అనంతపురం న్యూసిటీ: అనంతపురం ప్రభుత్వ సర్వజనాస్పత్రి వైద్యుల మధ్య కోల్డ్‌వార్ నడుస్తోంది. ఈ ప్రభావం రోగులపై పడుతోంది. ఇందుకు నిదర్శనం ఆస్పత్రిలోని పల్మనరీ విభాగమే. ఈ విభాగంలో ఓ ప్రొఫెసర్, కిందిస్థాయి వైద్యుల మధ్య సమన్వయలోపంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకునే స్థాయికి దిగజారారు. దీంతో పాటు నర్సుల డ్యూటీల కేటాయింపులపై నర్సింగ్ సూపరింటెండెంట్ ఏకపక్షంగా వ్యవహరిస్తుండడంతో స్టాఫ్‌నర్సులు తలలుపట్టుకుంటున్నారు. ఇలా ఆస్పత్రిలో ఎవరికి వారు యమునా తీరే అన్న చందంగా వ్యవహరిస్తున్నారు.
ఇష్టారాజ్యం
పల్మనరీ విభాగంలో ఓ ప్రొఫెసర్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. మూడ్రోజుల క్రితం ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్ సెలవు కోసం లిఖితపూర్వకంగా అడిగేందుకు వెళ్లారు. ఆ సమయంలోనే మరో వైద్యురాలు సెలవు కోసం ప్రొఫెసర్‌ను కోరారు. వైద్యురాలి సమక్షంలోనే అసిస్టెంట్ ప్రొఫెసర్‌ను హేళనగా మాట్లాడారు. ఇదే విషయమై సదరు వైద్యులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రొఫెసర్‌పై ఆర్‌ఎంఓకు ఫిర్యాదు చేశారు. ప్రొఫెసర్ ఐదు రోజుల క్రితం విధుల్లో ఉన్న స్టాఫ్‌నర్సుపై నోరుపారేసుకున్నారని తెల్సింది. రోగికి ట్రీట్‌మెంట్ ఇచ్చారా లేదా అని స్టాఫ్‌నర్సును నిలదీశారు. అందుకు స్టాఫ్‌నర్సు ‘సార్..తాను సెలవులో ఉన్నానని, నైట్ డ్యూటీ స్టాఫ్‌నర్సుతో మాట్లాడి విషయాన్ని చెబుతాన’ని సమాధానమిచ్చింది. దీనికి ప్రొఫెసర్ ‘బాగా స్టైల్‌గా, అతి తెలివితో సమాధానమిస్తావే’ అని స్టాఫ్‌నర్సును వ్యంగ్యంగా మాట్లాడారు. ప్రొఫెసర్ స్టాఫ్‌నర్సులు, హెడ్‌నర్సులను హేళన చేస్తూ మాట్లాడుతున్నారని, ఇదిలాగే కొనసాగితే తాము ధర్నా చేస్తామని నర్సింగ్ అసోసియేషన్ నాయకురాళ్లు ఆర్‌ఎంఓకు ఫిర్యాదు చేశారు.
గ్రూపు రాజకీయాలు
నర్సింగ్ రోస్టర్ విషయంలో ఓ నర్సింగ్ సూపరింటెండెంట్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఓ వర్గాన్ని ఏర్పాటు చేసుకుని వారికి ఇష్టమొచ్చినట్లు సెలవులు, విధులు కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది. కనీసం రోస్టర్ ప్రకారమైనా విధులు కేటాయిస్తారంటే అదీ లేదని స్టాఫ్‌నర్సులు వాపోతున్నారు. వంద మంది రోగులకు ఒక్కరు విధులు నిర్వర్తిస్తున్నా.. సెలవు కోసం వెళితే కనీస గౌరవం లేకుండా నర్సింగ్ సూపరింటెండెంట్ మాట్లాడుతున్నారని స్టాఫ్‌నర్సులు చెబుతున్నారు. గ్రేడ్ 1 నర్సింగ్ సూపరింటెండెంట్ ఉద్యోగ విరమణ పొందినప్పటి నుంచి స్టాఫ్‌నర్సులకు కేటాయిస్తున్న విధుల్లో పారదర్శకత లోపించిందని వాపోతున్నారు.ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన సూపరింటెండెంట్, ఆర్‌ఎంఓలు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment