కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తున్న సంప్రదాయ ఓటింగ్ ధోరణి ఈసారి రూటు మార్చుకుంది. ముఖ్యంగా కులాల వారీ ఓటు బ్యాంకు తారుమారైంది. మూడు దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీకి దూరమై బీజేపీకి అండదండగా నిలుస్తూ వచ్చిన లింగాయత్‌లు మనసు మార్చుకున్నారు. ఓట్లపరంగా అత్యంత ప్రాబల్యమున్న సామాజిక వర్గమైన లింగాయత్‌లలో బాహుబలి నేత యడియూరప్పను పక్కన పెట్టినందుకు బీజేపీ భారీ మూల్యమే చెల్లించింది.
ఆ పార్టీకి దశాబ్దాలుగా పెట్టని కోటలా ఉంటూ వచ్చిన లింగాయత్‌లు ఆగ్రహించి దూరమయ్యారు. 1990లో లింగాయత్ నాయకుడైన నాటి ముఖ్యమంత్రి వీరేంద్ర పాటిల్‌ను కాంగ్రెస్ అధ్యక్షుడు రాజీవ్ గాంధీ అవమానకరంగా సీఎం పదవి నుంచి తప్పించడంతో ఆ పార్టీ లింగాయత్‌ల ఆగ్రహ జ్వాలలకు గురైంది. నెమ్మదిగా లింగాయత్ ఓటుబ్యాంకు బీజేపీకి మళ్లింది. 30 ఏళ్ల తర్వాత సరిగ్గా మళ్లీ అదే సీన్ రిపీటైంది. ఈసారి బీజేపీ వంతు వచ్చింది.
యడియూరప్పను సీఎం పదవి నుంచి తప్పించడమే గాక అభ్యర్థల ఎంపిక మొదలుకుని ప్రచారం దాకా పెద్దగా ప్రాధాన్యమివ్వని ప్రభావం ఫలితాల్లో స్పష్టంగా కనిపించింది. లింగాయత్‌లు, వొక్కలిగలు, ఎస్సీల్లో ఐదేసి శాతం మంది కాంగ్రెస్ వైపు మళ్లడంతో ఆ పార్టీ అనూహ్య విజయాన్ని సాధించగలిగింది. కేంద్ర ఎన్నికల సంఘం, సీ –ఓటరు వెల్లడించిన పార్టీలవారీ ఓట్లు, సీట్ల సరళిని పరిశీలిస్తే కులాల ఓటుబ్యాంకుల్లో మార్పు స్పష్టంగా తెలుస్తోంది...
వొక్కలిగలు: జేడీ(ఎస్)కు షాక్
జేడీ(ఎస్)కు అండగా ఉంటూ ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడను తమ పితగా కొలిచే వొక్కలిగలు కూడా షాకిచ్చే నిర్ణయాలే తీసుకున్నారు. దేవెగౌడ కుటుంబ పెత్తనంపై ఓటర్లలో ఓ రకమైన కసి కనిపించింది.
2018 ఎన్నికల్లో వొక్కలిగ ప్రాబల్యమున్న మొత్తం 51 స్థానాల్లో జేడీ(ఎస్) 23 గెలుచుకుంటే ఈసారి కేవలం 12 సీట్లకు పరిమితమవ్వాల్సి వచ్చింది. పీసీసీ డీకే శివకుమార్ వొక్కలిగ నేత కావడంతో వారికి ప్రత్యామ్నాయం కనిపించింది. కాంగ్రెస్ ఓల్డ్ మైసూర్ గ్రామీణ ప్రాంతంలో ఏకంగా 36 స్థానాల్లో విజయం సాధించింది. శివకుమార్ కనకపురలో లక్షా 20 ఓట్ల పైచిలుకు మెజార్టీతో గెలిచారంటేనే దేవెగౌడ గుప్పిట్లోంచి వొక్కలిగలు జారిపోతున్నట్టేనని భావిస్తున్నారు.
లింగాయత్‌లు: బీజేపీకి షాక్
లింగాయత్‌లు బీజేపీకి దూరం కావడం ఇది తొలిసారేం కాదు. బీజేపీ యడియూరప్పను దూరం పెట్టినప్పుడు ఆయన బీజేపీకి గుడ్‌బై కొట్టి 2012లో కర్ణాటక జనతా పక్ష పేరుతో వేరు కుంపటి పెట్టారు. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి చేతుల కాలాయి. అప్పుడే ఆ పార్టీకి యడియూ రప్ప, లింగాయత్‌ల ఓట్ల ప్రాధాన్యం ఏమిటో తెలిసింది. ఆ తర్వాత యడియూరప్పను అక్కున చేర్చుకున్నప్పటికీ, మళ్లీ తాజాగా ఎన్నికల ముందు యడియూరప్పను సీఎం పదవి నుంచి తప్పించి అదే తప్పు చేసింది. 2018 ఎన్నికల్లో లింగాయత్ ప్రాబల్యం ఉన్న స్థానాల్లో 41.8% ఓటు షేర్ బీజేపీకి వస్తే, ఈసారి కాస్త స్వల్పంగా 39.5 శాతానికి తగ్గింది. కానీ సీట్లు మాత్రం ఏకంగా 20 స్థానాలను కోల్పోవలసి వచ్చింది. జేడీ(ఎస్)కు వచ్చిన ఓట్ల శాతంలో పెద్దగా మార్పు లేదు. కాంగ్రెస్‌కు ఓట్లు 5 శాతమే పెరిగినా సీట్లు మాత్రం రెట్టింపు పెరిగాయి.
చెయ్యెత్తి జై కొట్టిన ఎస్సీలు
ఈసారి కాంగ్రెస్ పార్టీ విజయంలో ఎస్సీలు అత్యంత కీలకంగా వ్యవహరించారు. ఎస్సీ ప్రాబల్య అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ గత ఎన్నికలతో పోల్చి చూస్తే అదనంగా 5.5శాతం ఓట్లు, 10 సీట్లు సంపాదించింది. దళిత నాయకుడు మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేపట్టడం ఈసారి ఆ పార్టీకి బాగా కలిసొచ్చింది. సాధారణంగా దళితులు ఏ ఒక్క పార్టీ వైపు ఉండరు. కానీ ఈసారి ఖర్గే దళిత బ్యాంకుపై ప్రత్యేకంగా దృష్టి సారించి 40 ర్యాలీల్లో పాల్గొనడంతో ఎస్సీ ప్రాబల్య స్థానాల్లో సగానికి పైగా కాంగ్రెస్ ఖాతాలో పడ్డాయి. మొత్తమ్మీద కేవలం ఐదు శాతం ఓట్ల తేడాతోనే ఫలితాల్లో భారీగా మార్పులు కనిపించడమే మన ప్రజాస్వామ్యంలో వైచిత్రిగా ఎన్నికల విశ్లేషకులు అభివర్ణిస్తూ ఉంటారు.
సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment