Money collection
-
‘కరెంటు’లో కూటమి కాసుల వేట
సాక్షి, అమరావతి: విద్యుత్ సంస్థల్లో కాసులు దండుకొనే ప్రక్రియలో కూటమి నేతలు మరో అంకాన్ని మొదలెట్టారు. కూటమి ప్రభుత్వం రాగానే బలవంతంగా రాజీనామా చేయించిన డైరెక్టర్ల స్థానంలో కొత్త వారి నియామకానికి ఇంటర్వ్యూలు ప్రారంభించారు. ఇప్పటికే డైరెక్టర్ల పోస్టుల్లో ఎవరిని నియమించాలో ఖరారై పోవడంతో ఇప్పుడు ఇంటర్వ్యూలు మొక్కుబడిగానే సాగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తొలి రోజు ఆంధ్రప్రదేశ్ తూర్పు, దక్షిణ ప్రాంత విద్యుత్ సంస్థ (డిస్కం)ల డైరెక్టర్ల పోస్టులకు ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, డిస్కంల సీఎండీలు, ఓ సాంకేతిక నిపుణుడు (మాజీ డైరెక్టర్) ఇంటర్వ్యూలు నిర్వహించారు.మొత్తం ముడుపుల కోసమేకూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత అధికార పార్టీ నేతలు డిస్కంలతో పాటు ఏపీ జెన్కో, ఏపీ ట్రాన్స్‌కోలో గత ప్రభుత్వంలో నియమితులైన 10 మంది డైరెక్టర్ల చేత జూలై 3న బలవంతంగా రాజీనామా చేయించారు. వీరితో పాటు గత నబంబర్లో పదవీకాలం పూర్తయిన ఐదుగురితో కలిపి మొత్తం 15 మంది డైరెక్టర్ల పోస్టులపై కన్నేసిన కూటమి పెద్దలు.. తమకు ముడుపులిచ్చే వారిని నియమించేందుకు నిబంధనలను మార్చేసుకున్నారు. గత్యంతరం లేక వారికి ఉన్నతాధికారులు సహకరిస్తున్నారు. గరిష్ట వయో పరిమితిని 62 ఏళ్ల నుంచి 65 ఏళ్లకు పెంచారు. చీఫ్ జనరల్ మేనేజర్ స్థాయి వారితో పాటు సూపరింటెండెంట్ ఇంజనీర్లు, చీఫ్ ఇంజనీర్లు కూడా అర్హులేనంటూ నిబంధనలు సవరించేశారు.పవర్ జనరేషన్ కార్పొరేషన్లో ఓ మహిళా అధికారిని హెచ్ఆర్ డైరెక్టర్‌గా కూర్చోబెట్టేందుకు ఆమె మాత్రమే అర్హత సాధించేలా నిబంధనలు మార్చారు. జాయింట్ సెక్రటరీ కేటగిరీకి అర్హత ఇచ్చి, చీఫ్ ఇంజినీర్ కేటగిరీని తీసేశారు. మిగతా పోస్టులకు మాత్రం చీఫ్ ఇంజనీర్ అర్హులేనంటూ ఆదేశాలిచ్చారు. తర్వాత కూటమి పెద్దలు కొందరు ఒక్కో పోస్టుకు రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకూ డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. చివరిగా ‘చినబాబు’ ఓ జాబితాను ఖరారు చేశారని, అందులో ఉన్నవారికే ఈ పోస్టులు కట్టబెడతారని సమాచారం.ఆరంభమే గందరగోళంఏపీ ట్రాన్స్‌కోలో ఫైనాన్స్, టెక్నికల్, ఏపీ జెన్కోలో థర్మల్, ఫైనాన్స్, హెచ్ఆర్, హైడల్, కోల్, ఏపీఈపీడీసీఎల్‌లో ఆపరేషన్స్, ప్రాజెక్ట్స్, ఏపీసీపీడీసీఎల్, ఎస్పీడీసీఎల్లో ప్రాజెక్ట్స్, టెక్నికల్, ఫైనాన్స్ పోస్టులకు 189 మంది దరఖాస్తు చేశారు. వీరిలో 167 మందికి రాష్ట్ర సచివాలయంలో ఉదయం 10 గంటలకు ఇంటర్వ్యూలు ఉంటాయని తెలియజేశారు. అభ్యర్థులు ఉదయమే సచివాలయానికి చేరుకోగా.. ఇక్కడ కాదు.. విజయవాడ గుణదలలోని విద్యుత్ సౌధకు వెళ్లాలని అధికారులు సమాచారం ఇచ్చారు. ఈ రెండింటికీ మధ్య 25 కిలోమీటర్ల దూరం ఉంటుంది.అంత దూరం ట్రాఫిక్‌ను దాటుకుని విద్యుత్ సౌధను చేరుకోవడానికి అభ్యర్థులు నానా తంటాలు పడ్డారు. ఉదయం 10 గంటలకల్లా ఇంటర్వ్యూకు వెళ్లాల్సిన వాళ్లు ఆలస్యంగా చేరుకున్నారు. కొందరు వెనక్కి వెళ్లిపోయారు. మరికొందరు వర్చ్యువల్‌గా హాజరయ్యారు. ఆలస్యంగా వచ్చారని వారిని అనర్హులను చేసి, మెచ్చిన వారికి పోస్టులు ఇవ్వడం కోసమే ఇలా దారి మళ్లించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏపీఈపీడీసీఎల్, ఏపీఎస్పీడీసీఎల్లో డైరెక్టర్ల పోస్టులకు ఇంటర్వ్యూలను సోమవారం రాత్రికి పూర్తి చేశారు. మంగళవారం జెన్కో, ట్రాన్స్‌కో, బుధవారం సీపీడీసీఎల్‌లో డైరెక్టర్ల పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.డబ్బులు వసూలు చేస్తే ఫోన్ చేసి చెప్పండిడైరెక్టర్ల పోస్టుల కోసం డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఎవరికైనా సమాచారం తెలిస్తే తమ దృష్టికి తీసుకురావాలని ఇంధన శాఖ సోమవారం ఓ ప్రకటనలో కోరింది. ఇందుకోసం ఏపీ ట్రాన్స్‌కో విజిలెన్స్ విభాగం మొబైల్ నంబర్ 9490154719కు ఫోన్ చేసి వివరాలు తెలపాలని కోరింది. -
కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు... దేవుళ్లం అనుకుంటున్నారు
అహ్మదాబాద్: కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు తమను తాము దేవుళ్లుగా భావించుకుంటున్నారంటూ అలహాబాద్ హైకోర్టు మండిపడింది. వాళ్లు సాధారణ ప్రజలకు అందుబాటులో లేకుండా పోతున్నారంటూ ఆవేదన వెలిబుచ్చింది. అహ్మదాబాద్‌లో రాత్రిపూట వెళ్తున్న ఓ జంట నుంచి ట్రాఫిక్ పోలీసులు బెదిరించి డబ్బుల వసూలు చేశారంటూ వచి్చన వార్తలను కోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, న్యాయమూర్తి జసిస్ అనిరుద్ధ పి.మాయీ ధర్మాసనం దీనిపై శుక్రవారం జరిపింది. ఈ సందర్భంగా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. పోలీసులపై ఫిర్యాదు చేసేందుకు ఉద్దేశించిన హెల్ప్‌లైన్‌ను కలెక్టర్ కార్యాలయంలో మాత్రమే ఉంచడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. ‘‘పోలీసులపై ఫిర్యాదు చేయాలంటే సామాన్యులు మీ కార్యాలయాల ముందు వరుస కట్టాలా? వారిని లోపలికి అనుమతించేదెవరు? మామూలు జనానికి పోలీస్ స్టేషన్లో కాలు పెట్టడమే కష్టం. ఇక పోలీస్ కమిషనర్, కలెక్టర్ కార్యాలయాల్లోకి వెళ్లడమైతే దాదాపుగా అసాధ్యం! మీ కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు దేవుళ్లలా, రాజుల మాదిరిగా ప్రవర్తిస్తారు. ఇవన్నీ క్షేత్రస్థాయి వాస్తవాలు. ఇంతకుమించి మాట్లాడేలా మమ్మల్ని రెచ్చగొట్టొద్దు’’అని జస్టిస్ అగర్వాల్ అన్నారు. పోలీసులపై ఫిర్యాదులకు గ్రీవెన్స్ సెల్‌తో పాటు హెల్ప్‌లైన్ నంబర్ ఏర్పాటు చేయాలని, అందరికీ తెలిసేలా దాన్ని ప్రచారం చేయాలని గత విచారణ సందర్భంగా జారీ చేసిన ఆదేశాలు అమలు కాకపోవడంపై ధర్మాసనం అసంతృప్తి వెలిబుచ్చింది. -
సార్.. ప్రేమలో పడ్డా కాస్త డబ్బు సర్దండి!
కోహిమా: రాజకీయ నాయకులకు తరచూ ఉద్యోగం, ఉపాధి, డబ్బు సాయం కావా లంటూ విజ్ఞాపనలు అందుతుండటం సహజంగా జరిగేదే. కానీ, ఓ యువకుడు మాత్రం తన కలల రాణితో ప్రేమ వ్యవ హారం సాగించేందుకు డబ్బు సర్దాలంటూ ప్రాధేయ పడ్డాడు. ఈ విడ్డూరం నాగాలాండ్‌లో చోటుచేసుకుంది. బీజేపీ నాగాలాండ్ అధ్యక్షుడు టెమ్జెన్ ఇమ్నా అలోంగ్ తనకు ఎదురైన అరుదైన అనుభవాన్ని స్వయంగా ‘ఎక్స్’లో వివరించారు. ఆయనకు అరవింద పాండా అనే ఓ యువకుడు పంపిన మెయిల్లో ఇలా ఉంది.. ‘సర్, ఈ నెల 31వ తేదీన నా గర్ల్‌ఫ్రెండ్‌తో మొద టిసారిగా డేటింగ్‌కు వెళ్తున్నాను. కానీ, ఇప్పటి వరకు నాకు ఉద్యోగం రాలేదు. దయవుంచి కొద్దిగా సాయం చేయండి. ఏదో ఒకటి చేయండి సార్’అని అందులో ఉంది. అందుకాయన, ‘ఎలాంటి సాయం కావాలో చెప్పండి’అంటూ బదులి చ్చారు. ‘ఎక్స్’లో అలోంగ్ పోస్టుకు నెటిజన్లు తమాషా వ్యాఖ్యలతో స్పందించారు. యువకు డితోపాటు డేటింగ్‌కు వెళ్లాలంటూ అలోంగ్‌కు ఒకరు సూచించగా, అతడికి డబ్బు సాయం చేయాలని మరొకరు కోరారు. లవర్ బోయ్ అరవింద పాండాకు ఎమ్మెల్యేగా అవకాశమి వ్వాలని, అతడికి ఉద్యోగమి వ్వాలని.. ఇలా రకరకాల సూచ నలు చేశారు. తల్లిదండ్రులు ఎంపిక చేసిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని మరొకరు ఆ యువకుడికి తెలిపారు. ఆ యు వకుడు జీవితంలో కఠినమైన పాఠా లను నేర్చు కోవాల్సిన అవసరం ఉన్నందున ఆ వినతిని పట్టించుకోవద్దని కొందరు పేర్కొన్నారు. -
డ్యాన్స్ స్కూల్‌కు వచ్చిన యువతులను..
సాక్క్షి, గచ్చిబౌలి(హైదరాబాద్): డ్యాన్స్ స్కూల్స్ పేరిట డబ్బు కాజేసి మోసాలకు పాల్పడి ఆపై యువతులను లైంగిక వేధింపులకు గురిచేసిన నిందితుడిని గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్ చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీఐ శ్రీనివాస్ తెలిపిన మేరకు.. గచ్చిబౌలి టీఎన్జీవోస్ కాలనీలో నివాసముండే విజయవాడకు చెందిన వి.చిరంజీవి(27) స్థానికంగా జుంబా డ్యాన్స్ స్కూల్ నిర్వహిస్తూ నగరంలో మరో రెండు డ్యాన్స్ స్కూల్ నడుపుతున్నాడు. డ్యాన్స్‌కు వచ్చిన యువతులను మభ్యపెట్టి డ్యాన్స్ స్కూల్ పెడితే లాభాలు వస్తాయని నమ్మించాడు. ఈ క్రమంలో టీఎన్జీవోస్కు చెందిన యువతి రూ.9 లక్షలు, హైదర్షాకోట్కు చెందిన యువతి రూ.6 లక్షలు ఇచ్చారు. డ్యాన్స్ స్కూల్స్ పెట్టకపోగా వారిని లైంగికంగా వేధించాడు. దీంతో బాధితులిద్దరు ఈ నెల 4న గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. -
వసూల్ రాజా..!
మహబూబ్‌నగర్ క్రైం: దేవరకద్ర నుంచి మహబూబ్‌నగర్ వైపు వస్తున్న ఇసుక టిప్పర్లను సీఐ స్థాయి పోలీసు అధికారి చెప్పాడని రోడ్డుపై నిలుపుతున్నాడు ఓ ప్రైవేటు వ్యక్తి. అనంతరం టిప్పర్ నంబర్, యజమాని సెల్‌ఫోన్ నంబర్ తీసుకోవటం మరుసటి రోజు నుంచి ఫోన్లు చేస్తూ.. ‘డబ్బులు అందలేదు.. సార్‌కు చెప్పాలా? రేపటి నుంచి ఈ రూట్లో టిప్పర్ కనిపించదు’ అంటూ వార్నింగ్ ఇవ్వటం, డబ్బులు వసూలు చేసే వరకు ఫోన్లు చేస్తూనే వేదిస్తున్నాడని టిప్పర్ యజమానులు వాపోతున్నారు. ఒక్కో టిప్పర్ నుంచి రూ.6 వేలు.. మక్తల్ సమీపంలోని ఓ వాగు నుంచి మహబూబ్‌నగర్‌కు టిప్పర్లలో ఇసుక తరలిస్తున్నారు. 100 నుంచి 130 టిప్పర్ల ఇసుక జిల్లాకేంద్రానికి వచ్చింది. ఈ క్రమంలో దేవరకద్ర – మహబూబ్‌నగర్ రహదారిలో ఓ పోలీసు అధికారి మనిషిని అంటూ ఓ వ్యక్తి దర్జాగా వాహనంపై పోలీస్ అని రాసుకొని టిప్పర్లు నిలుపుతున్నాడు. డ్రైవర్లు గట్టిగా ప్రశ్నిస్తే నేను ఫలనా సార్ మనిషిని, ఆయన పంపించాడు. అందుకే వచ్చానని సమాధానం ఇస్తున్నాడు. యాజమాని ఫోన్‌నంబర్, టిప్పర్ నంబర్ రాసుకొని మరసటి రోజు ఫోన్ చేసి రూ.6 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడు. మరికొందరు అధికారులు యాజమానులతో నేరుగా రూ.10 వేలు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయం ఉన్నతాధికారులకు తెలిసి జరుగుతుందా లేదా అనేది ప్రశ్నార్థకం. విచారణ జరిపిస్తాం.. ప్రైవేట్ వ్యక్తులు పోలీసుశాఖ పేరుచెప్పి నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం. ఇసుక టిప్పర్లు నిలిపి డబ్బులు వసూలు చేస్తున్నారనే విషయంపై విచారణ జరిపిస్తాం. పోలీసుశాఖలో ఎవరూ ఇలాంటి చర్యలకు పాల్పడరు.–శ్రీధర్, డీఎస్పీ, మహబూబ్‌నగర్ -
మగ బిడ్డకి రూ.1,200.. ఆడబిడ్డకి వెయ్యి
ఈ చిత్రంలోని బాలింత పేరు దిల్షాద్. ధర్మవరానికి చెందిన ఈమె రెండో కాన్పు కోసం సర్వజనాస్పత్రిలో చేరింది. ఈ నెల 3న రాత్రి 12 గంటల సమయంలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆరోగ్యం సరిగా లేకపోవడంతో శిశువును ఎస్‌ఎన్‌సీయూలో ఉంచారు. దిల్షాద్ను పోస్టునేటల్‌కు మార్చాల్సి ఉండగా.. ఆ సమయంలో విధుల్లో ఉన్న క్లాస్–4 సిబ్బంది దిల్షాద్ భర్త మున్వర్‌ను రూ.1,200 డిమాండ్ చేశారు. ముందు వార్డుకు మార్చండి.. ఉదయం డబ్బులిస్తానని చెప్పినా వినకపోవడం వివాదానికి కారణమైంది. కరువు జిల్లా అనంతలో కాసులకు నిత్యం కటకటే. అందుకే నిరుపేదలంతా ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా జిల్లాకే పెద్దదిక్కుగా ఉన్న సర్వజనాస్పత్రికి పరుగున వస్తారు. ఇక ప్రసవాల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. కానీ ఆస్పత్రిలో తిష్టవేసిన ధన పిశాచులు.. డబ్బుకోసం నిరుపేదల రక్తం పీలుస్తున్నారు. ఆడపిల్లకు ఓ రేటు.. మగపిల్లాడైతే మరో రేటు కట్టి మరీ వసూలు చేస్తున్నారు. వారడిగినంత డబ్బులివ్వకపోతే బాలింతలకు నరకం చూపుతున్నారు. అనంతపురం హాస్పిటల్: మాతృత్వం ప్రతి మహిళ జీవితంలో అపురూప ఘట్టం. అందుకే తొమ్మిది నెలలు కడుపులో బిడ్డను మోసిన గర్భిణి.. ప్రసవం అయ్యాక బిడ్డను చూసుకుని ఎంతో మురిసిపోతుంది. తన ప్రతిరూపాన్ని చూసే క్షణాలకోసం ఎన్ని ఇబ్బందులైనా భరిస్తుంది. అలాంటి అపురూప క్షణాలను కూడా సర్వజనాస్పత్రిలోని సిబ్బంది మహిళలకు దూరం చేస్తున్నారు. మానవత్వం మరచి.. మనీ కోసం కక్కుర్తి పడుతున్నారు. అడిగినంత డబ్బులివ్వకపోతే బిడ్డను కూడా చూపని పరిస్థితి. దీంతో కాన్పులకోసం ఆస్పత్రికి వస్తున్న గర్భిణులు ప్రసవ సమయంలో వచ్చే నొప్పులకంటే డబ్బుల కోసం ఆస్పత్రిలోని సిబ్బంది పెట్టే హింసతో కన్నీరుమున్నీరవుతున్నారు. రేట్లు ఫిక్స్ చేశారు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లే ఆర్థిక స్థోమత లేనివారే సర్వజనాస్పత్రికి వస్తారు. కాన్పులు, ఇతర ఆరోగ్య సమస్యలకు జిల్లాలోని మారుమూల ప్రాంతాల నుంచి ఇక్కడికే వస్తారు. రోగులు ఆస్పత్రుల్లో ఉంటుండగా.. వారి బంధువులు, వెంట వచ్చిన వారు లాడ్జిల్లో బసచేసే ఆర్థిక స్థోమత లేక ఆస్పత్రి ఆవరణలోనే దోమలతో సహవాసం చేస్తుంటారు. అలాంటి వారినీ ఇక్కడి సిబ్బంది పీక్కుతింటున్నారు. ముఖ్యంగా గ్రూప్–4 సిబ్బంది ప్రసవాలకు రేట్ ఫిక్స్ చేశారు. మగ బిడ్డ పుడితే రూ.1,200, ఆడబిడ్డ పుడితే రూ.1,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే బిడ్డను ఇవ్వరు. అదీ కాకపోతే లేబర్ వార్డు నుంచి పోస్టునేటల్ వార్డుకు తీసుకెళ్లేది లేదని మొండికేస్తుండటం పరిపాటిగా మారింది. రోజూ 25 ప్రసవాలు జిల్లా కేంద్రంలోని సర్వజనాస్పత్రిలో రోజూ సరాసరి 25 ప్రసవాలు జరుగుతుంటాయి. అధిక శాతం బాలింతల నుంచి లేబర్ వార్డు క్లాస్–4 సిబ్బంది రూ.వేలకు వేలు వసూలు చేస్తున్నారనే విమర్శలున్నాయి. గ్రూపులుగా ఏర్పడి బాలింతల నుంచి డబ్బు వసూలు చేస్తున్నారు. డబ్బులిచ్చుకోలేని వారికి ప్రత్యక్ష నరకం చూపుతున్నారు. గట్టిగాఅడిగితే తాము కూడా ప్రసవానికి ఇంత అని అధికారులకు ఇవ్వాలంటున్నారు. ఏ అధికారికి అని అడిగితే మాత్రం సమాధానం దాటవేస్తున్నారు. ఈ చిత్రంలోని బాలింతల పేర్లు వరలక్ష్మి(రాణినగర్, అనంతపురం), భాగ్యమ్మ(కొడవాండ్లపల్లి). రెండ్రోజుల క్రితం ఇరువురూ ప్రసవించారు. రూ.700 ఇచ్చే వరకు బిడ్డనిచ్చేది లేదని వరలక్ష్మితో సిబ్బంది పేచీ పెట్టుకున్నారు. ఇక భాగ్యమ్మతోనూ రూ.1000లు ముక్కుపిండి వసూలు చేశారు. కూలీ పనులకెళ్లే తమలాంటోళ్లతో రూ.వేలల్లో డబ్బులు తీసుకుంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రిలో ప్రసవమైతే చాలు.. ప్రతి ఒక్కరూ క్లాస్–4 సిబ్బందికిలంచాలు సమర్పించుకోవాల్సి వస్తుండటం గమనార్హం. పట్టించుకోని ఆర్‌ఎంఓలు సర్వజనాస్పత్రిలో రెసిడెన్షియల్ మెడికల్ ఆఫీసర్ల(ఆర్ఎంఓ) రోగులకందే సేవలు, సిబ్బంది పనితీరును పరిశీలించాల్సి ఉంటుంది. కానీ ఆర్‌ఎంఓలు ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడంతో ఇక్కడికొస్తున్న నిరుపేదలు ఇబ్బందులు పడుతున్నారు. ఎవరైనా ఫిర్యాదు చేసినప్పుడు హడావుడి చేయడం తప్ప.. సిబ్బందిని సరైన మార్గంలో నడపలేకపోతున్నారు. చంద్రుని చూపునకు నోచుకోక... కలెక్టర్ గంధం చంద్రుడు బాధ్యతలు స్వీకరించి మూడు నెలలు దాటి పోయింది. ఆస్పత్రి అభివృద్ధి కమిటీ అధ్యక్షునిగా ఉన్న ఆయన ఇంతవరకు కనీసం ఆస్పత్రివైపు కన్నెత్తి చూడని పరిస్థితి. నిత్యం ఏదో ఒక పనిమీద ఆస్పత్రి ఎదుటే వెళ్తున్నా.. ఆస్పత్రిలోకి మాత్రం రాకపోవడం గమనార్హం. దీంతో పర్యవేక్షణ కొరవడటం.. ఉన్నతాధికారులు దృష్టి సారించకపోవడంతో సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అందువల్లే జిల్లాకే పెద్దదిక్కుగా ఉన్న సర్వజనాస్పత్రిలో రోగులకు సరైన వైద్య సేవలందడం లేదు. గతంలో ట్రెయినీ కలెక్టర్‌గా వచ్చిన వినోద్ అర్థరాత్రి వేళల్లో ఆస్పత్రిని తనిఖీ చేసే వారని, ఫలితంగా వైద్యులు, సిబ్బంది అలర్ట్‌గా ఉంటూ సేవలందించేవారని రోగులు గుర్తు చేసుకుంటున్నారు. చర్యలు తీసుకుంటున్నాం ఎఫ్ఎన్ఓ, స్వీపర్లు బాలింతల నుంచి డబ్బులు తీసుకుంటున్నట్లు ఫిర్యాదులు అందాయి. అందులో భాగంగా ఇద్దరిని వేరే వార్డుకు మార్చాం. ఆస్పత్రిలో సేవలకు ఎవరూ డబ్బులివ్వాల్సిన పనిలేదు. సర్వజనాస్పత్రిలో అన్ని సేవలు ఉచితమే. ఎవరైనా డబ్బు డిమాండ్ చేస్తే నాకు ఫిర్యాదు చేయవచ్చు. తప్పకుండా చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ లలిత, ఆర్ఎంఓ -
హోంగార్డుల అక్రమ వసూళ్ల వ్యవహారం
కర్నూలు, డోన్: పట్టణానికి చెందిన ఇద్దరు హోంగార్డులు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న వీడియోలు వాట్సప్, ఫేస్బుక్, యూట్యూబ్‌లలో హల్చల్ చేస్తున్నాయి. నిబంధనలు పాటించని ఆటో డ్రైవర్లు, లారీ, వ్యాన్ డ్రైవర్లను బెదిరించి వారి వద్ద నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేయడం పట్టణంలో పరిపాటిగా మారిందని ప్రజలు ఆరోపిస్తున్నారు. నిత్యం ట్రాఫిక్ విధులు నిర్వర్తిస్తున్న కొందరు సరుకుల అన్లోడ్ చేస్తున్న వాహనదారుల నుంచి అక్రమ వసూళ్లు చేయడం రివాజుగా మారిందంటున్నారు. వీరి చేష్టల వల్ల పెద్ద వాహనాలు రోడ్లకు అడ్డంగా నిలిపి సిమెంట్, నిత్యావసర వస్తువులు, ఐరన్లను అన్లోడ్ చేస్తూ ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగిస్తున్నారని డ్రైవర్లపై ఆరోపణలున్నాయి. అయితే ఈ వీడియోల హల్‌చల్‌ను పోలీసు ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. సంతృప్తికరమైన రీతిలో ప్రభుత్వం వేతనాలు పెంచినా ఇలా లంచాలకు పాల్పడుతూ పోలీస్ వ్యవస్థకే చెడ్డపేరు తెస్తున్నారని పోలీస్ అధికారి ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. -
పాస్ గ్యారంటీ స్కీమ్‌తో అక్రమాలు..
ఒంగోలు టౌన్: జిల్లాలో బుధవారం నుంచి ప్రారంభమైన ఓపెన్ స్కూల్ సొసైటీ పరీక్షల్లో అక్రమాలు ఓపెన్‌గా జరుగుతున్నాయి. పదో తరగతి, ఇంటర్ మీడియట్ పరీక్షలు రాసే అభ్యర్థుల నుంచి ముందుగానే సంబంధిత నిర్వాహకులు డీల్ కుదుర్చుకున్నారు. పాస్ గ్యారంటీ స్కీమ్‌తో అభ్యర్థుల నుంచి పెద్ద మొత్తంలో వసూళ్లు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. పరీక్ష రాస్తున్న ఒక్కో అభ్యర్థి నుంచి రూ.10 వేల నుంచి రూ.15 వేల రూపాయల చొప్పున డిమాండ్ చేస్తున్నారు. ఈ పరీక్షలు రాసేవారిలో రెగ్యులర్ విద్యార్థుల కంటే సర్టిఫికేట్లకు ప్రాధాన్యం ఇచ్చేవారు ఉండటంతో నిర్వాహకులు అడిగినంతగా ముట్ట చెప్పేందుకు అభ్యర్థులు సిద్ధమయ్యారు. దీంతో పరీక్షలు రాస్తున్న అభ్యర్థుల చూచిరాతకు గేట్లను బార్లా తెరిచారు. ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో జిల్లాలో నిర్వహిస్తున్న పదో తరగతి పరీక్షలకు 5049 మంది అభ్యర్థులు, ఇంటర్మీడియట్ పరీక్షకు 5479 మంది హాజరవుతున్నారు. పదో తరగతి అభ్యర్థుల కోసం 21 పరీక్ష కేంద్రాలు, ఇంటర్మీడియట్ అభ్యర్థుల కోసం 21 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ సర్టిఫికెట్లు ఎంతో వాల్యూ ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీలో పదో తరగతి, ఇంటర్ మీడియట్ సర్టికెట్లకు రెగ్యులర్‌గా చదివే విద్యార్థులకు ఉన్నంత విలువ ఉంది. ఈ సర్టిఫికెట్లు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించేందుకు, పదోన్నతులు పొందేందుకు ఎంతగానో ఉపయోగపడతాయి. దీంతో అనేకమంది ఓపెన్ స్కూల్స్ అంటేనే మక్కువ చూపిస్తున్నారు. నామమాత్రపు ఫీజులతో పదో తరగతి, ఇంటర్ మీడియట్లో చేరిన తరువాత వార్షిక పరీక్షల్లో నిర్వాహకులు అడిగినంత ముట్టచెబితే దర్జాగా సర్టిఫికెట్లు వచ్చి చేతిలో పడతాయి. ఎంతో విలువైన సర్టిఫికెట్లనునిర్వాహకులు కూడా అంతే విలువుగా మార్చుకోవడం విశేషం. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల అవసరాన్ని, ఆతృతను నిర్వాహకులు ఎంచక్కా సొమ్ము చేసుకుంటున్నారన్నది ఓపెన్ సీక్రెట్. సెంటర్లోనే రాయ‘బేరాలు’ జిల్లాలో ఓపెన్ స్కూల్‌కు సంబంధించి 60 సెంటర్లు ఉన్నాయి. పదోతరగతి, ఇంటర్ మీడియట్ చదివేవారికి ప్రతి ఆదివారం తరగతులు నిర్వహిస్తారు. ఏడాదికి 24కు తగ్గకుండా తరగతులు నిర్వహించాల్సి ఉంటుంది. పదో తరగతి చదవాలనుకునేవారికి ఎలాంటి విద్యార్హతలు లేకున్నా 14 సంవత్సరాల నుంచి ఆపైన ఎంత వయస్సు ఉన్నా అర్హులే. ఇంటర్ మీడియట్‌కు సంబంధించి కచ్చితంగా పదవ తరగతి ఉత్తీర్ణులై ఉండి 15 సంవత్సరాల నుంచి ఆపైన ఎంత వయస్సు ఉన్నా అర్హులే. ప్రతి సెంటర్‌కు ఇద్దరు ఉపాధ్యాయులు ఉంటారు. వారిలో ఒకరు ప్రధానోపాధ్యాయులుగా, సెంటర్ కో ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తారు. తాము నిర్వహించే సెంటర్లలో పదవ తరగతి, ఇంటర్ మీడియట్లో చేరేందుకు వచ్చేవారి వివరాలను, ఎలాంటి అవసరార్ధం కోసం చేరుతున్నారో ముందుగానే తెలుసుకొని అక్కడ నుండే రాయ‘బేరాలు’ సాగిస్తుంటారు. ఇన్విజిలేటర్ డ్యూటీలకు డిమాండ్.. జిల్లాలో జరుగుతున్న ఓపెన్ స్కూల్ సొసైటీ పరీక్షల ఇన్విజిలేటర్ డ్యూటీలకు ఎక్కడాలేని డిమాండ్ వచ్చి పడింది. ఏటా వేసవి సెలవుల్లో ఓపెన్ స్కూల్ పరీక్షలు నిర్వహిస్తుంటారు. వేసవి సెలవుల్లో ఉండే ఉపాధ్యాయులు ఓపెన్ స్కూల్ పరీక్ష విధులకు హాజరైతే వచ్చే విద్యా సంవత్సరంలో ఎర్న్డ్ లీవ్‌లు పొందే వెసులుబాటు ఉంది. దీంతో ఇన్విజిలేటర్ డ్యూటీలంటేనే ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎగిరి గంతేస్తున్నారు. అందుకు ఉదాహరణే ఒంగోలులోని ఒక పరీక్ష కేంద్రం. దీని పరిధిలో ఏడు పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. ఇక్కడ ఏడుగురు ఇన్విజిలేటర్లు సరిపోతారు. కానీ, ఏకంగా 35మంది ఇన్విజిలేటర్లు విధులకు హాజరవుతున్నారంటే ఆ డ్యూటీలకు ఎంత డిమాండ్ ఉందో అర్ధం చేసుకోవచ్చు. రూ.15 లక్షల కారు గిఫ్ట్.. జిల్లాలో ఓపెన్ స్కూల్ పరీక్షలు జరిగే ప్రతిసారీ పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతుంటాయి. 2015–2017 మధ్యకాలంలో జిల్లా విద్యాశాఖాధికారిగా వ్యవహరించిన ఒక అధికారికి అప్పటి ఓపెన్ స్కూల్ జిల్లా కో ఆర్డినేటర్ 15 లక్షల రూపాయల విలువైన కారును గిఫ్ట్‌గా ఇచ్చారంటే పరీక్షల్లో అభ్యర్థుల నుండి ఏ మేరకు వసూలు చేశారో అర్ధమవుతోంది. ఆ సమయంలో జిల్లాలో జరిగిన ఓపెన్ స్కూల్ పరీక్షల అక్రమాల గురించి పత్రికల్లో కథనాలు రావడంతో సాక్షాత్తు ఓపెన్ స్కూల్ డైరెక్టర్ వచ్చి పరీక్షలను పర్యవేక్షించాల్సి వచ్చింది. ప్రస్తుతం జరుగుతున్న ఓపెన్ పరీక్షల్లో కూడా అభ్యర్థుల నుంచి వసూళ్లు చేస్తున్న దానిలో కింది నుంచి విద్యాశాఖలో కీలక స్థాయిగా వ్యవహరించే వారివరకు ఎవరి వాటాలు వారికి సిద్ధం చేశారన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుంటేనే.. ఓపెన్ స్కూల్ సొసైటీకి జిల్లా కలెక్టర్ వినయ్‌చంద్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఓపెన్ స్కూల్‌కు కార్యక్రమాల నివేదికలను కలెక్టర్ ఖరారు చేయాల్సి ఉంటుంది. ఓపెన్ పరీక్షల విషయంలో గేట్లు బారుగా తెరిచి పెద్ద ఎత్తున జరుగుతున్న వసూళ్ల పర్వానికి జిల్లా కలెక్టర్ బ్రేక్‌లు వేయాల్సి ఉంది. ఆయన కూడా మౌనంగా వ్యవహరిస్తే జిల్లాలో ఓపెన్ అక్రమాలకు అడ్డే ఉండదు. అభ్యర్థుల నుంచి వసూళ్లకు అంతమనేది ఉండదు. కంభంలో జోరుగా కాపీయింగ్ కంభం : పదో తరగతి ఓపెన్ పరీక్షల్లో కాపీయింగ్ జోరుగా సాగింది. పాపం విద్యార్థుల కష్టాన్ని చూడలేక ఇన్విజిలేటర్లే ఎంచక్కా ప్రశ్న పత్రం చూసి బ్లాక్ బోర్డుపై సమాధానం రాశారు. ఆ కేంద్రంలో లేటు వయసులో పరీక్షకు హాజరైన వారంతా వాటిని చూచి రాస్తూ పండుగ చేసుకున్నారు. పదోతరగతి ఓపెన్ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. పరీక్షలకు ముందు జిల్లా ఉన్నతాధికారులు ఓపెన్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తాం. కేంద్రాల వద్ద 144 సెక్షన్లు అమలు చేస్తామంటూ ఆర్భాటపు ప్రకటనలు చేశారు. కానీ, అవేవీ ఆచరణలో కనబడలేదు. కంభంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను పరీక్ష కేంద్రంగా కేటాయించగా అక్కడ జరిగిన పరీక్షల్లో ఇన్విజిలేటర్లే బోర్డులపై ప్రశ్నలకు సమాధానాలు రాయడం విశేషం.పరీక్షలు జరుగుతున్న సమయంలో ప్రవేటు వ్యక్తులు ఇష్టానుసారంగా కేంద్రంలోకి వెళ్తున్నా ఎవరూ పట్టించుకోక పోవడం పలు విమర్శలకు తావిచ్చింది. పరీక్ష ప్రారంభమైన కొద్దిసేపటికే చీఫ్ సూపరిండెంట్ వెళ్లిపోయినట్లు తెలిసింది. స్క్వాడ్ అధికారులు కూడా అలా వచ్చి, ఇలా వెళ్లారు. వారు వెళ్లిన తర్వాత ఇన్విజిలేటర్లు కాపీయింగ్‌కు తెరలేపారు. రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు కూడా ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇక పరీక్షలు ఎంత బాగా జరగనున్నాయో వేచి చూడాలి. -
‘సర్వీస్’ పేరుతో దోపిడీ
చంద్రబాబునాయుడి ప్రభుత్వం ప్రతీది ప్రైవేట్‌పరం చేసి సర్వీస్ చార్జీల పేరుతో వినియోగదారులను దోచుకునేందుకు ఎప్పుడూ ముందుంటుంది. విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సేవలు అందిస్తున్నామని చెబుతూనే పలురకాల చార్జీలు వేస్తోంది. తాజాగా ప్రభుత్వ కన్ను ఏటీపీ కేంద్రాలపై పడింది. నెల్లూరు(వీఆర్సీసెంటర్): విద్యుత్ వినియోగదారులు బిల్లులు చెల్లించేందుకు వీలుగా పలు సబ్స్టేషన్లలో వసూలు కేంద్రాలను ఏర్పాటుచేశారు. అలాగే మీ–సేవ కేంద్రాల్లో కూడా బిల్లులు చెల్లించే అవకాశాన్ని కల్పించి ప్రతి బిల్లుపై అదనంగా రూ.5 వసూలు చేస్తున్నారు. వినియోగదారులకు 24 గంటలు అందుబాటులో ఉండేందుకు ‘విద్యుత్ బిల్లుల నిరంతర చెల్లింపు కేంద్రం’ (ఏటీపీ)ను ఆ శాఖ నెల్లూరు నగరంలోని మినీబైపాస్రోడ్టులోని మిలీనియం విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద, ఏకేనగర్‌లోని విద్యుత్‌భవన్ వద్ద, చిన్నబజారులోని చేపల మార్కెట్ వద్ద ఏర్పాటుచేశారు. దీంతో వేలాది మంది వినియోగదారులు ఏ సమయంలోనైనా బిల్లులు చెల్లిస్తూ కేంద్రాలకు అలవాటుపడ్డారు. మరో రెండు ఈ క్రమంలో గూడూరులో ఒకటి. నెల్లూరులో ఒకటి కేంద్రాలు మంజూరయ్యాయి. నగరంలో ఉన్న మూడు కేంద్రాల ద్వారానే నెలకు 30 వేలమంది వినియోగదారులు రూ.2 కోట్లు బిల్లులు చెల్లిస్తున్నారు. ఇప్పటివరకు వీటిలో బిల్లులు చెల్లించినందుకు ఒక్కరూపాయి కూడా తీసుకోలేదు. వారికి ఇచ్చేశారు ఈ ఏటీపీ కేంద్రాలను ఏపీఎస్పీడీసీఎల్ సంస్థ నిర్వహిస్తుండేది. ఈనెల నుంచి కేంద్రాలను ప్రైవేట్‌పరం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఓ సంస్థకు అప్పగించి సర్వీస్ చార్జీ పేరుతో వినియోగదారుల నుంచి నగదు వసూలు చేయనున్నారు. సదరు సంస్థ కేంద్రం పనివేళలు మార్చివేసింది. అవి ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకే పనిచేయనున్నాయి. విద్యుత్ బిల్లు రూ.1–200 వరకు సర్వీస్ చార్జీ రూ.2, రూ.201–1,000 వరకు రూ.5, రూ.1,001–2,500 వరకు రూ.10, రూ.2,500పైగా బిల్లుకు రూ.25 చెల్లించాలి. మరొకటి విద్యుత్ వినియోగదారుడికి వచ్చే బిల్లులోనే సర్‌చార్జి పేరుతో విద్యుత్ సంస్థ రూ.30–50 వరకు వసూలు చేస్తుంటుంది. గత నెల రూ.2,500పైగా బిల్లును ఏటీపీ ద్వారా చెల్లించిన వినియోగదారులు 6,870 మంది ఉన్నారు. అంతే మంది ఈనెల కూడా చెల్లిస్తే వారిపై రూ.25 సర్వీస్ చార్జీ పడనుంది. మొత్తంగా రూ.1,71,750 అదనంగా కడతారు. నెలకు రూ.1,000 వరకు బిల్లు చెల్లించే వారు 30,000 మంది ఉన్నారు. వీరి ద్వారా ప్రైవేట్ సంస్థకు రూ.1,50,000 వస్తుంది. మొత్తంగా కేంద్రాల ద్వారా సంస్థకు సర్వీస్ చార్జీ రూపంలో రూ.7.50 లక్షలు వినియోగదారులు అదనంగా చెల్లిస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. -
వసూళ్ల జైలు!
తిరుపతి పట్టణానికి చెందిన ఓ డీఈ లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డాడు. కేసు నమోదు చేసి కర్నూలు సబ్ జైలుకు తరలించారు. ఆయనను కలుసుకోవడానికి వారం రోజుల తరువాత భార్య జిల్లా జైలుకు వెళ్లారు. రిమాండ్ పూర్తయ్యే వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆయనకు అన్ని సౌకర్యాలు కల్పిస్తాం.. ములాఖత్‌కొచ్చిన కుటుంబ సభ్యులు, బంధువులకు ఎలాంటి అడ్డంకి లేకుండా ఏర్పాటు చేస్తామంటూ రూ.80 వేలు మామూళ్లు వసూలు చేశారు. ఒక డీఈ భార్యనే కాదు జిల్లా జైలుకు వెళ్లిన చాలా మంది సందర్శకుల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నారు. ఖైదీల్లో పరివర్తన తీసుకురావాల్సిన జైళ్లు.. వసూళ్ల కేంద్రాలుగా మారాయి. ఖైదీలను కలుసుకునేందుకు వెళ్లిన కుటుంబ సభ్యులు, బంధువుల నుంచి అక్కడ పని చేస్తున్న వార్డర్లు, హెడ్ వార్డర్లు బలవంతపువసూళ్లు చేస్తున్నారు. మామూళ్లతో వేధిస్తుండడంతో ఖైదీల బంధువులు లబో దిబోమంటున్నారు. కర్నూలు:ఖైదీల పరివర్తన కేంద్రాలుగా జైళ్లను తయారు చేస్తామని కర్నూలు జిల్లా జైలు ప్రారంభోత్సవంలో హోంమంత్రి చినరాజప్ప ప్రకటన చేశారు. ఖైదీల పరివర్తన దేవుడెరుగు వారిని కలుసుకునేందుకెళ్లిన కుటుంబ సభ్యులు, బంధువులు జేబులు ఖాళీ చేసుకోవాల్సి వస్తోంది. అక్కడ పని చేస్తున్న వార్డర్లు, హెడ్ వార్డర్లు ములాఖత్దారులను నిలువు దోపిడీ చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. చిన్న చిన్న శిక్షలు పడిన వారిని సైతం వదలకుండా మామూళ్లతో వేధిస్తోండడంతో ఖైదీల బంధువులు లబో దిబోమంటున్నారు. ఏసీబీ కేసుల్లో పట్టుబడిన ఖైదీలంటే పండగే... కర్నూలుతో పాటు కడప, అనంతపురం జిల్లాల్లో లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన ఉద్యోగులను కర్నూలు జైలుకు తరలిస్తారు. వారు రిమాండ్ ఖైదీలుగా వచ్చారంటే అక్కడ పని చేసే వార్డర్, హెడ్ వార్డర్లకు పండగే. లంచాలకు మరిగిన మీరు ములాఖత్‌కు మామూళ్లు ఇవ్వలేరా అంటూ వారి నుంచి ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. నాన్‌బెయిలబుల్ కేసుల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న వారిని కలుసుకునేందుకు వచ్చిన సందర్శకుల నుంచి కూడా భారీగా దండుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. డబ్బు ఇచ్చి న వారికి ఒక రకంగా ఇవ్వని వారికి మరో రకంగా ఇబ్బందులు పెడుతున్నారని ఖైదీల బంధువులు ఆరోపిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ములాఖత్ నిబంధనల ప్రకారం రిమాండ్ ఖైదీలను కటుంబ సభ్యులు, బంధువులు వారానికి రెండుసార్లు కలుసుకోవచ్చు. సోమవారం నుంచి శనివారం వరకు ఏఏ ఖైదీని ఎంతమంది కలిశారన్నది ‘విజిటర్స్ బుక్కు’లో నమోదు చేయాలి. అయితే మామూళ్లు ముట్టజెప్పినవారికి విజిటర్స్ బుక్కులో నమోదు చేయకుండానే ఎక్కువసార్లు ములాఖత్‌కు అవకాశం కల్పిస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. ఈ ఏడాది జనవరిలో కర్నూలు శివారులో ఒక వ్యక్తిపై జరిగిన హత్యాయత్నం కేసులో ఏ1 నిందితుడు కొంతకాలంగా ఈ జైలులోనే రిమాండ్‌లో ఉంటున్నాడు. నిబంధనలకు విరుద్ధంగా ఆయనకు ప్రతి రోజు ములాఖత్‌కు అవకాశం కల్పించి మామూళ్లు దండుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కేసు విచారణ నిమిత్తం ఆ ఖైదీని పోలీసులు కస్టడికి తీసుకున్నారు. అతడిని కలుసుకునేందుకు జైలు దగ్గరకెళ్లి అల్లర్లకు పాల్పడిన కొంతమంది యువకులపై తాలూకా పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ఆ ఖైదీని కలుసుకునేందుకు ప్రతి రోజు ఎలా అనుమతిస్తున్నారంటూ అక్కడ జరుగుతున్న వసూళ్ల వ్యవహారాన్ని పోలీసు అధికారులు జైళ్ల శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. రిమాండ్ ఖైదీలకు కోర్టు నుంచి బెయిల్ మంజూరైనా సాయంత్రం ఆరు గంటల తర్వాత వారిని బయటకు పంపరాదన్న నిబంధన చూపి ఒక్కొక్కరినుంచి రూ.1000 దాకా లంచం వసూలు చేస్తున్నట్లు సమాచారం. ప్రిజినర్ ఫోన్ క్యాష్ (పీపీసీ) పేరుతో చేసిన వసూళ్లలో కూడా కొంత మంది హెడ్ వార్డర్లు సగం మెత్తాన్ని కాజేస్తున్నట్లు ఖైదీల బంధువులు వాపోతున్నారు. సందర్శకులు, ములాఖత్దారుల నుంచి రోజుకు కనీసం రూ.10 వేలకు పైగా మామూళ్ల రూపంలో వసూలు చేసి అక్కడ పని చేస్తున్న కింది స్థాయి అధికారులు వాటాలు వేసి పంచుకుంటున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ వసూళ్ల తతంగంపై ఉన్నతాధికారులు నిఘా పెట్టి న్యాయం చేయాలని సందర్శకులు కోరుకుంటున్నారు. నగరానికి దూరం..సిబ్బంది ఇష్టారాజ్యం జిల్లా జైలు గతంలో నగరంలోని ఆర్డీఓ ఆఫీసు పక్కన ఉండేది. తరచూ ఉన్నతాధికారులు సందర్శించి అక్కడ పరిస్థితులను తెలుసుకునే వారు. ఏడాది క్రితం నగరానికి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో పంచలింగాల గ్రామ సమీపంలో జిల్లా జైలును నూతనంగా నిర్మించి అక్కడికి షిఫ్ట్ చేశారు. జైలు దూరంగా ఉండడంతో అధికారుల పర్యవేక్షణ కొరవడి వసూలు రాజాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఖైదీల బంధువులు ఆరోపిస్తున్నారు. ఇక్కడ 8 మంది వార్డర్లు, నలుగురు హెడ్ వార్డర్లు విధులు నిర్వహిస్తున్నారు. ఇందులో సగం మంది వసూళ్లే దిన చర్యగా వ్యవహరిస్తున్నారనే అరోపణలు ఉన్నాయి. ఆధార్‌కార్డు లేకుంటే రూ.1000 ముట్టజెప్పాల్సిందే హత్యలు, అత్యాచారాలు, చోరీలు, కొట్లాటలు, దోపిడీలు మొదలుకుని జేబుదొంగలు, సారా కేసుల్లో పట్టుబడినవారు, మద్యం బెల్టు దుకాణాలు నిర్వహిస్తూ కేసుల్లో ఇరుక్కున్నవారు ఈ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. తుంగ భద్ర బ్యారెక్స్‌లో రిమాండ్ ఖైదీలు, కృష్ణా బారెక్స్‌లో శిక్షలు పడినవారు ఉంటున్నారు. వారిని కలుసుకునేందుకు వెళ్లిన బంధువులు లేదా సందర్శకులు కచ్చితంగా ఆధార్‌కార్డు చూపించాలన్న నిబంధన ఉంది. అది లేకుండా వెళ్లిన వారికి కింది స్థాయి అధికారులు చుక్కలు చూపిస్తున్నారు. నిబంధనను సాకుగా చూపి రూ.500 నుంచి రూ.1000 దాకా మామూళ్లు వసూలు చేస్తున్నారు. కడప జిల్లాకు చెందిన ప్రభుత్వ ఉద్యోగి ఒకరు ఏసీబీకి పట్టుబడి ఇక్కడ రిమాండ్ ఖైదీగా ఉన్నారు. చూసేందుకు వచ్చిన కన్న కూతురికి నిబంధనలను సాకుగా చూపి అధికారులు భారీ మొత్తంలో దండుకున్నారు. ఫోన్లో ప్రతి రోజు మాట్లాడిస్తాం... ఆయనకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఇంటి వాతావరణంలో గడిపినట్టుగా చూసుకుంటామని ఇద్దరు హెడ్ వార్డర్లు వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఖైదీలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. రాయలసీమ యూనివర్సిటీకి చెందిన ఓ ఉద్యోగి చీటింగ్ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. ఆయనను కలుసుకునేందుకు వెళ్లిన తల్లి నుంచి డబ్బులు వసూలు చేసినట్లు సమీప బంధువులు ఆరోపిస్తున్నారు. జైల్లోకి రిమాండ్ ఖైదీలను అనుమతించేటప్పుడు తనిఖీ పేరుతో వారి జేబుల్లో ఉన్న మొత్తాలను కూడా స్వాహా చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. -
ఓటు నమోదుకు వసూళ్లు
నెల్లూరు(వీఆర్సీ సెంటర్): నెల్లూరు నగరంలోని ఐదో డివిజన్ పాత చెక్‌పోస్టు, అహ్మద్‌నగర్ ప్రాంతాల్లో గత నాలుగు రోజులుగా పోలింగ్ బూత్ నంబరు 106లో కొత్త ఓటుహక్కు నమోదు కార్యక్రమాన్ని పోలింగ్ బూత్ ఆఫీసర్ మంజుల చేపట్టారు. అయితే నమోదు ప్రక్రియలో అవకతవకలు జరిగాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. కొత్తగా నమోదు చేసుకునే ఓటరు నుంచి రూ.30 వసూలు చేశారని కొందరు స్థానికులు తెలిపారు. అలాగే ఇంటింటికీ వెళ్లి ఈ ప్రక్రియ చేపట్టాల్సి ఉండగా ఒకచోట కూర్చుని కొందరి వద్దే వివరాలు సేకరించి వెళ్లిపోయారని స్థానికులు చెబుతున్నారు. దీంతో ఇప్పటికీ 400 మందికి కొత్తగా ఓటు నమోదు చేసుకునే అవకాశం లేకుండాపోయిందని వాపోతున్నారు. అంతేకాక బీఎల్ఓ ఇంటికి వచ్చి మీరు ఎవరికి ఓటువేస్తారు? అని అడగడం.. చంద్రబాబునాయుడుకు ఓటు వేయండంటూ బహిరంగంగానే ప్రచారం చేయడంపై స్థానికులు, నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొత్త ఓటు నమోదు చేయలేదు కొత్తగా ఓటు నమోదు ప్రక్రియకు ఆదివారం చివరిరోజు. మా ఇంటికి ఎవరూ రాలేదు. నాకు ఓటు హక్కు రాదేమోనని భయంగా ఉం ది. ప్రతి ఇంటికి వచ్చి కొత్త ఓటర్లను నమోదు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు అలాంటిది జరగలేదు. – ఎస్కే మస్తాన్, బేల్దారి, అహ్మద్‌నగర్ ఓటు నమోదుకురూ.30 తీసుకున్నారు మంజుల రెండు రోజుల నుంచి ఇక్కడ ఓటు నమోదు కార్యక్రమమంటూ వచ్చింది. అయితే మా ఇంట్లో పాత ఓట్లకు ఎలాంటి డబ్బులు తీసుకోలేదు. కొత్తగా ఓటు రాయించుకున్నందుకు రూ.30 అడిగి తీసుకుంది. ఎందుకని అడిగితే ఖర్చులకు కావాలి, పోస్టు ఖర్చులకు అని చెప్పింది. – ఖాదర్‌బీ, బోడిగాడితోట -
ఉద్యోగాలపేరుతో రూ. 54 లక్షలు స్వాహా
అంబాజీపేట (తూర్పుగోదావరి) : అన్నా, చెల్లెలు, మరో వ్యక్తి.. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ లక్షల రూపాయలు వసూలు చేసి, మోసగించినట్టు తూర్పు గోదావరి జిల్లా అంబాజీపేట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. శుక్రవారం ఏఎస్సై ఐ. మురళీకృష్ణ విలేకరులకు తెలిపిన వివరాల ప్రకారం.. అంబాజీపేట మండలం కె.పెదపూడికి చెందిన గుమ్మడి మురళి, అతని సోదరి వీర నాగమల్లేశ్వరి, బెంగళూరుకు చెందిన షాన్ భగవాన్ నాయుడు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగుల నుంచి సొమ్ములు వసూలు చేశారు. కోనసీమలోని 27 మంది నుంచి రూ.54 లక్షలు వసూలు చేశారని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. విశాఖలోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో ఉద్యోగం వేయిస్తానని పి. గన్నవరం మండలం గుత్తులవారిపాలెంకు చెందిన కుడుపూడి శ్రీనివాసరావు నుంచి మూడు నెలల క్రితం రూ.4 లక్షలు వసూలు చేశారు. ఇప్పటికీ ఉద్యోగం రాకపోవడంతో శ్రీనివాసరావు అన్నాచెల్లెళ్లను ప్రశ్నించాడు. వారినుంచి సరైన సమాధానం రాకపోవడంతో అంబాజీపేట పోలీసులను ఆశ్రయించాడు. అతని ఫిర్యాదు మేరకు ఎస్హెచ్ఓ పి. జయంత్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసాలకు పాల్పడుత్ను అన్నాచెల్లెళ్లు, షాన్ భగవాన్ నాయుడులపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. కాగా నిరుద్యోగుల నుంచి వసూలు చేసిన సొమ్మును ఎప్పటికప్పుడు ఆన్లైన్ ద్వారా షాన్ భగవాన్ నాయుడుకు పంపించినట్లు వీర నాగమల్లేశ్వరి పోలీసులకు చెబుతోంది.