
న్యూఢిల్లీ: పర్యావరణ అనుకూల (గ్రీన్ సర్టిఫైడ్) ఆఫీస్ స్పేస్ (కార్యాలయ వసతులు) దేశంలోని ఆరు ప్రధాన పట్టణాల్లో గడిచిన మూడున్నరేళ్లలో 36 శాతం పెరిగి 342 చదరపు అడుగులకు చేరుకుంది. 2019 నాటికి గ్రీన్ ఆఫీస్ స్పేస్ 251 మిలియన్ చదరపు అడుగులుగానే ఉంది.
ఈ వివరాలను రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సీబీఆర్‌ఈ, వాణిజ్య సంఘం సీఐఐ సంయుక్తంగా ఓ నివేదిక రూపంలో తెలియజేశాయి. దేశీయంగా, అంతర్జాతీయంగా ఈఎస్‌జీ నియంత్రణలపై దృష్టి సారించడం.. ఆధునిక, ప్రీమియం, పర్యావరణ అనుకూల కార్యాలయ వసతులకు మధ్య కాలం నుంచి దీర్ఘకాలంలో డిమాండ్‌ను పెంచుతుందని ఈ నివేదిక పేర్కొంది.
‘‘ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటే రియల్ ఎస్టేట్ రంగం వృద్ధి చెందుతుంది. ఈఎస్‌జీ, దాని అమలుకు ప్రాధాన్యం పెరుగుతోంది. ఆధునిక, టెక్నాలజీ ఆధారిత, పర్యావరణ అనుకూల వసతులకు రానున్న త్రైమాసికంలో డిమాండ్ పెరుగుతుందని అంచనా వేస్తున్నాం’’అని సీబీఆర్‌ఈ చైర్మన్, సీఈవో అన్షుమన్ మ్యాగజిన్ తెలిపారు. దేశవ్యాప్తంగా 2023 జూన్ నాటికి పర్యావరణ అనుకూల కార్యాలయ వసతుల్లో 68 శాతం బెంగళూరు, ఢిల్లీ ఎన్‌సీఆర్, ముంబైలోనే ఉన్నట్టు ఈ నివేదిక తెలిపింది.
హైదరాబాద్‌లో 51.9 మిలియన్ చదరపు అడుగుల మేర పర్యావరణ అనుకూల కార్యాలయ వసతులు ఉంటే, బెంగళూరులో 104.5 మిలియన్ చదరపు అడుగులు, ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో 70.2 మిలియన్లు, ముంబైలో 56.6 మిలియన్లు, చెన్నైలో 32.6 మిలియన్లు, పుణెలో 26.2 మిలియన్ చదరపు అడుగుల చొప్పున ఈ వసతులు ఉన్నట్టు వెల్లడించింది. పర్యావరణ అనుకూల, ఇంధన ఆదా కార్యాలయ భవనాలకు దేశీ, బహుళజాతి కంపెనీల నుంచి డిమాండ్ పెరిగినట్టు అర్బన్ వోల్ట్ సహ వ్యవస్థాపకులు అమల్ మిశ్రా ఈ నివేదికలో పేర్కొన్నారు. కర్బన ఉద్గారాలపై పెరుగుతున్న అవగాహనకు ఇది నిదర్శమన్నారు.