తాజా ఆకుకూరలను ఖైదీలకు అందించాలనే ఉద్దేశంతో సంగారెడ్డి జిల్లా జైలులో వినూత్నంగా హైడ్రోపోనిక్ సాగు పద్ధతికి శ్రీకారం చుట్టారు. మొదటగా పాలకూరను పండిస్తున్నారు. ఈ పద్ధతిలో సాగుకు మట్టి అవసరం లేదు. మొక్కలు నీటిలోనే పెరుగుతాయి. నీటివినియోగం కూడా చాలా తక్కువ. నేలలో పంటలకు కావలసిన నీటిలో 5 శాతం చాలు. విత్తనాలను చిన్న ట్రేలలో కొబ్బరి పొట్టులో వేసి మొలకెత్తిస్తారు. మొక్కల ఎదుగుదలకు కావాల్సిన పోషకాలను ద్రావణాల రూపంలో అందిస్తున్నారు. మున్ముందు కొత్తమీర, చుక్కకూరతోపాటు మిర్చి టమాట, వంగ తదితర కూరగాయ పంటలను సైతం పండించడానికి సన్నద్ధమవుతున్నా జైలు సూపరిండెంట్ నవాబు శివకుమార్ గౌడ్ ‘సాక్షి’కి వివరించారు.
హైడ్రోపోనిక్ సాగు విధానం..
ప్లాస్టిక్ ట్రేలలో కొబ్బరిపొట్టు నింపి విత్తనాలు వేస్తారు. వారం రోజుల్లోగా ఆ విత్తనం మొలకెత్తుతుంది. ఎదిగిన మొక్కను తీసి నెట్ పాట్(జాలీ గ్లాసుల)లో పెట్టి, మొక్క నిలబడడానికి క్లేబాల్స్(మట్టి బంతులు), గులకరాళ్లు వంటివి వాడతారు. మొక్కలతో కూడిన జాలీ గ్లాసులను పీవీసీ పైపులలో ఉంచుతారు. పోషక ద్రావణాలతో కూడిన నీరు ఈ పైపులలో ఉంటుంది. అందులోని పోషకాలను మొక్కలు వేర్ల ద్వారా గ్రహించి పెరుగుతాయి.
పీవీసీ లేదా ఫైబర్ పైపులను ఒకచోట అమరుస్తారు. ఇందుకు పెద్దగా స్థలం అవసరం ఉండదు. ఈ సాగుకు గాను పైపులకు సరిపడా గ్రీన్‌నెట్ లేదా షెడ్ నెట్ ఉపయోగించవచ్చు. 25 పైపులతో అమరిస్తే సుమారుగా 650 మొక్కలను సాగు చేసే అవకాశం ఉంది. అడుగుకు ఒక మొక్క పెడితే వేయి మొక్కలను సాగుచేయవచ్చు. మొక్కకు కావాల్సిన పోషకాలను మ్యాక్రో సొల్యూషన్స్ (స్థూలపోషకాలు), మైక్రోసొల్యూషన్స్ (సూక్ష్మ పోషకాలు) ద్రావణాల ద్వారా అందిస్తారు. పురుగుమందుల అవసరం ఉండదు.
మొక్క పెట్టిన మొదట్లో నీటిలో పోషకాల స్థాయి 800 వరకు ఉంటే సరిపోతుంది. మొక్క ఎదుగుతున్న కొద్దీ పోషకాల స్థాయి 1500 వరకు ఉండాలి. ప్రతి రోజు రెండు గంటలు ఎండ తగిలే విధంగా పైపులను ఉంచుతారు. ప్రతి రోజు మొక్క ఎదుగుదలను తెలుసుకోవడానికి ద్రావణాల మోతాదును, నీటిలో పీహెచ్ విలువను ఖచ్చితంగా పీహెచ్ మీటర్ ద్వారా పరీక్షిస్తారు. అదే విధంగా పోషకాలు ఎంత ఉన్నాయో తెలుసుకోవడానికి ఎలక్ట్రో కండక్టివిటీ మీటర్‌ను వాడతారు.
ఆకుకూరలైతే మూడు నుంచి నాలుగు వారాలలోపే మొదటి పంట చేతికి వస్తుంది. కూరగాయలైతే నాలుగు నుంచి ఐదు వారాల సమయం పట్టే అవకాశం ఉంది. హెడ్రోపోనిక్ పద్ధతి ద్వారా సంగారెడ్డి జిల్లా జైలులోని 250 మంది ఖైదీల కోసం తాజా పాలకూర సాగు మొదలు పెట్టామని జైలు సూపరిండెంట్ శివకుమార్‌గౌడ్ ‘సాక్షి’తో చెప్పారు. ఉన్నతాధికారుల తోడ్పాటుతో కూరగాయలు కూడా పండించడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
– కొలన్ దివాకర్‌రెడ్డి, సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి బి.శివప్రసాద్, స్టాఫ్ ఫొటోగ్రాఫర్
జైలులో ‘హైడ్రో’ ఫార్మింగ్
Published Tue, Dec 31 2019 6:10 AM | Last Updated on Tue, Dec 31 2019 6:10 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment