twin brothers
-
Twin Brothers: కలిసే తనువు చాలించి..
జీడిమెట్ల: ఇద్దరు అన్నదమ్ములు కవలలుగా జన్మించి తల్లిదండ్రులకు సంతోషాన్ని ఇచ్చారు. తల్లిదండ్రులు కవలలకు ముద్దుగా రాము, లక్ష్మణ్ అని పేర్లు పెట్టుకున్నారు. ఇద్దరు అన్నదమ్ములు ఎదిగి..బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కి వచ్చి దొరికిన పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అనుకోని ప్రమాదంలో అన్నను కాపాడేందుకు తమ్ముడు ప్రయతి్నంచి ఇద్దరూ ఒకేసారి మృత్యుఒడికి చేరారు. ఈ విషాదకర సంఘటన జీడిమెట్ల పారిశ్రామిక వాడలో జరిగింది. జీడిమెట్ల డీఐ కనకయ్య, ఎస్సై హరీష్ తెల్పన వివరాల ప్రకారం.. ఏపీలోని అంబేడ్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం దొంతికూరు గ్రామానికి చెందిన రాము(32), లక్ష్మణ్(32) కవలలు. వీరు ఉపాధి కోసం నగరానికి వచ్చి గుండ్లపోచంపల్లి, అన్నారం గ్రామంలో ఉంటూ వివిధ పనులు చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా సాధు నారాయణరావు అనే ఫ్యాబ్రికేషన్ కాంట్రాక్టర్ వద్ద రోజువారీ పనులు చేస్తున్నారు. ఇందులో భాగంగానే గత నాలుగు రోజులుగా వీరిద్దరూ జీడిమెట్ల ఏస్వీ కో ఆపరేటివ్ సొసైటీలో 3 సంవత్సరాలుగా మూతపడి ఉన్న సాబూరి ఫార్మా పరిశ్రమలో ఫ్యాబ్రికేషన్ పనులు నిర్వహిస్తున్నారు. బుధవారం రాము, లక్ష్మణ్‌తో పాటు పాండుబస్తీకి చెందిన సురేందర్‌రెడ్డి పరిశ్రమలో ఉన్న వ్యాక్యూమ్ ట్యాంక్ గోడపై నిలబడి ఫ్యాబ్రికేషన్ పనులు నిర్వహిస్తున్నారు. ఉదయం 10 గంటల సమయంలో వీరికి తాగేందుకు చాయ్ రావడంతో లక్ష్మణ్, సురేందర్‌రెడ్డి గోడపై నుండి కిందకు దిగారు. గోడ దిగే క్రమంలో రాము ప్రమాదవశాత్తు వ్యాక్యూమ్ ట్యాంకులో పడిపోయాడు. పరిశ్రమ మూడు సంవత్సరాలుగా మూసి ఉన్నకారణంగా ట్యాంకులో రసాయనాలతో కూడిన నీరు 6 ఫీట్ల మేర ఉంది. రాము ట్యాంకులో పడటాన్ని గమనించిన లక్ష్మణ్ వెంటనే ట్యాంకు గోడ ఎక్కి ఓ కర్ర సాయంతో వెతకగా రాము అసస్మారక స్థితిలో పడి ఉన్నాడు. దీంతో అన్నను బయటకు తీసేందుకు లక్ష్మణ్ సైతం ట్యాంకులోకి దిగి అతను కూడా అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. ఇద్దరూ బయటకు రాకపోవడంతో సురేందర్‌రెడ్డి ట్యాంకులోకి దిగి అపస్మారకస్థితిలో ఉన్న రాము, లక్ష్మణ్‌లను బయటకు తీశాడు. ఇద్దరిని వెంటనే షాపూర్‌నగర్‌లోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఇద్దరు మృతిచెందారని డ్యూటీ డాక్టర్ నిర్ధారించారు. సురేందర్‌రెడ్డి సైతం అస్వస్థతకు గురికావడంతో చికిత్స అందిస్తున్నారు. రాము, లక్ష్మణ్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
వేర్వేరు ఏడాదుల్లో పుట్టిన కవలలు.. ఇదెలా సాధ్యం?
సాధారణంగా కవల పిల్లలంటే కొన్ని నిమిషాల తేడాతోనే, లేక గంటల వ్యవధిలోనే పుడుతుంటారు. కానీ న్యూజెర్సీలో మాత్రం గమ్మత్తైన సంఘటన చోటుచేసుకుంది. ఓ గర్భిణీకి రెండు వేర్వేరు సంవత్సరాల్లో కవలలు పుట్టారు. అదేంటి కవల పిల్లలు ఏడాది తేడాతో పుట్టడమేంటి అనుకుంటున్నారా..?అవును మీరు చదివింది నిజమే. వివరాల ప్రకారం.. న్యూజెర్సీకి చెందిన బిల్లి హంఫ్రీ, అతని భార్య ఈవ్ ఈ ఏడాది నూతన సంవత్సరంలో కవల పిల్లలకు జన్మనిచ్చారు. నిండు గర్భిణీ అయిన ఈవ్‌కు డిసెంబర్ 31న పురుటి నొప్పులు ఎక్కువయ్యాయి. దీంతో కొత్త ఏడాదికి కొన్ని నిమిషాల ముందు రాత్రి 11.48 నిమిషాలకు ఓ బాబు జన్మించగా, మరుసటి రోజు 12:28 నిమిషాలకు మరో బాబు జన్మించారు. దీంతో కేవలం 40 నిమిషాల తేడాతో ఇద్దరు వేర్వేరు సంవత్సరాల్లో పుట్టినట్లయ్యింది. ఇది తమకు కూడా చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుందని ఈవ్ దంపతులు పేర్కొన్నారు. అయితే తన ఇద్దరు పిల్లలు పేరుకు మాత్రమే కవలలని, వారి ముఖ కవలికల్లో, దినచర్యలోనూ తేడాలు స్పష్టంగా కనిపిస్తుందని, ఇదో విచిత్ర అనుభవం అని తెలిపారు. మొదటి బాబు ఎజ్రా 6 పౌండ్ల బరువుతో ఉంటే, అతని తమ్ముడు ఎజెకియల్ 4 పౌండ్ల బరువుతో ఉన్నాడని వివరించారు. కాగా అయితే కవలలు ఇలా కొన్ని నిమిషాల వ్యవధిలో ఒక రోజు, ఒక నెల, ఒక ఏడాది తేడాతో వేర్వేరుగా జన్మించడం ‘20 లక్షల్లో ఒక్క ఛాన్స్’ అని వైద్యులు అంటున్నారు. -
900 కిమీ దూరం.. గంటల వ్యవధిలోనే చనిపోయిన కవల సోదరులు..
న్యూఢిల్లీ: 900 కిలోమీటర్ల దూరంలో నివసిస్తున్న కవల సోదరులు గంటల వ్యవధిలో ప్రాణాలు కోల్పోవడం ఓ కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. ఇద్దరు కుమారులు చనిపోవడంతో తల్లిదండ్రులు షోక సంద్రంలో మునిగిపోయారు. రాజస్థాన్‌కు చెందిన ఈ కవల సోదరుల పేర్లు సుమేర్ సింగ్, సోహన్ సింగ్. వయసు 26 ఏళ్లు. సుమేర్ గుజరాత్ సూరత్‌లోని టెక్స్టైల్ సిటీలో పని చేస్తున్నాడు. సోహన్ గ్రేడ్-2 టీచర్ రిక్రూట్మెంట్ పరీక్షకు సన్నద్ధమవుతూ జైపూర్‌లో నివాసముంటున్నాడు. అయితే సుమేర్ బుధవారం రాత్రి కుటుంబసభ్యులతో ఫోన్లో మాట్లాడుతూ ప్రమాదవశాత్తు భవనంపై నుంచి పడి చనిపోయాడు. తల్లిదండ్రులు పిలవడంతో ఇంటికి వెళ్లిన సోహన్.. గురువారం వేకువ జామున నీళ్లు తెచ్చేందుకు 100 మీటర్ల దూరంలో ఉన్న ట్యాంకు వద్దకు వెళ్లాడు. ఎంతసేపటికి తిరిగి రాలేదు. కుటుంబసభ్యులు వెళ్లి చూడగా.. అతని మృతదేహం ట్యాంకులో కన్పించడంతో షాక్ అయ్యారు. ఇద్దరు కుమారులు గంటల వ్యవధిలోనే మరణించడంతో తల్లిదండ్రులు విస్మయానికి గురయ్యారు. అయితే సోహన్ కాలుజారి వాటర్ ట్యాంక్‌లో పడిపోయాడా లేదా ఆత్మహత్య చేసుకున్నాడా? అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉందని పోలీసులు తెలిపారు. దీనిపై విచారణ చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ కవలలకు మరో ఇద్దరు తోబుట్టువులు కూడా ఉన్నారు. చదవండి: వృద్ధ దంపతులను నిర్బంధించి రూ. కోటి నగలు, డబ్బు చోరీ -
పండంటి కవలలకు జన్మనిచ్చిన సింగర్ చిన్మయి
ప్రమఖ సింగర్ చిన్మయి శ్రీపాద తల్లయ్యారు. ఆమె పండంటి కవలలకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని చిన్మయితో పాటు ఆమె భర్త రాహుల్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఇద్దరి పిల్లల చేతులను చిన్మయి, ఆమె భర్త పట్టుకున్న ఫోటోలను షేర్ చేస్తూ.. పిల్లల పేర్లను కూడా వెల్లడించారు. ఇద్దరిలో ఒకరికి ద్రిప్త అని.. మరొకరికి శర్వాస్ అని పేరు పెట్టినట్లు తెలియజేశారు. చిన్మయి, రాహుల్ తల్లిదండ్రులు కావడంపై నెటిజన్స్, సినీ ప్రముఖులు అభినందనలు తెలియజేస్తున్నారు. కాగా, రాహుల్, చిన్మయిలది ప్రేమ వివాహం. 2014లో వీరి పెళ్లి జరిగింది. ప్లేబ్యాక్ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్టుగా పేరు సంపాదించిన చిన్మయి మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఉంటారు. మీటూ, క్యాస్టింగ్ కౌచ్ ఉద్యమాన్ని దక్షిణాదిని ఉవ్వెతున ప్రచారం చేశారు. ఇక రాహుల్ విషయానికొస్తే.. ‘అందాల రాక్షసి’చిత్రంతో టాలీవుడ్‌కి పరిచమయ్యాడు. హీరోగానే కాకుండా సహాయనటుడిగాను పలు సినిమాల్లో నటించాడు. నాని ‘శ్యామ్ సింగరాయ్’లో రాహుల్ పాత్రకు ప్రశంసలు దక్కాయి. ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే.. దర్శకత్వం దర్శకుడిగాను రాణిస్తున్నాడు. ‘చి..ల..సౌ’ చిత్రానికి దర్శకుడిగా వ్యవహరించి, తొలి ప్రయత్నంలో విజయం సాధించాడు. Driptah and Sharvas The new and forever center of our Universe. ❤️ @rahulr_23 pic.twitter.com/XIJIAiAdqx — Chinmayi Sripaada (@Chinmayi) June 21, 2022 -
కవల కానిస్టేబుళ్లు.. రోజూ చూస్తున్నా సరే.. కనుక్కోవడం కష్టమే సుమా!
వారిద్దరూ కవలలు. పైగా ఒకే చోట పోలీసులుగా ఉద్యోగాలు. దీంతో రోజూ చూస్తున్నా సరే.. స్టేషన్‌కు వచ్చే ప్రజలతో పాటు అధికారులు కూడా ఒకింత కన్ఫ్యూజన్ అవ్వాల్సిందే. యూనిఫాం వేశారంటే ఎవరు.. ఎవరో గుర్తుపట్టడం అంత ఈజీ కాదు మరి. ఇద్దరూ ఒకేసారి జననం, కానిస్టేబుళ్లుగా ఉద్యోగాల్లో చేరడం, పెళ్లిళ్లూ ఒకేసారి కావడం.. ఇలా వీరి జీవితం అద్భుతాలమయంగా సాగుతోంది. కొవ్వూరు: తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు పోలీసు స్టేషన్లో ఈ ఇద్దరు కానిస్టేబుళ్లుగా పనిచేస్తున్నారు. ఒకరి పేరు యు.లక్ష్మణకుశ, మరొకరి పేరు యు.రాములవ. వీరి స్వస్థలం తాళ్లపూడి. ఊబా సన్యాసిరావు, సావిత్రి దంపతులకు ఆరుగురు మగపిల్లలు సంతానం. వీరు మూడు, నాలుగో సంతానంగా జన్మించారు. వీరి కంటే మరో ఇద్దరు కవలలు రామ్, లక్ష్మణ్ పుట్టి చనిపోయారు. తర్వాత నాలుగో కాన్పులో వీరు జన్మించారు. దీంతో రామ్, లక్ష్మణ్‌ల పేర్లు కలిసేలా వీరికి పేర్లు పెట్టారు. మరో విశేషం ఏమిటంటే ఈ అన్నదమ్ములు ఒకేరోజు పోలీసు, రైల్వే కానిస్టేబుళ్లుగా ఎంపికయ్యారు. ఇద్దరూ పోలీసు కానిస్టేబుళ్లుగా ఉద్యోగాల్లో చేరడం, వీరిద్దరి పెళ్లిళ్లు సైతం ఒకే రోజు కావడం విశేషం. -
14 ఏళ్లకే అద్భుతం అనిపించిన ట్విన్ బ్రదర్స్.. ఇంతకీ ఏం చేశారంటే..?
ఎందుకు? ఏమిటి? ఎలా....అనే ఆసక్తి వీరిని రకరకాల శాస్త్ర,సాంకేతిక పుస్తకాలు చదివేలా చేసింది. కొత్తగా ఆలోచించేలా చేసింది. కొత్త మార్గంలో వెళ్లేలా చేసింది. చిన్న వయసులోనే పెద్ద పేరు తెచ్చుకునేలా చేసింది... పద్నాలుగేళ్ల వయసులో పిల్లలు ఎలా ఉంటారు? సినిమాలంటే బోలెడు ఇష్టపడతారు. సంగీతం అంటే చెవి కోసుకుంటారు. వీరతాళ్లు మెడలో వేసుకొని వీడియో గేమ్స్ ఆడతారు. అయితే దిల్లీకి చెందిన ట్విన్ బ్రదర్స్ యశ్‌రాజ్ భరద్వాజ్, యువరాజ్ భరద్వాజ్ మాత్రం ఈ వయసులోనే తమ వయసుకు మించిన పనులు చేశారు. అద్భుతం అనిపించుకున్నారు. కాస్త వెనక్కి వెళితే.. అందరు పిల్లలలాగే ఈ కవల సోదరులకు క్రికెట్ అంటే చెప్పలేనంత ఇష్టం. చదువు మీద కంటే ఆట మీదే ఎక్కువ శ్రద్ధ పెట్టేవాళ్లు. ‘ఇలా అయితే చదువు పూర్తిగా దెబ్బతింటుంది. మీరు కొంతకాలం క్రికెట్‌ను దూరం పెడితే మంచిది’ అని బుజ్జగింపు ధోరణిలో చెప్పాడు తండ్రి. ఇక అంతే...అప్పటి నుంచి క్రికెట్ జోలికి వెళ్లలేదు. చదువే వారి ప్రపంచం అయింది. చదవండి: టీచరమ్మ స్కూలు సేద్యం నేషనల్ జాగ్రఫిక్–డిస్కవరీ చానల్స్ చూడడం ద్వారా ‘ఎందుకు? ఏమిటి? ఎలా?’ అనే జిజ్ఞాస పెరిగింది. తమ పుస్తకాలే కాకుండా పై తరగతి పుస్తకాలు చదివేవారు. సందేహాలు వస్తే సీనియర్లను అడిగేవారు. సైన్స్ ఫిక్షన్‌తో పాటు రిసెర్చ్ పేపర్స్, విజ్ఞానదాయకమైన బ్లాగ్స్ విరివిగా చదివేవారు. ప్రాజెక్ట్ మెనేజ్మెంట్ కన్సల్టెన్సీ, ట్రాన్స్ఫర్మెషన్ కన్సల్టింగ్, స్ట్రాటజిక్ స్టడీస్, ఫ్రాడ్ ఎనాలసిస్, డాటా ఎనాలటిక్స్...ఇలా రకరకాల విషయాల గురించి తెలుసుకోవడం ప్రారంభించారు. రకరకాల జర్నల్స్ చదివి వాటి గురించి చర్చించుకునేవారు. రిసెర్చ్ ఐడియాలను రాసుకునేవారు. ఈ క్రమంలోనే సొంతంగా రిసెర్చ్ పేపర్స్ రాయడం నేర్చుకున్నారు. ఫరీదాబాద్(హరియాణా)లోని ‘మానవ్ రచన ఇంటర్నేషనల్ యూనివర్శిటీలో’ ఇంజనీరింగ్ పూర్తికాకముందే బ్రెయిన్–కంప్యూటర్ ఇంటర్ఫేస్, ఎయిర్ ప్యూరిఫైయర్, ఆల్–ఇన్–వన్ మెడికల్ అసిస్టెన్స్...ఇలా ఎనిమిది అంశాలలో పేటెంట్ పొందారు. ‘క్రికెట్ మానేసినప్పుడు మొదట్లో చాలా బాధ అనిపించింది. అయితే కొత్త విషయాల గురించి తెలుసుకోవడం, కొత్త విషయాల గురించి ఆలోచించడంలో క్రికెట్లో కంటే ఎక్కువ సంతోషం దొరికింది’ అంటాడు యువరాజ్. రకరకాల బహుమతులు, గ్రాంట్స్, ఫెలోషిప్స్ ద్వారా వచ్చిన డబ్బుతో ‘పెటోనిక్ ఇన్ఫోటెక్’ అనే కన్సల్టెన్సీ సర్వీస్‌ను ప్రారంభించారు. ఇది టెక్నాలజీ, ఫైనాన్స్, అగ్రికల్చర్, మాన్యుఫాక్చరింగ్, హెల్త్‌కేర్...మొదలైన రంగాలలో కన్సల్టింగ్ సర్వీస్‌ను అందిస్తుంది. పేరు పొందిన కంపెనీలు కూడా వీరి క్లయింట్స్ జాబితాలో ఉన్నాయి. కోవిడ్ దెబ్బకు పెద్ద పెద్ద కంపెనీలు నష్టాల బాట పట్టాయి. ఇలాంటి క్లిష్ల సమయంలోనూ ‘పెటోనిక్ ఇన్ఫోటెక్’ దెబ్బతినలేదు. ‘ఒక విధంగా చెప్పాలంటే కోవిడ్ మా ముందు ఎన్నో సవాళ్లను పెట్టింది. ఎన్నో ద్వారాలు తెరవడానికి కారణం అయింది. మునపటి కంటే ఎక్కువ శక్తితో పనిచేశాం. ప్రతి చాలెంజ్ ఎగై్జటింగ్‌గా అనిపించింది. ఉద్యోగుల సంఖ్యను పెంచుకోగలిగాము’ అంటాడు యశ్‌రాజ్ భరద్వాజ్.‘హుందాతనం నిండిన మధ్యతరగతి కుటుంబ నేపథ్యం నుంచి వచ్చాం. చదువే మన ఆస్తి అని ఎప్పుడూ చెబుతుండేవారు నాన్న’ అంటాడు యువరాజ్ భరద్వాజ్. ఈ ఇద్దరిని ఒకేసారి చూస్తే ‘ఎవరు యశ్‌రాజ్?’ ‘ఎవరు యువరాజ్?’ అని వెంటనే పోల్చుకోవడం కష్టం కావచ్చుగానీ ‘ఎవరికి వారు సాటి’ అని మెచ్చుకోవడంలో ఎలాంటి అయోమయానికి తావు లేదు. -
పెరిగిపోతున్న కవలల సంఖ్య
సంతానం కోసం ఎంతో మంది దంపతులు ఎదురు చూస్తుంటారు. ఒకరు పుడితే ఓకే.. అదే ఒకేసారి ఇద్దరు పుడితే.. వారికి ఆ సంబరమే వేరు. మొదటిసారే అయినా, ఇప్పటికే పిల్లలున్నా.. మళ్లీ కవలలు పుడితే అదో ఆనందం, ఆశ్చర్యం.. మరి ఇలా ఏటా ప్రపంచవ్యాప్తంగా జన్మిస్తున్న కవల పిల్లల సంఖ్య పెరిగిపోతోందని తెలుసా? ఒకరిద్దరు కాదు ప్రపంచవ్యాప్తంగా ఏటా 16 లక్షల మంది కవలలు పుడుతున్నారు. ఇది మరింతగా పెరుగుతోంది. ముఖ్యంగా ఆఫ్రికా, ఆసియా ఖండాల్లో కవలల బర్త్ రేటు ఎక్కువగా ఉంటోంది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. ప్రస్తుతం ఆఫ్రికాలో కవలల సంఖ్య ఎక్కువగా ఉంటున్నా.. భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా కవలల పుట్టుకలో భారత్, చైనాలే టాప్కు చేరే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 165 దేశాల్లో 1980–1985 మధ్య, 2010–2015 మధ్య పుట్టిన కవలలకు సంబంధించి డేటాను ఆక్స్ఫర్డ్ శాస్త్రవేత్తలు సేకరించి విశ్లేషించారు. మొత్తం ప్రసవాల్లో పుట్టిన కవలల శాతాన్ని.. అప్పటికి, ఇప్పటికి పోల్చి చూశారు. ఏయే ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉందన్నది లెక్కించి ఒక నివేదికను రూపొందించారు. ఉత్తర అమెరికా, ఆసియాలోనే ఎక్కువ ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా కవలలు జన్మిస్తున్న శాతం పెరిగినట్టు శాస్త్రవేత్తలు తేల్చారు. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఈ రేటు ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. 1980 దశకంతో పోలిస్తే ప్రధానంగా ఉత్తర అమెరికా (అమెరికా, కెనడా, మెక్సికో తదితర దేశాలు)లో ఏకంగా 71 శాతం పెరిగిందని, యూరప్‌లో 60 శాతం, ఆసియా ప్రాంతంలో 32 శాతం పెరిగిందని తెలిపారు. ఒక్క దక్షిణ అమెరికా ఖండంలో మాత్రమే కవలల బర్త్‌రేటు తగ్గిందని వెల్లడించారు. కవలల సంఖ్యాపరంగా చూస్తే.. ఆఫ్రికా, ఆసియా ఖండాల్లో ఎక్కువ మంది జని్మస్తున్నారు. అంతేకాదు సహజంగా పుడుతున్న కవలలు ఈ రెండు ఖండాల్లోనే ఎక్కువ. సాధారణంగా రెండు రకాలుగా కవలలు పుడుతుంటారు. మహిళల్లో అండం ఫలదీకరణ చెందాక రెండుగా విడిపోయి వేర్వేరు శిశువులుగా ఎదగడం ఒక రకమైతే.. ఒకేసారి రెండు అండాలు విడుదలై (డైజైగోటిక్), ఫలదీకరణ ద్వారా కవలలు పుట్టడం రెండో రకం. ఆఫ్రికా మహిళల్లో జన్యుపరంగా డైజోగోటిక్ పరిస్థితి ఉంటుందని, ఆసియా ఖండంలోని కొన్ని దేశాల్లోనూ ఈ పరిస్థితి ఉందని ఈ పరిశోధనలో భాగమైన ఆక్స్ఫర్డ్ వర్సిటీ ప్రొఫెసర్ క్రిస్టియన్ మోండెన్ తెలిపారు. ఇక యూరప్, ఉత్తర అమెరికా, మరికొన్ని చోట్ల ఐవీఎఫ్, హార్మోన్ చికిత్స, ఇతర కృత్రిమ గర్భధారణ పద్ధతుల ద్వారా ఎక్కువగా కవలలు పుడుతున్నారు. వైద్యం, పోషణ లేక మరణాలు పేద, మధ్య ఆదాయ దేశాల్లో కవలలు ఎక్కువగా జన్మిస్తున్నా చిన్నతనంలోనే చనిపోతున్నారని ఆక్స్ఫర్డ్ ప్రొఫెసర్ జెరోన్ స్మిత్ చెప్పారు. ఆఫ్రికాలో పుడుతున్న కవలల్లో చాలా వరకు ఇద్దరిలో ఎవరో ఒకరు మరణిస్తున్నారని.. తల్లికి పోషకాహారం లేక చిన్నారులు సరిగా ఎదకపోవడం, పుట్టిన తర్వాత కూడా సరైన పోషణ, వైద్యం అందకపోవడం దీనికి కారణమని పేర్కొన్నారు. ఇలా ఆఫ్రికాలో పుడుతున్న కవలల్లో ఏటా రెండు లక్షల మంది చనిపోతున్నారని తెలిపారు. కవలలు పుట్టడానికి కారణాలివీ.. కృత్రిమ గర్భధారణ (ఐవీఎఫ్) వినియోగం పెరిగిపోవడం కవలలు పెరగడానికి కారణాల్లో ఒకటి. పిల్లలు లేని దంపతులు ఐవీఎఫ్ చేయించుకునేప్పుడే కవలల కోసం ప్రయతి్నస్తున్నారు. మరోవైపు ఈ విధానంలో ఫెయిల్యూర్ రేటు సగం దాకా ఉండటంతో.. డాక్టర్లు ఎక్కువ పిండాలను ఫలదీకరణం చెందించి మహిళల గర్భంలో ప్రవేశపెడుతున్నారు. మహిళలు ఆలస్యంగా పిల్లల్ని కనడం కవలల పుట్టుకలో మరో కారణం. ఉద్యోగాలు, కెరీర్‌కు ప్రాధాన్యం ఇస్తున్న దంపతులు లేటు వయసులో పెళ్లి చేసుకోవడం, ఇంకా లేటుగా పిల్లల్ని కనడం జరుగుతోంది. 35, 40 ఏళ్ల వయసు దాటిన మహిళల్లో కవలలు పుట్టే అవకాశం ఎక్కువగా ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. ► 30% -1980వ దశకంతో పోలిస్తే పెరిగిన కవలల పుట్టుక శాతం ► 16 లక్షలు ప్రపంచవ్యాప్తంగా ఏటా జన్మిస్తున్న కవల పిల్లల సంఖ్య ► 42లో ఒకరు సగటు ప్రసవాల్లో కవల పిల్లలు జన్మించే అవకాశం ► 80% ప్రపంచంలోని కవలల డెలివరీల్లో ఆఫ్రికా, ఆసియాలో జన్మిస్తున్నవారి శాతం -
విషాదం నింపిన వన భోజనం
నిజామాబాద్ : వన భోజన సంబురం ఒక కుటుంబంలో విషాదాన్ని నింపింది. భోజనాల అనంతరం పాత్రలు శుభ్రం చేస్తుండగా వాగులో కొట్టుకుపోయిన పాత్ర కోసం దిగిన కవల సోదరులిద్దరూ గల్లంతయ్యారు. మోర్తాడ్ మండలంలో గురువారం చోటుచేసుకున్న సంఘటన వివరాలిలా ఉన్నా యి. మోర్తాడ్ మండల కేంద్రానికి చెందిన పూల వ్యాపారి ఖుద్రత్ నలుగురు కూతుళ్లు, ఇద్దరు కుమారులు. కూతుళ్లు, అల్లుళ్లు, మనవలు, మనవరాళ్లు ఇంటికి రావడంతో వారితో సరదాగా గడిపేందుకు ఆయన గురువారం తన కుటుంబ సభ్యులను వనభోజనాల నిమిత్తం గాండ్లపేట్, దొన్కల్‌ల మధ్య ఉన్న పెద్ద వాగు పరిసరాలకు తీసుకువెళ్లాడు. భోజనాల అనంతరం కుటుంబ సభ్యులు పాత్రలను శుభ్రం చేసే క్రమంలో ఒక పా త్ర వాగులో పడిపోయింది. దానిని తీయడానికి కవల సోద రులు తాహెర్, తయ్యూబ్ ప్రయత్నించారు. ఈ క్రమంలో త య్యూబ్ వాగు ప్రవాహంలో కొట్టుకుపోయాడు. దీనిని గమ నించిన సోదరుడు తాహెర్ అతడిని కాపాడేందుకు యతి్నంచి, అతడూ గల్లంతయ్యాడు. వాగు ప్రవాహం ఎక్కువగా ఉండడంతో స్థానిక జాలరులు, గజ ఈతగాళ్లు ఎంత ప్ర యతి్నంచినా ఫలితం లేకపోయింది. గల్లంతైనవారి కోసం మూడు గంటలపాటు గాలించామని గాండ్లపేట్‌కు చెందిన గజ ఈతగాడు మనోజ్ తెలిపారు. ఇసుక, నాచు ఎక్కువగా ఉన్నాయని, వాటిలో ఇరుక్కుపోయి ఉంటారన్నారు. ఆర్మూర్ ఆర్డీవో శ్రీనివాసులు, ఏసీపీ రఘు, భీమ్‌గల్ సీఐ సైదయ్య, మోర్తాడ్ తహసీల్దార్ శ్రీధర్, ఎంపీడీవో శ్రీనివాస్‌రెడ్డి, ఎస్సై సంపత్‌కుమార్‌లు గురువారం రాత్రి వరకు గాలింపు చర్యలను పర్యవేక్షించారు. గల్లంతైన వారి కోసం ప్రత్యేక బృందాన్ని రప్పిస్తున్నారు. వాగు ప్రవాహంలో కొట్టుకపోతే వారిని గుర్తించడానికి పాలెం, ధర్మోరాల మధ్య ఉన్న చెక్‌డ్యాం వద్ద వలను ఏర్పాటు చేశారు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. -
విమాన ప్రమాదం : మృత్యుంజయులైన కవలలు
సాక్షి, తిరువనంతపురం: సమయం గడుస్తున్న కొద్దీ కేరళ కోళికోడ్ విమాన ప్రమాదం బాధితుల గాథలు ఒక్కోటి వెలుగు చూస్తున్నాయి. నిపుణుడు, అనుభవజ్ఞుడైన పైలట్ దీపక్ వసంత్ సాథే సారధ్యంలో విమానం అదుపు తప్పడం ఒక విషాదమైతే...మరికొద్ది క్షణాల్లో సొంతగడ్డపై కాలు మోపే సమయంలో కొంతమంది ప్రయాణీకులు ప్రాణాలు కోల్పోవడం మరో విషాదం. అయితే ఇంతటి ఘోర ప్రమాదంనుంచి ప్రాణాలతో బయటపడి కవలలు మృత్యుంజయులుగా నిలిచిన వార్త కాస్త ఊరటనిస్తోంది. (రక్తమోడిన దృశ్యాలు, భీతిల్లిన చిన్నారులు) న్యూస్ మినిట్ కథనం ప్రకారం ఈ కవలల కుటుంబం దుబాయ్ లో నివసిస్తోంది. తండ్రి దుబాయ్ లోనే ఉండిపోగా, తల్లి, తన నలుగురు బిడ్డలతో కలసి వందే భారత్ మిషన్ ద్వారా కేరళకు ఎయిరిండియా విమాన టికెట్లను బుక్ చేసుకున్నారు. అయితే దురదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో చిక్కుకోగా, ఏడేళ్ల కవలలు జైన్, జమిల్ కుండోట్ పారకల్ ప్రాణాలతో బయటపడిన అదృష్ట వంతులుగా నిలిచారు. వీరి సోదరి, సోదరుడు కూడా స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. జియాకు (10) ఫ్రాక్చర్ కావడంతో ఆర్థోపెడిక్ విభాగంలో చికిత్స పొందుతుండగా, జియాన్ (14) ఆరోగ్యం నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. అయితే తల్లి ఎలా ఉన్నారనేది దానిపై వివరాలు తెలియరాలేదు. దీంతో బంధువులు ఆందోళనలో పడిపోయారు. (విషాదం : మృత్యువును ముందే పసిగట్టాడేమో? ) స్వల్పంగా గాయపడిన వీరిని స్థానికులు, రక్షణ సిబ్బంది ఫిరోక్ చుంగమ్‌లోని రెడ్ క్రెసెంట్ ఆసుపత్రికి తరలించారు. 'గుర్తు తెలియని కవలలు' పేరుతో జిల్లా అధికారులు పేరుతో వీరిని ఆచూకీ తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నించారు. తద్వారా వీరిని మలప్పురం వాసులుగా గుర్తించారు. వారి సమీప బంధువు, మేనమామ రావడంతో శుక్రవారం సాయంత్రం డిశ్చార్జ్ అయ్యారని ఆసుపత్రి సిబ్బంది ధృవీకరించారు. -
నీ వెంటే నేనూ..
అనుమసముద్రంపేట: వారిద్దరూ కవలలు.. కలిసి పెరిగారు. ఒకరంటే ఒకరికి ఎంతో ఇష్టం. తన కంటే ఏడు నిమిషాలు చిన్నవాడు చనిపోవడాన్ని జీర్ణించుకోలేకపోయిన అన్న మనోవేదనకు గురై అంత్యక్రియలు జరుగుతున్న సమయంలో కుప్పకూలాడు. ఈ సంఘటన ఏఎస్‌పేట మండల కేంద్రంలో జరిగింది. స్థానికుల కథనం మేరకు.. వేమన చందు, రమేష్‌లు కవలలు. ఇద్దరూ చిన్నపాటి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. రమేష్ ఆదివారం రాత్రి శానిటైజర్ తాగి మృతిచెందాడు. ఈ విషయాన్ని చందు జీర్ణించుకోలేకపోయాడు. తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. సోమవారం రమేష్ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహిస్తుండగా చందు అక్కడ కుప్పకూలాడు. బంధువులు వెంటనే అతడిని ఆత్మకూరు జిల్లా వైద్యశాలకు తరలించారు. పరీక్షించిన డాక్టర్లు మృతిచెందాడని తెలిపారు. ఇద్దరు బిడ్డలు మృతిచెందడంతో వారి తల్లి కన్నీరుమున్నీరుగా రోదిస్తోంది. -
కల్యాణం.. ‘కవలీ’యం
సాక్షి, అంబాజీపేట (పి.గన్నవరం): వివాహమంటే కనుల పండుగ. అందులోనూ కోనసీమలో చేసే సందడి అంతాఇంతా కాదు. ఓ వేదికపై అంతకుమించిన సంబరంతో.. సంభ్రమాశ్చర్యాల నడుమ రెండు కవల జంటలకు వివాహమైంది. తూర్పు గోదావరి జిల్లా అంబాజీపేట మండలం పెచ్చెట్టివారిపాలెం గ్రామం ఇందుకు వేదికైంది. వివరాల్లోకి వెళితే.. అంబాజీపేట మండలం మాచవరం శివారు పోతాయిలంకకు చెందిన మట్టపర్తి నాగేశ్వరరావు, ధనలక్ష్మి దంపతులకు రెండో సంతానంగా ధర్మారావు, దుర్గారావు అనే కవలలు జన్మించారు. వారికి కవల వధువులతోనే వివాహం జరిపించాలనేది తమ తల్లి ధనలక్ష్మి కోరిక అని ఆమె పెద్ద కొడుకు లక్ష్మణ్ తెలిపారు. కొంతకాలం క్రితం ఆమె మరణించగా.. ధర్మారావు, దుర్గారావు వివాహ బాధ్యతను అన్నా వదినలైన లక్ష్మణ్, కళావతి తీసుకున్నారు. తండ్రి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కవల వధువుల కోసం వెతకసాగారు. సమీప గ్రామమైన పెచ్చెట్టివారి పాలెంలో కొప్పిశెట్టి బాలాజీ, శ్రీలక్ష్మి దంపతులకు జ్యోతి, స్వాతి అనే కవలలు ఉన్నారని తెలియటంతో వారింటికి వెళ్లి సంబంధాన్ని ఖాయం చేసుకున్నారు. ఆదివారం రాత్రి కవలలైన ధర్మారావు, దుర్గారావులకు కవల వధువులు స్వాతి, జ్యోతినిచ్చి వివాహం జరిపించారు. కవల వరులలో పెద్దవాడిగా భావించే ధర్మారావు హైదరాబాద్‌లో వ్యాపారం చేస్తుండగా.. దుర్గారావు బీహెచ్ఈఎల్లో ఉద్యోగం చేస్తున్నారు. వివాహానికి హాజరైనవారు కవల జంటల్ని చూసి ఎవరు ధర్మారావు, ఎవరు దుర్గారావు, ఎవరు జ్యోతి, ఎవరు స్వాతి తెలుసుకోవడంలో ఒకింత తికమకపడ్డారు. -
ఒకరు అంతరిక్షంలో.. ఒకరు అవనిపై..
వాషింగ్టన్: స్కాట్ కెల్లీ, మార్క్‌లు ఇద్దరూ కవలలు.. ఇద్దరి శరీర తీరు, ఆకారం, జన్యువులు దాదాపు ఒకేరకంగా ఉన్నాయి. ఒకవ్యక్తి అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రానికి వెళ్లాడు. 340 రోజుల పాటు అక్కడే గడిపాడు. మరొకరేమో భూమిపైనే ఉన్నాడు. సాధారణంగా మనలాగే ఇక్కడ గడిపాడు. ఈ ఏడాది పాటు వారిద్దరి శరీరంలో, జన్యు క్రమంలో జరిగిన మార్పులేంటి.. కెల్లీ భూమిపైకి వచ్చాక తిరిగి యథాస్థితికి వచ్చారా అనే విషయాలను తెలుసుకునేందుకు ఈ ఇద్దరు కవలలపై పరిశోధనలు చేసిన అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా.. పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. యూరీ గెగారిన్ అంతరిక్షంలోకి వెళ్లి 58 ఏళ్లు గడిచిన సందర్భంగా ఈ పరిశోధన వివరాలను శుక్రవారం నాసా తెలిపింది. ఏడాది పాటు మానవుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా మనుగడ సాగించగలడని చివరికి శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. 2015–16 మధ్య స్కాట్ కెల్లీ అంతరిక్షంలో 340 రోజుల పాటు జీవనం సాగించారు. అంతరిక్షంలోకి వెళ్లినప్పుడు గురుత్వాకర్షణ శక్తి ఉండకపోవడం, గంటకు దాదాపు 28 వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించడం వల్ల మన శరీరంలో కొన్ని మార్పులు జరిగి ఆ వాతావరణానికి అనుగుణంగా పనిచేస్తుంటుందని నాసాకు చెందిన స్టీవెన్ ప్లాట్స్ వివరించారు. శరీర బరువు, సూక్ష్మజీవులు, రక్తప్రసరణ, కొల్లాజెన్‌లో మార్పులు, ముఖ్యంగా జన్యువుల్లో అస్థిరత, రోగ నిరోధక శక్తి తదితర మార్పులు స్కాట్ కెల్లీలో సంభవించినట్లు తెలిపారు. అయితే భూమి మీదకు వచ్చాక కెల్లీ శరీరంలో సంభవించిన మార్పులన్నీ యథాస్థితికి వచ్చి, కవల సోదరుడి మాదిరిగానే మారిపోయినట్లు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. 12 యూనివర్సిటీలకు చెందిన 84 మంది శాస్త్రవేత్తలు 10 బృందాలుగా విడిపోయి అంతరిక్షంలో మానవ శరీరంలో జరిగే మార్పులను చాలా క్షుణ్నంగా అధ్యయనం చేశారు. అంతరిక్షంలో ఉన్న స్కాట్ కెల్లీ, భూమిపై ఉన్న మార్క్‌ల శారీరక, మానసిక మార్పులను తెలుసుకునేందుకు 27 నెలల పాటు వారి ప్లాస్మా, రక్తం, మల, మూత్రాల నమూనాలను అధ్యయనం చేశారు. ఈ అధ్యయనం ద్వారా అంతరిక్షంలో ఉండే వ్యోమగాములకు∙చికిత్స అందించేందుకు వీలు కలగనుంది. కెల్లీలో మార్పులివీ.. ► అంతరిక్షంలోకి చేరుకోగానే దాదాపు వెయ్యి జన్యువుల్లో మార్పులు ► కెరోటిడ్ ధమని దళసరిగా మారింది ► డీఎన్ఏకు నష్టం వాటిల్లింది ► జన్యువుల్లో మార్పులు సంభవించాయి ► కంటి రెటీనా మందంగా మారింది ► కడుపులోని బ్యాక్టీరియా స్థానాన్ని మార్చుకున్నాయి ► మేధస్సులో మార్పులు ► టీలోమర్లలో నిర్మాణాత్మక మార్పులు ► డీఎన్ఏలో జన్యుపరివర్తనం జరగలేదు ► ఫ్లూ వ్యాక్సిన్ భూమిపైలాగే పనిచేసింది ► వ్యాయామంతో బరువు తగ్గాడు ► ఎర్ర రక్తకణాల ఉత్పత్తికి తోడ్పడే ఫోలిక్ యాసిడ్ పెరిగింది ► చురుగ్గా రోగ నిరోధక శక్తి -
జాగ్రత్త..బైక్‌లో వెళ్లకండి రా..!
చిత్తూరు, పూతలపట్టు/దొడ్డబళ్లాపురం/మదనపల్లె సిటీ: వారిద్దరూ కవల సోదరులు. ఎక్కడికెళ్లినా ఇద్దరూ కలిసే వెళ్లేవారు. చదువులోనూ పోటీ పడేవారు. అయితే విధి చిన్నచూపు చూసింది. కాలేజీకి బైక్‌పై వెళ్తూ వ్యాన్‌ను వెనుకనుంచి ఢీకొనడంతో ఒకరు దుర్మరణం చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన బెంగళూరు సమీపంలో దొడ్డ గ్రామీణ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పూతలపట్టుకు చెందిన మదనమోహన్, సౌభాగ్య దంపతులు కొన్నేళ్లక్రితం మదనపల్లెలో స్థిరపడ్డారు. వారికి కవ ల పిల్లలున్నారు. పెద్దవాడు సాయి హర్షిత్, చిన్నవాడు సాయి హా ర్తిక్. కర్ణాటకలోని గీతం యూనివర్సిటీలో వీరి ద్దరూ బీఈ కంప్యూటర్ సైన్స్ మూడో సంవత్సరం చదువుతున్నా రు. ఇద్దరిదీ ఒకే సెక్షన్. మంగళవారం ఇద్దరూ బైక్‌పై కళాశాలకు బయల్దేరారు. హర్షిత్ (20) డ్రైవింగ్ చేస్తుండగా హార్తిక్ వెనుక కూర్చున్నాడు. మోపరహళ్లి వద్ద ముందు వెళ్తున్న వ్యాన్‌ను బైక్ ఢీకొన్నట్లు పోలీసులు చెబుతున్నారు. ప్రమాదంలో హర్షిత్ మృతి చెందగా, హార్తిక్ తీవ్రంగా గాయపడ్డాడు. బెంగళూరు రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం హర్షిత్ మృతదేహాన్ని, చికిత్స నిమిత్తం హార్తిక్ను తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జాగ్రత్త..బైక్‌లో వెళ్లకండి రా..!– ముందుగానే హెచ్చరించిన పిన్ని పూతలపట్టులో హర్షిత్, హార్తిక్ చిన్నాన్న, పిన్ని, బంధువులు ఉంటున్నారు. రెండ్రోజుల క్రితం హర్షిత్ ఫోన్లో తన చిన్నాన్న, పిన్నితో మాట్లాడాడు. ఇటీవల పూతలపట్టు మండలంలో చోటుచేసుకున్న మోటార్ సైకిళ్ల ప్రమాదాల్లో యువకులు మృతి చెందడంపై కలత చెందిన హర్షిత్ పిన్ని ఫోన్లోనూ ఇదే విషయాన్ని ప్రస్తావించి బాధపడ్డారు. బైక్‌లో కాలేజీకి వెళ్లవద్దని, టయాలు బాగా లేవని, బస్సులోనే కాలేజీకి వెళ్లమని హర్షిత్, హార్తిక్పై ఉన్న ప్రేమకొద్దీ సున్నితంగా హెచ్చరించారు. జాగ్రత్తలు చెప్పారు. జాగ్రత్తగానే వెళ్తాం– పిన్నీ అంటూ హర్షిత్ బదులిచ్చాడు. అయినా, విధిచూపు చిన్నచూసింది. హర్షిత్ మరణంతో పూతలపట్టులో విషాదఛాయలు అలుముకున్నాయి. అతడి పిన్ని, స్థానిక బంధువర్గం కన్నీటిపర్యంతమవుతోంది. బుధవారం ఉదయం ఇక్కడే అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. -
సోదర ‘త్రయం’ కలిసి బరిలోకి...
ఆమ్‌స్టల్‌వీన్ (నెదర్లాండ్స్): అంతర్జాతీయ క్రికెట్లో కవల సోదరులు (ట్విన్స్) కలిసి ఆడిన మ్యాచ్‌లు ఎన్నో చూశాం. కానీ ఒకే రోజు పుట్టిన ముగ్గురు సోదరులు (ట్రిప్లెట్స్) ఒకే మ్యాచ్‌లో కలిసి బరిలోకి దిగిన అరుదైన ఘటన సోమవారం చోటు చేసుకుంది. సోమవారం ఇక్కడి వీఆర్ఏ మైదానంలో నెదర్లాండ్స్, యూఈఏ మధ్య జరిగిన తొలి వన్డే దీనికి వేదికగా నిలిచింది. నెదర్లాండ్స్ తరఫున 20 ఏళ్ల సికందర్ జుల్ఫిఖర్, అసద్ జుల్ఫిఖర్, సాఖిబ్ జుల్ఫికర్ ఈ మ్యాచ్‌లో ఆడారు. అంతర్జాతీయ క్రికెట్లో ఈ తరహా ఘనత మొదటిది కావడం విశేషం. వీరిలో సికందర్ ఇప్పటికే 2 అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లు ఆడగా...అసద్, సాఖిబ్‌లకు ఇదే తొలి మ్యాచ్. మార్చి 28, 1997న పుట్టిన ఈ ముగ్గురు పాకిస్తాన్ సంతతికి చెందినవారు. సియాల్కోట్కు చెందిన వీరి తండ్రి జుల్ఫిఖర్ అహ్మద్ చాలా ఏళ్ల క్రితమే నెదర్లాండ్స్‌లో స్థిర పడ్డారు. స్వయంగా క్రికెటర్ అయిన అహ్మద్, 9 లిస్ట్–ఎ మ్యాచ్‌లలో నెదర్లాండ్స్ జట్టు తరఫున బరిలోకి దిగారు. అదే అనుభవంతో ఆయన తన ముగ్గురు పిల్లలను క్రికెట్లో ప్రోత్సహించారు. ఈ మ్యాచ్‌లో యూఏఈ 3 వికెట్ల తేడాతో గెలిచింది. -
భిన్నమైన కథతో...
సినిమా అనే షిప్కి డెరైక్టర్ కెప్టెన్‌లాంటి వాడు. సాధారణంగా ఓ చిత్రానికి ఒకే దర్శకుడుంటాడు. అరుదైన పరిస్థితుల్లో ఇద్దరు వేర్వేరు దర్శకులు పనిచేసిన సందర్భాలు న్నాయి. కానీ, తొలిసారి కవల సోదరులు ధర్మ-రక్ష దర్శకత్వం వహించిన చిత్రం ‘చందమామ రావే’. నవీన్ చంద్ర, ప్రియల్ గోర్ హీరో హీరోయిన్లు. ఐఈఎఫ్ కార్పొరేషన్, ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ ఫిల్మ్ కార్పొరేషన్ పతాకాలపై కిరణ్ జక్కంశెట్టి, శ్రీని గుబ్బాల నిర్మించారు. ఈ చిత్రం బ్యానర్ లోగోను దర్శకుడు మారుతి, టీజర్‌ను హీరో నాని విడుదల చేశారు. ‘‘ఇప్పుడొస్తున్న చిత్రాలకు భిన్నంగా మా చిత్రం ఉంటుందని చెప్పగలం. కథ కొత్తగా ఉంటుంది. ప్రేక్షకులు ఆశించే అన్ని అంశాలు ఇందులో ఉంటాయి’’ అని దర్శకులు తెలిపారు. ‘‘టీజర్ చూస్తుంటే సినిమాపై ఆసక్తి పెరుగుతోంది’’ అని దర్శకుడు మారుతి అన్నారు. చిత్ర నిర్మాతలు, హీరో నవీన్ చంద్ర తదితరులు పాల్గొన్నారు. -
వందేళ్ల కవలలు
బెల్జియం : నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో బతకాలని అందరూ కోరుకుంటారు. కాని మారుతున్న ఆహారపు అలవాట్లు, దానికి తోడు రకరకాల రోగాలు, కాలుష్యం వంటి కారణాలతో మనిషి జీవిత కాలం రానురానూ తగ్గిపోతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో 60 ఏళ్లు బతకడమే గగనమవుతోంది. అలాంటిది 100 ఏళ్లు బతకడమంటేనే ఆశ్చర్యం. కాని బెల్జియంకు చెందిన పీటర్, పౌలస్ లాంగ్రాక్ అనే ఇద్దరు కవల సోదరులు 103వ పడిలోకి అడుగుపెట్టారు. రెండు సంవత్సరాల్లో వీరు 105 ఏళ్లు బతికిన అమెరికాకు చెందిన కవల సోదరులు గ్లెన్, డేల్ మోయర్ రికార్డును బద్దలుగొట్టి, ప్రపంచంలోనే ఎక్కువ సంవత్సరాలు బతికిన కవలలుగా అవతరించబోతున్నారు. ఇప్పటికీ వారు ఒకరినొకరు వదిలి ఉండలేరు. అందుకే అన్నదమ్ములు పెళ్లి కూడా చేసుకోలేదు. వారు తమ పుట్టిన రోజును వారుండే నర్సింగ్ హోంలోనే ఆనందంగా జరుపుకున్నారు. వారి 103 ఏళ్ల అనుబంధాన్ని చూసి అన్నదమ్ములెవరైనా అసూయ పడాల్సిందే. -
ఎవరి భార్య ఎవరో తెలియక తికమక!
బీజీంగ్: వారిద్దరూ ట్విన్ సిస్టర్స్. వారు పెళ్లాడింది ట్విన్ బ్రదర్స్‌ను. అక్కడిదాకా బాగానే ఉంది కానీ ఆ తరువాతే మొదలైంది అసలు కథ. చూడటానికి అచ్చుగద్దినట్లు ఒకేలా ఉండే ఆ జంటల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఏ మాత్రం పొరపాటు జరిగినా మొదటికే మోసం వస్తుందని గ్రహించిన ఆ జంటలు ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ప్లాస్టిక్ సర్జరీని ఆశ్రయించి వారి రూపాలనే మార్చుకోవాలనుకుంటున్నారు. వివారాల్లోకి వెళ్తే.. చైనాలోని షాంజీ ప్రాంతానికి చెందిన ఇద్దరు ట్విన్ సిస్టర్స్ యున్ ఫియ్, యున్ యాంగ్ చూడటానికి ఒకేలా ఉండి అందరినీ తికమక పెట్టేవారు. అయితే ఆశ్చర్యంగా వారి ఊరికి సమీపంలోని మరో ఉళ్లో అచ్చం ఒకేలా ఉన్న ట్విన్ బ్రదర్స్ ను వారు ముచ్చటపడి పెళ్లాడారు. ఫిబ్రవరి 15న జరిగిన ఈ జాయింట్ వెడ్డింగ్ కార్యక్రమంలో ఒకరి ఫియాన్సీని మరోకరు కాకుండా ఎలాగోలా కరెక్టుగానే పెళ్లాడారు. వివాహానంతరం చూడటానికి అచ్చం ఒకేలా ఉన్న జంటలకు ఎవరి భర్త ఎవరు? ఎవరి భార్య ఎవరు? అనే విషయం వారికి కనిపెట్టడం కష్టంగా మారుతోంది. దీనికి తోడు కుటుంబ సభ్యులు, స్నేహితులు సైతం ఒకరనుకొని మరొకరితో మాట్లాడుతుండటంతో చిరాకుపడి దీనికి పరిష్కారం కనుగొనాలని సూచించారు. ఏం చేయాలో బాగా ఆలోచించిన ఈ జంటలు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాలని నిర్ణయించుకున్నారు. గురువారం వీరిని పరిశీలించిన వైద్యులు ముఖాల్లో చిన్న మార్పులు చేయడం ద్వారా వీరి సమస్యకు పరిష్కారం చూపుతామంటున్నారు. -
పాపం ఆ కవల చిన్నారులు!
కవల చిన్నారులు షాన్, రైస్ పాలిట విధి వక్రీకరించింది. ఈ రెండేళ్ల కవల సోదరులను విషాదకర పరిస్థితుల నడుమ మృత్యువు బలిగొంది. తల్లిదండ్రులకు తీరని గుండెకోతను మిగిలించింది. స్కాట్లాండ్లోని ఫిఫె నగరంలో శనివారం ఈ ఘటన జరిగింది. ఇంటి వెనుక ఉన్న గార్డెన్‌లోని చేపల చెరువులో మునిగిపోయి ఈ ఇద్దరు కవల సోదరులు ప్రాణాలు ప్రాణాలు విడిచారు. ఉదయం సమయంలో ఈ ఘటన జరిగింది. కవల చిన్నారులు బయట ఆడుకోవడానికి వెళ్లి ఉంటారని తల్లిదండ్రులు భావించారు. కానీ వారు ఇంటి వెనుక ఉన్న చేపల చెరువులో విగతజీవులుగా కనిపించడం తల్లిదండ్రుల్ని దిగ్భ్రమకు గురిచేసింది. ఈ ఘటన గురంచి ఉదయం 8.30 ప్రాంతంలో పోలీసులకు సమాచారం ఇచ్చారు. చిన్నారుల తల్లిదండ్రులను మెర్విన్ స్కాట్, సారా అట్కెన్గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటన సరిగ్గా ఎలా జరిగిందనే విషయాన్ని వారు ఆరా తీస్తున్నారు. ముద్దుగా ఉండి, తల్లిదండ్రులు, ఇరుగుపొరుగువారు అల్లారుముద్దుగా చూసుకొనే కవలలను మృత్యువు ఒకేసారి కబళించడం స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేసింది. స్థానిక కౌన్సిలర్లు, నేతలు ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. -
బస్సు డ్రైవర్ కవలలు.. ఐఐటీ కొట్టారు!!
ఐఐటీలో ర్యాంకు సాధించి, సీటు పొందడం అంటే చిన్న విషయం కాదు. కానీ ముంబైలోని ఓ బస్సు డ్రైవర్ రాం శంకర్ యాదవ్ కవల పిల్లలు ఇద్దరూ ఒకేసారి జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షల్లో ర్యాంకులు కొట్టి ఆ తండ్రికి రెట్టింపు ఆనందాన్నిచ్చారు. రాం యాదవ్, శ్యాం యాదవ్ అనే ఈ ఇద్దరు కవల పిల్లలకు ఐఐటీలలో సీట్లు సాధించేంత ర్యాంకులు వచ్చాయి. రాం యాదవ్‌కు ఓబీసీ విభాగంలో 267వ ర్యాంకు రాగా, శ్యాం యాదవ్‌కు అదే విభాగంలో 1816వ ర్యాంకు వచ్చింది. తమ తల్లిదండ్రులకు తాము ఈ పరీక్షలో ఉత్తీర్ణులు అయినట్లు తెలుసు గానీ, వారికి దీని ప్రాధాన్యం అంతగా తెలియదని, తమ కవల సోదరులిద్దరికీ మాత్రం లక్ష్యాలు సాధించడంలో ఇది మొదటి అడుగని రాం యాదవ్ చెప్పాడు. తామిద్దరం కూడా పరిశోధన రంగంలోకే వెళ్లాలనుకుంటున్నట్లు తెలిపాడు. భివాండీ మురికివాడలో పుట్టి పెరిగిన ఈ డ్రైవర్ కుటుంబం.. తమ పిల్లలు కుటుంబ పోషణకు సరిపడ సంపాదిస్తే చాలని రాం శంకర్ యాదవ్ భావించాడు. ప్రస్తుతానికి వారి కుటుంబ ఆదాయం 8 వేల రూపాయలు. అయినా ఎలాగోలా వారిని ఇన్నేళ్ల పాటు చదివించాడు. ఎలాంటి కోచింగ్ లేకుండానే పదోతరగతి, ఇంటర్ పరీక్షలు పాసైన కవల సోదరులు.. జేఈఈకి మాత్రం ఫిట్జీలో కోచింగ్ తీసుకున్నారు. యాప్టిట్యూట్ టెస్టులో మంచి ప్రతిభ కనిపించడంతో ఈ కోచింగ్ కూడా ఉచితంగానే అందింది. ర్యాంకులు వచ్చాయని ఆ కుటుంబం సంబరపడుతున్నా.. ఇప్పుడు వాళ్లిద్దరికీ ఫీజులు కట్టడానికి డబ్బు ఎక్కడినుంచి తేవాలన్నది ఆ కుటుంబానికి పెద్ద సమస్యగా మారింది. ఐఐటీ అంటేనే భారీమొత్తంలో ఫీజులుంటాయి. పైపెచ్చు, ఒకేసారి ఇద్దరికీ కట్టాలి. నెలకు 8వేల రూపాయల జీతం మాత్రమే సంపాదించే ఆ బస్సు డ్రైవర్.. ఈ భారాన్ని ఎలా మోయాలో తెలియక సతమతం అవుతున్నాడు.