
అబ్బో... భలే సూటైంది!
మేడమ్ పెద్ద పార్టీకి వెళ్లాలి. అక్కడ అందరి కళ్లూ ఆమె పైనే ఉండాలి. ఇంగ్లిష్‌లో ‘సెంటరాఫ్ ఎట్రాక్షన్’ అంటారే.. మేడమ్‌గారు అలా అవ్వాలన్న మాట. ఆ విధంగా నలుగురి దృష్టినీ ఆకట్టుకోవాలంటే వేసుకునే బట్టల నుంచి పెట్టుకునే నగల వరకూ అన్నీ ప్రత్యేకంగా ఉండాలి. అలా స్పెషల్‌గా ఉండేట్లు చేయాల్సిన బాధ్యత డిజైనర్‌ది. ఇక డిజైనర్ పాట్లు చూడాలి. వెరైటీగా ఉండాలి.. చూడచక్కగా అనిపించాలి.. అలాంటి డ్రెస్సుని డిజైన్ చేయడానికి ఒక్కోసారి తలబద్దులు కొట్టుకున్నంత పని చేస్తారు. అప్పుడొస్తుంది ఒక ఆలోచన. మగవాళ్లు సూట్‌కి వేసుకునే బో టై ఆకారంలో మేడమ్‌కి మంచి టాప్ తయారు చేస్తే? ‘భేష్ బాగుంది’ అని భుజం తట్టుకున్నారు డిజైనర్. ‘బో టై’ షేప్‌లో టాప్ తయారు చేసి, మేడమ్ నుంచి కితాబులు అందుకోవచ్చు అనుకున్నదే తడవు.. టాప్ రెడీ చేసేశారు. మేడమ్ కూడా మెచ్చుకున్నారు. ఆ టాప్‌లో నలుగురికీ కనువిందు చేశారు.
ఇదిగో ఇక్కడ బాపూ బొమ్మ ప్రణీత తెల్లని మేని ఛాయ మీద ముదురు నీలం రంగు టాప్ చూశారు కదా? అది అచ్చంగా మగవాళ్లు కట్టుకునే బో టైలానే ఉంది కదూ. ఇక.. అమీ జాక్సన్ టాప్ చూస్తే.. బో టై అడ్డంగా బదులు నిలువుగా ఉంది. ఈ డిజైన్ కూడా అదిరింది. ఊదా రంగు బో టై టాప్‌లో పాయల్ నిండుగా ఉన్నారు. ‘మీకేనా బో టై... మేమూ వేసుకోగలం’ అని మన కథానాయికలు మగవాళ్లను సవాల్ చేస్తున్నట్లు ధీమాగా పోజిచ్చిన విధానం భలే బాగుంది కదూ. ఆ మధ్య జరిగిన సౌతిండియా ఫిలిం ఫేర్ అవార్డు వేడుకలకు అమీ జాక్సన్, పాయల్ ఘోష్ ఇలా బో టై టాప్‌లో అందరి లుక్సూ తమపై పడేలా చేసుకున్నారు. ఇటీవల జరిగిన ‘సైమా’ వేడుకల కోసం ప్రణీత బో టై టాప్, మినీ స్కర్ట్‌తో ‘అమ్మో... బాపుగారి బొమ్మో’ అనిపించుకున్నారు. మగవాళ్ల సూట్‌కి హుందాతనం తెచ్చిన బో టై మగువలకూ భలే సూట్ అయింది కదా!