విద్యుత్ సంస్థల్లో 15 మంది డైరెక్టర్ల పోస్టులకు ముందే ఖరారైన అభ్యర్థులు
మొక్కుబడిగా ఇంటర్వ్యూలు.. పాత వారితో రాజీనామా చేయించిన కూటమి నేతలు
ముడుపులిచ్చే వారికి అనుకూలంగా నిబంధనలు
ఆఖరి నిమిషంలో ఇంటర్వ్యూల ప్రదేశాన్ని మార్చేసిన అధికారులు
రాష్ట్ర సచివాలయం నుంచి 25 కి.మీ. దూరంలోని విద్యుత్ సౌధకు మార్పు
ఆలస్యంగా వచ్చారనే నెపంతో అనర్హులుగా చేసే యత్నం?
సాక్షి, అమరావతి: విద్యుత్ సంస్థల్లో కాసులు దండుకొనే ప్రక్రియలో కూటమి నేతలు మరో అంకాన్ని మొదలెట్టారు. కూటమి ప్రభుత్వం రాగానే బలవంతంగా రాజీనామా చేయించిన డైరెక్టర్ల స్థానంలో కొత్త వారి నియామకానికి ఇంటర్వ్యూలు ప్రారంభించారు. ఇప్పటికే డైరెక్టర్ల పోస్టుల్లో ఎవరిని నియమించాలో ఖరారై పోవడంతో ఇప్పుడు ఇంటర్వ్యూలు మొక్కుబడిగానే సాగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తొలి రోజు ఆంధ్రప్రదేశ్ తూర్పు, దక్షిణ ప్రాంత విద్యుత్ సంస్థ (డిస్కం)ల డైరెక్టర్ల పోస్టులకు ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, డిస్కంల సీఎండీలు, ఓ సాంకేతిక నిపుణుడు (మాజీ డైరెక్టర్) ఇంటర్వ్యూలు నిర్వహించారు.
మొత్తం ముడుపుల కోసమే
కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత అధికార పార్టీ నేతలు డిస్కంలతో పాటు ఏపీ జెన్‌కో, ఏపీ ట్రాన్స్‌కోలో గత ప్రభుత్వంలో నియమితులైన 10 మంది డైరెక్టర్ల చేత జూలై 3న బలవంతంగా రాజీనామా చేయించారు. వీరితో పాటు గత నబంబర్‌లో పదవీకాలం పూర్తయిన ఐదుగురితో కలిపి మొత్తం 15 మంది డైరెక్టర్ల పోస్టులపై కన్నేసిన కూటమి పెద్దలు.. తమకు ముడుపులిచ్చే వారిని నియమించేందుకు నిబంధనలను మార్చేసుకున్నారు. గత్యంతరం లేక వారికి ఉన్నతాధికారులు సహకరిస్తున్నారు. గరిష్ట వయో పరిమితిని 62 ఏళ్ల నుంచి 65 ఏళ్లకు పెంచారు. చీఫ్ జనరల్ మేనేజర్ స్థాయి వారితో పాటు సూపరింటెండెంట్ ఇంజనీర్లు, చీఫ్ ఇంజనీర్లు కూడా అర్హులేనంటూ నిబంధనలు సవరించేశారు.
పవర్ జనరేషన్ కార్పొరేషన్లో ఓ మహిళా అధికారిని హెచ్‌ఆర్ డైరెక్టర్‌గా కూర్చోబెట్టేందుకు ఆమె మాత్రమే అర్హత సాధించేలా నిబంధనలు మార్చారు. జాయింట్ సెక్రటరీ కేటగిరీకి అర్హత ఇచ్చి, చీఫ్ ఇంజినీర్ కేటగిరీని తీసేశారు. మిగతా పోస్టులకు మాత్రం చీఫ్ ఇంజనీర్ అర్హులేనంటూ ఆదేశాలిచ్చారు. తర్వాత కూటమి పెద్దలు కొందరు ఒక్కో పోస్టుకు రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకూ డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. చివరిగా ‘చినబాబు’ ఓ జాబితాను ఖరారు చేశారని, అందులో ఉన్నవారికే ఈ పోస్టులు కట్టబెడతారని సమాచారం.
ఆరంభమే గందరగోళం
ఏపీ ట్రాన్స్‌కోలో ఫైనాన్స్, టెక్నికల్, ఏపీ జెన్‌కోలో థర్మల్, ఫైనాన్స్, హెచ్‌ఆర్, హైడల్, కోల్, ఏపీఈపీడీసీఎల్‌లో ఆపరేషన్స్, ప్రాజెక్ట్స్, ఏపీసీపీడీసీఎల్, ఎస్పీడీసీఎల్‌లో ప్రాజెక్ట్స్, టెక్నికల్, ఫైనాన్స్ పోస్టులకు 189 మంది దరఖాస్తు చేశారు. వీరిలో 167 మందికి రాష్ట్ర సచివాలయంలో ఉదయం 10 గంటలకు ఇంటర్వ్యూలు ఉంటాయని తెలియజేశారు. అభ్యర్థులు ఉదయమే సచివాలయానికి చేరుకోగా.. ఇక్కడ కాదు.. విజయవాడ గుణదలలోని విద్యుత్ సౌధకు వెళ్లాలని అధికారులు సమాచారం ఇచ్చారు. ఈ రెండింటికీ మధ్య 25 కిలోమీటర్ల దూరం ఉంటుంది.
అంత దూరం ట్రాఫిక్‌ను దాటుకుని విద్యుత్ సౌధను చేరుకోవడానికి అభ్యర్థులు నానా తంటాలు పడ్డారు. ఉదయం 10 గంటలకల్లా ఇంటర్వ్యూకు వెళ్లాల్సిన వాళ్లు ఆలస్యంగా చేరుకున్నారు. కొందరు వెనక్కి వెళ్లిపోయారు. మరికొందరు వర్చ్యువల్‌గా హాజరయ్యారు. ఆలస్యంగా వచ్చారని వారిని అనర్హులను చేసి, మెచ్చిన వారికి పోస్టులు ఇవ్వడం కోసమే ఇలా దారి మళ్లించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏపీఈపీడీసీఎల్, ఏపీఎస్పీడీసీఎల్‌లో డైరెక్టర్ల పోస్టులకు ఇంటర్వ్యూలను సోమవారం రాత్రికి పూర్తి చేశారు. మంగళవారం జెన్‌కో, ట్రాన్స్‌కో, బుధవారం సీపీడీసీఎల్‌లో డైరెక్టర్ల పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
డబ్బులు వసూలు చేస్తే ఫోన్ చేసి చెప్పండి
డైరెక్టర్ల పోస్టుల కోసం డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఎవరికైనా సమాచారం తెలిస్తే తమ దృష్టికి తీసుకురావాలని ఇంధన శాఖ సోమవారం ఓ ప్రకటనలో కోరింది. ఇందుకోసం ఏపీ ట్రాన్స్‌కో విజిలెన్స్ విభాగం మొబైల్ నంబర్ 9490154719కు ఫోన్ చేసి వివరాలు తెలపాలని కోరింది.
Comments
Please login to add a commentAdd a comment