ఎవరైనా అస్వస్థతకు గురై ఆస్పత్రికి వెళితే రక్త పరీక్షలు చేసి.. ఫలితం ఆధారంగా వైద్యులు చికిత్స చేస్తారు. ఇక సీజనల్ వ్యాధులు ప్రబలినప్పుడు.. జ్వరపీడితులకు రక్తపరీక్షలు తప్పనిసరి. రోజూ 2 వేల ఓపీ ఉండే అనంతపురం సర్వజనాస్పత్రిలో రక్త పరీక్షలు సకాలంలో చేయడం లేదు. రక్త పరీక్ష నిర్వహించేందుకు రూ.లక్షలు వెచ్చించి మూడు సెల్ కౌంటర్లు తెచ్చినా వాటినిి వాడే కెమికల్స్ లేకపోవడంతో సిబ్బంది మాన్యువల్‌గా పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీంతో రక్త పరీక్షల ఫలితం ఆలస్యమవుతుండగా.. రోగులకు సకాలంలో సరైన వైద్యం అందక అల్లాడిపోతున్నారు.
ఈ చిత్రంలోని బాలిక పుట్టపర్తి మండలం నిడిమామిడికి చెందిన సాహితి. నవంబర్ నెలలో డెంగీతో సర్వజనాస్పత్రిలో చేరింది. వెంటనే రక్త పరీక్ష చేయాల్సి ఉన్నా.. సెల్‌కౌంటర్ పనిచేయకపోవడంతో సిబ్బంది వైద్య పరీక్షలు వాయిదా వేశారు. చివరకు చిన్నారి ప్లేట్‌లెట్ కౌంట్ 30వేలకు తగ్గిపోవడంతో టెక్నీషియన్లు స్పందించి పరీక్షలు చేశారు. చిన్నవార్డులోనే రోజూ 200 మందికిపైగా చిన్నారులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. సమయం సరిపోకపోవడంతో పరీక్షలు వాయిదా వేస్తున్నారు. ఈ క్రమంలో అత్యవసర సమయంలో కీలకం కానున్న రక్త పరీక్షల నివేదికలు అందక వైద్యులు కూడా సరైన వైద్యం అందించలేని పరిస్థితి నెలకొంది.
అనంతపురం న్యూసిటీ: సర్వజనాస్పత్రి.. జిల్లా వాసులందరికీ పెద్ద దిక్కు. ఎవరికి ఏ ఆరోగ్య సమస్య తలెత్తినా ఇక్కడికే పరుగున వస్తారు. అందుకే ఇక్కడ రోజూ 2 వేల మంది ఔట్‌పేషంట్లు, 1,300 మంది ఇన్‌పేషంట్లు ఉంటున్నారు. డెంగీ, మలేరియా తదితర సీజనల్ వ్యాధులు ప్రబలే సమయంలో దాదాపుగా వెయ్యి మందికి వివిధ రక్త పరీక్షలు నిర్వహిస్తారు. అందుకోసమే పెథాలజీ విభాగంలో రక్తపరీక్షల కోసం రూ.20 లక్షలు వెచ్చించి మూడు సెల్ కౌంటర్ మిషన్లు(హెమటాలజీ అనలైజర్) తెప్పించారు. కానీ సర్వజనాస్పత్రి ఉన్నతాధికారులు వాటి నిర్వహణను గాలికి వదిలేశారు. కెమికల్స్ లేవన్న కారణంతో ఐదు నెలలుగా వాటిని మూలకుపెట్టారు. దీంతో వివిధ వార్డుల్లో వైద్య సేవల్లో జాప్యం జరుగుతోంది.
సెల్‌కౌంటర్ సేవలు ఇలా...
సెల్‌కౌంటర్ మిషన్ ద్వారా ప్లేట్‌లెట్స్, టీసీ, డీసీ, సీబీపీ, హెచ్‌బీ తదితర పరీక్షలు నిమిషాల్లో చేయవచ్చు. ఈ మిషన్ ద్వారా చేసే పరీక్షలు దాదాపుగా 500 వరకు ఉంటాయి. ఫలితం కూడా వేగవంతంగా అందుతుంది. దాన్నిబట్టి పరిస్థితి విషమించిన రోగులను ఇతర ఆస్పత్రులకు పంపడమో, లేదా మెరుగైన వైద్యం అందించడమో చేయవచ్చు. కానీ సెల్‌కౌంట్ మిషన్లు అందుబాటులో లేకపోవడంతో ఆస్పత్రిలోని చిన్నపిల్లల వార్డు, ఎఫ్‌ఎం, ఎంఎం, చెస్ట్, ఆర్థో, గైనిక్ తదితర వార్డుల్లో టెక్నీషియన్లు మాన్యువల్‌గా పరీక్షలు చేస్తున్నారు. వివిధ వార్డుల్లో రక్తపూతలు తీయడానికే గంటల సమయం వ్యవధి పడుతోంది. రక్తపూతలు తీసిన వెంటనే వారే మాన్యువల్‌గా పరీక్షలు చేయడానికి కనీసం రెండు గంటల సమయం పడుతోంది. దీంతో ఫలితం ఆలస్యమవుతుండగా.. వైద్య సేవల్లోనూ జాప్యం జరుగుతోంది. పోని ప్రైవేట్‌గా రక్త పరీక్షలు చేయించాలంటే రూ.300 నుంచి రూ.400 ఖర్చు అవుతుంది. సర్వజనాస్పత్రికి వచ్చే నిరుపేదలకు ఇది మరింత భారంగా మారింది.
పనిభారంతో పరీక్షలు వాయిదా..
సర్వజనాస్పత్రిలోని చిన్నపిల్లల విభాగంలో రెండు యూనిట్లు ఉన్నాయి. సెల్‌కౌంట్ మిషన్లు అందుబాటులో లేక ఒక్కోరోజు ఒక్కో యూనిట్ చొప్పున టెక్నీషియన్లు మాన్యువల్‌గా పరీక్షలు చేయాల్సి వస్తోంది. ఇక శనివారం, ఆదివారం వస్తే రక్త పరీక్షలకు మూడ్రోజుల సమయం పట్టే పరిస్థితి నెలకొంది. రక్త పరీక్ష ఫలితం వచ్చే వరకూ వైద్యులూ సరైన చికిత్స అందించలేకపోవడంతో చిన్నారుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్క చిన్నపిల్లల వార్డులోనే కాదు.. ఆస్పత్రిలోని ఎంఎం, ఎఫ్‌ఎం, ఆర్థో, చెస్ట్, ఓపీ, గైనిక్ తదితర విభాగాల్లో రక్త పరీక్షల నిర్వహణలో తీవ్ర జాప్యం జరుగుతోంది. పనిభారంతో టెక్నీషియన్లు రక్తపరీక్షలు వాయిదా వేస్తుండటంతో రోగులకు ప్రాణసంకటంగా మారింది.
అందుబాటులోకి రావాలంటే..
సెల్‌కౌంటర్ మిషన్లు అందుబాటులోకి రావాలంటే కెమికల్స్ కావాల్సి ఉంది. సెల్‌కౌంటర్ మిషన్‌లో 8 రకాల కెమికల్స్‌ను వినియోగిస్తారు. వాటికోసం ప్రతి నెలా రూ.5 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఈ ఏడాది రెండు మినీ సెల్‌కౌంటర్ మిషన్లను సర్వజనాస్పత్రిలో ఏర్పాటు చేశారు. వీటికి సంబంధించి కెమికల్స్ అందుబాటులో ఉన్నాయి. కానీ ఏపీఎంఎస్‌ఐడీసీ ఇంజినీర్లు ల్యాబ్‌లలో ఎలక్ట్రికల్, ఏసీ తదితర పనుల్లో జాప్యం చేశారు. దీంతో వాటిని కూడా ఉపయోగించుకోలేని పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా ఆస్పత్రి యాజమాన్యం మేలుకుని రూ.లక్షలు విలువ చేసే సెల్‌కౌంటర్ మిషన్‌లను అందుబాటులోకి తీసుకురావాలని రోగులు, జిల్లా ప్రజలు కోరుతున్నారు.
కెమికల్స్‌కు ఆర్డరిచ్చాం
కెమికల్స్ లేకపోవడంతో సెల్‌కౌంటర్ మిషన్లను ఉపయోగించడం లేదు. కెమికల్స్‌కు ఆర్డర్ ఇచ్చాం. త్వరలోనే కెమికల్స్ వస్తాయి. ప్రస్తుతం అందుబాటులో రెండు మినీ సెల్‌కౌంటర్ మిషన్లున్నాయి. వాటి ద్వారా రక్త పరీక్షలు చేసేలా చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ రామస్వామి నాయక్,ఆస్పత్రి సూపరింటెండెంట్ రక్తనమూనాలు సేకరిస్తున్న టెక్నీషియన్
Comments
Please login to add a commentAdd a comment