sarvajana hospital
-
పెద్దాసుపత్రిలో ఆక్సిజన్ కొరత లేదు
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల (పెద్దాసుపత్రి)లో రోగులకు ఆక్సిజన్ కొరత లేదని, కొరత ఉందంటూ వస్తున్న వదంతులను నమ్మవద్దని సూపరింటెండెంట్ డాక్టర్ జి.నరేంద్రనాథ్‌రెడ్డి చెప్పారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆసుపత్రిలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని సదుపాయాలు కల్పించిందన్నారు. 11.5 కేఎల్డీ కెపాసిటీతో పెద్ద ఆక్సిజన్ ట్యాంక్ ఏర్పాటు చేసి.. పైపు ద్వారా రోగులకు సరఫరా చేస్తున్నట్లు వివరించారు. దీంతో పాటు అదనంగా 10 కేఎల్డీ కెపాసిటీతో కొత్త ఆక్సిజన్ ట్యాంక్ నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నాయన్నారు. నాగపూర్‌లో ఉన్న డైరెక్టర్ జనరల్ (హై ఎక్స్‌ప్లోజివ్స్) నుంచి అనుమతి వచ్చిన వెంటనే దీన్ని ఉపయోగిస్తామని చెప్పారు. ప్రస్తుతం 450 పడకలకు సరిపడా ఆక్సిజన్ సరఫరా ఉందని, అదనంగా 1,131 పడకలకు సరఫరా కోసం చర్యలు చేపట్టామని ఆయన వివరించారు. ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్సలో ఉన్న కరోనా బాధితుల్లో రోజూ 120 మందికి మాత్రమే ఆక్సిజన్ అవసరం అవుతోందన్నారు. ఈ విషయమై కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియాలో వస్తున్న అవాస్తవ కథనాలను ప్రజలు నమ్మొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. -
ఆందోళన కలిగిస్తున్న మరణాలు
కర్నూలు(హాస్పిటల్): జిల్లాలో కరోనా కేసులు అధికమవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలను స్టేట్ కోవిడ్ ఆస్పత్రిగా మార్చింది. ఇక్కడ కేవలం కరోనా రోగులకు మాత్రమే చికిత్స అందించే విధంగా ఏర్పాట్లు చేశారు. అవసరమైన వైద్యులు, సిబ్బందిని, వైద్యపరికరాలను, సౌకర్యాలను సైతం ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో జిల్లాలో గత మార్చి 28 నుంచి ఇప్పటి వరకు 2,600లకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తంగా 85 మంది కరోనాతో మృత్యువాతపడ్డారు. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యతో పాటు మృతుల సంఖ్యను బట్టి చూస్తే రాష్ట్రంలోనే జిల్లా అగ్రస్థానంలో ఉంది. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలతో పాటు శాంతిరామ్ జిల్లా కోవిడ్ ఆస్పత్రి, విశ్వభారతి జిల్లా కోవిడ్ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం ఏర్పాటు చేసినా.. మరణాలన్నీ కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోనే నమోదయ్యాయి. ♦ గత నెల 26న సికింద్రాబాద్‌కు చెందిన 70 ఏళ్ల వ్యక్తి మధ్యాహ్నం 2.07 గంటలకు కరోనా లక్షణాలతో కర్నూలు పెద్దాస్పత్రికి వచ్చాడు. 2.25కే మృతి చెందాడు. ♦ అదే నెల 28న గద్వాలకు చెందిన 75 ఏళ్ల వృద్ధురాలు చికిత్స నిమిత్తం ఉదయం 11.39 గంటలకు ఆసుపత్రికి వచ్చింది. మధ్యాహ్నం 12 గంటలకే మరణించింది. ♦ మరుసటి రోజు నందికొట్కూరుకు చెందిన 43 ఏళ్ల వ్యక్తి కరోనా లక్షణాలతో వచ్చాడు. కొద్దిసేపటికే కన్నుమూశాడు. అదేరోజు ఆదోని ప్రాంతానికి చెందిన 15 ఏళ్ల యువతి సైతం కరోనా లక్షణాలతో ఆసుపత్రిలో చేరింది. రెండురోజుల తర్వాత మృతిచెందింది. ♦ ఆ మరుసటి రోజు మంత్రాలయం మండలానికి చెందిన 55 ఏళ్ల మహిళ ఉదయం 9.56 గంటలకు కరోనా లక్షణాలతో వచ్చింది. ఆమె సైతం కొద్దిసేపటికే కన్నుమూసింది. ఈ మరణాలన్నీ కర్నూలు పెద్దాస్పత్రిలోనే.. అందులోనూ చికిత్స కోసం వచ్చిన కొద్దిసేపటికే సంభవించినవి. అధిక శాతం ఛాతిలో నొప్పి, ఆయాసం, ఊపిరి తీసుకోలేకపోవడం వంటి లక్షణాలతో వచ్చారు. వీరి లక్షణాలను బట్టి వైద్యం చేయడానికి ముందుగా వైద్యులు జంకుతున్న పరిస్థితి. క్యాజువాలిటీలో కోవిడ్ పరీక్షలు చేసిన తర్వాత, ఆ ఫలితం వచ్చేంత వరకు ఇలాంటి వారికి చికిత్స చేయడం లేదన్న విమర్శలున్నాయి. దీనికితోడు అధిక శాతం వైరస్ వచ్చిన విషయం తెలిసి కొందరు, తెలియక కొందరు నిర్లక్ష్యం చేసి చివరి నిమిషంలో ఆసుపత్రికి రావడం వల్ల వైద్యులు ఏమీ చేయలేకపోతున్నారన్న చర్చ కూడా ఉంది. వైద్యుల పనితీరుపై కలెక్టర్ ఆగ్రహం ఆస్పత్రిలో రోజూ 4 నుంచి 6 దాకా కరోనా వైరస్ వల్ల మరణాలు సంభవిస్తుండటం, రాష్ట్రంలోనే కర్నూలు జిల్లాలో మరణాల సంఖ్య అధికంగా ఉండటంతో ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ మేరకు జిల్లా అధికారులతో చర్చించింది. ఈ నేపథ్యంలోనే ఆస్పత్రి అధికారులు, వైద్యులతో మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ సమావేశమయ్యారు. కరోనా రోగుల వద్దకు వైద్యులు వెళ్లడం లేదన్న ఫిర్యాదులు వస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కర్నూలులోనే మరణాలు ఎందుకు అధికమవుతున్నాయని ప్రశ్నించారు. కరోనా రోగుల పట్ల మానవత్వం చూపాలని, తగిన రక్షణ కిట్లతో వెళ్లి వారికి వైద్యం చేయాలని సూచించారు. ఇకపై తాను నేరుగా కరోనా రోగులతో వీడియో కాల్ ద్వారా మాట్లాడతానని, వారికి అందుతున్న వైద్యం గురించి అడిగి తెలుసుకుంటానని పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు. చివరి క్షణంలో చికిత్సకొస్తున్నారు కరోనాతో మరణించిన వారిలో అధిక శాతం చివరి స్టేజీలో వస్తున్న వారే ఉన్నారు. కరోనా లక్షణాలు కనిపించినా ఏమవుతుందిలే అనే నిర్లక్ష్యంతో బాహాటంగా బయట తిరుగుతున్నారు. దీంతో వారి ద్వారా మరికొందరికి వైరస్ సంక్రమించడమే గాక వారికి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ అధికమై శ్వాస తీసుకోలేని పరిస్థితికి వస్తున్నారు. ఊపిరితిత్తులు పూర్తిస్థాయిలో దెబ్బతిన్న స్థితిలో చికిత్స కోసం వస్తే కోలుకోవడం కష్టమవుతుంది. ప్రతి ఒక్కరూ కరోనాను నిర్లక్ష్యం చేయకుండా లక్షణాలు కనిపించిన వెంటనే పరీక్ష చేయించుకోవాలి. పాజిటివ్ వస్తే వెంటనే ఆస్పత్రిలో చేరి చికిత్స పొందితే ప్రాణాపాయం నుంచి బయటపడవచ్చు.– డాక్టర్ జి.నరేంద్రనాథ్‌రెడ్డి, ఆసుపత్రి సూపరింటెండెంట్ -
కరోనాకు ఎదురొడ్డి ప్రసవాలు..
అసలే కరోనా కాలం. ఎదుటి వారితో మాట్లాడాలంటేనే భయపడాల్సిన పరిస్థితి.ఇలాంటి సమయంలోనూ కర్నూలు పెద్దాసుపత్రి వైద్యులు ప్రత్యేకతనుచాటుకుంటున్నారు. ‘పెద్ద’ మనసుతో వైద్యసేవలు కొనసాగిస్తూప్రజల మన్ననలు చూరగొంటున్నారు.ముఖ్యంగా ప్రసూతి విభాగంఅందిస్తున్న సేవలుకష్టకాలంలో గర్భిణులకువరంగా మారాయి. కర్నూలు(హాస్పిటల్): జిల్లాలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల (పెద్దాసుపత్రి)ను స్టేట్ కోవిడ్ సెంటర్‌గా మార్చారు. ఇక్కడ అందే సాధారణ వైద్యసేవలను ప్రైవేటు ఆసుపత్రుల్లో నిర్వహించేందుకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు నగరంలో 12కు పైగా ‘డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ’ నెట్వర్క్ ఆసుపత్రులను ఎంపిక చేశారు. అయితే.. పెద్దాసుపత్రిలో మాతా శిశువులకు ఉన్న వసతులు, వైద్యులు, సిబ్బంది సేవలు బయట అందించలేరన్న ఉద్దేశంతో చిన్నపిల్లల విభాగం, ప్రసూతి విభాగాలను ప్రైవేటుకు ఇవ్వకుండా ఇక్కడే ఉంచారు. ఈ విభాగాలకు కరోనా రోగులు, వారి కుటుంబ సభ్యులు, వారికి చికిత్స అందించే వైద్యులు, సిబ్బంది వెళ్లకుండా ఆంక్షలు విధించారు. ఈ మేరకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు కూడా చేశారు. ప్రతి నెలా 800కు పైగా ప్రసవాలు జిల్లాలో లాక్డౌన్ కారణంగా కొన్నాళ్ల క్రితం వరకు ప్రజారవాణా ఆగిపోయింది. ఆ సమయంలోనూ జిల్లానలుమూలల నుంచి గర్భిణులను సొంత ఏర్పాట్లతో పెద్దాసుపత్రి ప్రసూతి విభాగానికి తీసుకొచ్చి.. ప్రసవం చేయించారు. ఇక్కడ అన్ని రకాల వసతులు ఉంటాయని, నిపుణులైన వైద్యులు, సిబ్బంది ఉంటారని, ప్రసవానికి వెళితే ఎలాంటి ఇబ్బందీ ఉండదన్న ఉద్దేశంతో దూరాభారమైనా గర్భిణులను ఇక్కడికి తీసుకొస్తున్నారు. ఈ విభాగంలో సాధారణ రోజుల్లో ప్రతి నెలా 900 నుంచి 1,000 దాకా ప్రసవాలు జరిగేవి. అలాగే లాక్డౌన్ సమయంలోనూ 800లకు పైగా జరగడం విశేషం. జిల్లా మొత్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరుగుతున్న ప్రసవాల సంఖ్యలో దాదాపు సగం పెద్దాసుపత్రిలోనే చేస్తున్నారంటే అతిశయోక్తి కాదు. ధైర్యంగా వైద్యసేవలు కరోనా కాలంలోనూ వైద్యులు ఏమాత్రమూ జంకకుండా సేవలు కొనసాగిస్తున్నారు. ప్రసూతి విభాగంలో ఏడు యూనిట్లు ఉన్నాయి. నలుగురు ప్రొఫెసర్లు, ఐదుగురు అసోసియేట్ ప్రొఫెసర్లు, 13 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లతో పాటు 18 మంది పీజీలు వైద్యసేవలు అందిస్తున్నారు. వీరే కాకుండా లాక్డౌన్ సమయంలో అదనంగా నలుగురు ఓబీజీ స్పెషలిస్టులు (ప్రసూతి–గైనకాలజిస్టులు), నలుగురు ఎంబీబీఎస్ వైద్యులను నియమించారు. ఇక్కడ చేరిన నలుగురు గర్భిణులకు కరోనా పాజిటివ్ వచ్చింది. అయినా వైద్యులు, సిబ్బంది భయపడకుండా వైద్యసేవలు అందించారు. ముగ్గురికి సాధారణ ప్రసవం, ఒకరికి సిజేరియన్ చేశారు. ఈ క్రమంలో ఇద్దరు వైద్యులు, ఇద్దరు సిబ్బందికి కరోనా సోకినా వెరవలేదు. ప్రస్తుతం వారంతా కోలుకుని తిరిగి విధుల్లో చేరడం గుండె నిబ్బరానికి నిదర్శనం. కోవిడ్, నాన్ కోవిడ్‌లుగా విభజించి... గర్భిణులను ప్రసవ తేదీ దగ్గరగా ఉంటేనే ఆసుపత్రిలో చేర్చుకుంటున్నారు. వారికి ముందుగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయిస్తున్నారు. కరోనా ఉంటే కోవిడ్ డివిజన్లో చేర్చుతున్నారు. వైరస్ లేని వారిని నాన్ కోవిడ్ డివిజన్లో అడ్మిట్ చేస్తున్నారు. వైద్యులను సైతం ఇందుకు ప్రత్యేకంగా నియమించి సేవలు అందించే ఏర్పాట్లు చేశారు. వైద్యులు, సిబ్బంది స్వీయరక్షణలో భాగంగా పీపీఈ కిట్లు, మాస్కులు ధరించి, శానిటైజర్లు వాడుతూ సేవలందిస్తున్నారు. కరోనా వచ్చినా భయపడలేదు కరోనా వ్యాప్తి చెందుతున్న వేళ మేము ఏ మాత్రమూ భయపడలేదు. స్వీయరక్షణ చర్యలు తీసుకుని గర్భిణులకు వైద్యసేవలు అందిస్తామని చెప్పాం. ఈ మేరకు ఎప్పటిలాగే సేవలు కొనసాగిస్తున్నాం. కొందరికి కరోనా సోకినా కొద్దిరోజుల్లోనే రికవరీ అయ్యి.. మళ్లీ విధుల్లో చేరారు. వారి ధైర్యానికి సెల్యూట్. –డాక్టర్ బి.ఇందిర, గైనకాలజీ హెచ్‌వోడీ, పెద్దాసుపత్రి -
పాజిటివ్ వచ్చినా ఆరుబయట విహారం
అనంతపురం హాస్పిటల్: సర్వజనాస్పత్రిలోని ఐసోలేషన్, క్వారంటైన్ వార్డుల్లో ఉన్న కోవిడ్ అనుమానితుల్లో కొందరు ఓవరాక్షన్ చేస్తున్నారు. ఆస్పత్రి సిబ్బంది చెబుతున్నా.. వార్డుల నుంచి బయటకు వచ్చి విహరిస్తున్నారు. దీంతో ఆస్పత్రిలోని స్టాఫ్‌నర్సులు, కింది స్థాయి సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. హిందూపురం ప్రాంతానికి చెందిన కరోనా పాజిటివ్ కేసుల్లోని వారే ఆస్పత్రిలో అలజడి సృష్టిస్తున్నట్లు తెలుస్తోంది. కరోనా పాజిటివ్ వచ్చిన వారు ఐసోలేషన్ గదుల నుంచి బయటకు రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆస్పత్రి వర్గాలు కోరుతున్నాయి. -
మగ బిడ్డకి రూ.1,200.. ఆడబిడ్డకి వెయ్యి
ఈ చిత్రంలోని బాలింత పేరు దిల్షాద్. ధర్మవరానికి చెందిన ఈమె రెండో కాన్పు కోసం సర్వజనాస్పత్రిలో చేరింది. ఈ నెల 3న రాత్రి 12 గంటల సమయంలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆరోగ్యం సరిగా లేకపోవడంతో శిశువును ఎస్‌ఎన్‌సీయూలో ఉంచారు. దిల్షాద్ను పోస్టునేటల్‌కు మార్చాల్సి ఉండగా.. ఆ సమయంలో విధుల్లో ఉన్న క్లాస్–4 సిబ్బంది దిల్షాద్ భర్త మున్వర్‌ను రూ.1,200 డిమాండ్ చేశారు. ముందు వార్డుకు మార్చండి.. ఉదయం డబ్బులిస్తానని చెప్పినా వినకపోవడం వివాదానికి కారణమైంది. కరువు జిల్లా అనంతలో కాసులకు నిత్యం కటకటే. అందుకే నిరుపేదలంతా ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా జిల్లాకే పెద్దదిక్కుగా ఉన్న సర్వజనాస్పత్రికి పరుగున వస్తారు. ఇక ప్రసవాల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. కానీ ఆస్పత్రిలో తిష్టవేసిన ధన పిశాచులు.. డబ్బుకోసం నిరుపేదల రక్తం పీలుస్తున్నారు. ఆడపిల్లకు ఓ రేటు.. మగపిల్లాడైతే మరో రేటు కట్టి మరీ వసూలు చేస్తున్నారు. వారడిగినంత డబ్బులివ్వకపోతే బాలింతలకు నరకం చూపుతున్నారు. అనంతపురం హాస్పిటల్: మాతృత్వం ప్రతి మహిళ జీవితంలో అపురూప ఘట్టం. అందుకే తొమ్మిది నెలలు కడుపులో బిడ్డను మోసిన గర్భిణి.. ప్రసవం అయ్యాక బిడ్డను చూసుకుని ఎంతో మురిసిపోతుంది. తన ప్రతిరూపాన్ని చూసే క్షణాలకోసం ఎన్ని ఇబ్బందులైనా భరిస్తుంది. అలాంటి అపురూప క్షణాలను కూడా సర్వజనాస్పత్రిలోని సిబ్బంది మహిళలకు దూరం చేస్తున్నారు. మానవత్వం మరచి.. మనీ కోసం కక్కుర్తి పడుతున్నారు. అడిగినంత డబ్బులివ్వకపోతే బిడ్డను కూడా చూపని పరిస్థితి. దీంతో కాన్పులకోసం ఆస్పత్రికి వస్తున్న గర్భిణులు ప్రసవ సమయంలో వచ్చే నొప్పులకంటే డబ్బుల కోసం ఆస్పత్రిలోని సిబ్బంది పెట్టే హింసతో కన్నీరుమున్నీరవుతున్నారు. రేట్లు ఫిక్స్ చేశారు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లే ఆర్థిక స్థోమత లేనివారే సర్వజనాస్పత్రికి వస్తారు. కాన్పులు, ఇతర ఆరోగ్య సమస్యలకు జిల్లాలోని మారుమూల ప్రాంతాల నుంచి ఇక్కడికే వస్తారు. రోగులు ఆస్పత్రుల్లో ఉంటుండగా.. వారి బంధువులు, వెంట వచ్చిన వారు లాడ్జిల్లో బసచేసే ఆర్థిక స్థోమత లేక ఆస్పత్రి ఆవరణలోనే దోమలతో సహవాసం చేస్తుంటారు. అలాంటి వారినీ ఇక్కడి సిబ్బంది పీక్కుతింటున్నారు. ముఖ్యంగా గ్రూప్–4 సిబ్బంది ప్రసవాలకు రేట్ ఫిక్స్ చేశారు. మగ బిడ్డ పుడితే రూ.1,200, ఆడబిడ్డ పుడితే రూ.1,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే బిడ్డను ఇవ్వరు. అదీ కాకపోతే లేబర్ వార్డు నుంచి పోస్టునేటల్ వార్డుకు తీసుకెళ్లేది లేదని మొండికేస్తుండటం పరిపాటిగా మారింది. రోజూ 25 ప్రసవాలు జిల్లా కేంద్రంలోని సర్వజనాస్పత్రిలో రోజూ సరాసరి 25 ప్రసవాలు జరుగుతుంటాయి. అధిక శాతం బాలింతల నుంచి లేబర్ వార్డు క్లాస్–4 సిబ్బంది రూ.వేలకు వేలు వసూలు చేస్తున్నారనే విమర్శలున్నాయి. గ్రూపులుగా ఏర్పడి బాలింతల నుంచి డబ్బు వసూలు చేస్తున్నారు. డబ్బులిచ్చుకోలేని వారికి ప్రత్యక్ష నరకం చూపుతున్నారు. గట్టిగాఅడిగితే తాము కూడా ప్రసవానికి ఇంత అని అధికారులకు ఇవ్వాలంటున్నారు. ఏ అధికారికి అని అడిగితే మాత్రం సమాధానం దాటవేస్తున్నారు. ఈ చిత్రంలోని బాలింతల పేర్లు వరలక్ష్మి(రాణినగర్, అనంతపురం), భాగ్యమ్మ(కొడవాండ్లపల్లి). రెండ్రోజుల క్రితం ఇరువురూ ప్రసవించారు. రూ.700 ఇచ్చే వరకు బిడ్డనిచ్చేది లేదని వరలక్ష్మితో సిబ్బంది పేచీ పెట్టుకున్నారు. ఇక భాగ్యమ్మతోనూ రూ.1000లు ముక్కుపిండి వసూలు చేశారు. కూలీ పనులకెళ్లే తమలాంటోళ్లతో రూ.వేలల్లో డబ్బులు తీసుకుంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రిలో ప్రసవమైతే చాలు.. ప్రతి ఒక్కరూ క్లాస్–4 సిబ్బందికిలంచాలు సమర్పించుకోవాల్సి వస్తుండటం గమనార్హం. పట్టించుకోని ఆర్‌ఎంఓలు సర్వజనాస్పత్రిలో రెసిడెన్షియల్ మెడికల్ ఆఫీసర్ల(ఆర్ఎంఓ) రోగులకందే సేవలు, సిబ్బంది పనితీరును పరిశీలించాల్సి ఉంటుంది. కానీ ఆర్‌ఎంఓలు ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడంతో ఇక్కడికొస్తున్న నిరుపేదలు ఇబ్బందులు పడుతున్నారు. ఎవరైనా ఫిర్యాదు చేసినప్పుడు హడావుడి చేయడం తప్ప.. సిబ్బందిని సరైన మార్గంలో నడపలేకపోతున్నారు. చంద్రుని చూపునకు నోచుకోక... కలెక్టర్ గంధం చంద్రుడు బాధ్యతలు స్వీకరించి మూడు నెలలు దాటి పోయింది. ఆస్పత్రి అభివృద్ధి కమిటీ అధ్యక్షునిగా ఉన్న ఆయన ఇంతవరకు కనీసం ఆస్పత్రివైపు కన్నెత్తి చూడని పరిస్థితి. నిత్యం ఏదో ఒక పనిమీద ఆస్పత్రి ఎదుటే వెళ్తున్నా.. ఆస్పత్రిలోకి మాత్రం రాకపోవడం గమనార్హం. దీంతో పర్యవేక్షణ కొరవడటం.. ఉన్నతాధికారులు దృష్టి సారించకపోవడంతో సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అందువల్లే జిల్లాకే పెద్దదిక్కుగా ఉన్న సర్వజనాస్పత్రిలో రోగులకు సరైన వైద్య సేవలందడం లేదు. గతంలో ట్రెయినీ కలెక్టర్‌గా వచ్చిన వినోద్ అర్థరాత్రి వేళల్లో ఆస్పత్రిని తనిఖీ చేసే వారని, ఫలితంగా వైద్యులు, సిబ్బంది అలర్ట్‌గా ఉంటూ సేవలందించేవారని రోగులు గుర్తు చేసుకుంటున్నారు. చర్యలు తీసుకుంటున్నాం ఎఫ్ఎన్ఓ, స్వీపర్లు బాలింతల నుంచి డబ్బులు తీసుకుంటున్నట్లు ఫిర్యాదులు అందాయి. అందులో భాగంగా ఇద్దరిని వేరే వార్డుకు మార్చాం. ఆస్పత్రిలో సేవలకు ఎవరూ డబ్బులివ్వాల్సిన పనిలేదు. సర్వజనాస్పత్రిలో అన్ని సేవలు ఉచితమే. ఎవరైనా డబ్బు డిమాండ్ చేస్తే నాకు ఫిర్యాదు చేయవచ్చు. తప్పకుండా చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ లలిత, ఆర్ఎంఓ -
రామా.. కనవేమిరా!
కుర్చీలకే పరిమితమైన వారు.. కాలు భూమిపై మోపలేని వారు.. మనిషి సాయంలేనిదే నడవలేనివారు.. వివిధ వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులు, వృద్ధులు.. వీరిని చూస్తే ఎవరికైనా అయ్యోపాపం అనిపిస్తుంది. కానీ సర్వజనాస్పత్రి నిర్వాహకులు మాత్రం కనీస మానవత్వం చూపలేకపోయారు. బుధవారం ఆస్పత్రిలోని మొదటి అంతస్తులో సదరం శిబిరం ఏర్పాటు చేసి దివ్యాంగులకు నరకం చూపించారు. ఒక్కోమెట్టు ఎక్కేందుకు ఒక్కొక్కరు పడిన కష్టం చూసి అక్కడున్న వారే అయ్యో అంటూ తల్లడిల్లిపోయారు. ఆస్పత్రి ఉన్నతాధికారులు మాత్రం ప్రశ్నించిన వారితో వితండవాదం చేయడం గమనార్హం. అనంతపురం న్యూసిటీ: తొమ్మిది రకాల జబ్బులతో బాధపడుతున్న వారికి సామాజిక పింఛన్లు మంజూరు చేస్తామని ఇటీవల ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలని వెల్లడించింది. దీంతో తలసీమియా, హీమోఫీలియా, సికెల్‌సెల్ అనీమియా, ఎలిఫాంటియాసిస్(బోదకాలు), మూత్రపిండ వ్యాధిగ్రస్తులకు, పక్షవాతం, కండరాల బలహీనత, యాక్సిడెంట్‌కు గురై(చక్రాల కుర్చీ/మంచానికి పరిమితమైన వారు), కుష్టు రోగులు(బహుళ వైకల్యం), కిడ్నీ, కాలేయం, గుండె మార్పి జరిగిన వారికి మెడికల్ బోర్డు సర్టిఫికెట్ మంజూరు కార్యక్రమం జరిగింది. ప్రొఫెసర్ ఆఫ్ మెడిసిన్ డాక్టర్ వెంకటేశ్వరరావు, చిన్నపిల్లల విభాగం ప్రొఫెసర్ డాక్టర్ మల్లీశ్వరి, తదితరులు దివ్యాంగుల ధృవీకరణ పత్రాలు, పాతరిపోర్టులను పరిశీలించారు. శిబిరానికి జిల్లా నలుమూలల నుంచి వేలాదిగా రోగులు తరలివచ్చారు. దీంతో వారిని కంట్రోల్ చేయడం ఇబ్బందిగా మారింది. ఆస్పత్రిలోని సూపరింటెండెంట్ చాంబర్ ముందున్న మొదటిఫ్లోర్ వికలాంగులతో కిక్కిరిసిపోయింది. ఎఫ్ఎం, ఎంఎం, ఐసీసీయూ, చిన్నపిల్లల వార్డు, సర్జికల్ వార్డులకు వెళ్లేందుకు వీల్లేకుండా వికలాంగులు బారులు తీరారు. అయినా ఆస్పత్రి యాజమాన్యం కనీస జాగ్రత్తలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమైంది. శిబిరాన్ని మొదటి అంతస్తులో నిర్వహించగా.. దివ్యాంగులు ఫస్ట్‌ప్లోర్ చేరుకోవడానికి నరకం చూశారు. నడిచేందుకు కూడా వీలులేని స్థితిలో ఉన్నవారు మోకాళ్లతో దోక్కుంటూ మెట్లు ఎక్కడానికి అల్లాడిపోయారు. తీరా సర్టిఫికెట్ల మంజూరు గదికి వచ్చే సరికి వందల సంఖ్యలో దివ్యాంగులు బారులు తీరారు. పసిపిల్లల గావుకేకలు వివిధ వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులకు సదరం సర్టిఫికెట్ తీసుకోవడం.. ఇప్పటికే ఉన్న సర్టిఫికెట్లను ధ్రువీకరించుకునేందుకు చాలా మంది చంటిబిడ్డలతో వచ్చారు. ఒళ్లో చంటిబిడ్డ.. మరో చేతిలో అనారోగ్యంతో ఉన్న పిల్లలతో వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జనం కిటకిటలాడగా గాలిసైతం వీయక పసిపిల్లల ఏడ్పులతో ఆస్పత్రి మార్మోగింది. చిన్నారుల ఇబ్బందులు చూసి తట్టుకోలేని చాలా మంది వెనక్కివెళ్లిపోయారు. సుదూరప్రాంతాల నుంచి వచ్చిన వారు క్యూలోనే కూర్చుండిపోయారు. అంతలా కష్టపడినా సదరం శిబిరంలో వివరాలు నమోదు చేయించలేకపోయారు. అడుగడుగునా నిర్లక్ష్యం దివ్యాంగులు, వివిధ రోగాలతో బాధపడుతున్న వారు సదరం శిబిరానికి వేలాదిగా తరలివస్తారని తెలిసినా...ఆస్పతి యాజమాన్యం ముందస్తు చర్యలు తీసుకోవడంలో విఫలమైంది. సెక్యూరిటీ పూర్తి స్థాయిలో లేకపోవడంతో కంట్రోల్ చేయడానికి వీలుకాలేదు. సర్టిఫికెట్ల కోసం రోగులు తోపులాడుకునే పరిస్థితి ఎదురైంది. తమనంటే తమను ముందు పరీక్షించాలంటూ శిబిరానికి వచ్చిన వారు ఎగబాకారు. ఈ పరిస్థితుల్లో ఔట్‌పోస్టు ఏఎస్ఐ త్రిలోక్ టూటౌన్ పోలీసులకు సమాచారం అందించగా, వారు స్పెషల్‌పార్టీ పోలీసులను రంగంలోకి దింపారు. వారొచ్చిన గంటన్నరకు సమస్య సద్దుమణిగింది. క్షేత్రస్థాయిలో విఫలం దివ్యాంగులను ఆస్పత్రికి పంపే విషయంలో క్షేత్రస్థాయిలో పీహెచ్సీ వైద్యులు, తదితర సిబ్బంది విఫలమైనట్లు తెలుస్తోంది. ప్రతి బుధవారం సర్టిఫికెట్ల మంజూరు చేస్తారన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో ఆస్పత్రి యాజమాన్యం, ఆరోగ్యశాఖ, సచివాలయ ఉద్యోగులు విఫలమయ్యారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయ. 9 రకాల సమస్యలతో బాధపడేవారితో పాటు సదరం సర్టిఫికెట్ల కోసం వచ్చే వారు ఆస్పత్రికి రావడం పెద్ద సమస్యగా మారింది. -
రక్త పరీక్ష..శిక్ష
ఎవరైనా అస్వస్థతకు గురై ఆస్పత్రికి వెళితే రక్త పరీక్షలు చేసి.. ఫలితం ఆధారంగా వైద్యులు చికిత్స చేస్తారు. ఇక సీజనల్ వ్యాధులు ప్రబలినప్పుడు.. జ్వరపీడితులకు రక్తపరీక్షలు తప్పనిసరి. రోజూ 2 వేల ఓపీ ఉండే అనంతపురం సర్వజనాస్పత్రిలో రక్త పరీక్షలు సకాలంలో చేయడం లేదు. రక్త పరీక్ష నిర్వహించేందుకు రూ.లక్షలు వెచ్చించి మూడు సెల్ కౌంటర్లు తెచ్చినా వాటినిి వాడే కెమికల్స్ లేకపోవడంతో సిబ్బంది మాన్యువల్‌గా పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీంతో రక్త పరీక్షల ఫలితం ఆలస్యమవుతుండగా.. రోగులకు సకాలంలో సరైన వైద్యం అందక అల్లాడిపోతున్నారు. ఈ చిత్రంలోని బాలిక పుట్టపర్తి మండలం నిడిమామిడికి చెందిన సాహితి. నవంబర్ నెలలో డెంగీతో సర్వజనాస్పత్రిలో చేరింది. వెంటనే రక్త పరీక్ష చేయాల్సి ఉన్నా.. సెల్‌కౌంటర్ పనిచేయకపోవడంతో సిబ్బంది వైద్య పరీక్షలు వాయిదా వేశారు. చివరకు చిన్నారి ప్లేట్లెట్ కౌంట్ 30వేలకు తగ్గిపోవడంతో టెక్నీషియన్లు స్పందించి పరీక్షలు చేశారు. చిన్నవార్డులోనే రోజూ 200 మందికిపైగా చిన్నారులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. సమయం సరిపోకపోవడంతో పరీక్షలు వాయిదా వేస్తున్నారు. ఈ క్రమంలో అత్యవసర సమయంలో కీలకం కానున్న రక్త పరీక్షల నివేదికలు అందక వైద్యులు కూడా సరైన వైద్యం అందించలేని పరిస్థితి నెలకొంది. అనంతపురం న్యూసిటీ: సర్వజనాస్పత్రి.. జిల్లా వాసులందరికీ పెద్ద దిక్కు. ఎవరికి ఏ ఆరోగ్య సమస్య తలెత్తినా ఇక్కడికే పరుగున వస్తారు. అందుకే ఇక్కడ రోజూ 2 వేల మంది ఔట్‌పేషంట్లు, 1,300 మంది ఇన్‌పేషంట్లు ఉంటున్నారు. డెంగీ, మలేరియా తదితర సీజనల్ వ్యాధులు ప్రబలే సమయంలో దాదాపుగా వెయ్యి మందికి వివిధ రక్త పరీక్షలు నిర్వహిస్తారు. అందుకోసమే పెథాలజీ విభాగంలో రక్తపరీక్షల కోసం రూ.20 లక్షలు వెచ్చించి మూడు సెల్ కౌంటర్ మిషన్లు(హెమటాలజీ అనలైజర్) తెప్పించారు. కానీ సర్వజనాస్పత్రి ఉన్నతాధికారులు వాటి నిర్వహణను గాలికి వదిలేశారు. కెమికల్స్ లేవన్న కారణంతో ఐదు నెలలుగా వాటిని మూలకుపెట్టారు. దీంతో వివిధ వార్డుల్లో వైద్య సేవల్లో జాప్యం జరుగుతోంది. సెల్‌కౌంటర్ సేవలు ఇలా... సెల్‌కౌంటర్ మిషన్ ద్వారా ప్లేట్లెట్స్, టీసీ, డీసీ, సీబీపీ, హెచ్‌బీ తదితర పరీక్షలు నిమిషాల్లో చేయవచ్చు. ఈ మిషన్ ద్వారా చేసే పరీక్షలు దాదాపుగా 500 వరకు ఉంటాయి. ఫలితం కూడా వేగవంతంగా అందుతుంది. దాన్నిబట్టి పరిస్థితి విషమించిన రోగులను ఇతర ఆస్పత్రులకు పంపడమో, లేదా మెరుగైన వైద్యం అందించడమో చేయవచ్చు. కానీ సెల్‌కౌంట్ మిషన్లు అందుబాటులో లేకపోవడంతో ఆస్పత్రిలోని చిన్నపిల్లల వార్డు, ఎఫ్ఎం, ఎంఎం, చెస్ట్, ఆర్థో, గైనిక్ తదితర వార్డుల్లో టెక్నీషియన్లు మాన్యువల్‌గా పరీక్షలు చేస్తున్నారు. వివిధ వార్డుల్లో రక్తపూతలు తీయడానికే గంటల సమయం వ్యవధి పడుతోంది. రక్తపూతలు తీసిన వెంటనే వారే మాన్యువల్‌గా పరీక్షలు చేయడానికి కనీసం రెండు గంటల సమయం పడుతోంది. దీంతో ఫలితం ఆలస్యమవుతుండగా.. వైద్య సేవల్లోనూ జాప్యం జరుగుతోంది. పోని ప్రైవేట్‌గా రక్త పరీక్షలు చేయించాలంటే రూ.300 నుంచి రూ.400 ఖర్చు అవుతుంది. సర్వజనాస్పత్రికి వచ్చే నిరుపేదలకు ఇది మరింత భారంగా మారింది. పనిభారంతో పరీక్షలు వాయిదా.. సర్వజనాస్పత్రిలోని చిన్నపిల్లల విభాగంలో రెండు యూనిట్లు ఉన్నాయి. సెల్‌కౌంట్ మిషన్లు అందుబాటులో లేక ఒక్కోరోజు ఒక్కో యూనిట్ చొప్పున టెక్నీషియన్లు మాన్యువల్‌గా పరీక్షలు చేయాల్సి వస్తోంది. ఇక శనివారం, ఆదివారం వస్తే రక్త పరీక్షలకు మూడ్రోజుల సమయం పట్టే పరిస్థితి నెలకొంది. రక్త పరీక్ష ఫలితం వచ్చే వరకూ వైద్యులూ సరైన చికిత్స అందించలేకపోవడంతో చిన్నారుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్క చిన్నపిల్లల వార్డులోనే కాదు.. ఆస్పత్రిలోని ఎంఎం, ఎఫ్ఎం, ఆర్థో, చెస్ట్, ఓపీ, గైనిక్ తదితర విభాగాల్లో రక్త పరీక్షల నిర్వహణలో తీవ్ర జాప్యం జరుగుతోంది. పనిభారంతో టెక్నీషియన్లు రక్తపరీక్షలు వాయిదా వేస్తుండటంతో రోగులకు ప్రాణసంకటంగా మారింది. అందుబాటులోకి రావాలంటే.. సెల్‌కౌంటర్ మిషన్లు అందుబాటులోకి రావాలంటే కెమికల్స్ కావాల్సి ఉంది. సెల్‌కౌంటర్ మిషన్‌లో 8 రకాల కెమికల్స్‌ను వినియోగిస్తారు. వాటికోసం ప్రతి నెలా రూ.5 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఈ ఏడాది రెండు మినీ సెల్‌కౌంటర్ మిషన్లను సర్వజనాస్పత్రిలో ఏర్పాటు చేశారు. వీటికి సంబంధించి కెమికల్స్ అందుబాటులో ఉన్నాయి. కానీ ఏపీఎంఎస్ఐడీసీ ఇంజినీర్లు ల్యాబ్‌లలో ఎలక్ట్రికల్, ఏసీ తదితర పనుల్లో జాప్యం చేశారు. దీంతో వాటిని కూడా ఉపయోగించుకోలేని పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా ఆస్పత్రి యాజమాన్యం మేలుకుని రూ.లక్షలు విలువ చేసే సెల్‌కౌంటర్ మిషన్లను అందుబాటులోకి తీసుకురావాలని రోగులు, జిల్లా ప్రజలు కోరుతున్నారు. కెమికల్స్‌కు ఆర్డరిచ్చాం కెమికల్స్ లేకపోవడంతో సెల్‌కౌంటర్ మిషన్లను ఉపయోగించడం లేదు. కెమికల్స్‌కు ఆర్డర్ ఇచ్చాం. త్వరలోనే కెమికల్స్ వస్తాయి. ప్రస్తుతం అందుబాటులో రెండు మినీ సెల్‌కౌంటర్ మిషన్లున్నాయి. వాటి ద్వారా రక్త పరీక్షలు చేసేలా చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ రామస్వామి నాయక్,ఆస్పత్రి సూపరింటెండెంట్ రక్తనమూనాలు సేకరిస్తున్న టెక్నీషియన్ -
ఆరోగ్య వివరాలు తారుమారు
అనంతపురం న్యూసిటీ: అనంతపురం సర్వజనాస్పత్రిలోని చిన్నపిల్లల విభాగంలో కొందరు వైద్యుల నిర్లక్ష్యంతో ఆరోగ్య వివరాలు తారుమారవుతున్నాయి. ఆస్పత్రిలో ఇటీవల ఓ బాలింతకు రక్తమార్పిడి జరిగి ప్రాణం కోల్పోయిన విషయం విదితమే. దీని ద్వారా ఇద్దరు వైద్యులు, ఇద్దరు స్టాఫ్‌నర్సులు, టెక్నీషియన్లను సస్పెండ్ చేసినా ఇంకా చాలామంది వైద్యుల్లో మార్పు రావడం లేదు. చిన్నారుల జీవితాలతో చెలగాటమాడుతున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అవాక్కు... చిన్న పిల్లల వార్డులో ధర్మవరానికి చెందిన మూడేళ్ల పాప మనస్వి డెంగీ అనుమానిత కేసుగా ఈ నెల 9న అడ్మిట్ అయ్యింది. ఆస్పత్రిలో వైద్యులు ఈ నెల 11న చిన్నారికి ప్లేట్‌లెట్స్‌తో పాటు డెంగీ పరీక్షకు రెఫర్ చేశారు. కానీ హౌస్సర్జన్లు మౌనిక అనే పేషెంట్ ఆరోగ్య నివేదికను ఏకంగా మనస్వి కేస్ షీట్లో నమోదు చేశారు. కేస్ షీట్లో మనస్వికి సీఆర్పీ పాజిటివ్ అని నమోదు చేశారు. దీనిపై పాప తండ్రి రాము కేస్ షీటును నిశితంగా పరిశీలించారు. పాప డెంగీ సమస్యతో బాధపడుతుంటే సీఆర్పీ ఎందుకు వస్తుందని ఆరా తీశాడు. దిద్దుబాటు చర్యలు వాస్తవంగా ఇదే వార్డులో ఉన్న మౌనిక అనే చిన్నారికి చెందిన సీఆర్పీ రిపోర్టును మనస్వి కేస్ షీట్లో రాశారు. అప్పటికప్పుడు తేరుకున్న వైద్యులు మనస్వి కేస్ షీట్‌లోని రిపోర్టును కొట్టేశారు. పాప తల్లిదండ్రులు ఆరా తీయకపోతే సీఆర్పీ కిందే మందులిచ్చే పరిస్థితి ఉండేది. ఆస్పత్రిలో వైద్యులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారడానికి ఇదొక నిలువెత్తు నిదర్శనం. చిన్నారుల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వైద్యులపై ఆస్పత్రి యాజమాన్యం చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
సర్వజనాస్పత్రిలో పసికందుల మృతి
అనంతపురం న్యూసిటీ: ప్రభుత్వ సర్వజనాస్పత్రిలోని ఎస్‌ఎన్‌సీయూలో ఆదివారం ఇద్దరు పసికందుల మృతి తీవ్ర వివాదానికి దారి తీసింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే పసికందులు మృత్యువాత పడ్డారని బాధిత కుటుంబీకులు ఎస్ఎన్సీయూ ముందు ఆందోళన చేపట్టారు. దీంతో కాసేపు ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. బుక్కరాయసముద్రం మండలం వడియంపేటకి చెందిన లక్ష్మిదేవి, ఎర్రిస్వామిల పాప(1.3 కేజీలు), కళ్యాణదుర్గానికి చెందిన గీతమ్మ, గంగయ్య పాప(2కేజీలు) ప్రీమెచ్యుర్డ్ బేబీలు. వీరిని ఆస్పత్రిలోని ఎస్‌ఎన్‌సీయూలో ఔట్‌బార్న్ యూనిట్లో చేర్పించారు. వీరు సాయంత్రం 6 గంటల సమయంలో మృతి చెందారు. దీంతో బాధిత కుటుంబీకులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. బతికున్న పిల్లలను ఇస్తే, వారి ప్రాణం లేకుండా ఇచ్చారని కన్నీరుపెట్టారు. యూనిట్లో ఏసీలు పనిచేయడం లేదని, ఉదయం నుంచి ఐదు మంది చనిపోయారంటూ వైద్యులు, సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు ఔట్‌పోస్టు ఏఎస్ఐ రాము తదితరులు బాధిత కుటుంబీకులను నచ్చజెప్పడంతో సమస్య సద్దుముణిగింది. వద్దు బాబోయ్ ఎస్‌ఎన్‌సీయూలో ఇద్దరు చిన్నారులతో మృతి కలకలం రేగడంతో అక్కడే ఉన్న రెండు కుటుంబాలు తమ పిల్లలను ఇక్కడి నుంచి తీసుకెళ్దామని నిర్ణయించుకున్నారు. ఆస్పత్రిలోని వైద్యులు చెబుతున్నా..హైయ్యర్ ఇన్స్టిట్యూట్కి తీసుకెళ్తామంటూ వెళ్లిపోయారు. చివరకు వైద్యులు వారితో సంతకాలు చేయించుకుని డిశ్చార్జ్ చేశారు. మెరుగైన సేవలందించాం ఇద్దరు పసికందుల ఆరోగ్య పరిస్థితి సరిగా లేదు. రెండు ప్రీమెచ్యూర్డ్ బేబీలు. పుట్టగానే ఏడవలేదు. దీంతో వారు కోలుకోవడానికి తక్కువ ఆస్కారం ఉంటుంది. కానీ రౌండ్ ద క్లాక్ మెరుగైన సేవలందించాం. అమాయక ప్రజలకు తెలియక మాపై ఆరోపణలు చేస్తున్నారు. – డాక్టర్ శ్రీధర్ -
పెద్దాసుపత్రిని నిమ్స్‌లా తీర్చిదిద్దుతాం
కర్నూలు(హాస్పిటల్): ప్రభుత్వ సర్వజన వైద్యశాల (పెద్దాసుపత్రి)ను హైదరాబాద్‌లోని నిమ్స్‌లా తీర్చిదిద్దుతామని కర్నూలు పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ సంజీవకుమార్, ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, హఫీజ్‌ఖాన్, డాక్టర్ సుధాకర్ అన్నారు. ఆసుపత్రి ఆర్థోపెడిక్ విభాగంలో రూ.35 లక్షలు, న్యూరోసర్జరీ విభాగంలో రూ.50 లక్షలు, యురాలజీ విభాగంలో రూ.35 లక్షలతో మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లుగా ఆధునికీకరించారు. వీటిని మంగళవారం ఎంపీ, ఎమ్మెల్యేలతో పాటు జిల్లా కలెక్టర్ సత్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ డాక్టర్ సంజీవకుమార్ మాట్లాడుతూ సర్జన్లకు ఆపరేషన్ థియేటర్ పూజగది లాంటిదన్నారు. మాడ్యులర్ ఓటీగా మార్చడం వల్ల ఇంకా ఉత్సాహంగా పని చేస్తారన్నారు. తనకు ఓనమాలు నేర్పిన కర్నూలు మెడికల్ కాలేజీలోనే ఆపరేషన్ థియేటర్లను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. ఆసుపత్రిలో ఏవైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎంసీఐ నిబంధనల ప్రకారం కళాశాలలో సెంట్రల్ లైబ్రరీ, క్లినికల్ లెక్చరర్ గ్యాలరీ, స్టాఫ్ క్వార్టర్స్ కావాల్సి ఉందని, వీటిని తెచ్చేందుకు కృషి చేస్తానని చెప్పారు. క్యాజువాలిటీ, ట్రామాకేర్లలో సౌకర్యాలు పెరగాల్సి ఉందన్నారు. పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి మాట్లాడుతూ దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ ఆసుపత్రులు సైతం బలోపేతం కావాలన్న ఉద్దేశంతో ఇక్కడ కూడా ఆరోగ్యశ్రీని తీసుకొచ్చామన్నారు. ఈ ఆసుపత్రికి అధిక శాతం పేదలు వస్తారని, వారికి మెరుగైన వైద్యసేవలు అందించాలని వైద్యులకు సూచించారు. సెక్యూరిటీ సిబ్బందికి సకాలంలో వేతనాలు ఇవ్వడం లేదని తరచూ ధర్నాలు చేస్తున్నారని, ఇలాంటి ఏజెన్సీలపై చర్యలు తీసుకునేలా నివేదికలు సిద్ధం చేసిస్తే ప్రభుత్వానికి నివేదిస్తామని తెలిపారు. ఆసుపత్రిలో జరిగే అభివృద్ధి పనుల్లో నాణ్యత తప్పకుండా ఉండాలన్నారు. కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైద్య,ఆరోగ్య రంగంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారన్నారు. ఈ శాఖను ఆయనే పర్యవేక్షిస్తారని తెలిపారు. ఆరోగ్యశ్రీ, 108, 104లకు పూర్వవైభవం తెచ్చేలా చర్యలు ఉంటాయన్నారు. అవినీతి రహిత పాలన దిశగా సీఎం కృషి చేస్తున్నారని, ఇందుకు అధికారులు, ఉద్యోగులు సహకరించాలని కోరారు. పెద్దాసుపత్రి అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ జె. సుధాకర్ మాట్లాడుతూ తనలాంటి సామాన్యునికి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ప్రజలకు సేవ చేసే భాగ్యం కల్పించారన్నారు. ఆయన ఆశయం మేరకు ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యసేవలు అందేలా కృషి చేస్తానన్నారు. ఏఎంసీలో ఐసీయూ మరింత అభివృద్ధి చెందాల్సి ఉందన్నారు. జిల్లా కలెక్టర్ ఎస్.సత్యనారాయణ మాట్లాడుతూ అవసరమైన వైద్యపరికరాలు, వసతులుంటే ఇలాంటి ఆసుపత్రిలో మరింత మెరుగైన వైద్యసేవలు అందించవచ్చని, ఈ మేరకు అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. అనంతరం 300లకు పైగా గుండెశస్త్రచికిత్సలు నిర్వహించిన సీటీ సర్జన్ డాక్టర్ ప్రభాకర్‌రెడ్డిని సన్మానించారు. కార్యక్రమంలో కర్నూలు మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ జీఎస్ రామప్రసాద్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పి.చంద్రశేఖర్, డీఎంహెచ్‌వో డాక్టర్ జేవీవీఆర్‌కె ప్రసాద్, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ భగవాన్, అనెస్తీషియా హెచ్‌వోడీ డాక్టర్ కైలాష్‌నాథ్‌రెడ్డి, న్యూరోసర్జరీ హెచ్‌వోడీ డాక్టర్ రామాంజులు, ఆర్థోపెడిక్ హెచ్‌వోడీ డాక్టర్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
ఆస్పత్రిలో కోల్డ్‌వార్ !
అనంతపురం న్యూసిటీ: అనంతపురం ప్రభుత్వ సర్వజనాస్పత్రి వైద్యుల మధ్య కోల్డ్‌వార్ నడుస్తోంది. ఈ ప్రభావం రోగులపై పడుతోంది. ఇందుకు నిదర్శనం ఆస్పత్రిలోని పల్మనరీ విభాగమే. ఈ విభాగంలో ఓ ప్రొఫెసర్, కిందిస్థాయి వైద్యుల మధ్య సమన్వయలోపంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకునే స్థాయికి దిగజారారు. దీంతో పాటు నర్సుల డ్యూటీల కేటాయింపులపై నర్సింగ్ సూపరింటెండెంట్ ఏకపక్షంగా వ్యవహరిస్తుండడంతో స్టాఫ్‌నర్సులు తలలుపట్టుకుంటున్నారు. ఇలా ఆస్పత్రిలో ఎవరికి వారు యమునా తీరే అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. ఇష్టారాజ్యం పల్మనరీ విభాగంలో ఓ ప్రొఫెసర్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. మూడ్రోజుల క్రితం ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్ సెలవు కోసం లిఖితపూర్వకంగా అడిగేందుకు వెళ్లారు. ఆ సమయంలోనే మరో వైద్యురాలు సెలవు కోసం ప్రొఫెసర్‌ను కోరారు. వైద్యురాలి సమక్షంలోనే అసిస్టెంట్ ప్రొఫెసర్‌ను హేళనగా మాట్లాడారు. ఇదే విషయమై సదరు వైద్యులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రొఫెసర్‌పై ఆర్ఎంఓకు ఫిర్యాదు చేశారు. ప్రొఫెసర్ ఐదు రోజుల క్రితం విధుల్లో ఉన్న స్టాఫ్‌నర్సుపై నోరుపారేసుకున్నారని తెల్సింది. రోగికి ట్రీట్మెంట్ ఇచ్చారా లేదా అని స్టాఫ్‌నర్సును నిలదీశారు. అందుకు స్టాఫ్‌నర్సు ‘సార్..తాను సెలవులో ఉన్నానని, నైట్ డ్యూటీ స్టాఫ్‌నర్సుతో మాట్లాడి విషయాన్ని చెబుతాన’ని సమాధానమిచ్చింది. దీనికి ప్రొఫెసర్ ‘బాగా స్టైల్‌గా, అతి తెలివితో సమాధానమిస్తావే’ అని స్టాఫ్‌నర్సును వ్యంగ్యంగా మాట్లాడారు. ప్రొఫెసర్ స్టాఫ్‌నర్సులు, హెడ్‌నర్సులను హేళన చేస్తూ మాట్లాడుతున్నారని, ఇదిలాగే కొనసాగితే తాము ధర్నా చేస్తామని నర్సింగ్ అసోసియేషన్ నాయకురాళ్లు ఆర్ఎంఓకు ఫిర్యాదు చేశారు. గ్రూపు రాజకీయాలు నర్సింగ్ రోస్టర్ విషయంలో ఓ నర్సింగ్ సూపరింటెండెంట్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఓ వర్గాన్ని ఏర్పాటు చేసుకుని వారికి ఇష్టమొచ్చినట్లు సెలవులు, విధులు కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది. కనీసం రోస్టర్ ప్రకారమైనా విధులు కేటాయిస్తారంటే అదీ లేదని స్టాఫ్‌నర్సులు వాపోతున్నారు. వంద మంది రోగులకు ఒక్కరు విధులు నిర్వర్తిస్తున్నా.. సెలవు కోసం వెళితే కనీస గౌరవం లేకుండా నర్సింగ్ సూపరింటెండెంట్ మాట్లాడుతున్నారని స్టాఫ్‌నర్సులు చెబుతున్నారు. గ్రేడ్ 1 నర్సింగ్ సూపరింటెండెంట్ ఉద్యోగ విరమణ పొందినప్పటి నుంచి స్టాఫ్‌నర్సులకు కేటాయిస్తున్న విధుల్లో పారదర్శకత లోపించిందని వాపోతున్నారు.ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన సూపరింటెండెంట్, ఆర్‌ఎంఓలు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
స్వీపర్లే.. స్టాఫ్‌నర్సులు
కోవెలకుంట్ల: స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో పనిచేస్తున్న స్వీపర్లు స్టాఫ్‌నర్సుల అవతారమెత్తారు. క్షతగాత్రులు, వివిధ సంఘటనల్లో గాయపడిన వ్యక్తుల చేయి కూడా ఇక్కడ పనిచేస్తున్న కొందరు స్టాఫ్ నర్సులు పట్టుకోకపోవడంతో అత్యవసర సేవలకు స్వీపర్లే దిక్కయ్యారు. కోవెలకుంట్ల సీహెచ్‌సీ ద్వారా మండలంతోపాటు సంజామల, ఉయ్యాలవాడ, దొర్నిపాడు మండలాలకు చెందిన రోగులకు ఓపీ, అత్యవసర వైద్య సేవలందాల్సి ఉంది. కోవెలకుంట్ల నుంచి నంద్యాల, ఆళ్లగడ్డ, జమ్మలమడుగు, కర్నూలు, అవుకు, తదితర ప్రధాన రహదారులు ఉండటంతో ఈ మార్గాల్లో తరుచుగా ప్రమాదాలు చోటు చేసుకుంటుండటంతో క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సీహెచ్‌సీకి తరలిస్తుంటారు. విలువైన ప్రాణాలతో చెలగాటం: రెండు రోజుల క్రితం సంజామలకు చెందిన ఓ వ్యక్తికి గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం సీహెచ్‌సీలో అత్యవసర చికిత్స విభాగానికి తరలించారు. ఇక్కడ పని చేస్తున్న నిర్మల జ్యోతి అనే స్టాఫ్‌నర్స్ నైట్ డ్యూటీ నిర్వహిస్తోంది. తలకు గాయమైన వ్యక్తికి స్టాఫ్‌నర్స్ వైద్య సేవలు అందించాల్సి ఉండగా గాయాన్ని పరిశీలించడంతోపాటు కట్టుకట్టే వరకు వైద్య చికిత్సలన్నీ అక్కడే ఉన్న స్వీపర్‌తో చేయించింది. గదిలో కూర్చున్న స్టాఫ్ నర్స్ చివరకు వచ్చి రెండు ఇంజక్షన్లు వేసి వెళ్లిపోయింది. అత్యవసర వైద్య చికిత్స విభాగం డాక్టర్‌తోపాటు స్టాఫ్‌నర్స్ వైద్యసేవలందించాల్సి ఉంది. కాని డాక్టర్ అందుబాటులో లేకపోగా ఉన్న స్టాఫ్‌నర్సు వైద్యసేవలందించకపోవడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. ఈ ఒక్క బాధితుడికే కాదు ప్రతి రోజు ఆసుపత్రికి వచ్చే బాధితులకు ఇలాగే జరుగుతోందని పలువురు ఆరోపిస్తున్నారు. శరీర అవయవాలకు గాయాలై ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తులకు సకాలంలో వైద్య సేవలందించి ప్రాణభిక్ష పెట్టాల్సిన వైద్య సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యం చేస్తుండటంతో వచ్చిరాని వైద్యంతో స్వీపర్లు రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. సంబంధిత ఉన్నతాధికారులు విధుల పట్ల నిర్లక్ష్యం చేస్తున్న సిబ్బందిపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. ఈ విషయంపై సీహెచ్‌సీ ఇన్చార్జ్ డాక్టర్ జఫురుల్లాను వివరణ కోరగా స్వీపర్లు వైద్య సేవలందిస్తున్న సంఘటనపై విచారణ జరిపి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. -
ప్రత్యక్ష నరకం!
అనంతపురం న్యూసిటీ: ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో గురువారం రోగులు ప్రత్యక్ష నరకం అనుభవించారు. విద్యుత్ సరఫరా ఆగిపోవడంతో ఉక్కిరిబిక్కిరయ్యారు. పురి టిశాలలో రోగులు, గర్భిణులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గాలివాన బీభత్సంతో వేకువజామున 3 గంటల నుంచి సాయంత్రం 5 వరకు విద్యుత్ సరఫరా పూర్తి స్థాయిలో జరగలేదు. అత్యవసర ఆపరేషన్లు మినహా అన్ని ఆపరేషన్లను వైద్యులు వాయిదా వేశారు. ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాల్సిన యాజమాన్యం ప్రేక్షకపాత్ర వహించిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉన్న జనరేటర్లతో కొన్ని వార్డులకు కొంతసేపు.. మరికొన్ని వార్డులకు కాసేపు కరెంటు సరఫరా చేశారు. గర్భిణుల అవస్థలు వర్ణనాతీతం విద్యుత్ సరఫరా ఆగిపోవడంతో అక్యూట్ మెడికల్ కేర్ (ఏఎంసీ), పురిటిశాల (లేబర్‌వార్డు)లో రోగులు, గర్భిణుల అవస్థలు వర్ణనాతీతంగా మారాయి. పురిటిశాలలోని టేబుల్స్‌పై గర్భిణులు ప్రసవం పొందే సమయంలో ఒక్కసారిగా కరెంటు పోయింది. దీంతో డ్యూటీ వైద్యులు, హౌస్ సర్జన్లు సెల్ టార్చ్ వేసి ప్రసవాలు చేశారు. ఇక సిజేరియన్ల పరిస్థితి దేవునికెరుక. ఎప్పుడెప్పుడు కరెంటు వస్తుందా అంటూ వేచి ఉండాల్సి వచ్చింది. ఎమర్జెన్సీ ఆపరేషన్ థియేటర్లో సిజేరియన్ల కోసం వైద్యులు గంటల తరబడి వేచి ఉన్నారు. ఆర్ఎంఓ డాక్టర్ లలితకి చాలాసార్లు ఫోన్ చేసి విద్యుత్ సరఫరా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. చివరకు జనరేటర్ సహాయంతో కరెంటు సరఫరా అందించడంతో గైనిక్ వైద్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఏఎంసీలో వెంటిలేటర్‌పై రెండు కేసులు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాయి. బ్యాటరీ బ్యాక్అప్ ఉండడంతో ఎటువంటి ప్రాణహాని జరగలేదు. ఏఎంసీ వైద్యులు ఎప్పుడెప్పుడు ఏం జరుగుతుందోనని భయాందోళన చెందారు. జనరేటర్‌తో సేవలు ఆస్పత్రిలో వేకువజాము నుంచి విద్యుత్ లేదు. జనరేటర్ల సహాయంతో వార్డులకు కొంత కొంత సేపు సేవలందించాం. అత్యవసరం మినహా మిగతా ఆపరేషన్లు వాయిదా పడ్డాయి.– డాక్టర్ లలిత, ఆర్ఎంఓ -
సర్వజన ఆస్పత్రిలో బాలింత మృత్యువాత
నెల్లూరు(బారకాసు): నెల్లూరు నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ఉన్న ఎంసీహెచ్ బ్లాక్‌లో మంగళవారం బాలింత మృతిచెందింది. మృతికి డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమని ఆమె కుటుంబసభ్యులు ఆరోపిస్తుండగా, వైద్యులు హై బీపీ కారణంగానే బాలింత చనిపోయిందని చెబుతున్నారు. కాగా మృతురాలి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులోని వివరాల మేరకు.. కోవూరు మండలంలోని వేగూరు పంచాయితీలో ఉన్న సీతారామపురం గ్రామానికి చెందిన గుంటి రాజమ్మ (19)కు నెల్లూరుకు చెందిన బాలరాజుతో వివాహమైంది. అతను కొయ్య పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. రాజమ్మ గర్భం దాల్చడంతో రెండునెలలపాటు ప్రైవేట్ హాస్పిటల్లో చూపించారు. తర్వాత నుంచి ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలోని ఎంసీహెచ్‌లో చూపిస్తున్నారు. ఆమెకు ఏడో నెల వచ్చే సరికి బీపీ అధికంగా ఉందని ఆస్పత్రిలో చేర్చాలని వైద్యులు సూచించారు. దీంతో 9 రోజుల క్రితం రాజమ్మను ఆస్పత్రిలో చేర్పించారు. కాన్పు చేయగా.. బీపీ నియంత్రణలో లేకపోవడంతో వెంటనే ఆపరేషన్ చేసి కాన్పు చేయకపోతే తల్లీబిడ్డకు ప్రమాదమని, మెరుగైన వైద్యం కోసం తిరుపతిలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రికైనా తీసుకెళ్లాలని వైద్యులు ఆమె కుటుంబ సభ్యులకు తెలియజేశారు. వారు తాము తిరుపతికి వెళ్లలేమని ఇక్కడే వైద్యం చేయండని చెప్పడంతో డాక్టర్లు రాజమ్మకు సోమవారం ఆపరేషన్ చేసి కాన్పు చేశారు. పుట్టిన ఆడశిశువు నెలలు, బరువు తక్కువ కారణంగా ప్రత్యేక వార్డులోని బాక్సులో ఉంచి వైద్యం అందిస్తున్నారు. అయితే మంగళవారం రాజమ్మకు బీపీ మరింత అధికమై మృతిచెందినట్లు వైద్యులు చెబుతున్నారు. మృతురాలి కుటుంబసభ్యులు వైద్యుల నిర్లక్ష్యం కారణంగా రాజమ్మ చనిపోయిందని ఆరోపిస్తున్నారు. దర్గామిట్ట పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆస్పత్రికి వెళ్లి వివరాలు సేకరించారు. కారణం చెప్పాలంటూ.. రాజమ్మ మృతికి కారణాలు చెప్పాలంటూ మృతురాలి కుటుంబసభ్యులు ఆస్పత్రి ఎదుట నిరసనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని దీనిపై దర్యాప్తు చేస్తామని వారికి చెప్పారు. మృతికి గల కారణం చెబితేనే ఇక్కడి నుంచి వెళతామని రాజమ్మ కుటుంబసభ్యులు భీష్మించుకున్నారు. ఈ క్రమంలో కొంతసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ ఘటనపై ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాసరావును వివరణ కోరగా రాజమ్మకు హై బీపీ ఉందన్నారు. అందుకు అవసరమైన వైద్యం అందించినట్లు చెప్పారు. అయినా బీపీ కంట్రోల్ కాకపోవడంతో ఆమె మృతిచెందినట్లు తెలియజేశారు. పూర్తిస్థాయిలో నివేదికను తయారుచేసి సంబంధిత ఉన్నతాధికారులకు నివేదిస్తామని తెలిపారు. వారి ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. -
పెద్ద దిక్కు.. మూడేళ్ల చిక్కు!
ప్రాణమ్మీదికి వచ్చి పరుగుపరుగున సర్వజనాస్పత్రికి వెళ్తే.. వైద్యులు చూసేలోపే ప్రాణం పోయేలా ఉంది. వైద్యం సంగతి దేవునికెరుక.. కనీసం తాగేందుకు నీళ్లు కూడా కరువే. మండు వేసవిలోనూ విద్యుత్ సమస్యలతో రోగులు ఉక్కపోతతో నరకం చూస్తున్నారు. పర్యవేక్షణ లేక.. పట్టించుకోవాల్సిన అధికారి స్వార్థం చూసుకోగా.. కొందరు వైద్యులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. అంతిమంగా రోగుల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. గతంలో చిన్నపాటి ఇబ్బందులు తలెత్తితేనే ధర్నాలు చేసే ప్రజాప్రతినిధులు కానీ.. జిల్లా పాలనా వ్యవహారాలు చూడాల్సిన కలెక్టర్ కానీ ఇటువైపు కన్నెత్తిచూడకపోవడం రోగుల పాలిట శాపంగా మారింది. అనంతపురం న్యూసిటీ: సర్వజనాస్పత్రి.. జిల్లాకే పెద్దదిక్కు. అందుకే పేదోళ్లకు ఏ ఆరోగ్య సమస్య తలెత్తినా ఇక్కడికే పరుగున వస్తారు. కానీ ఇక్కడి ఉన్నతాధికారి నిర్లక్ష్యం.. రోగుల ప్రాణాలమీదకు తెస్తోంది. టీడీపీ నేతల సిఫారసుతో నిబంధనలకు విరుద్ధంగా ఆస్పత్రిలోని కీలకమైన సూపరింటెండెంట్ సీట్లో కూర్చున్న డాక్టర్ జగన్నాథ్.. తన స్వార్థంమాత్రమే చూసుకుంటున్నారు. ఫలితంగా పాలన గాడి తప్పింది. ఆస్పత్రి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అవినీతి, అక్రమాలు పెరిగిపోగా.. రోగులకు కనీస సౌకర్యాలు కరువయ్యాయి. ఇదే అదనుగా కొందరు వైద్యులు అండిదే ఆట, పాడిందే పాటగా వ్యవహారం సాగుతోంది. నిబంధనలకు విరుద్ధంగా డాక్టర్ జగన్నాథ్‌కు సూపరింటెండెంట్‌గా కీలక బాధ్యతలు అప్పగించడంతోనే తాజా పరిస్థితికి కారణంగా తెలుస్తోంది. బోధనాస్పత్రిలో ప్రొఫెసర్‌గా పనిచేయడంతో పాటు 5 ఏళ్ల పాటు టీచింగ్ అనుభవం ఉన్న వారు మాత్రమే సూపరింటెండెంట్ పోస్టుకి అర్హులు. కానీ జగన్నాథ్ విషయంలో ఇవేమీ పట్టించుకోలేదు. జిల్లాకు చెందిన ఓ టీడీపీ నేత సిఫారసుతో ఆయనన్ను సూపరింటెండెంట్‌గా నియమించినట్లు సమాచారం. స్తంభించిన పాలన ఆస్పత్రి సూపరింటెండెంట్(ఎఫ్ఏసీ)గా డాక్టర్ జగన్నాథ్ 2017 మే 2న బాధ్యతలు చేపట్టారు. మూడేళ్లుగా ఆయన కీలక పోస్టులో కొనసాగుతున్నారు. కానీ ఆస్పత్రి వ్యవహారాలు మాత్రం గాలికి వదిలేశారు. ఛాంబర్ దాటి బయటకు రాకపోవడంతో వార్డుల్లో వైద్యసేవలు అంతంతమాత్రంగా అందుతున్నాయి. ఇక ఆస్పత్రికి వచ్చే రోగులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో యాజమాన్యం పూర్తిగా విఫలమైందనే విమర్శలు సరేసరి. తాగునీరు లేక రోగులు నిత్యం నరకం చూస్తున్నారు. కాలకృత్యాలు తీర్చుకునేందుకు బాత్రూంలు సరిగా లేని పరిస్థితి. ఇక రేడియాలజీ, కంటి విభాగంలో విద్యార్థులు రోగుల ప్రాణాలతో ఆటలాడుతున్నారు. ఈసీజీ, ఎక్స్‌రే, మందులిచ్చే ప్రాంతాల్లో అనర్హులతో పనులు చేయిస్తున్నారు. ఎలక్ట్రిషియన్లు ఈసీజీ, ఎక్స్‌రే టెక్నీషియన్లుగా, అటెండర్లు మందులిచ్చే దారుణమైన పరిస్థితి ఆస్పత్రిలో చోటు చేసుకుంది. వీరందరికీ పోస్టులు పురమాయించిన ఘనత కూడా డాక్టర్ జగన్నాథ్‌కే దక్కింది. అక్రమాలకు నిలయం సర్వజనాస్పత్రి అవినీతి అక్రమాలకు నిలయంగా మారింది. అడిగేవారు లేరన్న ధీమాతో ఇక్కడ కొందరు ఉన్నతాధికారులు, వైద్యులు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. ఎలాంటి ఆరోగ్య సమస్య లేకున్నా... ఆస్పత్రిలోని ప్రిజన్స్ వార్డులో ఓ ఖైదీని ఏకంగా రెండు నెలల పాటు అడ్మిషన్లో ఉంచారు. ఇందుకుగానూ సదరు ఖైదీ నుంచి రూ.లక్షలు తీసుకున్నట్లు ఆరోపణలు వినిపించాయి. దీనిపై ఏప్రిల్ 18న ‘సాక్షి’లో నిబంధనలకు ‘ఖైదు’ శీర్షికన కథనం ప్రచురితమైంది. అయినా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జగన్నాథ్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆస్పత్రిలో ఓపీ, ఐపీ నిర్వహణ బాధ్యతను ఓ కీలక అధికారి ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించారు. దీనిపై ఏప్రిల్ 24న ‘కాంట్రాక్ట్ జగన్నాథునికెరుక’ శీర్షికన ‘సాక్షి’ కథనం ప్రచురితమైంది. దీనిపైనా యాజమాన్యం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇక ఆఫీసు కార్యాలయంలో పైసలివ్వందే ఫైలు కదలని పరిస్థితి. కొందరు ఎంఎన్ఓల పదోన్నతుల విషయంలో రూ.లక్షలు మారాయన్న ఆరోపణలున్నాయి. ఇక సిటీ స్కాన్ నిర్వాహకులు ప్రత్యేక మీటర్ వేసుకోకుండా ఆస్పత్రి కరెంటునే వాడుకుంటున్నారు. వారిపైనా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. రూ. కోట్లతో నిర్మించిన ఎస్ఆర్ క్వార్టర్స్‌లో ప్రైవేట్ వ్యక్తులు తిష్టవేసినా..ఇంత వరకు ఖాళీ చేయించలేదు. రోగులకు ప్రత్యక్ష నరకం పట్టించుకునే వారులేక.. కనీస సౌకర్యాలు లేక.. సకాలంలో వైద్యసేవలందక సర్వజనాస్పత్రిలో రోగులు ప్రత్యక్ష నరకం చూస్తున్నారు. రేడియాలజీ, కంటి తదితర విభాగాల్లోని వైద్యులు రోగుల ప్రాణాలతో ఆటలాడుతున్నారు. రేడియాలజీ విభాగంలో విద్యార్థులతో పనులు చేయిస్తున్నారు. ఈ క్రమంలోనే ఏప్రిల్ 24న ‘రేడియాలేజీ’ అన్న శీర్షికతో ‘సాక్షి’ కథనం ప్రచురించింది. ఇదే నెలలో కంటి విభాగంలో ఓ విద్యార్థితో సిరంజ్ పనులు చేయిస్తున్నారు. ఇక వైద్యం కోసం ఆస్పత్రికి వచ్చే మహిళల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. వాడుకునేందుకు నీళ్లు లేక.. మరుగుదొడ్లకు తాళం వేయడంతో వారి బాధలు వర్ణించడానికి వీలు కాని విధంగా ఉన్నాయి. సర్వజనాస్పత్రిలో నెలకొన్న ఈ దుస్థితిపై ఈ నెల 10న ‘జగన్నాథ..మేలుకో’ అన్న శీర్షికన ‘సాక్షి’ కథనం ప్రచురించింది. మహిళలే యూరినల్స్ పరీక్షలు చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొన్న వైనాన్ని ఎండగట్టింది. ఇక వార్డుల్లో నీళ్లు సరఫరా కాక మరుగుదొడ్లకు తాళం వేయగా.. కాలకృత్యాలు తీర్చుకోవడం కోసం మహిళలు ఇతర వార్డులకు పరుగులు తీస్తున్నారు. ఇలా రోజూ ఓ సమస్యతో రోగులు ప్రత్యక్ష నరకం చూస్తున్నా.. పట్టించుకోవాల్సిన సూపరింటెండెంట్ చోద్యం చూస్తూ గడిపేస్తుండటం గమనార్హం. వీళ్లనెందుకు పరిగనలోకి తీసుకోరూ.. బోధనాస్పత్రిలో జగన్నాథ్ కంటే సీనియర్లు 8 నుంచి 10 మంది ఉన్నారు. గతంలో సూపరింటెండెంట్‌గా పనిచేసిన వెంకటేశ్వరరావుతో పాటు, నవీన్‌కుమార్, మైరెడ్డి నీరజ, రామస్వామినాయక్‌తో పాటు మరికొందరున్నప్పటికీ సూపరింటెండెంట్‌గా వీరిని పరిగన లోకి తీసుకోవడం లేదు. సూపరింటెండెంట్‌గా దర్జా వెలగబెట్టే జగన్నాథ్..మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) పర్యటనకు రాగానే జారుకుంటారు. ఆయన స్థానంలో ఇన్చార్జి హోదాలో నవీన్కుమారే బృందం సభ్యుల వెంట ఉంటూ ఆస్పత్రి సేవల గురించి వివరిస్తారు. 22వైద్య కళాశాల,బోధనాస్పత్రి విభాగాలు 19ప్రొఫెసర్లు 10ఐదేళ్ల అనుభవంకలిగిన ప్రొఫెసర్లు 3నిబంధనలకు విరుద్ధంగా డాక్టర్ జగన్నాథ్ సూపరింటెండెంట్ సీటులో కొనసాగుతున్న సంవత్సరాలు -
యూరిన్ పరీక్షలు సొంతంగా చేసుకోవాల్సిందే..
ఈ ఫొటోను చూడండి. గైనిక్ ఓపీ లేబొరేటరీ ఎదుట ఈ మహిళ ప్రెగ్నెన్సీ స్ట్రిప్‌తో సొంతంగా పరీక్ష చేసుకుంటోంది. వాస్తవంగా గర్భం దాల్చారా? లేదా? అనే విషయమై గైనిక్ వైద్యులు యూరిన్ పరీక్షకు రెఫర్ చేస్తారు. ల్యాబ్ సిబ్బంది యూరిన్ సేకరించి పరీక్ష నిర్వహించాల్సి ఉంది. కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తే ఆసుపత్రిలో దిగజారిన వైద్య సేవలకు అద్దం పడుతోంది. అనంతపురం న్యూసిటీ: ప్రభుత్వ సర్వజనాసుపత్రిలో సేవలు నానాటికీ దిగజారుతున్నాయి. నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించాల్సిన ఆసుపత్రిలో అడుగడుగునా నిర్లక్ష్యమే. ప్రధానంగా గైనిక్ ఓపీ, పోస్టునేటల్ వార్డులో గర్భిణిలు, బాలింతలు ప్రత్యక్ష నరకం చూస్తున్నారు. ఎంతలా అంటే.. యూరిన్ పరీక్షలు కూడా సొంతంగా చేసుకోవాల్సిన దయనీయ పరిస్థితి నెలకొంది. ఇక బాలింతల బాత్రూంలు శుభ్రపరిచే ఓపిక లేక ఏకంగా తాళాలు వేయడం గమనార్హం. ఈ కారణంగా అత్యవసర సమయంలో బాలింతలు ఇతర వార్డులకు పరుగు తీయాల్సి వస్తోంది. ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే గైనిక్ సేవలు ఈ స్థాయికిదిగజారినట్లు తెలుస్తోంది. మహిళా రోగులకు సర్వజనాస్పత్రిలో అందుతున్న సేవలను పరిశీలిస్తే ఈ సమాజం ఎటువైపు పయనిస్తోందనే అనుమానం కలుగక మానదు. మహిళ గర్భం దాల్చిందా? లేదా? అనేందుకు నిర్వహించే పరీక్షలను చూస్తే ప్రభుత్వాసుపత్రుల పరువు నానాటికీ ఎందుకు దిగజారుతుందో అర్థమవుతుంది. సిబ్బంది చేయాల్సిన పరీక్షలను, ఆసుపత్రికి వచ్చే మహిళల చేతనే చేయిస్తున్నారు. ఎదురు సమాధానం చెప్పలేక.. మహిళలు, గర్భిణిలు ఓపీ ముందే యూరిన్ పరీక్షలు సొంతంగా చేసుకుంటున్న దృశ్యాలు ఇక్కడ నిత్యకృత్యం. ఇదేమిటని ఎవరైనా ల్యాబ్ సిబ్బందిని ప్రశ్నిస్తే చీవాట్లు తప్పడం లేదు. ఈ పరిస్థితుల్లో ఎవరికి వారు పరీక్షలు నిర్వహించుకొని తిరిగి వైద్యులను కలుస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఆసుపత్రి సూపరింటెండెంట్ జగన్నాథ్‌కు చీమ కుట్టినట్లయినా లేకపోవడం గమనార్హం. బాత్రూంలకు తాళాలు బాత్రూం కష్టాలతో బాలింతలు చుక్కలు చూడాల్సి వస్తోంది. పోస్టునేటల్ వార్డుకి చెందిన మరుగుదొడ్డికి తాళం వేయడంతో కాలకృత్యాలు తీర్చుకోలేని పరిస్థితి నెలకొంది. అసలే మంచానికి ఇద్దరు, ముగ్గురు ఇరుక్కుంటున్నారు. ఈ పరిస్థితుల్లో బాత్రూంకు తాళం వేయడంతో యాంటీనేటల్ వార్డుకు పరుగు తీస్తున్నారు. ఇటీవల ఓ బాలింత కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లి కళ్లు తిరిగి పడిపోయింది. స్టాఫ్ నర్సులు గమనించి సెక్యూరిటీ సాయంతో వార్డుకు తరలించారు. ఇంతకన్నా దారుణమైన పరిస్థితి మరొకటి ఉంటుందా? అనే చర్చ ఆసుపత్రిలో జరుగుతోంది. కలెక్టర్ గారూ.. చూస్తున్నారా! నిరుపేద కుటుంబం నుంచి కలెక్టర్‌గా ఎన్నికైన వీరపాండియన్ కూడా ఆసుపత్రిలోని వైద్య సేవల విషయంలో అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తుండటం విమర్శలకు తావిస్తోంది. ఆసుపత్రిలో దిగజారిన వైద్య సేవల విషయమై ‘సాక్షి’ వరుస కథనాలను ప్రచురిస్తోంది. ఇంత జరుగుతున్నా సూపరింటెండెంట్‌కు వత్తాసు పలుకుతున్న తీరు విమర్శలకు తావిస్తోంది. కనీసం ఆసుపత్రి వైపు కన్నెత్తి కూడా చూడకపోవడం చూస్తే నిరుపేదలకు అందుతున్న వైద్యంపై కలెక్టర్‌కు ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తోంది. చీదరించుకుంటున్నారు యూరిన్ పరీక్ష కోసం గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. తీరా మా కోడలు నర్మదాకి కంటైనర్, స్ట్రిప్ ఇచ్చారు. ఇదేమిటని అడిగితే మీరే యూరిన్ పట్టుకుని, స్ట్రిప్ అందులో అద్ది తీసుకురమ్మన్నారు. మీరు పరీక్ష చేయరా? అని అడిగితే చీదిరించుకున్నారు. గర్భిణీలన్న దయ కూడా లేదు. ప్రభుత్వాసుపత్రిలోనే పరిస్థితి ఇలా ఉంటే ఎలా?– లక్ష్మిదేవి, నాల్గవ రోడ్డు, అనంతపురం -
ఏదైనా వారం తర్వాతే..
అనంతపురం న్యూసిటీ: వైద్యులను దేవుళ్లతో సమానంగా చూస్తారు. కానీ ప్రాణం పోయాల్సిన వైద్యులే...రోగుల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. సర్వజనాస్పత్రికొచ్చే వారికి బతికుండగానే నరకం చూపుతున్నారు. పట్టించుకోవాల్సిన ఉన్నతాధికారులు ఛాంబర్లతో పరిమితం కాగా..నిరుపేద రోగులు పడరాని పాట్లు పడుతున్నారు. ముఖ్యంగా రేడియాలజీ విభాగంలోని వైద్యుల నిర్లక్ష్యం..రోగుల ప్రాణం మీదకు తెస్తోంది. ఎమర్జెన్సీ కేసులకు కూడా వాయిదా వేస్తుండటంతో... సదరు రోగిని పరీక్షించిన వైద్యులే కలుగజేసుకుని స్కాన్ చేసి పంపాలని బతిమాడాల్సిన పరిస్థితి నెలకొంది. అయినప్పటికీ ‘‘ఇవాల్టికి ఇంతే.. మీరు పది రోజుల తర్వాత రండి’’ అంటూ రేడియాలజీ విభాగంలోని వైద్యులు తెగేసి చెబుతున్నారు. దీంతో అమాయక రోగులు తమ బాధను ఎవరికి చెప్పుకోలేక దేవుడా ఇదేం ఖర్మయ్యా అంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు. ఎవరు చెప్పినా పట్టించుకోరు ఆస్పత్రిలోని రేడియాలజీ విభాగంలోని వైద్యులకు రోగుల ప్రాణాలంతే లెక్కేలేకుండా పోయింది. వారికి ఓపిక ఉంటేనే ఇక్కడ సేవలందుతాయి. మెడిసిన్, సర్జరీ, ఆర్థో, గైనిక్ తదితర వైద్యులు ప్రిస్కిప్షన్‌పై స్కాన్ చేయాలని రాసినా... వారు పట్టించుకోరు. అడ్మిషన్లో ఉన్న కేసులను వెనక్కి పంపుతున్నారు. దీంతో చాలా మంది రోగులు ప్రైవేటు బాట పట్టి జేబులకు చిల్లు పెట్టుకుంటున్నారు. ఎఫ్ఎస్ 4లో అడ్మిషన్లో ఉన్న 10 ఏళ్ల వసంతలక్ష్మికి వైద్యులు అల్ట్రాసౌండ్ స్కాన్ రెఫర్ చేశారు. కానీ రేడియాలజిస్టు ఈ నెల 24వ తేదీ రావాలని చెప్పారు. దీంతో ఆ పాప అవ్వ ‘‘అయ్యా మీకు పుణ్యముంటుంది. ఆ పరీక్ష చేస్తే ఆపరేషన్ చేస్తారని డాక్టరమ్మ చెప్పింది..కొంచెం త్వరగా చూడయ్యా’’ అని సిబ్బందిని వేడుకోగా..9వ తేదీ రావాలని చెప్పారు. 10 నిమిషాల్లో చేసే పనికి కూడా 10 రోజుల తర్వాత రావాలని చెబుతుండటంతో ఆస్పత్రిలో ఉండలేక రోగులు, వారి బంధువులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ స్ట్రెచర్‌పై పడుకున్న వ్యక్తి పేరు గోపాల్. సీకేపల్లి మండలం ముష్టికోవెల. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రిలోని ఎంఎం వార్డులో చేరారు. గోపాల్‌ను పరీక్షించిన ఓ అసోసియేట్ ప్రొఫెసర్ త్వరగా అల్ట్రాస్కౌండ్ స్కాన్ చేయించాలని.....కేస్ షీట్‌పై ఎమర్జెన్సీ అని రాసి పంపారు. దీంతో గోపాల్ కుమారులు అతన్ని అల్ట్రాసౌండ్ స్కాన్‌కి తీసుకువెళ్లారు. అక్కడి వైద్యులు ఈ రోజు కాదని చెప్పారు. దీంతో వారు తండ్రిని తీసుకుని వార్డుకు వెళ్లగా.. అక్కడి వైద్యుడు ‘ఇది అర్జెంటయ్యా తొందరగా స్కానింగ్ చేయించండి’’ అని చెప్పారు. మరోసారి గోపాల్‌ను తీసుకుని వెళ్లినా.. పరిస్థితి వివరించినా రేడియాలజీ వైద్యులు పట్టించుకోలేదు. దీంతో వారు ఆర్ఎంఓ డాక్టర్ జమాల్బాషాకి ఫిర్యాదు చేశారు. అక్కడే ఉన్న అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ వీరభద్రయ్య సైతం గోపాల్ పేగుకి రంధ్రం పడిందని, త్వరగా స్కాన్ చేయించాలని ఆర్‌ఎంఓకి చెప్పారు. చివరకు ఆర్ఎంఓ రేడియాలజీ విభాగం హెచ్ఓడీ డాక్టర్ రాజేంద్రనాయుడికి ఫోన్ చేసి సమస్యను వివరించగా..ఆయన అప్పుడు కరుణించి అల్ట్రాసౌండ్ స్కాన్ చేశారు. సర్వజనాస్పత్రిలోని రేడియాలజీలో అందుతున్న సేవలకు ఇదో ఉదాహరణ మాత్రమే. -
ఎలక్ట్రీషియన్లతో రోగులకు సేవలు
ఈ చిత్రంలో అక్యూట్ మెడికల్ కేర్ యూనిట్(ఏఎంసీ)లో ప్రాణాపాయస్థితిలో ఉన్న రోగికి ఈసీజీ తీస్తున్న వ్యక్తి పేరు సుధాకర్. ఈయన వాస్తవానికి ఎలక్ట్రీషియన్ ఈసీజీ తీసేందుకు ఎలాంటి అర్హత లేకయినా ఆస్పత్రి యాజమాన్యం ఆయనకే బాధ్యతలు అప్పగించడం విమర్శలకు తావిస్తోంది. ఈ చిత్రాన్ని చూడండి.ఆస్పత్రిలోని రేడియాలజీ విభాగంలోని డార్క్ రూంలో విధులు నిర్వర్తిస్తున్న ఈ వ్యక్తి పేరు సురేష్. ఈయన కూడా ఎలక్ట్రీషియనే. కానీ కొన్ని నెలల క్రితం ఆస్పత్రి సూపరింటెండెంట్ ఈయన విధులను మార్చారు. అనంతపురం న్యూసిటీ: సర్వజనాస్పత్రిలో సూపరింటెండెంట్ డాక్టర్ జగన్నాథ్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అత్యంత కీలక పోస్టులో ఉన్న ఆయన కొందరి సిబ్బంది విధులు మార్చడం వివాదాస్పదంగా మారింది. ముఖ్యంగా ఎలక్ట్రీషియన్లతో రోగులకు సేవలందించే పనులు చేయించడం చర్చనీయాంశంగా మారింది. ఎలక్ట్రీషియన్లు పూర్తీ స్థాయి పని చేయకపోవడంతో రోగులకు కరెంటు కష్టాలు తప్పడం లేదు. ఆస్పత్రిలో కరెంటు కష్టాలు.. సర్వజనాస్పత్రిలో ఔట్సోర్సింగ్ కింద ఇద్దరు ఎలక్ట్రీషియన్లు 19 ఏళ్లుగా పని చేసేవారు. వీరిద్దరినీ ఆ విధుల నుంచి తప్పించి ఇతర బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం ముగ్గురు ఎలక్ట్రీషియన్లు దిన కూలీలుగా పని చేస్తున్నారు. అయితే వారు రౌండ్ ద క్లాక్ అందుబాటులో ఉండటం లేదు. అందులోనూ ఆస్పత్రిపై పూర్తీ స్థాయిలో అవగాహన లేదు. చెడిపోయిన ఫ్యాన్లు, లైట్లను ఎప్పటికప్పుడు రిపేరీ చేయాల్సిన ఉన్నా అవేమీ పట్టించుకోవడం లేదు. దీంతో గైనిక్, లేబర్, పోస్టునేటర్, సర్జరీ, మేల్, ఫీమేల్ హౌస్‌సర్జన్ హాస్టళ్లలో రోగులు, వైద్యులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. వారం రోజుల క్రితం కరెంటు పోతే సకాలంలో స్పందించి జనరేటర్ కూడా వేయలేని స్థితిలో ఎలక్ట్రీషియన్లున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. నిద్రమత్తులో జిల్లా అధికార యంత్రాంగం ఆస్పత్రిలో రోజుకో అడ్డగోలు బాగోతం బయటపడుతున్నా జిల్లా అధికార యంత్రాంగం నిద్రమత్తులో ఉందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పరిపాలన స్తంభించి తాము ప్రత్యక్ష నరకం చూస్తున్నా పట్టించుకోవడం లేదని రోగులు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. సమస్యగా ఉంటే మార్చా సుధాకర్‌కు ఎలక్ట్రీషియన్ పని చేతకాదు. ఉద్యోగంలో చేరే సమయంలో ఎటువంటి సర్టిఫికెట్లు పొందుపర్చాడో అర్థం కావడం లేదు. ఈసీజీ ట్రైనింగ్ ఇచ్చి పని చేయిస్తున్నా. ఇక సురేష్ ఆరోగ్యం బాగోలేదని చెప్పడంతో మానవతా దృక్పథంతో మార్చా. అందుబాటులో ఉన్న వారితో పని చేయిస్తున్నాం.– డాక్టర్ జగన్నాథ్(ఆస్పత్రి సూపరింటెండెంట్) -
సర్వ'జల' ఘోష
ఎండలు మండిపోతున్నాయి...అరగంటకోసారి నీరు తాగినా దాహం తీరడం లేదు. కానీ జిల్లాకే పెద్దదిక్కయిన సర్వజనాస్పత్రిలో తాగేందుకు నీళ్లు దొరకడం లేదు. దీంతో దాదాపు 2,500 మంది రోగులు...వారికి సేవలందిస్తున్న 500 మంది సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగులు ఇళ్లనుంచే బాటిళ్లలో నీరు తెచ్చుకుని 8 గంటల పాటు వాటినే పొదుపుగా వాడుకుంటుండగా...రోగులు, వారి బంధువులు తాగునీటి కోసం పడరాని పాట్లు పడుతున్నారు. ఇది సర్జికల్ వార్డులోని దృశ్యం...ఇక్కడ తాగునీటి సౌకర్యం లేక వార్డులో విధులు నిర్వర్తిస్తున్న హౌస్‌సర్జన్, స్టాఫ్‌నర్సులు ఇంటి వద్ద నుంచే వాటర్ బాటిళ్లలో నీరు తెచ్చుకుంటున్నారు. ఆ నీరు అయిపోతే ఇక డ్యూటీ అయ్యే వరకు వేచి ఉండాల్సిందేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈచిత్రంలోని వృద్ధురాలి పేరు లక్ష్మక్క. కూడేరు మండలం కరుట్లపల్లి. ఎఫ్ఎం వార్డులో అడ్మిషన్లో ఉంది. అక్కడ వాటర్ ప్లాంట్ పని చేయకపోవడంతో తాగునీటి కోసం ఎంఎం వార్డు వద్దకు వచ్చింది అక్కడా లేవు. దీంతో చిన్నపిల్లల వార్డు, ఆర్థో వార్డు..ఇలా వార్డులన్నీ తిరిగి చివరకు సూపరింటెండెంట్ కార్యాలయం పక్కనే ఉన్న వాటర్ ప్లాంట్ వద్దకు వచ్చింది. అక్కడా నీళ్లు రాకపోవడంతో...ఆవేదన వ్యక్తం చేసింది. ఇంత పెద్ద ఆస్పత్రిలో తాగేందుకు నీళ్లు కూడా లేవయ్యా అంటూ నిట్టూర్చింది. ఈ కష్టం లక్ష్మక్కది మాత్రమే కాదు...ఆస్పత్రిలో వస్తున్న వారిదీ..ఇక్కడ పనిచేసే ఉద్యోగులందరిదీ. అనంతపురం న్యూసిటీ: సర్వజనాస్పత్రిలో వైద్యులు, సిబ్బంది, రోగులకు కన్నీటి కష్టాలు తప్పడం లేదు. వైద్యం మాట దేవుడెరుగు..కనీసం తాగునీటి సౌకర్యం కూడా లేకపోవడంతో రోగులపాటు రోజూ 3 వేల మంది సేవలందించే ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, స్టాఫ్‌నర్సులు తీవ్ర ఇబ్బందిపడుతున్నారు. ఆస్పత్రి అభివృద్ధి పేరుతో రూ. కోట్లు ఖర్చు చేస్తున్న ఉన్నతాధికారులు కనీసం తాగునీరు కూడా ఏర్పాటు చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. వాటర్ ప్లాంట్లు రిపేరీ ఆస్పత్రిలో మొత్తం 10 వాటర్ ప్లాంట్లున్నాయి. అందులో రెండు మినహా మిగితావి పని చేయడం లేదు. దీంతో రోగులు ఆస్పత్రి ఆవరణలో ఉండే వాటర్ ప్లాంట్ వద్దకు వస్తున్నారు. ఆ వాటర్ ప్లాంట్లు కూడా సమయపాలనతో నడుపుతున్నారు. దీంతో ఉదయం, రాత్రి వేళల్లో రోగులు, వారి సహాయకులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక కదలలేని వారి పరిస్థితి మరీ దయనీయంగా ఉంటోంది. సిబ్బందికీ ఇబ్బందే అక్యూట్ మెడికల్ కేర్‌లో నిరంతరం వైద్యులు, స్టాఫ్‌నర్సులు అందుబాటులో ఉండాలి. అటువంటి ఈ యూనిట్లో ఒక్క వాటర్ ప్లాంట్ లేదు. సిబ్బంది ఇంటి నుంచి తెచ్చుకున్న నీటినే తాగాల్సి వస్తోంది. ఒక వేళ నీటి కోసం బయటకు వెళ్తే....అదే సమయంలో రోగికి ఏమైనా అయితే అందరూ మళ్లీ తమనే నిందిస్తారని అందుకే ఇంటినుంచి తెచ్చుకున్న నీటిని పొదుపుగా వాడుకుంటున్నామని ఓ సీనియర్ వైద్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రిలో పరిస్థితి ఇంతలా ఉన్నా ఉన్నతాధికారి మాత్రం పట్టించుకోవడం లేదు. కనీస సౌకర్యాలు కల్పించకుండా ఎన్ఏబీహెచ్ సర్టిఫికెట్ అంటూ నరకం చూపిస్తున్నారని ఉద్యోగులు బహిరంగంగా వాపోతున్నారు. -
‘సర్వ’జన కష్టాలు
అనంతపురం న్యూసిటీ : ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో రోగుల పరిస్థితి దయనీయంగా మారింది. ఆస్పత్రిలోని పలు వార్డుల్లో రోగులు ప్రత్యక్ష నరకం చూస్తున్నారు. స్కాన్, ఎక్స్‌రేలు, సిటీ స్కాన్, ఎంఆర్ఐ పరీక్షలకు వెళ్లాలన్నా స్ట్రెచర్ ఉండదు. ఒక వేళ స్ట్రెచర్ ఉంటే రోగి సహాయకులు ఉండరు. దీంతో రోగుల బంధువులే ఎంఎన్ఓ, ఎఫ్‌ఎన్‌ఓలుగా మారాల్సి వస్తోంది. హిందూపురం ఆరుమాకులపల్లికి చెందిన నారమ్మ అనే వృద్ధురాలును ఎఫ్ఎం వార్డులో అడ్మిషన్ చేయాల్సి ఉంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆ వృద్ధురాలికి వైద్యులు స్కాన్‌కు రెఫర్ చేశారు. కొడుకు గోవిందు, అల్లుడు నరసింహ, ఇతర కుటుంబీకులు ఉదయం 9.45 నుంచి వార్డులో స్ట్రెచర్, వీల్ చైర్ కోసం ఎదురుచూశారు. రోగి సహాయకులు లేకపోవడంతో చివరకు ఈ ముగ్గురే వృద్ధురాలిని వార్డు నుంచి స్ట్రెచర్‌పై స్కాన్ సెంటర్‌కు తీసుకెళ్లారు. ఉదయం 11.25 గంటలకు స్కాన్ పూర్తయ్యింది. తిరిగి ఆ వృద్ధురాలిని వార్డుకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఆస్పత్రిలో ఏ వార్డు ఎటువైపు ఉందో తెలియని పరిస్థితి. ఎఫ్ఎం వార్డులో తీసుకెళ్లేది పోయి ఓపీ నంబర్ 3కి తీసుకెళ్లారు. వార్డు ఎక్కడుందని అందరినీ బతిమాలుకోవాల్సిన పరిస్థితి. చివరకు 12 గంటల సమయంలో అక్కడే ఉన్న రోగులు సమాచారం ఇవ్వడంతో వారు అతికష్టం మీద వార్డుకు తీసుకెళ్లారు. ఆస్పత్రిలో నిత్యం ఇలాంటి దయనీయమైన పరిస్థితులు చోటు చేసుకుంటున్నా..యాజమాన్యం నిమ్మకి నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. ఇప్పటికైనా మేలుకొని వార్డుల్లో ఎఫ్ఎన్ఓ, ఎంఎన్ఓలను అందుబాటులో ఉంచి సేవలందించాలని రోగులు, వారి సహాయకులు కోరుతున్నారు. -
గాలి తగలదు.. ఊపిరాడదు!
తాగేందుకు నీళ్లుండవు... ఉక్కపోతలోనూ ఫ్యాన్ తిరగదు. ఆక్సిజన్ మాస్క్ మూతికి కట్టుకున్నా... గాలి ఆడదు. మంచాలు... స్ట్రెచర్ల సంగతి సరేసరి. ఆఖరుకు రాత్రివేళల్లో కరెంటు పోతే టార్చిలైట్లే గతి. కానీ ఇదే జిల్లాకంతటికీ పే...ద్ద ఆస్పత్రి. పాలకులు శ్రద్ధ చూపరు. ఆస్పత్రి యాజమాన్యం పట్టించుకోదు. అందుకే ఇక్కడికొచ్చే వారు ప్రత్యక్ష నరకం చూస్తున్నారు. అనంతపురం న్యూసిటీ: సర్వజనాస్పత్రిలో కనీస కనీస సౌకర్యాలు కరువయ్యాయి. ఆస్పత్రి ఉన్నతాధికారి తన గది దాటి బయటకు రాకపోవడంతో రోగుల హాహాకారాలేవీ ఆయనకు వినపడటం లేదు. ఏపీ చాంబర్లో సంతకాలు చేస్తూ అంతా బాగుందంటూ ఆయన గొప్పలు చెబుతుండగా...వార్డుల్లోని రోగులు మాత్రం సౌకర్యాల లేమితో అల్లాడిపోతున్నారు. ఇళ్ల నుంచే ఫ్యాన్లు ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. ఆస్పత్రిలో పేరుకు ఫ్యాన్లు ఉన్నా...అవి తిరగవు. ఎమర్జెన్సీ వార్డుల్లోని ఏసీలు పనిచేయడం లేదు. అందుకే రోగులు ఇళ్లనుంచే ఫ్యాన్లు తెచ్చుకుంటున్నారు. అక్యూట్ మెడికల్ కేర్(ఏఎంసీ) యూనిట్‌లోనూ ఇదే పరిస్థితి ఉండటంతో రోగులు ఉక్కపోతతో ప్రత్యక్షనరకం చూస్తున్నారు. వాస్తవానికి ఏఎంసీలో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుంటే కేసులుంటాయి. ఈ యూనిట్‌కు 24 గంటలూ నిరంతరాయంగా కరెంటు సరఫరా ఉండడంతో పాటు వెంటిలేటర్, ఏసీ, ఇతరత్రా మౌలిక సదుపాయాలుండాలి. కానీ సర్వజనాస్పత్రిలో ఆ పరిస్థితి లేదు. వారం రోజులుగా కరెంటు సమస్య వెంటాడుతోంది. లోడింగ్ సరిగా రాకపోవడంతో యూనిట్లో ఉండే రెండు, మూడు ఏసీలు పని చేయడం లేదు. దీంతో రోగుల పరిస్థితి వర్ణణాతీతంగా మారింది. దీంతో రోగుల సహాయకులు విసనకర్రతో ఊపుతూ ఉపశమనం కలిగిస్తున్నారు. మరికొందరు ఇంటి నుంచి ఫ్యాన్లు తెచ్చుకుంటున్నారు. పరిస్థితి ఇంత అధ్వానంగా ఉన్నా...రోగుల ప్రాణాలే పోయేలా ఉన్నా అటు ఆస్పత్రి యాజమాన్యం గానీ, ఏపీఎంఎస్ఐడీసీ అధికారులు గాని పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. కనీసం జిల్లా కలెక్టర్ వీరపాండియన్ అయినా ఓ సారి యూనిట్‌ను పరిశీలించి మెరుగైన వసతలు కల్పించాలని రోగులు, వారి బంధువులు కోరుతున్నారు. -
ప్రేమకథ విషాదాంతం
ఔను... వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు... ఏడాది కాలంగా ప్రేమించు కుంటున్నారు. ఈ సమాజంలో కులం అనే అడ్డుగోడలు తమ ప్రేమను ఆమోదించవని భయపడ్డారు. తమ ప్రేమ విషయం కుటుంబ సభ్యులకు తెలిస్తే ఏ అనర్థం జరుగుతుందోనన్న ఆందోళనఆ ప్రేమికులకు వెంటాడింది. తమ వెంట తెచ్చుకున్న విషపుగుళికలు మింగి ఆత్మహత్యాయత్నం చేశారు. అయితే మృత్యువు సమీపించడంతో వారిలో బతకాలనే ఆశ కలిగింది. తాము ఎందుకు మరణించాలి? తాము బతికి తమ ప్రేమను బతికించుకోవాలని నిర్ణయించుకుని స్వయంగా ఆస్పత్రికి వెళ్లి తమను కాపాడాలని వేడుకున్నారు. అప్పటికే వారి పరిస్థితి విషమంగా ఉండటంతో అనంతపురం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆ ప్రేమికులు మృత్యువాతపడ్డారు. అనంతపురం, పుట్లూరు: పుట్లూరు మండలం బాలాపురం ఎస్సీ కాలనీకి చెందిన మల్లికార్జున (20) తాడిపత్రిలో ఐటీఐ పూర్తి చేశాడు. విడపనకల్లు మండలం కొట్టాలపల్లికి చెందిన సి.మాధవి(19) తన తల్లి స్వస్థలం పుట్లూరు మండలం కోమటికుంట్లలో తాత రాముడు ఇంటి వద్ద ఉంటూ తాడిపత్రిలోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ చదివింది. వీరిద్దరూ ఏడాది కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం కుటుంభ సభ్యులకు తెలియకుండా జాగ్రత్త పడ్డారు. డిగ్రీ పూర్తీ చేసిన మాధవి తన స్వగ్రామానికి వెళ్లింది. శనివారం మధ్యాహ్న సమయంలో ప్రేమికులిద్దరూ ముందస్తు ప్రణాళిక ప్రకారం తాడిపత్రికి చేరుకున్నారు. కులాలు వేరు అయినందున తమ ప్రేమను పెద్దలు అంగీకరించరని చర్చించుకున్నారు. కలిసి జీవించే పరిస్థితి లేనపుడు కలిసి చనిపోదామనే నిర్ణయానికి వచ్చారు. వెంట తెచ్చుకున్న విషపుగుళికలు ఇద్దరూ మింగి ఆత్మహత్యాయత్నం చేశారు. మనసు మార్చుకుని.. బతకాలని..! ఆత్మహత్యాయత్నం చేసిన ఈ ప్రేమికులు తాము బతికి ప్రేమనూ బతికించుకోవాలని మనసు మార్చుకున్నారు. స్వయంగా తాడిపత్రి ప్రభుత్వ ఆస్పత్రికి చేరి తాము ఆత్మహత్యాయత్నం చేశామని, తమను బతికించాలని అక్కడి వైద్య సిబ్బందిని వేడుకున్నారు. వారిని పరీక్షించిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉండటంతో అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి పంపారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న సమయంలో సైతం మల్లికార్జున తాను ఉన్న బెడ్ నుంచి లేచి మాధవి ఎలా ఉంది.. అని ఆమె వద్దకు వెళ్లడానికి ప్రయత్నించాడు. చికిత్స పొంతుతూ మల్లికార్జున, మాధవిలు శనివారం అర్ధరాత్రి మృతి చెందారు. కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు తాడిపత్రి పోలీసులు కేసు నమోదు చేశారు. -
రాత్రికి రాత్రి సర్వజనాస్పత్రి నుంచి ఖైదీ డిశ్చార్జ్
అనంతపురం న్యూసిటీ: ఓ ఖైదీని కొన్ని నెలలుగా ఆస్పత్రిలో ఆశ్రయం కల్పించిన ప్రభుత్వ సర్వజనాస్పత్రి అధికారుల తీరు పలు అనుమానాలకు తావిస్తోంది. ఎలాంటి రోగాలు, జబ్బులూ లేకున్నా.. ఓ రోగిగా రికార్డులు సృష్టించి ప్రిజనర్స్ వార్డులో రాజభోగాలు కల్పించిన వైనంపై ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జగన్నాథ్‌ను ఈ నెల 17న సాయంత్రం 5.20 గంటలకు ‘సాక్షి’ వివరణ కోరింది. ఈ విషయంపై ఆరా తీసిన ఆయన అందుకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ పేర్కొన్నారు. అదే హడావుడితో గుట్టుచప్పుడు కాకుండా బుధవారం రాత్రికి రాత్రే ఏడు గంటలకు ఖైదీని డిశ్చార్జ్ చేసేశారు. సీసీ ఫుటేజీల్లో ఈ విషయం స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ.. ఆస్పత్రి రికార్డులో మాత్రం అదే రోజు మధ్యాహ్నం 2.50 గంటలకు డిశ్చార్జ్ చేసినట్లు రాసేశారు. ఇదంతా చూస్తుంటే అంతా పథకం ప్రకారమే ఖైదీని ఆస్పత్రిలో ఉంచినట్లు తెలుస్తోంది. నిజంగా ఖైదీ ఆరోగ్య పరిస్థితి బాగా లేకుంటే ఆ సమయంలో ఎందుకు పంపాల్సి వచ్చిందంటూ ఆస్పత్రి వర్గాలే వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం. నిర్లక్ష్యం నీడలో జిల్లా యంత్రాంగం ‘ఆస్పత్రిపై ఆరోపణలు వస్తున్నా సీరియస్‌గా తీసుకోవడం లేదు. పేదలకు మెరుగైన సేవలందిస్తున్నారనే ఒకేఒక్క కారణంతో చిన్న వాటిని పట్టించుకోవడం లేదు’ అంటూ ఈ ఏడాది వైద్య కళాశాలలో జరిగిన హెచ్‌డీఎస్ సమావేశంలో వైద్యాధికారులను సాక్షాత్తూ జిల్లా కలెక్టర్ వీరపాండియన్ హెచ్చరించారు. దీనిని బట్టి చూస్తుంటే.. సర్వజనాస్పత్రిలో అక్రమాలు జరుగుతున్న మాట వాస్తవమేనన్నది స్పష్టమవుతోంది. కేవలం హెచ్చరికలు తప్ప ఆచరణలో ఆ స్థాయి తీవ్రత కనిపించకపోవడంతో సర్వజనాస్పత్రిలో అక్రమార్కులకు మరింత ఊతమిచ్చినట్లైంది. దీంతో సర్వజనాస్పత్రిలో కీలక అధికారి ఆడింది ఆటగా సాగుతోంది. జిల్లా యంత్రాంగం నిర్లక్ష్యం కారణంగానే అతని అక్రమాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోందని ఆస్పత్రి వర్గాలే అంటున్నాయి. ఆ ముగ్గురే కీలకం కొన్ని నె లల పాటు ఆస్పత్రిలోని ప్రిజనర్స్ వార్డు లో ఖైదీని ఉంచడం వెనుక అ నంతపురం రెండో పట్టణ పోలీసు స్టే షన్లో విధులు నిర్వర్తించే ఓ హోంగార్డు, సర్వజనాస్పత్రిలోని ఆర్థో విభాగంలోని ఓ వైద్యుడితో పాటు మ రో కీలక అధికారి ప్ర మేయం ఉన్నట్లు వి శ్వసనీయ సమాచారం. నిబంధనలకు విరుద్ధంగా వీరు ముగ్గురు కలిసి ఖైదీకి సర్వజనాస్పత్రిలో ఆశ్రయం కల్పించా రు. వివిధ కారణాలు చూపుతూ రోజుల తరబడి ఖైదీ వార్డులో ఉండేలా సహకరిస్తూ వచ్చారు. ఇందుకు గాను వారికి రూ. లక్షల్లో నజరానాను ఆ ఖైదీ సమర్పించినట్లు ఆరోపణలున్నాయి. -
ఖైదీ దర్జా.. ఆస్పత్రే అడ్డా
ఆయన చేయి తడిపితే చాలు...ఆస్పత్రిలో ఎవరైనా సరే సలాం చేస్తారు. కంటిమీద కునుకు లేకుండా సేవ చేస్తారు. రిపోర్టులు కూడా ఎలా కావాలంటే అలా రాసిస్తారు..ఈ విషయం తెలుసుకున్న ఓ ఖైదీ మూడు నెలలుగా ఇక్కడ తిష్ట వేశాడు. సదరు ఆస్పత్రి కీలక అధికారికి రూ.లక్షలు ముట్టజెప్పాడు. అనారోగ్యంతో ఉన్నట్లు నటిస్తూ హాయిగా రెస్ట్ తీసుకుంటున్నాడు. ఫిబ్రవరిలో అనారోగ్య సమస్య ఉందంటూ రెడ్డిపల్లి జైలు నుంచి వచ్చిన ఖైదీ ఇక్కడే ఉండిపోయాడు. రిపోర్టులన్నీ నార్మల్‌గానే ఉన్నా... రోజుకో సమస్య చెబుతూ సపర్యలు చేయించుకుంటున్నాడని ఆస్పత్రి సిబ్బంది వాపోతున్నారు. అనంతపురం న్యూసిటీ: జిల్లా కేంద్రంలోని సర్వజనాస్పత్రిలో నిబంధనలు బంధీలుగా మారాయి. చేయి తడిపితే చాలు ఏ పనైనా సులువుగా చేయించుకోవచ్చనే చందంగా తయారైంది ఇక్కడి పరిస్థితి. ఆస్పత్రిలోనే ప్రిజన్ వార్డులో తాజాగా వెలుగుచూసిన ఓ బాగోతం ఈ మాటలకు అద్దం పడుతోంది. ఆ వివరాలిలా ఉన్నాయి. శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు ఎవరైనా అనారోగ్యానికి గురైతే చికిత్స అందించేందుకు పెద్దాసుపత్రిలో ప్రిజన్ వార్డు ఉంది. రక్త విరేచనాలతో బాధపడుతున్న ఓ వ్యక్తి 3 నెలల క్రితం ఈ వార్డులో చేరాడు. ఆస్పత్రి సిబ్బంది సర్జరీ కింద ఆయనకు అడ్మిషన్ ఇచ్చారు. మెడిసిన్ సమస్య ఉందని మరో నెల పొడిగించారు. ప్రస్తుతం ఆర్థో సమస్య ఉందని ఆ వ్యక్తిని ఇంకా కొనసాగిస్తున్నారు. రిపోర్టుల్లో కండీషన్ నార్మల్.. ఇదిలా ఉంటే, సదరు వ్యక్తికి సంబంధించిన మెడికల్ రిపోర్టుల్లో మాత్రం ఆయన కండీషన్ నార్మల్‌గా ఉన్నట్లు నిర్ధారణ అవడం చర్చనీయాంశంగా మారింది. ఆరోగ్య పరిస్థితి సాధారణంగానే ఉన్నా ఎందుకు అతడిని ఇంకా వార్డులో కొనసాగిస్తున్నారనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. సదరు ఖైదీ మామూలు స్థితిలో ఉన్నా వార్డులో ఉంచి సపర్యలు చేయడం వెనుక ఆంతర్యమేమిటో ఆయనకు వైద్య సేవలు అందింస్తున్న వారికే తెలియాలి. రూ.లక్షల్లో బేరం! ఈ విషయంపై పరిశీలన జరిపితే ఆసత్పికి సంబంధించిన ఓ కీలకాధికారి ప్రమేయం ఉన్నట్లు తెలిసింది. ప్రిజన్ వార్డులో రోగిని అడ్మిషన్లో ఉంచడానికి సదరు అధికారికి, ఖైదీకి రూ. లక్షల్లో బేరం కుదిరినట్లు తెలుస్తోంది. ఆ అధికారి వచ్చినప్పటి నుంచే ఇలాంటి అక్రమాలు మొదలయ్యాయని పలువురు ఆస్పత్రి వైద్యులు చెబుతున్నారు. ఆయన చేయి తడిపితే ఏ పనైనా సరే ఇట్టే అయిపోతుందని అక్కడి కొందరు సిబ్బందినడిగితే తెలిసింది. ఏమైనా అంటే నిబంధనల గురించి మాట్లాడే ఆయనే.. అవేవీ తనకు కాదన్నట్లు వ్యవహరిస్తున్నారని బహిరంగంగానే పలువురు విమర్శిస్తున్నారు. దీనిపై జిల్లా కలెక్టర్ అయినా స్పందించి, మరిన్ని అక్రమాలకు తావివ్వకుండా సదరు అధికారిపై తగిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. విచారించిచర్యలు తీసుకుంటా ప్రిజన్ వార్డులో మూడు నెలలుగా ఓ ఖైదీ ఉన్న విషయం తెలియదు. దీనిపై సమగ్ర విచారణకు ఆదేశిస్తా. అక్రమం జరిగిందని తెలిస్తే సంబంధిత వైద్యులు, సిబ్బందిపై తగిన చర్యలు తీసుకుంటా. – డాక్టర్ జగన్నాథ్,ఆస్పత్రి సూపరింటెండెంట్ -
కర్నూలు పెద్దాసుపత్రికి వెళ్తున్నారా..?
కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో మృత్యుఘోష విన్పిస్తోంది. రోజూ సగటున ఏడుగురి ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ప్రాణాలు కాపాడుకోవడానికి ఇక్కడికొస్తే చివరకు మృతదేహాలను తీసుకెళ్లాల్సి వస్తోందని మృతుల బంధువులు వాపోతున్నారు. ముఖ్యంగా అక్యూట్ మెడికల్ కేర్(ఏఎంసీ) విభాగంలో గత ఏడాది చేరిన 3,746 మందిలో ఏకంగా 2,498 మంది చికిత్స పొందుతూ మరణించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. వైద్యుల కొరత, ఉన్న వారిలోనూ నిర్లక్ష్యం, మందులు, పడకల కొరత తదితర కారణాలతో రోగులకు నూకలుచెల్లిపోతున్నాయి. కర్నూలు(హాస్పిటల్): సర్వజన వైద్యశాలలోని జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్, గైనకాలజీ, ఈఎన్‌టీతో పాటు న్యూరాలజీ, నెఫ్రాలజీ, యురాలజీ, గ్యాస్ట్రో ఎంట్రాలజీ తదితర సూపర్ స్పెషాలిటీ విభాగాలకు సైతం ప్రత్యేక ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు (ఐసీయూలు) లేవు. రోగులకు ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే చికిత్స అందించేందుకు గాను ఆసుపత్రి అధికారులే 20 ఏళ్ల క్రితం అప్పటి జిల్లా కలెక్టర్ సాయిప్రసాద్ సహకారంతో 20 పడకలతో అక్యూట్ మెడికల్ కేర్(ఏఎంసీ) విభాగాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆసుపత్రిలోని జనరల్ మెడిసిన్, జనరల్‌సర్జరీ, అనెస్తీషియా ప్రొఫెసర్లు, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, పీజీలు, హౌస్సర్జన్లు ఇక్కడ వంతుల వారీగా డ్యూటీలు వేసుకునివిధులు నిర్వర్తిస్తున్నారు. అంతేగానీ ప్రత్యేకంగా ఈ విభాగానికి ప్రభుత్వం నుంచి అనుమతులు లేవు. దీంతో వైద్యులు, పారామెడికల్, నర్సింగ్ సిబ్బంది, నాల్గవ తరగతి ఉద్యోగుల పోస్టులను మంజూరు చేయలేదు. వైద్యులు, నర్సులను ఆసుపత్రిలో రెగ్యులర్‌గా పనిచేస్తున్న వారినే వంతుల వారీగా, పారామెడికల్ సిబ్బంది, ఏఎన్ఎంలను కాంట్రాక్టు ప్రాతిపదికన నియమించి ఇక్కడ వైద్యసేవలు అందిస్తున్నారు. రోగుల రద్దీ దృష్ట్యా నాలుగేళ్ల క్రితం ఈ విభాగంలో పడకల సంఖ్యను 32కు పెంచారు. అయినప్పటికీ చాలడం లేదు. క్యాజువాలిటీలో అత్యవసర చికిత్సకు వచ్చే వారిని ఏఎంసీకి మార్చాలంటే పడకలు లభించడం లేదు. ఏఎంసీలో ఎవరికైనా ఆరోగ్యం కాస్త కుదుటపడితే గానీ అక్కడికి పంపలేని పరిస్థితి. లేదా ఎవరైనా మరణిస్తే గానీ పడకలు ఖాళీ కావడం లేదు. అప్పటి వరకు వార్డుల్లోనో, క్యాజువాలిటీలోనో రోగులు చికిత్స తీసుకోవాల్సి వస్తోంది. ఏడాదిలో 2,498 మరణాలు ఏఎంసీ విభాగంలో ఇటీవల మరణాల శాతం బాగా పెరిగింది. గత ఏడాది(2018) 3,746 మంది చేరగా.. అందులో 2,498 మంది మరణించారు. నెలకు సగటున 200 మంది, రోజుకు ఏడుగురు చనిపోతున్నారు. జిల్లా నలుమూలల నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా అత్యవసర చికిత్స కోసం అత్యధిక శాతం మంది ఇక్కడికే రావడం, చివరిక్షణాల్లో ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులు తమ వల్ల కాదని చేతులెత్తేసి పెద్దాసుపత్రికి పంపించడం, ఏఎంసీలో వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది కొరతతో పాటు మందులు, పడకల కొరత వల్ల రోగులకు సకాలంలో సరైన వైద్యం అందడం లేదు. ఈ కారణంగానే మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి. మధ్యాహ్నం దాటితే అరణ్యరోదనే ఏఎంసీ విభాగంలో ప్రతిరోజూ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆయా విభాగాల ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు వచ్చి ఒకసారి రోగులను చూసి జూనియర్ డాక్టర్లకు దిశా నిర్దేశం చేస్తుంటారు. మధ్యాహ్నం నుంచి జూనియర్ వైద్యులే ఇక్కడ దిక్కు. మధ్యాహ్నం నుంచి మరుసటి రోజు ఉదయం 10 గంటల వరకు పెద్ద డాక్టర్లు ఇటువైపు రావడం లేదు. ఫలితంగా సకాలంలో సరైన వైద్యం అందక ఎందరో తనువు చాలిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడ పనిచేసే నర్సింగ్, పారామెడికల్ సిబ్బందిలో కూడా కొందరు రోగుల పట్ల తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. రోగులకు క్యాథ్ ఊడిపోయినా, ఫ్లూయిడ్ అయిపోయినా తిరిగి పెట్టేందుకు త్వరగా రావడం లేదన్న విమర్శలున్నాయి. ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తున్నాం రోగుల రద్దీ దృష్ట్యా ప్రస్తుతం ఉన్న ఏఎంసీ సరిపోవడం లేదు. ఈ కారణంగా పాత గైనిక్ భవనంలో ప్రత్యేకంగా 100 పడకలతో ఏఎంసీ విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నాం. విభాగం ఏర్పాటు తర్వాత అవసరమైన వైద్యులు, సిబ్బంది కోసం ప్రభుత్వానికి ప్రతిపాదిస్తాం. దీనికితోడు ప్రైవేటు ఆసుపత్రుల నుంచి, జిల్లాలో ఇతర ప్రాంతాల నుంచి సీరియస్‌గా ఉన్న రోగులను ఇక్కడికి పంపుతున్నారు. ఈ కారణంగానే మరణాల శాతం పెరుగుతోంది. కొత్త విభాగం వస్తే సమస్యలు చాలా వరకు పరిష్కారమవుతాయి. –డాక్టర్ పి. చంద్రశేఖర్,ఆసుపత్రి సూపరింటెండెంట్