జీడిమెట్లలోని ఓ ఫార్మా పరిశ్రమలో విషాదం
వ్యాక్యూమ్ ట్యాంకులో పడి అన్నదమ్ములు మృతి
అన్నను కాపాడబోయి ప్రాణాలు వదిలిన తమ్ముడు
జీడిమెట్ల: ఇద్దరు అన్నదమ్ములు కవలలుగా జన్మించి తల్లిదండ్రులకు సంతోషాన్ని ఇచ్చారు. తల్లిదండ్రులు కవలలకు ముద్దుగా రాము, లక్ష్మణ్ అని పేర్లు పెట్టుకున్నారు. ఇద్దరు అన్నదమ్ములు ఎదిగి..బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కి వచ్చి దొరికిన పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అనుకోని ప్రమాదంలో అన్నను కాపాడేందుకు తమ్ముడు ప్రయతి్నంచి ఇద్దరూ ఒకేసారి మృత్యుఒడికి చేరారు. ఈ విషాదకర సంఘటన జీడిమెట్ల పారిశ్రామిక వాడలో జరిగింది.
జీడిమెట్ల డీఐ కనకయ్య, ఎస్సై హరీష్ తెల్పన వివరాల ప్రకారం.. ఏపీలోని అంబేడ్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం దొంతికూరు గ్రామానికి చెందిన రాము(32), లక్ష్మణ్(32) కవలలు. వీరు ఉపాధి కోసం నగరానికి వచ్చి గుండ్లపోచంపల్లి, అన్నారం గ్రామంలో ఉంటూ వివిధ పనులు చేస్తున్నారు.
గత కొన్ని రోజులుగా సాధు నారాయణరావు అనే ఫ్యాబ్రికేషన్ కాంట్రాక్టర్ వద్ద రోజువారీ పనులు చేస్తున్నారు. ఇందులో భాగంగానే గత నాలుగు రోజులుగా వీరిద్దరూ జీడిమెట్ల ఏస్వీ కో ఆపరేటివ్ సొసైటీలో 3 సంవత్సరాలుగా మూతపడి ఉన్న సాబూరి ఫార్మా పరిశ్రమలో ఫ్యాబ్రికేషన్ పనులు నిర్వహిస్తున్నారు. బుధవారం రాము, లక్ష్మణ్‌తో పాటు పాండుబస్తీకి చెందిన సురేందర్‌రెడ్డి పరిశ్రమలో ఉన్న వ్యాక్యూమ్ ట్యాంక్ గోడపై నిలబడి ఫ్యాబ్రికేషన్ పనులు నిర్వహిస్తున్నారు. ఉదయం 10 గంటల సమయంలో వీరికి తాగేందుకు చాయ్ రావడంతో లక్ష్మణ్, సురేందర్‌రెడ్డి గోడపై నుండి కిందకు దిగారు. గోడ దిగే క్రమంలో రాము ప్రమాదవశాత్తు వ్యాక్యూమ్ ట్యాంకులో పడిపోయాడు.
పరిశ్రమ మూడు సంవత్సరాలుగా మూసి ఉన్నకారణంగా ట్యాంకులో రసాయనాలతో కూడిన నీరు 6 ఫీట్ల మేర ఉంది. రాము ట్యాంకులో పడటాన్ని గమనించిన లక్ష్మణ్ వెంటనే ట్యాంకు గోడ ఎక్కి ఓ కర్ర సాయంతో వెతకగా రాము అసస్మారక స్థితిలో పడి ఉన్నాడు. దీంతో అన్నను బయటకు తీసేందుకు లక్ష్మణ్ సైతం ట్యాంకులోకి దిగి అతను కూడా అపస్మారకస్థితిలోకి వెళ్లాడు.
ఇద్దరూ బయటకు రాకపోవడంతో సురేందర్‌రెడ్డి ట్యాంకులోకి దిగి అపస్మారకస్థితిలో ఉన్న రాము, లక్ష్మణ్‌లను బయటకు తీశాడు. ఇద్దరిని వెంటనే షాపూర్‌నగర్‌లోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఇద్దరు మృతిచెందారని డ్యూటీ డాక్టర్ నిర్ధారించారు. సురేందర్‌రెడ్డి సైతం అస్వస్థతకు గురికావడంతో చికిత్స అందిస్తున్నారు. రాము, లక్ష్మణ్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment