sagubabi
-
స్ఫూర్తిదాయక ‘సాగుబడి’
హరిత విప్లవం పుణ్యమాని ఆహారోత్పత్తిలో మనదేశం స్వయం సమృద్ధి సాధించింది. ఆహార ధాన్యాలు, కూరగాయాలు, పండ్లు అధికంగా పండించడమే కాకుండా విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి మన వ్యవసాయ రంగం ఎదిగింది. ఇదంతా నాణానికి ఒకవైపు. ఇంకోవైపు విచ్చలవిడి రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకంతో సాగుచేసిన ఆహార ఉత్పత్తులు ప్రజల ప్రాణాలకు సంకటంగా మారుతున్నాయి. అధికోత్పత్తి ఆశతో మోతాదుకు మించి వాడుతున్న రసాయన ఔషధాలు, మేలు కంటే కీడే ఎక్కువ చేస్తున్నాయి. ప్రజలు, మూగజీవాల ఆరోగ్యాలకు హానికరంగా మారడంతో పాటు నేల సారాన్ని దారుణంగా దెబ్బతీస్తున్నాయి. వ్యవసాయక ఉత్పాదకత, ఆహార భద్రత, పర్యావరణ మీద ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయి. వీటన్నింటికి విరుగుడుగా రసాయనేతర సేంద్రియ, ప్రకృతి వ్యవసాయం మళ్లీ తెరమీదకు వచ్చింది.భూ సారానికి, వినియోగదారుల ఆరోగ్యానికి ముప్పుగా పరిణమించిన రసాయనిక వ్యవసాయానికి ప్రత్యామ్నాయంగా.. అతి తక్కువ సాగు ఖర్చుతో ఆరోగ్యదాయకమైన ఆహారోత్పత్తులను పండించడమే లక్ష్యంగా ప్రకృతి వ్యవసాయం పురుడు పోసుకుంది. అయితే సరైన ప్రచారం లేకపోవడంతో దీని గురించి రైతులకు, ఔత్సాహికులకు తెలియకుండా పోయింది. సరిగ్గా అలాంటి సమయంలోనే సాక్షి దినపత్రిక ఈ గురుతర బాధ్యతను భుజాన వేసుకుంది. పునరుజ్జీవన వ్యవసాయ కథనాలకు ‘సాగుబడి’ పేరుతో ప్రత్యేకంగా ఒక పేజీని కేటాయించి ముందడుగు వేసింది. ప్రకృతి, సేంద్రియ రైతుల స్ఫూర్తిదాయక కథనాలతో పాటు రైతు శాస్త్రవేత్తల ఆవిష్కరణలను వెలుగులోకి తెచ్చింది. విత్తు దగ్గరి నుంచి విక్రయం వరకు.. అన్నదాతలకు ఉపయుక్తమైన సమాచారాన్ని ‘సాగుబడి’ సాధికారికంగా అందించింది. స్వల్ప వ్యవధిలోనే ‘సాగుబడి’ తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు దిక్సూచిగా అత్యంత ఆదరణ చూరగొంది. ఇంటి పంటలు, సేంద్రియ సాగు, ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన సమస్త సమాచారాన్ని రైతులకు చేరువ చేసింది.చదవండి: తక్కువ ఖర్చుతో.. పంటభూమిలో విషానికి బ్యాక్టీరియాతో చెక్‘సాగుబడి’లోని 2014-16 మధ్య కాలంలో ప్రచురితమైన ప్రకృతి వ్యవసాయ ప్రేరణాత్మక కథనాలను పుసక్తంగా ప్రచురించారు సీనియర్ జర్నలిస్ట్ పంతంగి రాంబాబు. ప్రకృతి, సేంద్రియ సాగుకు సంబంధించిన అన్ని అంశాలను ఈ పుస్తకంలో పొందుపరిచారు. ప్రకృతి వ్యవసాయంలో లబ్దప్రతిష్టులైన వారు, రైతు శాస్త్రవేత్తల ఇంటర్వ్యూలతో పాటు రైతులకు అవసరమయ్యే సమాచారాన్నంతా అందించారు. క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీపడకుండా ప్రచురించిన ఈ పుస్తకాన్ని చూస్తేనే అర్థమవుతుంది రచయిత నిబద్దత. ప్రకృతి వ్యవసాయం చేయాలనుకునే వారితో పాటు సేంద్రియ సాగు గురించి తెలుసుకోవాలకునే వారికి కూడా ఈ పుస్తకం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందనడం ఎంత మాత్రం అతిశయోక్తి కాదు. రచయిత చెప్పినట్టుగా ఈ పుస్తకం ప్రకృతి వ్యవసాయానికి పెద్దబాలశిక్ష వంటిదే.సాగుబడి (మొదటి భాగం)ప్రకృతి వ్యవసాయ స్ఫూర్తి కథనాలుపేజీలు: 320;వెల: 600 /- ; రచన, ప్రతులకు:పంతంగి రాంబాబు,8639738658👉ఆన్లైన్లో సాగుబడి పుస్తకం కొనడానికి ఇక్కడ క్లిక్ చేయండి. -
పనికిరాని చేపలతో పంటలకు పోషణ
మత్స్యకారులు వేటాడి తెచ్చిన చేపలలో కొన్ని కుళ్లి తినటానికి పనికి రాకుండాపోతుంటాయి. వాటిని మత్స్యకారులు పారేస్తుంటారు. అటువంటి పనికిరాని చేపలను ప్రకృతి వ్యవసాయదారులు పునర్వినియోగిస్తున్నారు. పంట చేలకు పోషకాలను అందించే చక్కని మీనామృతం తయారు చేస్తున్నారు. కాకినాడ జిల్లా గొల్ల్ర΄ోలు మండలం దుర్గాడకు చెందిన రైతు గుండ్ర శివ చక్రంతోపాటు పలువురు రైతులు మీనామృతం, అనేక రకాల కషాయలు, ద్రావణాల తయారీలో విశేష అనుభవం గడించారు. ప్రకృతి/సేంద్రియ వ్యవసాయం చేస్తూ కషాయాలు, ద్రావణాలు స్వయంగా తయారు చేసుకోలేని స్థితిలో ఉన్న ఎందరో రైతులకు దువ్వాడ రైతాంగం చేదోడుగా ఉంటున్నది. గతంలో కుళ్లిన ఉల్లిపాయలతో ద్రావణం తయారు చేసి నల్ల తామర పురుగును నియంత్రించటంలో దుర్గాడ రైతులు విజయం సాధించటం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశం అయ్యింది. అ రైతులు స్థానికంగా దొరికే పదార్థాలు, వనరులతో అనేక కషాయాలు, ద్రావణాలు తయారు చేస్తూ ప్రకృతి వ్యవసాయాన్ని పరిపుష్టం చేస్తున్నారు. ఈ కోవలోదే మీనామృతం. తినటానికి, ఎండ బెట్టడానికి పనికిరాని పచ్చి చేపలను ముక్కలు చేసి పాత బెల్లం కలిపి, 90 రోజులు మురగబెట్టి మీనామృతం తయారు చేస్తున్నారు. ఇది కొన్ని నెలల పాటు నిల్వ ఉంటుంది. పంటల ఎదుగుదలకు.. పూత, పిందె రాలకుండా బలంగా పెరగడానికి దీన్ని పంటలపై పిచికారీ చేస్తున్నారు. ఎకరానికి ఒక లీటరు సరి΄ోతుంది. మీనామృతం తయారు చేసి తమ పంటలపై వాడుకోవటంతో పాటు ఇతర ప్రాంతాల రైతులకు లీటరు రూ.120కి విక్రయిస్తున్నారు.– ప్రసాద్, సాక్షి, పిఠాపురంమీనామృతం బాగా పని చేస్తోంది!పచ్చి చేపలు, పాత బెల్లంతో తయారు చేస్తున్న మీనామృతం సేంద్రియ పంటలకు బాగా ఉపయోగ పడుతోంది. దీన్ని పిచికారీ చేసిన పంటల దిగుబడి పెరుగుతోంది. మా గ్రామంలో గో గాయత్రి ప్రకృతి వ్యవసాయ వనరుల తయారీ శిక్షణ కేంద్రంలో ఈ ద్రావణం తయారు చేస్తున్నాం. ఈ ద్రావణం కోసం వివిధ ప్రాంతాల నుంచి రైతులు వచ్చి తీసుకెళుతున్నారు. ప్రతీ రోజు సుమారు 100 లీటర్ల వరకు తయారు చేస్తున్నాం. దీంతోపాటు రసం పీల్చు పురుగు నివారణకు చిల్లీ స్పెషల్ కషాయం తయారు చేస్తున్నాం. కాకినాడ జిల్లా ప్రకృతి వ్యవసాయాధికారి ఎలియాజరు సహాయంతో వివిధ రకాల కొత్త కషాయాలు తయారు చేసి విక్రయిస్తున్నాం.– గుండ్ర శివచక్రం (95537 31023),ప్రకృతి వ్యవసాయదారుడు, దుర్గాడ, గొల్ల్ర΄ోలు మండలం, కాకినాడ జిల్లాపచ్చి చేపలు, పాత బెల్లంతో తయారు చేస్తున్న మీనామృతం సేంద్రియ పంటలకు బాగా ఉపయోగ పడుతోంది. దీన్ని పిచికారీ చేసిన పంటల దిగుబడి పెరుగుతోంది. మా గ్రామంలో గో గాయత్రి ప్రకృతి వ్యవసాయ వనరుల తయారీ శిక్షణ కేంద్రంలో ఈ ద్రావణం తయారు చేస్తున్నాం. ఈ ద్రావణం కోసం వివిధ ్ర΄ాంతాల నుంచి రైతులు వచ్చి తీసుకెళుతున్నారు. ప్రతీ రోజు సుమారు 100 లీటర్ల వరకు తయారు చేస్తున్నాం. దీంతోపాటు రసం పీల్చు పురుగు నివారణకు చిల్లీ స్పెషల్ కషాయం తయారు చేస్తున్నాం. కాకినాడ జిల్లా ప్రకృతి వ్యవసాయాధికారి ఎలియాజరు సహాయంతో వివిధ రకాల కొత్త కషాయాలు తయారు చేసి విక్రయిస్తున్నాం.– గుండ్ర శివచక్రం (95537 31023),ప్రకృతి వ్యవసాయదారుడు, దుర్గాడ, గొల్ల్ర΄ోలు మండలం, కాకినాడ జిల్లా -
సాగుబడి: ఆంధ్రా వర్సిటీలో ఆర్గానిక్ పంటలు!
'నగరవాసులకు ఆరోగ్యదాయకమైన సేంద్రియ ఇంటిపంటలను, ప్రకృతి వ్యవసాయ పాఠాలు నేర్పించడానికి విశాఖ నగరంలోని ఆంధ్రా యూనివర్సిటీ ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. రైతు ఉత్పత్తిదారుల సంస్థతో కలిసి యూనివర్సిటీ ఆవరణలో అర్బన్ గార్డెనింగ్ హబ్‌ను ఏర్పాటు చేసింది. అనేక రకాల ఆకుకూరలను ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో నగరంలోనే పండించి తాజాగా నగరవాసులకు అందిస్తోంది. నగరంలో పుట్టి పెరిగే విద్యార్థులకు మట్టి వాసనను పరిచయం చేయటం.. సేంద్రియ ఇంటిపంటల సాగు పనులను చేస్తూ నేర్చుకునే వినూత్న అవకాశాన్ని నగరవాసులకు కల్పించటం ప్రశంసనీయం. ఈ సామాజిక కార్యక్రమంలో కీలకపాత్ర పోషిస్తున్న ‘ఎయు– అవని ఆర్గానిక్స్ అర్బన్ గార్డెనింగ్ హబ్’ నిర్వాహకులు ఉషా రాజు, హిమబిందు కృషిపై అంతర్జాతీయ మహిళా దినోత్సవం (మార్చి 8) సందర్భంగా ప్రత్యేక కథనం'. పదిహేనేళ్లుగా సేంద్రియ టెర్రస్ కిచెన్ గార్డెనింగ్, ప్రకృతి వ్యవసాయంలో అనుభవం ఉన్న పౌష్టికాహార నిపుణురాలు ఉషా రాజు, హిమబిందు ఆంధ్రా యూనివర్సిటీతో కలసి సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. మన మన్యం రైతు ఉత్పత్తిదారుల సంస్థ నిర్వాహకులు కూడా అయిన వీరు విశాఖపట్నం నగరం మధ్యలోని ఆంధ్రా యూనివర్సిటీ ఆవరణలోనే ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. ప్రజలకు ప్రకృతితో కలసి జీవించడం నేర్పుతున్నారు. వాలంటీర్లు పాల్గొనేందుకు అవకాశం ఇస్తూ అర్బన్ కమ్యూనిటీ ఫార్మింగ్‌ని ఆచరించి చూపుతున్నారు. నగర వాసులు తమ ఇంటిపైన కూడా ఆరోగ్యదాయకమైన సేంద్రియ కూరగాయలు, ఆకుకూరలు సాగు చేసుకునే విధంగా ప్రోత్సహిస్తున్నారు. గత ఏడాది నవంబర్‌లో ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డిని కలిసి వర్సిటీలో అర్బన్ గార్డెనింగ్ హబ్‌కు అనువైన స్థలం కేటాయించాలని ఉషా రాజు, హిమబిందు కోరారు. ప్రజలకు ఆరోగ్యదాయకమైన ఆకుకూరలు అందుబాటులోకి రావటంతో పాటు ప్రకృతి సేద్యంపై అవగాహన కలుగుతుందన్న ఆశయంతో ఆయన అందుకు అంగీకరించారు. వృక్షశాస్త్రం, ఫుట్ టెక్నాలజీ, ఫార్మసీ విద్యార్థులను ఈ అర్బన్ సాగులో భాగస్వాముల్ని చేయాలని వీసీ సూచించారు. ఆకుకూరలను నగరంలోనే పండిస్తున్నాం..! మా ‘మన మన్యం ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్’ రైతు ఉత్పత్తిదారుల కంపెనీలో 4 జిల్లాలకు చెందిన 120 మంది రైతులు సభ్యులు. ప్రకృతి వ్యవసాయంలో పండించిన బియ్యం, పప్పులు తదితర ఉత్పత్తులను ‘అవని ఆర్గానిక్స్’ పేరుతో విశాఖ నగరంలోని 4 రైతుబజార్లలోని మాకు కేటాయించిన స్టోర్ల ద్వారా ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నాం. అయితే, ఆకుకూరలను నగరానికి దూరంగా పొలాల్లో పండించి ఇక్కడికి తెచ్చి వినియోగదారులకు అందించేటప్పటికి కనీసం 25% పోషకాలు నష్టం జరుగుతోంది. ఈ సమస్యను అధిగమించడానికి తాజా ఆకుకూరలను నగరంలోనే ప్రకృతి వ్యవసాయంలో పండించి వినియోగదారులకు అందించాలని తలచాం. మా ఆలోచననుప్రోత్సహించిన ఆంధ్రా యూనివర్సిటీ సహకారంతో 80 సెంట్ల ఖాళీ స్థలంలో అనేక రకాల సాధారణ ఆకుకూరలతో పాటు కలే, లెట్యూస్, బాక్చాయ్ వంటి విదేశీ ఆకుకూరలను, కనుమరుగైన కొన్ని రకాల పాతకాలపు ఆకుకూరలను సైతం పండించి, ప్రజలకు తాజాగా విక్రయిస్తున్నాం. స్థలంతోపాటు నీటిని యూనివర్సిటీ ఇచ్చింది. వైర్ ఫెన్సింగ్, డ్రిప్‌లు, సిబ్బంది జీతాలను మా ఎఫ్.పి.ఓ. సమకూర్చుతోంది. నగరంలో పుట్టి పెరిగే పాఠశాల విద్యార్థులకు, నగరవాసులకు ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో ఇంటిపంటల సాగును నేర్పించాలన్నది మా లక్ష్యం. వాలంటీర్లు ఎవరైనా ప్రతి రోజూ ఉదయం 7–9 గంటల మధ్యలో నగరం మధ్యలో ఉన్న ఆంధ్రా యూనివర్సిటీకి వచ్చి గార్డెనింగ్ పనులను చేస్తూ నేర్చుకోవచ్చు. నచ్చిన ఆకుకూరలు తామే కోసుకొని కొనుక్కెళ్ల వచ్చు. స్కూలు విద్యార్థులకు ఇంటిపంటలు, ప్రకృతి వ్యవసాయ పనులను పరిచయం చేయడానికి ఇదొక మంచి అవకాశమని మేం భావిస్తున్నాం. యూనవర్సిటీలో ఈ పంటలను 2 ఎకరాలకు విస్తరించే ఆలోచన ఉంది. – ఉషా రాజు, ఎయు–అవని ఆర్గానిక్స్ అర్బన్ గార్డెనింగ్ హబ్, ఆంధ్రా యూనివర్సిటీ, విశాఖపట్నం 80 సెంట్లలో బహుళ పంటల సాగు.. ఆ విధంగా 2023 నవంబర్ చివరి నాటికి ఏయూ ఫార్మ్ టెస్టింగ్ లాబరేటరీ (ఎలిమెంట్) ఎదురుగా ఉన్న సుమారు 80 సెంట్ల ఖాళీ స్థలంలో ఏర్పాటైన అర్బన్ గార్డెనింగ్ హబ్‌లో ప్రకృతి సేద్యం ్రపారంభమైంది. కలుపు మొక్కలను తొలగించి నేలను సాగుకు అనుకూలంగా మార్చటానికి దాదాపు మూడు వారాల సమయం పట్టింది. తొలుత ఆకుకూరల సాగును ్రపారంభించారు. పాలకూర, తోటకూర, మెంతికూర, చుక్కకూర, బచ్చలి, గోంగూర, పొన్నగంటి, గలిజేరు, ఎర్రతోటకూర, పుదీనా వంటి పది రకాల ఆకుకూరలను చిన్నమడులుగా చేసుకొని సాగు చేస్తున్నారు. సలాడ్లలో వినియోగించే అరుదైన బాక్చాయ్ వంటి మొక్కలతో పాటు గోధుమ గడ్డి, ఆవ ఆకులు, చేమదుంపలు, కేరట్, బీట్రూట్, చిలగడదుంప వంటి దుంప పంటలనూ ఇక్కడ సాగు చేస్తున్నారు. ప్రస్తుతం చిత్రాడ బీర, వంగ, బొప్పాయి కాత దశకు వస్తున్నాయి. త్వరలో దొండ పాదులు సైతం నాటబోతున్నారు. ప్రతీ మూడు నెలలకు నాలుగైదు రకాల కూరగాయలు పెంచే విధంగా వీరు ప్రణాళిక చేసుకుని పనిచేస్తున్నారు. ఆకర్షితులవుతున్న ప్రజలు.. పశువుల పేడ తదితరాలతో తయారు చేసిన ద్రవ జీవామృతం, ఘనజీవామృతంతో ఇక్కడ పూర్తి ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పంటలు పండిస్తున్నారు. డ్రిప్, స్ప్రిక్లర్లు ఏర్పాటు చేసుకుని పొదుపుగా నీటిని వాడుతున్నారు. అనేక రకాల పంటలను కలిపి పండించటం వల్ల ఆకుకూరలు, కూరగాయ మొక్కలు ఏపుగా పెరుగుతున్నాయి. పెద్దగా పురుగు పట్టడం లేదు. తమ కళ్ల ముందే ఆరోగ్యదాయకంగా సాగవుతున్న పంటలు వర్సిటీ ఆవరణలో నిత్యం వాకింగ్‌కు వచ్చే వందలాది మందిని ఆకర్షిస్తున్నాయి. కొద్దిసేపు ఈ ్రపాంగణంలో గడుపుతూ.. ఆకుకూరలు, కూరగాయలను ఎలా పెంచుతున్నారో అడిగి తెలుసుకుంటూ.. కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు. కమ్యూనిటీ ఫార్మింగ్.. ప్రతీ ఆదివారం కమ్యూనిటీ ఫార్మింగ్నిప్రోత్సహిస్తున్నారు. నగరవాసులు స్వచ్ఛందంగా ఇక్కడకు వచ్చి కొద్దిసేపు వ్యవసాయం నేర్చుకోవడం కోసం భాగస్వాములయ్యేందుకు అవకాశం కల్పించారు. సాఫ్ట్వేర్ ఉద్యోగులు, మానసిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వారు ఇక్కడకు వచ్చి కాసేపు పంట మొక్కల మధ్య సరదాగా గడుపుతున్నారు. దీనితో వారికి ఒత్తిడి నుంచి ఉపశమనం, మానసిక ప్రశాంతత లభిస్తోందని చెబుతున్నారు. వలంటీర్లకు అవకాశం.. అర్బన్ కిచెన్ గార్డెనింగ్, ప్రకృతి వ్యవసాయంపై ఆసక్తి ఉన్న నగరవాసులకు ఇక్కడ వలంటీర్లుగా పని చేసే అవకాశం కల్పిస్తున్నారు. వీలైనంత ఎక్కువ మందికి ప్రకృతి వ్యవసాయం అలవాటు చేయడం, ప్రతీ ఇంటిలో టెర్రస్ గార్డెన్లు అభివృద్ధి చేసుకునే విధంగాప్రోత్సహించడం లక్ష్యంగా పనిచేస్తున్నామని నిర్వాహకులు ఉమా రాజు, హిమ బిందు చెబుతున్నారు. ప్రస్తుతం ఏయూలో చదువుకుంటున్న కొంత మంది విద్యార్థులు ఇక్కడ పనిచేస్తున్నారు. మొక్కలపై తమకున్న ఆసక్తితో స్వచ్ఛందంగా ఉదయపు వేళల్లో రెండు గంటల సమయం వెచ్చిస్తున్నారు. విద్యార్థులనుప్రోత్సహిస్తూ వారికి అవని ఆర్గానిక్స్ ప్రత్యేకంగా స్టైఫండ్‌ను అందిస్తోంది. కూరగాయల మొక్కలు, ఇండోర్ ΄్లాంట్స్ను విశాఖవాసులకు అందుబాటులో ఉంచే విధంగా నర్సరీని ్రపారంభించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రకృతి వ్యవసాయం, ప్రజల ఆరోగ్యంపై ఏయూ ఉన్నతాధికారులతో పాటు అవని ఆర్గానిక్స్ నిర్వాహకులకు శ్రద్ధ ఉండటం, సామాజిక బాధ్యతగా అర్బన్ గార్డెనింగ్ హబ్‌ను ్రపారంభించటం ఆదర్శ్రపాయం మాత్రమే కాదు, ఇతరులకు అనుసరణీయం కూడా! – వేదుల నరసింహం, సాక్షి, విశాఖపట్నం ఫోటోలు: పి.ఎల్ మోహన్ రావు, సాక్షి, విశాఖపట్నం తిరుపతిలో 9 నుంచి ఆర్గానిక్ మేళా.. తిరుపతి గవర్నమెంట్ యూత్ హాస్టల్ గ్రౌండ్స్ (పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ వెనుక)లో మార్చి 9,10,11 తేదీల్లో ఉ.6.30– రాత్రి 8 గం. వరకు ‘కనెక్ట్ 2ఫార్మర్’ సంస్థ ఆధ్వర్యంలో ఆర్గానిక్ మేళా జరగనుంది. రైతులు తమ సేంద్రియ/ప్రకృతి వ్యవసాయోత్పత్తులను నేరుగా వినియోగదారులకు విక్రయించేందుకు సహకరించటం.. దిగువ, మధ్య తరగతి కుటుంబాలకు ఆర్గానిక్ ఆహారోత్పత్తులను అందుబాటులోకి తేవటం తమ ముఖ్య ఉద్దేశమని కనెక్ట్ 2ఫార్మర్ ప్రతినిధి శిల్ప తెలి΄ారు. ప్రతి నెలా రెండో శని, ఆదివారాల్లో తిరుపతిలో ఆర్గానిక్ మేళా నిర్వహిస్తున్నామని, ఈ నెల ప్రత్యేకంగా 3 రోజుల మేళా నిర్వహిస్తున్నామన్నారు. 9న మొక్కల గ్రాఫ్టింగ్, 5 అంచెల పంట విధానంపై శిక్షణ ఇస్తారు. ఆసక్తి గల రైతులు, ఇంటిపంటల సాగుదారులు 63036 06326 నెంబర్‌కు వివరాలు వాట్సాప్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. 11న గృహిణులకు సిరిధాన్యాల వంటల పోటీ ఉంది. 83091 45655 నెంబర్‌కు వివరాలు వాట్సాప్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. ఆంధ్ర, తెలంగాణ నుండి 12 చేనేత సంఘాలు చేనేత వస్త్రాలను అందుబాటులోకి తెస్తున్నారు. పిల్లల కోసం భారతీయ సాంప్రదాయ యుద్ధ కళ అయిన కలరీ, వంటింటి వ్యర్థాలతో కంపోస్ట్, పెన్ కలంకారీ పై వర్క్‌షాప్‌లు జరుగనున్నాయి. ఇతర వివరాలకు.. 91330 77050. 7న మిద్దెతోట రైతులకు పురస్కారాలు.. ఈ నెల 7న ఉ. 11 గం.కు హైదరాబాద్ రెడ్‌హిల్స్‌లోని ఫ్యాప్సీ భవన్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో పట్టణ ప్రాంతాల్లో మిద్దెతోటలు, ఇంటిపంటలు సాగు చేసుకునే 24 మంది అర్బన్ రైతులకు ‘తుమ్మేటి రఘోత్తమరెడ్డి రైతునేస్తం మిద్దెతోట పురస్కారాల’ ప్రదానోత్సవం జరగనుందని రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్ వై. వెంకటేశ్వరరావు తెలి΄ారు. తెలంగాణ వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, తెలంగాణ సమాచార కమిషనర్ ఎం. హనుమంతరావు, మిద్దెతోటల నిపుణులు తుమ్మేటి రఘోత్తమరెడ్డి అతిథులుగా పాల్గొంటారు. అందరూ ఆహ్వానితులే. ఇవి చదవండి: షేర్ ఎట్ డోర్ స్టెప్: దానానికి దగ్గరి దారి -
‘కొబ్బరి’లో ‘సుగంధా’ల గుబాళింపు!.. అంతర పంటలతో లాభాలు
ఉద్యాన తోటల్లో సైతం ఏదో ఒకే పంటపై ఆధారపడకుండా.. అంతర పంటల సాగు చేస్తేనే రైతులకు వ్యవసాయం గిట్టుబాటవుతుంది. కొబ్బరి రైతుల ΄ాలిట అంతరపంటల సేద్యం కల్పతరువుగా మారింది. దక్షిణ కోస్తా ఆంధ్రా జిల్లాల్లో వాతావరణం కొబ్బరి సాగుకు అనుకూలం. అందువల్లనే ఏపీ కొబ్బరి తోటల విస్తీర్ణంలో 50 శాతానికిపైగా పాత ఉభయ గోదావరి జిల్లాల్లోనే ఉంది. కొబ్బరి తోటల్లో ఉండే పాక్షిక నీడ వల్ల చల్లని వాతావరణం ఏర్పడుతుంది. ఆ వాతావరణం సుగంధ ద్రవ్య పంటల (స్పైసెస్)కు ఎంతో అనువైనది. ముదురు కొబ్బరి తోటల్లో అనేక సుగంధ ద్రవ్య పంటలను అంతర పంటలుగా సాగు చేస్తూ, నేరుగా మార్కెటింగ్ చేసుకుంటున్న రైతుల విజయగాథలెన్నో. విశేష ప్రగతి సాధిస్తున్న అటువంటి ఇద్దరు ప్రకృతి వ్యవసాయదారులు ఉప్పలపాటి చక్రపాణి, సుసంపన్న అనుభవాలను తెలుసుకుందాం.. గత ఐదారేళ్లుగా కొబ్బరిలో అంతర పంటలు సాగు చేస్తూ.. వీటి ద్వారా ప్రధాన పంటకు తగ్గకుండా అదనపు ఆదాయం పొందవచ్చని రైతు శాస్త్రవేత్త ఉప్పలపాటి చక్రపాణి రుజువు చేస్తున్నారు. ఏలూరు జిల్లా పెదవేగి మండలం లక్క్ష్మీపురం గ్రామానికి చెందిన చక్రపాణి గత 13 సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో కొబ్బరి తోటలో వక్క, మిరియాలు, పసుపు అల్లం పండిస్తూ సంతృప్తికరమైన ఫలితాలు సాధిస్తున్నారు. కొబ్బరి తోటలో ఆరేళ్ల క్రితం నాటిన 2,500 వక్క చెట్లు చక్కని ఫలసాయాన్నిస్తున్నాయి. ఈ ఏడాది 700 వక్క చెట్లకు కాపు వచ్చింది. 2 టన్నుల ఎండు వక్కకాయల దిగుబడి ద్వారా రూ. 3 లక్షల 80 వేలు ఆదాయం వచ్చిందని చక్రపాణి వివరించారు. 300 కొబ్బరి చెట్లకు ఐదారేళ్ల క్రితం మిరియాల తీగలను పాకించారు. వీటిద్వారా 500 కిలోల ఎండు మిరియాల దిగుబడి వచ్చింది. కేజీ రూ.600 చొప్పున రిటైల్‌గా అమ్ముతున్నారు. గానుగ నూనెతో ఆరోగ్యం కొబ్బరి చెట్ల మధ్య వక్క చెట్లు పెంచి.. కొబ్బరి చెట్లకు అనేక ఏళ్ల క్రితమే మిరియం మొక్కల్ని పాకించడంతో చక్రపాణి కొబ్బరి తోట వర్టికల్ గ్రీన్ హెవెన్‌గా మారిపోయింది. కొబ్బరి చెట్లకు మిరియం మొక్కలు చుట్టుకొని ఉంటాయి కాబట్టి, మనుషులను ఎక్కించి కొబ్బరి కాయలు దింపే పద్ధతికి స్వస్తి చెప్పారు. కాయల్లో నీరు ఇంకిన తర్వాత వాటికవే రాలుతున్నాయి. రాలిన కాయలను అమ్మకుండా.. సోలార్ డ్రయ్యర్లో పూర్తిగా ఎండబెట్టి కురిడీలు తీస్తున్నారు. కురిడీలతో గానుగల ద్వారా సేంద్రియ కొబ్బరి నూనె తీసి నేరుగా వినియోగదారులకు విక్రయిస్తున్నారు. రెండేళ్లుగా తాము ఇంట్లో వంటలకు తమ సేంద్రియ కొబ్బరి నూనెనే వాడుతున్నామని, చాలా ఆరోగ్య సమస్యలు తీరటం గమనించామని చక్రపాణి సంతోషంగా చెప్పారు. పసుపు ఫ్లేక్స్ కొబ్బరి తోటలో వక్క, మిరియాలతో పాటు రెండేళ్లుగా అటవీ రకం పసుపును కూడా సాగు చేస్తున్నారు చక్రపాణి. ఈ రకం పసుపు వాసన, రంగు చాలా బాగుంది. పచ్చి పసుపు కొమ్ములను పల్చటి ముక్కలు చేసి, సోలార్ డ్రయ్యర్ లో ఎండబెట్టి, ఆ ఫ్లేక్స్‌ను అమ్ముతున్నారు. వాటి వాసన, రంగు, రుచి అద్భుతంగా ఉన్నాయని వాడిన వారు చెబుతున్నారన్నారు. సిలోన్ దాల్చిన చెక్క బెటర్ కొబ్బరిలో వక్క వేయడంతో పైకి తోట వత్తుగా కనిపించినా నేలపైన అక్కడక్కడా ఖాళీ ఉంటుంది. ఆ ఖాళీల్లో గత ఏడాది నుంచి అటవీ పసుపుతో పాటు అల్లం, సిలోన్ దాల్చిన చెక్క, నట్మగ్లను సాగు చేస్తున్నామని చక్రపాణి తెలిపారు. సాధారణంగా మనం ఇళ్లలో వాడే దాల్చిన చెక్క విదేశాల నుంచి దిగుమతయ్యే సాధారణ రకం. సిలోన్ దాల్చిన చక్క రకం దీనికన్నా మెరుగైనది. ఇది పల్చగా ఉన్నప్పటికీ, ఆరోగ్యకరమైనదని నిపుణులు చెబుతున్నారు. ఇది కూడా కోస్తా ఆంధ్రలో బాగా పండుతోందని చక్రపాణి వివ రించారు. కొబ్బరి, ΄ామాయిల్ తోటల్లో అంతర పంటల సాగు ద్వారా అధికాదాయం పొందేందుకు రైతులను ప్రోత్సహిస్తున్నట్లు పెదవేగి మండల ఉద్యాన అధికారి ఎం. రత్నమాల తెలి΄ారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. – కొత్తపల్లి వినోద్‌కుమార్, సాక్షి, పెదవేగి, ఏలూరు జిల్లా కేరళ మాదిరిగా ఇక్కడా పండిస్తున్నా! రైతులు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లోనే పంటలు పండించటం నేర్చుకోవాలి. పశ్చిమ గోదావరి జిల్లాలో అప్లాండ్ ఏరియాలో ఉద్యాన తోటలకు అనువైన వాతావరణం ఉంది. ఇవి సారవంతమైన భూములు. ఇక్కడి నీరు కూడా మంచిది. నాలుగైదేళ్లుగా భూగర్భజలాలు పెరగడంతో నీటి సమస్య లేదు. కొబ్బరిలో అంతర పంటలకు అనుకూలంగా ఉండేలా ముందే తగినంత దూరంలో మొక్కలు నాటుకొని సాగు చేసుకోవచ్చు. అంతర పంటలద్వారా సూక్ష్మ వాతావరణం సృష్టించుకొని కేరళలో మాదిరిగా సుగంధ ద్రవ్య పంటలు సాగు చేసుకోవచ్చు. కేరళలో 35 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటే మన దగ్గర 45 డిగ్రీల వరకు వస్తుంది. కొబ్బరిలో అంతర పంటల వల్ల బయటతో పోల్చితే పది డిగ్రీల వరకు ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. ఎండ, గాలిలో తేమ సమపాళ్లలో చెట్లకు అందుతున్నందున కేరళలో మాదిరిగా మిరియాలు, దాల్చిన చెక్క ఇక్కడ మా తోటలోనూ పండుతున్నాయి. – ఉప్పలపాటి చక్రపాణి (94401 88336), లక్ష్మీపురం, పెదవేగి మండలం, ఏలూరు జిల్లా -
ఇంగ్లండ్‌లో సర్దార్జీల సేద్యం!
ఇంగ్లండ్.. వెస్ట్ మిడ్లాండ్స్ ప్రాంతంలోని ఓ చారిత్రక పారిశ్రామిక పట్టణం స్మెదిక్. దశాబ్దాలుగా అక్కడ జీవిస్తున్న వందలాది పంజాబీ సిక్కు కుటుంబీకులు అర్బన్ ఫార్మర్స్‌గా మారారు. వ్యవసాయంతో, భూమితో వారికి అనువంశికంగా ఉన్న భావోద్వేగ, సాంస్కృతిక సంబంధాన్ని స్మెదిక్‌లోని తమ పెరటి తోటల ద్వారా పునరుజ్జీవింపజేసుకున్నారు. స్మెదిక్ పట్టణానికున్నట్టే సర్దార్జీల వలస గాథకూ సుదీర్ఘమైన చరిత్ర ఉంది. ∙∙ 1779వ సంవత్సరంలో ప్రపంచంలోనే అతి పురాతన ఆవిరి యంత్రాన్ని స్మెదిక్‌లో నెలకొల్పటం పారిశ్రామిక చరిత్రలోనే ఒక మైలురాయి. అందుకే ఆ యంత్రానికి ‘స్మెదిక్ ఇంజిన్’గా పేరు. పారిశ్రామిక విప్లవానికి పునాదులు వేసిన ఈ పట్టణంలో 5 చదరపు మైళ్ల విస్తీర్ణంలో దాదాపు 90 స్టీల్ ఫౌండ్రీలు ఉండేవట. ఆ పరిశ్రమల చిమ్నీల నుంచి నిరంతరం వెలువడే దట్టమైన నల్లటి పొగ కమ్ముకొని ఉంటుంది కాబట్టి.. ఈ పట్టణానికి ‘బ్లాక్ కంట్రీ’ అని పేరొచ్చిందట. శ్వేత జాతీయులతో పాటు అనేక కామన్వెల్త్ దేశాల నుంచి వలస వచ్చిన విభిన్న జాతుల ప్రజలు ఈ శ్రమజీవుల పట్టణంలో జీవిస్తుంటారు. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత నుంచి వలస జీవులు స్మెదిక్‌లో జీవిక కోసం వచ్చి స్థిరపడటం ప్రారంభమైంది. వీరిలో పంజాబీల సంఖ్య ఎక్కువ. 1917లో తొలిగా 50కి పైగా సిక్కు కుటుంబాలు వచ్చి స్థిరపడ్డాయి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత (1945 నుంచి) మరింత మంది సిక్కులు భారత దేశం నుంచి ఇక్కడకు చేరారు. 1961లో ఓ పాత చర్చ్‌ను కొనుగోలు చేసి గురుద్వారాగా మార్చుకున్నారు. స్మెదిక్ జనజీవనంతో సామాజికంగా, భావోద్వేగపరంగా సిక్కు సామాజిక వర్గం మమేకమయ్యే ప్రక్రియ అంతటితో పూర్తయ్యిందని చెప్పొచ్చు. ∙∙ పారిశ్రామిక కాలుష్యం వల్ల సహజ వనరులన్నీ కలుషితమైపోవటం వల్ల కాలక్రమంలో అక్కడి ప్రజల ఆయర్దాయం తగ్గిపోయింది. అటువంటి పరిస్థితుల నుంచి 11 లక్షల జనాభా కలిగిన ఈ పట్టణం ‘గార్డెన్ సిటీ’గా రూపాంతరం చెందుతోంది. ఏడెనిమిదేళ్ల క్రితం నుంచి పనిగట్టుకొని సుమారు 45 వేల కొత్త ఇళ్లను నిర్మించడంతోపాటు పచ్చదనాన్ని పెంపొందించే పని యుద్ధప్రాతిపదికన ప్రారంభమైంది. ఈ క్రమంలో సర్దార్జీల ఇంటిపంటల నైపుణ్యం గురించి స్థానిక పత్రికలు కథనాలు రాయటం ప్రారంభించాయి. పంజాబ్ నుంచి కుటుంబాలను వదిలి ఒంటరిగానో మిత్రులతోపాటో పారిశ్రామిక కార్మికులుగా వలస వచ్చిన తొలినాటి సర్దాజీలు.. అప్పట్లోనే తమ కోసం కూరగాయలు పండించుకోవటం ప్రారంభించారు. ఆ విధంగా వలస జీవులను ఇంటిపంటలు కనెక్ట్ చేస్తూ ఉత్తేజితపరుస్తూ వచ్చాయి. ‘వ్యవసాయంతో, భూమితో ఈ అనుబంధం మా సంస్కృతికి మూలం. ఏ సీజన్లో ఏమి తింటామో అవి పండించుకుంటాం’ అంటున్నారు స్మెదిక్ సర్దార్జీలు సంతోషంగా! (చదవండి: వర్షాలు తక్కువైనా, ఎక్కువైనా పంటకు ఢోకాలేని వ్యవసాయ పద్ధతి మీకు తెలుసా?) -
బాదం పంట దిగుబడులకు ఇవే ఆధారం! తేనెటీగలు లేకుంటే..
తేనెటీగలు.. ఇవి 3 కోట్ల సంవత్సరాల క్రితం నుంచే భూగోళంపై జీవిస్తున్నాయి. మొక్కల/వ్యవసాయ జీవవైవిధ్యానికి, పర్యావరణ వ్యవస్థల మనుగడకు పరాగ సంపర్కం కీలకం. అడవిలో 90% మొక్కలు, చెట్లకు, 75% పంటలకు తేనెటీగలు తదితర ప్రాణుల వల్ల జరిగే పరాగ సంపర్కమే ఆధారం. 115 ప్రధాన ఆహార పంటలు ప్రపంచ ప్రజల ఆకలితీర్చుతున్నాయి. వీటిలో 87 పంటలు పుష్పించి సక్రమంగా పంట దిగుబడులు ఇస్తున్నాయంటే అందుకు 35% కారణం తేనెటీగలు తదితర చిరు మిత్ర జీవులే. రసాయనిక వ్యవసాయ పద్ధతులు, చెట్లను నరికేయటం వల్ల వీటి మనుగడ ప్రమాదంలో పడింది. తేనెటీగలు వంటి మిత్ర పురుగులను రక్షించుకోవటం మన ఆహార భద్రతకు, పర్యావరణ ఆరోగ్యానికి ప్రాణావసరమని ఐరాసకు చెందిన ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్.ఎ.ఓ.) చెబుతోంది. మనం వినిపించుకోవాలి. ప్రతి నాలుగు పంటల్లో మూడు పంటలు తేనెటీగల సేవలు అందుకుంటున్నాయి. బాదం పంట దిగుబడులైతే నూటికి నూరు శాతం వీటిపైనే ఆధారపడి ఉంటుంది. తేనెటీగలకు 5 కళ్లు, రెండు రెక్కలుంటాయి. కొన్నయితే గంటకు 20 మైళ్లు ప్రయాణిస్తూ పరాగ సంపర్కానికి తోడ్పడుతుంటాయి. పంటల మార్పిడి, వైవిధ్యత.. పర పరాగ సంపర్కానికి తోడ్పడే ఈ చిరుప్రాణులకు హాని కలిగించని బాధ్యతాయుతమైన వ్యవసాయ పద్ధతులను అనుసరించమని అంతర్జాతీయ తేనెటీగల దినోతవ్సవం (మే 20) సందర్భంగా ఎఫ్.ఎ.ఓ. పిలుపునిచ్చింది. ‘పంటల మార్పిడి, పంటల వైవిధ్యత, రసాయనిక పురుగుమందుల వాడకాన్ని తగ్గించటం, పరాగ సంపర్కానికి దోహదపడే తేనెటీగలు వంటి చిరు జీవులకు అవసరమైన ఆవాసాలను అంటే చెట్లను, పూల వనాలను పునరుద్ధరించటం, అభివృద్ధి చేయటం వంటి చర్యలు తీసుకోవాలని ఎఫ్.పి.ఓ. డైరెక్టర్ జనరల్ క్యు డోంగ్యు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వాలు, రైతులు ఈ పిలుపును అందుకోవాలి. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి రసాయనిక ఎరువులు, పురుగుమందుల వాడకం తగ్గిస్తే నీటిలో వీటి అవశేషాలు తగ్గుతాయి. తేనెటీగలకు మేలు జరుగుతుంది అన్నారాయన. తేనెటీగల పరిరక్షణకు స్లొవేనియా విశేష కృషి చేస్తోంది. 2016 నుంచి మే 20వ తేదీని అంతర్జాతీయ తేనెటీగల దినోత్సవంగా ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో జరుపుకోవడానికి స్లొవేనియా ప్రభుత్వ కృషే కారణం. ఖండాంతర దేశాల్లో 300కు పైగా తేనెటీగల పరిరక్షణ కార్యక్రమాల్లో స్లొవేనియా భాగస్వామైంది. ఎన్.ఐ.పి.హెచ్.ఎం. అధ్యయనం హైదరాబాద్ రాజేంద్రనగరలోని జాతీయ మొక్కల ఆరోగ్య యాజమాన్య సంస్థ (ఎన్‌ఐపిహెచ్‌ఎం) శాస్త్రవేత్తలు తేనెటీగలు సహా అనేక మిత్ర పురుగుల వల్ల ఏయే పంటల సాగులో ఏ విధంగా ప్రయోజనం ఉంటుందనే అంశంపై అధ్యయనం చేశారు. మిత్రపురుగుల సంరక్షణతో కూడిన ‘ఎకలాజికల్ ఇంజనీరింగ్’ పద్ధతులపై జరిగిన అధ్యయనానికి అదనపు సంచాలకులు(పిహెచ్‌ఎం) డాక్టర్ ఈడ్పుగంటి శ్రీలత సారధ్యం వహించారు. పొద్దుతిరుగుడు, జనుము, మొక్కజొన్న, స్వీట్‌కార్న్, వంగ, బెండ, గుమ్మడి, సొర, బీర, చెర్రీ తదితర పంటలపై ఈ అధ్యయనం జరిగింది. గట్ల మీద పూల మొక్కలు సాగు చేశారు. 9 జాతులకు చెందిన 14 రకాల ఈగలు ఈ కూరగాయ తోటల్లో పరాగసంపర్కానికి దోహదపడినట్లు గుర్తించారు. అందులో 5 రకాల తేనెటీగలు ఉన్నాయి. వంగ తోటలో 14 రకాల ఈగలు కనిపించటం విశేషం. ఎకలాజికల్ ఇంజనీరింగ్ అంటే? ‘ఎకలాజికల్ ఇంజనీరింగ్’ భావనను 1962లో తొలుత ప్రతిపాదించిన శాస్త్రవేత్త డా. హొవర్డ్ టి. ఒడుమ్. రసాయనిక సాంద్ర వ్యవసాయ పద్ధతుల వల్ల పర్యావరణానికి జరిగిన నష్టాన్ని గుర్తించి, పంట పొలాల్లో పర్యావరణ వ్యవస్థలను పునరుజ్జీవింపజేయటం. తద్వారా మొక్కలు, భూమి ఆరోగ్యాన్ని కాపాడటం. ఆరోగ్యదాయకమైన ఆహారాన్ని ప్రజలకు అందుబాటులోకి తేవటం ఈ భావన ముఖ్య లక్ష్యం. భూమిని బాగు చేయడానికి ఆచ్ఛాదన పంటలు, పంటల మార్పిడి, పచ్చిరొట్ట పంటలను సాగు చేసి కలియదున్నటం, సేంద్రియ ఎరువులతో పాటు జీవన ఎరువులు, జీవ రసాయనాలు వినియోగించటం ఎకలాజికల్ ఇంజనీరింగ్‌లో ముఖ్యమైన అంశాలు. మిత్రపురుగులను ఆకర్షించడానికి ఆకర్షక పంటలు, శతృపురుగులను ఆకర్షించి మట్టుబెట్టడానికి ఎర పంటలు, శతృపురుగులను పారదోలడానికి వికర్షక పంటలు, పురుగులు తోటలోకి రాకుండా చూడడానికి కంచె/సరిహద్దు పంటలు వేసుకోవటం చీడపీడల నియంత్రణలో కీలకం. ‘పంటల తొలి 40 రోజుల్లో రసాయనిక పురుగుమందులు వాడకుండా ఉండటం ముఖ్యం. ఈ దశలోనే తేనెటీగలు సహా అనేక రకాల మిత్రపురుగులు వృద్ధి చెంది పంటకాలం అంతటా చీడపీడలను నియంత్రణలో ఉంచుతాయి. .’ అంటున్నారు డా. శ్రీలత. వ్యవసాయంలో రసాయనిక ఎరువులు, పురుగుమందుల వాడకం పెరుగుతున్న కొద్దీ సహజ తేనెటీగల సంఖ్య తగ్గిపోతున్నట్లు అనేక అధ్యయనాల్లో తేలింది. బెంగళూరు ప్రాంతంలో జరిగిన ఓ అధ్యయనంలో ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి. నగరం చుట్టూతా విస్తరించిన 40 కిలోమీటర్ల ప్రాంతంలోని 60 గ్రామాల్లో అధ్యయనం చేస్తే సహజ తేనెటీగల సంఖ్య ఏకంగా 20% తగ్గినట్లు వెల్లడైంది. జర్మనీకి చెందిన గొట్టింజెన్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తల బృందం పరిశోధించింది. రసాయనిక వ్యవసాయం విస్తీర్ణం, సాంద్రత పెరుగుతున్నకొద్దీ తేనెటీగలు సమూహాలు తగ్గిపోతుండటాన్ని గుర్తించారు. నగరం నుంచి ప్రతి కిలోమీటరు దూరంగా వెళ్లే కొద్దీ ఆయా ప్రాంతాల్లో తేనెటీగల సంఖ్య 2.4% మేరకు అధికంగా ఉన్నట్లు గుర్తించారు. ఠీ 2016 డిసెంబర్– మే 2017 మధ్య 1275 కుటుంబాలపై అధ్యయనం చేశారు. ఇందులో 638 రైతు కుటుంబాలు. 3 కుటుంబాలకు చెందిన 31 జాతుల తేనెటీగలు ఆ ప్రాంతాల్లో గుర్తించారు. చెట్ల మీదనే కాకుండా నేలలో బొరియలు చేసుకొని ఆవాసాలను ఏర్పాటు చేసుకునే తేనెటీగలు ఉంటాయి. కాబట్టి, రసాయనిక పురుగుమందుల వల్లనే కాకుండా రసాయనిక ఎరువులు లేదా నీటి పారుదల వల్ల కూడా తేనెటీగల సంఖ్య తగ్గుతున్నట్లు గుర్తించారు. ఒక రైతు తన పొలంలో రసాయనిక ఎరువులు వాడటం లేదా నీటి తడి పెట్టడం చేస్తే అక్కడ తేనెటీగల సంఖ్య 20% తగ్గినట్లు పరిశోధకులు గుర్తించారు. పరిసరాల్లోని ఒక్కో పొలంలో పురుగుమందులు చల్లినప్పుడల్లా ఒక్కోశాతం తేనెటీగల సంఖ్య తగ్గిపోతూ వచ్చింది. అత్యధికంగా 80% మంది రైతులు, సగటున 25% మంది రైతులు రసాయనిక పురుగుమందులు చల్లుతున్నారు. ఆ మేరకు తేనెటీగల మనుగడ ప్రశ్నార్థకమవుతోంది. అనేక సంవత్సరాల నుంచి ఉధృతంగా రసాయనిక వ్యవసాయం చేస్తున్న గ్రామాల్లో తేనెటీగలు 8.1% మేరకు తగ్గింది. రోడ్డుకు దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో తేనెటీగల సంఖ్య 17.3% తగ్గిపోయింది. అదేవిధంగా, దగ్గర్లో అడవి లేదా చెరువు ఉన్న చోట్ల 30–39% పెరిగింది. వ్యవసాయంలో విషరసాయనాలు, ముఖ్యంగా నియోనికోటినాయిడ్స్, వాడుతుండటం వల్ల తేనెటీగల నాడీవ్యవస్థ దెబ్బతింటున్నది. ఈ ప్రభావం వల్ల తేనె సేకరణకు వెళ్లిన తేనెటీగలు, ఇంకా ఇతర మిత్ర పురుగులు తిరిగి గూళ్లకు చేరకుండానే నేలరాలుతున్నట్లు పరిశోధకులు గుర్తించారంటున్నారు తేనెటీగల సంరక్షకురాలు బీవీ అపూర్వ. -
సోలార్ స్ప్రేయర్ ఆవిష్కర్త సుభానీకి ఐసిఏఆర్ అవార్డు
ఆరుతడి పంటలు పండించే రైతుల కోసం కొన్ని సంవత్సరాలుగా అనేక వినూత్న స్రేయర్లను ఆవిష్కరించిన సయ్యద్ సుభానీ కృషికి గుర్తింపు లభించింది. భారతీయ వ్యవసాయ పరిశోధాన మండలి సుభానీని జాతీయ ఉత్తమ ఆవిష్కర్త అవార్డుకు ఎంపిక చేసింది. బెంగళూరులోని భారతీయ ఉద్యాన పరిశోధనా సంస్థ (ఐఐహెచ్ఆర్)లో జరగనున్న జాతీయ ఉద్యాన ప్రదర్శన–2020లో ఈనెల 8న సుభానీ ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకోనున్నారు. కషాయాలు, పురుగుమందులను త్వరితగతిన పిచికారీ చేసే సౌర విద్యుత్తుతో నడిచే ఆటోమేటిక్ సోలార్ మౌంటెడ్ మల్టీ క్రాప్ స్ప్రేయర్‌ను రూపొందించినందుకు ప్రధానంగా ఈ అవార్డు తనకు దక్కిందని సయ్యద్ సుభానీ తెలిపారు. ఆయన స్వగ్రామం గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలంలోని నాగబైరు పాలెం. సుభానీ(98486 13687) గతంలో రూపొందించిన బూమ్ స్ప్రేయర్ బాగా ప్రాచుర్యం పొందింది. సుభానీ కృషికి ‘సాక్షి సాగుబడి’ జేజేలు! -
సైలేజీ గడ్డి సీజన్ ఇదే!
పచ్చిమేత లేకుండా పాడి లాభసాటి కాదు. అయితే, సంవత్సరం పొడవునా మనకు పిచ్చమేత లభ్యం కాదు. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో మనకు కొరత మరీ ఎక్కువ. అందుచేత జనవరి నెలలోనే మాగుడు గడ్డి / సైలేజీ గడ్డి / పాతర గడ్డిని తయారు చేసుకొని, పచ్చి గడ్డి కొరత ఉండే నెలల్లో వాడుకుంటే పాల దిగుబడి తగ్గిపోకుండా ఉంటుంది. సైలేజీ గడ్డి తయారీ ఇలా.. ► పచ్చి మేత పుష్కలంగా ఉన్నప్పుడు దాన్ని చిన్న ముక్కలుగా కత్తిరించి, గుంతలో వేసి, గాలి చొరపడకుండా కప్పి పెట్టి, పోషక విలువలు తగ్గకుండా కాపాడుకొని, అవసర సమయాల్లో పశువులకు మేపుకొనే గ్రాసాన్నే సైలేజీ గడ్డి అంటారు. ► ఎక్కువ పిండి పదార్థాలు కలిగి, సుమారుగా మాంసకృత్తులు కలిగిన పశుగ్రాసాలు అనువైనవి. ఉదా: జొన్న, మొక్కజొన్న, నేపియర్, గిన్నీ గడ్డి, సజ్జ మొదలైనవి. అలాగే గుర్రపుడెక్క, చెక్క తట్టాకు, గుంతకల్లుడు ఆకు, చెట్టింటాకు లాంటి కలుపు మొక్కలను కూడా సైలేజీకి వాడవచ్చు. ► సైలేజీ గడ్డిలో ఎండుగడ్డిని కూడా 1:4 నిష్పత్తిలో వాడవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక టన్ను పశుగ్రాసానికి సుమారు 30 కిలోల మొలాసిస్ వాడితే మంచిది. మొలాసిస్ లభ్యం కానప్పుడు బెల్లం నీటిని కూడా వాడవచ్చు. ఈ ద్రావణాన్ని పశుగ్రాసం పైన పిచికారీ చేసుకొని సైలేజీని తయారు చేసుకోవాలి. ► సైలేజీ తయారీకి 35 శాతం కంటే ఎక్కువ తేమ ఉండకూడదు. ఎక్కువ మాంసకృత్తులున్న పశుగ్రాసాలు– లూసర్ను, బర్సీము, అలసంద, పిల్లిపెసర లాంటివి సైలేజీకి పనికిరావు. ► సైలేజీ తయారీకి వాడే గుంతలు 3 రకాలు.. అపార్ట్మెంట్ పద్ధతి, గుంత కాల్వ పద్ధతి, బంకర్ పద్ధతి. ► రైతు తన అవసరాన్ని బట్టి సైలేజీని తయారు చేసుకోవచ్చు. సైలేజీ తయారీకి వాడే గుంత ముఖ్యంగా పశువుల సంఖ్య, నేల స్వభావం మీద ఆధారపడి ఉంటుంది. ► ఒక్కో రోజుకు సుమారుగా 20 కిలోల సైలేజీని పశువుకు మేపుకోవచ్చు. ► గుంత పరిమాణాన్ని నిర్ణయించడానికి సూత్రం– ఉదా: ఒక రైతు దగ్గర 3 పాడి పశువులున్నాయి. వేసవిలో 3 నెలల పాటు సైలేజీ అవసరం అనుకుంటే, ఒక్కోపశువుకు రోజుకు 20 కిలోలు. 90“20=1,800 కిలోల అవసరం. అదే 3 పశువులకు 5,400 కిలోలు అవసరం. ఈ సైలేజీ తయారు చేసుకోవడానికి 8,100 కిలోల పశుగ్రాసం అవసరం. ఒక ఘనపు అడుగులో 20–23 కిలోల పశుగ్రాసాన్ని పాతర వేయొచ్చు. కాబట్టి, దాదాపు 350 ఘనపుటడుగుల గుంత అవసరం. అంటే.. 12 అడుగుల పొడవు, 10 అడుగుల వెడల్పు, 3 అడుగుల లోతు ఉన్న గుంత అవసరం. సైలేజీ గడ్డి తయారీలో జాగ్రత్తలు ► పశుగ్రాసాన్ని నింపేటప్పుడు గుంతలో గాలి చొరబడకుండా చూడాలి. ► గుంతలో నీరు లేకుండా, చేరకుండా చూడాలి. ► సైలేజీ తయారీలో పశుగ్రాసాల్లో 65 శాతం కంటే ఎక్కువ తేమ ఉండకూడదు. ► జొన్న, మొక్కజొన్న చొప్ప సైలేజీ గడ్డి తయారీకి చాలా అనుకూలం. సైలేజీ గుంతను 3–4 రోజుల వ్యవధి లోపలే నింపాలి. అంతకన్నా ఆలస్యం కాకూడదు. ► జొన్న, మొక్కజొన్న, నేపియర్ గడ్డి రకాలు వాడినట్లయితే.. టన్నుకు 3 కిలోల యూరియా కలిపితే మంచిది. ► డోములాగా గుంత పై భాగాన్ని 2–3 అడుగుల ఎత్తు వరకు నింపవచ్చు. ► సైలేజీ నింపిన తర్వాత 2–3 అంగుళాల వరకు మట్టితో కప్పినట్లయితే, వత్తిడి వల్ల గుంతలోని గాలి బయటకు వెళ్లిపోయే అవకాశం ఉంది. ► 2–3 నెలల వ్యవధిలో సైలేజీ తయారవుతుంది. ► 2–3 సంవత్సరాల వరకు నిల్వ చేసుకోవచ్చు. ► గుంత తెరచిన తర్వాత సైలేజీని ఒక నెల లోపల వాడాలి. లేదంటే బూజు పడుతుంది. బూజు పట్టిన సైలేజీ గడ్డిని పశువులకు మేపకూడదు. ప్రతిరోజూ పశువుకు 20 కిలోలతో బాటుగా, పచ్చిమేత ఒక భాగం, ఎండు మేత ఒక భాగం కలిపి మేపుకుంటే మంచిది. ప్రాణ వాయువు లేకుండా బ్యాక్టీరియా కారణంగా జరిగే రసాయనిక చర్య ద్వారా సైలేజీ గడ్డి తయారవుతుంది. ఈ ప్రక్రియ వల్ల సువాసనలతో కూడిన ఆమ్లాలు కూడా ఉత్పత్తవుతాయి. అందుకే సైలేజీ గడ్డి మంచి సువాసన కలిగి ఉంటుంది. పశువులు ఇష్టంగా తింటాయి. – డా. ఎం.వి.ఎ.ఎన్. సూర్యనారాయణ (99485 90506), ప్రొఫెసర్–అధిపతి, డిపార్ట్మెంట్ ఆఫ్ లైవ్‌స్టాక్ ఫామ్ కాంప్లెక్స్, కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్, తిరుపతి సైలేజి తయారీకి సిద్ధం చేసిన గడ్డి ముక్కలు -
జైలులో ‘హైడ్రో’ ఫార్మింగ్
తాజా ఆకుకూరలను ఖైదీలకు అందించాలనే ఉద్దేశంతో సంగారెడ్డి జిల్లా జైలులో వినూత్నంగా హైడ్రోపోనిక్ సాగు పద్ధతికి శ్రీకారం చుట్టారు. మొదటగా పాలకూరను పండిస్తున్నారు. ఈ పద్ధతిలో సాగుకు మట్టి అవసరం లేదు. మొక్కలు నీటిలోనే పెరుగుతాయి. నీటివినియోగం కూడా చాలా తక్కువ. నేలలో పంటలకు కావలసిన నీటిలో 5 శాతం చాలు. విత్తనాలను చిన్న ట్రేలలో కొబ్బరి పొట్టులో వేసి మొలకెత్తిస్తారు. మొక్కల ఎదుగుదలకు కావాల్సిన పోషకాలను ద్రావణాల రూపంలో అందిస్తున్నారు. మున్ముందు కొత్తమీర, చుక్కకూరతోపాటు మిర్చి టమాట, వంగ తదితర కూరగాయ పంటలను సైతం పండించడానికి సన్నద్ధమవుతున్నా జైలు సూపరిండెంట్ నవాబు శివకుమార్ గౌడ్ ‘సాక్షి’కి వివరించారు. హైడ్రోపోనిక్ సాగు విధానం.. ప్లాస్టిక్ ట్రేలలో కొబ్బరిపొట్టు నింపి విత్తనాలు వేస్తారు. వారం రోజుల్లోగా ఆ విత్తనం మొలకెత్తుతుంది. ఎదిగిన మొక్కను తీసి నెట్ పాట్(జాలీ గ్లాసుల)లో పెట్టి, మొక్క నిలబడడానికి క్లేబాల్స్(మట్టి బంతులు), గులకరాళ్లు వంటివి వాడతారు. మొక్కలతో కూడిన జాలీ గ్లాసులను పీవీసీ పైపులలో ఉంచుతారు. పోషక ద్రావణాలతో కూడిన నీరు ఈ పైపులలో ఉంటుంది. అందులోని పోషకాలను మొక్కలు వేర్ల ద్వారా గ్రహించి పెరుగుతాయి. పీవీసీ లేదా ఫైబర్ పైపులను ఒకచోట అమరుస్తారు. ఇందుకు పెద్దగా స్థలం అవసరం ఉండదు. ఈ సాగుకు గాను పైపులకు సరిపడా గ్రీన్నెట్ లేదా షెడ్ నెట్ ఉపయోగించవచ్చు. 25 పైపులతో అమరిస్తే సుమారుగా 650 మొక్కలను సాగు చేసే అవకాశం ఉంది. అడుగుకు ఒక మొక్క పెడితే వేయి మొక్కలను సాగుచేయవచ్చు. మొక్కకు కావాల్సిన పోషకాలను మ్యాక్రో సొల్యూషన్స్ (స్థూలపోషకాలు), మైక్రోసొల్యూషన్స్ (సూక్ష్మ పోషకాలు) ద్రావణాల ద్వారా అందిస్తారు. పురుగుమందుల అవసరం ఉండదు. మొక్క పెట్టిన మొదట్లో నీటిలో పోషకాల స్థాయి 800 వరకు ఉంటే సరిపోతుంది. మొక్క ఎదుగుతున్న కొద్దీ పోషకాల స్థాయి 1500 వరకు ఉండాలి. ప్రతి రోజు రెండు గంటలు ఎండ తగిలే విధంగా పైపులను ఉంచుతారు. ప్రతి రోజు మొక్క ఎదుగుదలను తెలుసుకోవడానికి ద్రావణాల మోతాదును, నీటిలో పీహెచ్ విలువను ఖచ్చితంగా పీహెచ్ మీటర్ ద్వారా పరీక్షిస్తారు. అదే విధంగా పోషకాలు ఎంత ఉన్నాయో తెలుసుకోవడానికి ఎలక్ట్రో కండక్టివిటీ మీటర్‌ను వాడతారు. ఆకుకూరలైతే మూడు నుంచి నాలుగు వారాలలోపే మొదటి పంట చేతికి వస్తుంది. కూరగాయలైతే నాలుగు నుంచి ఐదు వారాల సమయం పట్టే అవకాశం ఉంది. హెడ్రోపోనిక్ పద్ధతి ద్వారా సంగారెడ్డి జిల్లా జైలులోని 250 మంది ఖైదీల కోసం తాజా పాలకూర సాగు మొదలు పెట్టామని జైలు సూపరిండెంట్ శివకుమార్‌గౌడ్ ‘సాక్షి’తో చెప్పారు. ఉన్నతాధికారుల తోడ్పాటుతో కూరగాయలు కూడా పండించడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. – కొలన్ దివాకర్‌రెడ్డి, సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి బి.శివప్రసాద్, స్టాఫ్ ఫొటోగ్రాఫర్ -
ఆశావహ సేద్యం!
రసాయనిక వ్యవసాయానికి పెట్టింది పేరైన హర్యానా రాష్ట్రంలో ఆశా వంటి ప్రకృతి వ్యవసాయదారులు అరుదుగా కనిపిస్తారు. ఆశ తన కుటుంబ సభ్యులు, కూలీల సహకారంతో గత పదేళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడకుండా పండ్ల తోటలు, పంటలు సాగు చేస్తానంటే వాళ్ల ఇంట్లో వాళ్లే ఎగతాళి చేశారు. అయినా, ఆశా వెనకంజ వెయ్యలేదు. జిల్లా కేంద్రం చర్కి–దద్రి జిల్లా కేంద్రానికి 25 కిలోమీటర్ల దూరంలో పిచొంప కలన్ గ్రామం ఆమెది. 3,200 గడప ఉంటుంది. ఆశా, ఆమె కోడలు జ్యోతితోపాటు ఆ ఊళ్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులు చాలా కొద్దిమంది మాత్రమే. వాళ్లకు మూడెకరాల భూమి ఉంది. అందులో నారింజ, నిమ్మ, బత్తాయి చెట్లతో కూడిన పండ్ల తోటను సాగు చేస్తున్నారు. పరస్పరం పోటీ పడని సీజనల్ పంటలను అంతర పంటలుగా సాగు చేయడం ప్రకృతి వ్యవసాయంలో ఓ ముఖ్య సూత్రం. ఆశా ఆ సూత్రాన్ని పాటిస్తున్నారు. పాలకూర, మెంతికూర, శనగలు, సజ్జలు, గోధుమలను కూడా అంతరపంటలుగా సాగు చేస్తూ ఉత్తమ రైతుగా ఆశా పేరు గడించారు. అదే తోటలో సీతాఫలం మొక్కలను కూడా నాటాలని ఆమె అనుకుంటున్నారు. తొలుత రెండేళ్ల పాటు సాధారణ దిగుబడితో పోల్చితే 40 శాతం మేరకే దిగుబడి వచ్చిందని, అయినా మక్కువతో ప్రారంభించిన ప్రకృతి వ్యవసాయాన్ని కొనసాగించి, ఇప్పుడు మంచి దిగుబడులు పొందుతున్నానని ఆశా తెలిపారు. ఏ రోజైనా ఇంటిపనులు చేసుకున్న తర్వాత ఉదయం, సాయంత్రం తోటలోకి వెళ్లి పనులు స్వయంగా చేసుకోవడం ఆశాకు, ఆమె కోడలికి అలవాటు. ప్రతిరోజూ శ్రద్ధగా తోటను గమనించుకుంటూ.. ఎక్కడైనా చీడపీడల జాడ కనిపిస్తే వెంటనే కషాయాలు, ద్రావణాలు పిచికారీ చేసి అదుపు చేయడం ముఖ్యమైన సంగతి అని ఆశ అంటున్నారు. గొయ్యిలో పాతిపెట్టిన మట్టి పాత్రలో పుల్లమజ్జిగ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. చీడపీడలకు దాన్ని నీటిలో కలిపి పిచికారీ చేస్తారు. ఔషధ చెట్ల నుంచి సేకరించిన జిగురుకు నిప్పు అంటించి తోటలో పొగబెట్టడం ద్వారా చీడపీడలను సంప్రదాయ పద్ధతిలో ఆశా పారదోలుతున్నారు. ‘పంటలు పూత దశలో మా బామ్మ ఇలాగే చేసేది’ అంటున్నారామె. ప్రతి రెండు నెలలకోసారి ద్రవ జీవామృతాన్ని తోటకు అందిస్తూ భూసారాన్ని పెంపొందిస్తున్నారు. వర్మీకంపోస్టును సైతం తయారు చేసి పంటలకు వాడుతున్నారు. అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించుకొని ఎరువులు, పురుగుమందులను తయారు చేసుకుంటున్నారు. బయట ఏవీ కొనడం లేదు. బోరు నీటిని స్ప్రింక్లర్లు, డ్రిప్ ద్వారా పంటలకు అందిస్తున్నారు. ‘ఈ తరహా ప్రకృతి వ్యవసాయంలో పెట్టుబడి చాలా తక్కువే. అయితే, కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది’ అంటున్నారు ఆశా కోడలు జ్యోతి. సతత్ సంపద అనే స్వచ్ఛందసంస్థ హర్యానా, ఉత్తరప్రదేశ్‌లో రైతులకు సుస్థిర వ్యవసాయ పద్ధతులను పరిచయం చేస్తూ ఉంటుంది. ఆశకు ఈ సంస్థ తోడ్పాటునందించింది. సతత్ సంపద డైరెక్టర్ జ్యోతి అవస్థి ఇలా అంటున్నారు.. ‘భూమిలో డీఏపీ, యూరియా వెయ్యకుండా పంటలు ఎలా పండుతాయి? అని రైతులు మమ్మల్ని ప్రశ్నిస్తూ ఉంటారు. భూమిలో సారం పెరగడానికి రెండేళ్లు పడుతుంది. అందుకే ప్రకృతి వ్యవసాయం మొదలు పెట్టిన తొలి రెండేళ్లలో దిగుబడి తక్కువగా ఉంటుంది. ఎంతో మక్కువతో ప్రారంభించిన ఆశ వంటి రైతులు తట్టుకొని నిలబడగలరు. కానీ, మరీ చిన్న రైతులు దీనికి తట్టుకోలేరు. అందుకే మేం ఈ రైతులతో పనిచేస్తున్నాం. మార్పు నెమ్మదిగా వస్తుంది..’. -
ఇంటిపంటలే ఆరోగ్యదాయకం
హైదరాబాద్ కుషాయగూడలో లత, కృష్ణమూర్తి వృద్ధ దంపతులు రెండేళ్ల నుంచి తాము నివాసం ఉంటున్న బంధువుల ఇంటిపైన సేంద్రియ ఇంటిపంటలు పండించుకొని తింటూ ఆరోగ్యంగా, సంతోషంగా గడుపుతున్నారు. కృష్ణమూర్తి ప్రభుత్వ రంగ సంస్థలో డిప్యూటీ మేనేజర్‌గా రిటైరైన తర్వాత కుషాయగూడలోని బావ గారి ఇంటి మొదటి అంతస్థులో నివాసం ఉంటున్నారు. ఆకుకూరలు, కూరగాయలను కలుషిత జలాలతో పండిస్తున్నారన్న వార్తలు చదివిన తర్వాత తమ ఆరోగ్యం కోసం మిద్దె తోటలో కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు పండించుకోవాలని నిర్ణయించుకున్నామని లత కృష్ణమూర్తి తెలిపారు. బరువు తక్కువగా ఉంటుందని గ్రోబాగ్స్‌లోనే ఎక్కువ భాగం ఇంటిపంటలు సాగు చేస్తున్నారు. ప్రస్తుతం వారి మిద్దెపై 300–400 గ్రోబాగ్స్‌లో పచ్చని పంటలు పండుతున్నాయి. ఆకుకూరలు, కూరగాయలతోపాటు పండ్ల మొక్కలు కూడా ఇందులో ఉన్నాయి. బోరు లేదు. నీటి అవసరాలకు కుళాయి నీరే ఆధారం కాబట్టి డ్రిప్‌ను ఏర్పాటు చేసుకున్నారు. గ్రోబాగ్స్‌లో కొయ్య తోటకూర, మెంతికూర, చుక్క కూరలతో ఇంటిపంటల సాగుకు శ్రీకారం చుట్టానని లత తెలిపారు. మొదట్లో చాలా సమస్యలు వచ్చినా అనుభవం నుంచి నేర్చుకున్నారు. చౌహన్ క్యు, పాలేకర్ బాటలో... ఎర్రమట్టి 20 శాతం, కొబ్బరిపొట్టు 25 శాతం, 55 శాతం పశువుల ఎరువు+వర్మీకంపోస్టుతోపాటు గుప్పెడు వేపపిండి కలిపి మట్టి మిశ్రమాన్ని తయారు చేసుకొని గ్రోబాగ్స్‌లో నింపి ఇంటిపంటలను దిగ్విజయంగా సాగు చేస్తున్నారు లత కృష్ణమూర్తి. సౌత్ కొరియా ప్రకృతి వ్యవసాయ నిపుణుడు చౌహన్‌క్యు చూపిన బాటలో ఇంటిలో లభించే ముడి సరుకులతోనే పోషకద్రావణాలను తయారు చేసుకొని పంటలకు ప్రతి వారం, పది రోజులకోసారి పిచికారీ చేయడం, మొక్కల మొదళ్లలో పోయడం ద్వారా మంచి దిగుబడులు సాధిస్తున్నారామె. జీవామృతం స్వయంగా తయారు చేసుకొని ప్రతి 15 రోజులకోసారి పంటలకు అందిస్తున్నారు. మునగాకు లేదా వేపాకు బరువుతో సమానంగా బెల్లం కలిపి 20 రోజుల తర్వాత లీటరుకు 1–2 మిల్లీలీటర్ల చొప్పున కలిపి పిచికారీ చేయడం, మట్టిలో పోయడం ద్వారా అధిక దిగుబడి పొందుతున్నామని, చీడపీడల బెడద లేకుండా చక్కని ఆరోగ్యదాయకమైన కూరగాయలు పండుతున్నాయని లత సంతృప్తిగా చెప్పారు. ఈ ఏడాది జూలై నుంచి గత వారం వరకు అసలు కూరగాయలు కొనాల్సిన అవసరం లేకుండా పూర్తిగా తమకు ఇంటిపంటలే సరిపోయాయని ఆమె తెలిపారు. అందరూ ఇంటిపంటలు పండించాలి కలుషితనీరు, విషరసాయనాలతో పండించే కూరగాయలు, ఆకుకూరలు, పండ్లకు బదులు నగరవాసులు అందరూ తమ ఇళ్లమీద పండించుకోవడం మంచిది. వారానికి కనీసం 3–4 రోజులైనా తాము పండించిన సేంద్రియ, తాజా కూరగాయలు తింటే ఆరోగ్యంగా ఉంటారు. వాకింగ్‌కు వెళ్లేబదులు ఉదయం గంట, సాయంత్రం గంట పాటు ఇంటిపంటల్లో పనులు చేసుకుంటే మేలు. ఇంటిపంటల పనుల్లో నిమగ్నం అయితే టైం కూడా తెలవదు. మనసు ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. మేము మంచి ఆహారం తీసుకోవడంతోపాటు విదేశాల్లో ఉన్న మా పిల్లలకు కూడా పొన్నగంటి కూర వంటి ముఖ్యమైన ఆకుకూరలను నీడలో ఆరబెట్టి పంపుతున్నందుకు ఆనందంగా ఉంది. – లత కృష్ణమూర్తి, ఇంటిపంటల సాగుదారు, కుషాయగూడ, హైదరాబాద్ కాకర కాయను చూపుతున్న లత కృష్ణమూర్తి లత కృష్ణమూర్తి మిద్దెతోటలో పండిన కూరగాయలు -
అన్నదమ్ముల అపూర్వ సేద్యం
ఆరిమిల్లి కృష్ణ, బాపిరాజు సోదరులు 135 ఎకరాల సొంత భూమిలో ఉమ్మడి వ్యవసాయం చేస్తున్న పెద్దరైతులు. కర్నూలు జిల్లా కోసిగి మండలం కోల్‌మాన్‌పేట వారి స్వగ్రామం. పశ్చిమగోదావరి జిల్లా నుంచి 1960లో వీరి తండ్రి వలస వచ్చి కోల్మాన్పేటలో స్థిరనివాసం ఏర్పరచుకొని పాడి పశువుల పోషణతోపాటు పంటలు సాగు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. కృష్ణ బీటెక్ చదువుకున్నప్పటికీ తండ్రి చూపిన బాటలో వ్యవసాయాన్నే వృత్తిగా ఎంపిక చేసుకున్నారు. అంతేకాదు, ఎన్నో ఏళ్లుగా చేస్తున్న రసాయనిక వ్యవసాయం అనేక విధాలుగా ఎలా నష్టదాయకమో గ్రహించి కుటుంబంలో అందర్నీ ఒప్పించి ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లించడం విశేషం. 40 దేశవాళీ ఆవులను పోషిస్తూ.. వాటి పేడ, మూత్రంతో జీవామృతం, ఘనజీవామృతం తయారు చేసుకొని భూములను సజీవవంతంగా మార్చుకుంటూ ఆరోగ్యదాయకమైన ఆహారాన్ని పండిస్తున్నారు. రసాయనిక వ్యవసాయంలో ఎరువులు, పురుగుమందుల ఖర్చులు పెరిగిపోయి క్రమంగా నికరాదాయం తగ్గిపోతూ వస్తున్న తరుణంలో 2012 ఏప్రిల్‌లో హైదరాబాద్‌లో సుభాష్ పాలేకర్ ప్రకృతి వ్యవసాయ శిక్షణా శిబిరంలో కృష్ణ పాల్గొన్నారు. రసాయనిక వ్యవసాయంతో ప్రజారోగ్యానికి, భూమికి, పర్యావరణానికి, ఆరోగ్యానికి జరుగుతున్న నష్టాన్ని అర్థం చేసుకున్న కృష్ణ.. పాలేకర్ చెప్పిన విధంగా 2012 ఖరీఫ్ పంట కాలం నుంచే ప్రకృతి వ్యవసాయం చేపట్టారు. ఏకంగా 90 ఎకరాల్లో వరి సేద్యాన్ని ప్రకృతి వ్యవసాయ పద్ధతిలోకి మార్చేశారు. అయితే, కొత్త కావడం, సందేహాలను నివృత్తి చేసే వారు అందుబాటులో లేకపోవడంతో వరి ధాన్యం దిగుబడి తొలి ఏడాది ఎకరానికి 18 బస్తాలకు పడిపోయింది. మొదటి ఏడాది రూ. లక్షల ఆదాయం తగ్గిపోయింది. అయినా, మొక్కవోని దీక్షతో ప్రకృతి వ్యవసాయంలో మెలకువలను నేర్చుకుంటూ వ్యవసాయాన్ని కొనసాగించారు. అంతేకాదు, అప్పటివరకు నిర్వహిస్తున్న రసాయనిక ఎరువులు, పురుగుమందుల దుకాణం(ఏటా రూ. 30 లక్షలకు పైగా టర్నోవర్) కూడా అదే సంవత్సరం మూసివేసి మరీ ప్రకృతి వ్యవసాయానికి కట్టుబడిన ప్రకృతి వ్యవసాయ కుటుంబం వారిది. దిగుబడి 18 నుంచి 52 బస్తాల వరకు.. ప్రకృతి వ్యవసాయంలో పట్టు సాధిస్తున్న కొద్దీ ఏటేటా దిగుబడులు పెరుగుతూ వచ్చాయి. ప్రస్తుతం తమ ప్రాంతంలో రసాయనిక వ్యవసాయదారుల కన్నా ఎక్కువగానే ప్రకృతి వ్యవసాయంలో తాము వరి ధాన్యం దిగుబడి తీయగలుగుతున్నామని గర్వంగా చెప్పుకునే స్థితికి కృష్ణ ఎదిగారు. మొదటి ఏడాదే 90 ఎకరాల్లో వరిసాగును ప్రకృతి వ్యవసాయంలో చేపట్టినప్పుడు కొన్ని పొరపాట్ల వల్ల ఎకరానికి 18 బస్తాల వరి ధాన్యం దిగుబడి వచ్చింది. ప్రస్తుతం ఎకరానికి 35 నుంచి 40 బస్తాల (బస్తా 72 కిలోలు) దిగుబడి సాధిస్తున్నారు. రెండేళ్ల క్రితం చీడపీడల బెడద ఎక్కువగా ఉండటంతో రసాయనిక వ్యవసాయం చేసిన రైతులకు ధాన్యం దిగుబడి బాగా తగ్గిపోయినా తమ పొలంలో చీడపీడలూ లేవు, దిగుబడీ తగ్గలేదని కృష్ణ తెలిపారు. రెండు ఎకరాల్లో ప్రయోగాత్మకంగా పచ్చి పేడ స్లర్రీని బకెట్లతో పొలంలో కూలీలతో తరచూ పోయిస్తూ వచ్చానని, దిగుబడి ఎకరానికి 52 బస్తాల ధాన్యం దిగుబడి వచ్చిందని కృష్ణ తెలిపారు. అయితే, పేడ స్లర్రీని బక్కెట్లతో పోయించడం శ్రమతోటి, ఖర్చుతోటి కూడిన పని కాబట్టి కొనసాగించడం లేదన్నారు. పత్తిలో అంతర పంటగా తెల్ల జొన్న కృష్ణ సోదరులకు 12 ఎకరాల్లో మామిడి తోట ఉంది. ఈ ఏడాది 56 ఎకరాల్లో వరి (బీపీటీ 5204, ఆర్ఎన్ఆర్ 15048, ఎన్‌డిఎల్‌ఆర్–7 రకాలు) సాగు చేశారు. ఆర్ఎన్ఆర్ ఎకరానికి 38 బస్తాల దిగుబడి వచ్చింది. ఆముదం 20 ఎకరాల్లో, 4 ఎకరాల్లో కంది సాగు చేస్తున్నారు. 14 ఎకరాల్లో అండుకొర్రలు, కొర్రలు, ఊదలు, సామలు, వరిగలు సాగు చేశారు. 6 ఎకరాల్లో బీటీ పత్తి వేసి, జొన్నను అంతరపంటగా సాగు చేస్తున్నారు. ఇప్పటికే ఎకరానికి 6 క్వింటాళ్ల పత్తి తీశారు. మరో 6 క్వింటాళ్లు రావచ్చు. పత్తి సాళ్ల మధ్య 48 అంగుళాల దూరం పెట్టారు. పత్తి సాళ్ల మధ్య రెండు వరుసలుగా తెల్ల జొన్నను విత్తారు. ఎకరానికి పది క్వింటాళ్ల జొన్న దిగుబడి వస్తుందని కృష్ణ ఆశిస్తున్నారు. షాంపూ, వేప చెక్క+గోమూత్ర కషాయం సోప్ షాంపూ, వేప చెక్క+గోమూత్రంతో చేసిన కషాయం పిచికారీ చేశాక కత్తెర పురుగు ఉధృతి రసాయనిక వ్యవసాయ పొలాల్లో కన్నా తమ పొలంలో తక్కువగా ఉందని కృష్ణ తెలిపారు. సోప్ షాంపూని రెండు సార్లు పిచికారీ చేశారు. వేపచక్క 3 కిలోలు, 12 లీటర్ల గోమూత్రం కలిపి 3 పొంగులు పొంగిస్తే 8–9 లీటర్ల కషాయం వస్తుంది. కాచిన తెల్లారి 20 లీటర్ల పంపునకు ఒక లీటరు కషాయాన్ని, 1 లీటరు గోమూత్రం, 18 లీటర్ల నీటిని కలిపి పత్తిపై పిచికారీ చేస్తున్నారు. ఈ రబీలో మినుము, పెసర, గోధుమను సాగు చేయనున్నామన్నారు. మిర్చిలో అంతరపంటలుగా జొన్న, సజ్జ గత ఏడాది ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేసిన ఎల్‌సిఎ 625 నాటు రకం మిర్చి (వరుసల మధ్య 36 అంగుళాలు, మొక్కల మధ్య 1.5 అంగుళాల దూరం)లో జొన్న, సజ్జ (3–4 మిరప మొక్కలకు ఒక జొన్న, సజ్జ మొక్కలు నాటారు) అంతర పంటలుగా వేసి మిర్చిలో 12 క్వింటాళ్ల దిగుబడులు సాధించానని కృష్ణ తెలిపారు. జొన్న, సజ్జ అంతరపంటగా వేయడం వల్ల ఫిబ్రవరి తర్వాత ఎండ తీవ్రత నుంచి మిర్చి పంటకు నీడ దొరకడంతో ఒక కాపు ఎక్కువగా వచ్చిందన్నారు. ఈ రకం మిరప విత్తనాన్ని తిరిగి వాడుకోవచ్చని, అయితే వేరే పొలంలో పండిన లేదా లాం ఫాం నుంచి విత్తనాలు తెచ్చి వేసుకుంటే మంచిదన్నారు. వేప చెక్క+గోమూత్ర కషాయాన్ని అమావాస్యకు ముందు ఒకసారి, తర్వాత మరోసారి ఈ కషాయాన్ని పిచికారీ చేసి మంచి ఫలితాలు సాధించామని కృష్ణ తెలిపారు. ప్రదర్శనా క్షేత్రం.. శిక్షణా కేంద్రం.. కృష్ణ, బాపిరాజు సోదరులు మక్కువతో ప్రకృతి వ్యవసాయం చేస్తూ వరి, పత్తి, మిర్చి నుంచి చిరుధాన్యాలు, మామిడి తోటల వరకు బహుళ పంటలు సాగు చేస్తూ భళా అనిపించుకుంటుండటంతో వారి వ్యవసాయ క్షేత్రం వైఎస్సార్ కడప, కర్నూలు జిల్లాలతో పాటు కర్ణాటకలోని బళ్లారి ప్రాంత రైతులకు సైతం ప్రదర్శన క్షేత్రంగా, రైతు శిక్షణా కేంద్రంగా రూపుదాల్చింది. సీజన్లో కనీసం రెండు సార్లు రైతులకు శిక్షణ ఇస్తున్నామని, నిరంతరం రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు ఫీల్డ్ విజిట్‌కు వస్తూ వుంటారని కృష్ణ గర్వంగా చెప్పారు. గ్రామంలో పెద్ద రైతు రసాయనిక వ్యవసాయానికి స్వస్తి పలికి ప్రకృతి వ్యవసాయం చేపట్టి, మిగతా రైతులకు తోడ్పాటునందిస్తూ ఉంటే ఆ గ్రామంలో చిన్న రైతులు అనుసరించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కోల్మాన్పేటలో కూడా అదే జరుగుతోంది. ఇప్పటికి 150 మంది రైతులు ప్రకృతి వ్యవసాయ బాట పట్టారని కృష్ణ తెలిపారు. తాము జీవామృతం, ఘనజీవామృతం, తదితర కషాయాలను రైతులకు నామమాత్రపు ధరలకు అందుబాటులో ఉంచుతున్నారు. ప్రభుత్వ యంత్రాంగం తోడ్పాటుతో గ్రామంలో మిగతా రైతులను కూడా ప్రకృతి వ్యవసాయంలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాని కృష్ణ ఆనందంగా చెప్పారు. స్ఫూర్తిదాయకమైన కృషి చేస్తున్న కృష్ణ సోదరులకు ‘సాగుబడి’ జేజేలు! – గవిని శ్రీనివాసులు, సాక్షి, కర్నూలు (అగ్రికల్చర్) వెయ్యి లీటర్ల బ్యారెల్స్‌లో జీవామృతం సరఫరా అలవాటైపోయిన రసాయనిక వ్యవసాయం వదిలేసి ప్రకృతి వ్యవసాయం చేపట్టే రైతుల్లో వారి ఆర్థిక స్తోమతను బట్టి ఎవరి బాధలు వాళ్లకుంటాయి. చిన్న రైతులకు ఉండే సమస్యలు ఒక రకమైతే, పెద్ద రైతులకు ఉండే సమస్యలు ఇంకో రకం. పాలేకర్ శిక్షణా తరగతుల్లో 200 లీటర్ల నీటిలో ఆవు పేడ, మూత్రం, బెల్లం, పప్పుల పిండి కలిపి ఎకరానికి సరిపడా జీవామృతం ఎలా తయారు చేసుకోవాలో చెబుతుంటారు. అయితే, ప్రకృతి వ్యవసాయం ప్రారంభించిన తొలినాళ్లలో ఈ సూచనలను కృష్ణ అలాగే పాటించారు. పొలం విస్తీర్ణం ఎక్కువ కావడంతో కొద్ది పరిమాణాల్లో చిన్న డ్రమ్ముల్లో చేసిన జీవామృతం సరిపోక పంట అనుకున్నంత దిగుబడినివ్వలేదు. దీంతో, ఇలా కాదని తమ పెద్ద వ్యవసాయ క్షేత్రానికి అనుగుణంగా జీవామృతం తయారీ పద్ధతిని కృష్ణ నేర్పుగా మార్చుకున్నారు. వెయ్యి లీటర్ల ఫైబర్ బ్యారెల్స్ తెప్పించి వాటిలో జీవామృతం తయారు చేసి భూములకు అందించడం ప్రారంభించిన తర్వాత సమస్య తీరింది. పంటల దిగుబడీ పెరిగింది. జీవామృతంతో కూడిన వెయ్యిలీటర్ల బ్యారెల్స్ మూడింటిని ఒక ట్రాలీలో తరలించి ఒక విడతకు 10–15 ఎకరాలకు అందిస్తుండడంతో ఇప్పుడు పుష్కలంగా జీవామృతం పంటలకు అందుతోంది. దీంతోపాటు పల్వరైజింగ్ మిషన్‌ను తెచ్చిన తర్వాత.. 135 ఎకరాలకు సరిపడా వివిధ రకాల కషాయాల తయారీ ప్రక్రియ కూడా సులభంగా మారిందని కృష్ణ సంతృప్తిగా చెప్పారు. ప్రకృతి వ్యవసాయమే నా సర్వస్వం ప్రకృతి వ్యవసాయమే నా సర్వస్వం. గతంలో రసాయన ఎరువులతో వ్యవసాయం చేసి నష్టాలను మూట కట్టుకున్నాను. సుభాష్ పాలేకర్ స్ఫూర్తితో 2012 నుంచి తమ్ముడు బాపిరాజుతో కలసి 135 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తూ అనేక మంది రైతులకు శిక్షణ కూడా ఇస్తున్నాం. మా గ్రామంలో దాదాపు 150 మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. 40 దేశవాళీ ఆవులను పోషిస్తున్నాం. ప్రకృతి వ్యవసాయం వల్ల నాణ్యమైన ఆహారాన్ని పండిస్తున్నాం. భూమి ఆరోగ్యం అభివృద్ధి చెందుతోంది. ప్రభుత్వం కూడా ఈ పద్ధతిని ప్రోత్సహిస్తుండటం శుభపరిణామం. మా ఊళ్లో రైతులందరినీ ప్రకృతి వ్యవసాయదారులుగా మార్చాలని ప్రయత్నిస్తున్నాను. – ఆరిమిల్లి కృష్ణ (95533 42667), బీటెక్, ప్రకృతి వ్యవసాయదారుడు, కోల్‌మాన్‌పేట, కొసిగి మం, కర్నూలు జిల్లా జీవామృతాన్ని పొలానికి తరలించడానికి వాడుతున్న భారీ ట్యాంకులు -
17న సేంద్రియ సాగులో చీడపీడల నివారణపై శిక్షణ
గుంటూరు జిల్లా కొర్నెపాడులో రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 17(ఆదివారం)న ఉ. 10 గం. నుంచి సా. 4 గం. వరకు ‘సేంద్రియ సాగులో చీడపీడల నివారణకు లింగాకర్షక బుట్టలు, జిగురు అట్టల వాడకం–ఉపయోగాల’పై ఉద్యాన శాఖ ఏడీ రాజా కృష్ణారెడ్డి, ఖాజా రహమతుల్లా శిక్షణ ఇస్తారు. వివరాలకు.. 97053 83666 జలసంరక్షణ, బోరు రీచార్జ్ పద్ధతులపై శిక్షణ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో బోర్లను రీచార్జ్ చేసుకునే పద్ధతి సహా వివిధ జల సంరక్షణ పద్ధతులపై డిసెంబర్ 16న స్వచ్ఛంద కార్యకర్తలు, విద్యార్థులు, రైతు బృందాలు, వ్యక్తులకు సికింద్రాబాద్ తార్నాకకు చెందిన వాటర్ అండ్ లైవ్లీహుడ్స్ ఫౌండేషన్ హైదరాబాద్ రెడ్‌హిల్స్‌లోని సురన ఆడిటోరియంలో శిక్షణ ఇవ్వనుంది. భూగర్భ జల సంరక్షణలో అపారమైన అనుభవం కలిగిన జలవనరుల ఇంజినీరు ఆర్. వి. రామమోహన్ శిక్షణ ఇస్తారు. జలసంరక్షణలో అనుభవాలను పంచుకునే ఆసక్తి గల వారు కూడా సంప్రదింవచ్చు. ఆంధ్రప్రదేశ్ వాసులు ఎక్కువ మంది ఆసక్తి చూపితే విజయవాడలోనూ శిక్షణ ఇవ్వనున్నట్లు రామ్మోహన్ తెలిపారు. రిజిస్ట్రేషన్, ఇతర వివరాలకు.. 040–27014467, e-mail: wlfoundation@outlook.com. 16న చిరుధాన్య వంటకాల తయారీపై శిక్షణ హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని భారతీయ చిరుధాన్య పరిశోధనా స్థానం(కేంద్ర ప్రభుత్వ సంస్థ)లోని న్యూట్రిహబ్‌లో ఈ నెల 16న ‘కుకింగ్ విత్ మిల్లెట్స్’ శిక్షణ ఇవ్వనున్నారు. చిరుధాన్యాల ఆహారోత్పత్తుల ప్రయోజనాలను తెలియజెప్పడంతో పాటు చిరుధాన్యాలతో వివిధ రకాల వంటకాలు, చిరుతిండ్లను తయారు చేయడంపై గృహిణులు, స్వయం సహాయక బృందాల సభ్యులు, పాకశాస్త్రనిపుణులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఫీజు రూ. 1,500. రిజిస్ట్రేషన్లు, ఇతర వివరాలకు.. 94904 76098. -
పురుగు మందులు ఇంట్లో లేకపోతే.. ఆత్మహత్యలు ఆగుతాయా?
రసాయనిక పురుగు మందులు రైతుల ఇళ్లలో అందుబాటులో లేకుండా చేస్తే.. భారత దేశంలో ఆత్మహత్యలు చాలా వరకు తగ్గుతాయా? అవుననే అంటున్నది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ.హెచ్.ఓ.). తమిళనాడులోని రెండు గ్రామాల రైతులందరి పురుగు మందులను ఓ గోదాములో భద్రపరచగా.. ఆత్మహత్యల సంఖ్య బాగా తగ్గిందని డబ్ల్యూ.హెచ్.ఓ. తెలిపింది. సాధారణంగా రైతులెవరైనా పంటలకు వాడాల్సిన పురుగుమందులను తెచ్చుకొని ఇంటి దగ్గరే పెట్టుకుంటారు. పంట నష్టపడడం, అప్పుల పాలవడం, కుటుంబ సమస్యలు.. ఇలా వాగ్వాదానికి కారణం ఏదైనప్పటికీ.. ఇంట్లో వాళ్లతో గొడవ పడి మాటకుమాట తూలిన క్షణికావేశంలో పురుగు మందు తాగడం ఆత్మహత్యల సంఖ్య పెరుగుదలకు దారితీస్తోందని ఒక అంచనా. ఆత్మహత్యలను నివారించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ చెన్నై (తమిళనాడు)కు సమీపంలో ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతున్న కందమంగళం, కురంగుడి గ్రామాల్లో చిన్న ప్రయోగం చేసింది. మల్లెపూల సాగుకు ఈ పల్లెలు పెట్టింది పేరు. మల్లె తోటలపై 15 రోజులకొకసారి పురుగు మందులు పిచికారీ చేస్తారు. అందుకే అక్కడ ప్రయోగాత్మకంగా పురుగు మందుల బ్యాంకును డబ్ల్యు.హెచ్.ఓ. ఏర్పాటు చేసింది. ఇళ్లకు దూరంగా ఉన్న భవనంలో ఒక గదిలో గోడకు ఆనుకొని ప్లైవుడ్‌తో చిన్న చిన్న సొరుగులు ఏర్పాటు చేశారు. ప్రతి రైతు కుటుంబానికి ఒక సొరుగును కేటాయించారు. ఆ కుటుంబానికి చెందిన పురుగు మందులను ఆ సొరుగులో దాచారు. ఇద్దరు స్థానికులకు ఈ బ్యాంకు నిర్వహణ బాధ్యతను అప్పగించారు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఇది తెరచి ఉంటుంది. పంటపై పురుగు మందులు చల్లాలనుకున్న రోజున రైతు తన పురుగు మందులను నేరుగా పొలానికి తీసుకెళ్లొచ్చు. ఆ రెండు గ్రామాల్లో అంతకుముందు ఏడాది 35 మంది పురుగుమందులు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. అయితే, ఏడాది పాటు ఈ పద్ధతిని అమలు చేయడంతో ఆత్మహత్యల సంఖ్య ఐదుకు తగ్గింది! పురుగుల మందులను ఇంటికి దూరంగా ఉంచితే ఆత్మహత్యలను కొంతమేరకు అరికట్టవచ్చని ఆ రెండు గ్రామాల ప్రజలకే కాకుండా పరిసర గ్రామాల ప్రజలకూ నమ్మకం కుదిరింది. ఇటువంటి బ్యాంకులను తమ గ్రామాల్లో కూడా ఏర్పాటు చేసుకోవాలని స్థానిక సంస్థల నేతలు కొందరు ప్రయత్నిస్తున్నారు. అయితే, విష రసాయనాలు వాడకుండా లాభసాటి సేద్యాన్ని ప్రోత్సహిస్తే దీనికన్నా ఇంకెంతో మేలు కదూ..! -
పెట్టుబడి లేని పంట!
సాగు నీటి తడులు అక్కర్లేదు. అంతా వర్షాధారమే. చీడపీడల బెడద బొత్తిగా లేదు. పంటను గొడ్లు తింటాయన్న భయం లేదు. దీని కొమ్మలకే ముళ్లుంటాయి కాబట్టి వేరే కంచె వేసే ఖర్చూ లేదు. మొక్కలు నాటిన మూడో ఏడాది నుంచి కాయలు కోసి అమ్ముకోవడమే! కోత కూలి తప్ప మరే ఖర్చూ లేదు. అలా సుదీర్థకాలం ఎంచక్కా పంట తీసుకుంటూనే ఉండొచ్చు. భలే బాగుంది కదండీ.. ఖర్చులేని తోట సాగు కథ! ఇంతకీ ఈ పంట పేరు క్యాండేట్ చెర్రీ. అదేనండీ.. వాక్కాయ! కడివేటి విశ్వనాథ రెడ్డి, జగన్నాథ రెడ్డి ప్రకాశం జిల్లాలో ఈ పంట సాగుకు శ్రీకారం చుట్టారు. ఇతర రైతులకు మార్గదర్శకులుగా నిలిచారు. అందరూ సాగు చేసే పంటలను ఆరుగాలం కాయకష్టం చేసి, అయినకాడికి అప్పులు చేసి పంటలు పండించినా.. దిగుబడి లేకనో, మార్కెట్లో ధర దక్కకనో రైతులు ఆర్థికంగా నష్టాల పాలవుతున్న రోజులివి. అయితే, కొండంత ధైర్యంతో కొత్త పంటలపై దృష్టి సారిస్తూ.. చక్కటి ఆదాయం పొందే రైతులు కొందరే! వ్యవసాయాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్న అటువంటి ధీశాలురు కడివేటి విశ్వనాథ రెడ్డి, జగన్నాథ రెడ్డి రైతు సోదరులు. తమ ప్రాంతానికి కొండ రేగు, సుబాబుల్ సాగును పరిచయం చేసిన ఈ రైతు సోదరులు.. ఇప్పుడు మరో చక్కని ఆహార పంటను సాగు చేస్తూ కొత్తదారి చూపుతున్నారు. అడవి జాతికి చెందిన ఈ పంట పేరు క్యాండేట్ చెర్రీ లేదా వాక్కాయ. వాక్కాయలు తెలిసినవే అయినా దీర్ఘకాలిక పంటగా దీన్ని సాగు చేయడం కొత్త విషయం. ఎకరానికి 200 మొక్కలు విశ్వనాథరెడ్డి చెప్పిఇలా వాక్కాయ సాగు విశేషాలు ఇవీ.. ఒంగోలులో 1984లో మధుసూదన్‌రెడ్డి అని ఉద్యాన శాఖ అధికారి ఉండేవారు. ఆయన సలహాతో కొండరేగు పంటను జిల్లాలో తొలిసారిగా సాగు చేశాం. ఆ తర్వాత మూడేళ్లకు వారణాసి నుంచి క్యాండేట్ చెర్రీ మొక్క తెచ్చి నాటాం. దిగుబడి బాగుండటంతో నారు పెంచి ఇతర రైతులకు కూడా విక్రయిస్తున్నాం. చెర్రీ సాగుకు నల్లరేగడి నేలలు అనువుగా ఉంటాయి. మొదట సాళ్ల మధ్య 9 అడుగులు, మొక్కల మధ్య 12 అడుగులు ఖాళీ ఉంచి నాటాం. రెండేళ్లకే దట్టంగా పెరిగి మధ్యలో నుంచి మనిషి వెళ్లే సందు కూడా లేకపోవడంతో.. మధ్య సాళ్లలో చెట్లను తొలగించాం. ఎకరాకు 200 మొక్కలు మిగిలాయి. కలుపు బెడద వల్ల అంతర పంటల సాగు ప్రయత్నం మానుకున్నాం. చెరీర మొక్క ఖరీదు రూ.15- రూ. 20 వరకు ఉంది. మొక్కలు నాటేందుకు మరీ లోతు గుంటలు తీయాల్సిన అవసరం లేదు. కేవలం జానెడు గుంటలోనే నాటేయొచ్చు. మూడో ఏట నుంచి పంట చేతికొస్తుంది. మొక్కలు నాటేటప్పుడే ఎకరానికి 4 ట్రాక్టర్ల చివికిన పశువుల ఎరువు తోలాం. ఇది ఎడారి మొక్క కాబట్టి నీరు లేకపోయినా బతుకుతుంది. ఎక్కువ నీరు పెడితే దిగుబడి తగ్గుతుంది! ఫిబ్రవరి- ఏప్రిల్ మధ్యలో చెట్లు పూతకు వస్తాయి. జూలై, ఆగస్టు నెలల్లో వర్షం పడిన వెంటనే పూత కాస్తా పిందెలవుతాయి. ఆ తర్వాత కొద్ది రోజులకు పంట కోతకొస్తుంది. ఎకరాకు 30 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. కిలో ధర రూ.30 పలుకుతుంది. ఏడాదికి ఎకరాకు రూ.90 వేల ఆదాయం వస్తుంది. ఎరువులు, కోత కూలీ ఖర్చు రూ.15 నుంచి 20 వేలకు మించదు. చెర్రీ చెట్ల ఆకుల నుంచి పాలు వస్తుంటాయి. అందువల్ల గొర్రెలు, గేదెలు వీటి జోలికి రావు. ఈ పంటకు పెట్టుబడి తక్కువ. ఆదాయం ఎక్కువ. మార్కెటింగ్ మొదట్లో ఇబ్బందిగా ఉండేది. ఇటీవల విజయవాడలో చెర్రీ ఫ్యాక్టరీ ఒకటి ఏర్పాటు కావడంతో ఇప్పుడు ఇబ్బంది లేదు. రాష్ట్రవ్యాప్తంగా పలువురు రైతులు మా వద్ద నుంచి చెర్రీ మొక్కలను తీసుకెళ్తున్నారు. ప్రకాశం జిల్లాలో 30 నుంచి 40 ఎకరాల్లో మాత్రమే చెర్రీ సాగవుతోంది. ప్రస్తుతం ఏడెకరాల్లో చెర్రీ సాగు చేస్తున్నాం. మరో మూడు ఎకరాల్లో పంట వేయబోతున్నాం. చెర్రీ ఫ్యాక్టరీల ఏర్పాటును ప్రభుత్వం ప్రోత్సహిస్తే బాగుంటుంది. ఈ పంట వేసిన పొలంలో ఏడాదికి రెండు నెలల్లో మాత్రమే పని ఉంటుంది. మిగతా సమయంలో ఇతర పనులు చూసుకునేందుకు రైతుకు వెసులుబాటు ఉంటుంది. చెర్రీ అనగానే అందరికీ ఎరుపు రంగులో నోరూరించే తియ్యని పండు గుర్తుకు వస్తుంది. అయితే క్యాండేట్ చెర్రీ(వాక్కాయ) కన్నా నాణ్యమైన చెర్రీ హిమాలయ ప్రాంతాల్లో మాత్రమే లభ్యమవుతుంది. ఈ పండు కోతకు రాగానే వాటిలోని విత్తనాలను తొలగించి ఉడికిస్తారు. తీపి కోసం పంచదార పాకంలో వేస్తారు. చెర్రీలను కిళ్లీలు, కొన్ని రకాల కేకుల తయారీలోనూ వినియోగిస్తున్నారు. చెర్రీ.. చెట్టు నుంచి కోసేటప్పుడు ఎర్రగానే ఉంటుంది. కానీ రుచి పుల్లగా ఉంటుంది. దీంతో పప్పు, పులిహోర తయారీలో చింత పండుకు బదులుగా చెర్రీ కాయలను వాడుతున్నారు. హోటళ్లలో వాక్కాయ పప్పు స్పెషల్ అంటూ ప్రత్యేక బోర్డులు ఏర్పాటు చేస్తుండడం విశేషం. కొద్ది పెట్టుబడితో నిశ్చింతగా నికరాదా యాన్నిచ్చే వాక్కాయ సాగు మెట్ట రైతులకు ఎంతో అనువైనది. - పర్చూరి శ్రీనివాసులు, ఒంగోలు నష్టం వచ్చే ప్రశ్నే లేదు..! ఆరు ఎకరాలు చెర్రీ పంట వేశాం. ముందుగా వేసిన రెండెకరాలు కాపు కొచ్చింది. మంచి పంట, నష్టం ప్రశ్నేలేదు. మా పంట మొత్తాన్నీ చెన్నై వ్యాపారికి అమ్ముతున్నాం. కిలోకు రూ.35 గిట్టుబాటవుతోంది. వినాయక చవితి పండుగ రోజుల్లో మాత్రం ఈ కాయలకు చెన్నైలో మంచి డిమాండ్ ఉంటుంది. వినాయక చవితి పూజకు వాడే పత్రిలో బృహతి కూడా ఒకటి. వినాయక చవితికి నెల రోజుల ముందు నుంచి వాక్కాయల దిగుబడి వస్తుంది. వినాయక చవితి అయి పోయిన నెలరోజుల్లో కాపు పూర్త వుతుంది. వీటిని తింటే జీర్ణశక్తి పెరుగుతుంది. గ్యాస్ ట్రబుల్ వచ్చే ప్రశ్నే లేదు. చింతపండుకు బదులుగా దీన్ని వాడుతున్నారు. పిల్లలు ఈ కాయలను ఉప్పు, కారం అద్దుకుని ఇష్టంగా తింటుంటారు. ప్రభుత్వం ఈ పంటపై దృష్టిపెట్టాలి. - మంగలపూడి కోటిరెడ్డి (98663 59683), రైతు, కోరిశపాడు, ప్రకాశం జిల్లా -
సోకిందా... గోవిందా!
దొండసాగు లాభాలు తెచ్చిపెడుతోంది. దీంతో రావులపాలెం పరిసర ప్రాంతాల్లో రైతులు ఈ సాగును సుమారు 600 ఎకరాల్లో చేపట్టారు. అయితే విరామం లేకుండా ఈ సాగు చేయడంతో వైరస్ వ్యాపించి పంట మొత్తం ఎందుకూ పనికి రాకుండా పోతోంది. రూ. లక్షలు పెట్టుబడి పెట్టిన రైతన్నలు ఈ పంటను ఎలా కాపాడుకోవాలోనని ఆందోళన చెందుతున్నాడు. పంట చేతికొచ్చే సమయానికి వైరస్ సోకి, కాయల దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతోందని లోలోపల కుమిలిపోతున్నారు. అయితే మార్కెట్లో ధర బాగుందని... విరామం లేకుండా దొండసాగు చేపట్టడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ఉద్యానశాఖాధికారులు చెబుతున్నారు. ఒక సారి పంట వేసిన తర్వాత పదేపదే అదే పంటను వేస్తే మొదటికే మోసం వస్తుందని హెచ్చరిస్తున్నారు. దీనికి పంట మార్పిడియే సరైన మందని సూచిస్తున్నారు. దొండసాగులో యాజమాన్యపద్ధతులు, వైరస్ బారిన పడకుండా పంటను ఎలా కాపాడుకోవాలి? తదితర విషయాలను వివరిస్తున్నారు కొత్తపేట ఉద్యానవనశాఖాధికారిణి ఎం.బబిత(83329 90547). ఆ సూచనలు ఆమె మాటల్లోనే... - రావులపాలెం ►దొండసాగును పీడిస్తున్న వైరస్ ►ఒక్కసారి సోకితే చాలు ఆపడం కష్టమే ►దిగుబడిపై తీవ్ర ప్రభావం ►పంట మార్పిడే సరైన మందు అంటున్న ఉద్యానశాఖాధికారులు ఏళ్ల తరబడి ఒకే పొలంలో దొండ సాగు చేస్తే సాగు మొదటిలో వ్యాపించిన వైరస్, ఇతర శిలీంధ్రాలు, ధాతువులు అదే నేలలో ఉండిపోయి బలం పుంజుకుంటాయి. దీంతో అవి తదుపరి పంటపై ప్రభావాన్ని చూపుతాయి. ఈ వైరస్ తాలూకూ అవశేషాలు నశించడానికి మందులు పెద్దగా పని చేయవు. అందుకే పంటమార్పిడి చేయాలి. దీని వల్ల సాగు సమయంలో దొండపై ప్రభావం చూపే వైరస్, ఇతర శిలీంధ్ర అవశేషాలకు పోషణ అందవు. దొండ సాగుపై ఎరువుల యాజమాన్య పద్ధతులు కోస్తాంధ్ర ప్రాంతాల్లో ఏడాది పొడవునా దొండసాగు చేపట్టవచ్చు. దొండ విత్తనం చూపుడు వేలు లావు ఉన్న కొమ్మలు నాలుగు కనుపులు ఉన్నవి రెండు చొప్పున ఒకటి నుంచి రెండు సెంటీమీటర్ల లోతులో నాటాలి. నాటే సమయంలో విత్తన శుద్ధికి కిలో విత్తనానికి మూడు గ్రాముల చొప్పున థైరమ్ ఒకసారి అరగంట విరామం అనంతరం ఐదు గ్రాముల ఇమిడాక్లోప్రిడ్ ఒకసారి కలిపి శుద్ధి చేయాలి. విత్తే ముందు ఎకరాకు ఆరు - ఎనిమిది టన్నుల పశువుల ఎరువు, 32 - 40 కిలోల భాస్వరం, 16 - 20 కిలోల పొటాష్ నిచ్చే ఎరువులను గుంటలలో వేయాలి. నత్రజని 32- 40 కిలోలు రెండు సమపాళ్లుగా చేసి విత్తిన 25 నుంచి 30 రోజుల్లో ఒకసారి, పూత పిందె దశలో ఒకసారి వేసుకోవాలి. మొక్కకు దగ్గరలో ఎరువును వేయకూడదు. ఎరువును వేసిన వెంటనే నీరు పెట్టాలి. కలుపు నివారణకు ఎకరాకు పెండిమిథాలిన్ 1.2 మీ.లీ 200 లీటర్ల నీటికి కలిపి విత్తిన 24 నుంచి 48 గంటల లోపు పిచికారీ చేయాలి. మొక్కలు రెండు - నాలుగు ఆకుల దశలో ఉన్నప్పుడు లీటరు నీటికి మూడు గ్రాముల బోరాక్స్ కలిపి ఆకులపై పిచికారీ చేస్తే ఆడపువ్వులు ఎక్కువగా పూచి పంట దిగుబడి బాగా ఉంటుంది. దొండకు వచ్చే తెగుళ్లు, సస్యరక్షణ చర్యలు ► వైరస్ నివారణకు కచ్చితంగా పంట మార్పిడి చే యాలి. పండు ఈగ(ఫ్రూట్‌ఫ్లై) సమస్యకు మిథైక్యూజనాల్, వెనిగర్, పంచదారద్రవం పది మిల్లీలీటర్లు చొప్పున కలిపి ఎకరానికి పది ఎరలు పెట్టాలి. ►కలుపు మొక్కలు లేకుండా జాగ్రత్త తీసుకోవాలి. ట్రైకోడెర్మా విరిడి దుక్కిలో వేసుకోవడం వల్ల తెగులు రాకుండా ముందుగా నివారించవచ్చు. ► బూడిద తెగులు నివారణకు డైనోక్యాప్ ఒక మిల్లీలీటరు, ఒక లీటరు నీటికి కలిపి పది రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి. నులుపురుగులు ఉన్న చోట కార్భోసల్ఫాన్ మూడు గ్రాము కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేయాలి. ► ఆకుల ఈనెల మధ్య చారలు ఏర్పడి, పెలుసుగా మారి గిడసబారిపోయి పూత, పిందె ఆగిపోతే అది వెర్రి తెగులుగా గుర్తించాలి. ఈ తెగులు సోకిన మొక్కలను నాశనం చేయాలి. ఈ తెగులు వ్యాపిస్తే బరక పురుగులను నివారించడానికి రెండు మిల్లీ లీటర్ల డైమిథాయేట్ లేదా మిథైల్ డెమటాన్ కలిపి పిచికారీ చేయాలి. ► వేరు కుళ్లు తెగులు ఉన్నట్టయితే తెగులు సోకిన తీగలు వడలిపోయి అకస్మాత్తుగా పండిపోయి ఆకులు వాడిపోతాయి. దీని నివారణకు బొర్డోమిశ్రమం ఒక శాతం లేదా కాపర్ ఆక్సీక్లోరైడ్ మందు లీటరు నీటికి మూడు గ్రాముల కలిపి ద్రావణాన్ని మొక్క మొదలు చుట్టూ నేల తడిచేలా పోయాలి. దీనిని పది రోజుల వ్యవధిలో రెండు, మూడు సార్లు చేయాలి. ► ఆఖరి దుక్కిలో వేపపండి 250 కిలోలు ఎకరాకు వేసి కలియదున్నాలి. పంట వేసిన తరువాత ట్రైకోడెర్మా విరిడి కల్చర్‌ను భూమిలో పాదుల దగ్గర వేయాలి. ► ‘తీగ’ పంటలపై గంధకం సంబంధిత పురుగు, తెగులు మందులు వాడకూడదు.