greenary
-
మట్టి + ఆముదం + కుంకుడు ద్రావణం: పంటలు పచ్చగా, నిండుగా!
పొలంలోని మట్టినే సేంద్రియ ఎరువుగా, పురుగులనునియంత్రించే ద్రావణం వాడి సత్ఫలితాలు పొందటం ద్వారా ఆరోగ్య దాయకమైన ద్రాక్ష, వరి తదితర పంటలు పండించిన ప్రముఖ రైతు శాస్త్రవేత్త, పద్మశ్రీ పురస్కార గ్రహీత చింతల వెంకటరెడ్డి (సివిఆర్) మరో ద్రావణాన్ని రూ పొందించారు. మట్టి+ఆముదంతో పాటు కుంకుడు రసం కలిపి చల్లితే పంటలకు చీడపీడల నియంత్రణతోపాటు పెరుగుదల బాగుందని గుర్తించారు. ఈ ద్రావణాన్ని తయారు చేసి మొదట తన పెరట్లోని టొమాటో, మొక్కజొన్న పంటలపై ఆయన ప్రయోగించి చూశారు. కేవలం వారం నుండి 10 రోజుల్లోనే పంటలో విపరీతమైన మార్పును గమనించారు. అంతకు ముందు మొక్కజొన్న ఆకులను పురుగులు తినటం, పంట పసుపు పచ్చగా ఉన్నపుడు ఈ ద్రావణం పిచికారీ చేశారు. కేవలం వారం నుంచి పది రోజుల్లోనే ఆ పంట పచ్చదనంతో కళకళలాడుతూ, ఆకులు కూడా వెడల్పుగా రావటం అంటే పంటలో మంచి ఎదుగుదలను గమనించారు. మరి కొందరు రైతులు కూడా సత్ఫలితాలు సాధించటంతో ఈ ద్రావణం సామర్థ్యంపై సివిఆర్ నిర్థారణకు వచ్చారు.మట్టి, ఆముదం, కుంకుడు ద్రావణం తయారీ విధానంలోపలి మట్టి (బాగా జిగటగా ఉండే మట్టి) 10 కిలోలు (ఒక తట్టెడు) తీసుకొని, గడ్డలు చిదిపి మెత్తని మట్టిని సిద్ధం చేసుకోవాలి. ఆ మట్టిలో 250 మి.లీ. నుంచి 500 మి.లీ. వరకు ఆముదం కలపాలి. 250 నుండి 500 గ్రా. కుంకుడు కాయలు తీసుకొని కొంచెం నీటిలో వాటిని రాత్రంతా నానబెట్టాలి. ఉదయం వాటిని చేతితో పిసికి, విత్తనాలు తీసివేసి, పేస్టులాగా తయారు చెయ్యాలి. అలా తయారైన పేస్టును అంతకు ముందు రోజు ఆముదం కలిపి పక్కన పెట్టిన మట్టిలో వేసి, బాగా కలియ తిప్పాలి. ఈ మిశ్రమాన్ని 200 లీటర్ల నీటి డ్రమ్ములో వేసి కర్రతో బాగా కలపాలి. మట్టి మిశ్రమం అంతా నీటిలో బాగా కలిసిపోయిన తర్వాత కొద్దిసేపటికి నీటిలోని మట్టి రేణువులు నీటి అడుగుకు పేరుకుంటాయి. పైకి తేరుకున్న ద్రావణాన్ని వడకట్టి స్ప్రేయర్లలో పోసుకొని పంటపై పిచికారీ చెయ్యాలి. రైతులు ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే మట్టి ద్రావణం నీటిలో కలిపిన తర్వాత 4 గంటల్లోగా వంటపై పిచికారీ చేయాలి. అప్పుడే మంచి ఫలితం ఉంటుంది. ఆలన్యం అయితే ఆముదం ప్రభావం తగ్గిపోయే అవకాశం ఉంది. కుంకుడుతో పచ్చదనం వస్తోంది!పైకి పురుగు కనిపిస్తూ ఉంటే గతంలో చెప్పినట్లు మట్టి 20 కిలోలు, ఆముదం పావు కిలో నుంచి అర కిలో వరకు కలిపిన ద్రావణం చల్లితే పురుగుల నియంత్రణ బాగుంటుంది. అయితే, పెరుగుదల ఉండేది కాదు. మొలకల ద్రావణం చల్లాల్సి వచ్చేది. ఇప్పుడు కుంకుడు రసం కలపటం వల్ల ఆ కొరత తీరి పచ్చదనం వస్తోంది. తెగుళ్లు నివారిస్తుంది. పురుగులను గుడ్లు పెట్టనివ్వదు. అనేక పంటల్లో మంచి ఫలితాలు వచ్చాయి. ఇది చల్లిన వారం, పది రోజుల్లోనే పంటలు ఆకుపచ్చని రంగులోకి మారి, గ్రోత్ వేగాన్ని అందుకుంటున్నది. మల్బరీ తప్ప ఏ పంటలోనైనా చల్లొచ్చు. పత్తి రైతులు కాయ పగలటానికి ముందు దశలోనే ఈ ద్రావణం వాడాలి. టొమాటోలో ఏ తెగుళ్లు, పురుగులూ రాలేదు. మిర్చిలో తామర పురుగు నియంత్రణకు మట్టి, ఆముదం, కుంకుళ్లతో పాటు అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి కూడా కలిపి తయారు చేసిన ద్రావణం వాడుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఈ ద్రావణాన్ని వర్షాలు బాగా పడే రోజుల్లో వారానికోసారి చల్లాలి. ఇప్పటి నుంచి పది రోజులకోసారి చల్లితే సరిపోతుంది. ఇది చల్లిన 2 గంటల వరకు వర్షం పడకపోతే చాలు, పనిచేస్తుంది. – చింతల వెంకటరెడ్డి (98668 83336), పద్మశ్రీ పురస్కార గ్రహీత, ఆల్వాల్, సికింద్రాబాద్చాలా పంటలపై చల్లా.. రిజల్టు బాగుంది!మట్టి, ఆముదం, కుంకుడు రసం ద్రావణం వాడిన వారం రోజుల్లోనే చీడపీడల నియంత్రణతో పాటు పంటల్లో పెరుగుదల బాగా కనిపించింది. 10 కిలోల లోపలి మట్టికి 250 ఎంఎల్ ఆముదం కలిపి పెట్టుకోవాలి. కుంకుడు కాయలను గింజలతో ΄ాటు నలగ్గొట్టి, ఉడక బెట్టాలి. నానబెట్టిన దానికన్నా, కుంకుడు విత్తనాలు కూడా పగులగొట్టి ఉడకబెడితే మరింత ప్రయోజనం ఉంటుందని నాకు అనిపించింది. ఆ తెల్లారి కుంకుళ్లను పిసికి రసం తీసుకోవాలి. ఆముదం కలిపిన మట్టిలో ఈ కుంకుడు రసం కలిపి 200 లీటర్ల నీటిలో కలిపి ఎకరానికి పిచికారీ చేసుకోవాలి. పసుపు, మామిడి, నిమ్మ, అవకాడో, అరటి తదితర పంటలన్నిటిపైనా ఈ ద్రావణాన్ని పిచికారీ చేశాను. వారంలోనే గ్రోత్ చాలా కనిపించింది. నూనెలు చల్లితే గ్రోత్ వస్తుంది. ఇక్కడ ఆముదం వాడుతున్నందున గ్రోత్తోపాటు చీడపీడల నియంత్రణ కూడా జరుగుతుంది. మట్టి ద్వారా మినరల్స్ కూడా పంటకు అందుతున్నాయి. 12–15 రోజులకోసారి అన్ని పంటలపైనే పిచికారీ చేస్తున్నా. ఈ రెండు పిచికారీల మధ్య ఒకసారి వేపనూనె పిచికారీ చేస్తే పురుగుల గుడ్లు నశించి మరింత మెరుగైన ఫలితాలుంటాయి. – పడాల గౌతమ్ (98497 12341), ఎస్టేట్ మేనేజర్, రుషి వ్యాలీ స్కూల్, మదనపల్లిదివంగత సంజీవరెడ్డి సూచనలతో 2007 నుంచి మా 20 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నా. 2014లో ‘సాక్షి సాగుబడి’లో సివిఆర్ మట్టి ద్రావణం గురించి చదివినప్పటి నుంచి వంగ, సాంబారు దోస, పూల తోట, వేరుశనగ వంటి అన్ని పంటలకూ లోపలి మట్టి+ ఆముదం ద్రావణం వాడుతూ మంచి ఫలితాలు పొందుతున్నాను. సివిఆర్ కొత్తగా చెప్తున్నట్లు మట్టి, ఆముదంతోపాటు కుంకుడు రసం కూడా కలిపి పత్తి పంట 20 రోజుల దశలో రెండు నెలల క్రితం ఒకసారి, ఆ తర్వాత మరోసారి పిచికారీ చేశాను. పంట ముదురు ఆకుపచ్చగా బలంగా పురుగుల బెడద లేకుండా పెరిగింది. ఇప్పుడు పత్తి తీస్తున్నాను. ఇతర రైతులతో కూడా మట్టి ద్రావణం వాడిస్తున్నాం. – పి. గిరీష్ గౌడ్ (80732 45976), ఇనగలూరు,అగళి మండలం, సత్యసాయి జిల్లా -
ఇంట్లోనే.. రిలీఫ్..! డయాబెటిస్‌పై పోరుకు మెడిసినల్ ప్లాంట్స్ సాయం!
డయాబెటిస్, బీపీ తదితర దీర్ఘకాలిక వ్యాధులు నగరవాసులకు వీడని నీడలుగా మారుతున్నాయి. వైద్యసాయం తీసుకుంటున్నా, మందులు వాడుతున్నా.. తగ్గేదెలే.. అన్నట్టుగా వదలకుండా వెంటాడుతున్న వ్యాధుల విషయంలో కొందరు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. అందులో భాగంగా ఇంట్లోనే మెడిసినల్ ప్లాంట్స్‌ను సైతం పెంచుకుంటున్నారు. – సాక్షి, సిటీబ్యూరోరక్తంలో చక్కెర స్థాయిలు, మధుమేహాన్ని నియంత్రించడానికి, ఇన్సులిన్ సహా అనేక రకాల మందులు చికిత్సలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. అయితే కారణాలేవైనా.. కొందరు ప్రత్యామ్నాయ విధానాలను ప్రయత్నిస్తున్నారు. మధుమేహంతో పోరాడేందుకు ఔషధ మొక్కలను పెంచుతున్నారు మాజీ సాఫ్ట్వేర్ నిపుణుడు మొట్టమర్రి సందీప్.టెర్రస్‌లో.. ట్రీట్మెంట్..ఇన్సులిన్ మొక్క ఆకులు మధుమేహం నిర్వహణలో ఉపయోగపడతాయని, ఇన్సులిన్ మొక్కల ప్రయోజనాలను గుర్తించి, వాటిని మొహిదీపట్నంలోని తన ఇంటి టెర్రస్‌పై సేంద్రీయంగా పెంచడం ప్రారంభించారు సందీప్. తన మధుమేహం చికిత్స కోసం ఈ సహజమైన విధానాన్ని ఆయన అనుసరించాడు. తన టెర్రస్‌ను ఆరోగ్యానికి తోటగా మార్చాడు. మందులు, ఇంజెక్షన్లకు బదులు ఇన్సులిన్ ఆకులను తీసుకోవడం ద్వారా, ఏడు సంవత్సరాలుగా తన మధుమేహాన్ని అదుపులో ఉంచుకోగలిగానని ఆయన అంటున్నారు. ‘నేను మందులు మానేసి ఏడేళ్లుగా ఇన్సులిన్ మొక్క ఆకులను తీసుకుంటున్నాను. దాంతో ఈ ఏడేళ్లలో డాక్టర్‌ను కలవాల్సిన అవసరం రాలేదు’ అని ఆయన చెప్పారు. ఆయన చెబుతున్న ప్రకారం.. ఇన్సులిన్ ప్లాంట్ తగిన స్థాయిలో పరిపక్వానికి చేరేందుకు దాదాపు నాలుగు నెలల సమయం పడుతుంది. పెంపకం.. పంపకం.. ఇన్సులిన్ మొక్కలతో పాటు అతను కొన్ని కూరగాయలతో పాటు రణపాల వివిధ రకాల తులసి వంటి ఇతర ఔషధ మొక్కలను కూడా ఆయన పెంచుతున్నారు. ఆయన దగ్గర ఉన్న మెడిసినల్ ఇన్సులిన్ ప్లాంట్ల గురించి ఆ నోటా.. ఈ నోటా విని సుదూర ప్రాంతాల నుంచీ కాల్స్ వస్తుంటాయన్నారాయన. ఓపికగా మొక్క ప్రయోజనాలను వివరిస్తానని, మొక్కలను తీసుకెళ్లడానికి వచ్చే వ్యక్తులకు నామమాత్రపు ధరకు వాటిని అందిస్తూనే, మొక్కలను పెంచే చిట్కాలను చెప్తానన్నారు. ‘ఆకులను క్రమం తప్పకుండా తీసుకున్న తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు క్షీణించడాన్ని గమనించినట్లు చాలా మంది సంతోషం వ్యక్తం చేశారు’ అని ఆయన చెప్పారు. అయితే ఒక రోజులో 2 కంటే ఎక్కువ ఆకులను వాడొద్దని ఆయన సలహా ఇస్తారు. అధిక మోతాదు కారణంగా సంభవించే ప్రమాదాలను నివారించడానికి ఉదయం ఒక ఆకు సాయంత్రం మరో ఆకును తీసుకోవాలని సూచిస్తున్నారు. -
ఆరు పట్టణాల్లో పెరిగిన గ్రీన్ సర్టిఫైడ్ ఆఫీస్ స్పేస్ - అక్కడే అధికం
న్యూఢిల్లీ: పర్యావరణ అనుకూల (గ్రీన్ సర్టిఫైడ్) ఆఫీస్ స్పేస్ (కార్యాలయ వసతులు) దేశంలోని ఆరు ప్రధాన పట్టణాల్లో గడిచిన మూడున్నరేళ్లలో 36 శాతం పెరిగి 342 చదరపు అడుగులకు చేరుకుంది. 2019 నాటికి గ్రీన్ ఆఫీస్ స్పేస్ 251 మిలియన్ చదరపు అడుగులుగానే ఉంది. ఈ వివరాలను రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సీబీఆర్ఈ, వాణిజ్య సంఘం సీఐఐ సంయుక్తంగా ఓ నివేదిక రూపంలో తెలియజేశాయి. దేశీయంగా, అంతర్జాతీయంగా ఈఎస్జీ నియంత్రణలపై దృష్టి సారించడం.. ఆధునిక, ప్రీమియం, పర్యావరణ అనుకూల కార్యాలయ వసతులకు మధ్య కాలం నుంచి దీర్ఘకాలంలో డిమాండ్‌ను పెంచుతుందని ఈ నివేదిక పేర్కొంది. ‘‘ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటే రియల్ ఎస్టేట్ రంగం వృద్ధి చెందుతుంది. ఈఎస్జీ, దాని అమలుకు ప్రాధాన్యం పెరుగుతోంది. ఆధునిక, టెక్నాలజీ ఆధారిత, పర్యావరణ అనుకూల వసతులకు రానున్న త్రైమాసికంలో డిమాండ్ పెరుగుతుందని అంచనా వేస్తున్నాం’’అని సీబీఆర్ఈ చైర్మన్, సీఈవో అన్షుమన్ మ్యాగజిన్ తెలిపారు. దేశవ్యాప్తంగా 2023 జూన్ నాటికి పర్యావరణ అనుకూల కార్యాలయ వసతుల్లో 68 శాతం బెంగళూరు, ఢిల్లీ ఎన్సీఆర్, ముంబైలోనే ఉన్నట్టు ఈ నివేదిక తెలిపింది. హైదరాబాద్‌లో 51.9 మిలియన్ చదరపు అడుగుల మేర పర్యావరణ అనుకూల కార్యాలయ వసతులు ఉంటే, బెంగళూరులో 104.5 మిలియన్ చదరపు అడుగులు, ఢిల్లీ ఎన్సీఆర్లో 70.2 మిలియన్లు, ముంబైలో 56.6 మిలియన్లు, చెన్నైలో 32.6 మిలియన్లు, పుణెలో 26.2 మిలియన్ చదరపు అడుగుల చొప్పున ఈ వసతులు ఉన్నట్టు వెల్లడించింది. పర్యావరణ అనుకూల, ఇంధన ఆదా కార్యాలయ భవనాలకు దేశీ, బహుళజాతి కంపెనీల నుంచి డిమాండ్ పెరిగినట్టు అర్బన్ వోల్ట్ సహ వ్యవస్థాపకులు అమల్ మిశ్రా ఈ నివేదికలో పేర్కొన్నారు. కర్బన ఉద్గారాలపై పెరుగుతున్న అవగాహనకు ఇది నిదర్శమన్నారు. -
భారతదేశంలోని అత్యంత అందమైన టాప్ 10 గ్రామాలు
-
ప్రపంచంలోని టాప్ 10 పచ్చదనంతో కూడిన ప్రదేశాలు
-
నేచర్ అర్బైన్.. అతిపెద్ద రూఫ్‌టాప్ పొలం!
పారిస్.. ఫ్రాన్స్ రాజధాని. అత్యంత జనసాంద్రత కలిగిన యూరోపియన్ రాజధానులలో ఒకటి. కాంక్రీటు అరణ్యంగా మారిపోవటంతో పచ్చని ప్రదేశాల విస్తీర్ణం బాగా తగ్గిపోయింది. అన్నే హిడాల్గో అనే మహిళ 2014లో మేయర్‌గా ఎన్నికైన తర్వాత పారిస్ పచ్చదనాన్ని పెంపొందించేందుకు ప్రయత్నిస్తున్నారు. సాధారణ పచ్చదనంతో అన్నే సంతృప్తి చెందలేదు. విస్తారమైన వాణిజ్య సముదాయాల పైకప్పులను పచ్చని సేంద్రియ పంట పొలాలుగా మార్చాలని ఆమె సంకల్పించారు. అర్బన్ కిచెన్ గార్డెన్స్ నిర్మించే సంస్థలను ప్రోత్సహించడానికి నిర్మాణాత్మక కార్యాచరణ చేపట్టి సఫలీకృతులవుతున్నారు. పారిస్‌లో అర్బన్ అగ్రికల్చర్ విస్తీర్ణాన్ని 100 హెక్టార్లకు విస్తరించాలన్న లక్ష్యానికి చేరువలో ఉన్నారు మేయర్ అన్నే హిడాల్గో. పారిస్కల్చర్ రూఫ్టాప్లపైన, పాత రైల్వే ట్రాక్ పొడవునా, భూగర్భ కార్ల పార్కింగ్ ప్రదేశాల్లోనూ, ఖాళీ ప్రదేశాల్లో సేంద్రియ పంటలు, పుట్టగొడుగుల సాగును ప్రోత్సహిస్తు న్నారు. ‘ద పారిస్కల్చర్స్’ పేరిట అర్బన్ అగ్రికల్చర్ ప్రాజెక్ట్‌లకు ప్రోత్సాహం ఇచ్చే పథకానికి మేయర్ శ్రీకారం చుట్టారు. అప్పటి నుంచి అత్యాధునిక మిద్దె (రూఫ్‌టాప్) పొలాలు నగరం అంతటా వెలుస్తున్నాయి. వాటిల్లో ‘నేచర్ అర్బైన్’ అతి పెద్దది. దక్షిణ పారిస్‌లో అద్భుతమైన కొత్త ఎగ్జిబిషన్ హాల్ భవనం పైన 14,000 చదరపు మీటర్ల (3.45 ఎకరాల) విస్తీర్ణంలో ఈ రూఫ్‌టాప్ ఫామ్ ఏర్పాటైంది. రోజుకు వెయ్యి కిలోల సేంద్రియ కూరగాయలు, ఆకుకూరలు, సలాడ్ గ్రీన్స్, స్ట్రాబెర్రీ తదితర పండ్లను ఉత్పత్తి చేస్తున్న ‘నేచర్ అర్బైన్’లో 20 మంది పనిచేస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద రూఫ్‌టాప్ క్షేత్రంగా ఇది పేరుగాంచింది. పారిస్ వాసులకు లెట్యూస్, టొమాటోలు, స్ట్రాబెర్రీలు, దుంపలు, తులసి, పుదీనా, ఇతర తాజా 35 రకాల సేంద్రియ పండ్లు, కూరగాయ లతో పాటు ఔషధ, సుగంధ మొక్కలను ‘నేచర్ అర్బైన్’ అందిస్తోంది. కరోనా మహమ్మారి మొదటి దఫా లాక్డౌన్ ముగిసిన తర్వాత .. నగరాల్లోనే సాధ్యమైనంత వరకు సేంద్రియ ఆహారోత్పత్తుల ఆవశ్యకతను చాటిచెబుతూ ‘నేచర్ అర్బైన్’ ప్రారంభమైంది. ఆక్వాపోనిక్స్.. హైడ్రోపోనిక్స్.. రూఫ్‌టాప్ పొలంలో రసాయన ఎరువులు, పురుగుమందులు, శిలీంద్రనాశినులు వాడరు. ఆక్వాపోనిక్స్, హైడ్రోపోనిక్స్ పద్ధతిలో పంటలను సాగు చేస్తున్నారు. మట్టిని వాడరు. పోషకాలు, ఖనిజాలు, జీవన ఎరువులతో కూడిన పోషక ద్రావణం కలిపిన నీటిని మొక్కల వేర్లకు అందిస్తూ పంటలను 10% నీటితోనే సాగు చేస్తున్నారు. నిలువు ప్లాస్టిక్ స్తంభాలలో లెట్యూస్, తులసి, పుదీనా మొక్కలు ఏరోపోనిక్స్ పద్ధతిలో ఏపుగా పెరుగుతుంటాయి. (క్లిక్ చేయండి: పేదల ఆకలి తీర్చే ఆర్గానిక్ గార్డెన్స్!) వీటికి ఎదురుగా, సన్నగా, అడ్డంగా ఉండే ట్రేలలో కొబ్బరి పొట్టులో నోరూరించే దేశవాళీ చెర్రీ టొమాటోలు, నాటు వంకాయలు, టొమాటోలు, కీర దోస తదితర కూరగాయలను పెంచుతున్నారు. పారిస్ వాసులు స్వయంగా తామే ఈ రూఫ్‌టాప్ పొలంలో పంటలు పండించుకోవడానికి ఎత్తు మడులతో కూడిన ప్లాట్లను ఏడాదికోసారి అద్దెకిస్తారు. 140 కూరగాయల ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి. నగరవాసులకు సాగు నేర్పడానికి పారిస్ నగరపాలక సంస్థ ఒక ప్రత్యేకమైన స్కూల్‌ను కూడా ప్రారంభించింది. పారిస్ నగరపాలకుల ప్రయత్నాల వల్ల స్థానికుల ఆహారపు అవసరాలు తీరేది కొద్ది మేరకే అయినప్పటికీ, తద్వారా ప్రజారోగ్యానికి, పర్యావరణానికి ఒనగూరే బహుళ ప్రయోజనాలు మాత్రం అమూల్యమైనవి! – పంతంగి రాంబాబు -
Photo Feature: మన్యం అందం.. ద్విగుణీకృతం
కవుల వర్ణనలో కనిపించే అందాలెన్నో మన్యంలో కనువిందు చేస్తున్నాయి. ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలకు పలు ప్రాంతాల్లో జలపాతాలు పొంగిపొర్లుతూ.. కొత్త సోయగాలు సంతరించుకుంటున్నాయి. ఆకాశం నుంచి నేలకు తాకుతున్న మబ్బులతో కొత్తందాలు ఆవిష్కృతమవుతున్నాయి. ప్రకృతి పచ్చని తివాచీ పరిచిందా అన్నట్లు అబ్బురపరిచే పొలాలు పర్యాటకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. సీలేరు జలాశయం వ్యూ పాయింట్, గుంటవాడ డ్యాం, సీలేరు సమీపంలోని తురాయి జలపాతం, జి.మాడుగుల మండలంలోని కొత్తపల్లి జలపాతం, గుర్రాయి, ఎగ కంఠవరంలోని అక్కాచెల్లెల జలపాతాలు, కుంబిడిసింగి మార్గంలో జలపాతం అందాలు పర్యాటకులను ఆహ్లాదపరుస్తున్నాయి. అరమ, సొవ్వ, సాగర, కొర్రా తదితర ప్రాంతాలు పచ్చదనంతో ముచ్చటగొల్పుతున్నాయి. కొండ ప్రాంత అందాలకు ప్రకృతి ప్రేమికులు పరవశించిపోతున్నారు. – సీలేరు, జి.మాడుగుల, డుంబ్రిగుడ (అల్లూరి సీతారామరాజు జిల్లా) -
శభాష్ గాడ్గే మీనాక్షి.. ముఖరా(కె) పచ్చదనం భేష్..
ఇచ్చోడ: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముఖరా(కె) గ్రామంలో విస్తృతంగా మొక్కలు నాటి ఎకో ఫ్రెండ్లీగా తీర్చిదిద్దిన తీరు అభినందనీయమని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి గిరిరాజ్‌సింగ్ శనివారం ట్వీట్ చేశారు. ఇందుకు కృషి చేసిన సర్పంచ్ గాడ్గే మీనాక్షిని అభినందించారు. అడవులు అంతరించిపోతున్న ఈ సమయంలో హరితహారం ద్వారా ఒకటిన్నర ఎకరంలో ఒకేచోట పెద్ద మొత్తంలో మొక్కలు నాటి సంరక్షించడం బాగుందన్నారు. గ్రామాల్లో మొక్కలునాటి పచ్చదనాన్ని పెంపొందించడానికి దేశంలో ఇతర పంచాయతీలకు ముఖరా(కె) ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. -
రోటీన్ లైఫ్‌తో విసిగి పోయారా ?.. ఈ వీడియో మీ కోసమే...
Karimnagar Raikal Waterfall: కరోనా మహమ్మారి దెబ్బకు ఏడాదిన్నరగా మన లైఫ్స్టైల్లో ఎంతో మార్పు వచ్చింది. బయట కాలు పెట్టాలంటే భయం. ఎక్కువ సమయం ఇంట్లోనే గడపాల్సిన పరిస్థితి. పార్కుల్లో అరకొర జనమే, సినిమా థియేటర్లు మూత పడ్డాయి. ఇళ్లు, ఆఫీసు, మార్కెట్ తప్ప మరో ఎక్సైట్మెంట్ కరువైంది జీవితానికి. ఈ బోర్డమ్ను బ్రేక్ చేసేందుకు రా.. రమ్మంటోంది రాయికల్ జలపాతం. జలజల... ఎత్తైన పర్వతశ్రేణిలో ఉండే ఈ జలపాతాన్ని చేరాలంటే అడవిలో రాళ్ల బాటలో ప్రకృతిలో మమేకం అవుతూ కాలినడకన కొంత దూరం వెళ్లాల్సి ఉంటుంది. చుట్టూ అల్లుకున్న పచ్చటి అడవి, పైన జలపాతం నుంచి పారే సెలయేటి గలగల సవ్వడులు, పక్షుల కిలకిలా రావాలు, పట్టణ కాలుష్యానికి దూరంగా ప్రశాంతమైన ప్రకృతిమాత ఒడిలో హాయిగా సేద తీరేందుకు ఇదొక చక్కని వేదిక. ఇంట్లో రోటీన్ లైఫ్‌కి భిన్నంగా.. ఆఫీస్ ఒత్తిడికి దూరంగా... ప్రకృతిలో మమేకం అవుతూ జల సవ్వడిలో కష్టాలను కరించేస్తూ.. ఎత్తైన కొండలను ఒక్కో అడుగు వేస్తూ ఎక్కేస్తూ... ఇటు అడ్వెంచర్.. అంటూ నేచర్ బ్యూటీలను ఒకేసారి అనుభవించాలంటే ఇటు వైపు ఓ సారి వెళ్లండి. ఇలా వెళ్లొచ్చు - హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ల నుంచి వచ్చే వారు పీవీ స్వగ్రామమైన భీమదేవరపల్లి మండలం వంగర గ్రామానికి చేరుకోవాలి. - వంగర నుంచి రాయికల్ గ్రామానికి చేరుకోవాలి - రాయిల్కల్ నుంచి దక్షిణ దిశలో 3 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే ఎత్తైన పర్వత పాదాల వద్ద రాయికల్ చెరువు కనిపిస్తుంది. దాదాపుగా ఇక్కడి వరకు బైకులు, కార్లు వెళ్లగలవు - చెరువు సమీపంలో వాహనాలు నిలిపి సుమారు 1.5 కిలోమీటర్లు అడవిలో ప్రయాణిస్తే జలపాతం చేరుకోవచ్చు. కొండల నడుమ వరంగల్ నగరం నుంచి 43 కిలోమీటర్ల దూరంలో హన్మకొండ, కరీంనగర్ జిల్లాల సరిహద్దుల్లో సైదాపురం అటవీ ప్రాంతంలో ఎత్తన కొండల నడుమ ఈ జలపాతం ఉంది . ఏళ్ల తరబడి స్థానికులకే తప్ప బయటి ప్రపంచానికి ఈ జలపాతం గురించి తెలియదు. ఇటీవలే ఈ జలపాతానికి వస్తున్న టూరిస్టుల సంఖ్య పెరుగుతోంది. 170 అడుగుల ఎత్తు నుంచి చుట్టూ కొండలు.. జలపాత సవ్వళ్లు తప్ప మరో శబ్దం వినిపించే అవకాశం లేదక్కడ. 170 అడుగుల ఎత్తు నుండి స్వచ్ఛమైన నీటి ప్రవాహంతో.. పరవళ్లు తొక్కుతూ జలపాతం కిందికి దూకుతుంటుంది. మొత్తం ఐదు జలపాతాల సమాహారం రాయికల్ జలపాతం. పర్యాటకులకు, ప్రకృతి ప్రేమికులకు మధురానుభూతిని పంచుతోంది. తీసుకోవాల్సిన జాగ్రత్తలు: - జలపాతాల వద్ద సరైన రక్షణ ఏర్పాట్లు లేవు, కాబట్టి సందర్శకుల బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంటుంది. సెల్ఫీ మోజులో నిర్లక్ష్యంగా ఉన్న అనవసరపు సాహాసాలు చేసినా... ఆహ్లాదంగా, ఆనందంగా సాగాల్సిన పర్యటన మరో రకంగా మారుతుంది. - కొండల పై భాగంలో ఎలుగుబంట్లు ఉన్నాయి. కాబట్టి పైకి వెళ్లే ప్రయత్నం చేయకుండా ఉంటే మేలు - మద్యం తాగివెళ్లొద్దు. - ఫొటోల కోసం లోతు ప్రాంతాల దగ్గరకు వెళ్లొద్దు. - జలపాతాలు ఎక్కే ప్రయత్నం చేయకూడదు. - కొండలు ఎక్కాల్సి ఉంటుంది కాబట్టి షూ ధరిస్తే సౌకర్యంగా ఉంటుంది. - ఫుడ్, వాటర్ తదితర వస్తువులేమీ అక్కడ లభించవు. కాబట్టి పర్యటకులు తమతో పాటు అవసరమైన వస్తువులు తీసుకెళ్లడం బెటర్. టి. కృష్ణ గోవింద్, సాక్షి, వెబ్‌డెస్క్. -
పచ్చని చెట్లతో ఆహ్లాదం
వేములవాడఅర్బన్ : వేములవాడ అర్బన్ మండలంలోని నాంపల్లిలోని శాంతినగర్ కాలనీలో 2017లో హరితహారం కార్యక్రమంలో కాలనీవాసులు కాలనీలోని సీసీ రోడ్డుకు ఇరువైపుల గన్నేరు మొక్కలను నాటుకున్నారు. ఎండాకాలంలో కూడా వాటిని ఎవరి ఇంటి ఎదుట వారు నీరు పెట్టుకుంటూ కంటికి రెప్పలా కాపాడుకున్నారు. ఆ చెట్లు పెరిగి ఇప్పుడు ఆ కాలనీలో గన్నేరు పూలతో, పచ్చదనంతో ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. కాలనీకి వచ్చిన ప్రతి ఒక్కరు ఆ చెట్లను చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
పరుచుకున్న పచ్చదనం
సిరిసిల్లటౌన్ : అందమైన చెమన్లు..రంగురంగుల పూలమొక్కలు..పిల్లలను అలరించే ఆటవస్తువులు..విద్యార్థులకు డిజిటల్ లైబ్రరీ..సందర్శకులను కట్టిపడేసే ఆంపిథియేటర్.. ఇవన్నీ ఎక్కడో నగరాల్లోని పార్కులో కనిపించే దృశ్యాలు. అయితే ఇవన్నీ ఇక కార్మికక్షేత్రంలోని సిరిసిల్లవాసులను కనువిందు చేయనున్నాయి. పక్షంరోజుల్లో ప్రజలకు ఆహ్లాదం పంచేందుకు కొత్త అందాలతో సిద్ధమైన నెహ్రూపార్కుపై కథనం.. అమాత్యుడి ఆదర్శం.. పట్టణానికి తలమానికం స్థానిక ఎమ్మెల్యే, మంత్రి కేటీఆర్ ఆదర్శమైన ఆలోచనలతో పురాతన పార్కును పట్టణానికే తల మానికంగా నిలిచేలా తీర్చిదిద్దారు. కార్మికక్షేత్రమైన సిరిసిల్లలో చాలారోజులుగా పట్టణ ప్రజలు, ఇక్కడికి వచ్చే సందర్శకులకు ఆహ్లాదం కొరవడిందని తెలుసుకున్న ఆయన ప్రత్యేక నిధులు కేటాయించి.. పట్టణంలో మున్సిపల్‌కు సంబంధించిన రెండు కొత్త పార్కులను ఏర్పాటు చేయించారు. మూడున్నర దశాబ్దాల క్రితం నిర్మితమైన పాత నెహ్రూపార్కు, ఇందిరా పార్కులను కూడా అభివృద్ధి పరిచేలా మున్సిపల్‌కు ప్రత్యేకంగా నిధులు అందించారు. అయితే నెహ్రూపార్కును ‘సోషల్ రెస్పాన్సిబిలిటీ’తో హైదరాబాద్‌కు చెందిన ‘ఫీనిక్స్’ ప్రముఖ కంపెనీ ఆధునిక సాంకేతికతో అభివృద్ధి చేసింది. ఆధునిక హంగులతో.. విస్తరిస్తున్న సిరిసిల్ల పట్టణంలోని ప్రజల అవసరాల మేరకు విద్యానగర్‌లోని పాత నెహ్రూపార్కును అభివృద్ధి చేస్తున్నారు. ప్రస్తుతం అభివృద్ధి పనులు పూర్తికావచ్చాయి. 15న పార్కును ప్రారంభించేలా చర్యలు చేపడుతున్నారు. పట్టణ ప్రజలకు ఆహ్లాదంతో పాటు ఆనందాన్ని పంచే విధంగా పార్కు సర్వాంగ సుందరంగా ముస్తాబయింది. ఏళ్ల తరబడి బోసిపోయిన అందాలతో కునారిళ్లిన ఈపార్కు ఇప్పుడు పూర్తిగా ఆధునిక హంగులతో అందాలను సొంతం చేసుకుంది. ఇందులోకి వెళ్లగానే సందర్శకులకు అందమైన చెమన్లు, ఆహ్లాదకరమైన వాతావరణం, పిల్లలకు ఆటకేంద్రంగా తయారైంది. వీటితో పాటు విజ్ఞానాన్ని పంచేలా విద్యార్థులకు డిజిటల్ లైబ్రరీ స్థానికంగానే అందుబాటులోకి రావడం విశేషం. డిజిటల్ సొగసులతో.. పాత నెహ్రూపార్కుకు హైదరాబాద్ కార్పొరేట్ సంస్థ డిజిటల్ సొగసులను మేళవించింది. సుమా రు 30గుంటల విస్తీర్ణంలో ఉన్న ఈపార్కులో బోటింగ్ కొలను, డిజిటల్ లైబ్రరీ, పిల్లలకోసం ఆంపిథియేటర్, చూడముచ్చట గొలిపే వాటర్ ఫౌంటేన్లు, పిల్లల ఆటవస్తువులను ఏర్పాటు చేసింది. పార్కులోకి వెళ్లిన వారు మైమరిచిపోయేలా అత్యాధునిక పరిజ్ఞానంతో కొత్త నిర్మాణాలు చేపట్టింది. పార్కులోంచి నేరుగా పక్కనే ఉన్న మున్సిపల్ ఈతకొలనుకు సందర్శకులు వెళ్లే సౌకర్యం కల్పించింది. ఇప్పటికే తొంభైశాతం పనులు పూర్తయిన ఈపార్కు అందాలను సందర్శకులు వీక్షిస్తూ.. మున్సిపల్ అధికారులకు కితాబిస్తున్నారు. మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించేందుకు సన్నాహాలు కూడా పూర్తయ్యాయి. పంద్రాగస్టుకు ప్రారంభిస్తాం పట్టణవాసులకు ఆహ్లాదంతో పాటు ఆనందాన్ని పంచేలా పార్కును ఆధునికీకరించాం. హైదరాబాద్‌కు చెందిన బిల్డ్కాం కంపెనీ వారు పార్కును నవీకరిస్తున్నారు. పంద్రాగస్టులోగా పార్కులో అన్ని పనులు పూర్తి చేయించి మంత్రి కేటీఆర్‌తో ప్రారంభించేలా ఏర్పాటు చేస్తున్నాం. పట్టణ ప్రజలతో పాటు సందర్శకులను ఆకట్టుకునేలా ముస్తాబైంది. – కేవీ రమణాచారి, మున్సిపల్ కమిషనర్ -
బరంపురానికి పచ్చదనంలో మొదటి స్థానం
బరంపురం : దక్షిణ ఒడిశాలో అన్ని రంగాల్లో మొదటి స్థానం పొందిన బరంపురం నగరం పచ్చదనంలో కూడా మొదటి స్థానం పొందేవిధంగా అందరు కలిసి కట్టుగా కృషి చేయాలని పలువురు వక్తలు ఆకాంక్షించారు. గురువారం స్థానిక హిల్‌పట్నాలో గల ఎంఈవీ పాఠశాల ప్రాంగణంలో పాఠశాల యాజమన్యం ఆధ్వర్యంలో క్లీన్ బరంపురం.. గ్రీన్ బరంపురం చైతన్య ర్యాలీ, మొక్కల పెంపకం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పాఠశాల ప్రిన్సి పాల్ ప్రకాష్ చంద్ర పండా ఎన్సీసీ, స్కౌ ట్స్, గైడ్స్, విద్యార్థుల చైతన్య ర్యాలీని ప్రారంభిం చారు. అనంతరం అయన మాట్లాడుతూ నగరంలో పరిశుభ్రత, మొక్కల పెంపకంతో పచ్చదనంతో పాటు పర్యావరణం పొందగలమని చెప్పారు. ఈ నేపథ్యంలో మనం ఉండే పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచుకోవాలని సూచిం చారు. కార్యక్రమంలో కార్యదర్శి కుమార్ రంజన్ పాఢి, ప్రముఖ జర్నలిస్టులు శక్తిధర్ రాజ్‌గురు, సుదీప్‌కుమార్ సాహు పాల్గొని ప్రసంగించి పిల్లలను ఉత్సాహపరిచారు. కార్యక్రమంలో వందలాది మంది ఎన్సీసీ, సౌట్స్, గైడ్స్ పిల్లలు పాల్గొన్నారు. -
పచ్చలహారంలా..
యాదాద్రి భువనగిరి : హైదరాబాద్ – వరంగల్ జాతీయ రహదారి పచ్చలహారాన్ని తలపిస్తోంది. ఇటీవల కురుస్తున్న వర్షాలకు రహదారి వెంట, మధ్యలో ఉన్న చెట్లు, గ్రీనరీ పచ్చగా మారి ప్రయాణికులకు ఆహ్లాదం పుంచుతోంది. -
హరిత హరివిల్లు.. నగరంలో నిల్లు!
సాక్షి, హైదరాబాద్ : తోటల నగరంగా ప్రసిద్ధి చెందిన భాగ్యనగరంలో హరిత హననం జరుగుతోంది. శరవేగంగా విస్తరిస్తున్న రహదారులు, బహుళ అంతస్తుల భవంతులు, ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్న వాణిజ్య సముదాయాలతో విశ్వనగరి కాంక్రీట్ మహారణ్యంలా మారుతోంది. కాంక్రీట్ విస్తరణకు అనుగుణంగా గ్రీన్‌బెల్ట్ పెరగకపోవడంతో మోటారు వాహనాలు, పరిశ్రమల నుంచి వెలువడుతున్న కార్బన్డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ వంటి ఉద్గారాలతో వాతావరణం త్వరగా వేడెక్కు తోంది. దీంతో స్వచ్ఛ ఆక్సిజన్‌ను.. స్వేచ్ఛగా పీల్చే పరిస్థితి ఉండటం లేదు. ప్రాణవాయువు అందక నగరవాసులు ఇప్పటికే ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 30 శాతం గ్రీన్‌బెల్ట్ (హరిత వాతావ రణం) ఉండాల్సి ఉండగా.. కేవలం 8 శాతమే ఉండటం ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతోంది. ఓ వృక్షం.. 260 పౌండ్ల ఆక్సిజన్ ఒక భారీ వృక్షం ఏటా 260 పౌండ్ల (సుమారు 118 కిలోలు) ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తుంది. స్వచ్ఛమైన ఆక్సిజన్‌ను పీల్చుకోవాలంటే నలుగురు సభ్యులున్న ఓ కుటుంబానికి ఇలాంటి నాలుగు వృక్షాల చొప్పున అందుబాటులో ఉండాల్సిందే. కానీ గ్రేటర్ హైదరాబాద్‌లో ఆ పరిస్థితి లేదు. మహా నగరంలో ఒక్కో కుటుంబానికి సరాసరిన రెండు చెట్లు మాత్రమే ఉన్నాయి. ఈ పరిస్థితి కారణంగానే నగరవాసులు స్వచ్ఛమైన ఆక్సిజన్ అందక ఉక్కిరిబిక్కిరయ్యే దుస్థితి తలెత్తింది. ప్రతివ్యక్తికి తలసరిగా అవసరమైన హరిత శాతం (పర్‌హెడ్ ట్రీ కవర్) జాతీయ స్థాయి సగటు కంటే తక్కువగా భాగ్యనగరంలో ఉండటం కూడా ఆందోళన కలిగిస్తోంది. జాతీయ సగటు ప్రకారం ప్రతివ్యక్తి స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకునేందుకు, స్వచ్ఛమైన ఆక్సిజన్‌ను గ్రహించేందుకు 10 మీటర్ల హరిత వాతావరణం అవసరం కాగా.. నగరంలో కేవలం 2.6 మీటర్ల హరితం మాత్రమే అందుబాటులో ఉంది. ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్ ఏడో స్థానంలో నిలవడం ఆందోళన కలిగిస్తోంది. బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఇటీవల నిర్వహించిన ఓ అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. జాతీయ స్థాయి సగటు కంటే అధిక హరిత శాతంతో చండీగఢ్ ముందుంది. 12 మీటర్ల తలసరి హరితంతో తొలిస్థానంలో నిలిచింది. రెండో స్థానంలో నిలిచిన ఢిల్లీలో 10.2 మీటర్ల హరితం ఉంది. బెంగళూరులో 10 మీటర్లు, కోల్‌కతాలో 8 మీటర్లు, ముంబైలో 7 మీటర్లు, చెన్నై 6 మీటర్లు, హైదరాబాద్‌లో 2.6 మీటర్లు మాత్రమే ఉంది. పలు మెట్రో నగరాల్లో గ్రీన్‌బెల్ట్ శాతం ఇలా హైదరాబాద్‌లో 8 శాతమే గ్రేటర్ హైదరాబాద్ నగరం 1.54 లక్షల ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం జీహెచ్ఎంసీ పరిధిలో 30 శాతం గ్రీన్‌బెల్ట్ ఉండాలి. కానీ నగరంలో 8 శాతం మాత్రమే ఉంది. సుమారు 12,320 ఎకరాల్లో హరిత వాతావరణం (గ్రీన్‌బెల్ట్) అందుబాటులో ఉంది. దీన్ని కనీసం 24,710 ఎకరాలకు పెంచాల్సి ఉంది. అంటే నగర విస్తీర్ణంలో హరితం శాతం కనీసం 16 శాతానికి పెంచాల్సిన అవసరం ఉందని పర్యావరణ వేత్తలు సూచిస్తున్నారు. దేశంలో 35 శాతం గ్రీన్‌బెల్ట్‌తో చండీగఢ్ తొలిస్థానంలో నిలిచింది. దేశ రాజధాని ఢిల్లీలో 20.2 శాతం, గ్రీన్ సిటీగా పేరొందిన బెంగళూరులో 19 శాతం, కోల్‌కతాలో 15 శాతం, ముంబైలో 10 శాతం, చెన్నైలో 9.5 శాతం గ్రీన్‌బెల్ట్ ఉన్నట్లు పర్యావరణ వేత్తలు చెబుతున్నారు. హైదరాబాద్‌లో హరితం 8 శాతానికే పరిమితమైంది. ఇలా చేస్తే మేలు.. నగరంలోని ప్రధాన రహదారులు, 185 చెరువుల చుట్టూ పెద్దమొత్తంలో మొక్కలు నాటాలి. తద్వారా భూగర్భ జల మట్టాలు పెరుగుతాయి. పర్యావరణ కాలుష్యం కూడా బాగా తగ్గుతుంది. విశాల ప్రాంగణాల్లో బహుళ అంతస్తుల భవంతులు నిర్మిస్తున్న వారు విధిగా కొంత విస్తీర్ణంలో మొక్కలు పెంచుతామని, ఇంకుడు గుంతలు ఏర్పాటు చేస్తామని డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే వారికి జీహెచ్ఎంసీ భవన నిర్మాణ అనుమతులు మంజూరు చేయాలి. నూతనంగా ఏర్పడిన కాలనీల్లో 30 శాతం గ్రీన్‌బెల్ట్ ఉండేలా చూడాలి. నూతన లే అవుట్లకు అనుమతులిచ్చే సమయంలో ఈ విషయాన్ని తప్పకుండా పరిగణనలోకి తీసుకోవాలి. జల వనరులకూ శాపం మహా నగరంలో చెరువులు, కుంటలకు పట్టణీకరణ శాపంగా పరిణమిస్తోంది. ఔటర్ రింగ్ రోడ్డుకు లోపల ఉన్న సుమారు 3,500 చెరువులు, కుంటల విస్తీర్ణం గణనీయంగా తగ్గుతోంది. ఆయా భూములు కబ్జాకు గురవడం, విల్లాలు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, బహుళ అంతస్తుల భవంతులు వెలియడంతో జలాశయాలు రోజురోజుకూ చిన్నబోతున్నాయి. పర్యావరణ సంస్థ నీరి (ఎన్ఈఈఆర్ఐ) 2005–2018 మధ్యకాలాన్ని పరిగణనలోకి తీసుకొని తాజాగా నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెలుగుచూసింది. ఔటర్‌కు లోపల చిన్న, పెద్ద చెరువులు, కుంటల సంఖ్య 3,500 వరకు ఉంది. వీటి విస్తీర్ణం 2005లో సుమారు 30,978 ఎకరాలుగా ఉండేది. తర్వాత రియల్ రంగం పురోగమించడం, పొరుగు రాష్ట్రాలు, దేశాల నుంచి ఉద్యోగాలు, వ్యాపారాల కోసం వలసలు అధికమవడంతో శివార్లలో పరిస్థితి మారింది. ఇదే క్రమంలో అక్రమార్కుల కన్ను విలువైన జలాశయాలపై పడింది. జీవో 111 పరిధిలో ఉన్న గ్రామాల్లో చెరువులు, కుంటల్లో నిబంధనలకు విరుద్ధంగా విల్లాలు, రియల్ వెంచర్లు, వాణిజ్య స్థలాలు, బహుళ అంతస్థుల భవంతులు వెలిశాయి. ఒకప్పుడు పచ్చటి పంట పొలాలు, నిండు కుండలను తలపించే చెరువులు, కుంటలతో కళకళలాడిన ప్రాంతాలు ఇప్పుడు కాంక్రీట్ మహారణ్యంగా దర్శనమిస్తున్నాయి. 30,978 ఎకరాలుగా ఉన్న చెరువులు, కుంటల విస్తీర్ణం.. 5,641 ఎకరాలకు చేరింది. గత 13 ఏళ్ల కాలంలో సుమారు 80 శాతం తగ్గిపోయింది. ఇందుకు పట్టణీకరణ ప్రభావం ఒక కారణమైతే, రెవెన్యూ, పంచాయతీరాజ్, చిన్న నీటిపారుదల శాఖల నిర్లక్ష్యం మరో కారణంగా ఉందని పర్యావరణ వేత్తలు పేర్కొంటున్నారు. ఇళ్లలో నాటే మొక్కలతో గ్రీన్‌బెల్ట్ పెరగదు: జీవానందరెడ్డి, పర్యావరణ వేత్త ప్రభుత్వం ప్రారంభించిన మూడో విడత హరితహారంలో నాటిన మొక్కల్లో 95 శాతం ఇళ్లలో పెంచుతున్నవే ఉన్నాయి. వీటితో నగరంలో గ్రీన్‌బెల్ట్ పెరిగే అవకాశం లేదు. దీర్ఘకాలం మన్నికగలవి, ఆక్సిజన్ అందించేవి, కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించే వేప, రావి, మర్రి, మద్ది, చింత వంటి సంప్రదాయ చెట్లను పెద్దమొత్తంలో నాటితేనే గ్రీన్‌బెల్ట్ పెరుగుతుంది. అలా ఆక్సిజన్ శాతం పెరిగి నగరవాసులకు కాలుష్యం నుంచి విముక్తి లభిస్తుంది. సర్కారు హరితహారంతో వల్ల నర్సరీల నిర్వాహకులకే లాభం చేకూరింది. -
ఇక్కడ ఆడపిల్ల పుడితే మొక్కలు నాటుతారు.!
జైపూర్: ఆడపిల్ల పుడితే చాలు అన్నీ బాధలే అనుకునే సమాజం ఇది. ఆడశిశువును చెత్తబుట్టల్లో పడేసే కర్కశులూ లేకపోలేరు. భ్రూణ హత్యలకు పాల్పడే మూర్ఖులు చాలా మంది నేటి సమాజంలో ఉన్నారు. కానీ ఓ గ్రామం మాత్రం వీటికి దూరంగా ఉంటూ ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోంది. అక్కడ ఆడపిల్ల జన్మిస్తే అక్కున చేర్చుకుంటారు. ఊరంతా కలిసి పండుగ జరుపుతారు. ఆడపిల్ల పుట్టిన ప్రతిసారి ఆ గ్రామంలో 111 మొక్కలు నాటుతారు. ఇలా నాటిన ప్రతి మొక్కని కన్న బిడ్డలా చూసుకుంటారు. ఇంత గొప్ప పనికి శ్రీకారం చుట్టింది రాజస్థాన్‌లోని పిప్లాన్‌ట్రీ అనే గ్రామం. ఇటు స్త్రీ నిష్పత్తిని పెంచుతూ.. అటూ పర్యావరణాన్ని కూడా రక్షిస్తున్నారు సదరు గ్రామస్తులు. ఇంత గొప్ప ఆచారాన్ని గత 11 ఏళ్లుగా కొనసాగిస్తున్నారు. ఓ వైపు సమాజంలో ఆడపిల్లల శాతం గణనీయంగా తగ్గిపోతోంది. చాలా చోట్ల వెయ్యి మంది పురుషులకు 985 మంది స్త్రీలే ఉంటున్నారు. ఇలాంటి తరుణంలో పిప్లాన్‌ట్రీ గ్రామస్తులు చేస్తున్న కార్యక్రమం నిజంగా సమాజానికి మేల్కొలుపు లాంటిదే. ఇటీవల ఆ గ్రామంపై ఓ ఆంగ్ల వార్తా సంస్థ డ్యాక్యుమెంటరీ రూపొందించి ఆన్లైన్లో పోస్ట్ చేసింది. ఆ వీడియోలో ఆ గ్రామ ప్రజలు నాటిన మొక్కలు, వారు మొక్కలపై తీసుకుంటున్న శ్రద్ధను తెలియజేశారు. ఆడశిశువు జన్మను ప్రొత్సహిస్తూ, పర్యావరణాన్ని సంరక్షిస్తూ పిప్లాన్‌ట్రీ గ్రామస్తులు ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. -
ఆడపిల్ల పుడితే ఆ గ్రామంలో 111 మొక్కలు నాటుతారు
-
ఉద్యమంలా హరితహారం
ఇప్పటికే నాటిన రెండు లక్షల మొక్కలు మరిన్ని నాటేందుకు సిద్ధంగా నాటిన మొక్కలకు ట్రీగార్డుల ఏర్పాటు రక్షణకు ప్రత్యేకంగా పంచాయతీ సిబ్బంది నియామకం దుబ్బాక రూరల్: రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం దుబ్బాక నగర పంచాయతీలో పరుగులు తీస్తోంది. దుబ్బాకతోపాటు దుంపలపల్లి, ధర్మాజీపేట, చేర్వాపూర్, చెల్లాపూర్, మల్లాయిపల్లి, లచ్చపేట వార్డుల్లో ఉద్యమంలా మొక్కలు నాటారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, పాఠశాలల ఆవరణలో, రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటారు. విరివిగా మొక్కలు నాటడంతో పర్యావరణ కాలుష్యాన్ని కాపాడడమే కాకుండా, వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని, మొక్కలు నాటడం వల్ల అవి పెరిగి చెట్లుగా మారి అవి మనల్ని రక్షిస్తాయనే అవగాహనతో ఇక్కడి ప్రజలు హరితహారంలో చురుగ్గా పాల్గొంటున్నారు. నగర పరిధిలో ఇప్పటివరకు సమారు రెండు లక్షల వరకు మొక్కలు నాటారు. మరి కొన్ని మొక్కలు నాటడానికి సిద్ధంగా ఉన్నారు. నాటిన ప్రతి మొక్కకు రక్షణగా ట్రీ గార్డు, ముళ్ల కంచె వేశారు. మొక్కల సంరక్షణకు నగర పంచాయతీ సిబ్బందిని ఏర్పాటు చేశారు. నగర పంచాయతీ పరిధిలోని రేకులకుంట శ్రీమల్లికార్జున దేవస్థానం సమీపంలో ఉన్న సర్వే నంబర్ 117, 129లోని భూమిలో 84 ఎకరాల్లో లక్ష మొక్కలు నాటారు. ఇందుకోసం భూ యజమానులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. నాటిన ప్రతి మొక్కను భూ యజమానులు కంటికి రెప్పలా కాపాడుతున్నారు. 84 ఎకరాల భూమిలో నీలగిరి 80 వేల మొక్కలు, అల్ల నేరెడు పది వేలు, సీతాఫలం ఐదు వేలు, చింత ఐదు వేల మొక్కలు నాటారు. నాటిన ప్రతి మొక్కనూ భూ యాజమానులు శ్రద్ధతో పెంచుతున్నారు. వీటితో కలిపి ఇప్పటివరకు నగర పంచాయతీ పరిధిలో సుమారు రెండు లక్షల మొక్కలు నాటారు. ప్రతి మొక్కనూ కాపాడుతాం నాటిన ప్రతి మొక్కనూ కాపాడుతాం. ఇందుకోసం సిబ్బందికి బాధ్యతలు అప్పగించాం. మొక్కలకు రక్షణగా ట్రీ గార్డు, ముళ్ల కంచెలు వేస్తున్నాం. ఇప్పటివరకు నగర పంచాయతీ పరిధిలో సుమారు రెండు లక్షల మొక్కలు నాటాం. ఇంకొన్ని మొక్కలు నాటడానికి సిద్ధంగా ఉన్నాం. 84 ఎకరాల్లో లక్ష మొక్కలు నాటడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన భూ యజమానులకు కృతజ్ఞతలు. - భోగేశ్వర్, దుబ్బాక నగర పంచాయతీ కమిషనర్ వాడవాడలా మొక్కలే.. నగర పంచాయతీ పరిధిలో ఎక్కడ చూసినా నాటిన మొక్కలే కన్పిస్తున్నాయి. కార్యాలయాలు, పాఠశాలలు, పొలాలు, ఎక్కడ చూసినా మొక్కలతో నిండిపోయాయి. నాటిని కాపాడేందుకు నగర పంచాయతీ వారు ట్రీ గార్డు, చుట్టూ ముళ్ల కంచె వేశారు. ప్రతి మొక్కను నగర పంచాయతీ సిబ్బంది శ్రద్ధతో పెంచుతున్నారు. - దత్తం స్వామి, స్థానికుడు -
‘పచ్చ’శాల
ఆహ్లాదకరంగా కుసంగి పాఠశాల ఆవరణంలో విరివిగా మొక్కలు సంరక్షణలో ప్రత్యేక శ్రద్ధ.. నిత్యం పర్యవేక్షణ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న ఉపాధ్యాయులు, విద్యార్థులు టేక్మాల్: రకరకాల చెట్లు, చల్లని వాతావరణం మధ్య ఎంతో ఆహ్లాదకరంగా, ఆకర్షణీయంగా ఉంది ఆ పాఠశాల.. ఆవరణలో విరివిగా మొక్కలు నాటడమే కాకుండా సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆ చెట్ల కిందే సేదతీరుతున్నారు. మొక్కల సంరక్షణలో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు ఇక్కడి ఉపాధ్యాయులు, విద్యార్థులు. టేక్మాల్ మండలం కుసంగి ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఎటుచూసినా చెట్లే.. పాఠశాల ప్రధానోపాధ్యాయులు దుర్గయ్య, ఉపాధ్యాయుడు తౌర్యానాయక్ల ప్రోత్సాహంతో ఆవరణలో మొక్కలు విరివిగా నాటారు. నాటిన ప్రతి మొక్కను కపాడాలన్నదే వీరి లక్ష్యం. ఇక్కడ టేకు, మామిడి, జామ, కొబ్బరి, చమాన్, రకరకాల పూల మొక్కలను నాటారు. పాఠశాలకు వచ్చే దారిలో ఇరువైపులా చమాన్ పెంచడంతో స్వాగత తోరణంగా మారింది. మరి కాస్త లోపలికి వస్తే పాఠశాల చుట్టూ చమాన్తో పాటూ, పూల మొక్కలను పెంచుతున్నారు. వెనుక భాగంగాలో పూర్తిగా టేకు మొక్కలను పెంచుతున్నారు. పాఠశాల ముందున్న జెండా గద్దె చుట్టూ పూల చమాన్‌ను పెంచడంతో ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. మొక్కల దత్తత ప్రతి మొక్కను క్లాస్‌ల వారీగా విద్యార్థులకు దత్తత ఇచ్చారు. నిత్యం ఆ విద్యార్థి నీటి మళ్లించడం, చెత్తను ఎరివేస్తూ గడ్డిని తొలగించడం ఆ మొక్క ఆలన, పాలన చూసుకుంటారు. వారు వినియోగించే నీరు వృధా పోకుండా చెట్లకు కాలువలు చేసి అందిస్తున్నారు. చమాన్ మొక్కలు పెద్దవిగా కాగానే ఆకృతిలో కత్తిరిస్తూ కొత్త అందాన్ని రూపొందిస్తున్నారు. విద్యార్థులే కాకుండా ఉపాధ్యాయులు సైతం ప్రత్యేకంగా ఉదయం, సాయంత్రం వేళల్లో సమయాన్ని వెచ్చిస్తూ మొక్కలను కాపాడుతున్నారు. ఉన్నత పాఠశాలలోనూ.. పక్కనే ఉన్న ఉన్నత పాఠశాలలో సైతం భారీగా మొక్కలు పెరిగాయి. పూలమొక్కలు, చమాన్‌ను పెంచుతున్నారు. చెట్లకింద, చల్లని గాలి మధ్య విద్యార్థులకు చదువులను అందిస్తున్నారు. -
ఇంటి చుట్టూ పచ్చందమే!
వృద్ధుల ఆదర్శనీయం మొక్కల మధ్యే జీవనం ఆహ్లాదాన్ని పంచే పొదరిల్లు జిన్నారం: ఆ ఇంట్లోకి వెళ్తే చాలు పచ్చదనం కనిపిస్తోంది. పచ్చతోరణమే స్వాగతం పలుకుతోంది. ఇంటి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. జిన్నారం మండలం అన్నారం గ్రామంలోని ప్రకృతి నివాస్‌లో ఈ ఇల్లు నందన వనంలా కనిపిస్తోంది. హైదరాబాద్‌కు చెందిన సుబ్బారావు, పద్మజలు ప్రకృతి నివాస్‌లో నివాసం ఉంటున్నారు. ఉన్న ఇద్దరు కుమారులు యూఎస్‌లో ఉన్నారు. సుమారు 60- 70 ఏళ్ల వయస్సు ఉన్న సుబ్బారావు, పద్మజలు ఇంటి ముందు మొక్కలను పెంచుకుంటూ జీవిస్తున్నారు. కుమారులు యూఎస్‌ల ఉండటంతో వారికి ఎలాంటి పనులు లేకపోవటంతో మొక్కలు పెంచటమే పనిగా చేసుకున్నారు. బంధువులు, స్నేహితుల నుంచి వివిధ రకాల మొక్కలను సేకరించి వాటిని పెంచే విధంగా ప్రతినిత్యం పనులు చేస్తుంటారు. మొక్కలే వారి స్నేహితులుగా మారాయి. సుమారు 15 రకాల ఆకుకూరలు, 30రకాల పూల మొక్కలు, 15రకాల పండ్ల మొక్కలు, 10 రకాల షోకేజీ చెట్లతో పాటు తమలపాకు, అరటి, కొబ్బరి చెట్లను పెంచుతున్నారు. వివిధ రకాల ఔషధ మొక్కలను కూడా వారు పెంచుతున్నారు. ఇంట్లోపెంచిన ఆకుకూరలనే వంటలకు ఉపయోగిస్తున్నారు. కేవలం సేంద్రియ ఎరువులతో పండించిన కూరగాయలను వాడుతుండటంతో ఆరోగ్యంగా ఉంటున్నామని వారు చెబుతున్నారు. ఈ మొక్కలతో ఇల్లు నందనవనంగా మారింది. హరితహారంలో భాగంగా మొక్కలు నాటాలని ప్రభుత్వం సూచిస్తుండగా, మొక్కలతో జీవనాన్ని సాగిస్తున్న ఈ వృద్ధ దంపతులు ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆహ్లాద వాతావరణంలో జీవిస్తున్నాం ఇంటి చుట్టూ పచ్చటి మొక్కలతో ఆహ్లాదంగా జీవిస్తున్నాం. ఈ వయస్సులో చెట్ల మధ్య గడపటం సంతోషంగా ఉంది. తాము పండించిన ఆకు కూరలనే తింటాం. సేంద్రియ ఎరువులతోనే అన్ని రకాల మొక్కలను పెంచుతున్నాం. తాము ఇద్దరమే ఇంట్లో ఉండటంతో తమ సొంత బిడ్డల్లాగా చెట్లను పెంచుతున్నాం. చచ్చే వరకు తాము మొక్కలను పెంచుతూనే ఉంటాం. - పద్మజ, సుబ్బారావు నిత్యం పూలు కోసుకుంటా పద్మజ, సుబ్బారావులు ఇంటి నిండా మొక్కలను పెంచటం సంతోషంగా ఉంది. వారి ఇంట్లో ప్రతి రోజు తాను పూలు కోసుకుంటాను. తమ ఇంట్లో ఎలాంటి పూజా కార్యక్రమాలను నిర్వహించినా పూలు, పండ్లు, తమలపాకులను వారి ఇంట్లోనుంచే తీసుకొస్తామన్నారు. - సరిత. కాలనీ వాసురాలు -
మొక్కోద్యమం
పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటుదాం.. ప్రగతికి మెట్లు.. పచ్చని చెట్లు.. అంటూ వందలాది గొంతులు గళమెత్తాయి. గంటలో లక్ష మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా సోమవారం పాలకొల్లు గాంధీబొమ్మల సెంటర్లో విద్యార్థులు మానవహారం చేపట్టారు. ప్రకృతిని పరిరక్షిస్తాం అంటూ ప్రతిజ్ఞ చేశారు. పాఠశాలలు, పంచాయతీ కార్యాలయాల ఆవరణలు, రోడ్డుకిరువైపులా లక్ష మొక్కలు నాటారు. ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, మునిసిపల్ చైర్మన్ వల్లభు నారాయణమూర్తి, వైస్‌చైర్మన్ కర్నేన రోజారమణి, కౌన్సిలర్లు గండేటి వెంకటేశ్వరరావు, పెచ్చెట్టి బాబు, తమ్మినీడి సత్యనారాయణ, మేడిశెట్టి సత్యనారాయణ, అధికారులు పాల్గొన్నారు. -
గ్రీన్‌క్యాంపస్‌గా తీర్చిదిద్దుదాం
ఏయూక్యాంపస్: విశ్వవిద్యాలయ సుందరీకరణలో వక్షశాస్త్ర విభాగ విద్యార్థుల భాగస్వామ్యం ఎంతో అవసరమని ఏయూ ఉపకులపతి ఆచార్య జి.నాగేశ్వరరావు అన్నారు. గురువారం ఉదయం విభాగంలో నిర్వహించిన ఫ్రెషర్స్‌డే వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ వర్సిటీలో ప్రధాన ప్రవేశ మార్గాలు, కూడళ్లవద్ద పచ్చదనం పరిచే కార్యక్రమానికి అవసరమైన సూచలను అందించాలని సూచించారు. హార్చికల్చర్, లాండ్స్కేప్ మేనేజ్మెంట్ విభాగ విద్యార్థులు నిర్ధిష్ట ప్రణాళికతో రావాలని వీటిని అమలు చేస్తామన్నారు. విద్యార్థులు ప్రత్యక్ష జ్ఞానాన్ని అందుకునే ప్రయత్నం చేయాలన్నారు. విద్యార్తి ప్రవర్తన, వ్యక్తిత్వం వర్సిటీ ఉన్నతిపై ప్రభావం చూపుతుందనే విషయాన్ని విద్యార్థులు గుర్తుంచుకోవాలన్నారు. సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య సి.వి రామన్,విద్యార్థి సమన్వయాధికారిణి ఆచార్య అరుంధతి ,బిఓఎస్ చైర్మన్ ఆచార్య ఓ.అనీల్ కుమార్, విభాగాధిపతి ఆచార్య వై.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. -
పచ్చదనంతోనే ప్రగతి
l గంగదేవిపల్లికి రావడం అంటే టెంపుల్‌కు వచ్చినట్లు.. l హరితహారంలో 9.50 లక్షల మొక్కలు నాటాం l నగర పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు గీసుకొండ : పచ్చదనంతోనే ఏ సమాజమైనా ప్రగతి సాధిస్తుందని, ప్రస్తుతం కావల్సినవి కాంక్రీట్ జంగిల్స్ కావని, జంగిల్స్ అని వరంగల్ నగర పోలీస్ కమిషనర్ జి. సుధీర్‌బాబు అన్నారు. హరితహారాన్ని ప్రజల భాగస్వామ్యంతో ఉద్యమంలా చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. మండలంలోని జాతీయ ఆదర్శగ్రామం గంగదేవిపల్లిలో పోలీసుల ఆ««దl్వర్యంలో బుధవారం చేపట్టిన హరితహారం కార్యక్రమంలో మాట్లాడుతూ.. గంగదేవిపల్లికి రావడం అంటే దేవాలయానికి వచ్చినట్లుగా ఉంటుందని, ఇలాంటి గ్రామాన్ని హరితవనంగా తీర్చిదిద్దడానికి తొలుత 6 వేల మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని అన్నారు. పెంబర్తిని దత్తత తీసుకుని గంగదేవిపల్లిలా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నానని చెప్పారు. నీరు, చెట్లు సమృద్ధిగా ఉన్న చోటే గొప్ప నాగరికతలు వర్ధిల్లాయని గుర్తుచేశారు. గత ఏడాది హరితహారంలో 1.10 లక్షల మొక్కలు నాటితే, ప్రజల భాగస్వామ్యంతో ఈ ఏడాది నగర కమిషనరేట్ పరిధిలో 9.50 లక్షల మొక్కలు నాటామన్నారు. మామునూరు ఎసీపీ మహేందర్ మాట్లాడుతూ చైనా, ఆఫ్రికా దేశాల తర్వాత ఇక్కడే పెద్ద స్థాయిలో హరితహారం కార్యక్రమం జరుగుతోందన్నారు. మామునూరు డివిజన్ పరిధిలో 3.50 లక్షల మెక్కలు నాటామన్నారు. అనంతరం గ్రామంలో 8 సీసీ కెమెరాలను సీపీ ప్రారంభించారు. కార్యక్రమంలో సీఐ శ్రీనివాస్, ఎంపీపీ ముంత కళావతి, జెడ్పీటీసీ ఆంగోతు కవిత, ఎంపీడీఓ సాయిచరణ్, ఈవోపీఆర్డీ భీంరెడ్డి రవీంద్రారెడ్డి, మామునూరు సీఐ శ్రీనివాస్, గీసుకొండ ఎస్ఐలు అంజన్‌రావు, నవీన్‌కుమార్, సర్పంచ్ ఇట్ల శాంతి, గ్రామాభివృద్ధి కమిటీ నాయకుడు కూసం రాజమౌళి , అరబిందో ఫార్మసీ కాలేజి, ఉషోదయ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. -
ప్రజా భాగస్వామ్యంతోనే గ్రీనరీ
సామాజిక అటవీ విభాగం డీఎఫ్‌వో రామ్ మోహన్‌రావు గుంటూరు వెస్ట్ : ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజల భాగస్వామ్యం ద్వారానే గ్రీనరీ సాధ్యమని సామాజిక అటవీ విభాగం డీఎఫ్‌వో పి.రామ్ మోహన్‌రావు తెలిపారు. 2016లో అటవీశాఖ జిల్లాలో కోటీ 7 లక్షల మొక్కలను పంపిణీ చేసేందుకు సిద్ధం చేసినట్లు చెప్పారు. ఈనెల 29వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన వనం–మనం కార్యక్రమంలో భాగంగా జిల్లాలో చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమ వివరాలను ఆయన వివరించారు. జిల్లాలో విస్తీర్ణంలో 14.58 శాతం అడవులు ఉన్నట్లు తెలిపారు. అటవీ విస్తీర్ణం పెంచే కార్యక్రమంలో భాగంగా 29వ తేదీన జిల్లావ్యాప్తంగా 11 లక్షల 31 వేలు మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకుని, అందుకు తగిన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని నల్లపాడులోని నగరవనంలో ప్రారంభించనున్నట్లు ఆయన చెప్పారు. మొక్కలను పెంచాలని ఆసక్తి కలిగినవారు 1800 425 3252 టోల్ ఫ్రీ నెంబర్‌కు ఫోన్ చేయడం ద్వారా మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చని, అవసరమైన మొక్కలను తీసుకుని వెళ్లవచ్చని ఆయన సూచించారు. -
గ్రీన్ డైట్
పచ్చదనాన్ని పరిచుకున్న డైట్ కళాశాల పాతికేళ్లుగా డ్రిప్‌తో మొక్కల పెంపకం పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్న సిబ్బంది మెదక్ : ‘వృక్షో రక్షితి.. రక్షితహ’.. ఈ సామెతను కొందరు అధికారులు అక్షరసత్యం చేస్తున్నారు. ఛాత్రోపాధ్యాయులకు పాఠాలు బోధించడమే కాకుండా.. పర్యావరణ పరిరక్షణలో వారిని భాగస్వాములు చేస్తున్నారు. ఫలితంగా మెదక్ మండల పరిధిలోని హవేళిఘణపూర్ శివారులోని డైట్ కాలేజీలో పచ్చదనం ఉట్టిపడుతోంది. 18 ఎకరాల్లో... ఘణపూర్ శివారులో 18 ఎకరాల స్థలంలో 1990లో డైట్ కాలేజీ ఏర్పాౖటెంది. ఇందులో ఉర్దూ, ఇంగ్లిష్ మీడియంలకు సంబంధించిన సుమారు 300లకు పైగా ఛాత్రోపాధ్యాయులు ఏటా శిక్షణ పొందుతున్నారు. విశాలమైన స్థలం ఉండటంతో పాతికేళ్ల క్రితమే అధ్యాపక సిబ్బంది విరివిగా మొక్కలు నాటారు. బోరుబావి తవ్వించి డ్రిప్ పద్ధతిలో నీరు పెడుతున్నారు. దీంతో డైట్కాలేజీ గ్రీనరీని సొంతం చేసుకుంది. కళాశాల గదులు రెండు ఎకరాల్లో నిర్మించగా మిగతా 16 ఎకరాల్లో పచ్చదనం పరుచుకుంది. జిల్లాలోని పచ్చదనం ఉన్న ఏకైక కాలేజీకి పేరుగడించింది. పలు రకాల చెట్లు ఇక్కడ ముఖ్యంగా వేప, మామిడి, అల్లనేరేడు, అశోక, షో ట్రీస్, ఉసిరిచెట్లతో పాటు పలు రకాల పూలమొక్కలు ఏపుగా పెరిగాయి. స్వాగత తోరణం నుంచి దారికి ఇరువైపులా పొడవాటి చెట్లు స్వాగతం పలుకుతాయి. ఇంకొంచెం ముందుకెళ్తే కాలేజీ పరిసరాలు అడవిని స్ఫురింపజేస్తాయి. గత సంవత్సరం హరితహారంలో పథకంలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, మెదక్ మున్సిపల్ చైర్మన్‌తో పాటు పలువురు డైట్కాలేజీలో మొక్కలు నాటారు. మొక్కల దత్తతు మొక్కలను నాటి వాటిని సంర క్షించినవారే తమ తల్లిదండ్రులతో పాటు సమాజాభివృద్ధికి తోడ్పడతారు. నిత్యం ఛాత్రోపాధ్యాయులకు పాఠాలతో పాటు పర్యావరణ రక్షణ గురించి ప్రాక్టికల్‌గా మొక్కలు నాటి, వాటిని వారికి దత్తత ఇస్తున్నాం. సిబ్బందితో పాటు అభ్యర్థుల కృషితో కాలేజీ ఆవరణ వనంలా మారింది. – రమేశ్‌బాబు, ప్రిన్సిపాల్