Center of Attraction
-
మేళాలో ప్రత్యేక ఆకర్షణ... నాగ సాధువులు
వాళ్లు బంధాలు, అనుబంధాలుండవు. సర్వం త్యజించిన సన్యాసులు. చలికాలమైనా, ఎండాకాలమైనా దిగంబరంగానే ఉంటారు. ఒళ్లంతా విభూది ధరిస్తారు. జనవాసాలకు దూరంగా సాధనే ప్రపంచంగా గడుపుతారు. కుంభమేళా సమయంలో మాత్రమే జన సామాన్యానికి కనిపిస్తారు. వాళ్లే నాగసాధువులు. కుంభమేళాకు శ్రీకారం చుట్టేది వాళ్లే. ఈసారి కూడా మేళాలో వారే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. మొహెంజోదారో కాలం నుంచీ నాగాల ఉనికికి సంబంధించిన ఆధారాలున్నాయి. అవసరమైనప్పుడు ఆలయాలను, సనాతన సంప్రదాయాలను అన్య మతస్తుల దాడులు తదితరాల నుంచి వీరు కాపాడినట్టుగా చరిత్ర చెబుతోంది. ఆయుధాల వాడకంలోనూ వీళ్లు దిట్ట. అందుకే వీరిని హిందూ ధర్మానికి కమాండర్లుగానూ అభివర్ణిస్తుంటారు. వీరి ప్రాముఖ్యత అనాది కాలం నుంచీ కొనసాగుతూ వస్తోంది. హిమాలయాల్లో ఉంటారంటారు. కుంభమేళా సమయంలో ప్రయాగ్‌రాజ్‌కు వచ్చి పవిత్ర స్నానాలు చేస్తారు. తద్వారా పుణ్య జలాలకు మరింత పవిత్రత వస్తుందన్నది విశ్వాసం. అందుకే మేళాలో తొలి రాజ (షాహీ) స్నానం వీరితోనే చేయించి గౌరవిస్తారు. కుంభమేళా కోసం.. → ప్రయాగ్‌రాజ్‌లో 92 రహదారులు నిర్మించారు → 17 ప్రధాన రోడ్లను సుందరీకరించారు → 30 బల్లకట్టు వంతెనలు కట్టారు → భిన్న భాషల్లో 800 దారిసూచికలు ఏర్పాటుచేశారు → తొలిసారిగా అండర్‌వాటర్ డ్రోన్లను రంగంలోకి దింపారు. ఇవి 100 మీటర్ల లోతుకు సైతం వెళ్లి గాలిస్తాయి. అలాగే 120 మీటర్ల ఎత్తులోనూ గస్తీ కాయనున్నాయి. → రోజూ వేలాది భక్తులకు కంటి పరీక్షలకు 10 ఎకరాల్లో 11 భారీ గుడారాల్లో నేత్ర కుంభ్‌ను నెలకొల్పారు. → భద్రతకు ఏడంచెల కట్టుదిట్టమైన వ్యవస్థ ఏర్పాటు చేశారు. → భక్తుల కోసం దేశ నలుమూలల నుంచి 13,000 ప్రత్యేక రైళ్లు ఏర్పాటయ్యాయి. → తప్పిపోయిన వారికోసం ‘ఖోయా–పాయా’ కేంద్రాలు ఏర్పాటు చేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
US Presidential Elections 2024: నువ్వా X నేనా?
నిక్కీ హేలీ, వివేక్ రామస్వామి ఇద్దరూ ఇద్దరే. భారత సంతతికి చెందిన వారే. రిపబ్లికన్ల అమెరికా అధ్యక్ష అభ్యర్థుల తొలి చర్చలో వారిద్దరే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఉక్రెయిన్ యుద్ధ్దంపై మాటల తూటాలు విసురుకున్నారు. చివరికి వివేక్ రామస్వామి పైచేయి సాధించారు. ట్రంప్‌కు గట్టి పోటీ ఇస్తారని అంచనాలున్న రాన్ డిసాంటిస్‌ను పక్కకు పెట్టి మరీ రామస్వామి ముందుకు దూసుకుపోతున్నారు. ► రిపబ్లికన్ పార్టీ అమెరికా అధ్యక్ష అభ్యర్థుల మధ్య జరిగిన తొలి చర్చ వాడీగా వేడిగా సాగింది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ చర్చకు దూరంగా ఉండడంతో ఇద్దరే ఇద్దరు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. వారిద్దరూ భారత సంతతికి చెందిన అభ్యర్థులే. దక్షిణ కరోలినా మాజీ గవర్నర్ నిక్కీ హేలీ, మల్టీ మిలియనీర్ వివేక్ రామస్వామి మధ్య ఉక్రెయిన్ యుద్ధంపై చర్చ మరో మలుపు తీసుకుంది. అమెరికా చరిత్రలో ఇద్దరు భారతీయులు ఒకే వేదికను పంచుకొని ఈ తరహాలో చర్చించుకోవడం ముందెన్నడూ జరగలేదు. ఇద్దరికి ఇద్దరు ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా ఒకానొక దశలో వేలి చూపిస్తూ బెదిరించుకున్నారు. ఒకరిపై మరొకరు 30 సెకండ్లపాటు అరుచుకున్నారు. విదేశీ వ్యవహారాల్లో వివేక్ రామస్వామికి అవగాహన లేదని, రష్యా, ఉక్రెయిన్ యుద్ధం అంశంలో ఆయన పుతిన్‌కు మద్దతుగా వ్యవహరిస్తున్నారంటూ నిక్కీ హేలీ గట్టి ఆరోపణలే చేశారు. అమెరికా శత్రువులకి కొమ్ముకాస్తూ, దేశ మిత్రులకు దూరంగా వెళుతున్నారని వివేక్‌ను దుయ్యబట్టారు. పుతిన్ ఒక హంతకుడని అతనికి మద్దతుగా మాట్లాడేవారు ఈ దేశానికి అధ్యక్షుడైతే భద్రత గాల్లో దీపంలా మారుతుందంటూ హేలీ మండిపడ్డారు. హేలీ మాట్లాడుతున్నంత సేపు వివేక్ రామస్వామి ఆమెని అడ్డుకుంటూనే ఉన్నారు. హేలీ చెబుతున్నవన్నీ అబద్ధాలని , తనపై నోటికొచి్చనట్టు మాట్లాడుతున్నారంటూ ఎదురు దాడికి దిగారు. అమెరికా భద్రతే ముఖ్యం.. ► ఉక్రెయిన్‌కు మరింత సాయానికి తాను వ్యతిరేకిస్తానని వివేక్ రామస్వామి ఈ చర్చలో కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. అమెరికాకు ఉక్రెయిన్ ప్రధానం కాదని, వారికి చేసే మిలటరీ సాయాన్ని తమ దేశ సరిహద్దుల్లో మోహరిస్తే దేశ భద్రత మరింత పటిష్టమవుతుందని వివేక్ రామస్వామి పేర్కొన్నారు. రక్షణ రంగానికి చెందిన కాంట్రాక్టర్ల ఒత్తిడితోనే నిక్కీ ఉక్రెయిన్‌కు మద్దతుగా ఉన్నారంటూ ధ్వజమెత్తారు. ఈ చర్చలో నిక్కీ హేలీపై వివేక్ రామస్వామి పై చేయి సాధించారు. అమెరికాకు ఎప్పుడైనా తన దేశ భద్రతే ముఖ్యం తప్ప, ఉక్రెయిన్‌కు సాయం చేయడం కాదంటూ గట్టిగా వాదించారు. రాజకీయ అనుభవం లేకపోవడంతో మొదట్లో అంతగా గుర్తింపు లేని వివేక్ రామస్వామి తాను నమ్మిన సిద్ధాంతాలను ఆక ట్టుకునేలా చెప్పడం ద్వారా మద్దతు పెంచుకుంటున్నారు. అధ్యక్ష అభ్యర్థి రేసులో ముందున్న డొనాల్డ్ ట్రంప్‌కు గట్టి పోటీగా ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్ పేరు వినిపించేది. మొదటి చర్చలో రాన్ ఎంత మాత్రం ప్రభా వితం చూపించలేకపోయారు. ఇప్పుడు ఆయనను దాటుకొని మరీ వివేక్ రామస్వామి దూసుకుపోతున్నారు. తొలి చర్చలో వివేక్‌రామస్వామి విజేతగా నిలిచారంటూ వివిధ పోల్స్ వెల్లడిస్తున్నాయి. సెపె్టంబర్ 22న జరిగే రెండో చర్చలో వివేక్ రామస్వామి ఏంమాట్లాడతారన్న ఉత్కంఠ రేపుతోంది. ఎవరీ వివేక్ రామస్వామి ? కేరళ నుంచి అమెరికాకు వలస వెళ్లిన భారతీయ దంపతులకు ఒహియోలోని సిన్సినాటిలో 1985, ఆగస్టు9న వివేక్ రామస్వామి జని్మంచారు. సంప్రదాయ హిందూ కుటుంబంలో పుట్టి పెరిగారు. తండ్రి ఎలక్ట్రిక్ ఇంజనీరు. తల్లి మానసిక వైద్యురాలు. యేల్, హార్వర్డ్ విశ్వవిద్యాలయాల్లో రామస్వామి చదువుకున్నారు. పాఠశాలలో విద్యనభ్యసించేటప్పుడు జూనియర్ టెన్నిస్ క్రీడాకారుడిగా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. యువకుడిగా ఉన్నప్పుడు తీరిక సమయాల్లో అల్జీమర్స్ రోగుల వద్ద పియానో వాయించేవారు. కాలేజీలో చదువుకున్నప్పుడు స్టూడెంట్ బిజినెసెస్.డాట్‌కామ్ సహవ్యవస్థాపకుడిగా ఉంటూ వ్యాపార రంగంలో అడుగు పెట్టారు. 2007 నుంచి 2014 వరకు క్యూవీటీ ఫైనాన్సెస్ సంస్థలో పని చేశారు. 2014లో సొంతంగా బయోటెక్ కంపెనీ రాయివాంట్ సైన్సెస్‌ను ఏర్పాటు చేశారు. అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మిని్రస్టేషన్ (ఊఈఅ) ఆమోదం పొందిన ఐదు ఔషధాలను అభివృద్ధి చేశారు. 10 మంది ఉద్యోగులతో ప్రారంభమైన ఈ సంస్థ 2017 నాటికి 110 కోట్ల డాలర్ల వ్యాపారం చేసే సంస్థగా ఎదిగింది. అమెరికాలో 40 ఏళ్లకు తక్కువ వయసున్న అత్యంత ధనికుడైన ఎంటర్ ప్రెన్యూర్‌గా ఫోర్బ్స్ జాబితాలోకెక్కారు. వివేక్ రామస్వామి ఆస్తుల విలువ 63 కోట్ల డాలర్లు ఉంటుందని అంచనా. తన క్లాస్మేట్ అయిన అపూర్వ తివారీని 2015లో పెళ్లాడిన వివేక్ రామస్వామికి కార్తీక్, అర్జున్ అనే ఇద్దరు అబ్బాయిలున్నారు. పుస్తక రచన, రాజకీయాలపై ఆసక్తితో రాయివాంట్ సంస్థ సీఈవో పదవి నుంచి 2021లో ఆయన తప్పుకున్నారు. ‘వోక్, ఇంక్: ఇన్సైడ్ కార్పొరేట్ అమెరికాస్ సోషల్ జస్టిస్ స్కామ్’అనే పుస్తకాన్ని రచించారు. ఎన్నో పత్రికల్లో వ్యాసాలు రాశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 21న అధ్యక్ష అభ్యరి్థగా నామినేషన్ వేశారు. సాంస్కృతిక ఉద్యమంతో కొత్త అమెరికా కల సాకారమవుతుందని రామస్వామి నినదిస్తున్నారు. ఇప్పటికే ఎలన్‌మస్క్ వంటి పారిశ్రామికవేత్తలు రామస్వామికి బహిరంగంగా మద్దతు పలుకుతూ ఉండడం, ట్రంప్ చుట్టూ కేసుల ఉచ్చు బిగుస్తూ ఉండడంతో వివేక్ రామస్వామి వైపు రిపబ్లికన్లు తిరుగుతారా అన్న చర్చ మొదలు కావడం విశేషం. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Karnataka assembly elections 2023: కర్ణాటక ‘సెంట్రల్’ ఎవరివైపు..!
సాక్షి,బెంగళూరు: సెంట్రల్ కర్ణాటకలో గత కొన్ని దశాబ్దాలుగా బీజేపీయే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారింది. లింగాయత్‌ల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో బీజేపీ హవా నడుస్తూ వస్తోంది. బీజేపీతో విభేదాలతో ఆ పార్టీ దిగ్గజ నాయకుడు యడియూరప్ప కర్ణాటక జనతా పార్టీ పేరుతో వేరు కుంపటి పెట్టి ఎన్నికల బరిలో దిగిన 2013లో మినహాయిస్తే మిగిలిన ఎన్నికల్లో బీజేపీదే పై చేయి. దావణగెరె, శివమొగ్గ, చిత్రదుర్గ, తుమకూరు జిల్లాలతో కూడిన ఈ ప్రాంతంలో లింగాయత్‌లతో పాటు ఎస్సీ, ఎస్టీ జనాభా ఎక్కువే. మొత్తం 32 స్థానాల్లో 8 సీట్లు ఎస్సీ, ఎస్టీకి రిజర్వ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఈ సారి లింగా యత్లతో పాటు ఎస్సీ, ఎస్టీ ఓట్లు తమకేనని అందుకే ఈ సారి ఈ ప్రాంతంలో తమ పార్టీ దూసుకు పోతుందన్న అంచనాలతో ఉంది. మలేనాడు, మధ్య కర్ణాటక జిల్లాల నుంచి రాష్ట్రానికి ఇప్పటికి ఐదు మంది ముఖ్యమంత్రులు వచ్చారు. దీంతో కర్ణాటక లోని ఈ ప్రాంతంపై ఆయా రాజకీయ పార్టీలు ప్రత్యేక దృష్టి సారించాయి. అయిదుగురు మాజీ ముఖ్యమంత్రుల్లో కడిదాళ్ మంజప్ప, ఎస్.బంగారప్ప, జేహెచ్ పటేల్, బీఎస్ యడియూరప్ప వంటి నేతలు అవిభజతి శివమొగ్గ జిల్లాకు చెందిన వారు. ఇంతటి ప్రాశస్త్యం ఉన్న ఈ ప్రాంతంపై పట్టుకు బీజేపీ,కాంగ్రెస్ శ్రమిస్తున్నాయి. కేవలం తుముకూరు జిల్లాలో మాత్రమే పట్టు ఉన్న జేడీ(ఎస్) ఈ సారి అన్ని జిల్లాలకు విస్తరించడానికి వ్యూహాలు పన్నుతోంది. అవకాశాలను అందిపుచ్చుకున్న బీజేపీ.. గతంలో కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న ఈ ప్రాంతం కాల క్రమేణ బీజేపీ వశం అయింది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో కాంగ్రెస్, బీజేపీకి మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. 2004 నుంచి హిందూ ఓట్లను క్రోడికరించడంలో బీజేపీ సఫలీకృతమైంది. అప్పటి నుంచి నెమ్మదిగా పుంజుకుంటూ మధ్య కర్ణాటకలో తిరుగులేని శక్తిగా ఎదిగింది. బీజేపీకి కీలక ఓటు బ్యాంకుగా ఉన్న లింగాయత్‌లు శివమొగ్గ, దావణగెరె జిల్లాల్లో అధిక సంఖ్యలో ఉండడం అధికార పార్టీకి కలసి వచ్చింది. సీట్లను పెంచుకునే వ్యూహంలో కాంగ్రెస్ స్థానికంగా ఉన్న సమస్యల్ని ఎత్తి చూపుతూ కాంగ్రెస్ పార్టీ తనకు అను కూలంగా ప్రచారంలో మలుచుకుంటోంది. ఎక్కడిక్కడే హామీలు గుప్పిస్తూ ఈ సారి మధ్య కర్ణాటకలో అత్యధిక స్థానాలను దక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది. గత ఏడాది కాంగ్రెస్ సీనియర్ నేత సిద్దరామయ్య 75వ పుట్టిన రోజు వేడుకల్ని దావణగెరెలో భారీగా నిర్వహించి ఎన్నికల సమరశంఖాన్ని పూరించింది. మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా సెంట్రల్ కర్ణాటకలో అత్యధికంగా ర్యాలీలు నిర్వహిస్తూ వస్తున్నారు. జేడీ(ఎస్) తుముకూరు ఓటు బ్యాంకును కాపాడుకోవడానికి పంచరత్న యాత్రని వినియోగించుకున్నారు. మొత్తమ్మీద సెంట్రల్ ఓటరు ఎవరిని కరుణిస్తారో వేచి చూడాలి. స్థానిక అంశాలపై బీజేపీ దృష్టి లింగాయత్ ఓట్లతో పాటుగా స్థానిక సమస్యల పరిష్కారంపై బీజేపీ దృష్టి సారించింది. శివమొగ్గ జిల్లాలో బగర్‌హుకుం భూ స్వాధీనం, శరావతి ప్రాజెక్టు పునరావాసం, విశ్వేశ్వరయ్య ఐరన్ అండ్ స్టీల్ కర్మాగారం మూసివేత వంటి సమస్యలు బీజేపీకి తలనొప్పిగా మారాయి. చిక్కమగళూరు జిల్లాలో వర్షాల వల్ల కాఫీ సాగుదారులు తీవ్రంగా నష్టపో యారు. భద్రా ఎత్తిపోతల ప్రాజెక్టు చిత్రదుర్గ జిల్లాలో ఎన్నికల్లో కీలకాంశంగా మారింది. కేంద్రం ఈ ప్రాజెక్టు కోసం బడ్జెట్లో రూ. 5,300 కోట్లు ప్యాకేజీ ప్రకటించింది. ఈ అంశం బీజేపీకి అనుకూ లంగా మారింది. ఇక ధరాభారం, రాష్ట్ర ప్రభుత్వ అవినీతి కూడా ఎన్నికల్లో ప్రభావం చూపనుంది. ఎస్సీ వర్గీకరణపై బీజేపీ ఇంకా ఎటూ తేల్చకపోవడంతో ఈ వర్గం వారు అధికార పార్టీపై గుర్రుగా ఉన్నారు. -
MLC Election Results: ఓడి.. గెలిచిన తీన్మార్ మల్లన్న
సాక్షి, హైదరాబాద్: ‘యుద్ధం మిగిలే ఉన్నది ఉద్యమ నేలనా... సిద్ధంకమ్మన్నదీ మన తెలంగాణలోన’అంటూ వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న సెంటర్ ఆఫ్ ది ఎట్రాక్షన్‌గా మారారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో సాధించిన ఓట్లపరంగా రెండో స్థానంలో నిలిచినప్పటికీ, చివరివరకూ అందరి దృష్టిని ఆకర్షించడంలో మాత్రం విజేతగా నిలిచాడు. జాతీయ పార్టీల అభ్యర్థులను, తెలంగాణ ఉద్యమంలో తనకంటూ గుర్తింపు సంపాదించుకున్న ప్రొఫెసర్‌ను సైతం ఎలిమినేట్ చేసి, స్వతంత్ర అభ్యర్థిగా అధికారపార్టీ అభ్యర్థికి గట్టి సవాల్ విసిరి చర్చనీయాంశంగా మారారు. పేదకుటుంబంలో పుట్టి.. పెద్ద చదువులు చదివి, పేపర్‌బాయ్‌గా పనిచేసే సమయం నుంచే జర్నలిజంపై ఆసక్తి పెంచుకున్న ఆయన 2015 ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. తన యూట్యూబ్ న్యూస్ చానల్ ద్వారా ప్రజల తరపున ప్రశ్నించే గొంతుకనవుతానన్న ఆయన, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బలమైన అభ్యరి్థగా సత్తా చాటి చర్చల్లో వ్యక్తిగా మారారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందే పాదయాత్రలతో సమస్యలపై అవగాహన పెంచుకున్న ‘మల్లన్న’పట్టభద్రులకు దగ్గరవడమేకాక, ప్రభుత్వాన్ని ప్రతీ అంశంలోనూ ప్రశ్నిస్తూ వచ్చారు. 1,650 కిలోమీటర్ల పాదయాత్ర.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అందరి దృష్టి ఉమ్మడి నల్లగొండ, వరంగల్, ఖమ్మం స్థానంపైనే పడింది. ఈ స్థానానికి అధికార, ప్రతిపక్ష పారీ్టలతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా బలమైన వారే బరిలో దిగటంతో ఈ స్థానంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి తీన్మార్ మల్లన్నగా సుపరిచితులైన చింతపండు నవీన్ కుమార్ ఈ ఎన్నికల్లో చర్చనీయాంశంగా నిలిచారు. తనదైన శైలిలో ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపుతూ ప్రజలలో ఒక ప్రత్యేక గుర్తింపును పొందారు. తెలంగాణ ఉద్యమం నుండి నేటి వరకు ప్రజా సమస్యలపై స్పందిస్తూ ప్రజా వ్యతిరేక విధానాలపై గళమెత్తుతూ అందరి దృష్టిని, ప్రత్యేకంగా పట్టభద్రులను ఆకర్షించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండు విడతల్లో 1,650 కిలోమీటర్ల పాదయాత్రలో మల్లన్నకు అడుగడుగునా ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. ‘14 లక్షల ఉద్యోగాలిచ్చామని చెబుతున్న పల్లా రాజేశ్వర్‌రెడ్డి.. అది నిజమని నిరూపిస్తే పోటీ నుంచి తప్పుకుంటా’అంటూ సవాల్ చేసిన మల్లన్న, తానిచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైతే రెండున్నరేళ్లలో ప్రజా రెఫరెండంకు సిద్ధంగా ఉంటానంటూ ప్రకటించి చివరివరకూ పోటీని రక్తికట్టించారు. చదవండి: కేసీఆర్ చాణక్యం: టీఆర్ఎస్కు కలిసొచ్చిన అంశాలివే.. అప్పులనే ఆదాయంగా చూపారా?.. హరీశ్ -
అబ్బో... భలే సూటైంది!
మేడమ్ పెద్ద పార్టీకి వెళ్లాలి. అక్కడ అందరి కళ్లూ ఆమె పైనే ఉండాలి. ఇంగ్లిష్‌లో ‘సెంటరాఫ్ ఎట్రాక్షన్’ అంటారే.. మేడమ్‌గారు అలా అవ్వాలన్న మాట. ఆ విధంగా నలుగురి దృష్టినీ ఆకట్టుకోవాలంటే వేసుకునే బట్టల నుంచి పెట్టుకునే నగల వరకూ అన్నీ ప్రత్యేకంగా ఉండాలి. అలా స్పెషల్‌గా ఉండేట్లు చేయాల్సిన బాధ్యత డిజైనర్ది. ఇక డిజైనర్ పాట్లు చూడాలి. వెరైటీగా ఉండాలి.. చూడచక్కగా అనిపించాలి.. అలాంటి డ్రెస్సుని డిజైన్ చేయడానికి ఒక్కోసారి తలబద్దులు కొట్టుకున్నంత పని చేస్తారు. అప్పుడొస్తుంది ఒక ఆలోచన. మగవాళ్లు సూట్‌కి వేసుకునే బో టై ఆకారంలో మేడమ్‌కి మంచి టాప్ తయారు చేస్తే? ‘భేష్ బాగుంది’ అని భుజం తట్టుకున్నారు డిజైనర్. ‘బో టై’ షేప్‌లో టాప్ తయారు చేసి, మేడమ్ నుంచి కితాబులు అందుకోవచ్చు అనుకున్నదే తడవు.. టాప్ రెడీ చేసేశారు. మేడమ్ కూడా మెచ్చుకున్నారు. ఆ టాప్‌లో నలుగురికీ కనువిందు చేశారు. ఇదిగో ఇక్కడ బాపూ బొమ్మ ప్రణీత తెల్లని మేని ఛాయ మీద ముదురు నీలం రంగు టాప్ చూశారు కదా? అది అచ్చంగా మగవాళ్లు కట్టుకునే బో టైలానే ఉంది కదూ. ఇక.. అమీ జాక్సన్ టాప్ చూస్తే.. బో టై అడ్డంగా బదులు నిలువుగా ఉంది. ఈ డిజైన్ కూడా అదిరింది. ఊదా రంగు బో టై టాప్‌లో పాయల్ నిండుగా ఉన్నారు. ‘మీకేనా బో టై... మేమూ వేసుకోగలం’ అని మన కథానాయికలు మగవాళ్లను సవాల్ చేస్తున్నట్లు ధీమాగా పోజిచ్చిన విధానం భలే బాగుంది కదూ. ఆ మధ్య జరిగిన సౌతిండియా ఫిలిం ఫేర్ అవార్డు వేడుకలకు అమీ జాక్సన్, పాయల్ ఘోష్ ఇలా బో టై టాప్‌లో అందరి లుక్సూ తమపై పడేలా చేసుకున్నారు. ఇటీవల జరిగిన ‘సైమా’ వేడుకల కోసం ప్రణీత బో టై టాప్, మినీ స్కర్ట్‌తో ‘అమ్మో... బాపుగారి బొమ్మో’ అనిపించుకున్నారు. మగవాళ్ల సూట్‌కి హుందాతనం తెచ్చిన బో టై మగువలకూ భలే సూట్ అయింది కదా! -
అవినీతిలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ బాబే
-
పవర్పఫ్ గర్ల్స్
అనగనగా ముగ్గురు సోదరీమణులు... ఇంద్రధనుస్సును మైమరిపించే రంగులు విరజిమ్ముతూ ఆకాశంలో మెరుపు వేగంతో దూసుకుపోతూ... అన్యాయాలపై పోరాడి న్యాయాన్ని గెలిపిస్తూ సాహస విన్యాసాలతో అలరిస్తుంటారు. వాళ్లు ఎవరో ఇంకా గుర్తుకు రాలేదా... అరే వాళ్ళేనండీ ‘పవర్పఫ్ గర్ల్స్’. ఈ కార్టూన్ సీరియల్ భలేగా ఉంటుంది తెలుసా! ముగ్గురు అక్కాచెల్లెళ్లు... సూపర్ పవర్‌తో న్యాయం కోసం చేసే పోరాటంలో అందరినీ నవ్విస్తూ, బోలెడు సాహసాలతో ఈ సీరియల్ సాగుతుంటుంది. అసలు వాళ్లని గుర్తుచేసుకుంటే ముందుగా గుర్తుకొచ్చేవి వారి కళ్లే... పెద్దపెద్ద కళ్లతో ముగ్గురూ మూడు రంగుల్లో మెరిసిపోతుంటారు. బబుల్స్, బ్లోసమ్, బటర్‌కప్ పేర్లతో వీళ్లను పిలుస్తారు. బబుల్స్ బ్లూ, బ్లోసమ్ పింక్, బటర్‌కప్ గ్రీన్ వీరి సిగ్నేచర్ కలర్స్. ఈ రంగులతో తెరపైన సాహసాలతో కనువిందు చేస్తుంటారు. వీరి సృష్టికర్త క్రెగ్ మెక్క్యానెన్. ఆయన కార్టూన్ నెట్వర్క్కి రాసిన మొదటి సీరియల్ ఈ పవర్పఫ్ గర్ల్స్. ఈ సీరియల్ 1998 నవంబర్ 18న మొదటిసారి ప్రసారమైంది. ఈ సీరియల్లో యుటోనియం అనే శాస్త్రవేత్త ప్రయోగశాలలో అనుకోకుండా పవర్పఫ్ గర్ల్స్ సృష్టిస్తాడు. పరిపూర్ణమైన లిటిల్ గర్ల్స్ను సృష్టించడానికి చక్కెర, మసాలాదినుసులు, మంచి పదార్థాలు సరిపోతాయి. కాని యుటోనియం వాటితో పాటు ‘ఎక్స్’ అనే రసాయనాన్ని కూడా కలపడంతో ముగ్గురు సూపర్ పవర్పఫ్ గర్ల్స్ జన్మిస్తారు. ఈ ముగ్గురు నేరాలపై, మంత్రశక్తులపై పోరాడుతూ ప్రజలను కాపాడుతుంటారు. ప్రస్తుతం పవర్పఫ్ గర్ల్స్ ఆరవ సిరీస్ ప్రసారమవుతోంది. పవర్పఫ్ గర్ల్స్ అమెరికా టెలివిజన్ పరిశ్రమ ఇచ్చే ఎమ్మీ అవార్డులను కూడా గెలుచుకుంది. 2001 ఎమ్మీ అవార్డుల్లో పవర్పఫ్ గర్ల్స్ సీరియల్‌కు ఉత్తమ ఆర్ట్ డెరైక్టర్ విభాగంలో వాటిని యానిమేట్ చేసిన ఆర్ట్ డెరైక్టర్ డాన్ షాంక్కు, అలాగే టెలివిజన్ యానిమేటెడ్ సీరియల్ విభాగంలో ఉత్తమ నేపథ్య సంగీతానికి అవార్డులు లభించాయి. 2005 ఎమ్మీ అవార్డుల్లో నేపథ్య రూపకర్త ఫ్రెడరిక్ జె. గార్డ్నర్ బహుమతి గెలుచుకున్నారు.