ఫలానా అభివృద్ధికి మేమే కారణం అంటూ అరిగిపోయిన రికార్డులాగా.. ఏళ్లు గడుస్తున్నా గప్పాలు కొట్టుకుంటూ తిరిగే నేతల్ని ఇంకా మనం చూస్తున్నాం. అయితే చర్చల ద్వారా మేధావులు అందులో ఎంత వాస్తవం ఉందనేది వెలికి తీసే ప్రయత్నం ఇప్పటికీ చేస్తున్నారు. అయినా అలాంటి నేతల తీరు మారడం లేదు. అయితే ఈ దారిలో సోమనహల్లి మల్లయ్య కృష్ణ(SM Krishna) ఏనాడూ పయనించలేదు.
దేశంలో కర్ణాటకలోని బెంగళూరు నగరానికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. గత రెండు దశాబ్దాలుగా ఏమాత్రం పట్టుకోల్పోకుండా ఐటీ రంగంలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. అలాగే.. భారత్‌కు సెమీకండక్టర్ హబ్‌గానూ పేరుగాంచింది. సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా, ఐటీ క్యాపిటల్ ఆఫ్ ఇండియా, ఎలక్ట్రానిక్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా బెంగళూరును ఇవాళ పిలుచుకుంటున్నాం. అయితే.. ఈ నగరానికి ఇంతలా ఘనత దక్కడానికి ఎఎస్‌ఎం కృష్ణ చేసిన కృషి గురించి కచ్చితంగా చెప్పుకుని తీరాలి.
సుదీర్ఘకాలం కాంగ్రెస్‌లో కొనసాగిన ఎస్‌ఎం కృష్ణ.. కర్ణాటక ముఖ్యమంత్రిగా 1999-2004 మధ్య పని చేశారు. అదే టైంలో ఇటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు సీఎంగా స్వయంప్రకటిత విజనరీ నారా చంద్రబాబు నాయుడు ఉన్నారు. ఎస్‌ఎం కృష్ణతో పోలిస్తే అప్పటికే చంద్రబాబు ఒక టర్మ్ ముఖ్యమంత్రిగా పని చేసి ఉన్నారు. పైగా హైటెక్ సిటీలాంటి కట్టడంతో కొంత పేరూ దక్కించుకున్నారు. అయితే నిజంగా చంద్రబాబు తాను చెప్పుకునే విజన్‌తో.. తన రాజకీయానుభవం ఉపయోగించి ఉంటే ఆనాడే హైదరాబాద్ ‘సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా’ ఘనత దక్కించుకుని ఉండేదేమో!. కానీ, ఎస్‌ఎం కృష్ణ తన రియల్ విజన్‌తో ఆ ట్యాగ్‌ను బెంగళూరుకు పట్టుకెళ్లిపోయారు.
విజన్ అంటే ఇది..
1999 టైంలో.. ప్రపంచవ్యాప్తంగా పేరుమోసిన ఐటీ సంస్థలు భారత్‌లో తమ తమ కంపెనీలకు అనుకూలమైన స్పేస్ కోసం వెతుకుతున్నాయి. అప్పటికీ హైదరాబాద్‌లో హైటెక్ సిటీ ఏర్పాటైనా.. రియల్ ఎస్టేట్ వ్యాపారం మీద ఎక్కువ ఫోకస్ నడిచింది. మరోవైపు ఆపాటికే బెంగళూరు వైట్‌ఫీల్డ్‌లో ఇంటర్నేషనల్ టెక్ పార్క్ ఏర్పాటైంది. ఇదే అదనుగా ఐటీ కంపెనీలను ఎలాగైనా బెంగళూరుకు తీసుకురావాలని నిర్ణయించుకున్న ఎస్‌ఎం కృష్ణ.. ఆ పరిశ్రమ వృద్ధికి అనువైన వాతావరణాన్ని కల్పించడంపై ఆయన దృష్టి సారించారు. ఇందులో భాగంగా..
ఐటీ పార్కులు మరియు ప్రత్యేక ఆర్థిక మండళ్ల (సెజ్) ఏర్పాటుతో సహా మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఎస్‌ఎం కృష్ణ ప్రభుత్వం ప్రాధాన్యతనిచ్చింది. ఈ నిర్ణయం దేశీయ, అంతర్జాతీయ టెక్ కంపెనీలను బెంగళూరులో తమ కార్యకలాపాలను ఏర్పాటు చేయడానికి ఆకర్షించింది. అలాగే.. ఐటీ రంగం అభివృద్ధి చెందాలంటే ఏం అవసరం అనే అంశాలపై అప్పటికే ఐటీ మేధావులతో ఆయన చర్చలు జరిపి ఉన్నారు. పన్ను ప్రోత్సాహకాలు, సరళీకృత నిబంధనలతో పాటు స్టార్టప్‌లకు మద్దతు ప్రకటించారు. అదే సమయంలో పారిశ్రామికవేత్తలతోనూ సత్సంబంధాలు కొనసాగించారు. తద్వారా వాళ్ల అవసరాలకు అనుగుణంగా తెచ్చిన సంస్కరణలు.. బెంగళూరులో టెక్ కంపెనీల కార్యకలాపాలను సులభతరం చేశాయి.
ఇక.. ఒకవైపు ఐటీ రంగం కోసం ప్రతిభావంతులైన నిపుణుల అవసరాన్ని గుర్తించి విద్యతో పాటు స్కిల్‌డెవలప్‌మెంట్‌కు ప్రాధాన్యత ఇచ్చారు. మరోవైపు ఐటీ పరిశ్రమ డిమాండ్‌ను తీర్చడానికి ఇంజనీరింగ్ కాలేజీలు, శిక్షణా సంస్థల స్థాపనకూ ప్రాధాన్యత ఇచ్చారు. అవకాశం దొరికినప్పుడల్లా.. అంతర్జాతీయ వేదికలపై బెంగళూరును ఎస్‌ఎం కృష్ణ ప్రమోట్ చేశారు. తద్వారా భాగస్వామ్యాలను, విదేశీ పెట్టుబడులను ఆకర్షించగలిగారు.
బాబు విజన్.. వాస్తవం ఎంత?
‘‘హైదరాబాద్‌లో టెక్నాలజీ నా చలవే’’ అంటూ హైటెక్ సిటీ ద్వారా నారా చంద్రబాబు నాయుడు ఒక భ్రమను కల్పించారనే వాదన ఒకటి ఉంది. కానీ, అంతకు ముందే హైదరాబాద్‌కు టెక్ కంపెనీల రాక మొదలైంది. నగరానికి 1965లోనే ఈసీఐఎల్, ఆ తర్వాత ఈఎంఈ వచ్చింది. తద్వారా ఎలక్ట్రానిక్ మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. ఇదే హైదరాబాద్‌లో ఐటీ విస్తరణకు మూలం అయ్యింది. 1982లో సీఎంసీ ఆర్ అండ్ డీ వచ్చింది. ఇది సాఫ్ట్‌వేర్ సంస్థ. బెంగళూర్ కన్నా మూడేళ్ల ముందే అది హైదరాబాద్‌కు వచ్చింది. దాన్ని ఆ తర్వాత టీసీఎస్‌కు అమ్మేశారు.
ఇక.. 1987లో ఇంటర్‌గ్రాఫ్ హైదరాబాద్‌లోని బేగంపేటలో తన కార్యకలాపాలను ప్రారంభించింది. ఆ తర్వాత దేశానికి ప్రధాని అయిన రాజీవ్ గాంధీ.. హైదరాబాద్‌తోపాటు దేశంలోని ప్రధాన నగరాల్లో ఐటీ వృద్ధికి కృషి జరిపారు. ఈ క్రమంలోనే మైత్రీవనంలో 1991లో సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్ ఏర్పాటైంది. ఆ తర్వాత మాదాపూర్ ప్రాంతంలో ‘‘హైటెక్ సిటీ’’కి అప్పటి ముఖ్యమంత్రి నేదురుమిల్లి జనార్దన్ రెడ్డి పునాది వేశారు. ఆ తర్వాత మైత్రీవనంలోని సంస్థలు అక్కడికి తరలిపోయాయి.
కర్ణాటక సీఎంగా ఎస్‌ఎం కృష్ణ వ్యూహాత్మక దృక్పథం, ఆయన విశేషకృషి వల్లే బెంగళూరు భారతదేశ ఐటీ విప్లవానికి పర్యాయపదంగా మారింది. సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అనే బిరుదును సంపాదించుకోగలిగింది. అయితే ఇతరుల్లా ఏనాడూ ఆయన ఆ ఘనతను.. తన ఘనతగా తర్వాతి కాలంలోనూ చెప్పుకుంది లేదు!.
ఎస్‌ఎం కృష్ణకి నివాళిగా..
Comments
Please login to add a commentAdd a comment