chemical
-
Twin Brothers: కలిసే తనువు చాలించి..
జీడిమెట్ల: ఇద్దరు అన్నదమ్ములు కవలలుగా జన్మించి తల్లిదండ్రులకు సంతోషాన్ని ఇచ్చారు. తల్లిదండ్రులు కవలలకు ముద్దుగా రాము, లక్ష్మణ్ అని పేర్లు పెట్టుకున్నారు. ఇద్దరు అన్నదమ్ములు ఎదిగి..బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కి వచ్చి దొరికిన పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అనుకోని ప్రమాదంలో అన్నను కాపాడేందుకు తమ్ముడు ప్రయతి్నంచి ఇద్దరూ ఒకేసారి మృత్యుఒడికి చేరారు. ఈ విషాదకర సంఘటన జీడిమెట్ల పారిశ్రామిక వాడలో జరిగింది. జీడిమెట్ల డీఐ కనకయ్య, ఎస్సై హరీష్ తెల్పన వివరాల ప్రకారం.. ఏపీలోని అంబేడ్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం దొంతికూరు గ్రామానికి చెందిన రాము(32), లక్ష్మణ్(32) కవలలు. వీరు ఉపాధి కోసం నగరానికి వచ్చి గుండ్లపోచంపల్లి, అన్నారం గ్రామంలో ఉంటూ వివిధ పనులు చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా సాధు నారాయణరావు అనే ఫ్యాబ్రికేషన్ కాంట్రాక్టర్ వద్ద రోజువారీ పనులు చేస్తున్నారు. ఇందులో భాగంగానే గత నాలుగు రోజులుగా వీరిద్దరూ జీడిమెట్ల ఏస్వీ కో ఆపరేటివ్ సొసైటీలో 3 సంవత్సరాలుగా మూతపడి ఉన్న సాబూరి ఫార్మా పరిశ్రమలో ఫ్యాబ్రికేషన్ పనులు నిర్వహిస్తున్నారు. బుధవారం రాము, లక్ష్మణ్‌తో పాటు పాండుబస్తీకి చెందిన సురేందర్‌రెడ్డి పరిశ్రమలో ఉన్న వ్యాక్యూమ్ ట్యాంక్ గోడపై నిలబడి ఫ్యాబ్రికేషన్ పనులు నిర్వహిస్తున్నారు. ఉదయం 10 గంటల సమయంలో వీరికి తాగేందుకు చాయ్ రావడంతో లక్ష్మణ్, సురేందర్‌రెడ్డి గోడపై నుండి కిందకు దిగారు. గోడ దిగే క్రమంలో రాము ప్రమాదవశాత్తు వ్యాక్యూమ్ ట్యాంకులో పడిపోయాడు. పరిశ్రమ మూడు సంవత్సరాలుగా మూసి ఉన్నకారణంగా ట్యాంకులో రసాయనాలతో కూడిన నీరు 6 ఫీట్ల మేర ఉంది. రాము ట్యాంకులో పడటాన్ని గమనించిన లక్ష్మణ్ వెంటనే ట్యాంకు గోడ ఎక్కి ఓ కర్ర సాయంతో వెతకగా రాము అసస్మారక స్థితిలో పడి ఉన్నాడు. దీంతో అన్నను బయటకు తీసేందుకు లక్ష్మణ్ సైతం ట్యాంకులోకి దిగి అతను కూడా అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. ఇద్దరూ బయటకు రాకపోవడంతో సురేందర్‌రెడ్డి ట్యాంకులోకి దిగి అపస్మారకస్థితిలో ఉన్న రాము, లక్ష్మణ్‌లను బయటకు తీశాడు. ఇద్దరిని వెంటనే షాపూర్‌నగర్‌లోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఇద్దరు మృతిచెందారని డ్యూటీ డాక్టర్ నిర్ధారించారు. సురేందర్‌రెడ్డి సైతం అస్వస్థతకు గురికావడంతో చికిత్స అందిస్తున్నారు. రాము, లక్ష్మణ్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
విశాఖ జిల్లా గాజువాకలోని శ్రవణ్ షిప్పింగ్ లో ప్రమాదం
-
Anupam Kumar: 'మినీ మైన్స్'తో.. క్లీన్ ఎనర్జీ అండ్ క్లైమెట్ చేంజ్..
‘లో కాస్ట్ – జీరో వేస్ట్’ నినాదంతో ‘మినీ మైన్స్’ స్టార్టప్‌కు శ్రీకారం చుట్టారు అనుపమ్ కుమార్, అరవింద్ భరద్వాజ్. ఈ–వ్యర్థాల నుంచి లిథియం ఎక్స్ట్రాక్షన్ చేస్తూ ఎలక్ట్రిక్ వెహికిల్(ఈవి) పరిశ్రమకు ఖర్చులు తగ్గిస్తున్నారు. దిగుమతులకు ప్రత్నామ్యాయంగా స్వావలంబనకు ప్రాధాన్యత ఇస్తూ విజనరీ ఫౌండర్స్‌గా పేరు తెచ్చుకున్నారు.. ఎలక్ట్రిక్ వెహికిల్స్ (ఈవీ)కి సంబంధించి అతి పెద్ద ఖర్చు లిథియం–అయాన్ బ్యాటరీ. మన దేశంలో లిథియం వోర్ తక్కువగా ఉంది. దీంతో దిగుమతులపై ఆధారపడాల్సిన పరిస్థితి. మరోవైపు చూస్తే ఎలక్ట్రిక్ వాహనాలు, మొబైల్ ఫోన్లు, లాప్టాప్ల బ్యాటరీలకు సంబంధించి ఈ–వ్యర్థాలు కొండలా పేరుకు పోయాయి. ఈ కొండల్లో నుంచి లిథియం వెలికి తీయగలిగితే నికెల్, కోబాల్టును సేకరించగలిగితే దిగుమతులపై అతిగా ఆధారపడాల్సిన అవసరం ఉండదు. బ్యాటరీల ఖర్చు తగ్గుతుంది. బెంగళూరు కేంద్రంగా అనుపమ్ కుమార్, అరవింద్ భరద్వాజ్లుప్రారంభించిన ‘మినీ మైన్స్’ మన దేశంలోని ఈ–వ్యర్థాల నుంచి లిథియం, నికెల్, కోబాల్ట్‌లను సేకరించి వాటిని బ్యాటరీ తయారీదారులకు విక్రయిస్తుంది. మైనింగ్ కంటే లీ–అయాన్ బ్యాటరీల నుండి భాగాలను వెలికితీయడం మంచి రాబడి ఇస్తుంది. ఒక టన్ను లిథియం ఖనిజాన్ని తవ్విప్రాసెసింగ్ చేయడం వల్ల 2–3 కిలోల లిథియం లభిస్తుందని, ఒక టన్ను బ్యాటరీలను రీసైక్లింగ్ చేయడం వల్ల 20–30 కిలోల లిథియం లభిస్తుందని, నీటిని ఆదా చేస్తుందని, కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను తగ్గిస్తుందని అంటున్నారు అనుపమ్, అరవింద్. ‘మన దేశంలోని స్పెంట్ బ్యాటరీల నుంచి 66 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలకు సరిపడా లిథియం అయాన్, నికెల్, కోబాల్ట్‌లను వెలికితీయవచ్చు’ అంటున్నాడు అనుపమ్ కుమార్. మొబైల్ ఫోన్, బటన్ సెల్స్, ల్యాప్‌టాప్ బ్యాటరీల తయారీకి కూడా లి–అయాన్‌ను ఉపయోగిస్తారు. లిథియం కార్బోనేట్‌ను ఫార్మాస్యూటికల్ రంగంలో, గ్లాస్ మాన్యుఫాక్చరింగ్లో ఉపయోగిస్తారు. బిర్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో కెమికల్ ఇంజనీరింగ్ చేసిన అనుపమ్ కుమార్ బాబా ఆటోమిక్ రిసెర్చ్ సెంటర్లో కెరీర్ప్రారంభించాడు. అక్కడ రియాక్టర్ల వ్యర్థాల నుంచి యురేనియం, నికెల్లను వేరు చేసేవాడు. ‘లాగ్9 మెటరీయల్స్’లో అనపమ్, అరవింద్ భరద్వాజ్‌లకు పరిచయం జరిగింది. అక్కడ భరద్వాజ్ లిథియం–అయాన్ బ్యాటరీస్ డివిజన్ హెడ్‌గా ఉండేవాడు. వీరి మధ్య జరిగిన సంభాషణల్లో ‘యురేకా’ మూమెంట్ ఆవిష్కారం అయింది. అది ‘మినీ మైన్స్’ స్టార్టప్ అయింది. తమ పొదుపు మొత్తాలు 6.5 కోట్లతో కంపెనీప్రారంభించారు. మినీమైన్స్ టెక్నాలజీని నీతి ఆయోగ్ ధృవీకరించింది. ఆయిల్ ఇండియా లిమిటెడ్, ది యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రీయల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్లు గ్రాంట్ ఇచ్చాయి. ‘ఎలక్ట్రిక్ వెహికిల్స్ రంగం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలో మినీ మైన్స్ విలువైన లోహాలను పునర్వినియోగ రూపంలో ఈవీ పరిశ్రమకు మేలు చేస్తుంది’ అంటున్నాడు ఆవాజ్ ఫౌండేషన్ కన్వీనర్ సుమైరా అబ్దులాలీ. కమాడిటీ సేల్స్, లైసెన్సింగ్/రాయల్టీ....మొదలైన వాటితో కంపెనీకి సంబంధించిన రెవెన్యూ మోడల్‌ను రూపొందించుకుంది మినీ మైన్స్. ‘ఈ–వ్యర్థాలను రీసైకిల్ చేయగలిగితే మన దేశం మరింత స్వావలంబన దిశగా పయనించడమే కాదు ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమకు ఖర్చును తగ్గించవచ్చు అనుకున్నాం’ అంటాడు కంపెనీ సీయివో అనుపమ్ కుమార్. అతడి మాటలు వృథా పోలేదు అని చెప్పడానికి ‘మినీ మైన్స్’ సాధించిన విజయమే సాక్ష్యం. ఇవి చదవండి: Shambhavi Choudhary: అతి చిన్న వయసు దళిత అభ్యర్థి -
ఓఎన్జీసీ రూ. లక్ష కోట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ చమురు, గ్యాస్ ఉత్పత్తి సంస్థ ఆయిల్, నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ) రెండు పెట్రోకెమికల్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ముడి చమురును నేరుగా అధిక విలువైన రసాయన ఉత్పత్తులుగా మార్చడానికి ఈ నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం రూ.1 లక్ష కోట్ల పెట్టుబడి పెట్టాలని యోచిస్తున్నట్టు కంపెనీ రెండవ త్రైమాసిక ఫలితాలపై ఇన్వెస్టర్ కాల్ సందర్భంగా ఓఎన్జీసీ ఫైనాన్స్ డైరెక్టర్ పోమిలా జస్పాల్ వెల్లడించారు. వేర్వేరు రాష్ట్రాల్లో రెండు ప్రాజెక్టులకుగాను 2028 లేదా 2030 నాటికి రూ.10,000 కోట్లు వెచ్చించనున్నట్టు సంస్థ ఈడీ డి.అధికారి తెలిపారు. పెట్రోకెమికల్స్ సామర్థ్యం ప్రస్తుతం ఉన్న 4.2 మిలియన్ టన్నుల నుంచి 2030 నాటికి 8.5–9 మిలియన్ టన్నులకు చేర్చాలన్నది ప్రణాళిక అని పేర్కొన్నారు. ఒక ప్రాజెక్టు సొంతంగా, మరొకటి భాగస్వామ్యంలో నెలకొల్పనున్నట్టు తెలిపారు. -
పాలీసైక్ల్‌తో రీ సస్టెయినబిలిటీ జట్టు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వ్యర్ధాల నిర్వహణ సంస్థ రీ సస్టెయినబిలిటీ (గతంలో రామ్కీ ఎన్విరో ఇంజినీర్స్) తాజాగా పాలీసైక్ల్ ప్రైవేట్ లిమిటెడ్‌తో జట్టు కట్టింది. ప్లాస్టిక్ రసాయనాల రీసైక్లింగ్ కోసం దేశీయంగా ఫీడ్‌స్టాక్ కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టు కింద తక్కువ గ్రేడ్ ప్లాస్టిక్స్‌ను సేకరించి పాలీసైకిల్, దాని భాగస్వామ్య సంస్థల కెమికల్ రీసైక్లింగ్ ప్రాజెక్టుల కోసం ఫీడ్‌స్టాక్‌ను సిద్ధం చేయనున్నారు. ఒప్పందంలో భాగంగా ఢిల్లీలో తొలి సారి్టంగ్, ప్రీ–ప్రాసెసింగ్ ప్లాంటును ఏర్పాటు చేయాలని కంపెనీలు భావిస్తున్నాయి. పర్యావరణ పరిరక్షణకు ఇటువంటి ఆవిష్కరణలు, భాగస్వామ్యాలు తోడ్పడగలవని రీ సస్టెయినబిలిటీ సీఈవో మసూద్ మలిక్ తెలిపారు. -
సైలెంట్ కిల్లర్.. వయెలెంట్‌గా..
సాక్షి, హైదరాబాద్: సైలెంట్ కిల్లర్‌గా పిలిచే కేన్సర్ వ్యాధి రాష్ట్రంలో వయెలెంట్‌గా విస్తరిస్తోంది. పొగాకు, మద్యం వినియోగం, ఆహారపు అలవాట్లు, వ్యవసాయంలో పెరిగిపోతున్న రసాయన ఎరువులు, శీతల పానీయాల వినియోగం, ఆధునిక జీవన శైలి పోకడల వంటి పరిణామాలతోనే కేన్సర్ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. కేన్సర్‌ను ప్రారంభదశలోనే గుర్తించి చికిత్స మొదలుపెట్టగలిగితే వ్యాధిని నయం చేయవచ్చని వైద్యనిపుణులు చెబుతుండగా...శరీరంలో తెలియకుండానే మొదలైన ఈ వ్యాధిని ముదిరిపోయేంతవరకూ పసిగట్టలేకే మరణాలవరకూ తెచ్చుకుంటున్నాం. జాతీయ వైద్య పరిశోధక మండలి (ఐసీఎంఆర్) వెల్లడించిన తాజా నివేదికలోని కేన్సర్ కేసుల, మరణాల గణాంకాలు ఇప్పుడు ప్రమాద ఘంటికల్ని మోగిస్తు న్నాయి. 2022లో దేశవ్యాప్తంగా 8.08లక్షల మంది కేన్సర్‌తో మరణించగా...అందులో ఒక్క తెలంగాణలోనే 27,339 మంది ఉన్నట్లు ఐసీఎంఆర్ నివేదికలో పేర్కొంది. రెండేళ్లతో పోలిస్తే పెరిగిన మరణాల సంఖ్య అంతకుముందు రెండేళ్లతో పోల్చుకుంటే దేశంతో పాటు రాష్ట్రంలోనూ కేన్సర్ రోగులు, మరణాల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఐసీఎంఆర్ నివేదిక ప్రకారం కేన్సర్ మరణాల్లో తెలంగాణ దేశంలో 13వ స్థానంలో ఉంది. 1.16లక్షల మరణాలతో ఉత్తరప్రదేశ్ తొలి స్థానంలో ఉండగా 66,879 మరణాలతో మహారాష్ట్ర దాని తర్వాతి స్థానంలో నిలిచింది. దేశంలోని ప్రతి లక్ష మందిలో ఒకరికి కేన్సర్ ఉన్నట్లు నివేదికలో పేర్కొంది. 2022లో దేశంలో కేన్సర్ రోగులు 14.61 లక్షలుండగా అందులో తెలంగాణలోనే కొత్తగా 49,983 కేన్సర్ కేసులు నమోదయ్యాయి. ఇక భవిష్యత్తులో దేశంలో ప్రతి తొమ్మిది మందిలో ఒకరికి కేన్సర్ వచ్చే అవకాశం ఉందని, 2025 నాటికి ఆ సంఖ్య 15.7 లక్షలకు చేరుకోనుందని ఐసీఎంఆర్ తాజా నివేదికలో హెచ్చరించింది. అధికంగా ఆ వయసువారే.. 60–64 వయస్సు గలవారు అత్యధికంగా కేన్సర్ బారిన పడుతున్నారు. పురుషుల్లో నమోదయ్యే కేన్సర్ కేసుల్లో ఊపిరితిత్తుల కేన్సర్ కేసులు 10.6%, నోటి కేన్సర్ 8.4%, ప్రొస్టేట్ కేన్సర్ కేసులు 6.1%, నాలుక కేన్సర్ కేసులు 5.9%, కడుపు కేన్సర్ కేసులు 4.8% నమోదవుతున్నాయి. మహిళల్లో నమోదయ్యే కేన్సర్ కేసుల్లో రొమ్ము కేన్సర్ 28.8%, గర్భాశయ కేన్సర్ 10.6%, అండాశయ కేన్సర్ 6.2%, ఊపిరితిత్తుల కేన్సర్ 3.7% నమోదవుతున్నాయి. 35 ఏళ్లు దాటితే పరీక్షలు తప్పనిసరి... ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల ప్రకారం 35ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ ఏడాదికి ఒకసారి లేదా రెండేళ్లకోసారైనా కేన్సర్ స్క్రీనింగ్ పరీ క్షలు చేయించుకోవాలి. దంత వైద్యుల వద్దకు వెళితే వారు చేసే పరీక్షలు నోటి కేన్సర్ నిర్ధారణకూ ఉపయోగపడతాయి. 8 నుంచి 18 ఏళ్లలోపు ఆడ పిల్లలకు సర్వైకల్ కేన్సర్ రాకుండా టీకాను వేయించి వ్యాధి రాకుండా అడ్డుకోవచ్చు. యాభై ఏళ్లు దాటినవారికి మలంలో రక్తం పడితే కొలనోగ్రఫీ ద్వారా వ్యాధిని గుర్తించవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. ఆలస్యంగా రావడం వల్లే అధిక మరణాలు ప్రస్తుతం రాష్ట్రంలో 70 శాతం మంది కేన్సర్ చివరి దశలో ఉండగా మాత్రమే ఆస్పత్రులకు వస్తున్నారు. దీంతో అధిక మరణాలు నమోదవుతున్నాయి. ఇక విదే శాల్లో 70 నుంచి 80 శాతం మంది మొదటి దశలోనే ఆస్పత్రులకు వచ్చి వైద్యులను సంప్రదిస్తున్నారు. సర్వైకల్, రొమ్ము కేన్సర్లను సులువుగా నయం చేయవచ్చు. రొమ్ము కేన్సర్‌ను మూడో దశలోనూ, థైరాయిడ్ కేన్సర్ వస్తే 100% నయం చేయవచ్చని వైద్యులు భరోసా ఇస్తున్నారు. పిల్లల్లో రక్త సంబంధిత కేన్సర్లే అధికం.. జన్యుమార్పిడి వల్లే పిల్లల్లో కేన్సర్ వస్తుంటుందని, ఎక్కువగా వారి లో రక్త సంబంధిత కేన్సర్లు అధికంగా వస్తుంటాయని వైద్యులు చెబుతు న్నారు. పిల్లల్లో వైద్యానికి స్పందించే లక్షణం ఎక్కువ వారికి వచ్చే కేన్స ర్లలో 80% వరకు నయం చేయడానికి వీలుంటుందని ఆంకాలజిస్టులు చెబుతున్నారు. మూడో దశ కేన్సర్లతో వచ్చే పిల్లల్ని సగం మందిని, నాలుగోదశలో వస్తే 25% మందిని బతికించవచ్చని అదే తొలి రెండు దశల్లో వస్తే 90%మందికి నయం చేయవచ్చని వైద్యులు చెబుతున్నారు. దేశంలో 2035 నాటికి 13లక్షల కేసులు.. పొగాకు, మద్యం, చెడు ఆహారపు అలవాట్ల వల్ల 66 శాతం, ఇన్ఫెక్షన్లతో 20% కేన్సర్లు వస్తున్నాయి. హార్మోన్లు, జన్యుమార్పుల వల్ల 10% పైగా, కాలుష్యం వల్ల ఒక శాతం కేన్సర్ రిస్క్‌లున్నాయి. 2035 నాటికి దేశంలో కేన్సర్ మరణాలు 13 లక్షలకు చేరుకుంటాయని అంచనా. –డాక్టర్ కిరణ్ మాదల, నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ -
ఈమె డాక్టర్ భారతి ఎందరికో స్ఫూర్తి
సాకే భారతి రెండు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా అనంతపురం ఎస్.కె.యూనివర్సిటీలో రసాయన శాస్త్రంలో పీహెచ్డీ పట్టా తీసుకుంది. ఆమె పుట్టి పెరిగిన సామాజిక వర్గం (ఎరుకల)లో, ఆమె నివసిస్తున్న శింగనమల మండలం నాగుల గుడ్డం గ్రామంలో ఆమె సాధించింది ఎంత పెద్ద ఘనకార్యమో చాలామందికి తెలియదు.అసలు సాకే భారతి చదువుకుంటూ ఉంటేనే ‘చదువెందుకు’ అని చాలామంది స్త్రీలు ఆశ్చర్యపోయేవారు. ‘మేము ఏం చదివామని సుబ్రంగా కాపురాలు చేస్తున్నాం’ అని కూడా అనేవారు. కాని చదువు తెచ్చే వెలుతురు భారతికి బాగా తెలుసు.ఈ మెట్టు తర్వాత తనకు ప్రోఫెసర్గానో అసిస్టెంట్ప్రోఫెసర్గానో ఉద్యోగం వస్తే మారబోయే తన జీవితమూ తెలుసు. తనను చూసైనా తన వర్గంలో తనలాంటి సామాజిక వర్గాల్లో స్ఫూర్తి రావాలని ఆమె కోరిక. ముగ్గురు ఆడపిల్లలు తల్లిదండ్రులకు పుట్టిన ముగ్గురు ఆడపిల్లల్లో సాకే భారతి రెండో సంతానం. తండ్రికి చదువు లేదు. పైగా ముగ్గురూ ఆడపిల్లలే పుట్టారని, అబ్బాయి పుట్టలేదని భార్యను ఇబ్బంది పెట్టేవాడు. తను కూడా చాలా అస్థిమితంగా ఉండేవాడు.ఇంట్లో వాతావరణం ఏమీ బాగుండేది కాదు. అప్పుడు భారతి తాత భారతితో అన్నమాట ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది– అమ్మా... నా కూతుర్ని మీ నాన్నకు ఇస్తే ఇలా ఇబ్బంది పెడుతున్నాడు. ఆడపిల్లకు ఏం తక్కువ? బాగా చదువుకుంటే ఎన్నో గొప్ప పనులు చేయవచ్చు.నువ్వు బాగా చదువుకుని మీ నాన్న కళ్లు తెరిపియ్యాలి’ అన్నాడు. ఆ రోజు నుంచి భారతి గట్టిగా చదువుకోవాలనుకుంది. ఇవాళ్టికీ చదువుకుంటూనే ఉంది. ఎన్నో కష్టాలు భారతి మూడోక్లాసుకు వచ్చేసరికి చిన్న చెల్లెలు పుట్టింది. తల్లిదండ్రులు ఇద్దరూ కూలికి వెళ్లాలి. అక్క బడికెళ్లాలి. చెల్లెల్ని ఎవరు చూసుకోవాలి? రెండేళ్లు బడి మానేసి ఇంట్లో చెల్లెల్ని చూసుకుంటూ ఉండిపోయింది భారతి. ఆ తర్వాత పదోక్లాస్లో పెళ్లి చేశారు. అప్పుడు కూడా ఒక సంవత్సరం చదువు సాగలేదు.పెళ్లయ్యాక నివాసానికి ఇల్లు లేకపోవడంతో రేకుల షెడ్డు వేసుకుని అందులోనే ఉన్నారు. అక్కడే ఒకరోజు కాలేజీకి వెళుతూ ఒకరోజు కూలి పనికి వెళుతూ చదువుకుంది భారతి. ఇంటర్ (ఎం.పి.సి.)లో రోజు కూలి పాతిక రూపాయలు, డిగ్రీ (బిఎస్సీ)లో రోజు కూలి యాభై రూపాయలు వచ్చేది. ఈ లోపు కూతురు పుట్టింది. పాటలంటే చాలా ఇష్టమున్న భారతి తన కూతురికి ‘గాయని’ అని పేరు పెట్టింది. పెళ్లి, సంసారం వల్ల చదువు మీద శ్రద్ధ ఉండటం లేదని భారతి బాధ పడుతుంటే భర్త ఏరికుల శివప్రసాద్ ఇంటర్ చదువు కొనసాగేలా ప్రోత్సహించాడు. పామిడిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్, అనంతపురం ఎస్ఎస్బీఎన్ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ, అనంతపురంలోనే ఎమ్మెస్సీ పూర్తి చేసింది. గ్రామం నుంచి కళాశాలకు పోవడానికి రవాణా సౌకర్యం లేకపోవడంతో రోజూ ఎనిమిది కిలోమీటర్లు గార్లదిన్నెకు నడుచుకుంటూ వెళ్లి అక్కడ నుంచి ఆర్టీసీ బస్సులో అనంతపురం వెళ్లి చదువుకుంది. డిగ్రీలో భారతి ఫస్ట్ క్లాస్ తెచ్చుకుంది. ఆ తర్వాత ఎమ్మెస్సీ పూర్తి చేసింది. ఇల్లు లేదు.. ఉద్యోగం లేదు భారతి నివసిస్తున్న ఇల్లు అసంపూర్ణ స్థితిలో ఉంది. గతంలో ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయితే డబ్బులేక నిర్మాణం సగంలోనే ఆపేయాల్సి వచ్చింది.ప్రోఫెసర్ కావాలన్నదే భారతి కోరిక. ప్రోఫెసర్ ఉద్యోగం వస్తే నేను నేర్చుకున్న జ్ఞానాన్ని మరి కొంతమంది విద్యార్థులకు పంచి చదువులో రాణించే విధంగా కృషి చేస్తాను’ అంది భారతి. పీహెచ్డీ పట్టా వచ్చాక దానిని ఇంట్లో పెట్టి కూలి పనికి వెళుతోంది భారతి. టొమాటో చేనులో, బెండకాయ చేనులో పని చేస్తోంది. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 వరకు పని చేస్తే 150 రూపాయలు వస్తున్నాయి. – రుషింగప్పగారి మునెప్ప, శింగనమల, సాక్షి చేతిలో పలుగూ పార నెత్తిన పచ్చగడ్డి నుదుటిన ఎప్పుడూ దొర్లే చెమట కాని గుండెల నిండా చదువు పూర్తి చేయాలన్నసంకల్పం.మహా మహా సౌకర్యాలు ఉండి కూడా పీహెచ్డీ కల నెరవేర్చుకోలేని వారు చకితమయ్యేలా ఏ సౌకర్యాలూ లేని వాళ్లు కొండంత స్ఫూర్తి పొందేలా వ్యవసాయ కూలీ భారతి మొన్న (సోమవారం) పీహెచ్డీ పట్టా అందుకుంది. అనంతపురంలో ఈ అద్భుతం జరిగింది. 2016లో పీహెచ్డీ సీటు 2016లో సాకే భారతి ఎస్.కె. యూనివర్శిటీలోప్రోఫెసర్ ఎం.సి.ఎస్ శోభ దగ్గర ఆర్గానిక్ కెమెస్ట్రీలో పిహెచ్.డి ప్రవేశం ΄పొందింది. పిహెచ్.డిలో చేరడంతో ప్రభుత్వం నుంచి వచ్చే ఉపకార వేతనం భారతి చదువుకు సహాయపడింది. దీంతోపాటు కూలి పనులకు వెళ్తూ 2023 సంవత్సరానికి పట్టా పొందింది. స్లిప్పర్లతో, అతి సాదా బట్టలతో స్నాతకోత్సవంలో పట్టా అందుకోవడానికి భారతి స్టేజీ ఎక్కితే ఆడిటోరియం అంతా చప్పట్లతో మార్మోగి పోయింది. -
ఈ కాక్టెయిల్ వృద్ధాప్యాన్ని రానివ్వదట!ఎప్పటికీ..
వృద్ధాప్యం! ఆ వయసులో ఎదుర్కొనే సమస్యలు గురించి అందరికీ తెలిసిందే. ఇప్పటికీ చాలామంది ఆ వయసు సమీపించే సమయంలో కూడా ఫిట్‌గా యవ్వనంగా ఉండాలనే రకరకాల డైట్ ఫాలో అవుతుంటారు. అయినా ఏదో ఒకరకంగా మనలో ఆ వృద్ధాప్య ఛాయాలు కనిపిస్తునే ఉంటాయి. ఐతే దానికి చెక్‌పెట్టి మనం ఎప్పటికీ యవ్వనంగా ఉండొచ్చని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. మన జీవిత కాలాన్ని పొడిగించుకోవచ్చు అని చెబుతున్నారు. ఈ మేరకు శాస్త్రవేత్తలు తాజాగా జరిపిన అధ్యయనాల్లో ఈ విషయం వెల్లడైంది. హర్వర్డ్ శాస్త్రవేత్తల బృందం వృద్ధాప్యాన్ని తిప్పికొట్టే ఓ సరికొత్త రసాయన కాక్టెయిల్ని కనిపెట్టింది. వారంతా ఈ కాక్టెయిల్ని మానవులు, ఎలుకలపై ప్రయోగించగా సత్ఫలితాలనిచ్చింది. వారి ఏజ్‌ని చాలా ఏళ్లు వెనక్కి నెట్టినట్లు నిర్థారించారు. తాము ఈ పరిశోధనలను "రసాయన ప్రేరిత రీ ప్రోగ్రామింగ్ టు రివర్స్ సెల్యులర్ ఏజింగ్" అనే పేరుతో చేసినట్లు తెలిపారు ఈ మేరకు హార్వర్డ్ పరిశోధకుడు డేవిడ్ సింక్లైర్ జూలె12న ప్రచురితమైన జర్నల్ ఏజింగ్‌లో ఈ విషయాన్ని పేర్కొన్నాడు. "జన్యు చికిత్స ద్వారా రివర్సల్ ఏజింగ్ సాధ్యమవుతుందని భావించాం. ఇప్పుడూ ఈ కెమికల్ కాక్టెయిల్స్తో అది సాధ్యమని చూపించాం. ఇది నిజంగా మనిషిని పూర్తి యవ్వనవంతుడిగా మార్చే ఒక ముందడగు అని పేర్కొన్నారు శాస్త్రవేత్తలు. ఈ రసాయన కాక్టెయిల్లో ఐదు నుంచి ఏడు ఏజెంట్లు ఉంటాయని, వీటిలో చాలా వరకు శారీరక, మానసిక రుగ్మతలకు చికిత్స అందిస్తాయని చెప్పారు. తమ బృందం సెల్యూలర్ వృద్ధాప్యాన్ని తిప్పికొట్టేలా మానవ కణాలను పునర్జ్జీవింప చేయడానికి మిళితం చేయగల అణువులను కనుగొనడానికి మూడు ఏళ్లు పైగా కృషి చేశారు. ఈ పరిశోధనల్లో.. ఆప్టిక్ నరాలు, మెదడు, కణజాలం, మూత్రపిండాలు, కండారాలు తదితరాలపై అధ్యయనాలు మెరుగైన ఫలితాలను ఇచ్చాయని తెలిపారు. ఎలుకలపై చేసిన పరిశోధనల్లో..వాటి జీవితకాలం పొడిగించబడటమేగాక మంచి ఫలితాలు కనిపించాయన్నారు. అలాగే కోతులపై చేసిన పరిశోధనల్లో కూడా మెరుగైన ఫలితాలు వచ్చాయని తెలిపారు. ఇక మిగిలింది మానవులపై చేయాల్సిన పూర్తి స్తాయి క్లినికల్ ట్రయల్స్ అని పేర్కొన్నారు. వచ్చే ఏడాదిలో అవి కూడా ప్రారంభకానున్నాయని చెప్పారు. అంతా సవ్యంగానే జరగుతుందని, మంచి ఫలితాలే వస్తాయని ధీమగా చెబతున్నారు హార్వర్డ్ శాస్త్రవేత్త సింక్లైర్. (చదవండి: ఇది చినుకు కాలం.. జనం వణుకు కాలం.. 3-4 వారాలు బాధించే జ్వరంతో జాగ్రత్త!) -
ఒక శకం ముగిసింది: ప్రముఖ పారిశ్రామికవేత్త కన్నుమూత
తొలి తరం వ్యవస్థాపకుడు, రసాయనాల తయారీ కంపెనీ దీపక్ నైట్రేట్ వ్యవస్థాపకుడు, చైర్మన్ చిమన్లాల్ కె మెహతా (సీకె మెహతా) సోమవారం కన్నుమూశారు. మౌలిక్ మెహతా కంపెనీకి సీఈవోగా ఉన్నారు.దీంతో పలువురు పారిశ్రామిక వేత్తలు, ఇతర పరిశ్రమ వర్గాలు సంతాపాన్ని ప్రకటించాయి. ఒక శకం ముగిసింది అంటూ ఆయనకు నివాళులర్పించారు. 1972-73లో దీపక్ నైట్రేట్ తయారీని ప్రారంభించిన చిమన్లాల్ రెండేళ్లలోనే లాభాల బాట పట్టించారు. అనేక కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) కార్యక్రమాలను ప్రారంభించడంలోనూ, దీపక్ ఫౌండేషన్‌ను స్థాపించడంలోమెహతాది కీలకపాత్ర. 1971లో దీపక్ నైట్రేట్ ప్రారంభ పబ్లిక్ ఆఫర్ వచ్చింది. ఈ సందర్భంగా 20 రెట్లు ఓవర్‌సబ్‌స్క్రైబ్ చేయడం విశేషం. దీపక్ నైట్రేట్ 1984లో మఫత్‌లాల్ ఇండస్ట్రీస్ నుండి సహ్యాద్రి డైస్టఫ్స్, కెమికల్స్ యూనిట్‌ను కొనుగోలు చేసింది. కంపెనీ 1995లో మహారాష్ట్రలోని తలోజాలో హైడ్రోజనేషన్ ప్లాంట్‌ను స్థాపించింది. ప్రస్తుతం, కంపెనీ గుజరాత్‌లోని నందేసరి , దహేజ్, మహారాష్ట్రలోని తలోజా అండ్ రోహా తెలంగాణలోని హైదరాబాద్‌లో ప్లాంట్స్ ఉన్నాయి. దీపక్ నైట్రేట్ 100కి పైగా ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియోలను ఉత్పత్తి చేస్తుంది. వ్యవసాయ రసాయనాలు, రంగులు, రబ్బరు, ఫార్మాస్యూటికల్స్, స్పెషాలిటీ అండ్ ఫైన్ కెమికల్స్ లాంటి రసాయనాలను ఉత్పత్తి చేస్తుంది. ప్రస్తుతం ప్రపంచంలో కెమికల్స్‌లో ఆరో అతిపెద్ద సంస్థగా ఉంది. అలాగే మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా చాలా రెట్లు పెరిగి, పదేళ్ల నాటి 24వ స్థానంతో పోలిస్తే దీపక్ నైట్రేట్ అయిదో అతిపెద్ద లిస్టెడ్ కెమికల్ ప్లేయర్‌గా ఉంది. ఏప్రిల్, 2023 నాటికి రూ. 25,208 కోట్లు. -
అనంతపురంలో పేలుడు.. ముక్కలైన వ్యక్తి శరీరం
సాక్షి, అనంతపురం: అనంతపురం నగరంలో పేలుడు కలకలం రేపుతోంది. ఊహించని ప్రమాదం ఓ వ్యక్తి ప్రాణాలను బలి తీసుకుంది. రవాణాశాఖ కార్యాలయం సమీపంలోని బాలాజీ స్టిక్కర్ అండ్ స్ప్రే పేయింట్ షాపులో కెమికల్ పెయింట్ డబ్బా ఓపెన్ చేస్తుండగా పేలుడు సంభవించింది. ఒక్కసారిగా పెయింట్ బాక్స్ పేలడంతో సతీష్ అనే వాచ్మెన్ అక్కడిక్కడే మృతిచెందాడు. పేలుడు ధాటికి మృతుడి శరీర భాగాలు తునాతునకలయ్యాయి. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా పేలిన పెయింట్ డబ్బా పదేళ్ల క్రితం నాటిదని తేలుస్తోంది. -
రసాయనాల తయారీ హబ్‌గా భారత్
న్యూఢిల్లీ: దేశీయంగా రసాయనాలకు డిమాండ్ పెరుగుతోంది. రాబోయే రెండు దశాబ్దాల్లో అంతర్జాతీయంగా రసాయనాల వినియోగంలో అయిదో వంతు వాటా భారత్‌దే ఉండనుంది. 2040 నాటికి ఇది 1,000 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 82,00,000 కోట్లు) చేరనుంది. ’తదుపరి రసాయనాల తయారీ హబ్‌గా భారత్’ పేరిట రూపొందించిన నివేదికలో కన్సల్టెన్సీ సంస్థ మెకిన్సే ఈ విషయాలు వెల్లడించింది. గత దశాబ్దకాలంగా ఇటు రసాయనాల వినియోగంలోనూ, అటు షేర్‌హోల్డర్ల కు సంపద సృష్టిలోనూ భారత కెమికల్స్ రంగం అంతర్జాతీయ పరిశ్రమను మించి రాణించిందని పేర్కొంది. ప్రస్తుతం ఇటు వినియోగం అటు తయారీ.. రెండింటిలోనూ అంతర్జాతీయంగా ఆధి పత్య పాత్ర పోషించే స్థాయిలో భారత్ ఉందని మెకిన్సే వివరించింది. 2021–27 మధ్య కాలంలో పరిశ్రమ 11–12 శాతం, 2027–40 మధ్య 7–10 శాతం మేర వృద్ధి చెందవచ్చని పేర్కొంది. 2040 నాటికి అంతర్జాతీయంగా తన మార్కెట్ వాటాను మూడు రెట్లు పెంచుకోవచ్చని వివరించింది. ‘వచ్చే రెండు దశాబ్దాల్లో అదనంగా పెరిగే రసాయనాల వినియోగంలో భారత్ వాటా 20 శాతం పైగా ఉండవచ్చని అంచనాలు ఉన్నాయి. దేశీయంగా డిమాండ్ 2021లో 170–180 బిలియన్ డాలర్లుగా ఉండగా .. 2040 నాటికి 850–1,000 బిలియన్ డాలర్లకు చేరే అవకాశం ఉంది‘ అని మెకిన్సే వివరించింది. అన్నింటా వినియోగం.. రసాయనాలు ప్రస్తుతం రోజువారీ ఉత్పత్తుల్లో భా గంగా మారిపోయాయి. డిటర్జెంట్లు, దుస్తులు మొ దలుకుని సుగంధ పరిమణాలు, క్రిమి సంహారకా లు, పెయింట్ల వరకు వివిధ రంగాల్లో విరివిగా వినియోగిస్తున్నారు. అంతర్జాతీయంగా పర్యావరణ అనుకూల ఉత్పత్తులకు ఆదరణ పెరుగుతుండటం భారత్‌కు లాభించగలదని మెకిన్సే పేర్కొంది. ఆ యా ఉత్పత్తుల్లో వినియోగించే అనేక రసాయనా లను తయారు చేసే టాప్ దేశాల్లో భారత్ కూడా ఒకటిగా ఉండటం ఇందుకు కారణమని వివరించింది. భౌగోళిక రాజకీయ పరిస్థితులు మారిపోతుండటం, పలు దేశాలు ప్రస్తుతమున్న కీలక తయారీ మార్కెట్లకు ప్రత్యామ్నాయాలను అన్వేíÙస్తుండటం వంటి పరిణామాల నేపథ్యంలో భారత్ కీలక గమ్యస్థానంగా మారేందుకు అవకాశం ఉందని పేర్కొంది. సవాళ్లున్నప్పటికీ .. దేశీ కంపెనీలు క్రాకర్ సామరŠాధ్యల లేమి, కీలక ఖనిజాల కొరత తదితర సమస్యలు ఎదుర్కొంటున్నాయని మెకిన్సే తెలిపింది. అలాగే పరిశోధనలు, అభివృద్ధి కార్యక్రమాల్లో సుశిక్షితులైన నిపుణుల కొరత, సమయానికి పర్యావరణ అనుమతులు, స్థలపరమైన కేటాయింపులు జరగకపోతుండటం వంటి సవాళ్లు కూడా ఉంటున్నాయని పేర్కొంది. అయినప్పటికీ తక్కువ మూలధనం, చౌకగా కారి్మకుల లభ్యత తదితర అంశాల కారణంగా పలు రసాయనిక విభాగాల్లో భారత్ ఇప్పటికీ చవకైన మార్కెట్లలో ఒకటిగా నిలుస్తోంది. మరోవైపు, భారత్ రసాయనాల తయారీలో కీలకంగా మారుతున్నప్పటికీ తనకు అవసరమైన కెమికల్స్ కోసం మాత్రం దిగుమతులపై ఆధారపడాల్సి ఉంటోంది. రసాయనాల పరిశ్రమలో అసేంద్రీయ, పెట్రోకెమికల్స్, స్పెషాలిటీ అంటూ మూడు ప్రధాన విభాగాలు ఉన్నాయి. వీటిలో స్పెషాలిటీ కెమికల్స్ మాత్రమే నికరంగా ఎగుమతి చేయగలుగుతోంది. కీలకమైన ముడివనరులు, ఖనిజాలు, మౌలిక సదుపాయాల కొరత కారణంగా అసేంద్రీయ, పెట్‌కెమ్ విభాగాలు దిగుమతులపైనే ఆధారపడటం కొనసాగవచ్చని మెకిన్సే వివరించింది. భారత్‌లో రసాయనాల వినియోగానికి స్పెషాలిటీ కెమికల్స్ విభాగం ఊతమివ్వగలదని పేర్కొంది. 2040 నాటికి భారత నికర ఎగుమతుల్లో ఈ విభాగం వాటా 10 రెట్లు పెరిగి 20 బిలియన్ డాలర్ల స్థాయికి చేరుకోగలదని తెలిపింది. ప్రస్తుతం ఇది 2 బిలియన్ డాలర్లు. -
ఇకపై స్పెషాలిటీ కెమికల్స్ జోరు
కరోనా మహమ్మారి తదుపరి ప్రపంచ కెమికల్ దిగ్గజాలు సరఫరాల చైన్‌ను పునర్వ్యవస్థీకరించే సన్నాహాలు ప్రారంభించాయి. తద్వారా చైనాయేతర దేశాల కంపెనీలపై దృష్టి సారిస్తున్నాయి. ఇదే సమయంలో దేశీయంగా స్పెషాలిటీ కెమికల్స్ తయారీ కంపెనీలు సామర్థ్య విస్తరణను చేపట్టాయి. ఈ నేపథ్యంలో ఇకపై స్పెషాలిటీ కెమికల్స్ కంపెనీలు మరింత మెరుగైన పనితీరు చూపే వీలున్నట్లు పలువురు స్టాక్ నిపుణులు భావిస్తున్నారు. వివరాలు చూద్దాం.. దేశీయంగా టాప్ పొజిషన్లో ఉన్న స్పెషాలిటీ కెమికల్స్ తయారీ కంపెనీలు కొంతకాలంగా విస్తరణ కార్యకలాపాలు అమలు చేస్తున్నాయి. దీంతో ప్రొడక్టుల లభ్యత పెరగనుంది. మరోవైపు కోవిడ్–19 తదుపరి ప్రపంచవ్యాప్తంగా సాధారణ పరిస్థితులు నెలకొనడం, ఆర్థిక వ్యవస్థలు పురోగమన పథం పట్టడం వంటి అంశాలు పలు రంగాలకు జోష్‌నిస్తున్నాయి. వీటిలో స్పెషాలిటీ కెమికల్ పరిశ్రమ సైతం చేరనున్నట్లు మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు. నిజానికి పలు గ్లోబల్ కెమికల్ దిగ్గజాలు చైనాపై ఆధారపడటాన్ని తగ్గించుకునే యోచనలో ఉన్నాయి. రిస్కులను తగ్గించుకునే వ్యూహాలు దీనికి కారణంకాగా.. ఇందుకు అనుగుణంగా భారత్ వంటి దేశాలవైపు చూస్తున్నా యి. ఇదే సమయంలో పలు అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలోనూ డిమాండుపై అంచనాలతో దేశీ కంపెనీలు తయారీ సామర్థ్యాలను పెంచుకుంటూ రావడం మరిన్ని అవకాశాలకు దారిచూపనున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. వెరసి స్పెషాలిటీ కెమికల్స్‌కు పెరగనున్న డిమాండును అందుకునే బాటలో దేశీ పరిశ్రమ ముందుకు సాగుతున్నట్లు తెలియజేశారు. చైనాకు చెక్ కోవిడ్–19 సవాళ్ల తదుపరి ఏడాది కాలంగా స్పెషాలిటీ కెమికల్స్ పరిశ్రమ ఊపందుకుంది. ఓవైపు చైనాకు ప్రత్యామ్నాయాల అన్వేషణలో భాగంగా ఇతర దేశాల కంపెనీలపై గ్లోబల్ కెమికల్ దిగ్గజాలు దృష్టిసారిస్తుంటే.. మరోపక్క యూరోపియన్ కెమికల్ దిగ్గజాలు భారత్ మార్కెట్‌వైపు మొగ్గు చూపుతున్నాయి. ఇందుకు ప్రధానంగా యూరోప్‌లో తయారీ వ్యయ, ప్రయాసలతో కూడుకోవడం ప్ర భావం చూపుతోంది. భారత్ నుంచి చౌకగా ప్రొడక్టులను ఔట్సోర్సింగ్ చేసుకునేందుకు వీలుండటం ఇందుకు సహకరిస్తున్నట్లు నిపుణులు విశ్లేషించారు. నిజానికి ఈ రంగంలో దేశీయంగా పలు కంపెనీలు ప్రొడక్టులను భారీగా ఎగుమతి చేస్తున్నాయి. అయితే ఇకముందు ఔట్సోర్సింగ్ మరింత పుంజుకోనున్నట్లు పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కొత్త మాలిక్యూల్స్.. కొద్ది రోజులుగా స్పెషాలిటీ కెమికల్ తయారీ ముడివ్యయాలు తగ్గుతూ వస్తున్నాయి. దీనికితోడు ఇంధన వ్యయాలూ దిగివస్తున్నాయి. ఇదే సమయంలో దేశీయంగా కొత్త మాలిక్యూల్స్, ప్రాసెస్‌పై కొన్ని కంపెనీలు ప్రత్యేక దృష్టి పెట్టాయి. అంతేకాకుండా సొంతంగా ముడిసరుకులను సమకూర్చుకోవడం, దిగుమతి ప్రొడక్టులకు ప్రత్యామ్నాయాల అన్వేషణ, ఉత్పత్తి సామర్థ్యాల పెంపు వంటి వ్యూహాలను అమలు చేస్తున్నాయి. తద్వారా గ్లోబల్ దిగ్గజాల నుంచి దీర్ఘకాలిక సరఫరా కాంట్రాక్టులను పొందడంపై కన్నేసినట్లు నిపుణులు పేర్కొన్నారు. షేర్లపై ఎఫెక్ట్ పటిష్ట అమ్మకాలు సాధిస్తున్న స్పెషాలిటీ కెమికల్ కంపెనీల స్టాక్స్ గత కొన్నేళ్లుగా లాభాలతో దూసుకెళ్లడంతో ఇటీవల కొంతమేర దిద్దుబాటును చవిచూస్తున్నాయి. గత 5–7 ఏళ్ల కాలాన్ని పరిగణిస్తే పలు దిగ్గజాల షేర్లు రెటింపునకుపైగా బలపడ్డాయి. అయితే కొద్ది నెలలుగా రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, అధిక ద్రవ్యోల్బణ పరిస్థితులు, ఆర్థిక మందగమన భయాలు వంటి ప్రతికూలతలతో వెనకడుగు వేస్తున్నాయి. 52 వారాల గరిష్టాలతో పోలిస్తే ఎస్ఆర్ఎఫ్, దీపక్ నైట్రైట్, ఆర్తి ఇండస్ట్రీస్, ఆల్కిల్ అమైన్ కెమికల్స్, క్లీన్ సైన్స్ టెక్నాలజీస్ తదితర షేర్లు 20–40 శాతం మధ్య పతనమయ్యాయి. అయినప్పటికీ ఐదేళ్ల సగటు ధరలతో చూస్తే ప్రీమియంలోనే ట్రేడవుతున్నట్లు స్టాక్ నిపుణులు చెబుతున్నారు. భవిష్యత్ ఆర్జనలపట్ల ఆశావహ అంచనాలు సానుకూల ప్రభావం చూపుతున్నట్లు తెలియజేశారు. ఇటీవల త్రైమాసిక ఫలితాలలో పీఐ ఇండస్ట్రీస్ ఆదాయం జంప్‌చేయగా.. రిఫ్రిజిరెంట్ గ్యాస్ ధరలతో గుజరాత్ ఫ్లోరో, ఎస్ఆర్ఎఫ్ లబ్ది పొందే వీలుంది. ఎఫ్ఎంసీజీ రంగం ద్వారా గలాక్సీ, ఫైన్ ఆర్గానిక్ మార్జిన్లు మెరుగుపడ్డాయి. ఇక దీపక్, ఆర్తి, జూబిలెంట్ కొంతమేర మార్జిన్ ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. అయితే ప్రత్యేక ప్రొడక్టుల ద్వారా పనితీరు మెరుగుకానున్నట్లు అభిప్రాయపడ్డారు. యాజమాన్యాలు రెడీ దేశీయంగా స్పెషాలిటీ కెమికల్స్ తయారీ భారీఎత్తున పెరుగుతోంది. అయినప్పటికీ ఎస్ఆర్ఎఫ్ లిమిటెడ్, గుజరాత్ ఫ్లోరో కెమికల్స్, దీపక్ నైట్రైట్ తదితరాలు పటిష్ట ఫలితాలు సాధించవచ్చని అంచనా. ఇక ఆర్తి ఇండస్ట్రీస్, నోసిల్, వినతీ ఆర్గానిక్స్, గలాక్సీ సర్ఫక్టాంట్స్, టాటా కెమికల్స్, అనుపమ్ రసాయన్ తదితర దిగ్గజాల యాజమాన్యాలు గ్లోబల్ సరఫరా చైన్ల పునర్వ్యవస్థీకరణతో భారీగా లబ్ది పొందే వీలున్నట్లు ఊహిస్తున్నాయి. వెరసి ఈ రంగంలోని పలు దిగ్గజాలు భవిష్యత్‌లో పటిష్ట పనితీరును ప్రదర్శించే అవకాశముంది. -
టీ పొడి అనుకొని పురుగులమందు.. చాయ్ తాగి అయిదుగురు దుర్మరణం
లక్నో: విష రసాయనాలు కలిసిన టీ (చాయ్) తాగి ఇద్దరు చిన్నారులు, వారి తండ్రి సహా ఐదుగురు మృత్యువాతపడ్డారు. ఉత్తరప్రదేశ్‌లోని మైన్‌పురి జిల్లా నగ్లా కన్హాయ్ గ్రామంలో ఈ విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రామమూర్తి అనే మహిళ గురువారం తన ఇంట్లో టీ పొడిగా పొరపడి, పొలంలో పిచికారీ చేసిన పురుగులమందు డబ్బాలోని పౌడర్‌ను వేసి టీ కాచింది. దానిని భర్త శివనందన్(35), కుమారులు శివాంగ్(6), దివ్యాన్ష్5)తోపాటు తన తండ్రి రవీంద్ర సింగ్(55), పొరుగునుండే సొబ్రాన్(42)లకు ఇచ్చిది. తాగిన తర్వాత వీరంతా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. రవీంద్ర సింగ్, శివాంగ్, దివాన్ష్ ఆస్పత్రికి తీసుకెళ్లేలోగానే చనిపోగా మిగతా ఇద్దరు చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారని ఎస్పీ చెప్పారు. చదవండి: కదులుతున్న కారుపైకి ఎక్కి టపాసుల కాల్పులు...సీన్ కట్ చేస్తే... -
అలర్ట్: పాపులర్ డవ్, ఇతర షాంపూల్లో కేన్సర్ కారక కెమికల్స్,రీకాల్
సాక్షి,ముంబై: ప్రముఖ ఎఫ్ఎంసీజీ సంస్థ యూనీ లీవర్ తన వినియోగదారులకు షాకింగ్ న్యూస్ చెప్పింది. డవ్, ట్రెస్మే, నెక్సస్, సువేవ్, టిగీ లాంటి షాంపూల్లో కేన్సర్ కారక కెమికల్ ఉన్నట్టు గుర్తించిన కారణంగా వాటిని భారీ ఎత్తున రీకాల్ చేసింది. ఈ నేపథ్యంలో కలుషితమైన ఏరోసోల్ డ్రై షాంపూ ఉత్పత్తుల వినియోగాన్ని నిలిపి వేయాలని వినియోగదారులకు కంపెనీ సూచించింది. వీటిని వినియోగించడం ప్రమాదమంటూ హెచ్చరిక జారీ చేసింది. యూనిలీవర్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వెబ్సైట్లో రీకాల్ వివరాలను అక్టోబర్ 18న ప్రకటించింది. రీకాల్ చేసిన వాటిల్లో అక్టోబరు 2021కి ముందు తయారు చేసిన డ్రై షాంపూ ఏరోసోల్ ఉత్పత్తులున్నాయని యునిలీవర్ తన నివేదికలో తెలిపింది. తమ అంతర్గత పరిశోధనలో ఏరోసోల్స్ ప్రొపెల్లెంట్ కేన్సర్ కారకం బెంజీన్కు మూలమని కనుగొన్నట్లు తెలిపింది. వీటి వాడకంతో బెంజీన్ స్థాయిలు పెరిగే అవకాశం ఉన్నందున అమెరికాలో పంపిణీ చేసిన ఉత్పత్తులు అన్నింటినీ రీకాల్ చేశామనీ, ఆయా ఉత్పత్తులను షెల్ఫ్‌ల నుండి తీసివేయమని రిటైలర్లను కోరింది. కాగా బెంజీన్ అధిక స్థాయిలోశరీరంలో చేరితే లుకేమియా, ప్రాణాంతక రక్త రుగ్మతలు, బోన్ మారో క్యాన్సర్ వంటి క్యాన్సర్ల ప్రమాదాన్ని పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే స్ప్రై ఆన్ డ్రై షాంపూలలో ప్రమాదకరమైన కలుషితాలను గుర్తించడం ఇదే మొదటి సారి కాదు. తాజా పరిణామంతో వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులలో ఏరోసోల్‌ల భద్రత మరోసారి ప్రశ్నార్థకమైంది. గత ఏడాదిన్నర కాలంలో, జాన్సన్ అండ్ జాన్సన్స్ న్యూట్రోజెనా, ఎడ్జ్‌వెల్ పర్సనల్ కేర్ కంపెనీకి చెందిన బనానా బోట్ లాంటి ఉత్పత్తులను మార్కెట్ నుంచి వెనక్కి తీసుకున్నాయి.అలాగే ప్రోక్టర్ అండ్ గాంబుల్ స్ప్రే-ఆన్ యాంటీ పెర్స్పిరెంట్‌లు సీక్రెట్ అండ్ ఓల్డ్ స్పైస్, యూనిలివర్స్ సువేవ్ లాంటి ఉత్పత్తులలో బెజీన్ కనుగొనడం, రీకాల్ చేయడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. -
హైదరాబాద్: గౌలిగూడలో కెమికల్ పేలుడు, ఒకరు మృతి
సాక్షి, హైదరాబాద్: అప్జల్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గౌలిగూడలో కెమికల్ బ్లాస్ట్ జరిగింది. ఈ పేలుడులో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు, క్లూస్ టీ సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తోంది. మ్యాన్‌హోల్‌లో కెమికల్ వేసి నీళ్లు పోస్తుండగా ఒక్కసారిగా అందులో బ్లాస్ట్ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. వాటర్‌తో కెమికల్ రియాక్ట్ అవ్వడం వల్లే పేలుడు సంభవించిందని తెలిపారు. కెమికల్ బ్లాస్ట్‌లో మరణించిన వ్యక్తిని భరత్ బాతోడ్ (కొడుకు).. గాయాలైన వ్యక్తిని గోపాల్ బాతోడ్గా (తండ్రి)గా గుర్తించారు. -
బంగ్లాదేశ్‌లో ఘోర అగ్నిప్రమాదం
ఢాకా: బంగ్లాదేశ్ లోని చిట్టగాంగ్‌లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 49 మంది సజీవదహనమయ్యారు. 450 మందికిపైగా కాలిన గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. రసాయనాలు ఉంచిన ఒక కంటైనర్ డిపోలో తొలుత అగ్నికీలలు చెలరేగి ఆ తర్వాత వరస పేలుళ్లు సంభవించడంతో భారీ ప్రమాదం జరిగింది. దేశంలో ప్రధాన రేవు పట్టణమైన చిట్టగాంగ్‌కి సమీపంలోని సీతాకుంద్‌లో షిప్పింగ్ కంటైనర్లు ఉంచే బీఎం కంటైనర్ డిపోలో శనివారం రాత్రి అగ్గి రాజుకుంది. ఆ తర్వాత వరసపెట్టి పేలుళ్లు సంభవించాయని ఒక పోలీసు అధికారి వెల్లడించారు. రాత్రి 11.45 గంటలకు మంటలు మొదలయ్యాయి. హైడ్రోజన్ పెరాక్సైడ్ రసాయనం నింపిన కంటైనర్లు కావడంతో ఒక దాని తర్వాత మరొకటి పెద్దగా శబ్దాలు చేస్తూ పేలిపోయాయి. అగ్నిమాపక సిబ్బందికి మంటల్ని అదుపులోకి తీసుకురావడం శక్తికి మించిన పనైంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశముంది. ప్రమాదం విషయం తెల్సి ఆ దేశ ప్రధాన మంత్రి షేక్ హసీనా తీవ్ర విచారం వ్యక్తంచేశారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరిపి మూడు రోజుల్లోగా నివేదిక సమర్పించాలని అధికారుల్ని ఆదేశించారు. వణికిపోయిన చుట్టుపక్కల ప్రాంతాలు ఈ పేలుడు ధాటి ప్రభావం నాలుగు కిలో మీటర్ల వరకు చూపించింది. భవనాలు ఊగాయి. పైకప్పులు చెదిరిపడ్డాయి. హుటాహుటిన 19 అగ్నిమాపక శకటాలు ఘటనా స్థలికి వచ్చి సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నాయి. ఆరు అంబులెన్స్‌లు సిద్ధంగా ఉంచారు. హైడ్రోజన్ పెరాక్సైడ్ వంటి రసాయనాలతో నింపిన కంటైనర్లు కావడంతో ఒక దానికి నిప్పు అంటుకోగానే వరుసగా వెంట వెంట నే అన్నీ పేలిపోయాయి. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై స్పష్టత రాలేదు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటించింది. -
రూ. 1,000 కోట్ల టర్నోవర్ లక్ష్యం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆగ్రో కెమికల్స్ ఉత్పత్తి సంస్థ నిచినో ఇండియా రూ. 1,000 కోట్ల టర్నోవరు లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం ఇది సుమారు రూ. 650 కోట్లుగా ఉందని, ఏటా 18–20 శాతం మేర వృద్ధి సాధిస్తున్నామని సంస్థ ఎండీ తమూకా నౌహిరో తెలిపారు. దాదాపు 71 ఉత్పత్తులతో దేశీయంగా క్రిమిసంహారకాల మార్కెట్లో తమకు 2–3 శాతం వాటా ఉందని, దేశవ్యాప్తంగా 2,500, తెలుగు రాష్ట్రాల్లో 1,200 మంది డీలర్లు ఉన్నారని చెప్పారు. వరి సాగులో సుడి దోమ సమస్య పరిష్కారానికి ఆర్కెస్ట్రా పేరిట క్రిమిసంహారకాన్ని ఆవిష్కరించిన సందర్భంగా ఆయన ఈ విషయాలు వివరించారు. వ్యయాలు తగ్గించుకోవడంతో పాటు దిగుబడిని పెంచుకునేందుకు ఇది రైతులకు తోడ్పడగలదని సంస్థ సీవోవో డీజీ శెట్టి తెలిపారు. జపాన్ సంస్థ నిహాన్ నొయాకూ కార్పొరేషన్‌కు అనుబంధ సంస్థ అయిన నిచినో ఇండియాకు.. తెలంగాణలోని హైదరాబాద్, సంగారెడ్డితో పాటు దేశీయంగా మొత్తం నాలుగు ప్లాంట్లు ఉన్నాయి. -
ఆ కెమికల్ వల్లే అమెరికాలో ఏటా లక్ష మంది మృతి
న్యూయార్క్: మనం రోజు పొద్దున లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు వాడే ప్లాస్టిక్స్ పరికరాలన్నింటిలో థాలెట్ ఆనే కెమికల్ ఉన్నట్లు న్యూయార్క్ పరిశోధకులు గుర్తించారు. ఆఖరికి పిల్లలు ఆడుకునే బొమ్మలు దగ్గర్నించి మనం నిత్యం వాడే దుస్తులు, షాంపు నుంచి మేకప్ వరకు అన్ని ప్లాస్టిక్‌తోనే రూపోందించినవే కావడంతో అత్యధికంగా థాలెట్ అనే కెమికల్ ఉత్పన్నవతోందని వెల్లడించారు. (చదవండి: ఆ గాయని వస్తువులు మిలియన్ డాలర్లు!) ఇది హర్మోన్ల వ్యవస్థను నాశనం చేసే కారకాలుగా ప్రసిద్ధిమైనవే కాక మొత్తం మానవ వినాళికా గ్రంథి వ్యవస్థనే ప్రభావితం చేస్తుందని హెచ్చరించారు. ఆ ప్లాస్టిక్ వస్తువులు మన నిత్య జీవితంలో ఒక భాగమైపోయాయని అందువల్లే ఈ విషపూరిత రసాయనాలు మన శరీరంలోకి సులభంగా ప్రవేశిస్తున్నాయి అని అన్నారు. దీంతో మధుమేహం, ఊబకాయం, గుండే జబ్బులు అధికమవుతున్నట్లు తాజా అద్యయనాల్లో తెలపారు. న్యూయార్క్ యూనివర్సిటీకి చెందిన గ్రాస్మన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ నిర్వహించిన పరిశోధనలో 55 నుంచి 64 సంవత్సరాల వయస్సు గల ఐదు వేల మంది మూత్రంలో థాలెట్ల సాంద్రత ఎక్కువగా ఉన్నట్లు గుర్తించామన్నారు. అంతేకాదు వారు గుండె జబ్బులతో చనిపోయే అవకాశం ఉందని వెల్లడించారు. గుండెజబ్బులకు ప్రధానం కారణం రసాయాలేనని తెలిపారు. అలాగే పురుషులలో టెస్టోస్టిరాన్ స్థాయిలు తగ్గిపోవడానికి కారణం ఈ థాలెట్ రసాయనమే కారణం అని చెప్పారు. ఈ థాలెట్ రసాయనం వల్ల అమెరికన్లు రకరకాల వ్యాధుల భారినపడి ఏటా 1,00,000 మంది అమెరికన్లు మరణిస్తున్నారని.. ఫలితంగా ఆర్థికంగా 40 నుంచి 47 బిలియన్ల డాలర్ల వరకు నష్టపోతున్నట్లు న్యూయార్క్ పరిశోధకులు అధ్యయనాల్లో పేర్కొన్నారు. (చదవండి: కూతురు ఆనందం: హే.. నాన్న కూడా నాతో పాటే..!) -
రిలయన్స్ సంచలన నిర్ణయం
సాక్షి, ముంబై: ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది. తన ఆయిల్-టు-కెమికల్స్ (ఓటూసీ) వ్యాపారాన్ని స్వతంత్ర అనుబంధ సంస్థగా రూపొందిస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. వ్యాపార బదిలీతో కొత్తగా ఏర్పడిన ఈ అనుబంధ సంస్థపై 100 శాతం నిర్వహణ, నియంత్రణ కలిగి ఉంటుందని ఆర్ఐఎల్ తెలిపింది. మొత్తం అపరేటింగ్ టీం, కొత్త సంస్థలోకి మారుతుందనీ, అలాగే ఆదాయాలను తగ్గించడం లేదా నగదు ప్రవాహాలపై ఎటువంటి పరిమితులు ఉండవని పేర్కొంది. పునర్వ్యవస్థీకరణ తర్వాత ప్రమోటర్ గ్రూప్ ఓటూసీ వ్యాపారంలో 49.14 శాతం వాటాను కలిగి ఉంటుందనీ, ఈ ప్రక్రియతో కంపెనీ వాటాదారుల్లో ఎలాంటి మార్పు ఉండదని రెగ్యులేటరీ సమాచారంలో రిలయన్స్ వెల్లడించింది. దీనికి సంబంధించి ఇప్పటికే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) స్టాక్ ఎక్స్ఛేంజీల ఆమోదం లభించినట్టు ఆర్ఐఎల్ తెలిపింది. అయితే, ఈక్విటీ వాటాదారులు, రుణదాతలు, ఐటీ, ఎన్సీఎల్టీ బెంచ్‌ల నుండి ఇంకా క్లియరెన్స్ పొందలేదని చెప్పింది. 2022 నాటికి ముంబై, అహ్మదాబాద్ ఎన్సీఎల్టీ అనుమతి వస్తుందని ఆశిస్తున్నట్లు రిలయన్స్ తెలిపింది. సంస్థకు చెందిన రిఫైనింగ్, మార్కెటింగ్, పెట్రో కెమికల్ ఆస్తులు మొత్తం కొత్త అనుబంధ సంస్థలోకి బదిలీ అవుతాయి. సౌదీ అరామ్కోతో ఒప్పందం అనంతరం మరింతగా ఇన్వెస్టర్ల ద్వారా కేపిటల్ సమకూర్చుకోవడానికి దోహద పడుతుందని కంపెనీ తెలిపింది. -
పురుగుల మందుతో బోండాలు.. ఇద్దరి మృతి
అరక్కోణం: తెలియక చేసిన చిన్న పొరపాటు ఇద్దరి ప్రాణాలను బలితీసుకుంది. రాణిపేట జిల్లా ఎస్ఆర్ కండ్రిగ గ్రామానికి చెందిన రైతు పెరియస్వామి (65), భార్య లక్ష్మి (57), కుమారుడు శివకుమార్ (27), కోడలు భారతి (22). పెరయస్వామి మంగళవారం రాత్రి బోండాలు చేసేందుకు మైదాపిండి తీసుకొచ్చేందుకు వెళ్లాడు. అలాగే మిరప తోటకు క్రిమిసంహారక మందు తీసుకొచ్చాడు. ఈ విషయం తెలియని కోడలు భారతి రెండూ కలిపి బోండాలు వేసింది. నలుగురూ తినడంతో కొంతసేపటికి వాంతులు, విరేచనాలు అయ్యాయి. గ్రామస్తులు వారిని షోలింగర్ ప్రభుత్వాస్పత్రికి అనంతరం చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ భారతి, శివకుమార్ మృతిచెందారు. పెరియస్వామి, లక్ష్మి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. అరక్కోణం తాలూకా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లయిన ఏడాదిలోనే దంపతులు మృతి చెందడంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. -
వాటర్ ప్లాంట్‌లో విషద్రావణం
నెల్లూరు, కోవూరు: ఎదుట ఉన్న వాటర్ ప్లాంట్‌తో తన వ్యాపారం సక్రమంగా జరగడం లేదని ఓ ప్రబుద్ధుడు ఏకంగా మినరల్ వాటర్ ప్లాంటులో విషద్రావణం కలిపేశాడు. అయితే ప్లాంటు నిర్వాహడు ఆ వాసనను పసిగట్టి అప్రమత్తమవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన కోవూరులోని పెళ్లకూరు కాలనీ సమీపంలో బుధవారం జరిగింది. పెళ్లకూరు కాలనీ సమీపంలో కొంతకాలంగా కోదండరామయ్య అనే వ్యక్తి సాయిబాబ మినరల్ వాటర్ ప్లాంట్‌ను నిర్వహిస్తున్నారు. ఇక్కడ సిద్ధం చేసిన తాగునీటిని అక్కడే క్యాన్లు నింపడంతో పాటు బయట ప్రాంతాలకు తీసుకెళ్లి విక్రయిస్తుంటారు. ఈ వాటర్ ప్లాంట్ సమీపంలో సుజల వాటర్‌ప్లాంట్‌ను శ్రావణ్ అనే వ్యక్తి నిర్వహిస్తున్నాడు. కాగా సాయిబాబ వాటర్ ప్లాంట్ కారణంగా తన ప్లాంటు సక్రమంగా జరగడం లేదని శ్రావణ్ కోదండరామయ్యపై అక్కసు పెంచుకొన్నాడు. సమయం కోసం వేచిచూస్తున్న అతను మంగళవారం అర్ధరాత్రి విషద్రావణం(పెనాయిల్,యాసిడ్ మిశ్రమం)ను వాటర్ ట్యాంక్ పైపుల ద్వారా కలిపేశాడు. బుధవారం కోదండరామయ్య కుమారుడు ప్లాంటు వద్దకు వచ్చి శుభ్రం చేసే పనిలో పడ్డాడు. ఈ క్రమంలో వాసన రావడంతో అనుమానం వచ్చి ప్లాంట్‌లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించగా అర్ధరాత్రి వేళలో బైక్‌పై వచ్చిన శ్రావణ విషద్రావణాన్ని పైపుల్లో కలపడం స్పష్టంగా కనిపించింది. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. కాగా గతంలో కూడా ఇదేవిధంగా రెండుసార్లు శ్రావణ్ తమ ప్లాంటుకు చెందిన విద్యుత్ వైర్లను కట్ చేశాడని బాధితులు పోలీసులకు తెలిపారు. దీంతో సీఐ శ్రీనివాసరావు, ఎస్సై సీహెచ్ కృష్ణారెడ్డి సీసీ ఫూటేజీలను పరిశీలించి నిందితులపై కేసు నమెదు చేశారు. అలాగే సుజల వాటర్‌ప్లాంట్‌ను సీజ్ చేశారు. -
రక్త పరీక్ష..శిక్ష
ఎవరైనా అస్వస్థతకు గురై ఆస్పత్రికి వెళితే రక్త పరీక్షలు చేసి.. ఫలితం ఆధారంగా వైద్యులు చికిత్స చేస్తారు. ఇక సీజనల్ వ్యాధులు ప్రబలినప్పుడు.. జ్వరపీడితులకు రక్తపరీక్షలు తప్పనిసరి. రోజూ 2 వేల ఓపీ ఉండే అనంతపురం సర్వజనాస్పత్రిలో రక్త పరీక్షలు సకాలంలో చేయడం లేదు. రక్త పరీక్ష నిర్వహించేందుకు రూ.లక్షలు వెచ్చించి మూడు సెల్ కౌంటర్లు తెచ్చినా వాటినిి వాడే కెమికల్స్ లేకపోవడంతో సిబ్బంది మాన్యువల్‌గా పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీంతో రక్త పరీక్షల ఫలితం ఆలస్యమవుతుండగా.. రోగులకు సకాలంలో సరైన వైద్యం అందక అల్లాడిపోతున్నారు. ఈ చిత్రంలోని బాలిక పుట్టపర్తి మండలం నిడిమామిడికి చెందిన సాహితి. నవంబర్ నెలలో డెంగీతో సర్వజనాస్పత్రిలో చేరింది. వెంటనే రక్త పరీక్ష చేయాల్సి ఉన్నా.. సెల్‌కౌంటర్ పనిచేయకపోవడంతో సిబ్బంది వైద్య పరీక్షలు వాయిదా వేశారు. చివరకు చిన్నారి ప్లేట్లెట్ కౌంట్ 30వేలకు తగ్గిపోవడంతో టెక్నీషియన్లు స్పందించి పరీక్షలు చేశారు. చిన్నవార్డులోనే రోజూ 200 మందికిపైగా చిన్నారులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. సమయం సరిపోకపోవడంతో పరీక్షలు వాయిదా వేస్తున్నారు. ఈ క్రమంలో అత్యవసర సమయంలో కీలకం కానున్న రక్త పరీక్షల నివేదికలు అందక వైద్యులు కూడా సరైన వైద్యం అందించలేని పరిస్థితి నెలకొంది. అనంతపురం న్యూసిటీ: సర్వజనాస్పత్రి.. జిల్లా వాసులందరికీ పెద్ద దిక్కు. ఎవరికి ఏ ఆరోగ్య సమస్య తలెత్తినా ఇక్కడికే పరుగున వస్తారు. అందుకే ఇక్కడ రోజూ 2 వేల మంది ఔట్‌పేషంట్లు, 1,300 మంది ఇన్‌పేషంట్లు ఉంటున్నారు. డెంగీ, మలేరియా తదితర సీజనల్ వ్యాధులు ప్రబలే సమయంలో దాదాపుగా వెయ్యి మందికి వివిధ రక్త పరీక్షలు నిర్వహిస్తారు. అందుకోసమే పెథాలజీ విభాగంలో రక్తపరీక్షల కోసం రూ.20 లక్షలు వెచ్చించి మూడు సెల్ కౌంటర్ మిషన్లు(హెమటాలజీ అనలైజర్) తెప్పించారు. కానీ సర్వజనాస్పత్రి ఉన్నతాధికారులు వాటి నిర్వహణను గాలికి వదిలేశారు. కెమికల్స్ లేవన్న కారణంతో ఐదు నెలలుగా వాటిని మూలకుపెట్టారు. దీంతో వివిధ వార్డుల్లో వైద్య సేవల్లో జాప్యం జరుగుతోంది. సెల్‌కౌంటర్ సేవలు ఇలా... సెల్‌కౌంటర్ మిషన్ ద్వారా ప్లేట్లెట్స్, టీసీ, డీసీ, సీబీపీ, హెచ్‌బీ తదితర పరీక్షలు నిమిషాల్లో చేయవచ్చు. ఈ మిషన్ ద్వారా చేసే పరీక్షలు దాదాపుగా 500 వరకు ఉంటాయి. ఫలితం కూడా వేగవంతంగా అందుతుంది. దాన్నిబట్టి పరిస్థితి విషమించిన రోగులను ఇతర ఆస్పత్రులకు పంపడమో, లేదా మెరుగైన వైద్యం అందించడమో చేయవచ్చు. కానీ సెల్‌కౌంట్ మిషన్లు అందుబాటులో లేకపోవడంతో ఆస్పత్రిలోని చిన్నపిల్లల వార్డు, ఎఫ్ఎం, ఎంఎం, చెస్ట్, ఆర్థో, గైనిక్ తదితర వార్డుల్లో టెక్నీషియన్లు మాన్యువల్‌గా పరీక్షలు చేస్తున్నారు. వివిధ వార్డుల్లో రక్తపూతలు తీయడానికే గంటల సమయం వ్యవధి పడుతోంది. రక్తపూతలు తీసిన వెంటనే వారే మాన్యువల్‌గా పరీక్షలు చేయడానికి కనీసం రెండు గంటల సమయం పడుతోంది. దీంతో ఫలితం ఆలస్యమవుతుండగా.. వైద్య సేవల్లోనూ జాప్యం జరుగుతోంది. పోని ప్రైవేట్‌గా రక్త పరీక్షలు చేయించాలంటే రూ.300 నుంచి రూ.400 ఖర్చు అవుతుంది. సర్వజనాస్పత్రికి వచ్చే నిరుపేదలకు ఇది మరింత భారంగా మారింది. పనిభారంతో పరీక్షలు వాయిదా.. సర్వజనాస్పత్రిలోని చిన్నపిల్లల విభాగంలో రెండు యూనిట్లు ఉన్నాయి. సెల్‌కౌంట్ మిషన్లు అందుబాటులో లేక ఒక్కోరోజు ఒక్కో యూనిట్ చొప్పున టెక్నీషియన్లు మాన్యువల్‌గా పరీక్షలు చేయాల్సి వస్తోంది. ఇక శనివారం, ఆదివారం వస్తే రక్త పరీక్షలకు మూడ్రోజుల సమయం పట్టే పరిస్థితి నెలకొంది. రక్త పరీక్ష ఫలితం వచ్చే వరకూ వైద్యులూ సరైన చికిత్స అందించలేకపోవడంతో చిన్నారుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్క చిన్నపిల్లల వార్డులోనే కాదు.. ఆస్పత్రిలోని ఎంఎం, ఎఫ్ఎం, ఆర్థో, చెస్ట్, ఓపీ, గైనిక్ తదితర విభాగాల్లో రక్త పరీక్షల నిర్వహణలో తీవ్ర జాప్యం జరుగుతోంది. పనిభారంతో టెక్నీషియన్లు రక్తపరీక్షలు వాయిదా వేస్తుండటంతో రోగులకు ప్రాణసంకటంగా మారింది. అందుబాటులోకి రావాలంటే.. సెల్‌కౌంటర్ మిషన్లు అందుబాటులోకి రావాలంటే కెమికల్స్ కావాల్సి ఉంది. సెల్‌కౌంటర్ మిషన్‌లో 8 రకాల కెమికల్స్‌ను వినియోగిస్తారు. వాటికోసం ప్రతి నెలా రూ.5 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఈ ఏడాది రెండు మినీ సెల్‌కౌంటర్ మిషన్లను సర్వజనాస్పత్రిలో ఏర్పాటు చేశారు. వీటికి సంబంధించి కెమికల్స్ అందుబాటులో ఉన్నాయి. కానీ ఏపీఎంఎస్ఐడీసీ ఇంజినీర్లు ల్యాబ్‌లలో ఎలక్ట్రికల్, ఏసీ తదితర పనుల్లో జాప్యం చేశారు. దీంతో వాటిని కూడా ఉపయోగించుకోలేని పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా ఆస్పత్రి యాజమాన్యం మేలుకుని రూ.లక్షలు విలువ చేసే సెల్‌కౌంటర్ మిషన్లను అందుబాటులోకి తీసుకురావాలని రోగులు, జిల్లా ప్రజలు కోరుతున్నారు. కెమికల్స్‌కు ఆర్డరిచ్చాం కెమికల్స్ లేకపోవడంతో సెల్‌కౌంటర్ మిషన్లను ఉపయోగించడం లేదు. కెమికల్స్‌కు ఆర్డర్ ఇచ్చాం. త్వరలోనే కెమికల్స్ వస్తాయి. ప్రస్తుతం అందుబాటులో రెండు మినీ సెల్‌కౌంటర్ మిషన్లున్నాయి. వాటి ద్వారా రక్త పరీక్షలు చేసేలా చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ రామస్వామి నాయక్,ఆస్పత్రి సూపరింటెండెంట్ రక్తనమూనాలు సేకరిస్తున్న టెక్నీషియన్ -
‘రసాయన’ రోడ్డు ప్రయోగం విఫలం
గన్నవరం (కృష్ణా): అమెరికా సాంకేతిక పరిజ్ఞానంతో రాష్ట్రంలోనే ప్రప్రథమంగా గన్నవరంలో ప్రయోగత్మకంగా చేపట్టిన ‘కెమికల్ సాయిల్ స్టెబిలైజేషన్’ రోడ్డు నిర్మాణం విఫలమైంది. గ్రావెల్, మెటల్ అవసరం లేకుండానే.. టాప్ సీల్ కెమికల్‌ను వినియోగించి మట్టిని గట్టిపరచడం ద్వారా తక్కువ ఖర్చుతో రహదారుల నిర్మాణం చేసే ఈ సాంకేతిక పరిజ్ఞానం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. అభివృద్ధి చెందిన పలు దేశాల్లో విజయవంతమైన ఈ టెక్నాలజీకి ఇక్కడ మాత్రం ఆదిలోనే అడ్డంకులు ఎదురయ్యాయి. ఈ పద్ధతిలో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో నాలుగు రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ.6.45 కోట్లు కేటాయించింది. అమెరికాకు చెందిన టాప్ సీల్ కెమికల్ తయారీ సంస్థ టెర్రా పేబ్తో కలిసి కడపకు చెందిన కృష్ణప్ప మినరల్ సంస్థ ఈ రోడ్ల నిర్మాణానికి ముందుకు వచ్చింది. పది రోజులకే తూట్లు తొలుత ప్రయోగాత్మకంగా గన్నవరంలోని జాతీయ రహదారి నుంచి మర్లపాలెం వరకు రెండు కిలోమీటర్ల పొడవున రూ.40 లక్షల వ్యయంతో రోడ్డు నిర్మాణానికి రెండు నెలల కిందట శంకుస్థాపన చేశారు. దీనికి అవసరమైన టాప్ సీల్ కెమికల్‌ను అమెరికా నుంచి దిగుమతి చేసుకున్నారు. నెల రోజుల కిందట ప్రయోగాత్మకంగా 90 మీటర్ల పొడవున నిర్మాణం చేపట్టారు. రోడ్డును ఆరు అంగుళాల లోతున దున్ని దానిపై నీటిలో కలిపిన కెమికల్ చల్లుతూ గ్రావెల్‌తో చదును చేశారు. ఈ విధంగా నాలుగు, ఐదు రోజుల్లో మూడుసార్లు కెమికల్ స్ప్రే, రోలింగ్ చేయడం ద్వారా మట్టిని గట్టిపరిచారు. ఈ పనులను అమెరికాకు చెందిన టెర్రా పేబ్ కంపెనీ ప్రతినిధి గ్యారీ నిల్సన్, ఆస్ట్రేలియాకు చెందిన నిపుణుడు చార్లెస్, నిర్మాణ సంస్థకు చెందిన అంజప్ప పర్యవేక్షించారు. ఆశించిన ఫలితం రాక అయితే, కెమికల్ సాయిల్ స్టెబిలైజేషన్ పద్ధతిలో చేపట్టిన ఈ రోడ్డు నిర్మాణం చివరకు ఆశించిన ఫలితం ఇవ్వలేదు. 90 మీటర్ల పొడవున వేసిన రోడ్డు పైభాగంలో మట్టి గట్టి పడలేదు. ఫలితంగా రోడ్డు పైపొర (లేయర్) వాహనాల తాకిడికి క్రమంగా దెబ్బతింటోంది. రోడ్డు నిర్మాణం సంతృప్తికరంగా లేకపోవడంతో పనులను అర్ధంతరంగా నిలిపివేశారు. ఈ టెక్నాలజీతో నిర్మించిన రోడ్డు పదేళ్ల పాటు చెక్కుచెదరదని నిపుణులు చెప్పినప్పటికీ, పది రోజులకే దెబ్బతినడంతో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడి మట్టి స్వభావం కారణంగానే అనుకున్న రీతిలో నిర్మాణం జరగలేదని కాంట్రాక్ట్ సంస్థ చెబుతోంది. ఈ పద్ధతిలో ఇక్కడ రోడ్ల నిర్మాణానికి అవసరమైన సాంకేతికత, యంత్ర పరికరాలు లేకపోవడం, నేల స్వభావం వల్ల అనుకున్న మేర సక్సెస్ కాలేకపోయామని నిపుణులు పేర్కొంటున్నారు. లోపాలను సవరించి మరోసారి నిర్మాణ పనులు పునఃప్రారంభిస్తామని చెబుతున్నారు. అయితే, పనుల కొనసాగింపుపై పంచాయతీరాజ్ అధికారులు మాత్రం పూర్తిస్థాయి నమ్మకం వ్యక్తం చేయడం లేదు. సంతృప్తికరంగా రాలేదు ప్రయోగత్మకంగా కెమికల్ సాయిల్ స్టెబిలైజేషన్ పద్ధతిలో చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులు సంతృప్తికరమైన ఫలితాలు ఇవ్వలేదు. దీంతో నిర్మాణ సంస్థ తాత్కాలికంగా పనులను నిలిపివేసింది. పనుల కొనసాగింపుపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తదుపరి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. – ఎ.వెంకటేశ్వరరావు, డీఈ, పంచాయతీరాజ్ -
అంధత్వం వచ్చే ప్రమాదం..?
గాజువాక: పెదగంట్యాడ స్వతంత్రనగర్ (ఎస్టీ కాలనీ)లో విష రసాయన విలయ తాండవాని కి ఊరు మొత్తం వల్లకాడుగా మారుతోంది. పక్కనే ఉన్న జీవీఎంసీ డంపింగ్ యార్డులో లభించిన రసాయనాన్ని సారాగా భావించి తాగడంతో బాధితులు ఒక్కొక్కరిగా మృత్యువాత పడుతున్నారు. ఆదివారం నాటికి ముగ్గురు మృతి చెందిన విషయం తెలిసిందే. సోమవారం నాటికి మరో నలుగురు మృతి చెందడంతో ఆ సంఖ్య ఏడుకు చేరింది. మరో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు పోలీసుల సమాచారం. ఈ సంఘటనతో కాలనీలో పలు కుటుంబాలు అనాథలుగా మారుతున్నాయి. అప్పటి వరకు తమతో సరదాగా గడిపిన కుటుంబ సభ్యులు విష రసాయనాన్ని సేవించి విగత జీవులుగా మారుతుండటంతో గుండెలవిసేలా రోదిస్తున్నారు. తాజాగా కాలనీకి చెంది న ఆసనాల రమణమ్మ, ఆసనాల చిన్నోడు, వాడపల్లి అంకమ్మ మృతి చెందడంతో కాలనీ మొత్తం విషాదంలో మునిగిపోయింది. అప్పలమ్మ మృతదేహం వెలికితీత ఈ దుర్ఘటనలో మృతి చెందిన పెండ్ర అప్పలమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాజువాక పోలీసులు సోమవారం వెలికితీశారు. ఆమె మృతదేహాన్ని కుటుంబ సభ్యులు ఖననం చేసిన విషయం తెలిసిందే. సంఘటనపై విచారణ ప్రారంభించిన పోలీసులు ఆమె మృతదేహాన్ని తవ్వి తీయించారు. గాజువాక తహసీల్దార్ జేమ్స్ ప్రభాకర్ సహకారంతో పంచనామా జరిపించారు. సౌత్ ఏసీపీ ప్రవీణ్ కుమార్, గాజువాక సీఐ కె.రామారావు, ఇంటెలిజెన్స్ సీఐ తిరుమలరావు, ఎస్ఐ అప్పలరాజు తదితరులు కాలనీలో పర్యటించి వివిధ కోణాల్లో దర్యాప్తు నిర్వహించారు. మరోవైపు ఇక్కడి లేబొరేటరీ సామర్థ్యం సరిపోవడంలేదని, అందువల్ల ఆ రసాయనాన్ని హైదరాబాద్‌లోని లేబొరేటరీకి పంపుతున్నామని గాజువాక ఎక్సైజ్ అధికారులు తెలిపారు. ఎక్సై జ్ డైరెక్టర్ హరికుమార్, జాయింట్ కమిషనర్ ఎ.చంద్రశేఖర్ నాయుడు, డిప్యూటీ కమిషనర్ పి.శ్రీనివాసరావు, సహాయ కమిషనర్ ఎం.భా స్కరరావు, అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆర్.ప్రసాద్, సీఐలు ఎల్.ఉపేంద్ర, ఆర్.జైభీమ్ తదితరులు మృతుల కుటుంబాలను కలుసుకొని వివరాలు సేకరించారు. కాలనీవాసుల దినచర్య, వారి ఆహార అలవాట్లు, మద్యం అలవాట్లపై వివరాలను సేకరించారు. బాధితులను ఆదుకోండి పాతపోస్టాఫీసు(విశాఖ దక్షిణ): స్పిరిట్ తాగి ఏడుగురు మరణించినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ఎస్టీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే కుంభా రవిబాబు అన్నారు. కేజీహెచ్ రాజేంద్రప్రసాద్ వార్డులో చికిత్స పొందుతున్న బాధితులను సోమవారం ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మృతుల కు టుంబాలకు నష్టపరిహారంగా రూ.25 లక్షల చొప్పున ప్రభుత్వం తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. సంఘటన జరిగిన స్థలం జీవీఎంసీ పరిధిలో ఉన్నా జీవీఎంసీ కమిషనర్, ఇతర అధికారులు బాధితులను పరామర్శించేందుకు రాకపోడం అన్యాయమన్నారు. కలెక్టర్ సాయం ప్రకటించలేదన్నారు. గిరిజనుల పట్ల ప్రభుత్వం ఎంత అమానుషంగా ప్రవర్తిస్తుందో ఈ సంఘటనతో తేటతెల్లం అవుతోందని తెలిపారు. గాజువాకలో జనావా సాల మధ్య ఉన్న డంపింగ్ యార్డ్‌ను ఊరికి దూరంగా తరలించాలని డిమాండ్ చేశారు. ఆదివాసీలకు భద్రత లేకుండా పోతోందన్నారు. బతుకుతెరువు కోసం డంపింగ్ యార్డ్‌లో కాగితాలు ఏరుకునే స్థితికి దిగజారారని ఆవేదన వ్యక్తం చేశారు. వీరికి సరైన ఆర్థిక భద్రత లేకపోవడం వల్లే ఇటువంటి సంఘటన చోటుచేసుకుందన్నారు. మైదాన ప్రాంతాల్లో నివసిస్తున్న గిరిజనులకు ప్రభుత్వం ఆసరా కల్పించాలని కోరారు. గిరిజనుల పట్ల ప్రభుత్వం చిన్నచూపు చూస్తే సహించేది లేదన్నారు. జరిగిన సంఘటనకు ప్రభుత్వంతో పాటు జీవీఎంసీ కూడా బాధ్యత వహించి బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కేజీహెచ్ సిబ్బంది నిర్లక్ష్యం పరిస్థితి విషమంగా ఉన్న బాధితుల నలుగురినీ ఒకే మంచం మీద కూర్చోబెట్టి ఫ్లూయిడ్స్‌ను ఎక్కించిన నర్సులు... బాధితుడు ఆసనాల ఎర్రోడి చేతి నుంచి రక్తం కారిపోతున్నా పట్టించుకోని సిబ్బంది... సకాలంలో సరైన వైద్యం అందించాలని కోరితే ఈసడింపులు.కేజీహెచ్‌లో వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యానికి అద్దం పట్టే సంఘటనలివి.. అది మిథనాలేనా? బాధితులు తాగిన రసాయనం మిథనాల్ (మిథైల్ ఆల్కాహాల్) అని ఎక్సైజ్ ల్యాబ్‌లో జరిపిన ప్రాథమిక పరీక్షల్లో తేలినట్టు కేజీహెచ్‌కు ఇచ్చిన నివేదికలో తెలిపారు. ఇది ప్రమాదకరమైనదని, కానీ మద్యంలో ఇథైల్ ఆల్కాహాల్ ఉంటుందని, అది ప్రాణాంతకం కాదని వైద్యులు చెబుతున్నారు. మరోవైపు ఇది ఏ రసాయనమన్నది నిగ్గు తేల్చేందుకు ఎక్సైజ్ అధికారులు హైదరాబాద్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీకి సోమవారం రాత్రి పంపారు. అలాగే పోలీసులు కూడా రసాయన శాంపిల్‌ను ఎఫ్ఎస్ఎల్కు పంపనున్నారు. అంధత్వం వచ్చే ప్రమాదం మిథనాల్ రసాయనాన్ని సేవించిన వారికి ప్రాణాపాయమే కాదు.. భవిష్యత్తులో పూర్తిగా అంధత్వం సంభవించే ప్రమాదం కూడా ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. శరీరంలో హైడ్రోజన్ కంటెంట్ బాగా పెరిగి గుండెపై ప్రభావం చూపుతుందని, ఫలితంగా రక్తపోటు స్థాయి పడిపోయి షాక్‌కు గురై చనిపోతారని కేజీహెచ్ నెఫ్రాలజీ విభాగాధిపతి డాక్టర్ జి.ప్రసాద్ ‘సాక్షి’కి చెప్పారు. వైద్య పరిభాషలో దీనిని మెటబాలిక్ ఎసిరోసిస్ అంటారన్నారు. డయాలసిస్ ద్వారా శరీరంలోని మిథాల్ రసాయన తీవ్రతను తగ్గించవచ్చని తెలిపారు. -
కనికరం లేని కలెక్టర్!
సాక్షి, విశాఖపట్నం / పాతపోస్టాఫీసు(విశాఖ దక్షిణ): ఆభాగ్యులెవరైనా ఆపదలో ఉంటే పట్టించుకోవలసిన బాధ్యత ఆయనది. క్షతగాత్రులు, బాధితులకు తక్షణమే ఆదుకోవలసిన కర్తవ్యం ఆయనది. ప్రభుత్వ పరంగా ఆర్థిక సాయానికి కృషి చేయాల్సిన విధి కూడా కలెక్టర్‌పైనే ఉంటుంది. మరి అవేమీ పట్టించుకోకుండా, బాధిత కుటుంబాల గోడు గాలికొదిలేస్తే ఆ కలెక్టర్‌ను ఏమనుకోవాలి? కనికరం లేని కలెక్టర్ అని అనుకోవాలి. ఇప్పుడు మన విశాఖ కలెక్టర్ కాటమనేని భాస్కర్‌ను పెదగంట్యాడ మండలం స్వతంత్రనగర్‌లో విష రసాయనాన్ని తాగి అశువులు బాసిన గిరిజన బాధిత కుటుం బ సభ్యులు అలాగే అనుకుంటున్నారు. మానవ త లేకుండా వ్యవహరించారని ఆక్రోశిస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే? స్వతంత్రనగర్ ఎస్టీకాలనీలో రసాయనాన్ని తా గి ఏడుగురు గిరిజనులు మృత్యువాతపడ్డారు. సోమవారం ఉదయం 10.30 గంటల సమయంలో కలెక్టర్‌ను కలిసి బాధిత కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని కోరడానికి సీపీఎం నాయకులను వెంటబెట్టుకుని వెళ్లారు. తనను కలవకుండా అరగంట సేపు బయటనే కూర్చోబెట్టారు. విషణ్ణవదనాలతో వీరంతా కలెక్టర్ కోసం ఎదురు చూస్తున్న తరుణంలో 11 గంటలకు చాంబర్ నుంచి బయటకు వచ్చారు. గడియారం వైపు చూపిస్తూ ‘ఇప్పుడే ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. పరిహారం గురించి అడక్కండి. నేనేమీ చేయలేను. నన్ను ఇందులో ఇన్వాల్వ్ చేయకండి.. ఇక్కడ్నుంచి వెళ్లిపోండి.. ఎలక్షన్ అయ్యాక వస్తే న్యాయం చేస్తాను..’ అంటూ వెళ్లిపోబోయారు. కోడ్‌కు మానవత్వంతో కూడిన పరిహారానికి సంబంధం లేదని బాధిత కుటుంబీకులు, సీపీఎం నాయకులు ఆయనను ప్రాధేయపడ్డారు. అయినా కలెక్టర్ మనసు కరగలేదు. తాము 10.30 గంటలకే ఆయన్ను కలిసినప్పుడే తమ వినతిని స్వీకరించి ఉంటే ఆయన చెప్పినట్టుగా కోడ్ అడ్డంకి ఉండేది కాదని, ఉద్దేశపూర్వకంగానే కలెక్టర్ అమానవీయంగా వ్యవహరించారంటూ బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రకృతి వైపరీత్యాలు, ప్రమాదాలు సంభవించి ప్రాణనష్టం జరిగినప్పుడు ఇలాగే తప్పించుకుంటారా? అంటూ సీపీఎం నాయకులు సీహెచ్ నర్సింగరావు, గంగారావు తదితరులు ప్రశ్నించారు. అనంతరం వెనుతిరిగి కేజీహెచ్ మార్చురీ వద్ద తమకు న్యాయం చేయాలని ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన చేపట్టారు. ఎన్నికల కోడ్ అడ్డమన్నారు కలెక్టరేట్‌కు ఉదయం 10.30 గంటలకే చేరుకున్నాం. మమల్ని కలెక్టర్ చాంబర్లోకి వెళ్లనివ్వకపోవడంతో వరండాలో వేచి ఉన్నాం. 11 గంటల సమయంలో ఆయన గది నుంచి వెలుపలకి వచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ప్రకటించినందున బాధితులకు న్యాయం చేస్తామని చెప్పడం కుదరదని, ఎన్నికలు పూర్తయిన తరువాత మృతుల కుటుంబాలకు తగిన న్యాయం చేస్తామని చెప్పారు. ఇది చాలా అన్యాయం. – వాడపిల్లి అప్పన్న,13 జిల్లాల గిరిజన సంక్షేమ సంఘం అధ్యక్షుడు