
బొల్లారంలో క్లినిక్ సీజ్ చేసిన వైద్యారోగ్యశాఖ
గతంలో 28 క్లినిక్‌లు, 7 డయాగ్నస్టిక్ సెంటర్ల సీజ్
సాక్షి,సిటీబ్యూరో: అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ప్రైవేటు ఆసుపత్రులు, క్లినిక్‌లు, డయాగ్నస్టిక్ సెంటర్లపై వైద్యారోగ్యశాఖ దృష్టి సారిస్తోంది. నగర శివారులో జాతీయ సహా పలు రహదారుల ప్రాంతాల్లో పదుల సంఖ్యలో అనుమతులు లేని ప్రైవేట్ ఆసుపత్రులు వెలుస్తుండటంతో పాటు ఇష్టానుసారంగా రోగుల నుంచి ఫీజులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
సమాచారం లేకుండా నిర్వహణ..
ఆసుపత్రుల్లో బోర్డులు ఏర్పాటు చేసి ఫీజుల వివరాల పట్టికతో సహా డాక్టర్లు,సిబ్బంది,పడకల సంఖ్య వంటి సమాచారాన్ని పొందుపరచాల్సి ఉన్నప్పటికీ, వాటిని పట్టించుకోకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. వైద్యశాఖ పర్యవేక్షణ కొరవడటమే దీనికి కారణంగా తెలుస్తోంది.
ఒక అనుమతితో మూడు బ్రాంచ్‌లు..
ఒక ఆసుపత్రికి అనుమతి తీసుకుని రెండు, మూడు బ్రాంచ్‌లను నిర్వహిస్తున్నారు. ఎలాంటి పరిశీలన, విచారణ లేకుండానే వైద్యారోగ్యశాఖ అనుమతులు ఇస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. శివారు మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాలో వందల సంఖ్యలో క్లినిక్‌లు, ఆసుపత్రులు ఇలానే నిర్వహిస్తున్నట్లు సమాచారం.
అనవసరంగా వైద్య పరీక్షలు..
అవసరం లేకుండా ఇష్టానుసారంగా వైద్యపరీక్షలు చేస్తూ.. పేదల నుంచి అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారని విమర్శలున్నాయి. ప్రైవేటు డయాగ్నస్టిక్, అ్రల్టాసౌండ్ సెంటర్లపై ఇటీవల అధికార యంత్రాంగానికి ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలను పాటించని సెంటర్లపై చర్యలకు జిల్లా వైద్యారోగ్యశాఖ సిద్ధమవుతోంది.
బొల్లారంలో క్లినిక్ సీజ్..
తాజాగా శుక్రవారం క్లినికల్ ఎస్టాబ్లిష్మింట్ చట్టాన్ని ఉల్లంఘించిన భవానీ పోలీ క్లినిక్‌ను డీఎంహెచ్‌ఓ డాక్టరు ఉమాగౌరీ సిబ్బందితో కలిసి సీజ్ చేశారు. క్లినిక్ నిర్వాహకులు నకిలీ జనరల్ ఫిజీషియన్‌గా అవతారమెత్తి, హైడోస్ యాంటీబయాటిక్స్ రాయడం, ఐవీ ఇన్ఫ్యూషన్లు ఇవ్వడం వంటి అనుచిత వైద్యచర్యలు చేపడుతున్నట్టు సమాచారం. అర్హతలేని వ్యక్తులతో నడుస్తుందన్న ఫిర్యాదుతో డీఎంహెచ్‌ఓ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
నిబంధనలు ఇలా..
అలోపతి ప్రైవేటు మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్మింట్ చట్టం ప్రకారం ప్రైవేటు ఆసుపత్రులు, క్లినిక్‌లు, డయాగ్నస్టిక్ సెంటర్లు, కన్సల్టెంట్ క్లినిక్‌లు, ఆయుష్ క్లినిక్‌లు, పిజియోథెరఫీ కేంద్రాలు అన్నింటికీ అనుమతి తప్పనిసరి. డయాగ్నస్టిక్ కేంద్రాల నిర్వాహకులతో పాటు పనిచేసే వైద్యుల రిజి్రస్టేషన్ తప్పనిసరిగా ఉండాలి. అగ్నిమాపక, బయోవేస్ట్ మేనేజ్‌మెంట్, పొల్యూషన్, మున్సిపల్ ట్రేడ్ లైసెన్స్‌తో సహా అన్నిరకాల పత్రాలు సరిగ్గా ఉన్నప్పుడే ఆసుపత్రుల ఏర్పాటుకు అనుమతి ఇస్తారు.
ఫీజుల వసూళ్లపై...
ప్రైవేట్ ,కార్పోరేట్ ఆసుపత్రుల్లో ఇష్టానుసారంగా ఫీజుల వసూళ్లు మొదలుకుని వైద్య పరీక్షలు తదితర వాటిల్లో దోపిడీని పసిగట్టిన జిల్లా వైద్యారోగ్యశాఖ బోర్డులు ఏర్పాటు చేయాలని వాటికి సూచినలు చేస్తోంది.
అనుమతిలేనివి ఎక్కువే..
మేడ్చల్ జిల్లాలో 2,730 పైగా ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులు ఉండగా.. ఇందులో రిజిస్ట్రేషన్‌తో సహా వివిధ అనుమతితో కొనసాగుతున్నట్లు ఆసుపత్రులు 1755 మాత్రమే ఉన్నాయి. అనుమతి లేని ప్రైవేట్ ఆసుపత్రులు 975 ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ అంచనా వేస్తోంది. అనుమతులు ఉన్న ఆసుపత్రుల్లో 100 కంటే ఎక్కువ పడకలు(బెడ్స్) ఉన్న ప్రైవేట్ ఆస్పత్రులు 48 ఉండగా.. 20 నుంచి 100 పడకలు(బెడ్స్) ఉన్న ఆస్పత్రులు 317 ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ పేర్కొంటోంది. 20 పడకలు (బెడ్స్) ఉన్న ఆస్పత్రులు 294 ఉన్నాయి. 712 పాలీక్లినిక్‌లు, క్లినిక్‌లు, డయాగ్నస్టిక్ సెంటర్లు, 180 డెంటల్ ఆసుపత్రులు, 46 ఫిజియోథెరపీ సెంటర్లు, 08రిహాబిలిటేషన్ సెంటర్లు, అనుమతి పొందిన స్కానింగ్ సెంటర్లు 628 ఉన్నాయి. అనుమతి లేకుండా 400 వరకు స్కానింగ్ సెంటర్లు ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ అంచనా.
నిబంధనలు పాటించని వాటిపై చర్యలు
ప్రభుత్వ నిబంధనలు, ప్రమాణాలు పాటించని ప్రైవేట్ క్లినిక్‌లు, ప్రైవేట్ ఆసుపత్రులు, డయాగ్నస్టిక్ సెంటర్లపై నోటీసులు జారీచేసి,సీజ్ చేస్తాం.అధిక ఫీజుల వసూళ్లతో ప్రజల ఆరోగ్యంతో వ్యాపారం చేసే ప్రైవేట్ ఆసుపత్రుల నిర్వాహకులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. – డా.ఉమాగౌరీ, డీఎంహెచ్‌ఓ
Comments
Please login to add a commentAdd a comment