అనంతపురం కలెక్టరేట్, న్యూస్‌లైన్ : వందలాది మంది ప్రజలు సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం ‘ప్రజావాణి’ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా ఇసుమంతైనా ఫలితం ఉండటం లేదు. ఇచ్చిన సమస్యలపైనే మళ్లీ మళ్లీ అర్జీలు ఇస్తున్నారు. కనీసం ఆ అర్జీలు ఏ దశలో ఉన్నాయో కూడా చెప్పే పరిస్థితి లేదు. జిల్లా ఉన్నతాధికారులు అర్భాటంగా ప్రజల నుంచి ప్రతివారం వినతి పత్రాలు స్వీకరిస్తున్నారే కానీ వాటి పరిష్కారానికి స్పష్టమైన ప్రణాళిక రూపొందించుకోవడంలో దారుణంగా విఫలమయ్యారు. ఒక సమస్యపైనే వినతిపత్రాలు ఇచ్చేవారు 80-100 మంది దాకా ఉంటున్నారు. అర్జీదారులకు వ్యయాప్రయాసలు మినహా ఎలాంటి ఉపయోగం లేదు.
గ్రీవెన్స్ వైపు చూడని అధికారులు..
రెవెన్యూ భవన్‌లో నిర్వహిస్తున్న ‘ప్రజావాణి’కి కలెక్టర్, జేసీ, జెడ్పీ సీఈఓ, డీఆర్వో తదితర ఉన్నతాధికారులంతా హాజరై ప్రతి సోమవారం అర్జీలు స్వీకరిస్తున్నారు. ప్రభుత్వ శాఖల అధికారుల్లో చాలా మంది ప్రజావాణికి డుమ్మా కొడుతున్నారు. మరి కొన్ని శాఖల అధికారులు కింది స్థాయి అధికారులను పంపుతూ కాలం వెళ్లదీస్తున్నారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణికి అగ్నిమాపక శాఖ, పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీఈఈ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ అనంతపురం, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సీబీఆర్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ గుంతకల్లు, ఏడీసీసీ బ్యాంకు తదితర శాఖల అధికారులు అటు వైపు కన్నెత్తి చూడలేదు. డీఆర్‌డీఏ, డ్వామా, ఐసీడీఎస్ పీడీ, ఆర్‌డబ్ల్యూఎస్, డీపీఓ తదితర శాఖల అధికారులు కింది స్థాయి సిబ్బందిని పంపి చేతులు దులుపుకున్నారు.
పెండింగ్‌లో 1930 అర్జీలు..
ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను కేటగిరి -ఏ, బీ, సీ,డీ,ఈ,ఎఫ్, జీలుగా విభజిస్తారు. ఇప్పటిదాకా ఈ ఏడాదిలో ప్రజావాణిలో 27,974 అర్జీలు వచ్చాయి. వీటిలో 25,674 అర్జీలు పరిష్కరించినట్లు అధికారుల గణాంకాలు సూచిస్తున్నాయి. కేటగిరి-ఏలో 6,717 అర్జీలు రాగా, 6011 పరిష్కరించినట్లు చెబుతున్నారు. పెండింగ్‌లో 706 అర్జీలు ఉన్నాయి. బీ-కేటగిరిలో 5,515 అర్జీలు రాగా 4,797 అర్జీలు పరిష్కారం కాగా 354 పెండింగ్‌లో ఉన్నాయి. సీ-కేటగిరిలో 11,360 అర్జీలు రాగా 10,853 అర్జీలు పరిష్కరించారు. 501 పెండింగ్‌లో ఉన్నాయి. డీ-కేటగిరిలో 2,706 అర్జీలు రాగా 2,547 పరిష్కరించారు. 159 పెండింగ్‌లో ఉన్నాయి. ఈ-కేటగిరిలో 1,622 రాగా 1431 పరిష్కరించారు. 191 పెండింగ్‌లో ఉన్నాయి. జీ-కేటగిరిలో 54 రాగా 35 పరిష్కారించగా 19 పెండింగ్‌లో ఉన్నాయి. అధికారులు పరిష్కారమయ్యాయని చెబుతున్న వాటిలో వాస్తవంగా సగానికి సగం ఆయా విభాగాలకు పంపి పరిష్కారమైనట్లు రికార్డుల్లో రాస్తున్నట్లు తెలుస్తోంది.
వికలాంగుల బాధలు వర్ణనాతీతం
ప్రజావాణిలో సకలాంగుల సమస్యలపై వచ్చే అర్జీలను తీసుకునేందుకు ప్రాధాన్యత కల్పిస్తున్నారు. వికలాంగుల అర్జీలు తీసుకునేందుకు రెవెన్యూ భవన్ కిందనే ఏర్పాటు చేసినా అక్కడ ఉన్నతాధికారులు ఎవరూ లేకపోవడంతో వికలాంగులు అష్టకష్టాలు పడి ర్యాంప్ ఎక్కి రెవెన్యూభవన్‌లో వినతులు సమర్పిస్తున్నారు.
ఇచ్చీ.. ఇచ్చీ.. సాలైంది..
Published Tue, Dec 31 2013 3:40 AM | Last Updated on Fri, Jun 1 2018 8:59 PM
Advertisement
Advertisement