సాక్షి,బెంగళూరు: సెంట్రల్ కర్ణాటకలో గత కొన్ని దశాబ్దాలుగా బీజేపీయే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారింది. లింగాయత్‌ల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో బీజేపీ హవా నడుస్తూ వస్తోంది. బీజేపీతో విభేదాలతో ఆ పార్టీ దిగ్గజ నాయకుడు యడియూరప్ప కర్ణాటక జనతా పార్టీ పేరుతో వేరు కుంపటి పెట్టి ఎన్నికల బరిలో దిగిన 2013లో మినహాయిస్తే మిగిలిన ఎన్నికల్లో బీజేపీదే పై చేయి.
దావణగెరె, శివమొగ్గ, చిత్రదుర్గ, తుమకూరు జిల్లాలతో కూడిన ఈ ప్రాంతంలో లింగాయత్‌లతో పాటు ఎస్‌సీ, ఎస్టీ జనాభా ఎక్కువే. మొత్తం 32 స్థానాల్లో 8 సీట్లు ఎస్‌సీ, ఎస్టీకి రిజర్వ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఈ సారి లింగా యత్‌లతో పాటు ఎస్‌సీ, ఎస్టీ ఓట్లు తమకేనని అందుకే ఈ సారి ఈ ప్రాంతంలో తమ పార్టీ దూసుకు పోతుందన్న అంచనాలతో ఉంది. మలేనాడు, మధ్య కర్ణాటక జిల్లాల నుంచి రాష్ట్రానికి ఇప్పటికి ఐదు మంది ముఖ్యమంత్రులు వచ్చారు.
దీంతో కర్ణాటక లోని ఈ ప్రాంతంపై ఆయా రాజకీయ పార్టీలు ప్రత్యేక దృష్టి సారించాయి. అయిదుగురు మాజీ ముఖ్యమంత్రుల్లో కడిదాళ్ మంజప్ప, ఎస్.బంగారప్ప, జేహెచ్ పటేల్, బీఎస్ యడియూరప్ప వంటి నేతలు అవిభజతి శివమొగ్గ జిల్లాకు చెందిన వారు. ఇంతటి ప్రాశస్త్యం ఉన్న ఈ ప్రాంతంపై పట్టుకు బీజేపీ,కాంగ్రెస్ శ్రమిస్తున్నాయి. కేవలం తుముకూరు జిల్లాలో మాత్రమే పట్టు ఉన్న జేడీ(ఎస్) ఈ సారి అన్ని జిల్లాలకు విస్తరించడానికి వ్యూహాలు పన్నుతోంది.
అవకాశాలను అందిపుచ్చుకున్న బీజేపీ..
గతంలో కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న ఈ ప్రాంతం కాల క్రమేణ బీజేపీ వశం అయింది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో కాంగ్రెస్, బీజేపీకి మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. 2004 నుంచి హిందూ ఓట్లను క్రోడికరించడంలో బీజేపీ సఫలీకృతమైంది. అప్పటి నుంచి నెమ్మదిగా పుంజుకుంటూ మధ్య కర్ణాటకలో తిరుగులేని శక్తిగా ఎదిగింది. బీజేపీకి కీలక ఓటు బ్యాంకుగా ఉన్న లింగాయత్‌లు శివమొగ్గ, దావణగెరె జిల్లాల్లో అధిక సంఖ్యలో ఉండడం అధికార పార్టీకి కలసి వచ్చింది.
సీట్లను పెంచుకునే వ్యూహంలో కాంగ్రెస్
స్థానికంగా ఉన్న సమస్యల్ని ఎత్తి చూపుతూ కాంగ్రెస్ పార్టీ తనకు అను కూలంగా ప్రచారంలో మలుచుకుంటోంది. ఎక్కడిక్కడే హామీలు గుప్పిస్తూ ఈ సారి మధ్య కర్ణాటకలో అత్యధిక స్థానాలను దక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది. గత ఏడాది కాంగ్రెస్ సీనియర్ నేత సిద్దరామయ్య 75వ పుట్టిన రోజు వేడుకల్ని దావణగెరెలో భారీగా నిర్వహించి ఎన్నికల సమరశంఖాన్ని పూరించింది. మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా సెంట్రల్ కర్ణాటకలో అత్యధికంగా ర్యాలీలు నిర్వహిస్తూ వస్తున్నారు. జేడీ(ఎస్) తుముకూరు ఓటు బ్యాంకును కాపాడుకోవడానికి పంచరత్న యాత్రని వినియోగించుకున్నారు. మొత్తమ్మీద సెంట్రల్ ఓటరు ఎవరిని కరుణిస్తారో వేచి చూడాలి.
స్థానిక అంశాలపై బీజేపీ దృష్టి
లింగాయత్ ఓట్లతో పాటుగా స్థానిక సమస్యల పరిష్కారంపై బీజేపీ దృష్టి సారించింది. శివమొగ్గ జిల్లాలో బగర్‌హుకుం భూ స్వాధీనం, శరావతి ప్రాజెక్టు పునరావాసం, విశ్వేశ్వరయ్య ఐరన్ అండ్ స్టీల్ కర్మాగారం మూసివేత వంటి సమస్యలు బీజేపీకి తలనొప్పిగా మారాయి. చిక్కమగళూరు జిల్లాలో వర్షాల వల్ల కాఫీ సాగుదారులు తీవ్రంగా నష్టపో యారు. భద్రా ఎత్తిపోతల ప్రాజెక్టు చిత్రదుర్గ జిల్లాలో ఎన్నికల్లో కీలకాంశంగా మారింది. కేంద్రం ఈ ప్రాజెక్టు కోసం బడ్జెట్‌లో రూ. 5,300 కోట్లు ప్యాకేజీ ప్రకటించింది. ఈ అంశం బీజేపీకి అనుకూ లంగా మారింది. ఇక ధరాభారం, రాష్ట్ర ప్రభుత్వ అవినీతి కూడా ఎన్నికల్లో ప్రభావం చూపనుంది. ఎస్సీ వర్గీకరణపై బీజేపీ ఇంకా ఎటూ తేల్చకపోవడంతో ఈ వర్గం వారు అధికార పార్టీపై గుర్రుగా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment