మగ బిడ్డకి రూ.1,200.. ఆడబిడ్డకి వెయ్యి | Sarvajana Hospital Staff Money Collecting From Patients Anantapur | Sakshi
Sakshi News home page

మామూళ్ల పురుడు!

Published Fri, Mar 6 2020 1:45 PM | Last Updated on Fri, Mar 6 2020 1:45 PM

Sarvajana Hospital Staff Money Collecting From Patients Anantapur - Sakshi

ఈ చిత్రంలోని బాలింత పేరు దిల్షాద్‌. ధర్మవరానికి చెందిన ఈమె రెండో కాన్పు కోసం సర్వజనాస్పత్రిలో చేరింది. ఈ నెల 3న రాత్రి 12 గంటల సమయంలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆరోగ్యం సరిగా లేకపోవడంతో శిశువును ఎస్‌ఎన్‌సీయూలో ఉంచారు. దిల్షాద్‌ను పోస్టునేటల్‌కు మార్చాల్సి ఉండగా.. ఆ సమయంలో విధుల్లో ఉన్న క్లాస్‌–4 సిబ్బంది దిల్షాద్‌ భర్త మున్వర్‌ను రూ.1,200 డిమాండ్‌ చేశారు. ముందు వార్డుకు మార్చండి.. ఉదయం డబ్బులిస్తానని చెప్పినా వినకపోవడం వివాదానికి కారణమైంది.  

కరువు జిల్లా అనంతలో కాసులకు నిత్యం కటకటే. అందుకే నిరుపేదలంతా ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా జిల్లాకే పెద్దదిక్కుగా ఉన్న సర్వజనాస్పత్రికి పరుగున వస్తారు. ఇక ప్రసవాల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. కానీ ఆస్పత్రిలో తిష్టవేసిన ధన పిశాచులు.. డబ్బుకోసం నిరుపేదల రక్తం పీలుస్తున్నారు. ఆడపిల్లకు ఓ రేటు.. మగపిల్లాడైతే మరో రేటు కట్టి మరీ వసూలు చేస్తున్నారు. వారడిగినంత డబ్బులివ్వకపోతే బాలింతలకు నరకం చూపుతున్నారు.  

అనంతపురం హాస్పిటల్‌: మాతృత్వం ప్రతి మహిళ జీవితంలో అపురూప ఘట్టం. అందుకే తొమ్మిది నెలలు కడుపులో బిడ్డను మోసిన గర్భిణి.. ప్రసవం అయ్యాక బిడ్డను చూసుకుని ఎంతో మురిసిపోతుంది. తన ప్రతిరూపాన్ని చూసే క్షణాలకోసం ఎన్ని ఇబ్బందులైనా భరిస్తుంది. అలాంటి అపురూప క్షణాలను కూడా సర్వజనాస్పత్రిలోని సిబ్బంది మహిళలకు దూరం చేస్తున్నారు. మానవత్వం మరచి.. మనీ కోసం కక్కుర్తి పడుతున్నారు. అడిగినంత డబ్బులివ్వకపోతే బిడ్డను కూడా చూపని పరిస్థితి. దీంతో కాన్పులకోసం ఆస్పత్రికి వస్తున్న గర్భిణులు ప్రసవ సమయంలో వచ్చే నొప్పులకంటే డబ్బుల కోసం ఆస్పత్రిలోని సిబ్బంది పెట్టే హింసతో కన్నీరుమున్నీరవుతున్నారు. 

రేట్లు ఫిక్స్‌ చేశారు
ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లే ఆర్థిక స్థోమత లేనివారే సర్వజనాస్పత్రికి వస్తారు. కాన్పులు, ఇతర ఆరోగ్య సమస్యలకు జిల్లాలోని మారుమూల ప్రాంతాల నుంచి ఇక్కడికే వస్తారు. రోగులు ఆస్పత్రుల్లో ఉంటుండగా.. వారి బంధువులు, వెంట వచ్చిన వారు లాడ్జిల్లో బసచేసే ఆర్థిక స్థోమత లేక ఆస్పత్రి ఆవరణలోనే దోమలతో సహవాసం చేస్తుంటారు. అలాంటి వారినీ ఇక్కడి సిబ్బంది పీక్కుతింటున్నారు. ముఖ్యంగా గ్రూప్‌–4 సిబ్బంది ప్రసవాలకు రేట్‌ ఫిక్స్‌ చేశారు. మగ బిడ్డ పుడితే రూ.1,200, ఆడబిడ్డ పుడితే రూ.1,000 ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. లేకుంటే బిడ్డను ఇవ్వరు. అదీ కాకపోతే లేబర్‌ వార్డు నుంచి పోస్టునేటల్‌ వార్డుకు తీసుకెళ్లేది లేదని మొండికేస్తుండటం పరిపాటిగా మారింది.

రోజూ 25 ప్రసవాలు
జిల్లా కేంద్రంలోని సర్వజనాస్పత్రిలో రోజూ సరాసరి 25 ప్రసవాలు జరుగుతుంటాయి. అధిక శాతం బాలింతల నుంచి లేబర్‌ వార్డు క్లాస్‌–4 సిబ్బంది రూ.వేలకు వేలు వసూలు చేస్తున్నారనే విమర్శలున్నాయి. గ్రూపులుగా ఏర్పడి బాలింతల నుంచి డబ్బు వసూలు చేస్తున్నారు. డబ్బులిచ్చుకోలేని వారికి ప్రత్యక్ష నరకం చూపుతున్నారు. గట్టిగాఅడిగితే తాము కూడా ప్రసవానికి ఇంత అని అధికారులకు ఇవ్వాలంటున్నారు. ఏ అధికారికి అని అడిగితే మాత్రం సమాధానం దాటవేస్తున్నారు.

ఈ చిత్రంలోని బాలింతల పేర్లు వరలక్ష్మి(రాణినగర్, అనంతపురం), భాగ్యమ్మ(కొడవాండ్లపల్లి). రెండ్రోజుల క్రితం ఇరువురూ ప్రసవించారు. రూ.700 ఇచ్చే వరకు బిడ్డనిచ్చేది లేదని వరలక్ష్మితో సిబ్బంది పేచీ పెట్టుకున్నారు. ఇక భాగ్యమ్మతోనూ రూ.1000లు ముక్కుపిండి వసూలు చేశారు. కూలీ పనులకెళ్లే తమలాంటోళ్లతో రూ.వేలల్లో డబ్బులు తీసుకుంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రిలో ప్రసవమైతే చాలు.. ప్రతి ఒక్కరూ క్లాస్‌–4 సిబ్బందికిలంచాలు సమర్పించుకోవాల్సి వస్తుండటం గమనార్హం.

పట్టించుకోని ఆర్‌ఎంఓలు
సర్వజనాస్పత్రిలో రెసిడెన్షియల్‌ మెడికల్‌ ఆఫీసర్ల(ఆర్‌ఎంఓ) రోగులకందే సేవలు, సిబ్బంది పనితీరును పరిశీలించాల్సి ఉంటుంది. కానీ ఆర్‌ఎంఓలు ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడంతో ఇక్కడికొస్తున్న నిరుపేదలు ఇబ్బందులు పడుతున్నారు. ఎవరైనా ఫిర్యాదు చేసినప్పుడు హడావుడి చేయడం తప్ప.. సిబ్బందిని సరైన మార్గంలో నడపలేకపోతున్నారు.

చంద్రుని చూపునకు నోచుకోక...
కలెక్టర్‌ గంధం చంద్రుడు బాధ్యతలు స్వీకరించి మూడు నెలలు దాటి పోయింది. ఆస్పత్రి అభివృద్ధి కమిటీ అధ్యక్షునిగా ఉన్న ఆయన ఇంతవరకు కనీసం ఆస్పత్రివైపు కన్నెత్తి చూడని పరిస్థితి. నిత్యం ఏదో ఒక పనిమీద ఆస్పత్రి ఎదుటే వెళ్తున్నా.. ఆస్పత్రిలోకి మాత్రం రాకపోవడం గమనార్హం. దీంతో పర్యవేక్షణ కొరవడటం.. ఉన్నతాధికారులు దృష్టి సారించకపోవడంతో సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అందువల్లే జిల్లాకే పెద్దదిక్కుగా ఉన్న సర్వజనాస్పత్రిలో రోగులకు సరైన వైద్య సేవలందడం లేదు. గతంలో ట్రెయినీ కలెక్టర్‌గా వచ్చిన వినోద్‌ అర్థరాత్రి వేళల్లో ఆస్పత్రిని తనిఖీ చేసే వారని, ఫలితంగా వైద్యులు, సిబ్బంది అలర్ట్‌గా ఉంటూ సేవలందించేవారని రోగులు గుర్తు చేసుకుంటున్నారు.

చర్యలు తీసుకుంటున్నాం
ఎఫ్‌ఎన్‌ఓ, స్వీపర్లు బాలింతల నుంచి డబ్బులు తీసుకుంటున్నట్లు ఫిర్యాదులు అందాయి. అందులో భాగంగా ఇద్దరిని వేరే వార్డుకు మార్చాం. ఆస్పత్రిలో సేవలకు ఎవరూ డబ్బులివ్వాల్సిన పనిలేదు. సర్వజనాస్పత్రిలో అన్ని సేవలు ఉచితమే. ఎవరైనా డబ్బు డిమాండ్‌ చేస్తే నాకు ఫిర్యాదు చేయవచ్చు. తప్పకుండా చర్యలు తీసుకుంటాం.  – డాక్టర్‌ లలిత, ఆర్‌ఎంఓ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement