తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పది రోజులపాటు అమెరికా, దక్షిణ కొరియా దేశాలలో పర్యటించి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి యత్నించారు. ఇలా ఎవరు చేసినా అభినందించవలసిందే. ఏ ముఖ్యమంత్రి అయినా, మంత్రి అయినా కేవలం ప్రచారం కోసం కాకుండా, రాష్ట్రానికి మంచి జరగాలన్న లక్ష్యంతో ఆయా విదేశీ, ఎన్ఆర్ఐ పారిశ్రామికవేత్తలను కలిసి తమ వద్ద కూడా పెట్టుబడులు పెట్టాలని కోరితే, వారిలో కొందరైనా అంగీకరిస్తే ఈ ప్రాంత ప్రజలకు ఉపయోగం జరుగుతుంది.
రేవంత్ విదేశీపర్యటన ద్వారా సుమారు ముప్పైఐదు వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించినట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆర్థిక మాంద్యం పరిస్థితులు ప్రపంచాన్ని భయపెడుతున్నాయి. అయినప్పటికీ ఈ మేరకు పెట్టుబడులు తేగలిగితే గొప్ప విషయమే. అవన్ని సాకారం అయితే అభినందించవలసిందే. గతంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ చైనా వంటి ఒకటి, రెండు దేశాలకు పెట్టుబడుల నిమిత్తం వెళ్లివచ్చినా, బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో మంత్రి కేటీఆర్ విస్తృతంగా పర్యటనలు చేసి పెట్టుబడులు తీసుకు రావడానికి యత్నించారు. కేటీఆర్ వద్దే ఐటి, పరిశ్రమల శాఖలు ఉండేవి. ఆయన హయాంలోనే ఫార్మాసిటీ ఒక రూపు దిద్దుకుంది.
హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డులో ఆదిభట్ల మొదలైన ప్రాంతాలలో కొత్త కంపెనీలు నెలకొల్పడానికి కృషి జరిగింది. దీనికి ముందుగా హైదరాబాద్‌లో ప్రాథమిక సదుపాయాల కల్పనకు కేసీఆర్ ప్రభుత్వం చాలా గట్టి కృషి చేసిందని చెప్పాలి. రింగ్ రోడ్డుకు కనెక్టివిని బాగా పెంచింది. హైదరాబాద్ పశ్చిమ భాగంలో కాని, ఇటు వరంగల్, విజయవాడ రూట్‌లలో కాని కొత్త వంతెలను భారీ ఎత్తున చేపట్టి వాహనాల రాకపోకలకు చర్యలు తీసుకుంది. ఐటి రంగానికి విశేష ప్రాధాన్యత ఇచ్చారు. వీటన్నిటి పలితంగానే గత శాసనసభ ఎన్నికలలో హైదరాబాద్, పరిసరాలలో మొత్తం అసెంబ్లీ సీట్లన్నిటిని బీఆర్‌ఎస్ స్వీప్ చేసిందన్న విశ్లేషణ ఉంది. అదే టైమ్‌లో గ్రామీణ ప్రాంతాలలో బీఆర్‌ఎస్ బాగా దెబ్బతినడం, ఎమ్మెల్యే అభ్యర్ధులపై తీవ్ర వ్యతిరేకత, కేసీఆర్ వ్యవహారశైలి వంటివాటి కారణాల వల్ల ఆ పార్టీ అధికారం కోల్పోయింది.
తదుపరి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. రేవంత్ తొలుత కొంత తొందరపాటు ప్రకటనలకు పాల్పడ్డారన్న విమర్శలు ఉండేవి. ముఖ్యంగా ఫార్మాసిటీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించడం, దానిని ఆయా చోట్ల ఏర్పాటు చేస్తామని అనడంతో ఆ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ యాక్టివిటి బాగా దెబ్బతింది. ఆ తర్వాత రేవంత్ కొన్ని దిద్దుబాటు చర్యలు తీసుకున్నారు. పారిశ్రామికవేత్తలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని భరోసా ఇచ్చే యత్నం చేశారు. ఆ కృషిలో భాగంగా ఎన్ఆర్ఐ పెట్టుబడులను ఆకర్షించడానికి అమెరికా, దక్షిణ కోరియా టూర్ పెట్టుకున్నారు.
దాదాపు పది రోజుల ఈ టూర్‌లో సుమారు ఏభైకి పైగా సమావేశాలలో ఆయన పాల్గొన్నారు. అమెరికాలోనే 19 కంపెనీలతో ఒప్పందాలు పెట్టుకున్నారు. ఇవి కార్యరూపం దాల్చితే ముప్పైవేల మందికి ఉద్యోగాలు వస్తాయని అంచనా. దీని ప్రభావం హైదరాబాద్ ఆర్థిక వ్యవస్థపై పాజిటివ్‌గా ఉంటుంది. ప్రతిష్టాత్మకమైన కాగ్నిజెంట్ కంపెనీ హైదరాబాద్‌లో భారీ విస్తరణకు ముందుకు రావడం శుభ పరిణామం. అలాగే అమెజానన్‌తో సహా ఆయా సంస్థలు పెట్టుబడులు పెడతామని అంటున్నాయి. వీటిలో స్వచ్ఛ బయో అనే సంస్థపై కొన్ని విమర్శలు వచ్చాయి. అది సీఎంకు సంబంధించినవారి కంపెనీ అని కొన్ని ఆరోపణలు వచ్చాయి. అయినా ఫర్వాలేదు. ఎవరి కంపెనీ అయినా పెట్టుబడి పెట్టి పదిమందికి ఉపాధి కల్పిస్తే సంతోషించవలసిందే. అయితే ఒప్పందం చేసుకున్న కంపెనీలన్నీ నిజంగానే పెట్టుబడులు పెడతాయి అన్న చర్చ లేకపోలేదు.
ప్రతిపాదిత పెట్టుబడులలో పాతిక శాతం నుంచి ఏభై శాతం మొత్తం వచ్చినా ప్రయోజనకరమే. కాకపోతే రేవంత్ తన గురువు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడుగుజాడలలో నడిచి ప్రచారానికి ప్రాముఖ్యత ఇస్తే అది ఆయనకు నష్టం జరగవచ్చు. 2014 టరమ్‌లో చంద్రబాబు నాయుడు విశాఖలో పెట్టుబడుల సదస్సు పెట్టి లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేస్తున్నట్లు కలరింగ్ ఇచ్చేవారు. తీరా చూస్తే అదంతా ప్రచారార్భాటమేనని ఆ తర్వాత వెల్లడైంది. ఆ పరిస్థితి రేవంత్ తెచ్చుకోకూడదు. అమెరికా టూర్ ద్వారా ఏదో రూ.లక్ష కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని పబ్లిసిటీ ఇచ్చుకోకుండా, వాస్తవంగా ఎన్ని ఒప్పందాలు కుదిరితే వాటినే అంటే రూ.32 వేల కోట్ల పెట్టుబడులు అని అధికారికంగా ప్రకటించడం మంచిదే. దాని వల్ల రేవంత్ విశ్వసనీయత పెరుగుతుంది.
తెలంగాణకు సంబంధించి హైదరాబాద్ నగరం ఒక పెద్ద అస్సెట్‌గా మారింది. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో తయారైన అవుటర్ రింగ్ రోడ్డు హైదరాబాద్ స్వరూపస్వభావాలనే మార్చివేసిందని చెప్పాలి. చంద్రబాబు హైదరాబాద్ అంతా తానే నిర్మించానని ప్రచారం చేసుకుంటారు. పాతికేళ్ల క్రితం ఒక బిల్డింగ్ కట్టి హైటెక్ సిటీ అని పేరు పెట్టి, ఆ ప్రాంతం అంతటికి సైబరాబాద్ అని నామకరణం చేసి మొత్తం నగరాన్ని తానే నిర్మించానని ప్రచారం చేసుకుంటారు. నిజానికి వైఎస్ రాజశేఖరరెడ్డి టైమ్‌లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ తదితర ప్రాంతాలు ఒక ప్లాన్ ప్రకారం అభివృద్ధి అయ్యాయి.
బీఆర్‌ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిన మాట వాస్తవమే అయినా, ఆ రోజుల్లో మాట్లాడితే లండన్ చేస్తా.. డల్లాస్ చేస్తా అంటూ కేసీఆర్ చేసిన ప్రచారం వల్ల దాని సీరియస్‌నెస్ పోయిందని చెప్పాలి. హుస్సేన్ సాగర్‌లో మురికి నీటిని కొబ్బరినీరులా మార్చుతానంటూ కబుర్లు చెప్పేవారు. మూసి నదిని సుందరంగా తీర్చుదిద్దుతానని అనేవారు. కొంత ప్రయత్నం చేసి ఉండవచ్చు. కాని ఆచరణ సాద్యంకాని మాటలు చెప్పడం వల్ల వ్యంగ్య వ్యాఖ్యలకు అవకాశం ఇచ్చినట్లు అవుతుందే తప్ప ప్రయోజనం కలగదు. ఇప్పుడు అదే బాటలో రేవంత్ కూడా భారీ స్టేట్ మెంట్లు ఇస్తున్నారు. తన హయాంలో ఒక నగరం నిర్మించానని చెప్పుకోవాలని ఆయన ఉబలాటపడుతున్నారు. నిజానికి సిటీల నిర్మాణం ఎవరివల్లకాదు. అందులోను ప్రభుత్వాలు అసలు అలాంటి ప్రయత్నాలు చేయడం సరికాదు.
ఒక ప్రణాళికాబద్దమైన అభివృద్ధికి ప్లాన్ చేయాలి కాని, అన్నీ తామే నిర్మిస్తామని, దానిని రియల్ ఎస్టేట్ మోడల్‌లో తీసుకు వస్తామని అంటే ఎక్కువ సందర్భాలలో అది ఉపయోగపడలేదు. ఉదాహరణకు అమరావతి పేరుతో చంద్రబాబు నాయుడు రియల్ ఎస్టేట్ వెంచర్ తరహా అభివృద్దికి శ్రీకారం చుట్టి 2019లో దెబ్బతిన్నారు. ఇప్పుడు మళ్లీ అదే ప్రయత్నం చేస్తున్నట్లు కనబడుతుంది. ఏభై వేల ఎకరాల భూమిలో ప్రభుత్వపరంగా అభివృద్ది చేపట్టడం అంటే లక్షల కోట్ల వ్యవహారం అని చెప్పాలి. తాజాగా రేవంత్ రెడ్డి కూడా హైదరాబాద్‌ను న్యూయార్కు సిటీగా మార్చుతానని అంటున్నారు. ప్రత్యేకించి ప్యూచర్ స్టేట్ అనో, ఫ్యూచర్ సిటీ అనో చెప్పి నాలుగో నగరాన్ని నిర్మిస్తానని అంటున్నారు. కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం వృద్ది చేయడంలో బాగంగా అని ఉంటే పెద్దగా తప్పు లేదు. కాని తన ప్రభుత్వమే ఆ వ్యాపారం చేస్తుందని రియల్ ఎస్టేట్ రంగంలో దిగితే ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ అంత ప్రోత్సాహకరంగా లేదన్నది మార్కెట్ వర్గాల విశ్లేషణగా ఉంది. దానికి అనేక కారణాలు ఉన్నాయి. ఎన్నికలు, అంతర్జాతీయ మాంద్య పరిస్తితులు, ఐటి రంగంలో ఉపాది అవకాశాలు తగ్గడం వంటి కారణాలు ప్రభావం చూపుతున్నాయి. అయినప్పటికీ వాటిన్నిటిని అధిగమించే విదంగా రేవంత్ తన పెట్టుబడుల యాత్రను విజయవంతం చేయగలిగితే ఆయనకు మంచిపేరే వస్తుంది. ఇక మూసి మురుగునీటి నదిని శుద్ది చేస్తామని రేవంత్ కూడా అంటున్నారు. వేల కోట్ల రూపాయల విలువైన ఈ ప్రాజెక్టుల గురించి మరీ అతిగా ప్రచారం చేసుకుంటే, అది కొంత శాతం అయినా చేయలేకపోతే అవన్ని ఉత్తుత్తి కబుర్లుగా మిగిలిపోతాయి.
ఇక గతంలో ఎన్ఆర్ఐలను ఉద్దేశించి రేవంత్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రచారంలోకి వచ్చాయి. ఎన్ఆర్ఐ అంటే నాన్ రిలయబుల్ ఇండియన్స్ అని ఆయన పీసీసీ అధ్యక్షుడి హోదాలో వ్యాఖ్యలు చేశారు. అలాంటివారి పెట్టుబడులు కావాలని అమెరికా వరకు ఎందుకు వచ్చారని కొందరు ప్రశ్నిస్తున్నారు. మరో వైపు కేటీఆర్ తెలంగాణ నుంచి కొన్ని పరిశ్రమలు వెళ్లిపోతున్నాయని, దానికి కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించాలని అంటున్నారు. వాటిలో తొమ్మిదివేల కోట్ల రూపాయల వ్యయంతో పెట్టదలచిన అమరరాజా బాటరీస్ కూడా ఉందని ఆయన చెబుతున్నారు. అలాగే గుజరాత్‌కు ఒక కంపెనీ, చెన్నైకి మరో కంపెనీ తరలిపోయాయని ఆయన చెబుతున్నారు.
అది నిజమా? కాదా? దానికి కారణాలు ఏమిటి అన్నదానిపై రేవంత్ సర్కార్ విశ్లేషణ చేసుకుని వాటిలో నిజం ఉంటే దిద్దుబాటు చర్యలు చేపట్టాలి. లేకుంటే వచ్చే పెట్టుబడుల సంగతి ఎలా ఉన్నా, వెళ్ళే సంస్థల వల్ల తెలంగాణకు అప్రతిష్ట వస్తుంది. హైదరాబాద్ ఇప్పటికే ఐటి సెంటర్‌గా విలసిల్లుతోంది. ఇది కేంద్రీకృత విధానంలో కాకుండా, చుట్టూరా ఉన్న రెండో స్థాయి నగరాలకు వ్యాప్తి చేయగలిగితే అప్పుడు తెలంగాణ దశ-దిశ మారిపోతాయి. అది అంత తేలిక కాదు.
గతంలో కేటీఆర్ కూడా వరంగల్, ఖమ్మం వంటి చోట్ల ఐటీని అభివృద్ధి చేయాలని ప్రయత్నించారు. కాని అవి ఆశించిన ఫలితాలు ఇవ్వలేదని అంటారు. ఏది ఏమైనా రేవంత్ టూర్ కేవలం రియల్ ఎస్టేట్ టూర్‌గా కాకుండా, ఉపాది, ఉద్యోగ అవకాశాలు పెంచే పరిశ్రమల స్థాపన టూర్‌గా విజయవంతం అయితే అభినందించవచ్చు. ఈ టూర్ సఫలం అయిందా? లేదా? అన్నది తేలడానికి కొంత టైమ్ పడుతుంది.
– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment