Mark
-
రాజ్యసభ: మెజారిటీ మార్క్‌కి చేరిన ఎన్డీయే.. 12 మంది ఏకగ్రీవం
ఢిల్లీ: రాజ్యసభకు జరిగిన ఉప ఎన్నికల్లో తొమ్మిది మంది బీజేపీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో రాజ్యసభలో అధికార బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి మంగళవారం.. మెజారిటీ మార్కుని చేరుకుంది. బీజేపీ బలం 96కి చేరుకుంది. కూటమిగా చూస్తే ఎన్డీయే బలం 112కి చేరింది. అధికార కూటమికి ఆరుగురు నామినేటెడ్ ఎంపీలతో పాటు ఒక స్వతంత్ర సభ్యుడి మద్దతు కూడా ఉంది.మొత్తం 12 స్థానాలకు ఉప ఎన్నికలు జరగ్గా అన్ని స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 9 మంది బీజేపీ వారు కాగా, మరో మూడు స్థానాల్లో కాంగ్రెస్ నుంచి ఒకరు, ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం నుంచి ఒకరు, ఆర్ఎల్ఎం నుంచి ఒకరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.రాజ్యసభలో మొత్తం స్థానాలు 245 కాగా, ప్రస్తుతం ఎనిమిది ఖాళీగా ఉన్నాయి. ఇందులో జమ్మూ కాశ్మీర్ నుంచి 4 ఉండగా, మరో నాలుగు నామినేట్ చేయబడ్డాయి. ప్రస్తుతం రాజ్యసభలో సభ్యుల సంఖ్య 237 కాగా, మెజారిటీ మార్క్ 119. కాంగ్రెస్ బలం 27కి చేరుకోవడంతో ప్రతిపక్షం హోదాను దక్కించుకుంది. ప్రతిపక్ష నేత హోదా పొందాలంటే పార్టీకి కనీసం 25 మంది ఎంపీలు ఉండాలి. -
రికార్డుల ర్యాలీ
ముంబై: అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందడంతో పాటు బ్యాంకులు, ఐటీ షేర్లు రాణించడంతో స్టాక్ సూచీల రికార్డుల ర్యాలీ మూడో రోజూ కొనసాగింది. ఉదయం లాభాలతో మొదలైన సూచీలు రోజంతా పరిమిత శ్రేణిలో కదలాడి ఇంట్రాడే, ముగింపులో సరికొత్త రికార్డులు లిఖించాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పూర్తి ఆర్థిక సంవత్సరం(2024–25) కోసం వచ్చే నెలలో ప్రవేశపెట్టనున్న సమగ్ర బడ్జెట్ వృద్ధికి ప్రాధాన్యతనిస్తూనే., ప్రజారంజకంగా ఉంటుందని మార్కెట్ వర్గాలు విశ్వసిస్తున్నాయి. సెన్సెక్స్ ఉదయం 242 పాయింట్ల లాభంతో 77,235 వద్ద మొదలైంది. ట్రేడింగ్‌లో 374 పాయింట్లు పెరిగి 77,366 వద్ద జీవితకాల గరిష్టాన్ని తాకింది. చివరికి 308 పాయింట్ల లాభంతో 77,301 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో నిఫ్టీ 113 పాయింట్లు బలపడి 23,579 వద్ద రికార్డు గరిష్టాన్ని నమోదు చేసింది. ఆఖరికి 92 పాయింట్లు 23,558 వద్ద ముగిసింది. బ్యాంకులు, ఐటీతో పాటు రియలీ్ట, కన్జూమర్, యుటిలిటీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. బీఎస్ఈ స్మాల్, మిడ్ క్యాప్ సూచీలు 1శాతం, అరశాతం చొప్పున రాణించాయి. ఆటో, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అమెరికా మార్కెట్లు జీవితకాల గరిష్టానికి చేరుకోవడంతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఇన్వెస్టర్ల సంపద రయ్...సెన్సెక్స్ నాలుగోరోజూ రాణించడంతో బీఎస్ఈలోని నమోదిత కంపెనీల మొత్తం విలువ జీవితకాల గరిష్టానికి చేరింది. మంగళవారం ఒక్కరోజే రూ.2.42 లక్షల కోట్లు పెరగడంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ మార్కెట్ క్యాప్ రూ. 437.24 లక్షల కోట్లకు చేరింది. ఈ మొత్తం 4 రోజుల్లో రూ.10.29 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది.⇒ అమెరికా ఫ్యాషన్ దుస్తుల సంస్థ హానెస్ బ్రాండ్స్‌తో వ్యాపార కాంట్రాక్టు కొనసాగింపుతో పాటు జీబీఎస్టీతో కొత్త వ్యాపార భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవడంతో విప్రో షేరు 3% పెరిగి రూ.492 వద్ద ముగిసింది. ⇒ రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి 156 తేలికపాటి యుద్ధ హెలికాప్టర్ల కొనుగోళ్ల ఆర్డర్ దక్కించుకోవడంతో హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) షేరు 6 శాతం పెరిగి రూ. 5,533 వద్ద ముగిసింది. ట్రేడింగ్‌లో 7% ఎగసి రూ. 5,565 వద్ద ఏడాది గరిష్టాన్ని అందుకుంది. -
బీఐఎస్ గుర్తింపు తప్పనిసరి.. ఏ ఉత్పత్తులకంటే..
నాణ్యత కొనుగోలుదారుడి హక్కు అని భారతీయ ప్రమాణాల సంస్థ (బీఐఎస్) చెబుతోంది. ఈ క్రమంలో వివిధ వస్తువులు, ఉత్పత్తులు, పరికరాలు సహా అన్నీ బీఐఎస్ నిర్దేశిత ప్రమాణాల మేరకు ఉండాల్సిందేనని అధికారులు తెలిపారు. దేశ ప్రజలు నిత్యం వినియోగించే దాదాపు 344 వస్తువులకు విధిగా బీఐఎస్ నాణ్యత గుర్తు ఉండాల్సిందేనని స్పష్టం సంస్థ స్పష్టం చేసింది. విదేశాల నుంచి మన దేశానికి వస్తున్న మొబైల్ఫోన్లు సహా అనేక రకాల ఎలక్ట్రానిక్ వస్తువులకు బీఐఎస్ గుర్తింపు తప్పనిసరని తెలిపింది. బీఐఎస్ ఇప్పటి వరకూ సుమారు 20 వేల ప్రమాణాలను ధ్రువీకరించి అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిసింది. నాణ్యత లేని వస్తువుల దిగుమతిని అరికట్టడానికి, దేశీయ తయారీని పెంచడానికి ప్రభుత్వం స్విచ్, సాకెట్, కేబుల్ ట్రంక్.. వంటి ఎలక్ట్రికల్ వస్తువులకు నాణ్యత నిబంధనలను తప్పనిసరి చేసింది. ఎలక్ట్రికల్ యాక్సెసరీస్ (క్వాలిటీ కంట్రోల్) ఆర్డర్, 2023ని ఈ ఏడాది జనవరి 1న డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) జారీ చేసింది. ఈ ఆర్డర్ ప్రకారం ఎలక్ట్రిక్ వస్తువులకు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) గుర్తు తప్పనిసరి చేసింది. లేదంటే వాటిని ఉత్పత్తి చేయడం, విక్రయించడం, వ్యాపారం చేయడం, దిగుమతి చేయడం, నిల్వ చేయడం సాధ్యం కాదు. ఆర్డర్ వెలువడిన ఆరు నెలల నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయిని డీపీఐఐటీ తెలిపింది. ఎంఎస్ఎంఈ రంగాన్ని రక్షించడానికి అధికారులు నిబంధనల్లో కొన్ని సడలింపులు ఇచ్చినట్లు తెలుస్తుంది. చిన్న పరిశ్రమలకు అదనంగా తొమ్మిది నెలలు, మైక్రో ఎంటర్‌ప్రైజెస్‌లు 12 నెలల తర్వాత నిబంధనల పరిధిలోకి వస్తాయని సమాచారం. బీఐఎస్ చట్టంలోని నిబంధనలను ఉల్లంఘిస్తే, మొదటి నేరానికి గరిష్ఠంగా రెండేళ్ల జైలుశిక్ష లేదా కనీసం రూ.2 లక్షల జరిమానా విధించవచ్చు. రెండో, తదుపరి నేరాల విషయంలో మరింత కఠిన శిక్షలు ఉంటాయి. ఇదీ చదవండి: ప్రపంచంలోనే అతిచిన్న ఎలక్ట్రిక్ కారు.. ధర ఎంతంటే? బీఐఎస్ ప్రమాణాలను ఎలా నిర్ధారిస్తుందంటే.. తయారీదారులు, ప్రయోగశాలలు, సంబంధిత సైంటిస్టులు, నియంత్రణ సంస్థలు, వినియోగదారులు, ఆ రంగంలోని నిపుణులు కమిటీగా ఏర్పడి ప్రమాణాల ముసాయిదాను రూపొందిస్తారు. ఆపై భారతీయ ప్రమాణాలను తయారుచేస్తారు. ఏదైనా సంస్థ తయారు చేసిన వస్తువు నమూనా (శాంపిల్) తీసుకుని ప్రయోగశాలల్లో పరిశీలించి బీఐఎస్ నిర్దేశిత ప్రమాణాలు ఉంటే ఐఎస్ఐ మార్కు వినియోగానికి లైసెన్స్ కేటాయిస్తారు. -
భారత్‌లో స్టార్టప్ కంపెనీల సరికొత్త రికార్డ్! ఏకంగా..
భారత్‌లో పారిశ్రామిక చైతన్యం పెరుగుతూ వస్తోంది. పరిశ్రమలు స్థాపించి తమకు చేతనైనంత మందికి ఉపాధి కల్పించాలన్న స్పృహ యువతలో బాగా పెరిగింది. ఇందుకు అనుగుణంగా ప్రభుత్వం కూడా ప్రోత్సాహక విధానాలను అవలంభిస్తోంది. ఫలితంగా దీంతో దేశంలో స్టార్టప్ కంపెనీ సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రభుత్వ గుర్తింపు పొందిన స్టార్టప్‌ల సంఖ్య 2016లో 450 ఉండగా ప్రస్తుతం లక్షకు పైగా పెరిగిందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఓ కార్యక్రమంలో పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ 2047 నాటికి భారతదేశ ఆర్థిక వ్యవస్థ విపరీతమైన వృద్ధిని సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. (High Severity Warning: ఐఫోన్లు, యాపిల్ ప్రొడక్ట్స్‌కు హై సివియారిటీ వార్నింగ్!) భారతదేశంలో పరిశ్రమల స్థాపన, వాణిజ్యాన్ని సులభతరం చేయడానికి ప్రభుత్వం నిబద్ధతతో ఉందని పీయూష్ గోయల్ పేర్కొన్నారు. తద్వారా దేశంలో బిజినెస్ ప్రారంభించడం, నిర్వహించాడాన్ని సులభతరం చేసినట్లు వివరించారు. -
అన్ని రైళ్లకూ ‘X’ గుర్తు.. ‘వందే భారత్’కు ఎందుకు మినహాయింపు?
మనదేశంలోని అన్ని రైళ్ల చివరి బోగీ వెనుక ‘X’ గుర్తు కనిపిస్తుంది. దీనిని భద్రతా నియమాలను అనుసరిస్తూ రూపొందిస్తారు. ఈ ‘X’ గుర్తు రైలు చివరి బోగీని సూచిస్తుంది. అయితే వందేభారత్ రైలు చివరి బోగీకి మాత్రం ఈ ‘X’ గుర్తు కనిపించదు. వందేబారత్ ట్రైన్.. హై స్పీడ్ ట్రైన్. ఈ ట్రైన్ అంతా అటాచ్డ్గా ఉంటుంది. ఈ రైలు రెండు వైపుల నుంచి పరుగులు పెడుతుంది. అందుకే ఈ రైలుకు ‘X’ గుర్తు ఉండదు. రైల్వే విభాగం పలు భద్రతా చర్యలు చేపడున్న దృష్ట్యా పలు సిగ్నళ్లు, సైన్లను రూపొందించి, ఉపయోగిస్తుంది. ఈ కోవలోనే రైలు చివరి బోగీ వెనుక ‘X’ గుర్తు రూపొందిస్తారు. ఇది రైల్వే అధికారులను, సిబ్బందిని దృష్టిలో ఉంచుకుని రూపొందిస్తారు. ‘X’ గుర్తు రైలు చివరి బోగీని సూచిస్తుంది. రైలు ఏదైనా స్టేషన్ మీదుగా వెళ్లినప్పుడు రైల్వే సిబ్బంది ఆ రైలు చివరి బోగీపై ఉన్న ‘X’ గుర్తును చూస్తారు. దానిని గమనించాక ఆ రైలుకు అది చివరి బోగీ అని స్పష్టం చేసుకుంటారు. ఒకవేళ ‘X’ గుర్తు అనేది లేకపోతే.. ఆ రైలుకు వెనుకవైపు గల బోగీలు రైలు నుంచి విడిపోయాయని అర్థం. ఇలా జరిగితే వెంటనే రైల్వే సిబ్బంది కంట్రోల్ రూమ్‌కు పోన్ చేసి, ఆ రైలుకు గల వెనుక బోగీలు ఎక్కడో విడిపోయాయనే సమాచారాన్ని అందిస్తారు. అందుకే ఏ రైలుకైనా చివరి బోగీ వెనక ‘X’ గుర్తు ఉండటం ఎంతో ముఖ్య విషయమని రైల్వే సిబ్బంది భావిస్తారు. వందేభారత్ విషయానికొస్తే దీనికి ‘రైల్వే సురక్షా కవచ్’ అనే ప్రత్యేక ఫీచర్ ఉంది. ఈ ఫీచర్ అనుకోని విపత్తుల నుంచి ప్రయాణికులను రక్షిస్తుంది. వందేభారత్ ఎక్స్‌ప్రెస్ స్పీడు అధికారికంగా గంటకు 160 కిలోమీటర్లు. ఈ ఎక్స్‌ప్రెస్‌కు ఇంటెలిజంట్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా ఉంది. ఇది కూడా చదవండి: యువకుని ప్రాణాలు తీసిన మూమూస్ ఈటింగ్ ఛాలెంజ్ -
ఒకరు అంతరిక్షంలో.. ఒకరు అవనిపై..
వాషింగ్టన్: స్కాట్ కెల్లీ, మార్క్‌లు ఇద్దరూ కవలలు.. ఇద్దరి శరీర తీరు, ఆకారం, జన్యువులు దాదాపు ఒకేరకంగా ఉన్నాయి. ఒకవ్యక్తి అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రానికి వెళ్లాడు. 340 రోజుల పాటు అక్కడే గడిపాడు. మరొకరేమో భూమిపైనే ఉన్నాడు. సాధారణంగా మనలాగే ఇక్కడ గడిపాడు. ఈ ఏడాది పాటు వారిద్దరి శరీరంలో, జన్యు క్రమంలో జరిగిన మార్పులేంటి.. కెల్లీ భూమిపైకి వచ్చాక తిరిగి యథాస్థితికి వచ్చారా అనే విషయాలను తెలుసుకునేందుకు ఈ ఇద్దరు కవలలపై పరిశోధనలు చేసిన అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా.. పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. యూరీ గెగారిన్ అంతరిక్షంలోకి వెళ్లి 58 ఏళ్లు గడిచిన సందర్భంగా ఈ పరిశోధన వివరాలను శుక్రవారం నాసా తెలిపింది. ఏడాది పాటు మానవుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా మనుగడ సాగించగలడని చివరికి శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. 2015–16 మధ్య స్కాట్ కెల్లీ అంతరిక్షంలో 340 రోజుల పాటు జీవనం సాగించారు. అంతరిక్షంలోకి వెళ్లినప్పుడు గురుత్వాకర్షణ శక్తి ఉండకపోవడం, గంటకు దాదాపు 28 వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించడం వల్ల మన శరీరంలో కొన్ని మార్పులు జరిగి ఆ వాతావరణానికి అనుగుణంగా పనిచేస్తుంటుందని నాసాకు చెందిన స్టీవెన్ ప్లాట్స్ వివరించారు. శరీర బరువు, సూక్ష్మజీవులు, రక్తప్రసరణ, కొల్లాజెన్‌లో మార్పులు, ముఖ్యంగా జన్యువుల్లో అస్థిరత, రోగ నిరోధక శక్తి తదితర మార్పులు స్కాట్ కెల్లీలో సంభవించినట్లు తెలిపారు. అయితే భూమి మీదకు వచ్చాక కెల్లీ శరీరంలో సంభవించిన మార్పులన్నీ యథాస్థితికి వచ్చి, కవల సోదరుడి మాదిరిగానే మారిపోయినట్లు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. 12 యూనివర్సిటీలకు చెందిన 84 మంది శాస్త్రవేత్తలు 10 బృందాలుగా విడిపోయి అంతరిక్షంలో మానవ శరీరంలో జరిగే మార్పులను చాలా క్షుణ్నంగా అధ్యయనం చేశారు. అంతరిక్షంలో ఉన్న స్కాట్ కెల్లీ, భూమిపై ఉన్న మార్క్‌ల శారీరక, మానసిక మార్పులను తెలుసుకునేందుకు 27 నెలల పాటు వారి ప్లాస్మా, రక్తం, మల, మూత్రాల నమూనాలను అధ్యయనం చేశారు. ఈ అధ్యయనం ద్వారా అంతరిక్షంలో ఉండే వ్యోమగాములకు∙చికిత్స అందించేందుకు వీలు కలగనుంది. కెల్లీలో మార్పులివీ.. ► అంతరిక్షంలోకి చేరుకోగానే దాదాపు వెయ్యి జన్యువుల్లో మార్పులు ► కెరోటిడ్ ధమని దళసరిగా మారింది ► డీఎన్ఏకు నష్టం వాటిల్లింది ► జన్యువుల్లో మార్పులు సంభవించాయి ► కంటి రెటీనా మందంగా మారింది ► కడుపులోని బ్యాక్టీరియా స్థానాన్ని మార్చుకున్నాయి ► మేధస్సులో మార్పులు ► టీలోమర్లలో నిర్మాణాత్మక మార్పులు ► డీఎన్ఏలో జన్యుపరివర్తనం జరగలేదు ► ఫ్లూ వ్యాక్సిన్ భూమిపైలాగే పనిచేసింది ► వ్యాయామంతో బరువు తగ్గాడు ► ఎర్ర రక్తకణాల ఉత్పత్తికి తోడ్పడే ఫోలిక్ యాసిడ్ పెరిగింది ► చురుగ్గా రోగ నిరోధక శక్తి -
బ్లాక్ స్పాట్ల వద్ద ప్రమాద సంకేతాలు
రోడ్డు భద్రత కమిటీ సమావేశంలో కలెక్టర్ మిశ్రా కాకినాడ సిటీ : జిల్లాలోని జాతీయరహదారులు, ఇతర రహదారులలో ప్రమాదాలు సంభవించే అవకాశమున్న బ్లాక్ స్పాట్స్‌లో ప్రమాద సంకేతాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఆదేశించారు. కలెక్టరేట్ కోర్టు హాలులో మంగళవారం నిర్వహించిన జిల్లా రోడ్డు భద్రత కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వీటి వద్ద వేగ నియంత్రణ ఉండేలా కూడా సంకేతాలు ఉండాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు వాహనచోదకులకు అర్ధమయ్యే రీతిలో ప్రమాద సంకేతాలను తెలుగులో కూడా ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ పనులు వచ్చే 20 రోజుల్లో పూర్తి చేయాలని నేషనల్ హైవేస్ ప్రాజెక్ట్ డైరెక్టర్‌ను ఆదేశించారు. మద్యం మత్తులో డ్రైవింగ్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలోని ఎన్‌హెచ్–16, 216 రహదారిలో వాహనాలను నిలిపివేయడం వల్ల ప్రమాదాలు సంభవిస్తున్నాయని, వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ మేరకు అవసరమైన భూముల కోసం భూ సేకరణకు ప్రతిపాదనలు పంపాలని ఎన్‌హెచ్ అధికారులకు సూచించారు. నిబంధనలు ఉల్లంఘించే క్వారీ లారీలపై కేసులు నమోదు చేసి వాటిని స్వాధీన పర్చుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ విశాల్ గున్నీ మాట్లాడుతూ రోడ్డు నిర్మాణ సమయంలో కాంట్రాక్టర్లతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం లైటింగ్, ఇతర రోడ్డు భద్రత చర్యలు కూడా చేపట్టాలని సూచించారు. ఈ సమావేశంలో రాజమహేంద్రవరం అడిషనల్ ఎస్పీ రెడ్డి గంగాధర్‌రావు, ఇన్చార్జి డీటీసీ అశోక్‌కుమార్ ప్రసాద్, ఎన్‌హెచ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ వెంకటరత్నం, కాకినాడ ట్రాఫిక్ డీఎస్పీ కె.సత్యనారాయణ, మున్సిపల్ కమిషనర్లు, ఆర్అండ్బీ డీఈలు, పోలీస్, ఎన్‌హెచ్, ఎక్సైజ్ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ఈ అదృష్టం కోట్లలో ఒక్కరికే దక్కుతుంది...
లండన్: లండన్‌లోని వర్సెస్టర్‌షైర్ కౌంటీకి చెందిన 32 ఏళ్ల జోడి బెల్లింగల్, 33 ఏళ్ల మార్క్ దంపతులు ఎంతో అదృష్టవంతులు. వారిలాంటి అదృష్టం ప్రపంచంలో నాలుగు కోట్ల ఎనభై లక్షల మందిలో ఒక్కరికి మాత్రమే లభిస్తోంది. ఆగస్టు ఒకటవ తేదీనే వారిద్దరి పుట్టిన రోజు. వారికి అదే రోజున తొలి సంతానం కలిగింది. ఆ పాపకు ఆ దంపతులు లిబ్బీ అని ముద్దుగా పేరు పెట్టుకున్నారు. ఆ కుటుంబంలో వారి ముగ్గురి పుట్టిన రోజు వేర్వేరుగా ఉంటే వేర్వేరు రోజుల్లో పుట్టిన రోజు వేడుకలు జరపుకోవాల్సి వచ్చేది. ముగ్గురు పుట్టిన రోజును ఒకే రోజు జరుపుకోవడం వల్ల ఖర్చు కలిసొస్తుంది. ఖర్చుకు వెరవకపోయినా ఒక రోజునే జరుపుకోవడంలో ఓ థ్రిల్ ఉంది. ఘనంగా జరపుకునే వీలుంది. వాస్తవానికి డాక్టర్లు ఇచ్చిన డేట్ ప్రకారం జూలై 23వ తేదీన జోడి బెల్లింగల్ డెలివరీ కావాల్సి ఉంది. ఎందుకోగానీ తొమ్మిది రోజులు ఆలస్యంగా సహజసిద్ధంగానే డెలివరీ అయింది. ‘ఇది అద్భుతమైన విషయం. మా పుట్టిన రోజునే జన్మించేందుకు లిబ్బీ తొమ్మిది రోజుల పాటు నా కడుపులో నిరీక్షిందనే విషయం తలచుకుంటే ఒళ్లంతా పులకరించి పోతోంది. ఇది కాకతాళీయమే కావచ్చు. కానీ ఈ అద్భుతం నా జీవితంలో జరుగుతుందని నేనెన్నడూ ఊహించలేదు. ఇప్పటికీ నాకు నమ్మశక్యంగా లేదు’ అని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన జోడి బెల్లింగల్ వ్యాఖ్యానించారు. తమ పుట్టిన రోజు నాడే నాకు కూతురు జన్మించిందంటే ఆస్పత్రి నర్సులు కూడా ముందుగా నమ్మలేకపోయారు. ఆ తర్వాత వారంతా స్వీట్లు కొనుక్కొచ్చి తమ పాప పుట్టిన సందర్భాన్ని సెలబ్రేట్ చేశారని జోడి తెలిపారు. ‘ఇప్పుడు ఈ పాప మాకొక బహుమానం అల్లారుముద్దుగా చూసుకుంటాం. ఒకో రోజున ముగ్గురం పుట్టిన రోజును జరుపుకుంటాం’ అని ఆమె చెప్పారు. ప్రపంచంలో నాలుగు కోట్ల ఎనభై లక్షల మందిలో ఒక్కరికే ఇలాంటి అదృష్టం కలిసొస్తుందని, ఐర్లాండ్, ఇంగ్లండ్‌లో చట్టబద్ధంగా పలు బెట్టింగ్ షాపులను నడుపుతున్న బుక్‌మేకర్ పాడి పవర్ తెలిపారు. -
ఎల్జీబీటీ సంఘానికి జుకర్ బర్గ్ మద్దతు!
శాన్ ఫ్రాన్సిస్కోః ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్ బర్గ్ ఎల్జీబీటీ ప్రైడ్ పరేడ్ లో పాల్గొన్నారు. లెస్బియన్, గే, బై సెక్సువల్, ట్రాన్స్ జెండర్లు శాన్ ఫ్రాన్సిస్కోలో నిర్వహించిన పరేడ్ లో పాల్గొని, అనంతరం ఫేస్ బుక్ లో వారికి అందించే తోడ్పాటుతో కూడని విషయాలను వివరిస్తూ ఓ సుదీర్ఘ వ్యాసాన్ని పోస్టు చేశారు. మార్క్ జుకర్ బర్గ్ మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. అమెరికా శాన్ ఫ్రాన్సిస్కోలో నిర్వహించిన ఎల్జీబీటీ ప్రైడ్ మార్చ్ లో పాల్గొన్న ఆయన.. ఆ సమాజ సభ్యులకు తన అండదండలు ఎప్పుడూ ఉంటాయన్నారు. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు ప్రైడ్ పరేడ్స్ లో పాల్తొంటున్నారని, ఎల్జీబీటీ సమాజ సభ్యులతో తాను పెరేడ్ లో కలసి నిలబడటమే కాదు.. ఫేస్ బుక్ వారికి సురక్షితమైన స్థలంగా మార్చేందుకు కట్టుబడి ఉన్నానని జుకర్ బర్గ్ తన ఫేస్ బుక్ పోస్ట్ లో తెలిపారు. తమకూ స్వేచ్ఛా, ఆనందం, జీవించే హక్కు కావాలని కోరుకుంటున్న వారిని గౌరవిస్తూ వారితో కలసి తాను ఎల్జీబీటీ నిర్వహించే నెలవారీ ప్రైడ్ సంబరాలు జరుపుకుంటున్నానని, సమానత్వంకోసం వారు చేసే పోరాటంలోనూ తాను పాల్గొన్నానని తెలిపారు. వారి సమస్యల పోరాటానికి ప్రత్యేకంగా పనిచేస్తానని తెలిపారు. ఎల్జీబీటీ ప్రైడ్ పరేడ్ కు మద్దతు పలికిన టెక్ సీఈవోల్లో ఫేస్ బుక్ సీఈవో జుకర్ బర్గ్ మాత్రమే కాక... యాపిల్ సీఈవో టిమ్ కుక్, వారి ఉద్యోగులు కూడ పాల్గొని ఎల్జీబీటీ హక్కుల పోరాటానికి మద్దతు పలికారు. -
అమెరికాను మించిపోయారు..!
ప్రపంచ దేశాల్లో జనాభా విషయంలో ముందున్న చైనా.. ఇప్పుడు ఇంటర్నెట్ వాడకంలోనూ రికార్డు సృష్టిస్తోంది. నెట్వర్క్ వాడకందార్లు ప్రతి సంవత్సరం రికార్డు స్థాయిలో పెరిగిపోతున్నట్లు తాజా నివేదికలు చెప్తున్నాయి. ప్రపంచంలోనే అన్ని దేశాలకన్నా ఇంటర్నెట్ వాడకంలో చైనా ప్రజలే ముందున్నట్లు అధికారిక లెక్కలు చెప్తున్నాయి. దీన్నిబట్టి చైనా నెటిజన్ల సంఖ్య అమెరికా జనాభాతో పోలిస్తే రెండు రెట్లు ఎక్కువని తెలుస్తోంది. దేశ జనాభాలో 90 శాతం మంది నెటిజన్లు ఉన్నారని చైనా అధికారికంగా వెల్లడించింది. దేశంలో ఇంటర్నెట్ వాడకందార్ల సంఖ్య గత సంవత్సరం సుమారు 70 కోట్లకు చేరింది. 2015 నాటికి చైనాలో నెటిజన్ల సంఖ్య 68.8 కోట్లు ఉన్నట్లు చైనా ఇంటర్నెట్ నెట్ వర్క్ ఇన్ఫర్మేషన్ సెంటర్ (సీఎన్ఎన్ఐసీ ) తెలిపింది. ఈ లెక్కల ప్రకారం ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన చైనాలో సగం మంది ప్రజలు నెట్ వాడుతున్నట్లు అర్థమౌతోంది. వీరిలో 90 శాతం మంది మొబైల్ ఫోన్లలోనే ఇంటర్నెట్ వాడుతున్నట్లు సీఎన్ఎన్ఐసీ లెక్కలు చెప్తున్నాయి. ఇకపోతే మూడింట ఒక వంతు డెస్క్ టాప్ కంప్యూటర్ల నూ, సుమారు నలభై శాతం మంది ల్యాప్ టాప్ల్లో నెట్ వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. అన్లైన్ వాడేవారి సంఖ్య పెరగడంవల్ల చైనాలో ఇటీవలి సంవత్సరాలలో టెక్ సంస్థలు బ్రహ్మాండమైన వృద్ధిని చవి చూస్తున్నట్లు నిపుణులు సైతం చెప్తున్నారు. జనాభా సంఖ్యతోపాటు, గ్రేట్ వాల్‌తో ప్రత్యేక గుర్తింపు కలిగిన చైనా ఇప్పుడు ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్యలోనూ ప్రపంచంలోనే ముందు స్థానంలో నిలుస్తోంది. -
ఒక్క నెలలో 252 సినిమాలు చూసేశాడు!
ఆన్లైన్లో సినిమాల్ని అందించేందుకు అనేక వెబ్‌సైట్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిలో నెలవారీ ప్యాకేజ్‌లు అందించే సైట్లూ ఉన్నాయి. అలాంటివాటిలో ఒకటి నెట్‌ఫ్లిక్స్. ఈ సైట్‌కు కొంత రుసుము చెల్లిస్తే నెల రోజులపాటు కావాల్సినన్ని సినిమాల్ని నిరంతరం ఉచితంగా చూడొచ్చు. ఇలా చాలా మంది సబ్‌స్క్రైబ్ చేసుకున్నప్పటికీ చెల్లించిన డబ్బు విలువకి తగిన సినిమాలు చూసే వారు కొందరే. ఎందుకంటే మంత్లీ సబ్‌స్క్రైబ్ చేసుకున్నా మనం చూసే సినిమాలు ఓ పది, ఇరవై మించవు కదూ! కానీ అమెరికాకు చెందిన నటుడు, రచయిత అయిన మార్క్ మాల్కోఫ్ నెట్‌ఫ్లిక్స్‌లో ఒక నెల పాటు సబ్‌స్క్రైబ్ పొంది ఆ నెలలో ఏకంగా 252 సినిమాల్ని చూశాడు. ఈ సైట్లో అందుబాటులో ఉండే సింప్సన్ కార్టూన్స్‌కు చెందిన సినిమాల్ని దాదాపు 404 గంటలపాటు చూశాడు. ఒకనెలలో సగటున 744 గంటలు ఉంటే ఆయన 404 గంటల్ని సినిమాలు చూసేందుకే కేటాయించాడు. -
ఎట్టకేలకు క్రికెట్ లెజండ్ మౌనం వీడాడు
న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో భారత క్రికెట్ మాజీ కెప్టెన్ సచిన్ టెండూల్కర్ నోరు విప్పారు. రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన తర్వాత.. దాదాపు మూడేళ్ల నుంచి మౌనంగానే ఉన్న ఆయన రెండు ప్రశ్నలు అడిగి అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నారు. అద్భుతమైన ఆటతీరుతో, మెరుపువేగంతో చెలరేగి సెంచరీలు సాధించిన లెజండ్ పార్లమెంటులో తొలి షాట్ కొట్టాడు. 2012 జూన్‌లో రాజ్యసభకు నామినేటెడ్ సభ్యుడిగా ఎన్నికైన ఈ క్రికెట్ లెజెండ్ సోమవారం మాట్లాడారు. సభలో ప్రశ్నోత్తరాల సమయంలో ముంబై మెట్రోకు సంబంధించి ఒక ప్రశ్నను అడిగారు. కోల్‌కతాలో ఉన్నట్లు ముంబై మెట్రోకు కూడా ప్రత్యేక జోన్ కావాలని కోరారు. దీనికి రైల్వే మంత్రి మెట్రో సేవల విభాగంలో కోల్‌కతాకు ఒక ప్రత్యేకస్థానం ఉందని, దానితో ముంబైని పోల్చలేమన్నారు. ప్రత్యేక జోన్‌గా ప్రకటించడం సాధ్యం కాదని సమాధానం చెప్పారు. దీంతోపాటు డ్రైవింగ్ లైసెన్స్ జారీ ప్రక్రియలో మార్పులకు సంబంధించిన మరో ప్రశ్నను కూడా సచిన్ అడిగారు. కాగా క్రీడారంగంలో అందించిన విశిష్ట సేవలకు గాను రాజ్యసభకు ఎన్నికైన లిటిల్ మాస్టర్ ఇటీవలి కాలంలో విమర్శల పాలయ్యారు. వివిధ సందర్భాల్లో సభకు హాజరు కాకపోవడం, హాజరైనా మౌనంగా ఉండటంపై విమర్శలు చెలరేగిన సంగతి తెలిసిందే. -
’అనుకున్న స్థాయిలో విజయం సాధించలేకపోయాం’
-
మనలో మచ్చ, మన మీది మచ్చ
నేను ‘పుట్టుమచ్చ’ ఎప్పుడూ మొదటిసారే చదువుతాను. ఎప్పుడు చదివినా ఇది ఇంతకుముందు చదివినదే సుమా అనిపించదు. చదువుతాను అన్నాను కదా, కాదు వింటాను. ఆ పద్యం చదువుతున్నట్టు అనిపించదు. వింటున్నట్టుంటుంది. ఈ పద్యంలో గొంతుక గుక్క తిప్పుకోనివ్వకుండా తన మాటల్ని నాకు వినిపిస్తుంది. మాట తరవాత మాట, రకరకాల వేగాలతో ఆవరించుకుంటాయి నన్ను ఆ పద్యంలోని మాటలు. మొదటి మాటే నన్ను హఠాత్తుగా ఆపి ఒక ప్రమాదకరమైన కష్టాన్ని గురించి వినిపిస్తుంది. ‘‘ఒక కట్టుకథ నన్ను కాటేసింది.’’ నాకు కాటేసింది అనే మాట వినేసరికి అదేదో ప్రమాదపు విషపు నాగు గుర్తొచ్చి కొంచెం కంగారు పడుతుండగా ఇంకొంచెం ఆలోచించుకోవడానికి చోటివ్వకుండా ‘ఒక వక్రీకరణ’, ‘ఒక అపనింద’ నన్ను చుట్టుముట్టి, నా దృష్టిని నా చుట్టూ వున్న మనుషుల వైపు మళ్లిస్తాయి. నేను వింటూనే వుంటాను. నాకు కొన్ని వివరాలు, ఆచూకీలు, పుట్టిన తేదీలతో సహా చెప్తాడీయన. నాకా గొంతుక కొత్త. ఈ కథ కొత్తది. కొంత విన్నాక తెలుస్తుంది. ఆ గొంతుకలో వ్యక్తి తన కథనే చెప్తున్నాడు అని. 1955 ఆగస్టు 10 అలా గుర్తుండిపోతుంది. ‘‘నేను పుట్టకముందే దేశద్రోహుల జాబితాలో నమోదైంది నా పేరు.’’ ఆ మాట వినేసరికి నేను ఉలిక్కిపడతాను. ఒకవేళ ఆ పాపానికి నేను కూడా కారణమా అని. ఎందుకంటే అంతకుముందే నేను పుట్టాను. ఆ తర్వాత గుక్క తిప్పుకోకుండా చరిత్ర మీద, పాఠ్యపుస్తకాల మీద రాయి మీద రాయి విసిరినట్టు మాటలు వినిపిస్తాయి. హఠాత్తుగా 1947 నేననుకుంటున్న అందమైన అంకె కాదు, అది ఒక దారుణం, మనుషుల్ని విడదీసిన విషాదానికి గుర్తు అని చటుక్కున బోధపడుతుంది. నా బొమ్మ చెదిరిపోతుంది. నా ఇంట కన్ను తెరిచిన నవజాత శిశువు తెగ్గోసుకున్న తల్లిపేగు చివర తడియారని నెత్తుటి బొట్టులో కనిపిస్తుంది ఈ 1947. ఇది మూడురంగుల పండుగ కాదు. ఆ పుట్టినవాడు ముస్లిం. మనవాడు కాదు అని గుర్తుచేస్తుంది ఈ 1947. తరవాత వినిపించే నినాదాలు నినాదాలు చేసే పనే చేస్తాయి. ఆలోచనకి చోటివ్వకుండా నా చుట్టూ ఆవేశాన్ని నింపుతాయి. మీకిష్టం లేకపోతే ‘పాకిస్తాన్ వెళ్లిపొండి’ అని ఇప్పటి హిందూ రాజకీయ నాయకులు చెప్తున్న మాటలు నా బుర్ర నిండా తిరుగుతాయి. పేరుకు రాజ్యాంగమైతే వుంది. అది శిలాక్షరం. అంటే రాతి మాట. దానికి మూడు సింహాల బొమ్మ రాతి గుర్తు. ఆ తరువాత వరుసగా కుట్ర కుట్ర కుట్ర అని జలపాతంగా వచ్చే మాటలు వింటూ వుంటే... నేను పెళ్లాడటం కుట్ర నేను పిల్లల్ని కనడం కుట్ర అనేసరికి నా మనసు నన్ను నిలబెట్టి ప్రశ్నిస్తుంది. నువ్వేమిటి చేస్తున్నావు ఇన్నాళ్లూ అని . రోడ్డుపక్క పేవుమెంటు మీద పూలమ్ముకునేవాళ్లు, పళ్లూ, పల్లీలు అమ్ముకునేవాళ్లు, గొడుగులు బాగుచేసేవాళ్లు, వీధరుగుల మీద కుట్టు పనిచేసేవాళ్లు, వాళ్లు కూడా ముస్లిములే సుమా. వాళ్లు ఎవరికీ ఏ అపకారమూ చేయలేదే. కాని వాళ్ల రక్తమే రోడ్లమీద పారుతుంది. పుట్టుమచ్చ అంటే మనకు తెలుసు. మనందరికీ వుంటాయి పుట్టుమచ్చలు. పుట్టుకతో శరీరం మీద వచ్చే మచ్చలివి. జాతకాలు చూసేటప్పుడు ఆ పుట్టుమచ్చలు ఎక్కడ వుంటే లాభమో, ఎక్కడ వుంటే నష్టమో చెప్తారు. బుగ్గమీదో, గడ్డం కిందో అందంగా కనిపిస్తుంది కూడా ఈ పుట్టుమచ్చ. మన వ్యక్తిత్వాన్ని నిర్ధారించుకోవడానికి గుర్తులుగా మన సర్టిఫికేటులో రాసేది ఈ పుట్టుమచ్చ ఉన్న చోటే. ఇది పుట్టుకతో వచ్చిన మచ్చ కాబట్టి దీనికి ఇన్ని విశేషమైన అందాలూ, అర్థాలూ వచ్చాయి. కాని ఈ పద్యం చెప్పేది ఆ పుట్టుమచ్చ గురించి కాదు. పుట్టడమే ఒక మచ్చ. పుట్టుకే ఒక మచ్చ. ఈ పద్యంలో పుట్టుమచ్చ అది. ఈ మాటకి అర్థం తెలిసేసరికి నాకు ఒళ్లు ఒణుకుతుంది. ‘‘నేను పుట్టకముందే దేశద్రోహుల జాబితాలో నమోదైంది నా పేరు.’’ ఆ మాట వినేసరికి నేను ఉలిక్కిపడతాను. ఒకవేళ ఆ పాపానికి నేను కూడా కారణమా అని.ఈ పద్యం చాలాసార్లు చదివాను. అంటే విన్నాను. ఇది భారతదేశపు చరిత్రలో శాశ్వతంగా వినిపించే గొంతుక. ఈ గొంతుకకి భాష లేదు. ఈ పద్యానికీ లేదు. అంచేత ఇది ఏ భాషలో అయినా గొప్ప పద్యమే. రామచంద్ర గుహ ‘ఇండియా ఆఫ్టర్ గాంధీ’ పుస్తకంలో ఈ పద్యంలో కొన్ని భాగాలు ఉదహరించిన తరువాత ఇంకా చాలామంది చదివారు. ఈ పద్యపు పూర్తి అనువాదం నా ‘హైబిస్కస్ ఆన్ ది లేక్, ట్వంటీయత్ సెంచరీ తెలుగు పొయట్రీ ఫ్రమ్ ఇండియా’ పుస్తకంలో వుందని చూసి చాలా అమెరికన్ విశ్వవిద్యాలయాలలో ఈ పద్యాన్ని పాఠాలుగా చెప్పారు. ఒక కవి తన గొంతుకని ఒక సమూహపు గొంతుకగా చేయగలగడం సాహిత్యంలో చాలాసార్లు జరగదు. ఒకవేళ జరిగినా అది ఒక నినాదమో, ఒక ఆవేశమో అవుతుంది కానీ చరిత్రనీ, జీవన విధానాన్నీ అమాయకుల మీద అధికారం చేసిన అన్యాయాన్ని వివరంగా చెప్పే గొంతుక అవదు. ఖాదర్ ఈ శతాబ్దపు కవి. అతని గొంతుక ఈ శతాబ్దపు ప్రపంచపు గొంతుక. ఇది అమాయకంగా దెబ్బతింటున్న ముస్లిముల గొంతుక మాత్రమే కాదు. ప్రపంచంలో ఎక్కడ బల మైన ఎక్కువ మంది బలంలేని తక్కువమందిని వాళ్ల అవసరాల కోసం, వాళ్ల అధికారం నిలబెట్టుకోవడం కోసం శత్రువులుగా మారుస్తారో వాళ్లందరి గొంతుక ఇది. వాళ్లకి పేరు మతం మూలంగా వచ్చి ఉండొచ్చు. ఒంటి రంగు మూలంగా వచ్చి ఉండవచ్చు. కులం పేరుతో వచ్చి ఉండొచ్చు - కాని ఆళ్లంతా పేదవాళ్లు, దిక్కులేనివాళ్లు. వాళ్లంతా ‘వాళ్లు’ అధికారంలో వున్నవాళ్లు అంతా ‘మనం’ అనుకొని విడదీసి, ఎడంపెట్టి, వికారంగా వేరు పెట్టిన ‘వాళ్లు’. వాళ్ల గొంతుక ఖాదర్. - వెల్చేరు నారాయణరావు (1991 నాటి ‘పుట్టుమచ్చ’ ద్వితీయ ముద్రణ రేపు వస్తోంది. దానికిగానూ రాసిన ముందుమాట సంక్షిప్తంగా...) ఆగస్టు 10న ఖాదర్ మొహియుద్దీన్ ‘షష్టిపూర్తి’. -
200 ఏళ్లకు ఒక అమ్మాయి జన్మించింది
సమ్‌థింగ్ స్పెషల్ ‘అమ్మాయే పుడుతుంది.. అచ్చం అమ్మలాగే ఉంటుంది...’ అంటూ ల్యారీల కుటుంబం రెండువందల సంవత్సరాల నుంచి ఎదురుచూస్తోంది. అయితే ప్రతిసారీ నాన్నలాంటి అబ్బాయిలే పుడుతూ వస్తున్నారు. ఈ పరంపర రెండు వందల సంవత్సరాల నుంచి కొనసాగుతోంది. అయితే ఎట్టకేలకు తాజాగా ఆ ఇంట ఒక బుజ్జిపాప పుట్టింది. దీంతో ఆ కుటుంబం ఇప్పుడు ఉబ్బితబ్బిబయిపోతోంది. ల్యారీల వంశ వృక్షాన్ని రెండువందల ఏళ్లుగా పరిశీలించి చూస్తే ఒక్క అమ్మాయంటే ఒక్క అమ్మాయీ ఉండదు. 1809లో చివరగా ఆ ఇంట ఒక పాప జన్మించింది. అప్పటి నుంచి తరాలు మారిపోతున్నా.. ఆ ఇంట మగశిశువులు తప్ప ఆడశిశువుల జాడ లేదు. అబ్బాయిలు పుడుతున్నారు.. పెద్ద అవుతున్నారు, వారికి పెళ్లిళ్లు అవుతున్నాయి... సంతానం కలుగుతోంది. ఆ సంతానమంతా అబ్బాయిలే! కొన్ని తరాల కిందటే ల్యారీల వంశం తమ ఇంట్లో ఆడశిశువుల జననం కలగడం లేదని అర్థం చేసుకొంది. కుటుంబం విస్తరిస్తున్నా.. ఏ ఒక్కరికీ అమ్మాయి పుట్టలేదు. అన్నీ గడ్డాలూ, మీసాలే! ఒక అక్క కావాలి, ఒక చెల్లి ఉండాలి, కూతురు కావాలి... అనే తపన మొదలైంది. ల్యారీల ఇంటికి వచ్చిన కోడళ్లను కూడా లోటు వేధించసాగింది. ఆడపిల్ల కోసం ఆ కుటుంబం పరితపించింది. ఐదు తరాల ఈ ఆవేదనను తీరుస్తూ ఇటీవలే ఆ ఇంట్లో పాపపుట్టింది. ల్యారీల వంశంలోని మార్క్‌కు నలుగురబ్బాయిల తర్వాత ఐదో సంతానంగా పాపపుట్టింది. దీంతో ఇప్పుడు ఆ కుటుంబం చాలా ఆనందపడుతోంది. ఐదు తరాలుగా తమ ఇంట్లో అమ్మాయిలే లేరని.. ఇప్పుడు పాప పుట్టడంతో తమ కుటుంబం మొత్తం ఎంత ఆనందిస్తోందో చెప్పడానికి మాటలు చాలడం లేదని మార్క్ అంటున్నాడు. తన భార్య హన్నా వల్ల ఈ అదృష్టం కలిసి వచ్చిందని మార్క్ మెరుస్తున్న కళ్లతో చెబుతున్నాడు! -
ఎన్నికల వేళ ''వేలు'' లొల్లి
-
బదిలీ(ల)లు!
సాక్షి ప్రతినిధి, అనంతపురం : ఎన్నికలు ముంచుకొస్తోన్న వేళ కాంగ్రెస్ ‘మార్క్’ రాజకీయాలకు తెరలేచింది. మూడేళ్లకు మించి జిల్లాలో పనిచేస్తోన్న (ఎన్నికలను ప్రభావితం చేసే స్థాయి ఉన్న) అధికారులను సరిహద్దులు దాటించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. జిల్లాలో పాతుకుపోయిన కొందరు అధికారులు తమను లూప్‌లైన్ పోస్టులకు బదిలీ చేయించి.. సరిహద్దులు దాటించకుండా చూడాలని మంత్రులపై ఒత్తిడి తెస్తున్నారు. ఇదే అదునుగా తీసుకున్న మంత్రులు ఎన్నికల్లో తమకు సహకరిస్తామని పూర్తి స్థాయిలో హామీ ఇస్తే బదిలీ కాకుండా చూసుకుంటామని ప్రతిపాదిస్తున్నారు. ఆ ప్రతిపాదనకు అంగీకరించిన అధికారులను బదిలీ చేయొద్దంటూ కలెక్టర్ డీఎస్ లోకేష్కుమార్పై ఇద్దరు మంత్రులు తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం అప్రమత్తమైంది. సాధారణ ఎన్నికల ఏర్పాట్లకు తెరతీసింది. ఆర్డీవో, తహశీల్దార్, ఎమ్పీడీవో, సీఐ, ఎస్ఐ స్థాయి అధికారులు ఎన్నికలను ప్రభావితం చేస్తారని ఎన్నికల సంఘం భావిస్తోంది. మూడేళ్లకు మించి పనిచేస్తోన్న అధికారులను జిల్లా సరిహద్దులు దాటించాలని కలెక్టర్ డీఎస్ లోకేష్‌కుమార్, ఎస్పీ సెంథిల్‌కుమార్‌ను ఆదేశించింది. ఈ ప్రక్రియను ఫిబ్రవరి 10 నాటికి పూర్తి చేయాలని సూచించింది. జిల్లాలో మూడేళ్లకు మించి పనిచేస్తోన్న ఆర్డీవో స్థాయి అధికారులు నలుగురు, తహశీల్దార్లు 61 మంది, ఎమ్పీడీవోలు 51 మంది, సీఐలు 31 మంది ఉన్నారు. మూడేళ్లకు మించి జిల్లాలో పనిచేస్తోన్న 61 మంది ఎస్ఐలకు పోలీసు ఉన్నతాధికారులు ఇప్పటికే స్థానభ్రంశం కల్పించారు. సీఐల బదిలీల ఉత్తర్వులను రాయలసీమ ఐజీ రాజీవ్ రతన్ సోమవారం జారీ చేసే అవకాశం ఉంది. మంత్రులకు నమ్మినబంట్లుగా మారిన కొందరు సీఐలు సరిహద్దులు దాటడానికి మొరాయిస్తున్నారు. తమను పోలీసు ట్రైనింగ్ కళాశాలకు గానీ.. డీసీఆర్‌బీకీ గానీ.. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కు గానీ బదిలీ చేయించాలని మంత్రులపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులు, 11 మంది తహశీల్దార్లు, ఎనిమిది మంది ఎమ్పీడీవోలు ఇదే రీతిలో మంత్రులపై ఒత్తిడి తెస్తున్నారు. తమ బదిలీలు ఆపించాలంటూ మంత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇదే అదునుగా భావించిన మంత్రులు మనసులోని మాటను బయటపెట్టారు. ఎన్నికల వేళ తమకు పూర్తి స్థాయిలో సహకరిస్తామని హామీ ఇస్తే ఎలాగోలా బదిలీలను అడ్డుకుంటామని హామీ ఇచ్చేస్తున్నారు. ఆ ప్రతిపాదనకు అధిక శాతం మంది అధికారులు అంగీకరించడంతో.. ఓ జాబితా ఇచ్చి ఆ బదిలీలను ఆపాలని కలెక్టర్, డీఐజీ, ఎస్పీలపై తీవ్రస్థాయిలో అమాత్యులు ఒత్తిడి తెస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో కీలక బాధ్యతలు నిర్వహిస్తోన్న ఓ ఆర్డీవో స్థాయి అధికారిని ఓ ప్రధాన శాఖలో అప్రాధాన్య పోస్టుకు సీనియర్ మంత్రి బదిలీ చేయించారు. మరో ఆర్డీవో స్థాయి అధికారిని కూడా ఇదే రీతిలో అప్రాధాన్య పోస్టుకు బదిలీ చేయించడానికి ఆ మంత్రే చక్రం తిప్పుతున్నారు. తనకు అత్యంత నమ్మకస్తులైన నలుగురు సీఐలకు స్థానభ్రంశం కల్పించకుండా చూడాలంటూ రాయలసీమ ఐజీ రాజీవ్ రతన్‌పై జూనియర్ మంత్రి ఒత్తిడి తెస్తున్నారు. అస్మదీయ తహశీల్దార్లు, ఎమ్పీడీవోల బదిలీల విషయంలో ఇద్దరు మంత్రులు కలెక్టర్ డీఎస్ లోకేష్కుమార్పై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు. మంత్రుల ఒత్తిళ్లకు తలొగ్గితే ఎన్నికల సంఘం ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని కలెక్టర్ ఆందోళన చెందుతున్నారు. ఇదే అంశాన్ని కలెక్టర్ వివరించినా మంత్రులు వెనక్కు తగ్గడం లేదని అధికారవర్గాలు వెల్లడించాయి. 27, 29 తేదీల్లో హెచ్ఎంల సమావేశాలు అనంతపురం ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్ : ఉన్నత పాఠశాలల హెచ్ఎంలతో ఈ నెల 27, 29 తేదీల్లో సమావేశాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి మధుసూదన్‌రావు ఓ ప్రకటనలో తెలిపారు. 27న అనంతపురం, గుత్తి డివిజన్ల హెచ్ఎంలకు అనంతపురం కొత్తూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సమావేశం ఉంటుందన్నారు. 29న ధర్మవరం డివిజన్ పరిధిలోని హెచ్ఎంలకు ధర్మవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాల, పెనుకొండ డివిజన్ పరిధిలోని పెనుకొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సమావేశం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పదో తరగతి విద్యార్థులకు సంబంధించి గ్రేడింగ్, సబ్జెక్టు టీచర్లు, ఇన్స్పైర్ ప్రపోజల్స్, 9వ తరగతి ఎస్సీ, ఎస్టీ బాలికల వివరాలు, అనంత విద్యార్థీ మేలుకో కార్యక్రమంలో భాగంగా సందర్శన రిపోర్టులు తీసుకురావాలని ఆదేశించారు. అనంతపురం, ధర్మవరం డివిజన్లకు ఉదయం, గుత్తి, పెనుకొండ డివిజన్లకు మధ్యాహ్నం సమావేశం ఉంటుందని వివరించారు.