19న బెంగళూరుతో తొలి మ్యాచ్
జట్టులోని ఆటగాళ్లకు ఫీజులు కూడా చెల్లించలేని నిస్సహాయత... కాంట్రాక్ట్‌ల రద్దు... ఆటగాళ్ల బదిలీలపై నిషేధం... టీమ్‌పై నిషేధం... కొద్ది రోజుల క్రితం వరకు ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్)లో హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్ (హెచ్‌ఎఫ్‌సీ) పరిస్థితి ఇది. వరుణ్ త్రిపురనేని తదితరులు యజమానులుగా ఉన్న ఈ టీమ్‌కు ఐఎస్‌ఎల్ నిర్వాహకులు హెచ్చరికలు జారీ చేస్తూ నోటీసులు ఇచ్చినా స్పందించలేని వైనం... చివరకు ఐఎస్‌ఎల్ నుంచి హైదరాబాద్ టీమ్‌ను తప్పించేందుకు రంగం సిద్ధం!
ఇలాంటి సమయంలో బీసీ జిందాల్ గ్రూప్ బరిలోకి దిగింది. అన్ని రకాల బాకీలను తీరుస్తూ జట్టును తీసుకునేందుకు సిద్ధమైంది. చర్చోపచర్చల తర్వాత ఎట్టకేలకు యాజమాన్య మార్పు ఖాయమైంది. ఇప్పుడు అధికారిక అనుమతి తర్వాత హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్ ఎలాంటి అంతరాయం లేకుండా ఐఎస్‌ఎల్‌లో ఆరో సీజన్‌కు ‘సై’ అంటోంది.
సాక్షి, హైదరాబాద్: ఐఎస్‌ఎల్‌లో హైదరాబాద్ టీమ్ అడుగు పెట్టడమే అనూహ్యంగా జరిగింది. 2018–19 సీజన్ తర్వాత ఆర్థిక సమస్యలతో పుణే సిటీ టీమ్ సతమతమైంది. దాంతో తర్వాతి సీజన్‌లో పుణే స్థానాన్ని మరో జట్టుతో భర్తీ చేసేందుకు ఐఎస్‌ఎల్ నిర్వాహకులు సిద్ధం కాగా... అప్పటికే కేరళ బ్లాస్టర్స్ టీమ్‌తో కలిసి పని చేసిన వరుణ్ ఎక్కువ వాటాతో పుణే స్థానాన్ని హైదరాబాద్ టీమ్‌తో భర్తీ చేశాడు.
తొలి సీజన్ (2019–20)లో పేలవమైన ఆటతో జట్టు చివరి స్థానానికే పరిమితమైంది. తర్వాతి ఏడాది కాస్త మెరుగైన ప్రదర్శనతో జట్టు ఐదో స్థానంతో ముగించింది. అయితే 2021–22లో ప్రస్తుత భారత జట్టు హెడ్ కోచ్ మనోలో మార్క్వెజ్ నేతృత్వంలో చాంపియన్‌గా నిలిచింది.
తర్వాతి ఏడాదీ రన్నరప్‌గా మెరుగైన ప్రదర్శన కనబర్చింది. అయితే గత సీజన్‌లో జట్టు గతి తప్పింది. మైదానంలో ప్రదర్శన ఘోరంగా ఉండగా... మైదానం బయట సమస్యలు టీమ్ పరిస్థితిని పూర్తిగా దిగజార్చాయి. 22 మ్యాచ్‌లు ఆడితే 1 మ్యాచ్‌లో నెగ్గి, 16 మ్యాచ్‌లలో ఓడి, 5 మ్యాచ్‌లను ‘డ్రా’ చేసుకొని అట్టడుగున నిలిచింది.
అన్నీ సమస్యలే...
బయటకు కనిపించని ఎన్నో కారణాలతో హైదరాబాద్ ఎఫ్‌సీ టీమ్ పరిస్థితిపై అనిశ్చితి నెలకొంది. కొన్ని నెలల పాటు తమకు ఒప్పందం ప్రకారం ఫీజులు చెల్లించలేదంటూ ఎనిమిది మంది ఆటగాళ్లు జట్టు నుంచి తప్పుకున్నారు. దాంతో ఆటగాళ్ల బదిలీపై కూడా ‘ఫిఫా’ నిషేధం విధించింది. టీమ్ అప్పులు పెరిగిపోయాయి. మ్యాచ్‌ల కోసం ప్రయాణాలను కూడా సరిగా ప్లాన్ చేయలేక వేదిక అయిన మరో నగరానికి మ్యాచ్ రోజు ఉదయం చేరిన ఘటనలు కూడా జరిగాయి.
ఐఎస్‌ఎల్ నుంచి నోటీసు వచ్చినా టీమ్ యాజమాన్యం స్పందించలేదు. ఒకదశలో మాకు జీతాలు చెల్లించండి ప్రభూ అంటూ టీమ్‌తో కలిసి పని చేసిన పలువురు సహాయక సిబ్బంది మ్యాచ్‌ల సమయంలో గచ్చిబౌలి స్టేడియంలో పెద్ద బ్యానర్లను ప్రదర్శించారు. సమస్య తాత్కాలికమేనని, త్వరలో పరిష్కరిస్తామని వరుణ్ ప్రకటించినా ఎవరికీ నమ్మకం కుదరలేదు.
గచ్చిబౌలి స్టేడియంలో కూడా జీతాలు ఇవ్వకపోవడంతో అక్కడి సిబ్బంది ఎవరూ మ్యాచ్ నిర్వహణకు సహకరించలేదు. చివరకు యాజమాన్య హక్కులను వదులుకోవాల్సి వచ్చింది.
కొత్త యాజమాన్యంతో...
సమస్యలను పరిష్కరించుకునేందుకు ఆగస్టు 15ను డెడ్‌లైన్‌గా విధించగా... టీమ్ యాజమాన్యం మరో రెండు వారాలు అదనపు గడువు అడిగింది. దాంతో హైదరాబాద్ మ్యాచ్‌లను మినహాయించి ఇతర మ్యాచ్‌ల షెడ్యూల్‌ను ఐఎస్‌ఎల్ ప్రకటించింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వివిధ వ్యాపారాల్లో ఉన్న సంస్థ బీసీ జిందాల్ గ్రూప్ క్రీడల్లో అడుగు పెట్టేందుకు సిద్ధమై ముందుకు వచ్చింది.
1952 నుంచి వ్యాపార రంగంలో ఉన్న ఈ సంస్థ ‘జిందాల్ ఫుట్‌బాల్ ప్రైవేట్ లిమిటెడ్’ పేరుతో తొలిసారి లీగ్‌లో ఒక టీమ్‌ను కొనుగోలు చేసింది. గత యాజమాన్యం చేసిన అప్పులు, లాభాలు, ఇతర లెక్కలు అన్నీ తేలిన తర్వాత ఈ నెల 2న హైదరాబాద్ టీమ్‌ను జిందాల్ గ్రూప్ తీసుకున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. కొత్త మేనేజ్‌మెంట్ అండతో హెచ్‌ఎఫ్‌సీ 2024–25 సీజన్‌లో ఎలా ఆడుతుందనేది ఆసక్తికరం.
హైదరాబాద్ ఎఫ్‌సీ జట్టు వివరాలు
అర్ష్‌దీప్ సింగ్ సైనీ, లాల్‌బియాక్లువా జాంగ్తే, అలెక్స్ షాజీ, లియాండర్ కన్హా, మనోజ్ మొహమ్మద్, మొహమ్మద్ రఫీ, పరాగ్ సతీశ్ శ్రీవాస్, సోయల్ జోషి, విజయ్ మరాండి, రామ్‌లన్‌చుంగా, అబ్దుల్ రబీ అంజుకందన్, అభిజిత్ పా, ఆయుశ్ అధికారి, ఐజాక్ వన్మల్‌సవ్మా చాక్‌చువాక్, లాల్‌చన్‌హిమా చైలో, లెనీ రోడ్రిగ్స్, రషీద్ మదమ్‌బిల్లత్, అమోన్ లెప్చా, ఆరోన్ వన్‌లాల్‌రించనా, స్టీఫెన్ గొడార్డ్, దేవేంద్ర ఢాకూ ముర్గాంవ్‌కర్, జోసెఫ్ సన్నీ.
కోచ్: తంగ్‌బోయ్ సింగ్తో.
నేటి నుంచి ఐఎస్‌ఎల్
ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఫుట్‌బాల్ టోర్నీ 11వ సీజన్‌కు రంగం సిద్ధమైంది. టోర్నీలో మొత్తం 13 జట్లు బరిలోకి దిగుతున్నాయి. నేడు జరిగే తొలి పోరులో డిఫెండింగ్ చాంపియన్ ముంబై సిటీ ఎఫ్‌సీతో గత ఏడాది రన్నరప్ మోహన్ బగాన్ సూపర్ జెయింట్ జట్టు తలపడుతుంది. ఈ రెండు టీమ్‌లతో పాటు డ్యురాండ్ కప్ విజేత నార్త్‌ఈస్ట్ యునైటెడ్ ఎఫ్‌సీ కూడా చక్కటి ఫామ్‌తో సవాల్ విసురుతోంది.
నేడు జరిగే మొదటి మ్యాచ్‌లో రెండు జట్లలో కలిపి భారత సీనియర్ జట్టు ఆటగాళ్లంతా పెద్ద సంఖ్యలో ఉండటం ఆసక్తిని పెంచింది. టోర్నీలో ప్రాథమిక లీగ్ దశ పోటీలు డిసెంబర్ 30 వరకు సాగుతాయి. ఆ తర్వాత నాకౌట్ మ్యాచ్‌లు నిర్వహిస్తారు. హైదరాబాద్ గచి్చబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియం హోం టీమ్ హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్ ఆడే ఆరు మ్యాచ్‌లకు (అక్టోబర్ 1, 30...నవంబర్ 25...డిసెంబర్ 4, 23, 28) ఆతిథ్యం ఇవ్వనుంది. మ్యాచ్‌లన్నీ స్పోర్ట్స్ 18 చానెల్, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment