బాదం పంట దిగుబడులకు ఇవే ఆధారం! తేనెటీగలు లేకుంటే.. | What IS Ecological Engineering Why We Have To Save Honey Bees | Sakshi
Sakshi News home page

తేనెటీగలను మింగుతున్న రసాయన సేద్యం! బాదం పంట దిగుబడులకు ఇవే ఆధారం!

Published Tue, May 23 2023 12:47 PM | Last Updated on Tue, May 23 2023 12:56 PM

What IS Ecological Engineering Why We Have To Save Honey Bees - Sakshi

తేనెటీగలు.. ఇవి 3 కోట్ల సంవత్సరాల క్రితం నుంచే భూగోళంపై జీవిస్తున్నాయి. మొక్కల/వ్యవసాయ జీవవైవిధ్యానికి, పర్యావరణ వ్యవస్థల మనుగడకు పరాగ సంపర్కం కీలకం. అడవిలో 90% మొక్కలు, చెట్లకు, 75% పంటలకు తేనెటీగలు తదితర ప్రాణుల వల్ల జరిగే పరాగ సంపర్కమే ఆధారం.

115 ప్రధాన ఆహార పంటలు ప్రపంచ ప్రజల ఆకలితీర్చుతున్నాయి. వీటిలో 87 పంటలు పుష్పించి సక్రమంగా పంట దిగుబడులు ఇస్తున్నాయంటే అందుకు 35% కారణం తేనెటీగలు తదితర చిరు మిత్ర జీవులే. రసాయనిక వ్యవసాయ పద్ధతులు, చెట్లను నరికేయటం వల్ల వీటి మనుగడ ప్రమాదంలో పడింది.

తేనెటీగలు వంటి మిత్ర పురుగులను రక్షించుకోవటం మన ఆహార భద్రతకు, పర్యావరణ ఆరోగ్యానికి ప్రాణావసరమని ఐరాసకు చెందిన ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్‌.ఎ.ఓ.) చెబుతోంది. మనం వినిపించుకోవాలి. 

ప్రతి నాలుగు పంటల్లో మూడు పంటలు తేనెటీగల సేవలు అందుకుంటున్నాయి. బాదం పంట దిగుబడులైతే నూటికి నూరు శాతం వీటిపైనే ఆధారపడి ఉంటుంది. తేనెటీగలకు 5 కళ్లు, రెండు రెక్కలుంటాయి. కొన్నయితే గంటకు 20 మైళ్లు ప్రయాణిస్తూ పరాగ సంపర్కానికి తోడ్పడుతుంటాయి. 

పంటల మార్పిడి, వైవిధ్యత..
పర పరాగ సంపర్కానికి తోడ్పడే ఈ చిరుప్రాణులకు హాని కలిగించని బాధ్యతాయుతమైన వ్యవసాయ పద్ధతులను అనుసరించమని అంతర్జాతీయ తేనెటీగల దినోతవ్సవం (మే 20) సందర్భంగా ఎఫ్‌.ఎ.ఓ. పిలుపునిచ్చింది.

‘పంటల మార్పిడి, పంటల వైవిధ్యత, రసాయనిక పురుగుమందుల వాడకాన్ని తగ్గించటం, పరాగ సంపర్కానికి దోహదపడే తేనెటీగలు వంటి చిరు జీవులకు అవసరమైన ఆవాసాలను అంటే చెట్లను, పూల వనాలను పునరుద్ధరించటం, అభివృద్ధి చేయటం వంటి చర్యలు తీసుకోవాలని ఎఫ్‌.పి.ఓ. డైరెక్టర్‌ జనరల్‌ క్యు డోంగ్యు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వాలు, రైతులు ఈ పిలుపును అందుకోవాలి.

సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి రసాయనిక ఎరువులు, పురుగుమందుల వాడకం తగ్గిస్తే నీటిలో వీటి అవశేషాలు తగ్గుతాయి. తేనెటీగలకు మేలు జరుగుతుంది అన్నారాయన.

తేనెటీగల పరిరక్షణకు స్లొవేనియా విశేష కృషి చేస్తోంది. 2016 నుంచి మే 20వ తేదీని అంతర్జాతీయ తేనెటీగల దినోత్సవంగా ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో జరుపుకోవడానికి స్లొవేనియా ప్రభుత్వ కృషే కారణం. ఖండాంతర దేశాల్లో 300కు పైగా తేనెటీగల పరిరక్షణ కార్యక్రమాల్లో స్లొవేనియా భాగస్వామైంది.  

ఎన్‌.ఐ.పి.హెచ్‌.ఎం. అధ్యయనం
హైదరాబాద్‌ రాజేంద్రనగరలోని జాతీయ మొక్కల ఆరోగ్య యాజమాన్య సంస్థ (ఎన్‌ఐపిహెచ్‌ఎం) శాస్త్రవేత్తలు తేనెటీగలు సహా అనేక మిత్ర పురుగుల వల్ల ఏయే పంటల సాగులో ఏ విధంగా ప్రయోజనం ఉంటుందనే అంశంపై అధ్యయనం చేశారు. మిత్రపురుగుల సంరక్షణతో కూడిన ‘ఎకలాజికల్‌ ఇంజనీరింగ్‌’ పద్ధతులపై జరిగిన అధ్యయనానికి అదనపు సంచాలకులు(పిహెచ్‌ఎం) డాక్టర్‌ ఈడ్పుగంటి శ్రీలత సారధ్యం వహించారు.

పొద్దుతిరుగుడు, జనుము, మొక్కజొన్న,  స్వీట్‌కార్న్, వంగ, బెండ, గుమ్మడి, సొర, బీర, చెర్రీ తదితర పంటలపై ఈ అధ్యయనం జరిగింది. గట్ల మీద పూల మొక్కలు సాగు చేశారు. 9 జాతులకు చెందిన 14 రకాల ఈగలు ఈ కూరగాయ తోటల్లో పరాగసంపర్కానికి దోహదపడినట్లు గుర్తించారు. అందులో 5 రకాల తేనెటీగలు ఉన్నాయి. వంగ తోటలో 14 రకాల ఈగలు కనిపించటం విశేషం. 


 
ఎకలాజికల్‌ ఇంజనీరింగ్‌ అంటే?
‘ఎకలాజికల్‌ ఇంజనీరింగ్‌’ భావనను 1962లో తొలుత ప్రతిపాదించిన శాస్త్రవేత్త డా. హొవర్డ్‌ టి. ఒడుమ్‌. రసాయనిక సాంద్ర వ్యవసాయ పద్ధతుల వల్ల పర్యావరణానికి జరిగిన నష్టాన్ని గుర్తించి, పంట పొలాల్లో పర్యావరణ వ్యవస్థలను పునరుజ్జీవింపజేయటం.

తద్వారా మొక్కలు, భూమి ఆరోగ్యాన్ని కాపాడటం. ఆరోగ్యదాయకమైన ఆహారాన్ని ప్రజలకు అందుబాటులోకి తేవటం ఈ భావన ముఖ్య లక్ష్యం.  భూమిని బాగు చేయడానికి ఆచ్ఛాదన పంటలు, పంటల మార్పిడి, పచ్చిరొట్ట పంటలను సాగు చేసి కలియదున్నటం, సేంద్రియ ఎరువులతో పాటు జీవన ఎరువులు, జీవ రసాయనాలు వినియోగించటం ఎకలాజికల్‌ ఇంజనీరింగ్‌లో ముఖ్యమైన అంశాలు. 

మిత్రపురుగులను ఆకర్షించడానికి ఆకర్షక పంటలు, శతృపురుగులను ఆకర్షించి మట్టుబెట్టడానికి ఎర పంటలు, శతృపురుగులను పారదోలడానికి వికర్షక పంటలు, పురుగులు తోటలోకి రాకుండా చూడడానికి కంచె/సరిహద్దు పంటలు వేసుకోవటం చీడపీడల నియంత్రణలో కీలకం.

‘పంటల తొలి 40 రోజుల్లో రసాయనిక పురుగుమందులు వాడకుండా ఉండటం ముఖ్యం. ఈ దశలోనే తేనెటీగలు సహా అనేక రకాల మిత్రపురుగులు వృద్ధి చెంది పంటకాలం అంతటా చీడపీడలను నియంత్రణలో ఉంచుతాయి. .’ అంటున్నారు డా. శ్రీలత.

వ్యవసాయంలో రసాయనిక ఎరువులు, పురుగుమందుల వాడకం పెరుగుతున్న కొద్దీ సహజ తేనెటీగల సంఖ్య తగ్గిపోతున్నట్లు అనేక అధ్యయనాల్లో తేలింది. బెంగళూరు ప్రాంతంలో జరిగిన ఓ అధ్యయనంలో ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి. నగరం చుట్టూతా విస్తరించిన 40 కిలోమీటర్ల ప్రాంతంలోని 60 గ్రామాల్లో అధ్యయనం చేస్తే సహజ తేనెటీగల సంఖ్య ఏకంగా 20% తగ్గినట్లు వెల్లడైంది.

జర్మనీకి చెందిన గొట్టింజెన్‌ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తల బృందం పరిశోధించింది. రసాయనిక వ్యవసాయం విస్తీర్ణం, సాంద్రత పెరుగుతున్నకొద్దీ తేనెటీగలు సమూహాలు తగ్గిపోతుండటాన్ని గుర్తించారు.

నగరం నుంచి ప్రతి కిలోమీటరు దూరంగా వెళ్లే కొద్దీ ఆయా ప్రాంతాల్లో తేనెటీగల సంఖ్య 2.4% మేరకు అధికంగా ఉన్నట్లు గుర్తించారు. ఠీ 2016 డిసెంబర్‌– మే 2017 మధ్య 1275 కుటుంబాలపై  అధ్యయనం చేశారు. ఇందులో 638 రైతు కుటుంబాలు. 3 కుటుంబాలకు చెందిన 31 జాతుల తేనెటీగలు ఆ ప్రాంతాల్లో గుర్తించారు.

చెట్ల మీదనే కాకుండా నేలలో బొరియలు చేసుకొని ఆవాసాలను ఏర్పాటు చేసుకునే తేనెటీగలు ఉంటాయి. కాబట్టి, రసాయనిక పురుగుమందుల వల్లనే కాకుండా రసాయనిక ఎరువులు లేదా నీటి పారుదల వల్ల కూడా తేనెటీగల సంఖ్య తగ్గుతున్నట్లు గుర్తించారు.

ఒక రైతు తన పొలంలో రసాయనిక ఎరువులు వాడటం లేదా నీటి తడి పెట్టడం చేస్తే అక్కడ తేనెటీగల సంఖ్య 20% తగ్గినట్లు పరిశోధకులు గుర్తించారు. 

పరిసరాల్లోని ఒక్కో పొలంలో పురుగుమందులు చల్లినప్పుడల్లా ఒక్కోశాతం తేనెటీగల సంఖ్య తగ్గిపోతూ వచ్చింది. అత్యధికంగా 80% మంది రైతులు, సగటున 25% మంది రైతులు రసాయనిక పురుగుమందులు చల్లుతున్నారు. ఆ మేరకు తేనెటీగల మనుగడ ప్రశ్నార్థకమవుతోంది. అనేక సంవత్సరాల నుంచి ఉధృతంగా రసాయనిక వ్యవసాయం చేస్తున్న గ్రామాల్లో తేనెటీగలు 8.1% మేరకు తగ్గింది. 

రోడ్డుకు దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో తేనెటీగల సంఖ్య 17.3% తగ్గిపోయింది. అదేవిధంగా, దగ్గర్లో అడవి లేదా చెరువు ఉన్న చోట్ల 30–39% పెరిగింది. వ్యవసాయంలో విషరసాయనాలు, ముఖ్యంగా నియోనికోటినాయిడ్స్, వాడుతుండటం వల్ల తేనెటీగల నాడీవ్యవస్థ దెబ్బతింటున్నది. ఈ ప్రభావం వల్ల తేనె సేకరణకు వెళ్లిన తేనెటీగలు, ఇంకా ఇతర మిత్ర పురుగులు తిరిగి గూళ్లకు చేరకుండానే నేలరాలుతున్నట్లు పరిశోధకులు గుర్తించారంటున్నారు తేనెటీగల సంరక్షకురాలు బీవీ అపూర్వ. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement