బదిలీ(ల)లు! | Transfers | Sakshi
Sakshi News home page

బదిలీ(ల)లు!

Published Sun, Jan 26 2014 2:53 AM | Last Updated on Fri, Jun 1 2018 8:47 PM

Transfers

 సాక్షి ప్రతినిధి, అనంతపురం : ఎన్నికలు ముంచుకొస్తోన్న వేళ కాంగ్రెస్ ‘మార్క్’ రాజకీయాలకు తెరలేచింది. మూడేళ్లకు మించి జిల్లాలో పనిచేస్తోన్న (ఎన్నికలను ప్రభావితం చేసే స్థాయి ఉన్న) అధికారులను సరిహద్దులు దాటించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. జిల్లాలో పాతుకుపోయిన కొందరు అధికారులు తమను లూప్‌లైన్ పోస్టులకు బదిలీ చేయించి.. సరిహద్దులు దాటించకుండా చూడాలని మంత్రులపై ఒత్తిడి తెస్తున్నారు.
 
 ఇదే అదునుగా తీసుకున్న మంత్రులు ఎన్నికల్లో తమకు సహకరిస్తామని పూర్తి స్థాయిలో హామీ ఇస్తే బదిలీ కాకుండా చూసుకుంటామని ప్రతిపాదిస్తున్నారు. ఆ ప్రతిపాదనకు అంగీకరించిన అధికారులను బదిలీ చేయొద్దంటూ కలెక్టర్ డీఎస్ లోకేష్‌కుమార్‌పై ఇద్దరు మంత్రులు తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం అప్రమత్తమైంది. సాధారణ ఎన్నికల ఏర్పాట్లకు తెరతీసింది. ఆర్డీవో, తహశీల్దార్, ఎమ్పీడీవో, సీఐ, ఎస్‌ఐ స్థాయి అధికారులు ఎన్నికలను ప్రభావితం చేస్తారని ఎన్నికల సంఘం భావిస్తోంది.
 
 మూడేళ్లకు మించి పనిచేస్తోన్న అధికారులను జిల్లా సరిహద్దులు దాటించాలని కలెక్టర్ డీఎస్ లోకేష్‌కుమార్, ఎస్పీ సెంథిల్‌కుమార్‌ను ఆదేశించింది. ఈ ప్రక్రియను ఫిబ్రవరి 10 నాటికి పూర్తి చేయాలని సూచించింది. జిల్లాలో మూడేళ్లకు మించి పనిచేస్తోన్న ఆర్డీవో స్థాయి అధికారులు నలుగురు, తహశీల్దార్లు 61 మంది, ఎమ్పీడీవోలు 51 మంది, సీఐలు 31 మంది ఉన్నారు. మూడేళ్లకు మించి జిల్లాలో పనిచేస్తోన్న 61 మంది ఎస్‌ఐలకు పోలీసు ఉన్నతాధికారులు ఇప్పటికే స్థానభ్రంశం కల్పించారు. సీఐల బదిలీల ఉత్తర్వులను రాయలసీమ ఐజీ రాజీవ్ రతన్ సోమవారం జారీ చేసే అవకాశం ఉంది. మంత్రులకు నమ్మినబంట్లుగా మారిన కొందరు సీఐలు సరిహద్దులు దాటడానికి మొరాయిస్తున్నారు. తమను పోలీసు ట్రైనింగ్ కళాశాలకు గానీ.. డీసీఆర్‌బీకీ గానీ.. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు గానీ బదిలీ చేయించాలని మంత్రులపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు.
 
 ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులు, 11 మంది తహశీల్దార్లు, ఎనిమిది మంది ఎమ్పీడీవోలు ఇదే రీతిలో మంత్రులపై ఒత్తిడి తెస్తున్నారు. తమ బదిలీలు ఆపించాలంటూ మంత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇదే అదునుగా భావించిన మంత్రులు మనసులోని మాటను బయటపెట్టారు. ఎన్నికల వేళ తమకు పూర్తి స్థాయిలో సహకరిస్తామని హామీ ఇస్తే ఎలాగోలా బదిలీలను అడ్డుకుంటామని హామీ ఇచ్చేస్తున్నారు. ఆ ప్రతిపాదనకు అధిక శాతం మంది అధికారులు అంగీకరించడంతో.. ఓ జాబితా ఇచ్చి ఆ బదిలీలను ఆపాలని కలెక్టర్, డీఐజీ, ఎస్పీలపై తీవ్రస్థాయిలో అమాత్యులు ఒత్తిడి తెస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో కీలక బాధ్యతలు నిర్వహిస్తోన్న ఓ ఆర్డీవో స్థాయి అధికారిని ఓ ప్రధాన శాఖలో అప్రాధాన్య పోస్టుకు సీనియర్ మంత్రి బదిలీ చేయించారు. మరో ఆర్డీవో స్థాయి అధికారిని కూడా ఇదే రీతిలో అప్రాధాన్య పోస్టుకు బదిలీ చేయించడానికి ఆ మంత్రే చక్రం తిప్పుతున్నారు. తనకు అత్యంత నమ్మకస్తులైన నలుగురు సీఐలకు స్థానభ్రంశం కల్పించకుండా చూడాలంటూ రాయలసీమ ఐజీ రాజీవ్ రతన్‌పై జూనియర్ మంత్రి ఒత్తిడి తెస్తున్నారు. అస్మదీయ తహశీల్దార్లు, ఎమ్పీడీవోల బదిలీల విషయంలో ఇద్దరు మంత్రులు కలెక్టర్ డీఎస్ లోకేష్‌కుమార్‌పై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు. మంత్రుల ఒత్తిళ్లకు తలొగ్గితే ఎన్నికల సంఘం ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని కలెక్టర్ ఆందోళన చెందుతున్నారు. ఇదే అంశాన్ని కలెక్టర్ వివరించినా మంత్రులు వెనక్కు తగ్గడం లేదని అధికారవర్గాలు వెల్లడించాయి.
 
 27, 29 తేదీల్లో హెచ్‌ఎంల సమావేశాలు
 అనంతపురం ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్ : ఉన్నత పాఠశాలల హెచ్‌ఎంలతో ఈ నెల 27, 29 తేదీల్లో సమావేశాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి మధుసూదన్‌రావు ఓ ప్రకటనలో తెలిపారు. 27న అనంతపురం, గుత్తి డివిజన్ల హెచ్‌ఎంలకు అనంతపురం కొత్తూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సమావేశం ఉంటుందన్నారు.
 
 29న ధర్మవరం డివిజన్ పరిధిలోని హెచ్‌ఎంలకు ధర్మవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాల, పెనుకొండ డివిజన్ పరిధిలోని పెనుకొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సమావేశం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పదో తరగతి విద్యార్థులకు సంబంధించి గ్రేడింగ్, సబ్జెక్టు టీచర్లు, ఇన్‌స్పైర్ ప్రపోజల్స్, 9వ తరగతి ఎస్సీ, ఎస్టీ బాలికల వివరాలు, అనంత విద్యార్థీ మేలుకో కార్యక్రమంలో భాగంగా సందర్శన రిపోర్టులు తీసుకురావాలని ఆదేశించారు. అనంతపురం, ధర్మవరం డివిజన్లకు ఉదయం, గుత్తి, పెనుకొండ డివిజన్లకు మధ్యాహ్నం సమావేశం ఉంటుందని వివరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement