నిక్కీ హేలీ, వివేక్ రామస్వామి ఇద్దరూ ఇద్దరే. భారత సంతతికి చెందిన వారే. రిపబ్లికన్ల అమెరికా అధ్యక్ష అభ్యర్థుల తొలి చర్చలో వారిద్దరే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఉక్రెయిన్ యుద్ధ్దంపై మాటల తూటాలు విసురుకున్నారు. చివరికి వివేక్ రామస్వామి పైచేయి సాధించారు. ట్రంప్‌కు గట్టి పోటీ ఇస్తారని అంచనాలున్న రాన్ డిసాంటిస్‌ను పక్కకు పెట్టి మరీ రామస్వామి ముందుకు దూసుకుపోతున్నారు.
► రిపబ్లికన్ పార్టీ అమెరికా అధ్యక్ష అభ్యర్థుల మధ్య జరిగిన తొలి చర్చ వాడీగా వేడిగా సాగింది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ చర్చకు దూరంగా ఉండడంతో ఇద్దరే ఇద్దరు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. వారిద్దరూ భారత సంతతికి చెందిన అభ్యర్థులే. దక్షిణ కరోలినా మాజీ గవర్నర్ నిక్కీ హేలీ, మల్టీ మిలియనీర్ వివేక్ రామస్వామి మధ్య ఉక్రెయిన్ యుద్ధంపై చర్చ మరో మలుపు తీసుకుంది.
అమెరికా చరిత్రలో ఇద్దరు భారతీయులు ఒకే వేదికను పంచుకొని ఈ తరహాలో చర్చించుకోవడం ముందెన్నడూ జరగలేదు. ఇద్దరికి ఇద్దరు ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా ఒకానొక దశలో వేలి చూపిస్తూ బెదిరించుకున్నారు.
ఒకరిపై మరొకరు 30 సెకండ్లపాటు అరుచుకున్నారు. విదేశీ వ్యవహారాల్లో వివేక్ రామస్వామికి అవగాహన లేదని, రష్యా, ఉక్రెయిన్ యుద్ధం అంశంలో ఆయన పుతిన్‌కు మద్దతుగా వ్యవహరిస్తున్నారంటూ నిక్కీ హేలీ గట్టి ఆరోపణలే చేశారు. అమెరికా శత్రువులకి కొమ్ముకాస్తూ, దేశ మిత్రులకు దూరంగా వెళుతున్నారని వివేక్‌ను దుయ్యబట్టారు. పుతిన్ ఒక హంతకుడని అతనికి మద్దతుగా మాట్లాడేవారు ఈ దేశానికి అధ్యక్షుడైతే భద్రత గాల్లో దీపంలా మారుతుందంటూ హేలీ మండిపడ్డారు. హేలీ మాట్లాడుతున్నంత సేపు వివేక్ రామస్వామి ఆమెని అడ్డుకుంటూనే ఉన్నారు. హేలీ చెబుతున్నవన్నీ అబద్ధాలని , తనపై నోటికొచి్చనట్టు మాట్లాడుతున్నారంటూ ఎదురు దాడికి దిగారు.
అమెరికా భద్రతే ముఖ్యం..
► ఉక్రెయిన్‌కు మరింత సాయానికి తాను వ్యతిరేకిస్తానని వివేక్ రామస్వామి ఈ చర్చలో కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. అమెరికాకు ఉక్రెయిన్ ప్రధానం కాదని, వారికి చేసే మిలటరీ సాయాన్ని తమ దేశ సరిహద్దుల్లో మోహరిస్తే దేశ భద్రత మరింత పటిష్టమవుతుందని వివేక్ రామస్వామి పేర్కొన్నారు. రక్షణ రంగానికి చెందిన కాంట్రాక్టర్ల ఒత్తిడితోనే నిక్కీ ఉక్రెయిన్‌కు మద్దతుగా ఉన్నారంటూ ధ్వజమెత్తారు. ఈ చర్చలో నిక్కీ హేలీపై వివేక్ రామస్వామి పై చేయి సాధించారు. అమెరికాకు ఎప్పుడైనా తన దేశ భద్రతే ముఖ్యం తప్ప, ఉక్రెయిన్‌కు సాయం చేయడం కాదంటూ గట్టిగా వాదించారు.
రాజకీయ అనుభవం లేకపోవడంతో మొదట్లో అంతగా గుర్తింపు లేని వివేక్ రామస్వామి తాను నమ్మిన సిద్ధాంతాలను ఆక ట్టుకునేలా చెప్పడం ద్వారా మద్దతు పెంచుకుంటున్నారు. అధ్యక్ష అభ్యర్థి రేసులో ముందున్న డొనాల్డ్ ట్రంప్‌కు గట్టి పోటీగా ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్ పేరు వినిపించేది. మొదటి చర్చలో రాన్ ఎంత మాత్రం ప్రభా వితం చూపించలేకపోయారు. ఇప్పుడు ఆయనను దాటుకొని మరీ వివేక్ రామస్వామి దూసుకుపోతున్నారు. తొలి చర్చలో వివేక్‌రామస్వామి విజేతగా నిలిచారంటూ వివిధ పోల్స్ వెల్లడిస్తున్నాయి. సెపె్టంబర్ 22న జరిగే రెండో చర్చలో వివేక్ రామస్వామి ఏంమాట్లాడతారన్న ఉత్కంఠ రేపుతోంది.
ఎవరీ వివేక్ రామస్వామి ?
కేరళ నుంచి అమెరికాకు వలస వెళ్లిన భారతీయ దంపతులకు ఒహియోలోని సిన్సినాటిలో 1985, ఆగస్టు9న వివేక్ రామస్వామి జని్మంచారు. సంప్రదాయ హిందూ కుటుంబంలో పుట్టి పెరిగారు. తండ్రి ఎలక్ట్రిక్ ఇంజనీరు. తల్లి మానసిక వైద్యురాలు. యేల్, హార్వర్డ్ విశ్వవిద్యాలయాల్లో రామస్వామి చదువుకున్నారు. పాఠశాలలో విద్యనభ్యసించేటప్పుడు జూనియర్ టెన్నిస్ క్రీడాకారుడిగా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. యువకుడిగా ఉన్నప్పుడు తీరిక సమయాల్లో అల్జీమర్స్ రోగుల వద్ద పియానో వాయించేవారు. కాలేజీలో చదువుకున్నప్పుడు స్టూడెంట్ బిజినెసెస్.డాట్‌కామ్ సహవ్యవస్థాపకుడిగా ఉంటూ వ్యాపార రంగంలో అడుగు పెట్టారు.
2007 నుంచి 2014 వరకు క్యూవీటీ ఫైనాన్సెస్ సంస్థలో పని చేశారు. 2014లో సొంతంగా బయోటెక్ కంపెనీ రాయివాంట్ సైన్సెస్‌ను ఏర్పాటు చేశారు. అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మిని్రస్టేషన్ (ఊఈఅ) ఆమోదం పొందిన ఐదు ఔషధాలను అభివృద్ధి చేశారు. 10 మంది ఉద్యోగులతో ప్రారంభమైన ఈ సంస్థ 2017 నాటికి 110 కోట్ల డాలర్ల వ్యాపారం చేసే సంస్థగా ఎదిగింది. అమెరికాలో 40 ఏళ్లకు తక్కువ వయసున్న అత్యంత ధనికుడైన ఎంటర్ ప్రెన్యూర్‌గా ఫోర్బ్స్ జాబితాలోకెక్కారు. వివేక్ రామస్వామి ఆస్తుల విలువ 63 కోట్ల డాలర్లు ఉంటుందని అంచనా. తన క్లాస్‌మేట్ అయిన అపూర్వ తివారీని 2015లో పెళ్లాడిన వివేక్ రామస్వామికి కార్తీక్, అర్జున్ అనే ఇద్దరు అబ్బాయిలున్నారు.
పుస్తక రచన, రాజకీయాలపై ఆసక్తితో రాయివాంట్ సంస్థ సీఈవో పదవి నుంచి 2021లో ఆయన తప్పుకున్నారు. ‘వోక్, ఇంక్: ఇన్‌సైడ్ కార్పొరేట్ అమెరికాస్ సోషల్ జస్టిస్ స్కామ్’అనే పుస్తకాన్ని రచించారు. ఎన్నో పత్రికల్లో వ్యాసాలు రాశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 21న అధ్యక్ష అభ్యరి్థగా నామినేషన్ వేశారు. సాంస్కృతిక ఉద్యమంతో కొత్త అమెరికా కల సాకారమవుతుందని రామస్వామి నినదిస్తున్నారు. ఇప్పటికే ఎలన్‌మస్క్ వంటి పారిశ్రామికవేత్తలు రామస్వామికి బహిరంగంగా మద్దతు పలుకుతూ ఉండడం, ట్రంప్ చుట్టూ కేసుల ఉచ్చు బిగుస్తూ ఉండడంతో వివేక్ రామస్వామి వైపు రిపబ్లికన్లు తిరుగుతారా అన్న చర్చ మొదలు కావడం విశేషం.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment