కర్ణాటక రాజకీయాలతో లింగాయత్‌లది విడదీయ లేని బంధం. వారు ఎన్నికల్లో గెలుపోటముల్ని శాసించే శక్తిసామర్థ్యాలున్న సామాజిక వర్గం. ఒకప్పుడు కాంగ్రెస్‌కు గట్టి మద్దతుదారులైన లింగాయత్‌లు కొన్ని దశాబ్దాలుగా బీజేపీకి అండగా నిలుస్తున్నారు. అయితే ఆ సామాజికవర్గానికి చెందిన బలమైన నాయకుడు యడియూరప్పను సీఎం పదవి నుంచి బీజేపీ తప్పించడంతో లింగాయత్ మఠాధిపతుల్లో అసహనం మొదలైంది. అది ఎలా పరిణమిస్తుంది? లింగాయత్‌ల ఓట్ల కోసం బీజేపీ, కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయి...?
ఉత్తర కర్ణాటకలో లింగాయత్‌ల ప్రాబల్యం ఎక్కువ. రాష్ట్ర జనాభాలో 17% ఉన్న వీరు కీలక ఓటుబ్యాంకు. ఒకప్పుడు కాంగ్రెస్‌కు పెట్టని కోట అయిన లింగాయత్‌లు 1990 తర్వాత బీజేపీ వైపు మళ్లారు. వీరి ఓటుబ్యాంకునే నమ్ముకున్న బీజేపీ ఇతర సామాజిక వర్గాల కోసం పెద్దగా చేస్తున్నదేమీ లేదు. తాజాగా ముస్లింల 4% రిజర్వేషన్లను తొలగించి లింగాయత్, వక్కలిగలకు చెరో 2% కట్టబెట్టింది కూడా. అయితే బలమైన లింగాయత్ నాయకుడు యడియూరప్పను సీఎం పదవి నుంచి తొలగించినప్పటి నుంచీ ఆ వర్గంలో నెలకొన్న అసంతృప్తి అంతా ఇంతా కాదు. సీఎం బసవరాజ్ బొమ్మై లింగాయతే అయినా తమ అభిమాన నాయ కున్ని అవమానకరంగా తొలగించారన్నది వారి ఆగ్రహం.
కాంగ్రెస్ వ్యూహరచన
ఒకప్పుడు తమ కీలక ఓటుబ్యాంకు అయిన లింగాయత్‌లను మరోసారి అక్కున చేర్చుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. యడియూరప్ప విషయమై వారిలో నెలకొన్న అసంతృప్తిని అనుకూలంగా మార్చుకునే పనిలో పడింది. లింగాయత్‌లకు అత్యధిక టికెట్లు ఇవ్వడానికి కసరత్తు చేస్తోంది. ఇప్పటిదాకా ప్రకటించిన 166 మంది అభ్యర్థుల్లో 43 మంది లింగాయత్ సమాజికవర్గానికి చెందినవారే! 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు నాటి కాంగ్రెస్ సీఎం సిద్దరామయ్య ప్రభుత్వ కార్యాలయాల్లో లింగాయత్‌ల గురువు బసవేశ్వర చిత్రపటాన్ని ఉంచాలని ఆదేశించారు. తమను మతపరమైన మైనారిటీలుగా గుర్తించాలన్న లింగాయత్‌ల డిమాండ్‌ను కూడా కాంగ్రెస్ తలకెత్తుకుంది. తాను రాష్ట్రంలో అధికారంలో ఉండగా ఈ మేరకు కేంద్రానికి సిఫార్సు కూడా చేసింది. దీనిపై కేంద్రం మౌనాన్ని కూడా ప్రచారాస్త్రంగా చేసుకుంటోంది.
అలా బీజేపీ ఓటుబ్యాంకుగా...
లింగాయత్‌లు కాంగ్రెస్ వెన్నంటి ఉన్న రోజుల్లో ఆ పార్టీ బంపర్ మెజారిటీలు కళ్లజూసింది. 1990లో లింగాయత్ నేత వీరేంద్ర పాటిల్ నేతృత్వంలో కాంగ్రెస్ 224 స్థానాలకు గాను ఏకంగా 179 చోట్ల గెలిచింది! కానీ తర్వాత కాంగ్రెస్‌లో చీలికలు, బీజేపీ ఎదుగుదల తదితర కారణాలతో లింగాయత్‌లు బీజేపీ వైపు మళ్లారు. ముఖ్యంగా కర్ణాటకలో మత ఘర్షణల వేళ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజీవ్ గాంధీ రాష్ట్ర సీఎం వీరేంద్ర పాటిల్‌ను తప్పించడాన్ని చారిత్రక తప్పిదంగా చెబుతారు. అప్పట్నుంచి లింగాయత్‌లు కాంగ్రెస్‌కు బాగా దూరమయ్యారు. ఆ దెబ్బకు 1994 ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం 36 స్థానాలకు పరిమితమైంది!
లింగాయత్‌ల రాజకీయ ప్రాబల్యానికి ఇది తార్కాణమంటారు. ఇక బీజేపీలో యడియూరప్ప ఎదుగుదలతో లింగాయత్‌లు పూర్తిగా ఆ పార్టీవైపు మళ్లారు. అయితే అవినీతి ఆరోపణలతో యడ్డీని బీజేపీ బహిష్కరించడంతో ఆయన కర్ణాటక జనతా పార్టీ (కేజేపీ) పేరుతో వేరుకుంపటి పెట్టుకున్నారు. దాంతో 2013 ఎన్నికల్లో లింగాయత్ ఓట్లు భారీగా చీలి బీజేపీ 40 సీట్లకు పరిమితమైంది. కేజీపీ కూడా పెద్దగా సత్తా చాటలేదు. తర్వాత యడియూరప్ప తిరిగి బీజేపీ గూటికి చేరారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో మోదీ చరిష్మా కూడా కలిసొచ్చి 28 ఎంపీ స్థానాల్లో బీజేపీ 17 గెలుపొందింది.
స్వాతంత్య్రోద్యమంలోనూ...
12వ శతాబ్దంలో సంఘ సంస్కర్త బసవేశ్వర లింగాయత్‌లకు నిర్దిష్ట జీవన విధానాన్ని ఏర్పాటు చేశారు. వీరు వీరశైవుల నుంచి దూరమై వేదాలను, కుల వ్యవస్థను వ్యతిరేకించేవారు. దేవాలయాలకు వెళ్లడం, బహుదేవతారాధన మాని ప్రగతిశీల భావాలు అలవర్చుకున్నారు. స్త్రీ పురుషులు సమానమని నమ్ముతారు. లింగాయత్‌లలో మహిళలకు ప్రత్యేక హక్కులున్నాయి. వారికి పెళ్లి చేసుకోకున్నా, భర్తను కోల్పోయినా పిల్లల్ని దత్తత చేసుకునే స్వేచ్ఛ ఉంది. స్వాతంత్య్ర సంగ్రామంలోనూ లింగాయత్‌లది చురుకైన పాత్ర. ప్రస్తుతం వీరశైవులు, లింగాయత్‌లు దాదాపుగా కలిసిపోయారు.
లింగాయత్ మఠాల ప్రాధాన్యం...
కర్ణాటకలో 500కు పైగా లింగాయత్ మఠాలున్నాయి. వీటి చుట్టూనే రాజకీయాలు నడుస్తూ ఉంటాయి. లింగాయత్ ఉపకులాలూ కీలకమే. వీరు మఠాధిపతులు గీచిన గీత దాటరు. లింగాయత్‌లు అత్యధికంగా ఉన్న ఉత్తర కర్ణాటకలోని 22 జిల్లాల్లో బాగా పట్టున్న అఖిల భారత వీరశైవ మహాసభ రాష్ట్ర రాజకీయాల్లో బాగా చురుగ్గా ఉంది. బొమ్మై కూడా లింగాయతే అయినా ఈ మఠాల మద్దతు యడియూరప్పకే! ఆయన్ను సీఎంగా తప్పించినప్పటి నుంచీ మఠాధిపతులు గుర్రుగా ఉన్నారు. పర్యవసానం అనుభవిస్తారంటూ బీజేపీకి వారు బహిరంగంగానే హెచ్చరికలు జారీ చేశారు. దాంతో ఈసారి ఎన్నికల్లో గట్టెక్కించే బాధ్యతను బీజేపీ యడ్డీ భుజస్కంధాలపైనే ఉంచింది. దాంతో ఆయన మఠాధిపతుల్ని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు.
లింగాయత్‌ల జనాభా: 1.5 కోట్లు
రాష్ట్ర జనాభాలో శాతం: 17%
ప్రభావం చూపించే స్థానాలు: 100-120
ప్రస్తుత అసెంబ్లీలో లింగాయత్ ఎమ్మెల్యేలు: 54 (బీజేపీ 37)
1952 నుంచి లింగాయత్ సీఎంలు: 10
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment