నేచర్‌ అర్బైన్‌.. అతిపెద్ద రూఫ్‌టాప్‌ పొలం! | the worlds largest urban rooftop that is feeding Paris | Sakshi
Sakshi News home page

నేచర్‌ అర్బైన్‌.. అతిపెద్ద రూఫ్‌టాప్‌ పొలం!

Published Mon, Sep 19 2022 9:47 PM | Last Updated on Tue, Sep 20 2022 2:31 PM

the worlds largest urban rooftop that is feeding Paris - Sakshi

పారిస్‌.. ఫ్రాన్స్‌ రాజధాని. అత్యంత జనసాంద్రత కలిగిన యూరోపియన్‌ రాజధానులలో ఒకటి. కాంక్రీటు అరణ్యంగా మారిపోవటంతో పచ్చని ప్రదేశాల విస్తీర్ణం బాగా తగ్గిపోయింది. అన్నే హిడాల్గో అనే మహిళ 2014లో మేయర్‌గా ఎన్నికైన తర్వాత పారిస్‌ పచ్చదనాన్ని పెంపొందించేందుకు ప్రయత్నిస్తున్నారు. సాధారణ పచ్చదనంతో అన్నే సంతృప్తి చెందలేదు.

విస్తారమైన వాణిజ్య సముదాయాల పైకప్పులను పచ్చని సేంద్రియ పంట పొలాలుగా మార్చాలని ఆమె సంకల్పించారు. అర్బన్‌ కిచెన్‌ గార్డెన్స్‌ నిర్మించే సంస్థలను ప్రోత్సహించడానికి నిర్మాణాత్మక కార్యాచరణ చేపట్టి సఫలీకృతులవుతున్నారు. పారిస్‌లో అర్బన్‌ అగ్రికల్చర్‌ విస్తీర్ణాన్ని 100 హెక్టార్లకు విస్తరించాలన్న లక్ష్యానికి చేరువలో ఉన్నారు మేయర్‌ అన్నే హిడాల్గో. 

పారిస్‌కల్చర్‌
రూఫ్‌టాప్‌లపైన, పాత రైల్వే ట్రాక్‌ పొడవునా, భూగర్భ కార్ల పార్కింగ్‌ ప్రదేశాల్లోనూ, ఖాళీ ప్రదేశాల్లో సేంద్రియ పంటలు, పుట్టగొడుగుల సాగును ప్రోత్సహిస్తు న్నారు. ‘ద పారిస్‌కల్చర్స్‌’ పేరిట అర్బన్‌ అగ్రికల్చర్‌ ప్రాజెక్ట్‌లకు ప్రోత్సాహం ఇచ్చే పథకానికి మేయర్‌ శ్రీకారం చుట్టారు. అప్పటి నుంచి అత్యాధునిక మిద్దె (రూఫ్‌టాప్‌) పొలాలు నగరం అంతటా వెలుస్తున్నాయి. వాటిల్లో ‘నేచర్‌ అర్బైన్‌’ అతి పెద్దది.

దక్షిణ పారిస్‌లో అద్భుతమైన కొత్త ఎగ్జిబిషన్‌ హాల్‌ భవనం పైన 14,000 చదరపు మీటర్ల (3.45 ఎకరాల) విస్తీర్ణంలో ఈ రూఫ్‌టాప్‌ ఫామ్‌ ఏర్పాటైంది. రోజుకు వెయ్యి కిలోల సేంద్రియ కూరగాయలు, ఆకుకూరలు, సలాడ్‌ గ్రీన్స్, స్ట్రాబెర్రీ తదితర పండ్లను ఉత్పత్తి చేస్తున్న ‘నేచర్‌ అర్బైన్‌’లో 20 మంది పనిచేస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద రూఫ్‌టాప్‌ క్షేత్రంగా ఇది పేరుగాంచింది.

పారిస్‌ వాసులకు లెట్యూస్, టొమాటోలు, స్ట్రాబెర్రీలు, దుంపలు, తులసి, పుదీనా, ఇతర తాజా 35 రకాల సేంద్రియ పండ్లు, కూరగాయ లతో పాటు ఔషధ, సుగంధ మొక్కలను ‘నేచర్‌ అర్బైన్‌’ అందిస్తోంది. కరోనా మహమ్మారి మొదటి దఫా లాక్‌డౌన్‌ ముగిసిన తర్వాత .. నగరాల్లోనే సాధ్యమైనంత వరకు సేంద్రియ ఆహారోత్పత్తుల ఆవశ్యకతను చాటిచెబుతూ ‘నేచర్‌ అర్బైన్‌’ ప్రారంభమైంది. 

ఆక్వాపోనిక్స్‌.. హైడ్రోపోనిక్స్‌..
రూఫ్‌టాప్‌ పొలంలో రసాయన ఎరువులు, పురుగుమందులు, శిలీంద్రనాశినులు వాడరు. ఆక్వాపోనిక్స్, హైడ్రోపోనిక్స్‌ పద్ధతిలో పంటలను సాగు చేస్తున్నారు. మట్టిని వాడరు. పోషకాలు, ఖనిజాలు, జీవన ఎరువులతో కూడిన పోషక ద్రావణం కలిపిన నీటిని మొక్కల వేర్లకు అందిస్తూ పంటలను 10% నీటితోనే సాగు చేస్తున్నారు. నిలువు ప్లాస్టిక్‌ స్తంభాలలో లెట్యూస్, తులసి, పుదీనా మొక్కలు ఏరోపోనిక్స్‌ పద్ధతిలో ఏపుగా పెరుగుతుంటాయి. (క్లిక్ చేయండి: పేదల ఆకలి తీర్చే ఆర్గానిక్‌ గార్డెన్స్‌!)

వీటికి ఎదురుగా, సన్నగా, అడ్డంగా ఉండే ట్రేలలో కొబ్బరి పొట్టులో నోరూరించే దేశవాళీ చెర్రీ టొమాటోలు, నాటు వంకాయలు, టొమాటోలు, కీర దోస తదితర కూరగాయలను పెంచుతున్నారు. పారిస్‌ వాసులు స్వయంగా తామే ఈ రూఫ్‌టాప్‌ పొలంలో పంటలు పండించుకోవడానికి ఎత్తు మడులతో కూడిన ప్లాట్లను ఏడాదికోసారి అద్దెకిస్తారు. 140 కూరగాయల ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి. నగరవాసులకు సాగు నేర్పడానికి పారిస్‌ నగరపాలక సంస్థ ఒక ప్రత్యేకమైన స్కూల్‌ను కూడా ప్రారంభించింది. పారిస్‌ నగరపాలకుల ప్రయత్నాల వల్ల స్థానికుల ఆహారపు అవసరాలు తీరేది కొద్ది మేరకే అయినప్పటికీ, తద్వారా ప్రజారోగ్యానికి, పర్యావరణానికి ఒనగూరే బహుళ ప్రయోజనాలు మాత్రం అమూల్యమైనవి!
– పంతంగి రాంబాబు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement