district jail
-
రూ.78 కోట్లతో జిల్లా జైలు... శంకుస్థాపన చేయనున్న మంత్రి హరీశ్‌రావు
సిద్దిపేటకమాన్: సిద్దిపేట ఎన్సాన్పల్లి శివారులో జిల్లా జైలు ఏర్పాటు కానుంది. రూ.78 కోట్ల వ్యయంతో 34 ఎకరాల విస్తీర్ణంలో చేపట్టనున్న భవానికి మంగళవారం ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ప్రస్తుతం పట్టణంలో 15 మంది ఖైదీల కెపాసిటీతో సబ్ జైలు కొనసాగుతుండగా ఎన్సాన్‌పల్లిలో 21 ఫీట్ల ఎత్తుతో హై సెక్యూరిటీ గోడలు, 17 బ్లాక్‌లతో కొత్త జైలు త్వరలో అందుబాటులోకి రానుంది. కొత్త జైలులో అడ్మిన్ బ్లాక్, హాస్పిటల్ బ్లాక్, క్వార్టర్స్, రిసిప్షెన్, అడ్మిన్ బ్లాక్, డార్మెటరీ, లైబ్రెరీ, ఫీమెల్ బ్లాక్, పురుషులు, మహిళలు వేర్వేరుగా లాకప్‌లు, ఇతర సదుపాయాలు కల్పించనున్నారు. సుమారు 500 మంది ఖైదీల కెపాసిటీ, 50 మంది సిబ్బంది విధులు నిర్వహించేలా నిర్మించనున్నారు. 18 నెలల్లో నిర్మాణం పూర్తి అందుబాటులోకి తేనున్నట్లు పోలీస్ హౌసింగ్ ఏఈ సుధాకర్ తెలిపారు. -
జైలులో ‘హైడ్రో’ ఫార్మింగ్
తాజా ఆకుకూరలను ఖైదీలకు అందించాలనే ఉద్దేశంతో సంగారెడ్డి జిల్లా జైలులో వినూత్నంగా హైడ్రోపోనిక్ సాగు పద్ధతికి శ్రీకారం చుట్టారు. మొదటగా పాలకూరను పండిస్తున్నారు. ఈ పద్ధతిలో సాగుకు మట్టి అవసరం లేదు. మొక్కలు నీటిలోనే పెరుగుతాయి. నీటివినియోగం కూడా చాలా తక్కువ. నేలలో పంటలకు కావలసిన నీటిలో 5 శాతం చాలు. విత్తనాలను చిన్న ట్రేలలో కొబ్బరి పొట్టులో వేసి మొలకెత్తిస్తారు. మొక్కల ఎదుగుదలకు కావాల్సిన పోషకాలను ద్రావణాల రూపంలో అందిస్తున్నారు. మున్ముందు కొత్తమీర, చుక్కకూరతోపాటు మిర్చి టమాట, వంగ తదితర కూరగాయ పంటలను సైతం పండించడానికి సన్నద్ధమవుతున్నా జైలు సూపరిండెంట్ నవాబు శివకుమార్ గౌడ్ ‘సాక్షి’కి వివరించారు. హైడ్రోపోనిక్ సాగు విధానం.. ప్లాస్టిక్ ట్రేలలో కొబ్బరిపొట్టు నింపి విత్తనాలు వేస్తారు. వారం రోజుల్లోగా ఆ విత్తనం మొలకెత్తుతుంది. ఎదిగిన మొక్కను తీసి నెట్ పాట్(జాలీ గ్లాసుల)లో పెట్టి, మొక్క నిలబడడానికి క్లేబాల్స్(మట్టి బంతులు), గులకరాళ్లు వంటివి వాడతారు. మొక్కలతో కూడిన జాలీ గ్లాసులను పీవీసీ పైపులలో ఉంచుతారు. పోషక ద్రావణాలతో కూడిన నీరు ఈ పైపులలో ఉంటుంది. అందులోని పోషకాలను మొక్కలు వేర్ల ద్వారా గ్రహించి పెరుగుతాయి. పీవీసీ లేదా ఫైబర్ పైపులను ఒకచోట అమరుస్తారు. ఇందుకు పెద్దగా స్థలం అవసరం ఉండదు. ఈ సాగుకు గాను పైపులకు సరిపడా గ్రీన్నెట్ లేదా షెడ్ నెట్ ఉపయోగించవచ్చు. 25 పైపులతో అమరిస్తే సుమారుగా 650 మొక్కలను సాగు చేసే అవకాశం ఉంది. అడుగుకు ఒక మొక్క పెడితే వేయి మొక్కలను సాగుచేయవచ్చు. మొక్కకు కావాల్సిన పోషకాలను మ్యాక్రో సొల్యూషన్స్ (స్థూలపోషకాలు), మైక్రోసొల్యూషన్స్ (సూక్ష్మ పోషకాలు) ద్రావణాల ద్వారా అందిస్తారు. పురుగుమందుల అవసరం ఉండదు. మొక్క పెట్టిన మొదట్లో నీటిలో పోషకాల స్థాయి 800 వరకు ఉంటే సరిపోతుంది. మొక్క ఎదుగుతున్న కొద్దీ పోషకాల స్థాయి 1500 వరకు ఉండాలి. ప్రతి రోజు రెండు గంటలు ఎండ తగిలే విధంగా పైపులను ఉంచుతారు. ప్రతి రోజు మొక్క ఎదుగుదలను తెలుసుకోవడానికి ద్రావణాల మోతాదును, నీటిలో పీహెచ్ విలువను ఖచ్చితంగా పీహెచ్ మీటర్ ద్వారా పరీక్షిస్తారు. అదే విధంగా పోషకాలు ఎంత ఉన్నాయో తెలుసుకోవడానికి ఎలక్ట్రో కండక్టివిటీ మీటర్‌ను వాడతారు. ఆకుకూరలైతే మూడు నుంచి నాలుగు వారాలలోపే మొదటి పంట చేతికి వస్తుంది. కూరగాయలైతే నాలుగు నుంచి ఐదు వారాల సమయం పట్టే అవకాశం ఉంది. హెడ్రోపోనిక్ పద్ధతి ద్వారా సంగారెడ్డి జిల్లా జైలులోని 250 మంది ఖైదీల కోసం తాజా పాలకూర సాగు మొదలు పెట్టామని జైలు సూపరిండెంట్ శివకుమార్‌గౌడ్ ‘సాక్షి’తో చెప్పారు. ఉన్నతాధికారుల తోడ్పాటుతో కూరగాయలు కూడా పండించడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. – కొలన్ దివాకర్‌రెడ్డి, సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి బి.శివప్రసాద్, స్టాఫ్ ఫొటోగ్రాఫర్ -
ఖైదీ బంగారం మాయం..!
సాక్షి, నల్గొండ: జిల్లా జైలులో శిక్ష అనుభవిస్తున్న ఓ ఖైదీకి చెందిన బంగారు ఉంగరాలు చోరీకి గురయ్యాయి. 80 వేల విలువైన ఉంగరాలను ఎవరో తస్కరించారని జైళ్ల శాఖ డీఐజీ సైదయ్య వెల్లడించారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని, బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఘటనపై విచారణ చేసేందుకు స్థానిక పోలిస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని తెలిపారు. భవిష్యత్‌లో ఇలాంటివి జరగకుండా లాకర్ వ్యవస్థను కట్టుదిట్టం చేస్తామని స్పష్టం చేవారు. -
వసూళ్ల జైలు!
తిరుపతి పట్టణానికి చెందిన ఓ డీఈ లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డాడు. కేసు నమోదు చేసి కర్నూలు సబ్ జైలుకు తరలించారు. ఆయనను కలుసుకోవడానికి వారం రోజుల తరువాత భార్య జిల్లా జైలుకు వెళ్లారు. రిమాండ్ పూర్తయ్యే వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆయనకు అన్ని సౌకర్యాలు కల్పిస్తాం.. ములాఖత్‌కొచ్చిన కుటుంబ సభ్యులు, బంధువులకు ఎలాంటి అడ్డంకి లేకుండా ఏర్పాటు చేస్తామంటూ రూ.80 వేలు మామూళ్లు వసూలు చేశారు. ఒక డీఈ భార్యనే కాదు జిల్లా జైలుకు వెళ్లిన చాలా మంది సందర్శకుల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నారు. ఖైదీల్లో పరివర్తన తీసుకురావాల్సిన జైళ్లు.. వసూళ్ల కేంద్రాలుగా మారాయి. ఖైదీలను కలుసుకునేందుకు వెళ్లిన కుటుంబ సభ్యులు, బంధువుల నుంచి అక్కడ పని చేస్తున్న వార్డర్లు, హెడ్ వార్డర్లు బలవంతపువసూళ్లు చేస్తున్నారు. మామూళ్లతో వేధిస్తుండడంతో ఖైదీల బంధువులు లబో దిబోమంటున్నారు. కర్నూలు:ఖైదీల పరివర్తన కేంద్రాలుగా జైళ్లను తయారు చేస్తామని కర్నూలు జిల్లా జైలు ప్రారంభోత్సవంలో హోంమంత్రి చినరాజప్ప ప్రకటన చేశారు. ఖైదీల పరివర్తన దేవుడెరుగు వారిని కలుసుకునేందుకెళ్లిన కుటుంబ సభ్యులు, బంధువులు జేబులు ఖాళీ చేసుకోవాల్సి వస్తోంది. అక్కడ పని చేస్తున్న వార్డర్లు, హెడ్ వార్డర్లు ములాఖత్దారులను నిలువు దోపిడీ చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. చిన్న చిన్న శిక్షలు పడిన వారిని సైతం వదలకుండా మామూళ్లతో వేధిస్తోండడంతో ఖైదీల బంధువులు లబో దిబోమంటున్నారు. ఏసీబీ కేసుల్లో పట్టుబడిన ఖైదీలంటే పండగే... కర్నూలుతో పాటు కడప, అనంతపురం జిల్లాల్లో లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన ఉద్యోగులను కర్నూలు జైలుకు తరలిస్తారు. వారు రిమాండ్ ఖైదీలుగా వచ్చారంటే అక్కడ పని చేసే వార్డర్, హెడ్ వార్డర్లకు పండగే. లంచాలకు మరిగిన మీరు ములాఖత్‌కు మామూళ్లు ఇవ్వలేరా అంటూ వారి నుంచి ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. నాన్‌బెయిలబుల్ కేసుల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న వారిని కలుసుకునేందుకు వచ్చిన సందర్శకుల నుంచి కూడా భారీగా దండుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. డబ్బు ఇచ్చి న వారికి ఒక రకంగా ఇవ్వని వారికి మరో రకంగా ఇబ్బందులు పెడుతున్నారని ఖైదీల బంధువులు ఆరోపిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ములాఖత్ నిబంధనల ప్రకారం రిమాండ్ ఖైదీలను కటుంబ సభ్యులు, బంధువులు వారానికి రెండుసార్లు కలుసుకోవచ్చు. సోమవారం నుంచి శనివారం వరకు ఏఏ ఖైదీని ఎంతమంది కలిశారన్నది ‘విజిటర్స్ బుక్కు’లో నమోదు చేయాలి. అయితే మామూళ్లు ముట్టజెప్పినవారికి విజిటర్స్ బుక్కులో నమోదు చేయకుండానే ఎక్కువసార్లు ములాఖత్‌కు అవకాశం కల్పిస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. ఈ ఏడాది జనవరిలో కర్నూలు శివారులో ఒక వ్యక్తిపై జరిగిన హత్యాయత్నం కేసులో ఏ1 నిందితుడు కొంతకాలంగా ఈ జైలులోనే రిమాండ్‌లో ఉంటున్నాడు. నిబంధనలకు విరుద్ధంగా ఆయనకు ప్రతి రోజు ములాఖత్‌కు అవకాశం కల్పించి మామూళ్లు దండుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కేసు విచారణ నిమిత్తం ఆ ఖైదీని పోలీసులు కస్టడికి తీసుకున్నారు. అతడిని కలుసుకునేందుకు జైలు దగ్గరకెళ్లి అల్లర్లకు పాల్పడిన కొంతమంది యువకులపై తాలూకా పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ఆ ఖైదీని కలుసుకునేందుకు ప్రతి రోజు ఎలా అనుమతిస్తున్నారంటూ అక్కడ జరుగుతున్న వసూళ్ల వ్యవహారాన్ని పోలీసు అధికారులు జైళ్ల శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. రిమాండ్ ఖైదీలకు కోర్టు నుంచి బెయిల్ మంజూరైనా సాయంత్రం ఆరు గంటల తర్వాత వారిని బయటకు పంపరాదన్న నిబంధన చూపి ఒక్కొక్కరినుంచి రూ.1000 దాకా లంచం వసూలు చేస్తున్నట్లు సమాచారం. ప్రిజినర్ ఫోన్ క్యాష్ (పీపీసీ) పేరుతో చేసిన వసూళ్లలో కూడా కొంత మంది హెడ్ వార్డర్లు సగం మెత్తాన్ని కాజేస్తున్నట్లు ఖైదీల బంధువులు వాపోతున్నారు. సందర్శకులు, ములాఖత్దారుల నుంచి రోజుకు కనీసం రూ.10 వేలకు పైగా మామూళ్ల రూపంలో వసూలు చేసి అక్కడ పని చేస్తున్న కింది స్థాయి అధికారులు వాటాలు వేసి పంచుకుంటున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ వసూళ్ల తతంగంపై ఉన్నతాధికారులు నిఘా పెట్టి న్యాయం చేయాలని సందర్శకులు కోరుకుంటున్నారు. నగరానికి దూరం..సిబ్బంది ఇష్టారాజ్యం జిల్లా జైలు గతంలో నగరంలోని ఆర్డీఓ ఆఫీసు పక్కన ఉండేది. తరచూ ఉన్నతాధికారులు సందర్శించి అక్కడ పరిస్థితులను తెలుసుకునే వారు. ఏడాది క్రితం నగరానికి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో పంచలింగాల గ్రామ సమీపంలో జిల్లా జైలును నూతనంగా నిర్మించి అక్కడికి షిఫ్ట్ చేశారు. జైలు దూరంగా ఉండడంతో అధికారుల పర్యవేక్షణ కొరవడి వసూలు రాజాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఖైదీల బంధువులు ఆరోపిస్తున్నారు. ఇక్కడ 8 మంది వార్డర్లు, నలుగురు హెడ్ వార్డర్లు విధులు నిర్వహిస్తున్నారు. ఇందులో సగం మంది వసూళ్లే దిన చర్యగా వ్యవహరిస్తున్నారనే అరోపణలు ఉన్నాయి. ఆధార్‌కార్డు లేకుంటే రూ.1000 ముట్టజెప్పాల్సిందే హత్యలు, అత్యాచారాలు, చోరీలు, కొట్లాటలు, దోపిడీలు మొదలుకుని జేబుదొంగలు, సారా కేసుల్లో పట్టుబడినవారు, మద్యం బెల్టు దుకాణాలు నిర్వహిస్తూ కేసుల్లో ఇరుక్కున్నవారు ఈ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. తుంగ భద్ర బ్యారెక్స్‌లో రిమాండ్ ఖైదీలు, కృష్ణా బారెక్స్‌లో శిక్షలు పడినవారు ఉంటున్నారు. వారిని కలుసుకునేందుకు వెళ్లిన బంధువులు లేదా సందర్శకులు కచ్చితంగా ఆధార్‌కార్డు చూపించాలన్న నిబంధన ఉంది. అది లేకుండా వెళ్లిన వారికి కింది స్థాయి అధికారులు చుక్కలు చూపిస్తున్నారు. నిబంధనను సాకుగా చూపి రూ.500 నుంచి రూ.1000 దాకా మామూళ్లు వసూలు చేస్తున్నారు. కడప జిల్లాకు చెందిన ప్రభుత్వ ఉద్యోగి ఒకరు ఏసీబీకి పట్టుబడి ఇక్కడ రిమాండ్ ఖైదీగా ఉన్నారు. చూసేందుకు వచ్చిన కన్న కూతురికి నిబంధనలను సాకుగా చూపి అధికారులు భారీ మొత్తంలో దండుకున్నారు. ఫోన్లో ప్రతి రోజు మాట్లాడిస్తాం... ఆయనకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఇంటి వాతావరణంలో గడిపినట్టుగా చూసుకుంటామని ఇద్దరు హెడ్ వార్డర్లు వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఖైదీలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. రాయలసీమ యూనివర్సిటీకి చెందిన ఓ ఉద్యోగి చీటింగ్ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. ఆయనను కలుసుకునేందుకు వెళ్లిన తల్లి నుంచి డబ్బులు వసూలు చేసినట్లు సమీప బంధువులు ఆరోపిస్తున్నారు. జైల్లోకి రిమాండ్ ఖైదీలను అనుమతించేటప్పుడు తనిఖీ పేరుతో వారి జేబుల్లో ఉన్న మొత్తాలను కూడా స్వాహా చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. -
పెట్రోల్ బంకు సొత్తుతో జీవిత ఖైదీ పరార్
నల్గొండ: పట్టణంలోని ఓ పెట్రోల్ బంకులో పనిచేస్తున్న జీవిత ఖైదీ పరారయ్యాడు. జిల్లా జైలు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పెట్రోల్ బంకులో ప్రకాశంజిల్లా యద్దనపూడి మండలం చిమ్మటవారి పాలేనికి చెంది జిల్లా జైలులో జీవిత ఖైదీగా ఉన్న శివకృష్ణ పనిచేస్తున్నాడు. మంగళవారం రాత్రి బంకులో డ్యూటీ చేసి బంకుకు వచ్చిన ఆదాయం రూ.25,000 తీసుకుని పరారయ్యాడు. ఇతని కోసం జైలు అధికారులు, స్థానిక పోలీసులు గాలిస్తున్నారు. -
వరుస చోరీలు చేసి.. జైలుకెళ్లి..
♦ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య ♦ నిందితుడిపై పలు కేసులు ♦ మానసిక స్థితి బాగోలేకనేనన్నజైలు అధికారులు నిజామాబాద్ క్రైం(నిజామాబాద్ అర్బన్) : సారంగపూర్ వద్ద ఉన్న జిల్లా జైలులో అండర్ ట్రయల్ ఖైదీ ఒకరు శుక్రవారం ఉరేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కొన ఊపీరితో ఉన్న అతడిని అధికారులు వెంటనే కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతిచెందాడు. నిందితుడు చివరిసారిగా నవీపేటలో చోరీ చేసి అరెస్టు అయ్యాడు. ఇతడిని గత మే 16న కోర్టులో హాజరుపరుచగా అప్పటి నుంచి రిమాండ్‌లో ఉన్నాడు. నగరంలోని గాజుల్‌పేట్‌కు చెందిన మక్కల లక్ష్మయ్య, గంగవ్వ చిన్న కుమారుడు మక్కల హన్మంత్(24) చదువుకోలేదు. తండ్రి లక్ష్మయ్య మేస్త్రీ పనిచేస్తాడు. హన్మంత్ పనిచేయకుండా చోరీలు చేసేవాడు. ఇతడిపై నిజామాబాద్ నాల్గోటౌన్, మాక్లూర్, నవీపేట పోలీస్స్టేషన్లలో దాదాపు 15 కేసులు ఉన్నట్లు తెలిసింది. కాగా చివరి సారిగా నవీపేట మండలం పోతంగల్లో మే 4న హన్మంత్‌తో పాటు ధర్పల్లి సాయిలు సెల్ఫోన్లు చోరీ చేశారు. దీనిపై నవీపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. హన్మంత్‌ను మే 16న అరెస్టు చేసి కోర్టులో హాజరుపరుచగా, కోర్టు రిమాండ్‌కు పంపింది. అప్పటి నుంచి హన్మంత్ జైలులో అండర్ ట్రయల్ ఖైదీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం అందరూ ఖైదీలతోపాటు ఇతడిని జైలు ఆవరణలో వదిలారు. వారందరూ వివిధ పనులు చేస్తుండగా మ«ధ్యాహ్నం 2.20 గంటలకు హన్మంత్ జైలులోని ఒకటో బ్యారక్ వెనుక ఓ చెట్టుకు టెలిఫోన్ వైర్‌తో ఉరేసుకున్నాడు. అటువైపు వచ్చిన జైలు అధికారులు కొన ఊపీరితో ఉన్న హన్మంత్‌ను నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఖైదీ హన్మంత్ సాయంత్రం 5గంటలకు మృతిచెందాడు. దీనిపై జైలు సూపరింటెండెంట్ కళాసాగర్ ఆరోటౌన్ పోలీసులకు తెలుపగా ఎస్ఐ లక్ష్మయ్య, రూరల్ సీఐ వెంకటేశ్వర్లు ఆస్పత్రికి చేరి కేసు నమోదు చేశారు. సమాచారం అందుకున్న మృతుడి తల్లి గంగవ్వ, కుటుంబ సభ్యులు ఆస్పత్రికి చేరి మృతదేహంపై పడి బోరన విలపించారు. గతంలో పలుమార్లు ఆత్మహత్యాయత్నం.. అండర్ ట్రయల్ ఖైదీ హన్మంత్ గతంలోనూ పులుమార్లు చో రీలు చేసి జైలుకు వచ్చి వెళ్లాడు. ఆయా సమయాల్లోనూ ప లుమార్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడినటు జైలు అధికా రులు తెలిపారు. రాళ్లతో చేతులపై, కడుపులో కోసుకునేవాడ ని, బాత్రూం గదుల్లో ఉండే బ్లీచింగ్ పౌడర్, ఫినాయిల్ తాగి ఆస్పత్రి పాలయ్యాడని అధికారులు తెలిపారు. ఇతడికి వైట్నర్ తాగే అలవాటు ఉందని, పలుమార్లు వింతగా ప్రవర్తించేవాడని అధికారులు తెలిపారు. -
నేడు హోంమంత్రి చిన్నరాజప్ప పర్యటన
– ఆధునికీకరించిన జిల్లా జైలుకు ప్రారంభోత్సవం – భారీ బందోబస్తు ఏర్పాటు కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): హోంమంత్రి నిమ్మకాయల చిన్నరాజప్ప శనివారం జిల్లాలో పర్యటించనున్నాడు. ఈ నేపథ్యంలో జిల్లా పోలీసు అధికారులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఉదయం 11 గంటలకు హైదరాబాద్ నుంచి కర్నూలుకు చేరుకొని పంచలింగాల సమీపంలో ఆధునికీకరించిన జిల్లా జైలును ప్రారంభిస్తారు. అనంతరం 12 గంటలకు జిల్లా పోలీసులతో సమీక్ష నిర్వహిస్తారు. భోజనం అంతరం 2.30 గంటలకు నందికొట్కూరు చేరుకొని అక్కడ పోలీసు క్వార్టర్స్‌ను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి 2.45 గంటలకు నందవరం వెళ్లి స్థానిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సాయంత్రం 3.45 గంటలకు నంద్యాలకు వెళ్తారు. అక్కడ సాయంత్రం 5 గంటలకు కాపు కల్యాణ మండపానికి భూమి పూజతో పాటు పోలీసు కార్టర్స్‌ను ప్రారంభిస్తారు. అనంతరం 7 గంటలకు నంద్యాల నుంచి హైదరాబాద్‌కు తిరుగు పయనమవుతారు.. -
జిల్లా జడ్జి ఆకస్మిక తనిఖీ
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): పంచలింగాల సమీపంలోని జిల్లా జైలును సోమవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సంస్థ కార్యదర్శి, జిల్లా లోక్ అదాలత్ జడ్జి ఎంఏ సోమశేఖర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. జైలు పరిసరాలు, గదులు, ఖైదీలకు ఇచ్చే ఆహారాన్ని పరిశీలించారు. అనంతరం ఖైదీలతో మాట్లాడుతూ సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పట్టువిడుపులకు పోయి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని సూచించారు. న్యాయవాదిని నియమించుకోలేని వారికి న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఉచితంగా న్యాయ సహాయం కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో న్యాయవాదులు ఏ.చంద్రశేఖర్, ఎంఏ తిరుపతయ్య, జి.నాగముని పాల్గొన్నారు. -
జిల్లా జైలును తనిఖీ చేసిన జైళ్ల శాఖ ఐజీ
కర్నూలు(లీగల్) : కర్నూలు నగర శివారులోని పంచలింగాల గ్రామ పరిధిలోని జిల్లా జైలును మంగళవారం జైళ్ల శాఖ ఐజీ బి.సునిల్‌కుమార్ తనిఖీ చేశారు. శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు తయారు చేస్తున్న సిమెంటు ఇటుకల తయారీపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఖైదీల వసతులు, ఆహారంపై ఆరా తీశారు. జైలు రికార్డులను చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జిల్లా జైళ్ల అధికారి వరుణారెడ్డి, జైలర్లు వీరేంద్రప్రసాద్, నరసింహారెడ్డి, సబ్ జైలర్ సురేష్ బాబు, సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం జిల్లా కేంద్రంలోని జిల్లా మహిళల జైలును సందర్శించి అక్కడి సౌకర్యాలను ఆరా తీశారు. -
జిల్లా జైలు ఆకస్మిక తనిఖీ
కర్నూలు : కర్నూలు శివారులోని పంచలింగాల దగ్గర ఉన్న జిల్లా జైలును జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం.ఎ.సోమశేఖర్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. జైలులోని పరిసరాలను, గదులను ఖైదీలకు అందించే ఆహారాన్ని పరిశీలించారు. ఖైదీలకు కల్పిస్తున్న వసతుల గురించి వారిని అడిగి తెలుసుకున్నారు. న్యాయవాదిని నియమించుకునే స్థోమత లేనివారికి న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఉచితంగా న్యాయవాదిని నియమిస్తామని తెలిపారు. అనంతరం ఖైదీలకు న్యాయ విజ్ఞాన సదస్సు ఏర్పాటు చేసి చట్టాలపై అవగాహన కల్పించారు. న్యాయవాదులు ఆదినారాయణరెడ్డి, పి.నిర్మల, నాగమణి, జైలు అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. -
జిల్లా జైలులో ఖైదీల నిరశన
సాక్షి, నిజామాబాద్: తమకు పది నెలలుగా పని కల్పించడం లేదంటూ పలువురు ఖైదీలు బుధవారం నిజామాబాద్ జిల్లా జైలులో నిరశనకు దిగారు. భోజనం చేయకుండా గాంధీగిరీ చే పట్టారు. జైలు అధికారులు సముదాయించడంతో మధ్యాహ్నం తరువాత దీక్షను విరమించారు. వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ శివారులో ఉన్న చర్లపల్లి జైలులో రద్దీ ఎక్కువ కావడంతో ప్రభుత్వం 2013 ఫిబ్రవరిలో సుమారు 120 మంది జీవిత ఖైదీలను జిల్లా జైలుకు తరలించింది. ఇక్కడి వర్క్‌షాప్ ప్రారంభానికి నోచు కోక పోవడంతో వీరికి పనులు లేకుండా పోయాయి. చర్లపల్లి లో ఉన్నప్పుడు అక్కడి వర్క్‌షాప్‌లో పని చేసేవారు. నెల నెలా సుమారు మూడు వేల రూపాయల ఆదాయం వచ్చేది. ఇప్పుడు ఒక్క రూపాయి కూడా రాకపోవడంతో తమ కుటుంబాలు బతుకేదెలా అని వారు ప్రశ్నిస్తున్నారు. జైలులో ఏర్పాటు చేసిన స్టీల్ ఫ్యాక్టరీ వర్క్‌షాప్ ప్రారంభానికి జైళ్ల శాఖ నిధులు మంజూరు చేయలేదు. దీంతో చర్లపల్లి నుంచి వచ్చిన జీవిత ఖైదీలకు పనులు కల్పించలేకపోయారు. దీంతో వారు తమను తిరిగి చర్లప ల్లికి పంపాలని డిమాండ్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే నిరశనకు దిగారు. వైద్య పరీక్షలూ లేవు తమకు వైద్య పరీక్షలు కూడా సరిగ్గా నిర్వహించడం లేదని ఖైదీలు పేర్కొంటున్నారు. మూడు నెలల క్రితం ఈ జైలు లో ఇద్దరు జీవితఖైదీలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. జైలు సిబ్బంది తమను అసభ్య పదజాలంతో సంభాషిస్తున్నారని కొందరు ఆవేదన చెందుతున్నట్లు తెలుస్తోంది. ములాఖత్ కోసం వస్తున్న తమను కూడా జైలు సిబ్బంది ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఖైదీ ల కుటుంబ సభ్యులు వాపోతున్నారు. ఖైదీలు తరచూ నిరసనలకు దిగినప్పటికీ ప్రయోజనం ఉండడం లేదు. అధికారులేమంటున్నారంటే జీవిత ఖైదీల నిరసనలపై ‘సాక్షి’ జైలు సూపరిండెంట్ శంకరయ్యను సంప్రదించగా..అలాంటిదేమీలేదన్నారు. పెరోల్ తిరస్కరణకు గురికావడంతో గంగారాం అనే ఒక్క ఖైదీ మాత్రమే నిరసన తెలిపారన్నారు. ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు కాకపోవడంతో వర్క్‌షాప్‌ను ప్రారంభించలేకపోతున్నామన్నారు. వర్క్‌షాప్‌లో అన్ని యంత్రాలను బిగించామని, ఇన్స్ట్రక్టర్ నియామకం జరగాల్సి ఉందని పేర్కొన్నారు.