తన సోదరుడు మార్క్‌తో వ్యోమగామి కెల్లీ(కుడి)
వాషింగ్టన్: స్కాట్ కెల్లీ, మార్క్‌లు ఇద్దరూ కవలలు.. ఇద్దరి శరీర తీరు, ఆకారం, జన్యువులు దాదాపు ఒకేరకంగా ఉన్నాయి. ఒకవ్యక్తి అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రానికి వెళ్లాడు. 340 రోజుల పాటు అక్కడే గడిపాడు. మరొకరేమో భూమిపైనే ఉన్నాడు. సాధారణంగా మనలాగే ఇక్కడ గడిపాడు. ఈ ఏడాది పాటు వారిద్దరి శరీరంలో, జన్యు క్రమంలో జరిగిన మార్పులేంటి.. కెల్లీ భూమిపైకి వచ్చాక తిరిగి యథాస్థితికి వచ్చారా అనే విషయాలను తెలుసుకునేందుకు ఈ ఇద్దరు కవలలపై పరిశోధనలు చేసిన అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా.. పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది.
యూరీ గెగారిన్ అంతరిక్షంలోకి వెళ్లి 58 ఏళ్లు గడిచిన సందర్భంగా ఈ పరిశోధన వివరాలను శుక్రవారం నాసా తెలిపింది. ఏడాది పాటు మానవుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా మనుగడ సాగించగలడని చివరికి శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. 2015–16 మధ్య స్కాట్ కెల్లీ అంతరిక్షంలో 340 రోజుల పాటు జీవనం సాగించారు. అంతరిక్షంలోకి వెళ్లినప్పుడు గురుత్వాకర్షణ శక్తి ఉండకపోవడం, గంటకు దాదాపు 28 వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించడం వల్ల మన శరీరంలో కొన్ని మార్పులు జరిగి ఆ వాతావరణానికి అనుగుణంగా పనిచేస్తుంటుందని నాసాకు చెందిన స్టీవెన్ ప్లాట్స్ వివరించారు.
శరీర బరువు, సూక్ష్మజీవులు, రక్తప్రసరణ, కొల్లాజెన్‌లో మార్పులు, ముఖ్యంగా జన్యువుల్లో అస్థిరత, రోగ నిరోధక శక్తి తదితర మార్పులు స్కాట్ కెల్లీలో సంభవించినట్లు తెలిపారు. అయితే భూమి మీదకు వచ్చాక కెల్లీ శరీరంలో సంభవించిన మార్పులన్నీ యథాస్థితికి వచ్చి, కవల సోదరుడి మాదిరిగానే మారిపోయినట్లు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. 12 యూనివర్సిటీలకు చెందిన 84 మంది శాస్త్రవేత్తలు 10 బృందాలుగా విడిపోయి అంతరిక్షంలో మానవ శరీరంలో జరిగే మార్పులను చాలా క్షుణ్నంగా అధ్యయనం చేశారు. అంతరిక్షంలో ఉన్న స్కాట్ కెల్లీ, భూమిపై ఉన్న మార్క్‌ల శారీరక, మానసిక మార్పులను తెలుసుకునేందుకు 27 నెలల పాటు వారి ప్లాస్మా, రక్తం, మల, మూత్రాల నమూనాలను అధ్యయనం చేశారు. ఈ అధ్యయనం ద్వారా అంతరిక్షంలో ఉండే వ్యోమగాములకు∙చికిత్స అందించేందుకు వీలు కలగనుంది.
కెల్లీలో మార్పులివీ..
► అంతరిక్షంలోకి చేరుకోగానే దాదాపు వెయ్యి జన్యువుల్లో మార్పులు
► కెరోటిడ్ ధమని దళసరిగా మారింది
► డీఎన్‌ఏకు నష్టం వాటిల్లింది
► జన్యువుల్లో మార్పులు సంభవించాయి
► కంటి రెటీనా మందంగా మారింది
► కడుపులోని బ్యాక్టీరియా స్థానాన్ని మార్చుకున్నాయి
► మేధస్సులో మార్పులు
► టీలోమర్లలో నిర్మాణాత్మక మార్పులు
► డీఎన్‌ఏలో జన్యుపరివర్తనం జరగలేదు
► ఫ్లూ వ్యాక్సిన్ భూమిపైలాగే పనిచేసింది
► వ్యాయామంతో బరువు తగ్గాడు
► ఎర్ర రక్తకణాల ఉత్పత్తికి తోడ్పడే ఫోలిక్ యాసిడ్ పెరిగింది
► చురుగ్గా రోగ నిరోధక శక్తి
Comments
Please login to add a commentAdd a comment