను పరిష్కరించాలి. – గ్రామస్తులు, ఆరేపల్లి, ఆత్మకూరు మండలం నా కుమారుడి ఆచూకీ గుర్తించాలి మా కుమారుడు మహేష్‌ను జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్లో చేర్పించాం. అక్కడే హాస్టల్లో ఉంచి చదివించాం. గతనెలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ముగిసిన రోజు మహేష్ ఇంటికి రాకపోవడంతో కళాశాల యాజమాన్యాన్ని సంప్రదిస్తే మాకు తెలియదని నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారు. పోలీస్‌స్టేషన్‌లో కేసు రిజిస్టర్ చేసి నెలరోజులు పూర్తయినా నేటికీ ఆచూకి తెలియలేదు. – తల్లితండ్రులు, సాసనూలు, ఇటిక్యాల మండలం అనధికారిక మద్యం విక్రయాలపై.. మా గ్రామంలో ఎలాంటి అనుమతులు లేకుండా కిరాణం షాపులలో మద్యం విక్రయిస్తున్నారు. నిత్యం సాయంత్రం అయ్యిందంటే.. గ్రామశివారులలో మద్యం సీసాలతో గుంపులు కనిపిస్తాయి. రోజురోజుకు మద్యం సేవించేవారి సంఖ్య పెరుగుతూ వస్తుంది. అనధికారికంగా గ్రామంలో ఏర్పాటు చేసిన మద్యం దుకాణాలను తొలగించాలి.– రాముడు, అశోక్, కంభాళాపురం ఖాళీ బిందెలతోతండావాసుల నిరసన గతనెల రోజులుగా మా తండాలో మంచినీటి సమస్య నెలకొందని, అధికారులకు, పాలకులు చెప్పినా.. పట్టించుకోవటం లేదంటూ.. సోమవారం శ్రీనివాసపురం తండాకు చెందిన గిరిజన మహిళలు, పిల్లలు ఖాళీ బిందెలతో కలెక్టరేట్‌కు వచ్చారు. సుమారు గంటపాటు అక్కడే నిరసన తెలిపారు. అధికారులు, పాలకులకు ఈ విషయమై పలుమార్లు విన్నవించినా పటించుకో వడంలేదని ఆరోపించారు. సమస్యను కలెక్టర్‌కు వివరించారు. ఆమె సమస్య పరిష్కరిస్తామని చెప్పడంతో గిరిజన మహిళలు శాంతించారు. -
పైసలివ్వనందుకు పట్టామార్చారు
సిరిసిల్ల టౌన్: ‘సారూ.. నాకు భార్య, ముగ్గురు ఆడపిల్లలు. ఊరు శివారులో 27 గుంటల భూమి ఉంది. దాన్ని ఆధారంగానే కుటుంబాన్ని సాకుతున్న.. కానీ, వీఆర్వో ఆ భూమిని వేరేవాళ్ల పేరు మీద రాసిండ్రు.. ఆయన అడిగిన పైసలు ఇయ్యలేదని గిట్ల జేసిండ్రు.. ఇగ నాకు ఆధారం ఎట్లా? గందుకోసమే పురుగుల మందు తాగుతున్న..’ అని రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్‌కు చెందిన బొమ్మెన తిరుపతి సోమవారం ప్రజావాణిలో కలెక్టర్ కృష్ణభాస్కర్ ఎదుట ఆత్మహత్యకు యత్నించాడు. అధికారు లు అప్రమత్తం కావడంతో ప్రమాదం తప్పింది. బొమ్మెన తిరుపతి తండ్రి ఎల్లయ్యకు గ్రామ శివారులోని సర్వేనంబర్ 20లో 1.29 ఎకరాల భూమి ఉంది. దీనిని 2015 డిసెంబర్లో తన కుమారుడు తిరుపతి పేరిట రిజిస్ట్రేషన్ చేయించి, రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేయించారు. దీని పట్టాదారు పాసుపుస్తకం ఆధారంగా బ్యాంకులో రుణం తీసుకున్నాడు. ఇటీవల వీఆర్వో ఒకరు 1.29 ఎకరాల్లోని 27 గుంటలను ఇతరుల పేరిట పట్టా చేశారు. తన భూమిని ఇతరులకు ఎలా పట్టా చేస్తావని బాధితుడు ఆ వీఆర్వోను నిలదీయ గా.. అవతలి పార్టీ వారు రూ.30 వేలు ఇచ్చారని, నువ్వు రూ.50 వేలు ఇస్తే.. పట్టా నీ పేరిట చేస్తానన్నాడు.దీంతో మనస్తాపానికి గురైన తిరుపతి కుటుంబ సభ్యులతో కలసి సోమవారం జిల్లాకేంద్రంలో నిర్వహించే ప్రజావాణికి హాజరయ్యాడు. తన భూమిని ఇతరుల పేరిట పట్టా చేసి, లంచం అడుగుతున్న వీఆర్వోపై చర్య తీసుకోవాలని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు. వెంటనే తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగేందుకు యత్నించగా కలెక్టర్ కృష్ణభాస్కర్, ఆర్డీవో పాండురంగ అడ్డుకున్నారు. ఘటనపై విచారణ జరిపించి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. అనంతరం తగు చర్యలు తీసుకోవాలని ఆర్డీవో పాండురంగను కలెక్టర్ ఆదేశించారు. -
దయ చూపండయ్యా..
మహబూబ్‌నగర్ న్యూటౌన్: తిరిగి తిరిగి అలిసిపోతున్నాం.. దయ చూపండయ్యా అంటూ ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదుదారులు కలెక్టర్ ఎదుట సమస్యల ఏకరువు పెట్టారు. మండలాల్లో సమస్యలు పరిష్కారం కాకపోవడంతోనే ఇక్కడికి వస్తున్నామంటూ చెప్పుకొచ్చారు. కలెక్టరేట్లోని రెవెన్యూ సమావేశ మందిరంలో సోమవారం ఏర్పాటు చేసిన ప్రజావాణికి కలెక్టర్ రొనాల్డ్‌రోస్‌తో పాటు, డీఆర్వో వెంకటేశ్వర్లు, మెప్మా పీడీ గోపాల్, ట్రెయినీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బెన్షాలో ప్రజల నుంచి వినతిపత్రాలు, ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారం విషయంలో జాప్యం తగదని ఫిర్యాదులను అందుకున్న కలెక్టర్ ఈ సందర్భంగా మండలాల అధికారులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సూచించారు. భూముల సమస్యలు, ఆసరా పెన్షన్లు, రుణాలు, ఉపాధి కోసం ఎక్కువ వినతిపత్రాలు అందగా మొత్తం 82వినతులు, ఫిర్యాదులు వచ్చాయి. బాధ్యలపై చర్య తీసుకోవాలి మత్స్యశాఖ కార్యాలయంలో ఏ పని జరుగాలన్నా లంచం ఇవ్వనిదే పని జరుగడంలేదని, అవినీతి అక్రమార్కులపై చర్య తీసుకోవాలని కోరుతూ తెలంగాణ మత్స్యకార్మిక సహకార సంఘం జిల్లా కార్యదర్శి తెలుగు సత్యయ్య ప్రజావాణిలో కలెక్టర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. సంఘాల్లో సభ్యత్వం, లైసెన్సుల జారీ, వాహనాల మంజూరులో అక్రమాలు జరుగుతున్నాయని, అవినీతి అక్రమాలపై నిఘా ఉంచి చర్యలు తీసుకోవాలని కోరారు. మైనింగ్ అనుమతులు నిలిపివేయాలి తమకు ప్రభుత్వం ఇచ్చిన పట్టా భూములను తీసుకొని ఇచ్చిన మైనింగ్ అనుమతులు నిలిపేయాలని మద్దూర్ మండలం నందిపాడ్ గ్రామానికి చెందిన దళిత రైతులు ప్రజావాణిలో కలెక్టర్‌కు విన్నవించారు. తమకు సర్వే నంబర్ 21లో 70మందికి పట్టాలు ఇవ్వడం జరిగిందని, వాటిని రద్దు చేసి మైనింగ్ చేపట్టడంతో జీవనోపాధి పోయిందన్నారు. మైనింగ్ అనుమతులు నిలిపేసి తమ భూములను సాగు చేసుకునేలా చూడాలని కోరారు. సేవా కార్యక్రమాలు అడ్డుకుంటున్నారు నవాబ్‌పేట మండలం లింగంపల్లి పంచాయతీ కిషన్‌గూడ పాఠశాలలో విద్యార్థుల దాహార్తిని తీర్చేందుకు సేవాదృక్పథంతో వాటర్ ప్యూరిఫైర్‌ను ఏర్పాటు చేసేందుకు చేస్తున్న పనులను స్థానిక టీఆర్ఎస్ నాయకులు, అధికారులు అడ్డుకుంటున్నారని పేర్కొంటూ అనిరుధ్ యువసేన ఆధ్వర్యంలో రాజాపూర్, నవాబ్‌పేట మండలాలకు చెందిన ప్రజలు కలెక్టరేట్‌కు తరలివచ్చి కలెక్టరేట్లో ఆందోళన చేపట్టారు. అలాగే, పోలేపల్లి సెజ్ వద్ద స్థానిక నాయకులు కొందరు అక్రమంగా వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి చెరువు నీటిని తరలిస్తున్నారన్నారు. రాజాపూర్ మండలం గుండ్ల పొట్లపల్లి సమీపంలో ఉన్న బిలాస్ స్పాం జ్ ఐరన్ పరిశ్రమ ద్వారా కాలుష్యం విడుదలవుతుందని, తద్వారా తాము తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని పేర్కొన్నారు. పలు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్‌కు అందజేశారు. హద్దులు, ఆర్వోఆర్ అమలు చేయాలి రాష్ట్ర ప్రభుత్వ గజిట్ ప్రకారం జమా మసీద్, ఈద్గాలకు కేటాయించిన భూమికి హద్దులు చూపి ఆర్వోఆర్ అమలు చేయాలి. సర్వే నంబర్ 320, 171లోని భూమిలో జామా మసీద్, ఈద్గా, ఖబ్రస్తాన్, గోఖుర్సాహెబ్ చెల్కలకు సంబంధించిన భూమిని సర్వే చేయించి హద్దులు నిర్ణయించి, రికార్డుల్లో నమోదు చేయాలని ఏళ్లుగా అధికారులను కోరుతున్నా పట్టించుకోవడంలేదని దామరగిద్ద మండలం లోకుర్తి గ్రామానికి చెందిన జామామసీద్ కమిటీ సభ్యులు ప్రజావాణిలో అధికారులను కలిసి విన్నవించారు. సంబంధిత భూమిని రికార్డుల్లో నమోదు చేయాలని కోరారు.