వసూళ్ల జైలు! | Money Collection In District Jail | Sakshi
Sakshi News home page

వసూళ్ల జైలు!

Published Mon, Apr 2 2018 9:35 AM | Last Updated on Mon, Apr 2 2018 9:35 AM

Money Collection In District Jail - Sakshi

జిల్లా జైలు (ఫైల్‌)

తిరుపతి పట్టణానికి చెందిన ఓ డీఈ లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డాడు. కేసు నమోదు చేసి కర్నూలు సబ్‌ జైలుకు తరలించారు. ఆయనను కలుసుకోవడానికి వారం రోజుల తరువాత భార్య జిల్లా జైలుకు వెళ్లారు. రిమాండ్‌ పూర్తయ్యే వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆయనకు అన్ని సౌకర్యాలు కల్పిస్తాం.. ములాఖత్‌కొచ్చిన కుటుంబ సభ్యులు, బంధువులకు ఎలాంటి అడ్డంకి లేకుండా ఏర్పాటు చేస్తామంటూ రూ.80 వేలు మామూళ్లు వసూలు చేశారు. ఒక డీఈ భార్యనే కాదు జిల్లా జైలుకు వెళ్లిన చాలా మంది సందర్శకుల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నారు.

ఖైదీల్లో పరివర్తన తీసుకురావాల్సిన జైళ్లు.. వసూళ్ల కేంద్రాలుగా మారాయి. ఖైదీలను కలుసుకునేందుకు వెళ్లిన కుటుంబ సభ్యులు, బంధువుల నుంచి అక్కడ పని చేస్తున్న వార్డర్లు, హెడ్‌ వార్డర్లు బలవంతపువసూళ్లు చేస్తున్నారు. మామూళ్లతో వేధిస్తుండడంతో ఖైదీల బంధువులు లబో దిబోమంటున్నారు.

కర్నూలు:ఖైదీల పరివర్తన కేంద్రాలుగా జైళ్లను తయారు చేస్తామని కర్నూలు జిల్లా జైలు ప్రారంభోత్సవంలో హోంమంత్రి చినరాజప్ప  ప్రకటన చేశారు. ఖైదీల పరివర్తన దేవుడెరుగు వారిని కలుసుకునేందుకెళ్లిన కుటుంబ సభ్యులు, బంధువులు జేబులు ఖాళీ చేసుకోవాల్సి వస్తోంది. అక్కడ పని చేస్తున్న వార్డర్లు, హెడ్‌ వార్డర్లు ములాఖత్‌దారులను నిలువు దోపిడీ చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. చిన్న చిన్న శిక్షలు పడిన వారిని సైతం వదలకుండా మామూళ్లతో వేధిస్తోండడంతో ఖైదీల బంధువులు లబో దిబోమంటున్నారు. 

ఏసీబీ కేసుల్లో పట్టుబడిన ఖైదీలంటే పండగే...
కర్నూలుతో పాటు కడప, అనంతపురం జిల్లాల్లో లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన ఉద్యోగులను కర్నూలు జైలుకు తరలిస్తారు. వారు రిమాండ్‌ ఖైదీలుగా వచ్చారంటే అక్కడ పని చేసే వార్డర్, హెడ్‌ వార్డర్లకు పండగే. లంచాలకు మరిగిన మీరు ములాఖత్‌కు మామూళ్లు ఇవ్వలేరా అంటూ వారి నుంచి ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. నాన్‌బెయిలబుల్‌ కేసుల్లో రిమాండ్‌ ఖైదీలుగా ఉన్న వారిని కలుసుకునేందుకు వచ్చిన సందర్శకుల నుంచి కూడా భారీగా దండుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. డబ్బు ఇచ్చి న వారికి ఒక రకంగా ఇవ్వని వారికి మరో రకంగా ఇబ్బందులు పెడుతున్నారని ఖైదీల బంధువులు ఆరోపిస్తున్నారు. 

నిబంధనలకు విరుద్ధంగా ములాఖత్‌
నిబంధనల ప్రకారం రిమాండ్‌ ఖైదీలను కటుంబ సభ్యులు, బంధువులు వారానికి రెండుసార్లు కలుసుకోవచ్చు. సోమవారం నుంచి శనివారం వరకు ఏఏ ఖైదీని ఎంతమంది కలిశారన్నది ‘విజిటర్స్‌ బుక్కు’లో నమోదు చేయాలి. అయితే మామూళ్లు ముట్టజెప్పినవారికి విజిటర్స్‌ బుక్కులో నమోదు చేయకుండానే ఎక్కువసార్లు ములాఖత్‌కు అవకాశం కల్పిస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. ఈ ఏడాది జనవరిలో కర్నూలు శివారులో  ఒక వ్యక్తిపై జరిగిన హత్యాయత్నం కేసులో ఏ1 నిందితుడు కొంతకాలంగా ఈ జైలులోనే రిమాండ్‌లో ఉంటున్నాడు.  నిబంధనలకు విరుద్ధంగా ఆయనకు ప్రతి రోజు ములాఖత్‌కు అవకాశం కల్పించి మామూళ్లు దండుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కేసు విచారణ నిమిత్తం ఆ ఖైదీని పోలీసులు కస్టడికి తీసుకున్నారు.

అతడిని కలుసుకునేందుకు జైలు దగ్గరకెళ్లి అల్లర్లకు పాల్పడిన కొంతమంది యువకులపై తాలూకా పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ఆ ఖైదీని కలుసుకునేందుకు ప్రతి రోజు ఎలా అనుమతిస్తున్నారంటూ అక్కడ జరుగుతున్న వసూళ్ల  వ్యవహారాన్ని పోలీసు అధికారులు  జైళ్ల శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. రిమాండ్‌ ఖైదీలకు కోర్టు నుంచి బెయిల్‌ మంజూరైనా సాయంత్రం ఆరు గంటల తర్వాత వారిని బయటకు పంపరాదన్న నిబంధన  చూపి  ఒక్కొక్కరినుంచి రూ.1000 దాకా లంచం వసూలు చేస్తున్నట్లు సమాచారం. ప్రిజినర్‌ ఫోన్‌ క్యాష్‌ (పీపీసీ) పేరుతో చేసిన వసూళ్లలో కూడా కొంత మంది హెడ్‌ వార్డర్లు సగం మెత్తాన్ని కాజేస్తున్నట్లు ఖైదీల బంధువులు వాపోతున్నారు. సందర్శకులు, ములాఖత్‌దారుల నుంచి రోజుకు కనీసం రూ.10 వేలకు పైగా మామూళ్ల రూపంలో వసూలు చేసి అక్కడ పని చేస్తున్న కింది స్థాయి అధికారులు వాటాలు వేసి పంచుకుంటున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.  ఈ వసూళ్ల తతంగంపై ఉన్నతాధికారులు నిఘా పెట్టి న్యాయం చేయాలని సందర్శకులు కోరుకుంటున్నారు.

నగరానికి దూరం..సిబ్బంది ఇష్టారాజ్యం
జిల్లా జైలు గతంలో నగరంలోని ఆర్‌డీఓ ఆఫీసు పక్కన ఉండేది. తరచూ ఉన్నతాధికారులు సందర్శించి అక్కడ పరిస్థితులను తెలుసుకునే వారు. ఏడాది క్రితం నగరానికి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో పంచలింగాల గ్రామ సమీపంలో జిల్లా జైలును నూతనంగా నిర్మించి అక్కడికి షిఫ్ట్‌ చేశారు.  జైలు దూరంగా ఉండడంతో అధికారుల పర్యవేక్షణ కొరవడి వసూలు రాజాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఖైదీల బంధువులు ఆరోపిస్తున్నారు. ఇక్కడ 8 మంది వార్డర్లు, నలుగురు హెడ్‌ వార్డర్లు విధులు నిర్వహిస్తున్నారు. ఇందులో సగం మంది వసూళ్లే దిన చర్యగా వ్యవహరిస్తున్నారనే అరోపణలు ఉన్నాయి. 

ఆధార్‌కార్డు లేకుంటే రూ.1000 ముట్టజెప్పాల్సిందే  
హత్యలు, అత్యాచారాలు, చోరీలు, కొట్లాటలు, దోపిడీలు మొదలుకుని జేబుదొంగలు, సారా కేసుల్లో పట్టుబడినవారు, మద్యం బెల్టు దుకాణాలు నిర్వహిస్తూ కేసుల్లో ఇరుక్కున్నవారు ఈ జైలులో రిమాండ్‌ ఖైదీలుగా ఉన్నారు. తుంగ భద్ర బ్యారెక్స్‌లో రిమాండ్‌ ఖైదీలు, కృష్ణా బారెక్స్‌లో శిక్షలు పడినవారు ఉంటున్నారు. వారిని కలుసుకునేందుకు వెళ్లిన బంధువులు లేదా సందర్శకులు కచ్చితంగా ఆధార్‌కార్డు చూపించాలన్న నిబంధన ఉంది. అది లేకుండా వెళ్లిన వారికి కింది స్థాయి అధికారులు చుక్కలు చూపిస్తున్నారు. నిబంధనను సాకుగా చూపి రూ.500 నుంచి రూ.1000 దాకా మామూళ్లు వసూలు చేస్తున్నారు. కడప జిల్లాకు చెందిన ప్రభుత్వ ఉద్యోగి ఒకరు ఏసీబీకి పట్టుబడి ఇక్కడ రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు.

చూసేందుకు వచ్చిన కన్న కూతురికి నిబంధనలను సాకుగా చూపి అధికారులు  భారీ మొత్తంలో దండుకున్నారు. ఫోన్‌లో ప్రతి రోజు మాట్లాడిస్తాం... ఆయనకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఇంటి వాతావరణంలో గడిపినట్టుగా  చూసుకుంటామని ఇద్దరు హెడ్‌ వార్డర్లు వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఖైదీలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. రాయలసీమ యూనివర్సిటీకి చెందిన ఓ ఉద్యోగి చీటింగ్‌ కేసులో  రిమాండ్‌ ఖైదీగా ఉన్నాడు. ఆయనను కలుసుకునేందుకు వెళ్లిన  తల్లి నుంచి డబ్బులు వసూలు చేసినట్లు సమీప బంధువులు ఆరోపిస్తున్నారు. జైల్‌లోకి  రిమాండ్‌ ఖైదీలను అనుమతించేటప్పుడు తనిఖీ పేరుతో వారి జేబుల్లో ఉన్న మొత్తాలను కూడా స్వాహా చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement