
ఒక్కటైన కవల జంటలు
సంభ్రమాశ్చర్యాల నడుమ రెండు కవల జంటలకు వివాహమైంది.
సాక్షి, అంబాజీపేట (పి.గన్నవరం): వివాహమంటే కనుల పండుగ. అందులోనూ కోనసీమలో చేసే సందడి అంతాఇంతా కాదు. ఓ వేదికపై అంతకుమించిన సంబరంతో.. సంభ్రమాశ్చర్యాల నడుమ రెండు కవల జంటలకు వివాహమైంది. తూర్పు గోదావరి జిల్లా అంబాజీపేట మండలం పెచ్చెట్టివారిపాలెం గ్రామం ఇందుకు వేదికైంది. వివరాల్లోకి వెళితే.. అంబాజీపేట మండలం మాచవరం శివారు పోతాయిలంకకు చెందిన మట్టపర్తి నాగేశ్వరరావు, ధనలక్ష్మి దంపతులకు రెండో సంతానంగా ధర్మారావు, దుర్గారావు అనే కవలలు జన్మించారు. వారికి కవల వధువులతోనే వివాహం జరిపించాలనేది తమ తల్లి ధనలక్ష్మి కోరిక అని ఆమె పెద్ద కొడుకు లక్ష్మణ్ తెలిపారు. కొంతకాలం క్రితం ఆమె మరణించగా.. ధర్మారావు, దుర్గారావు వివాహ బాధ్యతను అన్నా వదినలైన లక్ష్మణ్, కళావతి తీసుకున్నారు.
తండ్రి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కవల వధువుల కోసం వెతకసాగారు. సమీప గ్రామమైన పెచ్చెట్టివారి పాలెంలో కొప్పిశెట్టి బాలాజీ, శ్రీలక్ష్మి దంపతులకు జ్యోతి, స్వాతి అనే కవలలు ఉన్నారని తెలియటంతో వారింటికి వెళ్లి సంబంధాన్ని ఖాయం చేసుకున్నారు. ఆదివారం రాత్రి కవలలైన ధర్మారావు, దుర్గారావులకు కవల వధువులు స్వాతి, జ్యోతినిచ్చి వివాహం జరిపించారు. కవల వరులలో పెద్దవాడిగా భావించే ధర్మారావు హైదరాబాద్‌లో వ్యాపారం చేస్తుండగా.. దుర్గారావు బీహెచ్‌ఈఎల్‌లో ఉద్యోగం చేస్తున్నారు. వివాహానికి హాజరైనవారు కవల జంటల్ని చూసి ఎవరు ధర్మారావు, ఎవరు దుర్గారావు, ఎవరు జ్యోతి, ఎవరు స్వాతి తెలుసుకోవడంలో ఒకింత తికమకపడ్డారు.