హరిత విప్లవం పుణ్యమాని ఆహారోత్పత్తిలో మనదేశం స్వయం సమృద్ధి సాధించింది. ఆహార ధాన్యాలు, కూరగాయాలు, పండ్లు అధికంగా పండించడమే కాకుండా విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి మన వ్యవసాయ రంగం ఎదిగింది. ఇదంతా నాణానికి ఒకవైపు. ఇంకోవైపు విచ్చలవిడి రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకంతో సాగుచేసిన ఆహార ఉత్పత్తులు ప్రజల ప్రాణాలకు సంకటంగా మారుతున్నాయి. అధికోత్పత్తి ఆశతో మోతాదుకు మించి వాడుతున్న రసాయన ఔషధాలు, మేలు కంటే కీడే ఎక్కువ చేస్తున్నాయి. ప్రజలు, మూగజీవాల ఆరోగ్యాలకు హానికరంగా మారడంతో పాటు నేల సారాన్ని దారుణంగా దెబ్బతీస్తున్నాయి. వ్యవసాయక ఉత్పాదకత, ఆహార భద్రత, పర్యావరణ మీద ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయి. వీటన్నింటికి విరుగుడుగా రసాయనేతర సేంద్రియ, ప్రకృతి వ్యవసాయం మళ్లీ తెరమీదకు వచ్చింది.
భూ సారానికి, వినియోగదారుల ఆరోగ్యానికి ముప్పుగా పరిణమించిన రసాయనిక వ్యవసాయానికి ప్రత్యామ్నాయంగా.. అతి తక్కువ సాగు ఖర్చుతో ఆరోగ్యదాయకమైన ఆహారోత్పత్తులను పండించడమే లక్ష్యంగా ప్రకృతి వ్యవసాయం పురుడు పోసుకుంది. అయితే సరైన ప్రచారం లేకపోవడంతో దీని గురించి రైతులకు, ఔత్సాహికులకు తెలియకుండా పోయింది. సరిగ్గా అలాంటి సమయంలోనే సాక్షి దినపత్రిక ఈ గురుతర బాధ్యతను భుజాన వేసుకుంది.
పునరుజ్జీవన వ్యవసాయ కథనాలకు ‘సాగుబడి’ పేరుతో ప్రత్యేకంగా ఒక పేజీని కేటాయించి ముందడుగు వేసింది. ప్రకృతి, సేంద్రియ రైతుల స్ఫూర్తిదాయక కథనాలతో పాటు రైతు శాస్త్రవేత్తల ఆవిష్కరణలను వెలుగులోకి తెచ్చింది. విత్తు దగ్గరి నుంచి విక్రయం వరకు.. అన్నదాతలకు ఉపయుక్తమైన సమాచారాన్ని ‘సాగుబడి’ సాధికారికంగా అందించింది. స్వల్ప వ్యవధిలోనే ‘సాగుబడి’ తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు దిక్సూచిగా అత్యంత ఆదరణ చూరగొంది. ఇంటి పంటలు, సేంద్రియ సాగు, ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన సమస్త సమాచారాన్ని రైతులకు చేరువ చేసింది.
చదవండి: తక్కువ ఖర్చుతో.. పంటభూమిలో విషానికి బ్యాక్టీరియాతో చెక్
‘సాగుబడి’లోని 2014-16 మధ్య కాలంలో ప్రచురితమైన ప్రకృతి వ్యవసాయ ప్రేరణాత్మక కథనాలను పుసక్తంగా ప్రచురించారు సీనియర్ జర్నలిస్ట్ పంతంగి రాంబాబు. ప్రకృతి, సేంద్రియ సాగుకు సంబంధించిన అన్ని అంశాలను ఈ పుస్తకంలో పొందుపరిచారు. ప్రకృతి వ్యవసాయంలో లబ్దప్రతిష్టులైన వారు, రైతు శాస్త్రవేత్తల ఇంటర్వ్యూలతో పాటు రైతులకు అవసరమయ్యే సమాచారాన్నంతా అందించారు. క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీపడకుండా ప్రచురించిన ఈ పుస్తకాన్ని చూస్తేనే అర్థమవుతుంది రచయిత నిబద్దత. ప్రకృతి వ్యవసాయం చేయాలనుకునే వారితో పాటు సేంద్రియ సాగు గురించి తెలుసుకోవాలకునే వారికి కూడా ఈ పుస్తకం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందనడం ఎంత మాత్రం అతిశయోక్తి కాదు. రచయిత చెప్పినట్టుగా ఈ పుస్తకం ప్రకృతి వ్యవసాయానికి పెద్దబాలశిక్ష వంటిదే.
సాగుబడి (మొదటి భాగం)
ప్రకృతి వ్యవసాయ స్ఫూర్తి కథనాలు
పేజీలు: 320;
వెల: 600 /- ;
రచన, ప్రతులకు:
పంతంగి రాంబాబు,
8639738658
Comments
Please login to add a commentAdd a comment