సర్వ'జల' ఘోష | Water Problems in Sarvajana Hospital Anantapur | Sakshi
Sakshi News home page

సర్వ'జల' ఘోష

Published Mon, Apr 29 2019 10:15 AM | Last Updated on Mon, Apr 29 2019 10:15 AM

Water Problems in Sarvajana Hospital Anantapur - Sakshi

ఎండలు మండిపోతున్నాయి...అరగంటకోసారి నీరు తాగినా దాహం తీరడం లేదు. కానీ జిల్లాకే పెద్దదిక్కయిన సర్వజనాస్పత్రిలో తాగేందుకు నీళ్లు దొరకడం లేదు. దీంతో దాదాపు 2,500 మంది రోగులు...వారికి సేవలందిస్తున్న 500 మంది సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగులు ఇళ్లనుంచే బాటిళ్లలో నీరు తెచ్చుకుని 8 గంటల పాటు వాటినే పొదుపుగా వాడుకుంటుండగా...రోగులు, వారి బంధువులు తాగునీటి కోసం పడరాని పాట్లు పడుతున్నారు.

ఇది సర్జికల్‌ వార్డులోని దృశ్యం...ఇక్కడ తాగునీటి సౌకర్యం లేక వార్డులో విధులు నిర్వర్తిస్తున్న హౌస్‌సర్జన్, స్టాఫ్‌నర్సులు ఇంటి వద్ద నుంచే వాటర్‌ బాటిళ్లలో నీరు తెచ్చుకుంటున్నారు. ఆ నీరు అయిపోతే ఇక డ్యూటీ అయ్యే వరకు వేచి ఉండాల్సిందేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

ఈచిత్రంలోని వృద్ధురాలి పేరు లక్ష్మక్క. కూడేరు మండలం కరుట్లపల్లి. ఎఫ్‌ఎం వార్డులో అడ్మిషన్‌లో ఉంది. అక్కడ వాటర్‌ ప్లాంట్‌ పని చేయకపోవడంతో తాగునీటి కోసం ఎంఎం వార్డు వద్దకు వచ్చింది అక్కడా లేవు. దీంతో చిన్నపిల్లల వార్డు, ఆర్థో వార్డు..ఇలా వార్డులన్నీ తిరిగి చివరకు సూపరింటెండెంట్‌ కార్యాలయం పక్కనే ఉన్న వాటర్‌ ప్లాంట్‌ వద్దకు వచ్చింది. అక్కడా నీళ్లు రాకపోవడంతో...ఆవేదన వ్యక్తం చేసింది. ఇంత పెద్ద ఆస్పత్రిలో తాగేందుకు నీళ్లు కూడా లేవయ్యా అంటూ నిట్టూర్చింది. ఈ కష్టం లక్ష్మక్కది మాత్రమే కాదు...ఆస్పత్రిలో వస్తున్న వారిదీ..ఇక్కడ పనిచేసే ఉద్యోగులందరిదీ.

అనంతపురం న్యూసిటీ: సర్వజనాస్పత్రిలో వైద్యులు, సిబ్బంది, రోగులకు కన్నీటి కష్టాలు తప్పడం లేదు. వైద్యం మాట దేవుడెరుగు..కనీసం తాగునీటి సౌకర్యం కూడా లేకపోవడంతో రోగులపాటు రోజూ 3 వేల మంది సేవలందించే ప్రొఫెసర్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, స్టాఫ్‌నర్సులు తీవ్ర ఇబ్బందిపడుతున్నారు. ఆస్పత్రి అభివృద్ధి పేరుతో రూ. కోట్లు ఖర్చు చేస్తున్న ఉన్నతాధికారులు కనీసం తాగునీరు కూడా ఏర్పాటు చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది.

వాటర్‌ ప్లాంట్లు రిపేరీ
ఆస్పత్రిలో మొత్తం 10 వాటర్‌ ప్లాంట్లున్నాయి. అందులో రెండు మినహా మిగితావి పని చేయడం లేదు. దీంతో రోగులు ఆస్పత్రి ఆవరణలో ఉండే వాటర్‌ ప్లాంట్‌ వద్దకు వస్తున్నారు. ఆ వాటర్‌ ప్లాంట్‌లు కూడా సమయపాలనతో నడుపుతున్నారు. దీంతో ఉదయం, రాత్రి వేళల్లో రోగులు, వారి సహాయకులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక కదలలేని వారి పరిస్థితి మరీ దయనీయంగా ఉంటోంది.  

సిబ్బందికీ ఇబ్బందే
అక్యూట్‌ మెడికల్‌ కేర్‌లో నిరంతరం వైద్యులు, స్టాఫ్‌నర్సులు అందుబాటులో ఉండాలి. అటువంటి ఈ యూనిట్‌లో ఒక్క వాటర్‌ ప్లాంట్‌ లేదు. సిబ్బంది ఇంటి నుంచి తెచ్చుకున్న నీటినే తాగాల్సి వస్తోంది. ఒక వేళ నీటి కోసం బయటకు వెళ్తే....అదే సమయంలో రోగికి ఏమైనా అయితే అందరూ మళ్లీ తమనే నిందిస్తారని అందుకే ఇంటినుంచి తెచ్చుకున్న నీటిని పొదుపుగా వాడుకుంటున్నామని ఓ సీనియర్‌ వైద్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రిలో పరిస్థితి ఇంతలా ఉన్నా ఉన్నతాధికారి మాత్రం పట్టించుకోవడం లేదు. కనీస సౌకర్యాలు కల్పించకుండా ఎన్‌ఏబీహెచ్‌ సర్టిఫికెట్‌ అంటూ నరకం చూపిస్తున్నారని ఉద్యోగులు బహిరంగంగా వాపోతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement